ఓల్గా సాహితీ స్వర్ణోత్సవం సందర్భంగా ‘ఓల్గా సాహిత్యం-సాన్నిహిత్యం ఏ 50’ కార్యక్రమం డిసెంబర్ 1 ఆదివారం ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్‌లోని నారాయణగూడాలో ఉన్న రెడ్డి ఉమెన్స్ కాలేజి ఆడిటోరియంలో జరిగింది. ఎంతోమంది రచయితలు, మేధావులు, అధ్యాపకులు, ఆత్మీయులు, హితులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు, కుటుంబసభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమం ఆద్యంతం ఆసక్తికరంగా, ఆహ్లాదకరంగా జరిగింది. ముందుగా =దీహ== కాలేజి ఇంగ్లీష్, తెలుగు అధ్యాపకులు ఓల్గాగారి సాహితీ ప్రయాణం గురించి మాట్లాడారు. ఆ తర్వాత ప్రొఫెసర్ సుదర్శన్ ఈ కార్యక్రమాన్ని తమ కాలేజిలో నిర్వహించే అవకాశం ఇచ్చినందుకు ఓల్గాగారికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం అక్కినేని కుటుంబరావు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని =దీహ== కాలేజి భాషా శాఖలు, ఓల్గా మిత్రులు కలసి సంయుక్తంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
శ్రీనిధి బృందం నృత్యరూపకాన్ని ఎంతో మనోహరంగా ప్రదర్శించారు. అనంతరం రచయిత, మేధావి వసంత కన్నాభిరాన్ ఓల్గా గారితో తన స్నేహం గురించి మాట్లాడారు. ఓల్గా తనకు 1983 నుంచి పరిచయమని, కొంతవరకు కలిసి సాహితీ ప్రయాణం చేశామని చెప్పారు. తన రచనలను అనువాదం చేసి, వాటిని తెలుగు పాఠకులకు దగ్గరగా చేర్చింది ఓల్గానేనని చెప్పారు. ఆమె మాట సున్నితమని, మృదువుగా, మెత్తగా మాట్లాడతారని, కానీ బుర్ర అత్యంత పదును అని అన్నారు. ఆమె పురుషుల సానుభూతి పరురాలని అన్నారు. పురుషులను తిట్టరని, వ్యవస్థలోని పురుషాధిపత్యాన్ని తన రచనల ద్వారా చీల్చి చెండాడుతారని అన్నారు. మీరు ఇంతకు ముందు బాలే చూశారు. ఆ లిరిక్స్‌లో దీవaబ్‌వ, జుaరవ, ఖీశ్రీబఱసఱ్‌వ ఉంటుందని, క్లిష్టమైన స్త్రీ వాద సిద్ధాంత భావనలు, రాజకీయ భావనలు, తన కథలు, నవలలు, కవితలను ఆమె బాలేల్లో పెడతారని అన్నారు. ఆమె ఎన్నో అవార్డులను పొందారని, ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నారని, మరెంతో ఉన్నత స్థాయికి ఎదిగారని కన్నాభిరాన్ అన్నారు. శత్రువులు ఆమెను అణచివేయాలని చూశారని, ‘నువ్వు నెగ్గలేవు, నిలబడలేవు’ అంటే ఆమె నిలబడి చూపారని ఆయన ప్రశంసించారు. తమది 40 ఏళ్ళ స్నేహమని, తాను తమ స్నేహాన్ని ఎంజాయ్ చేశానని చెప్పి ముగించారు.
అనంతరం ఓల్గా రచించిన యుద్ధం-శాంతి, లక్ష్మణరేఖ నృత్య రూపకాల నుంచి కొన్ని పాత్రలను కూచిపూడి నృత్య కళాకారిణులు ఎంతో హృద్యంగా, మనోహరంగా ప్రదర్శించి ప్రేక్షకులను అలరించారు.
అనంతరం ప్రముఖ కవి, సాహిత్య విమర్శకులు సీతారామ్, ఓల్గా కవిత్వం గురించి ప్రసంగిస్తూ, ఆమె 50 ఏళ్ళ సాహిత్య కృషిని సంబరంగా, వేడుకగా జరుపుకుంటున్న సందర్భంలో ఆమె కవిత్వం గురించి తనను మాట్లాడమన్నారని చెప్పారు. 50 ఏళ్ళుగా తెలుగు సాహిత్యం మీద చర్చలు, వాదోపవాదాలు, విశ్లేషణలు, అవగాహనలు జరుగుతూనే ఉన్నాయని అన్నారు. చాలా సందర్భాలలో తెలుగు కవిత్వంలో ఉద్దేశపూర్వకంగా జరిగిందా అనేది తెలియదు కానీ, పైగంబర కవుల గురించి ఎక్కువ చర్చ జరగలేదని అన్నారు. పైగంబరులు కూడా చర్చ జరగాలని పట్టుబట్టలేదని, ఆ కవులలో ఒకరుగా ఓల్గాగారు ఉన్నారన్న విషయం భవిష్యత్తులో తెలుగు కవిత్వం పట్టించుకుంటుందని భావిస్తున్నానని అభిప్రాయపడ్డారు. 1972లో ఓల్గా ‘పంచాది నిర్మల వారసురాలిని’ అనే కవితను, ఆ తర్వాత ‘గృహలక్ష్మి’, ‘మెహందీ స్త్రీల విజ్ఞప్తి’, ‘అవును మేము గయ్యాళులమే’ అన్న కవితలు రాశారని చెప్పారు. చివరి కవితను ‘రచయిత అయిన రావిశాస్త్రి స్త్రీ వాద సాహిత్య సంవేదనలను అర్థం చేసుకోవడం లేదనే ఆక్రోశంతో ఓల్గా రాశారని అన్నారు. పితృస్వామ్యం-పురుషాధిపత్యాన్ని స్త్రీలు అంగీకరించలేని స్థితి ఉండడంవల్లనే రావిశాస్త్రి స్త్రీ వాదులను గయ్యాళులు అన్నప్పుడు ఓల్గా దానికి సమాధానంగా ఆ కవితను రాశారని ఆయన చెప్పారు. గృహలక్ష్మి కవితలో స్త్రీల ఇంటిపని విలువలేనిది, గుర్తింపు లేనిది, మూల్యం లేనిది, నిష్ఫలశ్రమగా ఉండిపోతుందని చెప్పారని అన్నారు. 1972లో రాసిన ‘పంచాది నిర్మల వారసురాలిని’ అనే కవిత చాలా విశేషమైనదన్నారు. అందులో ఉన్నత వర్గ, కులీన, మధ్యతరగతి శ్రామిక స్త్రీలు స్వేచ్ఛను కోల్పోయి అణచివేతలకు గురవుతున్న వ్యక్తులన్న వాస్తవాన్ని ఆవిడ ప్రజంట్ చేశారన్నారు. ఆమె కవితలో దోపిడీ, హింసలను న్యాయబద్ధమైన దాస్యంగా గురయ్యామని అంటారని అన్నారు. అందులో మీరు ఇచ్చిన పాత్రలను తిరస్కరిస్తున్నామన్న సూచన కనిపిస్తుందన్నారు. నిరాకరించడం, తృణీకరించడం, అవతలివారు పెత్తనాన్ని ఎదిరించడం అందులో కనిపిస్తుందని ఆయన అన్నారు. అలాగే ఆ కవితలో స్పష్టమైన రాజకీయ దృక్పథం కనిపిస్తుందన్నారు. స్త్రీ వాద వస్తు వైవిధ్యం ఓల్గా గారి నుంచే ప్రారంభమైందని సీతారామ్ అన్నారు. ‘మెహందీ స్త్రీల విజ్ఞప్తి’ కవితలో వివాహ వ్యవస్థ వెలుపల స్త్రీల గురించి, తక్కువగా చూడబడిన స్త్రీల గురించి రాశారని అన్నారు. ఇంత మంచి సాహిత్యాన్ని అందించినందుకు ఓల్గా గారికి అభినందనలు తెలియజేస్తున్నానని ఆయన అన్నారు.
అనంతరం మహాకవి గోపి ఓల్గా గారికి అభినందనలు తెలియచేశారు.
ఆ తర్వాత డా.మృణాళిని ఓల్గా సాహిత్యం గురించి మాట్లాడుతూ ‘శాంతి అంటే ఘర్షణ లేకుండా ఉండడం కాదని, ఘర్షణాపూరిత పరిస్థితుల్లో కూడా ప్రశాంతంగా ఉండగలగడం’ అన్న విషయాన్ని ఓల్గా గారి నుంచి నేర్చుకుంటామని అన్నారు. ఆమె ప్రధానంగా స్త్రీలకు సంబంధించిన విషయాలు చెప్తారని, మనకు తెలిసిన విషయాలు, మనకు ఏ మాత్రం అర్థం కాలేదని ‘ముక్కు’, ‘చెవులు’, ‘నోరు’ తదితర కథల్లో చెప్తారని అన్నారు. ఆమె రచనలు గమనిస్తే ఆత్మ విమర్శ, సామాజిక విమర్శ రెండూ ఉంటాయని అన్నారు. ఆత్మ విమర్శ కలిగించిన రచయితల వల్లే పాఠకులు ప్రభావితమవుతారని, స్త్రీ, పురుషులకు స్వస్వరూప జ్ఞానాన్ని అందించడంలో ఓల్గాది మొదటి చేయని ఆమె అన్నారు. ఆమె లక్ష్య పాఠకులు ఎవరు? ఓల్గా రచన ప్రారంభించినప్పుడు, చదువుకున్న మధ్యతరగతి స్త్రీలే ఆమె పాఠకులని అన్నారు. ఆ తర్వాత ఆమె రచనా ప్రక్రియ విస్తరించిందని, క్రమంగా కథలు, నవలలు, సాహిత్య విమర్శలతో పాటు నాట్యం, నాటకం, సినిమా, టి.వి.ల ద్వారా స్త్రీ వాద సిద్ధాంతాలను ప్రచారంలోకి తీసుకువచ్చారని చెప్పారు. లక్ష్య పాఠకులను విస్తరించుకున్నారని, మొత్తం సమాజం గురించి ఆలోచించి, ఎవరికి ఏ భాషలో చెప్పాలో ఆ రకంగా చెప్పారని అన్నారు. సీత, శూర్పణఖ, అహల్య వంటి పురాణ పాత్రలతో అన్ని వర్గాల స్త్రీలు గుర్తించబడతారని అన్నారు. ఓల్గా ఎప్పుడూ కూడా ‘చెప్పాల్సి ఉంది, బాగా చెప్పాల్సి ఉంది, ఇంకా కొత్తగా చెప్పాల్సి ఉంది’ అని భావిస్తారని అన్నారు. వనిత టి.వి.లో ‘మానవి’ సీరియల్ ప్రారంభమైనప్పుడు ఎంతో భిన్నంగా ఉందంటూ దాన్ని మహిళా ప్రేక్షకులు ఆదరించారని చెప్పారు. ఓల్గా నృత్య రూపకాల ద్వారా, ఎంతో విరుద్ధ భావజాలం, వ్యతిరేక భావజాలం ఉన్నవారిని కూడా కన్విన్స్ చేయగలుగుతారని, ఆమెది ధర్మాగ్రహం, పాషాణ పదజాలం కాదని, సమాజంలో ఎదుటి వారిని ఎలా ఒప్పించాలో ఆమెకు బాగా తెలుసని అన్నారు. ఓల్గా స్త్రీ వాద భావజాలాన్ని ప్రచారం చేయడానికి రచనలు చేశారని, రాస్తున్న క్రమంలో ఆమెలో మార్పు, పురాణ పాత్రలు తీసుకోవడంలో శాంతి ఎక్కువైందని అన్నారు. విముక్త కథల్లో పాత్రలు స్వగతం చెప్తున్నట్లు ఉంటాయన్నారు. శిల్పిపరంగా విముక్త కథల్లో పరిణితి కన్పిస్తుందని, పాత్రలు వాదంతో మాట్లాడి స్వగతంలోకి వస్తాయని అన్నారు. ఆ పాత్రల ద్వారా చిట్టచివరి ప్రశాంతత, శాంతి, ఆ ్‌శీఅవ స్వగతంలోనే ఉందని భావించి చెప్పదలచుకుంది చెప్పారని మృణాళిని అన్నారు. ‘నీ రచనలు చదివిన కొంతమందికి కోపం వస్తుందని’ ఆమెతో చెబితే ‘కోపం తెప్పించకపోతే నా రచనలు ఎందుకు?’ అని ఓల్గా అంటారని చెప్పారు. రచనల క్రమ పరిణామంలో కోపం నుంచి ధర్మాగ్రహం, తనలో తాను శాంతి పడడం ‘యశోబుద్ధ’ లో కనిపిస్తుందని, అలాగే స్త్రీ మధ్య సాన్నిహిత్యాన్ని ఆమె రాసినంత గాఢంగా మరెవ్వరూ రాయలేరని అభినందిస్తూ డా.మృణాళిని తన ప్రసంగాన్ని ముగించారు.
అనంతరం ఓల్గా సాహిత్య వ్యాసాలు, సాహిత్య విమర్శకురాలిగా ఆమె కృషి గురించి ప్రొ.మధుజ్యోతి మాట్లాడుతూ ఓల్గా గారు సాహిత్యాన్ని ఏ ప్రక్రియలో రాసినా స్త్రీ వాద సిద్ధాంత ప్రచారం కోసమే రాశారని, ఆమె పదునైన ఆలోచనలతో పాఠకులకు చైతన్యాన్ని అందించారని అన్నారు. వారి వాగ్ధోరణి మార్దవంగా ఉంటుందని, ఆందోళనా సమయాల్లో కూడా శాంతి స్వరాలతో మాట్లాడడం ఆమె సమర్థతకు నిదర్శనమని ప్రశంసించారు. ఆమె తర్కం, ఆలోచనల్లో మనోధైర్యంఉందని, విమర్శలో కొత్త ధోరణి కన్పిస్తుందని, వ్యాసాల్లో క్రమత, స్పష్టత కన్పిస్తుందని, ప్రతి పేరాని చర్చిస్తుందని అన్నారు. సాహిత్య వ్యాసాల పరిణామ క్రమంలో వామపక్ష ధోరణి నుంచి స్త్రీవాద ఆలోచనలు చేశారని, స్త్రీల సమస్యలు వామపక్షాలు గుర్తించలేదని, స్త్రీవాదం గుర్తిస్తుంది కాబట్టే వామపక్ష ధోరణి నుంచి స్త్రీవాదంలోకి, అక్కడినుంచి రాజ్యాంగం పట్ల తన ఆలోచనలు చూపారని అన్నారు. రాజ్యాంగ నైతికతను, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి రాజ్యాంగ విలువలను నీతిగా గ్రహించాలని ఓల్గా తన సాహిత్య వ్యాసాల్లో తెలియజేశారని చెప్పి ముగించారు.
తర్వాత ప్రముఖ రచయిత కొలకలూరి ఇనాక్ ఓల్గా గారికి అభినందనలు తెలియజేస్తూ, ఆమె రచనల్లో ఆర్ద్రత, మానవీయత, హృదయ కోమలత నిండి ఉంటాయని ప్రశంసించారు.
అనంతరం విముక్త కథలను ఇంగ్లీష్‌లోకి అనువదించిన ప్రొ.విజయకుమార్ కూఱపవతీa్‌ఱశీఅ శీట ూఱ్a పుస్తకం గురించి తన అనుభవాలను పంచుకున్నారు.
తర్వాతి సెషన్‌లో ఓల్గా కథల గురించి రచయిత్రి అయ్యగారి సీతారత్నం మాట్లాడుతూ ఆమె కథలు, నవలలు అనేక పాఠ్యాంశాలుగా వచ్చాయని, ఆమె ద్వారా స్త్రీవాదం సామాజిక ఆమోదం పొందిందని అన్నారు. సామాజిక కార్యకర్తగా స్త్రీవాదాన్ని సమాజంలో ప్రచారం చేశారని, ఆమె రచనను ఒక ఉద్యమంగా చేపట్టారని అన్నారు. ఆమె తనపై జరిగిన దాడులను అధిగమించి మరీ రాశారని ప్రశంసించారు. ”ఘనీభవించిన పితృస్వామ్యాన్ని ద్రవీకరింప చేసి, బిందు రూపంలో లేకుండా చేయడానికి” రచనలు చేశారన్నారు. ‘తెలుగు సాహిత్య యుగకర్త ఓల్గా’ అని ప్రస్తుతించారు.
అనంతరం ఓల్గా మాట్లాడుతూ ఈ రోజు ఇంతమంది తన మీద ప్రేమతో, స్నేహంతో, అభిమానంతో ఇక్కడికి వచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. 50 సంవత్సరాలపాటు నిరంతరం రాయడమంటే మాటలు కాదని, ఎన్నో అవరోధాలు, ప్రత్యక్షంగా విమర్శలు ఎదుర్కొన్నానని చెప్పారు. రాజ్యం సెన్సార్‌షిప్‌ను, సాహిత్య పీఠాధిపతులు, సాంఘిక శక్తుల ఒత్తిడిని ఎదుర్కొని రాయడం కష్టమన్నారు. తమను తాము నిలబెట్టుకోవాలని, భిన్నంగా బ్రతకాలనే స్త్రీలు ఉంటారని అన్నారు. తన రచనలు ఆపాలని, స్త్రీవాద భావాలను ఆపాలని చాలా ప్రయత్నాలు జరిగాయన్నారు. చాలామంది ఆ ప్రయత్నాల్లో భాగమయ్యారన్నారు. అలాంటి పరిస్థితులు వస్తాయని, తాను వాటిని ఎదుర్కోగలిగానని చెప్పారు. స్త్రీలకు స్ఫూర్తిగా నిలవడానికి నిరంతరం రాస్తూ పోయానని, స్త్రీగా ఇలా తనను తీసిపారేయడం, దాడులు చేయడం జరిగినపుడు వసంత కన్నాభిరాన్, హరగోపాల్, వరవరరావు, కేతు విశ్వనాధరెడ్డి, చలసాని ప్రసాదరావు తనకు అండగా ఉన్నారని, వాళ్ళు ప్రజాస్వామిక శక్తులుగా, స్త్రీ పురుష భేదం లేకుండా తన వెనుక ఉన్నారని, వాళ్ళు లేకపోతే తాను నిలబడేదాన్ని కాదని చెప్పారు. అలాగే కల్పన, వింధ్య, వసంతలక్ష్మి… అందరూ తన వెనక ఉన్నారని, వాళ్ళందరూ తనకు పంచిన ప్రేమాభిమానాలను తానెప్పటికీ మర్చిపోనని అన్నారు. కుటుంబరావు, తన పిల్లలు కూడా తన వెనక ఉన్నారన్నారు. వీళ్ళందరూ తన బలం అన్పిస్తుందని చెప్పి ముగించారు.
మధ్యాహ్నం భోజనానంతరం రెండవ సెషన్ మొదలయింది. మొదటగా ‘ఓల్గా సాహిత్యం-సాన్నిహిత్యం’ పుస్తకాన్ని రచయిత్రి పి.సత్యవతి తదితరులు ఆవిష్కరించారు. రచయిత్రి ప్రతిమ ఓల్గా సాహిత్య కృషిని ప్రశంసించారు. వ్యాస రచయిత్రి స్వర్ణ కిలారి ‘స్వేచ్ఛ’ నవలలోని అరుణ పాత్రను విశ్లేషించి రాయడంలోని తన అనుభవాన్ని పంచుకున్నారు.
తమిళ, కన్నడ రచయితలైన గౌరి కృపానందన్, వేద కుమార్ అజయ్ వర్మ అట్లూరి విముక్త కథల కన్నడ అనువాదాన్ని ఆవిష్కరించారు. ఓల్గా రచించిన ‘చలం-నేను’ అనే పుస్తకాన్ని ప్రొ.వింధ్య, ప్రముఖ కవి దేవిప్రియ శ్రీపతి ఆవిష్కరించారు. ‘చరిత్ర స్వరాలు-వాళ్ళు ఆరుగురు’ రూపకాల్లోని పాత్రలు వేయడం గురించిన అనుభవాన్ని వింధ్య పంచుకున్నారు.
ఈ సందర్భంగా ఓల్గా మాట్లాడుతూ చలం లాలస పాత్ర ‘వాళ్ళు ఆరుగురు’లో ఉందని, ఈ పాత్రను వేసిన ప్రముఖ పిల్లల డాక్టర్ హేమ పరిమి ఇటీవల మరణించారని తెలిపి దుఃఖం వ్యక్తం చేశారు.
‘యశోబుద్ధ’ పుస్తకాన్ని ఇంగ్లీష్‌లో అనువదించిన రచయిత పి.ప్రసాద్ తన అనుభవాలను పంచుకున్నారు. అనంతరం ఓల్గా కథ, సంభాషణలు అందించిన సినిమాలలోని క్లిప్పింగులను ప్రదర్శించారు.
చివరిగా =దీహ== కాలేజీ నుండి ముత్యంరెడ్డి గారు ఓల్గా, కుటుంబరావు గార్లతో తన స్నేహం గురించి మాట్లాడారు. కుటుంబరావు గారి వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.