(అవును… ఇది వట్టిమాట కాదు. ప్రపంచవ్యాప్తంగా యురేనియం ఖనిజం వెలికితీత, శుద్ధి, వినియోగాలలో ఎదురైన వాస్తవానుభవాల నుంచి చెప్తున్న మాట. అణువిద్యుత్ కర్మాగారాల వల్ల ఉపయోగాల మాట ఎలా ఉన్నా, వాటినుంచి వెలువడుతున్న అణుధార్మికత కలిగిన వ్యర్థాల వల్ల పెనుముప్పు మాత్రం ముంచుకొస్తోంది. ఏ దేశానికా దేశం జాతీయ ప్రయోజనాల పేరు చెప్పి యురేనియం సేకరించి వినియోగించుకొని ఇష్టం వచ్చిన రీతిగా వ్యర్థాలను వదిలివేయడం వల్ల మానవాళి మనుగడకే ప్రమాదం వచ్చిపడుతోంది. ఈ నేపథ్యంలో యురేనియం గురించి ‘వార్త’ ఆదివారం (7 సెప్టెంబరు, 2003) అందిస్తున్న విశ్లేషణాత్మక కథనమిది.)
మనిషి ఎంతోకాలం నుంచి యురేనియం ముడి ఖనిజం రాళ్ళను చూస్తున్నా, దానివల్ల
ఉపయోగముంటుందని భావించినది వంద సంవత్సరాల క్రితమే. అదీ యాదృచ్ఛికంగా.
అది 1896వ సంవత్సరం హెన్రీ బెకెల్ (HENRY BECQUEREL) అనే శాస్త్రవేత్త ఒక రాయిని సొరుగులో పెట్టి కొన్ని రోజులు దాని సంగతే మర్చిపోయాడు. దాని క్రింద ఒక ఫోటోగ్రాఫిక్ ప్లేటుని జాగ్రత్తగా, ఏ రకమైన కాంతీ సోకకుండా కవరులో భద్రపరిచాడాయన. కొన్ని వారాల తర్వాత ఆ ప్లేటును తీసి కడిగితే ఆ రాయి ఉంచిన ప్రదేశం నుంచి కాంతి కిరణాలు ప్రసరించిన జాడలు కనిపించాయి. హెన్రీ బెకెల్ ముందు ఆశ్చర్యపోయినా, శాస్త్రవేత్త కనుక గ్రహించాడు. తాను సృష్టిలోనే అద్భుతమైన లక్షణాలున్న లోహాన్ని ఆవిష్కరించానని, బయటినుంచి ఏ రకమైన ఉత్ప్రేరకం లేకుండానే, రసాయనిక చర్య జరగకుండానే, తనలోనుంచి స్వతసిద్ధంగా శక్తిని ఒక లోహం బయటికి వదలటమన్నది అప్పటివరకూ మనిషి ఊహకందని విషయం. ఆ లోహమే యురేనియం. దానినుంచి విడుదలయ్యే శక్తినే అణుధార్మిక శక్తి లేదా రేడియో ఆక్టివిటీగా గుర్తించారు.
సృష్టిలో ఉన్న పదార్థమంతా అణువులతో నిండి ఉంది. ఈ అణువుల్లో చాలావరకు నిలకడగానే ఉంటాయి. ఆక్సిజన్ అణువు లేదా హైడ్రోజన్ అణువు కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఏ విధంగా ఉండేదో ఇప్పుడూ అదే విధంగా ఏ మార్పుకూ లోనుకాకుండా ఉన్నాయి. కొన్ని అణుధార్మికత కలిగిన అణువుల స్వభావం మాత్రం దీనికి భిన్నంగా ఉంటుంది. ఉదాహరణకు యురేనియం అణువుల్లో సూక్ష్మాతిసూక్ష్మ స్థాయిలో అణువిస్ఫోటనం జరుగుతూ కొంత ఆల్ఫా, బీటా అణుపదార్ధాలు తూటాల రూపంలో బయటికి దూసుకొస్తూ ఉంటాయి. ఈ విధంగా శక్తి పదార్థాలు ఈ అణువుల నుంచి వెలువడటాన్ని రేడియో ఆక్టివిటీ అని పిలుస్తున్నారు.
యురేనియం అణువులు ఈ విధంగా విస్ఫోటం చెందుతూ తమలో కొంత పదార్థాన్ని కోల్పోతూ మరొక పదార్థంగా, అంటే ప్రొటాక్టినియంగా మారుతుంది. అది విస్ఫోటం చెందుతూ థోరియంగా మారుతుంది. థోరియం రేడియంగా మారుతుంది. ఇలా సహజసిద్ధంగా ఉద్భవించిన యురేనియం (NATURAL URANIUM U-238) నుంచి దాదాపు 12 అణుధార్మికత గల పదార్థాలు తయారయి చివరకు సీసం అనే స్థిరమైన లోహంగా మారుతుంది. ఇది మిగిలన లోహాలవలే అణుధార్మికత లేని పదార్థం.
హాఫ్లైఫ్ అంటే…?
యురేనియం వంటి అణుధార్మికత కలిగిన పదార్ధాలు, అవి పుట్టిన క్షణం నుంచీ నిరంతరం తమలోని పదార్థాలు శక్తి రూపంలోనో (గామా కిరణాలు), ఆల్ఫా, బీటా పార్టికల్స్‌గా బయటకి వెదజల్లుతూ పదార్థరీత్యా (Atomic Weight) సగం కావడానికి పట్టే సమయాన్నే హాఫ్లైఫ్ అంటారు. ఉదాహరణకి రెండు గ్రాముల ఖ-238 పదార్థం డికే (Decay) అవుతూ ఒక గ్రాము పదార్థంగా మారడానికి 450,00,00,000 సంవత్సరాలు పడుతుంది. మిగిలిన గ్రాము పదార్థం అరగ్రాముగా పట్టడానికి కూడా ఇంతే సమయం పడుతుంది. ఈ సమయంలో బయటికి వెలువడిన ఒక గ్రాము ఖ-238 పదార్థం కొంత శక్తిగా, కొంత ఆల్ఫా, బీటా పార్టికల్స్‌గా, మిగిలింది మరో అణుధార్మిక పదార్థంగా మారుతుంది.
అణుధార్మికతకీ మనకీ సంబంధమేంటి?
అణుధార్మికత కలిగిన యురేనియం వంటి అణువులు తమలోంచి అలా పార్టికల్స్ (రెండు ప్రోటాన్లు, రెండు న్యూట్రాన్లు సెకనుకు పదివేల మైళ్ళ వేగంతో) లేదా బీటా పార్టికల్స్ (ఎలక్ట్రాన్లు, కాంతివేగంతో) నిరంతరం ఎవరో ప్రోగ్రామ్ చేసి ట్రిగ్గర్‌ని నొక్కి తుపాకీ నుంచి తూటాలను వదిలినట్లు వదులుతూనే ఉంటాయి. ఈ ప్రక్రియ ఇలాగే జరిగిపోతూ ఉంటే ఏమవుతుంది?
19వ శతాబ్దం చివరివరకూ యురేనియం వంటి వింత స్వభావం కలిగిన పదార్థమున్నదని ఎవరికీ తెలియకపోవడంతో ఈ లోహం వలన జీవకాలానికి ముఖ్యంగా మానవాళికి జరిగే లాభనష్టాల మీద పరిశోధనలేమీ జరగలేదు.
1898 డిసెంబర్లో మేరీక్యూరీ, ఆమె భర్త పేమెర్ క్యూరీలు ‘రేడియం’ ఉనికిని కనుగొని ప్రపంచానికి చాటిచెప్పారు. మేరీక్యూరీ రేడియంతో పాటు థోరియం, పాలోనియంలను కనుగొన్నారు. అప్పటికి అణుధార్మికత గురించి వారికి సరైన అవగాహన లేకపోవడంవల్ల మేరీక్యూరీ, ఆమె కూతురు ఇరీన్… ఇద్దరూ రేడియం బారినపడి రక్త క్యాన్సర్‌తో మరణించారు.
యురేనియంకి గల ప్రత్యేక గుణాన్ని ‘ఫిషనబిలిటీ’గా వ్యవహరిస్తారు. ఈ ఖనిజం విచ్ఛిన్నమవుతూ శక్తిని వదలటం, విచ్ఛిన్నకర ప్రక్రియకు యురేనియం అణునిర్మాణం అనుకూలంగా ఉందన్న విషయాన్ని ఫెర్మీ (Fermi) అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. అప్పట్లో యురేనియంని వ్యాపారధోరణిలోకి తేవాలని చేసిన ప్రయత్నాలేవీ సఫలీకృతం కాలేదు. క్యూరీ, రేడియంను కనుగొన్న తర్వాత దాన్ని గడియారాలలో
ఉపయోగించడం మనందరికీ తెలిసిందే!
యురేనియం నుంచి శక్తి విడుదల లేదా అణుధార్మికత వెలువడటం అనే సహజ ప్రక్రియకి కానీ, దానిలోంచి వచ్చే పదార్ధాల మీద కానీ నియంత్రణ సాధ్యంకాదు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో శాస్త్రజ్ఞులు యురేనియంకి ఉన్న ‘ఫిషనబిలిటీ’ని గుర్తించారు. అది రెండు విధాలుగా అపారమైన శక్తిని విడుదల చేస్తుందని వారి పరిశోధనలలో తేలింది. ఇందులో మొదటిది – నియంత్రించలేని (Uncontrolled) అణువిస్ఫోటన శక్తి కాగా, రెండోది – నియంత్రించగలిగి, దాన్ని మనకి కావాల్సిన రీతిలో వినియోగించుకోగలిగే విస్ఫోటనశక్తి. అయితే ఈ రెండు సందర్భాలలోనూ అణుధార్మికత కలిగిన ప్లుటోనియం, స్టాన్షియం, అయోడిన్, సీజియం, క్రిప్టాన్ వంటి కొత్త పదార్ధాలు పుట్టుకొస్తాయి. ఇవన్నీ అంతకు ముందు ప్రకృతిలో లేని అత్యంత తీవ్ర అణుధార్మికత కలిగిన పదార్థాలు కావడం గమనార్హం.
నియంత్రించలేని అణువిస్ఫోటం
యురేనియం అణుకేంద్రకాన్ని న్యూట్రాన్తో ఢీ కొట్టించినప్పుడు ఆ కేంద్రకం విచ్ఛిన్నమయి, రెండు మూడు ముద్దలుగా ఛిద్రమయి నాలుగు వందల రెట్లు అధిక శక్తిని విడుదల చేస్తుంది. అదే సమయంలో అదనంగా మరికొన్ని న్యూట్రాన్లు వేగంగా విడుదలయి పక్కనున్న అణుకేంద్రకాల్ని ఢీకొంటాయి. వాటినుంచి మళ్ళీ శక్తితోపాటు న్యూట్రాన్లు కూడా విడుదలయి మరిన్ని కేంద్రకాల్లో విస్ఫోటనం సృష్టిస్తాయి. అదంతా చైన్ రియాక్షన్ (గొలుసుకట్టు చర్య)గా మారి క్షణంలో వెయ్యోవంతు సమయంలో అపారమైన శక్తి విడుదలవుతుంది. దీన్నే మనం ఆటంబాంబు అంటున్నాం. భూమిని పదిసార్లు భస్మీపటలం చేసేంత శక్తిగల బాంబులు ఇప్పటికే తయారయ్యాయి.
నియంత్రణ శక్తిగా యురేనియం
ఒక న్యూట్రాన్తో ఒక యురేనియం కేంద్రకాన్ని విచ్ఛిన్నం చేసినపుడు, బయటకి విడుదలయ్యే న్యూట్రాన్లని నియంత్రించలేకపోయినా, అవి పక్కనున్న వేరే అణుకేంద్రకాల్ని తాకకుండా చేయవచ్చు. ఆ విధంగా అదుపు తప్పకుండా మనకు కావల్సిన రీతిలో శక్తిని విడుదల చేయించి, అపరిమితమైన ఆ వేడిమితో నీటిని మరిగించి, దానిద్వారా వచ్చే ఆవిరిశక్తితో యంత్రాల్ని నడిపి విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చునని శాస్త్రవేత్తలు నిరూపించారు. ఈ ప్రక్రియ మొత్తం జరిగే ప్రదేశాల్నే మనం అణురియాక్టర్లుగా వ్యవహరిస్తున్నాం. అదే అణువిద్యుత్ కర్మాగారాల నుంచి ప్రతి వెయ్యి మెగావాట్ల విద్యుదుత్పత్తికి తోడు సుమారుగా 1200 కిలోల ప్లుటోనియం, 30 టన్నుల తీవ్రమైన అణుధార్మికత కలిగిన వ్యర్థ పదార్ధాలు ప్రతి ఏటా ఉత్పత్తి అవుతాయి. ఈ ఫ్లూటోనియం నుంచి ఎన్ని ఆటంబాంబులైనా తయారు చేయవచ్చు. నియంత్రణ లేనప్పుడే కాదు, నియంత్రణ శక్తిగా యురేనియంని ఉపయోగిస్తున్న సందర్భాల్లోనూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అది మానవ తప్పిదాల వల్ల కావచ్చు, యంత్రాల లోపం వల్ల కావచ్చు. గత 50 సంవత్సరాల్లో కొన్ని వందల అణుప్రమాదాలు సంభవించాయి. అందులో ఒకప్పటి సోవియట్ యూనియన్‌లోని చెర్నోబిల్, అమెరికాలోని ‘త్రీమైల్ ఐలాండ్’ ఘటనలు (ఈ ప్రమాదాల్ని శాస్త్రీయ పరిభాషలో ‘మెల్ట్‌డౌన్’గా పిలుస్తారు) చెప్పుకోదగ్గవి. చెర్నోబిల్ దుర్ఘటనలో రెండు కిలోల యురేనియం అణు పదార్థం అదుపు తప్పి పేలిపోయి కొన్ని అడుగుల మందమున్న కాంక్రీట్ కప్పుని చీల్చుకుని అణుధార్మికత కలిగిన లక్షల కోట్ల ధూళి కణాలుగా వాతావరణంలో కలిసిపోయింది. ఫలితంగా ఎక్కడో – వెయ్యి కిలోమీటర్ల దూరంలో
ఉన్న ఇంగ్లండ్‌లోని వేల్స్ ప్రాంతపు గొర్రెలన్నీ గాలివాలుతో సోకిన అణుధార్మికతకి గురయ్యాయి. ఆ అణుధూళి సోకిన లక్షల టన్నుల ఆహార ధాన్యాలను యూరప్ దేశాలన్నీ భూస్థాపితం చేయాల్సి వచ్చింది.
ఇందులో అణువిద్యుత్ కర్మాగారాలున్న ప్రతి దేశమూ ఎంతో వ్యయప్రయాసలకోర్చి అణుధార్మికత కలిగిన వ్యర్థ పదార్థాలు, వాడేసిన ప్లూటోనియం వంటి అవశేష ఇంధనాల్ని గాలి, నీరు, నేల, జీవజాలానికి దూరంగా ఉంచుతున్నాయి. అయితే, ఆ యురేనియం పదార్థాల నుంచి మనం ఎందుకు దూరంగా ఉండాల్సి వస్తోంది?
అమెరికాలోని 114 అణువిద్యుత్ కర్మాగారాల నుంచి వచ్చే అణుధార్మిక పదార్థాల్ని యూకా పర్వత శ్రేణుల్లో ప్రత్యేకంగా సొరంగాల ద్వారా దాచిఉంచడాని ఏటా 25000 కోట్ల రూపాయల చొప్పున రాబోయే 75 సంవత్సరాల్లో ఖర్చు చేయడానికి ఒక ప్రణాళికను తయారుచేశారు. యురేనియం వల్ల యూనిట్ విద్యుత్ ఎంతకి లభిస్తోంది అన్న లెక్కలు తీసేవారు అణువ్యర్థాల నిల్వల కోసం వెచ్చిస్తున్న ఖర్చుని మాత్రం పరిగణనలోకి తీసుకోవడం లేదు!
ఎందుకు దూరంగా ఉంచాలి?
యురేనియం ప్రత్యేక లక్షణాల గురించి ముందే చెప్పుకున్నాం కదా. యురేనియం నుంచి రేడియంగా, రేడియం నుంచి రేడాన్ వాయువుగా అనేక దశలతో అది రూపాంతరం చెందుతుంటుంది. ఎంతో సూక్ష్మస్థాయిలో జరిగే ఈ చర్యవల్ల వెలువడే అణుధార్మిక ఉనికిని మన పంచేంద్రియాలు గుర్తించలేవు.
ఈ ప్రకృతిలో గల సకల జీవజాలమంతా కణాల నిర్మితాలన్న సంగతి తెలిసిందే. అయితే, ఈ అణుధార్మిక పదార్థం ఏదైనా డిఎన్ఏతో కూడిన కణానికి తగిలినా, చేరువైనా ఆ పదార్ధం నుంచి వెలువడే ఆల్ఫా, బీటా పార్టికల్స్, గామా కిరణాలు ఆ కణాన్ని చీల్చివేయడమో లేదా మాడ్చివేయడమో చేస్తాయి. ఇటువంటి ప్రమాదాల్లో నాలుగు రకాల ఫలితాలు ఉండొచ్చు. 1. ఆ కిరణాలు కణాన్ని దెబ్బతీయకుండానే కణం నుంచి చొచ్చుకుపోవడం, 2. కణాన్ని దెబ్బతీస్తుంది – కానీ ఆ దెబ్బ నుంచి ఆ కణం దానికదే కోలుకుంటుంది, 3. కణం అణుధార్మికత దాడిలో చనిపోతుంది., 4. కణంలో ఉండే డిఎన్ఎ దెబ్బతింటుంది – కణం మాత్రం జీవంతోనే ఉంటుంది.
ఇందులో మొదటి దానివల్ల పెద్దగా నష్టం లేదు. రెండోది ఎంతవరకూ ప్రమాదమన్నది ఇప్పటికీ చర్చనీయంశమే. మూడవది కణం చనిపోవడం. ఇలా మన శరీరంలో కణాలు పుట్టడం, గిట్టడం ఒక క్రమపద్ధతిలో జరిగిపోతూనే ఉంటుంది. ఇక్కడ చనిపోయే కణం ఆ కోవకి చెందితే ఫర్వాలేదు. కానీ, అదే పరిస్థితి పదే పదే జరిగితే చివరికది క్యాన్సర్‌గా పరిణమించొచ్చు. నాలుగోదాని వల్ల కణంలోని డిఎన్ఎ దెబ్బతిని జన్యుసంబంధ అనువంశిక రోగాలకు దారితీస్తుంది.
ప్రపంచం మొత్తంమీద యురేనియం వెలికితీత, శుద్ధి చేయడం, ఇంధనంగా వాడుతున్న ప్రదేశాల్లోనూ, అణుబాంబులు చేసి ప్రయోగించిన ప్రదేశాల్లోనూ రోగకారక స్థితి, జన్యువులలో మార్పులు సంభవించిన దాఖలాలున్నాయి. ముడి ఖనిజం రూపంలో యురేనియం భూమిపొరల్లో అట్టడుగున ఉన్నంతకాలం దానివల్ల మానవాళికి కానీ, ఇతర జంతుజాలంగానీ ఈ రకమైన జబ్బులకు లోనుకాలేదు. శాస్త్రజ్ఞులు యురేనియంని ఆయుధాల తయారీకి, విద్యుత్ ఉత్పాదనకి, ఈ మధ్యకాలంలో క్యాన్సర్ చికిత్సకీ వాడడం ప్రారంభించిన తర్వాత దీని ప్రాముఖ్యం పెరిగింది. అయితే, ఈ 50 ఏళ్ళ అనుభవాలు యురేనియం తాలూకు ఉపయోగంపై మనల్ని ఒకానొక సంశయంలోకి నెట్టేస్తున్నాయి.
భారతదేశం గత 40 సంవత్సరాల నుంచి అణువిద్యుత్ ఉత్పత్తి కోసం యురేనియంను ఉపయోగిస్తోంది. జార్ఖండ్, బీహార్ రాష్ట్రాలలో గనుల నుంచి యురేనియంని వెలికితీస్తోంది. ఈ నలభై ఏళ్ళలోనూ కొన్ని వేల కోట్ల రూపాయలను ఖర్చు చేయడంవల్ల లభిస్తున్న విద్యుత్ కేవలం 2700 మెగావాట్లు మాత్రమే. గత 20 సంవత్సరాల నుంచి జరుగుతున్న ‘రెన్యువబుల్ ఎనర్జీ’ సామర్ధ్యం 3200 మెగావాట్లు కావడం ఆశ్చర్యకర విషయం. డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ లెక్కల ప్రకారమే చూసుకున్నా, రాబోయేపదేళ్ళలో 96 శాతం విద్యుత్ కోసం ‘నాన్ యురేనియం (యురేనియమేతర వనరులు) వనరుల పైనే ఆధారపడక తప్పదని వెల్లడవుతోంది. ఇన్ని కోట్లు ఖర్చుచేస్తున్నా నాలుగు శాతం కూడా రాని విద్యుత్ కోసం ఈ ప్రయాసలూ, ప్రమాదాలూ కొనితెచ్చుకోవాలా?
ప్రపంచంలో యురేనియం నిల్వలు అత్యధిక శాతం కెనడా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా దేశాలైన నైగర్, గేబస్, నమీబియాలలో ఉన్నాయి. ఈ ప్రదేశాలన్నీ ఆదివాసీ ప్రాంతాలు కావడం గమనించాలి. ఆ యురేనియం గనులలో వారికి ఉద్యోగాలు, తదితర సదుపాయాల ఎర చూపించి వారినే బలిపశువులుగా చేసిన సందర్భాలు కోకొల్లలు. భారత్‌లోని జాదుగూడ యురేనియం నిక్షేపాలు కూడా ఆదివాసీ ప్రాంతంలోనే ఉన్నాయి. ప్రస్తుతం యుసిఐఎల్ అధికారులు ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపాదిస్తున్న యురేనియం ప్రాజెక్ట్ కూడా నల్లగొండ జిల్లాలోని ఆదివాసీ లంబాడాలు నివసించే ప్రాంతంలోనే కావడం ఇంకో విశేషం.
యురేనియం గనులలో ఈ ఆదివాసీలను, ఏ నైపుణ్యం లేనివారిని ఉద్యోగాల్లో తీసుకోవడం, ఉద్యోగుల ఆరోగ్య భద్రతకి తగిన చర్యలు తీసుకోకపోవడం వల్ల వారు రేడియేషన్‌కు గురై పిన్నవయసులోనే రోగాలకు గురవుతూ చనిపోవడం సర్వసాధారణమైపోయింది. తర్వాత, వెలికితీసిన యురేనియం నుండి ఖనిజాన్ని శుద్ధి కర్మాగారాలలో, వారికి కావాల్సిన ఇంధన మూల పదార్థమైన ‘ఎల్లో కేక్’ని మాత్రమే తీసుకుని మిగిలిన 85 శాతం అణుధార్మికత కలిగిన వ్యర్థ పదార్థాల్ని కొన్ని లక్షల టన్నులు ‘టెయిలింగ్ పాండ్స్’ అనే చెరువుల్లో వదిలేస్తున్నారు. ఈ పరిస్థితి వల్ల జన్యు సంబంధమైన లోపాలు, క్యాన్సర్లు, లుకేమియా, రోగస్థ శిశువుల జననం, పునరుత్పత్తి – హార్మోన్ల సమస్యలు, రోగనిరోధక శక్తి లోపించడం వంటి రకరకాల జబ్బులు మానవాళిని బాధిస్తున్నాయి.
జార్ఖండ్‌లోని జాదుగూడలో యుసిఐఎల్ చేపట్టిన యురేనియం వెలికితీత శుద్ధి చేయడంవంటి పనులవల్ల స్థానికుల జీవితాల్లో ఎన్నో పరిణామాలు సంభవించినట్లు జాతీయ, అంతర్జాతీయ సంస్థల సర్వేలలో తేలింది. జీవిత కాలం తగ్గడం, గర్భస్థ శిశువుల్లో మార్పులు, తరచూ గర్భస్రావాలు జరగడం, గర్భ విచ్ఛిత్తి, పుట్టిన 24 గంటల్లో చనిపోయే పిల్లల సంఖ్య అధికంగా ఉండడం, పుట్టిన పిల్లలు రోజుల్లోనో, ఒక ఏడాదిలోనో చనిపోవడం, చర్మవ్యాధులు, అంగ వైకల్యం, జన్యు లోపాలు, ఆడవారిలో అండాశయ, మగవారిలో వృషణ సంబంధ క్యాన్సర్లు రావడం, పిల్లలులేని దంపతుల సంఖ్య పెరగడం వంటి పలురకాల ఆరోగ్య సమస్యలతో స్థానికులు బాధపడుతున్నట్టు గుర్తించారు.
కనువిప్పు కలిగించిన మేఘాలయ
ఈ పరిణామాల్ని ముందే గుర్తించారు కనుకనే భారత్‌లోని మేఘాలయ రాష్ట్ర ప్రభుత్వం, అక్కడి ప్రజానీకం దొమియాసి వద్ద యుసిఐఎల్ చేపట్టాలనుకున్న ప్రాజెక్టుని తిప్పికొట్టారు. అక్కడ యుసిఐఎల్ వారు గత 5 సంవత్సరాల నుంచి చేపట్టిన తవ్వకాల ఫలితంగా వింత వింత వ్యాధులకు స్థానికులు లోనయ్యారు. ఆదివాసీలైన వారంతా సమిష్టిగా, సంప్రదాయ ఆయుధాలు ధరించి వెళ్ళి యుసిఐఎల్ వారిని ఎదుర్కొన్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే దొమియాసియాత్లో ఉన్న యురేనియం ఖనిజం నల్గొండ జిల్లా పి.ఎ.పల్లి మండలంలోని పెద్దగట్టు, లంబాపురంలో లభించే యురేనియం శాతం కంటే (అక్కడ 0.1 శాతం. ఇక్కడ 0.06 శాతం) దాదాపు రెట్టింపు. భారత్‌లో ఉన్న యురేనియం నిక్షేపాలలో 16 శాతం అక్కడే ఉంది. అయినా సరే, స్థానికుల నుంచి వచ్చిన వ్యతిరేకత వల్ల ప్రాజెక్టు నిలిచిపోయింది.
ప్రమాదపు అంచుల్లో టెయిలింగ్ పాండ్స్
ప్రపంచంలో ఎక్కడైనా సరే ‘టెయిలింగ్ పాండ్స్’లో వదిలే అణుధార్మిక వ్యర్థ పదార్థం అతి మెత్తటి పిండిలా ఉండి గాలిలో తేలుతూ కొన్ని వందల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంటుంది. ఆ రకంగా అది సకల జీవజాలానికి ప్రాణాంతకంగా పరిణమిస్తోంది. ఇందులో రేడాన్ వాయువు ‘హాప్లైఫ్’ మూడున్నర రోజులు కావడంతో, అది ఆహారం ద్వారా కానీ, శ్వాస ద్వారా కానీ, మరే విధంగానైనా మనిషి దేహంలోకి ప్రవేశించిన మరుక్షణం పైన చెప్పిన విధంగా రోగాల బారిన పడే అవకాశముంది.
కెనడాలో, ఆస్ట్రేలియాలో ఎంతోమంది గని కార్మికులు ఈ రోగాలకు గురై చనిపోయారు. అనేక ప్రాంతాల్లో వ్యర్థ పదార్థాల్ని
ఉంచిన టెయిలింగ్ పాండ్స్ నేలలోకి ఇంకడం, గట్లు తెగిపోవడమో లేదా పొంగిపొర్లడం వంటి అనేక ప్రమాదకర పరిస్థితుల్ని సృష్టిస్తున్నాయి. వీటిలోని అణుధార్మిక పదార్థాలు నేరుగా నేల, గాలి, నీటిలో కలిసిపోయి మానవ మనుగడనే దెబ్బతీస్తున్నాయి. ఈ పదార్థాల ‘హాఫ్లైఫ్’ కొన్ని వేల సంవత్సరాలు కావడంతో సమస్య మరింత జఠిలమవుతోంది.
టెయిలింగ్ పాండ్స్‌లో అణువ్యర్థాలు వదలడంవల్ల ప్రమాదం ఉండదనో లేదా అణు రియాక్టర్ల కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కనుగొన్నామనో ఎవరు చెప్పినా నమ్మనక్కర లేదు. ఎందుకంటే ఇవేవీ ప్రమాదాల్ని నిలువరించలేవన్నది జగద్విదితం. అనుభవపూర్వకంగా తెలిసిన వాస్తవం. ఈ మధ్య తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో ఉన్న కల్పాకం అణు విద్యుత్ కేంద్రంలో ఆరుగురు
ఉద్యోగులు తీవ్ర అణుధార్మికతకి గురయినట్లు అధికారులే ప్రకటించారు. అయితే, వారు ప్రస్తుతం సంపూర్ణారోగ్యంతోనే ఉన్నారని అధికారులు సమర్ధించుకోవడం కూడా జరిగింది. హైదరాబాద్‌లో ఉన్న న్యూక్లియర్ ఫ్యుయల్ కాంప్లెక్ట్ (ఎన్.ఎఫ్.సి) చుట్టుపక్కల ప్రాంతాల ప్రజానీకం కూడా అణుధార్మికతకి గురవుతున్నారని, వారిలో జన్యు పరమైన మార్పులు సంభవించాయని పరిశోధనలలో తేలినట్లు పర్యావరణ ఉద్యమకారులు హెచ్చరిస్తున్నారు.
ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పరిణితి చెందిన పలువురు శాస్త్రవేత్తలు, మేధావులు ఒప్పుకుంటున్న విషయమేంటంటే… ‘యురేనియం ద్వారా వచ్చే విద్యుత్ ఎంతో ఖరీదైనది’ అని. అభివృద్ధి పేరుతో మానవాళి మనుగడనే పణంగా పెట్టడం సబబేనా అన్న చర్చే ఇప్పుడు ఎల్లెడలా వినిపిస్తోంది. సాంకేతిక పరిజ్ఞానం విషయంలో ఎంతో ఉన్నతస్థాయిని అందుకున్న పాశ్చాత్య దేశాలు సైతం అణుశక్తిని ఉపయోగించుకోవడంలో వైఫల్యాలతో సతమతమవుతుంటే, భారతదేశం వారిని గుడ్డిగా అనుకరించడం సమర్ధనీయమేనా? ఏదేమైనా, మొత్తం వ్యవహారంలో యురేనియందే గెలుపు కావచ్చు. ఎందుకంటే దాని ‘హాఫ్ లైఫ్’ 450 కోట్ల సంవత్సరాలు. దానిముందు మనిషి జీవిత కాలమెంత!? దూరంగా ఉంచామో బతికి బట్టకడతాం. లేదంటే వినాశనమే. యురేనియం భూమితోపాటు పుట్టిన ఖనిజం అన్న సంగతిని ఎప్పటికీ మరవొద్దు.
(పర్చా కిషన్‌రావు ఖమ్మం జిల్లాలో వ్యవసాయం చేస్తున్నారు. శ్రీవరి సాగుమీద విస్తృతమైన పరిశోధన చేస్తున్నారు).
వెంటాడే విధ్వంస స్మృతి చెర్నోబిల్
– వై.వి.ఆర్.సుబ్రహ్మణ్మం
ఏప్రిల్ 27, 1986. రోజూ అరుణకాంతులతో ఉదయించే సూర్యుడు ‘ఆ రోజు’ కూడా అలాగే ఉదయించాడని స్కాండినేవియా ప్రజలు దైనందిన కార్యక్రమాలు మొదలుపెట్టారు. ప్రభాతవేళ ప్రశాంత సమీరాలు ప్రాక్ దిశనుంచీ మధురంగా వీస్తున్నాయి. ప్రకృతి అందాలను ఆస్వాదించే అవకాశం తమకు లేదనీ, ప్రకృతిని పరిరక్షించటమే తమ కర్తవ్యమని కొన్ని ‘మానిటర్లు’ తమ డ్యూటీ తాము చేస్తున్నాయి. అవి సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో చూడడం తప్ప, అవి అలారం మోగించాలని ఎవరూ కోరుకోరు. తూర్పునుంచి వీస్తున్న పిల్ల తెమ్మెరలు తాకగానే ప్రళయ కాలరుద్రుడు ప్రత్యక్షమయ్యాడు మానిటర్లకు. అవి మామూలు మానిటర్లు కావు. వాతావరణంలోని రేడియేషన్ హాలాహలాన్ని పసిగట్టే శక్తివంతమైన వ్యవస్థలు. ఒక్కసారిగా అవి మోగటం మొదలుపెట్టాయి. ఆ మోత విన్న అణుశాస్త్ర నిపుణులకు గుండె ఝల్లుమంది. అంతకంతకీ ప్రమాద సంకేతాలు అధికమవుతుంటే, అవి పిల్లగాలులు కావని ఎక్కడో ఏదో అణు విద్యుత్ కేంద్రంలో అపశ్రుతి దొర్లిందని గుర్తించారు. అణు ధార్మిక శక్తి గాలిద్వారా మృత్యువులా కబళిస్తోందని, ‘కాలమేఘాలు’ కమ్ముకొస్తున్నాయని అనుకున్నారు. వారు ఊహించింది నిజమయింది. ఆనాటి సోవియట్ యూనియన్‌లోని చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రంలోని నాలుగో అణు రియాక్టర్ బద్దలైంది. అదే మానవ చరిత్రలో అతి పెద్ద అణుశక్తి ప్రమాదం. చెర్నోబిల్ విధ్వంసం!
బద్ధలైన అణురియాక్టర్ నుంచి రెండు వారాల పాటు రేడియేషన్ మేఘాలు స్వైర విహారం చేశాయి. మూడు లక్షల టన్నుల కాంక్రీటు మెటల్‌తో మృత్యుదేవత బయటకు రాకుండా చేయాలని ‘లిక్విడేటర్స్’ అనే వీరులు శతవిధాలా ప్రయత్నించారు. ఈలోపే అదుపులేని రేడియేషన్ మృత్యు మేఘాలు చుట్టుపక్కల పల్లెలను, పట్టణాలనూ, అడవులను చుట్టుముడుతూ అనేక దేశాలను కూడా ఆక్రమించింది. ఉక్రెయిన్‌లోని 1,50,000 మందిని హడావిడిగా ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బెలారస్ నుంచి 1,30,000 మంది తరలిపోయారు. ఏ గాలి ఎటు తిరుగుతుందో ఎవరికీ తెలియదు. గాలివాటు మారింది. తలదాచుకోవడానికి వెళ్ళిన ప్రజలు మళ్ళీ స్థలం మారాల్సి వచ్చింది.
ఆ ప్రమాదంలో మరణించిన వారి పంఖ్య 2.500 అన్నది అప్పటి సోవియట్ యూనియన్ ప్రభుత్వ నివేదిక. చెర్నోబిల్ సంఘటన నేటికీ చర్నాకోలలాగా ఛెళ్మని కొడుతూ అణు విద్యుదుత్పత్తి సంస్థలని భయపెడుతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ‘ప్రమాదరహితంగా అణువిద్యుత్ పొందగలమా?” అన్న ప్రశ్న తలెత్తింది. సమాధానం దొరక్క, భద్రతా వ్యవస్థలు విఫలం కావడంతో ఎన్నో ఉద్యమాలు నడిచాయి. అమెరికా ప్రభుత్వం సైతం అణువిద్యుత్ కార్యక్రమాలకు పెట్టుబడులు ఉపసంహరించుకుంది. ఈ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోకపోతే ఎలా?
(అణు ‘ధార్మిక’ సత్యాలు పుస్తకం నుండి)