(370 ఆర్టికల్ రద్దు సందర్భంగా ‘న్యూయార్క్ టైమ్స్’కు అరుంధతీ రాయ్ రాసిన వ్యాసం)
భారతదేశం 73వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంలో, ఢిల్లీ ట్రాఫిక్‌లో చిరిగిన బట్టలతో వీథిబాలలు పెద్ద పెద్ద జాతీయ జెండాలను, ‘నా భారతదేశం గొప్పది’ అనే జ్ఞాపికలను అమ్ముతుంటారు. నిజం చెప్పాలంటే, మన ప్రభుత్వం దగుల్బాజీగా మారిపోయినట్లు కనిపిస్తున్న ఇప్పటి సందర్భంలో నా భారతదేశం గొప్పదని అనుకోవడం చాలా కష్టమైన పని.
పూర్వం స్వతంత్ర రాజ్యమైన జమ్ము-కాశ్మీర్, 1947లో భారతదేశంలో విలీనానికి ప్రాతిపదిక అయిన విలీన ఒప్పందంలోని మౌలికమైన నిబంధనలను, పోయిన వారం ప్రభుత్వం ఏకపక్షంగా ఉల్లంఘించింది. ఆ పని చేయడానికి ముందు జాగ్రత్తగా, ఆగస్టు 4 అర్థరాత్రి మొత్తం కాశ్మీర్‌ను ఒక పెద్ద జైలు శిబిరంగా మార్చివేసింది. డెబ్భై లక్షల మంది కాశ్మీరీలు వాళ్ళ ఇళ్ళల్లో ఖైదీ చేయబడ్డారు, ఇంటర్నెట్ కనెక్షన్లు కత్తిరించారు, వాళ్ళ ఫోన్లు మూగబోయాయి.
ఆగస్టు 5న, భారతదేశ హోమ్ శాఖా మంత్రి పార్లమెంటులో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ను (విలీన ఒప్పందంలో చట్టపరమైన నిబంధనలను చేర్చే ఆర్టికల్) రద్దు చేయాలని ప్రతిపాదించాడు. ప్రతిపక్షాలు ఏమీ ప్రతిఘటించలేదు. మరుసటి రోజు సాయంత్రం వరకు జమ్ము కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం రెండు చట్టసభల్లో ఆమోదించబడింది.
జమ్మూ-కాశ్మీర్ తన సొంత రాజ్యాంగం, సొంత జెండా కలిగి ఉండే హక్కును ఇచ్చే ప్రత్యేక హోదాను ఈ చట్టం రద్దు చేస్తుంది. అట్లానే దానిని రాష్ట్రంగా రద్దు చేసి, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజన చేస్తుంది. మొదటిది జమ్ము-కాశ్మీర్. దానికి స్థానికంగా ఎన్నికైన శాసనసభ ఉన్నా మునుపటికన్నా చాలా తక్కువ అధికారాలతో ఉంటుంది. రెండవది, లద్దాక్. దానికి శాసనసభ కూడా
ఉండదు. చట్టం అమల్లోకి రావడాన్ని పార్లమెంటులో పచ్చి బ్రిటిష్ సంప్రదాయమైన బల్లలు చరచడంతో స్వాగతించారు. గాలిలో సామ్రాజ్యవాద వాసన గుప్పుమన్నది. మొండి వలస రాజ్యం చివరకు లాంఛనంగా కైవసం అయినందుకు ప్రభువులు తృప్తి చెందారు. అదంతా దాని మంచికోసమే మరి!
భారత పౌరులు ఇప్పుడిక వాళ్ళ కొత్త రాజ్యంలో భూమిని కొనుక్కోవచ్చు, స్థిరపడవచ్చు. కొత్త ప్రాంతాల్లో ఇప్పుడు వ్యాపారానికి తలుపులు తెరుచుకున్నాయి. రిలయన్స్ ఇండస్త్రీస్ అధినేత, భారతదేశంలో ఇప్పటికే అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ, ఎన్నో ‘ప్రకటనలు’ వాగ్దానం చేశాడు. లద్దాక్, కాశ్మీర్లలో ఉన్న అపారమైన హిమానీనదాలు, ఎత్తైన ప్రాంతాల్లో ఉన్న సరస్సులు, ఐదు ప్రధానమైన నదులతో కూడుకున్న సున్నితమైన హిమాలయ పర్యావరణంపై అవి ఎలాంటి ప్రభావం చూపుతాయనే ఆలోచన మచ్చుకైనా లేదు.
చట్టపరంగా రాష్ట్రమనే దాన్ని రద్దు చేయడం, స్థానికులను తమ ప్రాంతంలో తమనే సారధులను చేసే హక్కులను, ఆర్హతలను ఇచ్చే ఆర్టికల్ 35ఎ రద్దు చేయడం కూడా. ‘వ్యాపారానికి ద్వారాలు తెరుచుకోవడం’ అంటే ఏమిటో ఇంకా స్పష్టీకరించవలసి ఉంది.దాని అర్థం ఇజ్రాయిల్ తరహా సెటిల్మెంట్లు, టిబెట్ తరహా జనాభా తరలింపులు కూడా కావచ్చు.
కశ్మీరీలకు ప్రత్యేకంగా ఇది మొదటినుండి ఉన్న ప్రధానమైన భయం. కశ్మీర్ లోయలో జాగా కోసం ఉప్పెనలా వచ్చే భారతీయుల ధాటికి కొట్టుకుపోతామేమోనన్న భయం వాళ్ళను పీడకలలా వెంటాడుతోంది.
కొత్త చట్టం గురించి వార్త పాకుతుండగా, భారతదేశంలో అన్ని రకాల జాతీయవాదులు హర్షం వ్యక్తం చేశారు. మెయిన్ స్త్రీమ్ మీడియా, చాలా మటుకు శిరస్సు వంచి అంగీకారం తెలిపింది. వీథుల్లో జనం నాట్యాలు చేస్తుండగా, ఇంటర్నెట్లో స్త్రీలపట్ల ఘోరమైన నీచభావం వ్యక్తమయింది. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ వాళ్ళ రాష్ట్రంలో వక్రంగా ఉన్న స్త్రీ-పురుష నిష్పత్తిని అతను మెరుగుపరచిన దాని గురించి మాట్లాడుతూ ”మన థాకర్ జీ బీహార్ నుండి అమ్మాయిలను తెస్తాను అనేవాడు. ఇప్పుడు కశ్మీర్ తెరుచుకుందంటున్నారు. ఇక మనం అమ్మాయిలను అక్కడినుండి తెచ్చుకోవచ్చు” అని ఛలోక్తి విసిరాడు.
అయితే ఈ అసభ్యమైన వేడుకల మధ్య కశ్మీరులో పహారాలు, బారికేడ్ల మధ్యనున్న వీథుల నిశ్శబ్దం, ముళ్ళ కంచెలతో బంధించబడి, డ్రోన్లతో నిఘా వేయబడి, పూర్తిగా సమాచార మార్పిడి స్తంభించిపోయిన పరిస్థితుల్లో నివసిస్తున్న సుమారు డెబ్భై లక్షల మంది ప్రజల శ్మశాన నిశ్శబ్దం, అతి బిగ్గరగా వినబడిన చప్పుడు. ఇప్పటి సమాచార యుగంలో, ఒక ప్రభుత్వం అంత సునాయాసంగా జనాభాను మిగతా ప్రపంచం నుండి వేరు చేయగలగడమనేది మనం ఎటువంటి ప్రమాదకరమైన కాలం వైపు పయనిస్తున్నామో చెప్తుంది.
కశ్మీర్‌ను ‘విభజన’లో పూర్తికాని వ్యవహారం (unfinished business) అని వాళ్ళు తరచూ అంటుంటారు. 1947లో బ్రిటిష్ వాళ్ళు ఉపఖండం గుండా అజాగ్రత్తగా సరిహద్దు రేఖ గీసినప్పుడు, ఒక ‘అఖండ’ భారతదేశాన్ని విభజించినట్టు ఆ పదం సూచిస్తుంది. నిజానికి, ‘అఖండం’ అనేది ఎప్పుడూ లేదు. బ్రిటిష్ ఇండియా ప్రాంతంలో లేని వందలాది సార్వభౌమ సంస్థానాలు, వేటికవే ఇండియా లేదా పాకిస్తాన్లో కలవడానికి ఒప్పందాలు చేసుకున్నాయి. విలీనానికి సుముఖంగా లేని చాలా సంస్థానాలను బలవంతంగా కలుపుకోవడం జరిగింది.
విభజన, దానివల్ల జరిగిన భయంకరమైన హింస, భారతదేశపు స్మృతిలో మానని గాయంగా
ఉంది. అయితే విభజన సమయంలో, ఆ తర్వాత కాలంలో ఇండియా, పాకిస్థాన్లలో జరిగిన హింస, విభజన వల్ల ఎంత జరిగిందో, విలీనీకరణ వల్ల కూడా అంతే జరిగింది. ఇండియాలో, దేశనిర్మాణం అనే బ్యానర్ కింద జరిగే విలీనీకరణలో భాగంగా, 1947 నుండి ఇప్పటివరకు, భారతదేశ సరిహద్దుల్లోనే తన ‘సొంత ప్రజల’కు వ్యతిరేకంగా భారత సైన్యం మోహరించని సంవత్సరం ఒక్కటీ లేదు. లిస్టు పొడవైనది – కశ్మీర్, మిజోరం, నాగాలాండ్, మణిపూర్, హైదరాబాద్, అస్సాం.
విలీనీకరణ వ్యవహారం పదుల వేల సంఖ్యలో ప్రాణాలను బలిగొంది. మునుపటి జమ్మూ-కాశ్మీర్ సరిహద్దుకు ఇరువైపులా ఈ రోజు జరుగుతున్నది విలీనీకరణలో పూర్తికాని వ్యవహారం.
భారతదేశ పార్లమెంటులో పోయిన వారం జరిగిన విషయం, విలీన ఒప్పందాన్ని దహనం చేయడంతో సమానం. అపఖ్యాతి పాలయిన ఒక రాజు, డోగ్రా హిందూ రాజు, మహారాజా హరిసింగ్ సంతకం చేసిన ఒక క్లిష్టమైన మూలం ఉన్న డాక్యుమెంట్ అది. అస్థిరమైన, శిథిలమవుతున్న తన జమ్మూ-కాశ్మీర్ రాజ్యం ఇండియా, పాకిస్తాన్ల కొత్త సరిహద్దు రేఖ మీద ఉంది.
తనకు వ్యతిరేకంగా 1945లో చెలరేగిన తిరుగుబాట్లను, విస్తరిస్తున్న విభజన దావానలం తీవ్రతరం చేస్తూ, తనలో కలుపుకుంది. పడమటి పర్వత ప్రాంతమయిన పూంఛ్ జిల్లాలో, అధిక సంఖ్యాకులయిన ముస్లింలు, మహారాజా బలగాలపై, హిందూ ప్రజలపై దాడికి దిగారు. దక్షిణాన జమ్మూలో మహారాజా బలగాలు ఇతర సంస్థానాల నుండి అరువు తెచ్చుకున్న బలగాల సహాయంతో ముస్లింలను ఊచకోత కోశారు. చరిత్రకారులు, వార్తా కథనాల ప్రకారం సుమారు 70 వేల నుండి 2 లక్షల వరకు ముస్లింలు పట్టణ వీథుల్లో, చుట్టుపక్కల జిల్లాల్లో చంపబడ్డారు.
జమ్మూ ఊచకోత వార్తతో కోపోద్రిక్తులయిన పాకిస్తానీ సాయుధ ఆదివాసీ తెగలు వాయువ్య సరిహద్దులో పర్వతాల గుండా, దారిలో ఉన్నవి కాల్చేస్తూ, కొల్లగొడుతూ కాశ్మీర్ లోయలోకి జొరబడ్డారు. హరిసింగ్ కాశ్మీర్ నుండి పారిపోయి ఇండియా ప్రధాని జవహర్లాల్ నెహ్రును సహాయం కోరాడు. భారత సైన్యం కాశ్మీర్‌లోకి ప్రవేశించడానికి విలీన ఒప్పందం చట్టబద్ధత కల్పించింది.
భారత సైన్యం స్థానికుల నుండి కొంత సహాయంతో, పాకిస్తానీ సాయుధ ఆదివాసీలను వెనుకకు తరిమినా, లోయ అంచుల్లో ఉన్న పర్వతాల వరకే తరమగలిగారు. మునుపటి డోగ్రా రాజ్యం అప్పుడిక ఇండియా, పాకిస్తాన్ల మధ్య చీలిపోయింది. జమ్మూ-కాశ్మీర్ ప్రజల అభీష్టాన్ని తెలుసుకోవడం కోసం ప్రజాభిప్రాయ సేకరణ చేసి విలీన ఒప్పందం ఆమోదించవలసి ఉంది. ఆ ప్రజాభిప్రాయ సేకరణ ఎప్పుడూ జరగలేదు. అట్లా ఉపఖండంలో అతి ప్రమాదకరమైన, పరిష్కరించడానికి అసాధ్యమైన, రాజకీయ సమస్య ఉత్పన్నమయింది.
అప్పటినుండి గడచిన 72 ఏండ్లలో, వరుసగా భారత ప్రభుత్వాలు ఎముకల గూడుగా మాత్రమే మిగిలేలా విలీన ఒప్పందాన్ని బలహీనపరుస్తూనే ఉన్నాయి. ఇప్పుడిక దాన్నీ చితక్కొట్టేశారు.
పరిస్థితి ఇక్కడికి రావడానికి జరిగిన సంఘటనలూ, మలుపులన్నీ చెప్పాలంటే పెద్ద సాహసమే అవుతుంది. అది యాభైలలో, అరవైలలో దక్షిణ వియత్నాంలో అమెరికా తను స్థాపించిన కీలుబొమ్మ పాలనలతో ఆడిన ఆటలంత క్లిష్టమైనది, ప్రమాదకరమైనది.
ఎన్నికల కుట్రల సుదీర్ఘమైన చరిత్ర తరువాత, 1987లో జరిగిన రాష్ట్ర ఎన్నికలను ఢిల్లీ ఘోరంగా రిగ్ చేయడం ఒక చారిత్రాత్మక మలుపునకు నాంది. అప్పటివరకూ స్వయం నిర్ణయాధికారం కోసం శాంతియుతంగా జరుగుతున్న డిమాండ్, పూర్తిస్థాయి స్వాతంత్ర పోరాటంగా ఎదిగింది. లక్షల సంఖ్యలో వీథుల్లోకి ప్రవహిస్తున్న ప్రజలను ఊచకోతలతో అంతమొందించారు.
సరిహద్దుకు ఇరువైపుల నుండి కశ్మీరీలూ, విదేశీయులూ అయిన మిలిటెంట్లతో కశ్మీర్ లోయ తొందరలోనే నిండిపోయింది. వాళ్ళకు పాకిస్తాన్ తర్ఫీదు, ఆయుధాలు ఇవ్వగా, కశ్మీర్ ప్రజలు చాలా మటుకు వాళ్ళను అక్కున చేర్చుకున్నారు. మళ్ళీ ఒకసారి కశ్మీర్ ఉపఖండంలో వీస్తున్న రాజకీయ దుమారంలో చిక్కుకుపోయింది. ఒకవైపు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చిన, కశ్మీర్ సంస్కృతికి పరాయిదయిన ఛాందసవాద ఇస్లాం, మరోవైపు భారతదేశంలో పెరిగిపోతున్న మతోన్మాద హిందూ జాతీయవాదం.
ఆ తిరుగుబాటు వలన కశ్మీర్ ముస్లింలకు, అల్పసంఖ్యాకులైన హిందూ పండిట్ల మధ్య అనాదిగా ఉన్న అనుబంధానికి మొదటి నష్టం జరిగింది. హింస చెలరేగినప్పుడు కశ్మీర్ పండిట్ సంఘర్ష్ సమితి (కె.పి.ఎస్.ఎస్.) ప్రకారం 400 మంది పండిట్లను మిలిటెంట్లు చంపేశారు. 1990 చివరి వరకు, ప్రభుత్వ అంచనాల ప్రకారం, 25 వేలమంది పండిట్ కుటుంబాలు కశ్మీర్ వదిలి వెళ్ళిపోయాయి.
వాళ్ళు తమ ఇండ్లను, స్వస్థలాన్ని, సర్వస్వాన్ని కోల్పోయారు. వేలమంది, దాదాపు పండిట్ జనాభా మొత్తం లోయ వదిలి వెళ్ళిపోయారు. ఘర్షణ కొనసాగినా, కొన్ని పదుల సంఖ్యలో ముస్లింలతో సహా, కె.పి.ఎస్.ఎస్. ప్రకారం 650 మంది పండిట్లు చంపబడ్డారు.
అప్పటినుండి ఎంతోమంది పండిట్లు జమ్మూ నగరంలో దుర్భరమైన శరణార్ధి శిబిరాల్లో జీవిస్తున్నారు. ముప్ఫై ఏండ్లు గడిచినా, న్యూఢిల్లీలో వరుసగా వచ్చిన ప్రభుత్వాలు వారిని స్వస్థలానికి తిరిగి పంపడానికి ప్రయత్నాలు చేయలేదు. కశ్మీర్ పండిట్లకు పరిష్కార మార్గం చూపకుండా వాళ్ళల్లో ఆగ్రహాన్ని రగిలించారు. ఆ న్యాయమైన ఆగ్రహాన్ని భారతదేశం తన ప్రమాదకరమైన జాతీయవాద కథనానికి ఆజ్యం పోయడానికి వాడుకుంది. ఒక ఇతిహాస విషాదంలోని ఒకానొక అంశం మిగతా దారుణాన్ని కప్పివేయడానికి ఉపయోగించబడుతుంది.
నేడు కశ్మీర్ ప్రపంచంలో అత్యంత సైనికీకరణ చెందిన ప్రదేశం. ఇప్పుడున్నది కేవలం గుప్పెడు మంది ‘ఉగ్రవాదులు’ మాత్రమేనని సైన్యమే అంగీకరిస్తూ, వారిని ఎదుర్కొనడానికి మాత్రం అయిదు లక్షలకు పైగా సైనికులను నియమించారు. ఇంతకుముందు ఏమైనా సందేహాలు ఉంటే, వారి నిజమైన శత్రువు కశ్మీరీ ప్రజలు అని ఇప్పుడు చాలా స్పష్టంగా తెలుస్తుంది. గత 30 ఏళ్ళుగా కశ్మీర్లో భారత్ చేస్తోన్న పని క్షమించరానిది. ఈ ఘర్షణలో 70 వేల మంది ప్రజలు, పౌరులు, ఉగ్రవాదులు, భద్రతా దళాలు మరణించారని అంచనా. వేలాది మంది ‘అదృశ్యం’ చేయబడ్డారు. లోయలో చిన్న స్థాయి అబూ గ్రైబ్ల నెట్వర్క్లాగా ఉన్న టార్చర్ చాంబర్ల గుండా పదుల వేల మంది వెళ్ళారు.
గత కొన్ని సంవత్సరాలుగా, జన సమూహాల నియంత్రణ కోసం భద్రతా బలగాల కొత్త ఆయుధమైన పెలెట్ షాట్గన్లను ఉపయోగించడంతో వందలాది మంది యువకులు అంధులయ్యారు. ఈ రోజు లోయలో మిలిటెంట్లుగా పనిచేస్తోన్న చాలామంది, స్థానికంగా శిక్షణ పొందిన సాయుధులైన యువ కశ్మీరీలు. వారు తుపాకులు చేతబట్టిన నిమిషం, వారి ”షెల్ష్ లైఫ్” ఆరు నెలలకన్నా ఎక్కువ ఉండదని వారికి బాగా తెలుసు. ”ఉగ్రవాది” చంపబడిన ప్రతిసారీ, కశ్మీరీలు పదుల వేల సంఖ్యలో ఒక యువకుడిని ఖననం చేయడానికి వెళ్తారు. వీరిని వారు షహీద్, అమరవీరుడు అని గౌరవిస్తారు.
ఇవి 30 ఏళ్ళ సైనిక ఆక్రమణకు సంబంధించిన రమారమి అక్షాంశాలు మాత్రమే. దశాబ్దాలుగా కొనసాగిన ఆక్రమణ యొక్క అత్యంత క్రూరమైన ప్రభావాలను ఇంత చిన్న కథనంలో వివరించడం అసాధ్యం.
నరేంద్ర మోడీ మొదటిసారి భారత ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, అతని కఠినమైన విధానాల వల్ల కశ్మీర్లో హింస పెరిగింది. ఫిబ్రవరిలో, ఒక కశ్మీరీ ఆత్మాహుతి దాడిలో 40 మంది భారత భద్రతా సిబ్బంది మరణించిన తరువాత, భారత్ పాకిస్తాన్‌పై వైమానిక దాడి చేసింది. పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకుంది. ఒకదానిపై ఒకటి వైమానిక దాడులు చేసుకున్న మొదటి రెండు అణు శక్తులుగా రెండు దేశాలూ చరిత్రలోకెక్కాయి. ఇప్పుడు నరేంద్ర మోడీ రెండవ పదవీకాలం మొదలైన రెండు నెలల్లోనే, అతని ప్రభుత్వం అన్నింటికంటే ప్రమాదకరమైన కార్డును ఆడింది. ఒక మండుతున్న అగ్గిపుల్లను పేలుడు మందులోకి విసిరింది.
అది సరిపోనట్లు, ఆ పనిని చేసిన మోసపూరిత మార్గం చాలా అవమానకరం. జులై చివరి వారంలో, 45 వేల మంది అదనపు దళాలను వివిధ సాకులతో కశ్మీర్లోకి తరలించారు. అమర్నాథ్ యాత్రకు పాకిస్తాన్ ”ఉగ్రవాద” ముప్పు ఉందనే సాకు చాలా మంది దృష్టిని ఆకర్షించింది. అమర్నాథ్ యాత్ర అనేది ఏడాదికోసారి జరిగే తీర్థయాత్ర. దీనిలో లక్షల మంది హిందూ భక్తులు ఎత్తైన పర్వతాల ద్వారా అమర్నాథ్ గుహను సందర్శించడానికి (లేదా కశ్మీరీ పోర్టర్లు తీసుకువెళ్తారు) వెళ్ళి, శివుని అవతారం అని వారు నమ్ముతున్న సహజ మంచు నిర్మాణానికి పూజలు చేస్తారు.
ఆగస్టు 1న, కొన్ని భారతీయ టెలివిజన్ నెట్‌వర్క్‌లు తీర్థయాత్ర మార్గంలో పాకిస్తాన్ ఆర్మీ గుర్తులతో ఉన్న మందు పాత్రలు దొరికినట్లు ప్రకటించాయి. ఆగస్టు 2న, యాత్రికులందరినీ (తీర్థయాత్రకు మైళ్ళ దూరంలో ఉన్న పర్యాటకులు కూడా) వెంటనే లోయ నుండి బయలుదేరాలని ప్రభుత్వం ఒక నోటీసును ప్రచురించింది. భయాందోళనతో జనం లోయ విడిచి వెళ్ళడం మొదలుపెట్టారు. తరలింపును పర్యవేక్షించేవారు కశ్మీర్లో ఉన్న సుమారు రెండు లక్షల మంది భారతీయ వలస రోజువారీ కార్మికుల గురించి మాత్రం ఆందోళన పడలేదు. మరీ పేదవాళ్ళు కదా, వాళ్ళు లెక్కలోకి రారని నేనూహిస్తున్నాను. ఆగస్టు 3న, శనివారం నాటికి, పర్యాటకులూ, యాత్రికులూ వెళ్ళిపోయారు. లోయ అంతటా భద్రతా దళాలు మోహరించాయి.
ఆదివారం అర్థరాత్రి నాటికి కశ్మీరీలను వారి ఇళ్ళల్లో బారికేడ్ చేశారు. అన్ని కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లు పనిచేయడం ఆగిపోయాయి. మరుసటిరోజు ఉదయం, వందలాదిమందితో పాటు, పూర్వపు ముగ్గురు ముఖ్యమంత్రులు ఫరూక్ అబ్దుల్లా, అతని కుమారుడు, నేషనల్ కాన్ఫరెన్స్‌కి చెందిన ఒమర్ అబ్దుల్లా, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీకి చెందిన మెహబూబా ముఫ్తీలను అరెస్టు చేసినట్లు మనకు తెలిసింది. తిరుగుబాటు ముమ్మరంగా జరుగుతున్న కాలంలో భారతదేశపు ప్రయోజనాలను కాపాడిన భారత-అనుకూల ప్రధాన స్రవంతి రాజకీయ నాయకులు వీళ్ళు.
భారత ప్రభుత్వం జమ్మూ కశ్మీర్ పోలీసు బలగాలను నిరాయుధులను చేసినట్లు వార్తాపత్రికలు నివేదించాయి. ఇంతకాలం అందరికంటే ఎక్కువగా, ఈ స్థానిక పోలీసులు ముందు వరుసలో నిలిచారు. గ్రౌండ్ వర్క్ చేశారు, ఆక్రమణ ఉపకరణాన్ని అవసరమైన తెలివితేటలతో అందించారు. వారి యజమానుల క్రూరమైన ఆదేశాలను పాటించారు. వాళ్ళ శ్రమ ఫలితంగా వారి స్వంత ప్రజల ద్వేషాన్ని సంపాదించుకున్నారు. ఇదంతా కాశ్మీర్లో భారత జెండా ఎగురుతూ ఉండడానికి జరిగింది. ఇప్పుడు, పరిస్థితి ప్రమాదకరంగా మారినప్పుడు, కోపంతో రగులుతున్న జనానికి ఆ స్థానిక పోలీసులను ఆహుతి ఇవ్వనున్నారు.
నరేంద్ర మోడీ ప్రభుత్వం భారతదేశ మిత్రపక్షాలకు చేసిన ద్రోహం, బహిరంగ అవమానం ఒక రకమైన దురహంకారమూ, అజ్ఞానం నుండి వచ్చింది. ఇది మోసమూ, నైపుణ్యమూ కలగలిసిన భారతీయ రాజకీయాల ద్వారా దశాబ్దాలుగా కష్టపడి ఏర్పరచిన విస్తృతమైన బూటకపు నిర్మాణాలను తొలగించింది. ఆ పని పూర్తయింది కాబట్టి ఇప్పుడిక వీథులకు, సైనికులకు మధ్య పోరాటం. వీథుల్లోకి వచ్చిన యువ కశ్మీరీలకు దీనివల్ల ఏమి జరుగుతుందో పక్కన పెడితే, సైనికులను కూడా ఇలాంటి పరిస్థితిలోకి నెట్టడం అర్థరహితమైన పని.
స్వయం నిర్ణయాధికార హక్కు లేదా పాకిస్తాన్లో విలీనమయ్యే హక్కును కోరుతున్న కశ్మీరీ ఉగ్రవాద వర్గాలకు భారతదేశ చట్టాలు లేదా రాజ్యాంగంపై ఎలాంటి గౌరవం లేదు. ఉగ్రవాద వర్గాలు ఎవరినైతే వాళ్ళు భారతదేశానికి సహకారులుగా చూస్తారో వాళ్ళను భారతదేశం మోసం చేసిందని, మసిబూసి మారేడు కాయను చేసి ఆట ఎట్టకేలకు ముగిసిందని వారు సంతోషిస్తారు. అయితే వారు సంతోషపడితే తొందరపడినట్టే అవుతుంది. ఎందుకంటే మళ్ళీ కొత్త రాజకీయ పార్టీలు పుడతాయి. ఊరిలో కొత్త ఆట మొదలవుతుంది.
ఆగస్టు 8న, కశ్మీర్ దిగ్బంధం మొదలయిన నాలుగు రోజులకు, నరేంద్ర మోడీ టీవీలో బాహాటంగా వేడుకలు జరుపుకుంటున్న భారతదేశాన్ని, బంధించబడిన కశ్మీర్‌ను ఉద్దేశించి ప్రసంగించాడు. ఆయన మారిన మనిషిలా కనిపించాడు. మామూలుగా అతనిలో ఉండే దూకుడుతనం, కంఠంలో ధ్వనించే కఠినత్వం, నిందారోపణ మాయమయ్యాయి. బదులుగా ఆయన ఒక యవ్వనురాలైన తల్లికుండే సున్నితత్వంతో మాట్లాడాడు. అతనిది ఇది ఇప్పటివరకూ అన్నింటికన్నా ఎక్కువ వణుకు పుట్టించే అవతారం.
పాత, అవినీతి నాయకులను వదిలించుకుని, న్యూఢిల్లీ నుండి నేరుగా పాలించబడబోయే పూర్వపు జమ్ము-కశ్మీర్ రాష్ట్ర ప్రజలపై కురవబోయే ప్రయోజనాల జాబితా చెప్తుండగా అతని గొంతు చలించింది, కళ్ళు ఒలకని కన్నీళ్ళతో మెరిశాయి. టైమ్ క్యాప్సూల్ నుండి బయటపడ్డ భూస్వామ్య రైతుల సమూహాన్ని విద్యావంతులను చేస్తున్నట్లుగా అతను భారతీయ ఆధునికత యొక్క అద్భుతాలను వివరించాడు. బాలీవుడ్ సినిమాలు మరోసారి వారి లోయలో ఎలా చిత్రీకరించబడతాయో ఆయన మాట్లాడాడు.
ఆయన తన ఉత్తేజకరమైన ప్రసంగం చేస్తున్నప్పుడు కశ్మీరీలను ఎందుకు బంధించాలో, కమ్యూనికేషన్ల దిగ్బంధనం ఎందుకు పెట్టాలో వివరించలేదు. వారికి ఎంతో ప్రయోజనం చేకూర్చేదిగా భావించే ఈ నిర్ణయం, వారిని సంప్రదించకుండా ఎందుకు తీసుకున్నారో ఆయన వివరించలేదు. సైనిక ఆక్రమణలో నివసించే ప్రజలు భారత ప్రజాస్వామ్యపు గొప్ప బహుమతులను ఎలా అనుభవించవచ్చో ఆయన చెప్పలేదు. కొన్ని రోజుల్లో రానున్న ఈద్ కోసం ముందుగానే వారికి శుభాకాంక్షలు చెప్పడం ఆయన మర్చిపోలేదు. కానీ పండుగ కోసం లాక్డౌన్ ఎత్తివేస్తానని మాత్రం ఆయన హామీ ఇవ్వలేదు, అది జరగలేదు. మరుసటి రోజు ఉదయం, భారతీయ వార్తా పత్రికలు, అనేకమంది ఉదారవాద వ్యాఖ్యాతలు, నరేంద్ర మోదీ అత్యంత కఠినమైన విమర్శకులలో కొందరు సైతం, అతని కదిలించే ప్రసంగంపై పొగడ్తల వర్షం కురిపించారు. నిజమైన వలసవాదుల మాదిరిగానే, భారతదేశంలో చాలామంది తమ స్వంత హక్కులు, స్వేచ్ఛల ఉల్లంఘనలపై అప్రమత్తంగా ఉన్నా, కశ్మీరీల విషయంలో మాత్రం పూర్తి భిన్నమైన ప్రమాణం ఉంది.
ఆగస్టు 15, గురువారం, నరేంద్ర మోదీ ఢిల్లీ ఎర్రకోట ప్రాకారాల నుండి తన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో, చివరకు తన ప్రభుత్వం తన కశ్మీర్ ఎత్తుగడతో ”ఒక దేశం, ఒక రాజ్యాంగం” అనే భారత కలని సాధించిందని ప్రగల్భాలు పలికాడు. కానీ అంతకుముందు రోజు సాయంత్రమే, భారతదేశం ఈశాన్యంలోని అనేక సమస్యాత్మక రాష్ట్రాల్లోని తిరుగుబాటు గ్రూపులు, స్వాతంత్య్ర దినోత్సవాన్ని బహిష్కరించినట్లు ప్రకటించాయి. అవి చాలావరకు పూర్వపు జమ్మూ-కశ్మీర్వలె ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలు. నరేంద్ర మోడీకి ఎర్రకోట ప్రేక్షకులు ఉత్సాహంగా చప్పట్లు కొడుతుండగా, 70 లక్షల మంది కశ్మీరీలు దిగ్బంధంలో ఉన్నారు. కమ్యూనికేషన్ దిగ్బంధనం కొంతకాలం వరకు పొడిగించే అవకాశాలున్నాయని ఇప్పుడు తెలియవస్తుంది.
అది ముగిసినప్పుడు, కశ్మీర్ నుండి చెలరేగిన హింస అనివార్యంగా భారతదేశంలోకి చిమ్ముతుంది. ఇప్పటికే నిందించబడి, మురికివాడల్లోకి నెట్టబడి, ఆర్థికంగా అణచివేయబడి, భయంకరమైన క్రమబద్ధతతో హతమార్చబడుతున్న భారతీయ ముస్లింలపై శత్రుత్వాన్ని మరింత పెంచడానికి ఇది ఉపయోగపడుతుంది. ధైర్యంగా, బహిరంగంగా నిరసన తెలిపిన కార్యకర్తలు, న్యాయవాదులు, కళాకారులు, విద్యార్థులు, మేథావులు, జర్నలిస్టులను నియంత్రించడానికి అవకాశంగా రాజ్యం దీన్ని ఉపయోగించుకుంటుంది.
ప్రమాదం చాలా దిశల నుండి వస్తుంది. భారతదేశంలో అత్యంత శక్తివంతమైన సంస్థ, నరేంద్ర మోడీ, అతని మంత్రులతో సహా ఆరు లక్షల మందికి పైగా సభ్యులతో కూడిన హిందూ జాతీయవాద రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్), ముస్సోలినీ బ్లాక్ షర్టుల ప్రేరణతో శిక్షణ పొందిన ”వాలంటీర్” సైన్యాన్ని కలిగి ఉంది. గడిచే ప్రతి రోజుతో, భారతదేశంలోని ప్రతి సంస్థపై ఆరెస్సెస్ తన పట్టును బిగించుకుంటుంది. నిజానికి, ఆరెస్సెస్ ఇంచుమించు అదే రాజ్యం అయ్యే పరిస్థితి చేరుకుంది.
అటువంటి రాజ్యపు దయగల నీడలో, అనేక చిన్న హిందూ సంస్థలు, హిందూ రాజ్యపు సాయుధ ముఠాలు దేశవ్యాప్తంగా పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చి, చాలా ఖచ్చితంగా వారి ప్రమాదకరమైన కార్యకలాపాలను చేసుకుపోతున్నాయి.
మేథావులు, విద్యావేత్తలే వారి ప్రధాన లక్ష్యం. మే నెలలో, భారతీయ జనతా పార్టీ సార్వత్రిక ఎన్నికలలో విజయం సాధించిన తరువాత, పార్టీ ప్రధాన కార్యదర్శి, ఆర్ఎస్ఎస్ మాజీ ప్రతినిధి అయిన రామ్‌మాధవ్, ”దేశంలో మేథో రంగం, విధాన స్థాపనపై అసమానమైన ఆధిపత్యం, పట్టు ఉన్న నకిలీ-లౌకిక/ ఉదారవాద సంస్థల అవశేషాలను దేశపు విద్యా, సాంస్కృతిక, మేధో రంగాల నుండి విస్మరించాల్సిన అవసరం ఉంది” అని రాశాడు.
ఆగస్టు 1న, ఆ ”విస్మరించడానికి” సన్నాహకంగా, ఇప్పటికే క్రూరమైన చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం (UAPA), ”ఉగ్రవాది” నిర్వచనాన్ని సంస్థలను మాత్రమే కాకుండా వ్యక్తులను చేర్చేలా విస్తరించడానికి సవరించబడింది. ఎఫ్ఐఆర్, చార్జిషీట్, న్యాయవిచారణ, నేరస్థాపన అనే సరైన ప్రక్రియలను అనుసరించకుండానే ఏ వ్యక్తినైనా ఉగ్రవాదిగా పేర్కొనడానికి ఈ సవరణ ప్రభుత్వాన్ని అనుమతిస్తుంది. పార్లమెంటులో, భయానకమైన మన హోం మంత్రి అమిత్ షా ఇలా అన్నారు. ”అయ్యా, తుపాకులు ఉగ్రవాదానికి దారితీయవు, ఉగ్రవాదానికి మూలం దాన్ని వ్యాప్తి చెందడానికి చేసే ప్రచారంలో ఉంటుంది… అలాంటి వ్యక్తులందరినీ ఉగ్రవాదులని ప్రకటిస్తే, పార్లమెంటు సభ్యులందరికీ ఎటువంటి అభ్యంతరమూ ఉంటుందని నేను అనుకోను”.
మనలో చాలామంది వైరంతో నిండిన అతని కళ్ళు మనవైపే తదేకంగా చూస్తున్నట్టు భావించారు. తన సొంత రాష్ట్రమైన గుజరాత్లో వరస హత్యలతో అతను ప్రధాన నిందితుడిగా జైలులో సమయం గడిపాడనే విషయం తెలిస్తే పరిస్థితి ఇంకా ఘోరంగా
ఉంటుంది. అతని ట్రయల్ జడ్జి, జస్టిస్ బ్రిజ్గోపాల్ హర్కిషన్ లోయా, విచారణ సమయంలో అనుమానాస్పదంగా మరణించాడు. అతని స్థానంలో నియమించబడిన మరొకరు అతన్ని అతివేగంగా నిర్దోషిగా ప్రకటించాడు. వీటన్నింటితో తెగించిన, వందలాది భారతదేశ వార్తా నెట్‌వర్క్‌లలోని రైట్-వింగ్ టెలివిజన్ వ్యాఖ్యాతలు, ఇప్పుడు అసమ్మతివాదులను బహిరంగంగా ఖండిస్తున్నారు. వారిపై క్రూరమైన ఆరోపణలు చేస్తూ వారి అరెస్టుకు పిలుపునిస్తున్నారు. ”టీవీ చేత హతమార్చబడడం” అనేది భారతదేశంలో కొత్త రాజకీయ నమూనా అయ్యేట్టు ఉంది.
ప్రపంచం చూస్తుండగానే, భారతీయ ఫాసిజం నిర్మాణం త్వరిత గతిలో జరుగుతుంది.
జులై 28న కొంతమంది స్నేహితులను కలవడానికి నేను కశ్మీర్‌కు వెళ్ళాలని టిక్కెట్ బుక్ చేసుకున్నాను. రాబోయే కల్లోలం గురించి, దళాల మోహరింపు గురించి, గుసగుసలు అప్పటికే ప్రారంభమయ్యాయి. నేను వెళ్ళడం గురించి తర్జన భర్జనలలో పడ్డాను. నా స్నేహతుడు, నేను నా ఇంట్లో దాని గురించి మాట్లాడుకున్నాము. ముస్లిం అయిన అతను ఒక ప్రభుత్వ ఆస్పత్రిలో సీనియర్ వైద్యుడు. అతను తనజీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేశాడు. ప్రజలను, ముఖ్యంగా ముస్లింలను చుట్టుముట్టే అల్లరిమూకలు ”జై శ్రీరామ్” అని బలవంతంగా చెప్పించడం గురించి మాట్లాడుకున్నాం.
కశ్మీర్‌ను భద్రతా దళాలు ఆక్రమిస్తే, అల్లరి మూకలు భారతదేశాన్ని ఆక్రమించాయి.
అతను కూడా దాని గురించి ఆలోచిస్తున్నానని చెప్పాడు. ఎందుకంటే అతను కొన్ని గంటల దూరంలో నివసించే తన కుటుంబాన్ని సందర్శించడానికి ఢిల్లీ నుండి హైవేలలో తరచూ వెళ్తుంటాడు.
”నన్ను వాళ్ళు ఆపే అవకాశాలు చాలానే ఉన్నాయి” అని అతను అన్నాడు.
”అట్లాంటి సందర్భం వస్తే మీరు తప్పక జై శ్రీరామ్ అనాలి” అన్నాను. ”మీరు బతకాలి”.
”నేను అనను. ఎందుకంటే వాళ్ళు నన్ను ఎట్లయినా చంపేస్తారు. తబ్రేజ్ అన్సారీని వాళ్ళు అదే చేశారు” అన్నాడు.
కశ్మీర్ మాట్లాడాలని ఎదురుచూస్తూ భారతదేశంలో మేము చేస్తున్న సంభాషణలు ఇవి. కశ్మీర్ ఖచ్చితంగా మాట్లాడుతుంది.
(కొలిమి వెబ్‌మ్యాగజైన్, డిసెంబర్ సంచిక నుండి)