మారుతున్న లైంగికత – కొత్త హక్కుల చర్చ -ఎ. సునీత

 

(కిందటి సంచిక తరువాయి)

నయా ఉదారవాదం తెచ్చిన వ్యవస్థీకృత మార్పుల్లో…

మొదటిది: ప్రైవేటీకరణ వల్ల జరిగిన ప్రజల విస్థాపన: ఆ విస్థాపన, విధ్వంసం మధ్యలో రూపుదిద్దుకుంటున్న వ్యక్తిగతం, వ్యక్తులు

1990 తర్వాత వేగవంతమయిన ప్రైవేటీకరణ, ఉదారవాద విధానాలు, ప్రైవేటు కార్పొరేట్‌ సంస్థల ద్వారా భారత రాజ్యం చేపట్టిన ఆర్థిక విధానాల వల్ల ‘స్వేచ్ఛా శ్రామికులు’ పెద్ద సంఖ్యలో ఉత్పన్నమయ్యారు. మార్క్స్‌ చెప్పిన అర్థంలో లక్షల మంది బలవంతంగా, హింసాత్మకంగా తమ తమ గ్రామాలు, తండాలు, అడవుల నుండి విస్థాపన చెందారు. పట్టణ ప్రాంతాలకు, దూర ప్రదేశాలకు ఏ రక్షణ లేని పని వెతుక్కుంటూ వలస పోతున్నారు. భారత రాజ్యం తాను తక్కువలో తక్కువగా ఇచ్చిన ‘సాంఘిక సంక్షేమం’ కూడా వెనక్కి తీసుకోవటంతో ఏ రకమైన సామాజిక, ఆర్థిక పౌరసత్వం లేని భారతీయ పౌరులు అనేకమంది తయారయ్యారని నీర్జా గోపాల్‌ జయాల్‌ వంటి రాజనీతి శాస్త్రవేత్త ఎత్తి చూపారు. అంతేకాక, వీరు వలస వచ్చినవారి పట్ల ఏ మాత్రం దయ లేని నగర వాతావరణంలో ఉంటున్నారని కూడా అంటారు. భారతదేశంలో ఇలా వలస వెళ్తున్న ప్రజలు ప్రస్తుతం 7 కోట్ల నుండి 10 కోట్ల వరకు ఉంటారని పరిశోధకులు అంచనా వేశారు. పని కోసం వలస వెళ్తున్న ఇటువంటి శ్రామికుల్లో 80% మంది మగవాళ్ళే. అయితే ఏ రక్షణ, హక్కులు లేని ఈ ‘వలస పౌరులు’ కుటుంబం, గ్రామం, కులం కట్టుబాట్ల నుండి కూడా విడదీయబడ్డారని మనం గుర్తించాలి. వాళ్ళే రోజూ మనకి కనిపించే హోటల్‌ వర్కర్లు, ఆటో డ్రైవర్లు, క్యాబ్‌ డ్రైవర్లు, హాస్పిటల్‌ వర్కర్లు, పారిశుధ్య కార్మికులు, సెక్స్‌ వర్కర్లు, స్వాతంత్య్రానంతర చరిత్రలో ఇంతమంది తమ స్వంత ప్రాంతాల నుండి విడదీయబడి బలవంతంగా తమ బ్రతుకు తాము బ్రతకాల్సిన సందర్భం ఇప్పుడే ఏర్పడిందని సామాజిక శాస్త్రవేత్త చిన్మయి తుంబే అంటారు. అయితే, ఇవే ఉదారవాద విధానాల విధ్వంసం నేపథ్యంలోనే వీరికి తమ జీవితాల్ని తాము నిర్మించుకునే ‘స్వేచ్ఛ’ కూడా వారికి ఇవ్వబడింది లేదా లభించిందని బహుశా మనం గుర్తించాల్సిన సమయం వచ్చింది.

రెండవది : పెరుగుతున్న ఉన్నత విద్య నేపథ్యంలో జెండర్‌ సంబంధాలు, లైంగికతల మార్పు

1990 తరువాత, జనాభాలోని ఇంకొక పొర ఇష్టంతో వలస వెళ్ళటం ప్రారంభించింది. వాళ్ళు విద్యార్థులు. వేరే ప్రాంతాలకి, పట్టణాలకు, నగరాలకు వెళ్ళి ప్రభుత్వ విద్యాలయాల్లో లేక ప్రైవేటు విద్యాలయాల్లో చదువుకునే విద్యార్థుల సంఖ్య చాలా, చాలా పెరిగింది. ముఖ్యంగా ఉన్నత విద్య, అంటే ఇంటర్మీడియట్‌ నుండి పై స్థాయి వరకూ చాలా పెరిగింది. ప్రభుత్వం కంటే ప్రైవేటు సెక్టర్‌లోనే ఉన్నత విద్య విపరీతంగా పెరిగిందని అధ్యయనాలు చెప్తున్నాయి. మొత్తానికి ఇటువంటి విద్యార్థుల సంఖ్య ఒక కోటి వరకు ఉంటుందని ఒక అంచనా. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆడపిల్లలు స్కూలుకెళ్ళటం కూడా గత దశాబ్దకాలంగా దేశవ్యాప్తంగా పెరిగింది. ఇది అన్ని స్థాయిల్లో కూడా పెరిగింది, అన్ని సామాజిక వర్గాల్లో కూడా పెరిగింది. ఉన్నత విద్యలో (అంటే, ఇంటర్మీడియట్‌ తర్వాత) అమ్మాయిల సంఖ్య అబ్బాయిల సంఖ్యతో, అన్ని వర్గాల్లో, దాదాపు సరిసమానంగా ఉంది. అంతేకాదు, ఎంతగా పెరిగిందంటే ఆర్థిక వేత్తలు దీన్ని 2004 తర్వాత మార్కెట్‌లో స్త్రీ శ్రామికులు పనిలో పాల్గొనే రేట్‌ తగ్గటానికి ఒక కారణంగా గుర్తించేటంత పెరిగింది.

మనం ఇప్పటి విద్యా విధానాన్ని ఎంత విమర్శించినప్పటికీ, ఒక విషయం గుర్తించక తప్పదు. అణువణువునా కుల అహంకారం, స్త్రీ ద్వేషంతో కూడిన ఈ సమాజంలో ఉన్నత స్థాయి విద్యాలయాల్లో, ముఖ్యంగా పబ్లిక్‌ (అంటే, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే) విశ్వవిద్యాలయాల్లో అన్ని రకాల సామాజిక వర్గాల నుండి వచ్చిన విద్యార్థులు, విద్యార్థినులు సమానులుగా కలుస్తున్నారు అని. మన సమాజంలో ఇది ఊహించని విప్లవాత్మక మార్పు. దీనితో సమానత్వం వచ్చేసిందని చెప్పలేము, కానీ అనుక్షణం కుటుంబం, గ్రామం, సమూహం కనుసన్నల్లో, కట్టుబాట్లలో మెలగనవసరం లేని ఒక ప్రదేశం / స్పేస్‌ ఈ విద్యాలయాల వల్ల ఏర్పడిందని గుర్తిద్దాం. కులం, స్త్రీ ద్వేషం ఒక్క రోజులో పోయేవి కాదు. కానీ, మొదటి తరం దళిత విద్యార్థులు, ఆదివాసీ విద్యార్థినులు, సవర్ణ విద్యార్థులు ఒకరినొకరు చూసి, కలిసి ఒక తరగతి గదిలో కూర్చోవాల్సి రావటం తప్పనిసరిగా ఒకరి గురించి మరొకరు తెలుసుకోవటానికి, బయటి సమాజం కల్పించని అవకాశాల్ని కల్పిస్తోంది. కొంతమేరకైనా వీరి మధ్య ఇంటరాక్షన్‌ ఒకరి గురించి ఒకరికున్న మూసపోసిన ఆలోచనల్ని మార్చటానికి ఉపయోగపడుతోంది. మన పబ్లిక్‌ విశ్వవిద్యాలయాల్లో కుల అహంకారానికి, జెండర్‌ అసమానత్వానికి వ్యతిరేకమైన నిరసనలు ఎక్కువ కావటం బహుశా కాకతాళీయం కాదు. రోహిత్‌ వేముల నిరసన కావచ్చు, బెనారస్‌ హిందూ యూనివర్శిటీ అమ్మాయిలు కావచ్చు, ఢిల్లీ కాలేజీల్లో పింజ్రా తోడ్‌ కావచ్చు, కేరళ, తమిళనాడుల్లో కాలేజీ అమ్మాయిల కిస్‌ ఆఫ్‌ లవ్‌ నిరసనలు కావచ్చు… ఇవన్నీ జరుగుతున్న విప్లవాత్మక మార్పుకి నిదర్శనాలు.

ఇటువంటి రాజకీయార్థిక, సామాజిక పరిణామాలే బహుశా మన దేశ చరిత్రలో మొదటిసారిగా పెద్ద స్థాయిలో వైయక్తికం, వ్యక్తులు, వ్యక్తిగతాలు ఏర్పడడానికి భూమిక ఏర్పరుస్తున్నాయి. ఉదారవాద వైయక్తికం, వ్యక్తులు, వ్యక్తిగతాలు ఐరోపా చరిత్రలో కూడా గ్రామాలని, సమూహ జీవనాన్ని విధ్వంసం చేసి మనుషులని వారి వారి సమూహాల నుండి, గ్రామాల నుండి బలవంతంగా విడగొట్టి, తమ కాళ్ళమీద తమని నిలబడేలా చేసిన పెట్టుబడి వల్లేనని, రాజనీతి శాస్త్రవేత్త ఆదిత్య నిగమ్‌ ఎత్తి చూపారు. ఆ రకంగా తమ సముదాయాల నుండి విడగొట్టబడిన మనుషులని వ్యక్తులుగా తయారుచేసేది ఎవరు? ప్రధానంగా పెట్టుబడి సృష్టించిన మార్కెట్‌. ఎట్లా? వారిని వినియోగదారులుగా రూపుదిద్ది, మార్చి, జెండర్‌ పరంగా, కుల పరంగా, వర్గ పరంగా వారిని రకరకాల వినియోగదారులుగా తయారుచేస్తుంది. ప్రపంచాన్ని, వస్తువుల్ని వినియోగించటంలో ఎంపికనిచ్చి ఆ ఎంపికను బట్టి ఏ రకమైన వ్యక్తివో నిన్ను నువ్వు నిర్వచించుకునే మార్గాన్ని ఏర్పరుస్తుంది. భారతదేశంలో గత రెండున్నర దశాబ్దాలలో మార్కెట్‌ తీసుకొచ్చిన/కూడిన ఎంపికలు ఎన్నో. మాల్స్‌ నుండి ఫేస్‌బుక్‌ వరకు దీనికి దారులు వేసేవే. ఇదేదో చెడ్డ, జరక్కూడని, విపరీత పరిణామమని నేను అనుకోవట్లేదు. దీన్ని ఒక తప్పనిసరి చారిత్రక పరిణామంగా అర్థం చేసుకోవటం అవసరం.

కొత్తగా స్వేచ్ఛా జీవులవుతున్న వారిని సంభాళించడానికి 1990ల తర్వాత వ్యక్తివాదం ఒక ప్రధాన స్రవంతి భావజాలంగా ముందుకొచ్చింది. దాని ఆరాధన పెరిగింది. వార్తా పత్రికల్లో, మార్కెట్‌లో ‘సెల్ఫ్‌ హెల్ప్‌’ పుస్తకాలు వెల్లువగా వచ్చాయి. అత్యవసరమయిన ఇంగ్లీష్‌తో పాటు లైఫ్‌ స్కిల్స్‌ కూడా నేర్పే సంస్థలొచ్చాయి. వ్యక్తివాదం ప్రధానంగా చెప్పేదేమిటంటే, ”ఇది పోటీ ప్రపంచం, ప్రపంచంలో సఫలీకృతుడివి కావటానికి నువ్వు మాత్రమే కారకుడివి/కారకురాలివి. పోటీ ప్రపంచంలో నువ్వు ముందుకెళ్ళాలంటే నీ మీదే నువ్వు ఆధారపడాలి తప్ప వ్యవస్థ మీద కాదు, రాజ్యం మీద కాదు, స్వావలంబన నేర్చుకో, అంతేకానీ వ్యవస్థని నిందించకు. వ్యవస్థ నిన్ను భరిస్తోంది. నీ సాఫల్యం దానికనుగుణంగా నిన్ను నువ్వు మార్చుకోవటంలోనే ఉంది”. 1990ల తరువాతి తరం ఈ భావజాలంలోకే ప్రవేశించారు. ఇక్కడ వ్యవస్థ వైఫల్యాలు ఉండవు, వ్యక్తిగత వైఫల్యాలే ఉంటాయి తప్ప. ఎకనామిక్‌ టైమ్స్‌ / బిజినెస్‌ లైన్‌ అంచనా ప్రకారం గత పదేళ్ళలో 75,000 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారంటే, ఈ భావజాల సఫలతని అంచనా వెయ్యొచ్చు.

మూడవది: 2000లలో పెరుగుతూ వచ్చిన ప్రభుత్వ స్త్రీ వాదం, ప్రజామోద స్త్రీ వాదాలు

భారత రాజ్యం 1990ల తర్వాత ‘స్త్రీల సాధికారత’ సిద్ధాంతాన్ని తన సాధికారత కోసం వినియోగించుకోవటం మొదలయింది. ఇది కొంతమేరకు స్త్రీల ఉద్యమ ఫలితమే కావచ్చు. అప్పుడొక విధానం, తరువాత మరొక విధానాన్ని ప్రవేశపెడుతూ పోతోంది. ఒకసారి హింసను ఆపుతాను అంటుంది, మరొకసారి గ్యాస్‌ సిలెండర్లు ఇస్తాను అంటుంది. ఇంకోసారి పొదుపు పథకం అంటుంది, లేదా కళ్యాణ లక్ష్మి అంటుంది. మరొకసారి కూతుళ్ళని చదివిద్దాం, కూతుళ్ళని పెంచుదాం అంటుంది. పెద్ద ఉద్యమం వస్తే, స్త్రీలపై హింస గురించిన చట్టాల్ని మరింత కఠినతరం చేస్తుంది. మరొకసారి ముస్లిం స్త్రీలను ఉద్దరిస్తానంటుంది. మరోసారి జెండర్‌ సెన్సిటైజేషన్‌ కోర్సులని తప్పనిసరి చేస్తుంది. మాలాంటి వాళ్ళతో పాఠ్య పుస్తకాలు కూడా రాయిస్తుంది. చేసేది కొంచెమైనా ప్రజారంగంలో మాత్రం స్త్రీల సాధికారతని చర్చలో ఉంచుతుంది.

దీంతోపాటు ఒక రకమైన ప్రజామోద (పాపులర్‌) స్త్రీ వాదం కూడా ఈ మధ్య పెరిగింది. వాషింగ్‌ మెషీన్‌ ప్రకటనల్లో కావచ్చు, వోగ్‌ పత్రికల వంటి అంతర్జాతీయ పత్రికల్లో తెచ్చిన ‘ఛాయస్‌ ఫెమినిజం’ (నాకిష్టమైనది నేను చేస్తాను అన్న స్త్రీ వాదం) కావచ్చు ఇలా స్త్రీలకి తమ స్వతంత్రం, స్వేచ్ఛ ఉండాలని గత కొన్నేళ్ళుగా వస్తున్న ఈ ప్రజామోద స్త్రీ వాదం చెబుతుంది. మగవాళ్ళు దీన్ని ఆమోదించాలని కూడా చెప్తుంది. ఏది ఆమోదకరమైన స్త్రీల స్వతంత్రం అన్నది అంతర్జాలంలో ఇప్పుడు ఒక పెద్ద చర్చా విషయం.

ఇక్కడ గుర్తించాల్సింది ఏమిటంటే, మా తరం స్త్రీలు పెరిగి పెద్దవుతున్న రోజుల్లో లేని స్త్రీవాదం గాలి ఇప్పుడు వీస్తోంది. అప్పుడు స్త్రీ వాదం అంటే ఒక రాడికల్‌ నినాదం, భావజాలం, సమాజాన్ని కూలగొట్టే సిద్ధాంతం. ఇప్పుడు దాన్ని కొంతమేరకు రాజ్యం, మార్కెట్‌ తమ అవసరాలకనుగుణంగా మలుచుకున్నాయి. గర్ల్‌ పవర్‌, ఫెమినిజం స్లోగన్లు రాసి ఉన్న టీ షర్టులు చాలా చోట్ల దొరుకుతున్నాయి. బహుశా అమెరికన్‌ తత్వవేత్త నాన్సీ ఫ్రేజర్‌ చెప్పిన నయా ఉదారవాద ప్రగతి శీలతలో ఇది కూడా భాగమేమో. ఏదయితేనేం, రాజ్యం, మార్కెట్‌ రెండూ కూడా, స్త్రీలకి సమాజంలో ‘సహజ సిద్ధమయిన పాత్ర’ ఉంటుందని ఒక పక్క చెప్తూనే, మరో పక్క స్త్రీలని ‘తమకి కావాల్సింది ఎంచుకోగలిగే వ్యక్తులుగా’ కూడా రూపొందించడానికి ప్రయత్నిస్తున్నాయి. ‘చక్కగా అమ్మాయిలా ఉండు’ అని చెప్తూనే ‘ఎప్పుడూ అమ్మాయిలా ఎందుకు ప్రవర్తిస్తావు?’ అని కూడా అడుగుతున్నాయి. ఈ స్త్రీల సాధికారత వాదన పురుషులని కూడా కొంత మారమని చెప్తుంది, కానీ దాని దృష్టి కేంద్రీకరించేది మాత్రం స్త్రీల మీదే, పురుషులపై కాదు.

నాల్గవది: వ్యక్తిగత సంతోషానికి, ఆనందానికి ప్రాధాన్యమివ్వమంటున్న సోషల్‌ మీడియా, అంతర్జాలం తెచ్చిన సమాచార విప్లవం

టెలివిజన్‌ ద్వారా నడిచే సాంస్కృతిక పరిశ్రమ చాలావరకు పాత నైతిక భావజాలంతో పనిచేస్తోంది. కానీ, అంతర్జాలం, సోషల్‌ మీడియా యువకులు, యువతులకు తమ శరీరాలను, తమ జీవితాలను ఎలా మలచుకోవాలో, నియంత్రించుకోవాలో చెప్తూ దానికి కావల్సిన వివరాలు, పద్ధతులు, దృక్పథం సరఫరా చేస్తోంది. టెలివిజన్‌ సీరియళ్ళలో మూసపోసిన మంచి స్త్రీలు, చెడ్డ స్త్రీలు ఉంటారు. న్యూస్‌ మీడియాలో స్త్రీలు సెలబ్రిటీస్‌గా ఉంటారు – సినీ తారలు, బ్యాంకర్లు, పారిశ్రామికవేత్తలు, అటువంటి అరుదయిన స్త్రీలు. కానీ అంతర్జాలం, సామాజిక మాధ్యమాల్లో అన్ని రకాల వాళ్ళు ఉంటారు. లైంగిక చర్యల గురించి అన్ని రకాల సమాచారమే కాక, పోర్నోగ్రఫీ కూడా ఇంటర్నెట్‌ కనెక్టివిటీ పెరగటం వల్ల బాగా అందుబాటులోకి వచ్చింది. దీనివల్ల ఒక పక్క శరీరం అంటేనే – పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, లైంగిక పరికరంగా భావించే భావజాలం పెరిగింది. అందానికి విపరీతమైన ప్రాముఖ్యత పెరిగింది. ఇదివరకటితో పోలిస్తే తమ వ్యక్తిగత సంతోషానికి, ఆనందానికి అన్నింటికన్నా ఎక్కువ ప్రాముఖ్యత నివ్వటం సరయినదే అన్న భావన కూడా ఊపందుకుంది.

వ్యక్తిగత భావజాలాన్ని పెంపొందించే అంశాలు ఈ నాలుగే కావు. కానీ మన చర్చకి ఇవి చాలు. ఒక పక్క ఉదారవాద విధానాలు మనుషుల్ని తమకి అలవాటయిన స్థానాల నుండి ఊడబీకి కొత్త ప్రాంతాల్లో జీవితాల్ని ఏర్పరచుకోమని చెప్తున్నాయి. సామాజిక అంతరాలకి భిన్నంగా స్త్రీ పురుషులు పరిచయాల్ని చేసుకునేందుకు ప్రేరేపిస్తున్నాయి, అవకాశాలు కల్పిస్తున్నాయి. కానీ ఇవి చేసుకోవటానికి అవసరమైన మానసిక, శారీరక, ఆర్థిక వనరులు చాలామందికి లేవు. ఆసక్తి, ఉత్సాహం ఉన్నప్పటికీ ఆయా సంబంధాలకి, స్నేహాలకీ రెడీమేడ్‌ నమూనాలు లేవు. సమాచారం ఉంది కానీ, భావోద్వేగాలని సంభాళించే జ్ఞానం లేదు. మన ముందున్న ప్రపంచం అందుకే వైవిధ్య భరితంగా మారిపోయింది. భారతదేశంలో జరుగుతున్న లైంగిక విప్లవం ఈ వైరుధ్యాలలోనే చిక్కుకుపోయింది. అన్ని విప్లవాల్లాగే ఇది కూడా హింసాభరితమయింది. పిల్లల్ని లైంగిక వాంఛలకు వాడుకోవటం, కులాంతర వివాహాల్లో దళిత పురుషుల్ని చంపెయ్యటం, ఖాప్‌ పంచాయతీలు, సామూహిక అత్యచారాలు, స్త్రీలపై పెరిగే లైంగిక దోపిడీ, వ్యక్తి స్వాతంత్య్రం కులం, జెండర్‌, వర్గ వైరుధ్యాల మధ్యలో వస్తే జరిగే పరిణామాలే. కానీ, ఇదే వ్యక్తిగత స్వేచ్ఛ భావజాలం ఏ

ఉద్యమ మద్దతు లేని స్త్రీలు (పురుషులు కూడా అనుకోండి) తమ కోసం, తమ స్వతంత్రం కోసం, తమ సంతోషం కోసం, గౌరవం కోసం నిలబడే అవకాశాలు కూడా కల్పిస్తోంది. అవి తమకు నచ్చిన భాగస్వామిని వెతుక్కోవటం కావచ్చు, పని స్థలాల్లో లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా నిరసనలు కావచ్చు, మగ స్నేహితులతో కలిసి చెట్టాపట్టాలు వేసుకుని తిరిగే స్వతంత్రం కావచ్చు, రోడ్డపైన, పార్కుల్లోనూ పని లేకుండా ఊరికే తిరిగే స్వేచ్ఛ కావచ్చు. ముఖ్యంగా లైంగిక సంబంధాల్లో అంగీకారం ఉండాలని డిమాండ్‌ చెయ్యటం కావచ్చు.

స్త్రీల ఉద్యమం, దళిత ఉద్యమాలు, మిగిలిన హక్కుల ఉద్యమాలు లైంగిక హక్కుల కోసం పనిచేయలేదా అని అడగొచ్చు. ఎందుకు చెయ్యలేదు, తప్పకుండా చేశాయి. మనం హింస జరిగినప్పుడు, కుటుంబం, పోలీసులు, ఆధిపత్య శక్తులు హక్కుల ఉల్లంఘనలకి పాల్పడినప్పుడు పోరాడాము. న్యాయం కోసం ఉద్యమిస్తాం. రక్షణ కావాలని అడుగుతాం. దుర్మార్గమైన రోమియో స్క్వాడ్లు, లవ్‌ జిహాద్‌ ప్రోగ్రాములు జరిగినప్పుడు వారికి అండగా నిలబడుతున్నాం. కులాంతర వివాహం చేసుకున్న జంటలకి మద్దతిస్తున్నాం. కాలేజీ అమ్మాయిలు కర్ఫ్యూ వద్దంటే మద్దతిస్తాం. చిన్న పిల్లలపై హింసని ఖండించాం. చట్టాల్లో మార్పులకి పోరాడాం. కానీ ఇవన్నీ సంఘటనల తర్వాత మన స్పందనలే. కానీ, ఇదివరకులా కాకుండా యువతీ యువకులు, సంస్థల మద్దతు కోసం చూడకుండా, తమంతట తామే, తమనిలా వేధించారని ఫేస్‌ బుక్‌లో పెట్టి మద్దతు ఎలా కూడగట్టుకుంటున్నారు? పిల్లలపై లైంగిక అత్యాచారాలు జరిగితే తల్లిదండ్రులు దాచి పెట్టుకోకుండా ఆస్పత్రులకి, పోలీస్‌ స్టేషన్లకు ఎలా వెళ్ళగలుగుతున్నారు? శ్రీ రెడ్డివంటి స్త్రీలు పదేళ్ళ క్రితం మాట్లాడి ఉంటే సోదిలోకి లేకుండా తరిమికొట్టేవాళ్ళు కాదా? ఇలా మాట్లాడే స్త్రీలలో చాలామందికి కులపరమైన, వర్గపరమైన ఆధిక్యత ఉందనేది వాస్తవం. కానీ గుర్తించాల్సింది, ఇటువంటి స్త్రీలు కూడా కొన్నాళ్ళ క్రితం ఈ విషయం మాట్లాడలేకపోయారని, మాట్లాడినా లైంగిక స్వతంత్రత విషయాల్లో ఇంత ధిక్కార స్వరం ఉపయోగించలేకపోయారని.

మన దేశంలో లైంగిక హక్కుల కోసం బహిరంగంగా పోరాడింది ప్రధానంగా లైంగిక అల్పసంఖ్యాకులైన గే, లెస్బియన్‌ ఉద్యమాలు, ట్రాన్స్‌జెండర్‌ ఉద్యమాలే. తమ ఉనికి, అస్తిత్వం, తమపైన ఉండే నేర ముద్ర తొలగిపోవాలని, తమకి జీవితాన్ని ఆనందించే స్వేచ్ఛ కావాలని ఇరవై సంవత్సరాలు వాళ్ళు చేసిన పోరాటాలు అధికార జెండర్‌, లైంగికత నమూనాల మూలాల్ని కదిలించాయి. వారి పోరాటాలు దేశంలో జరుగుతున్న ఇతర మార్పులతో కలిసి లైంగికత పట్ల యువత వైఖరిని మార్చడంలో తోడ్పడుతున్నాయి. లైంగికానందం ప్రతి ఒక్కరికీ అవసరమేనని, అది అంగీకారంతో జరగాలనే స్పృహని కొంతలో కొంత పెంచుతున్నాయి. ఈ మార్పుల వల్ల వచ్చిన స్పేస్‌ శ్రీరెడ్డికి మద్దతునిచ్చింది. అమృతవర్షిణికి మద్దతు కూడగట్టింది. ఇదివరకటిలా వివాహానికి ముందు సెక్స్‌ని పెద్ద అపరాధంగా చూడడం కొంత తగ్గింది. స్టాండ్‌అప్‌ కమెడియన్‌లు స్వయంతృప్తి గురించి, పోర్నోగ్రఫీ గురించి, మన సమాజం శిలా సదృశంగా భావించే భారతీయ పురుషత్వం గురించి, స్త్రీత్వం గురించే కాక, మార్కెట్‌ పెంపొందించే కొత్త స్త్రీత్వ నమూనాల గురించి కూడా జోకులు వేస్తున్నారు.

హక్కుల కార్యకర్తలుగా మనం చేయగలిగింది, జరుగుతున్న మార్పుని గుర్తించి, ఆహ్వానించటం. ఆ హక్కు నయా ఉదారవాద నేపథ్యంలో వచ్చింది కాబట్టి పక్కన పడేయలేం. ఆహ్వానించినంత మాత్రాన విమర్శించకూడదనీ లేదు. అందాల పరిశ్రమ, ఎక్కువయిన శరీర స్పృహ యువతులని, యువకులని కొత్త కట్టుబాట్లలోకి నెడుతోంది. పోర్నోగ్రఫీ భర్తలకు భార్యలను వేధించడానికి కొత్త ఆయుధంగా పరిణమించింది. ఆన్‌లైన్‌ ట్రోలింగ్‌ సామాజిక పితృస్వామ్యానికి కొత్త రూపాన్నిచ్చింది. అంతేకాదు, చిన్న ఇల్లు, పేదరికం, కుల పెత్తనం బలంగా కొనసాగే మన సమాజంలో, స్వంతానందానికి ప్రాధాన్యమివ్వడం ఎన్ని వైరుధ్యాలకి, హింసకి దారి తీస్తుందో సామాజిక స్పృహ ఉన్న ఎవరికైనా సులభంగా అర్థమవుతుంది.

లైంగిక హింస, వేధింపుల గురించి మరింత సంక్లిష్ట ప్రశ్నలు వేసుకోవాల్సిన అవసరం కూడా ఈ వైరుధ్యాలే కల్పిస్తున్నాయి. వాటిలో మొదటిది, ఇన్ని రకాల సంక్లిష్ట సామాజిక, రాజకీయ, ఆర్థిక మార్పుల నేపథ్యంలో లైంగికత, లైంగిక స్వేచ్ఛ, లైంగిక వేధింపులు, లైంగిక హింసల పట్ల సమాజంలో ఇప్పటికీ బలంగా ఉన్న భిన్న అవగాహనలని మార్చటం ఎలా అన్నది. ఈ భిన్న అవగాహనలు చాలావరకు సమస్య పూరితమైనవి. చట్టాలు కొత్తగా రూపొందుతున్న లైంగిక హక్కుల అవగాహనని పరిగణిస్తున్నాయి. వాటికనుగుణంగా కొంత మారుతున్నాయి. కానీ, సమాజంలో ఇప్పటికే ఉన్న భిన్న అవగాహనలతో పని చేయటం, వాటిని మార్చటం ఎలా అన్న ప్రశ్నకి సమాధానం ఇవ్వలేవు. మరి మనం

అపోహలు, అభిప్రాయ భేదాలు, తీవ్ర విభేదాలు మారకుండా నేరాలు జరిగినప్పుడు మాత్రమే కలుగచేసుకుని హింసకి తగిన శిక్షలు వేసే చట్ట వ్యవస్థ కోసం పోరాడితే సరిపోతుందా?

పై ప్రశ్నకి సమాధానం కాదు అనుకుంటే, ఆయా వ్యక్తులు స్వేచ్ఛ, సమానత్వం గురించి చేస్తున్న వ్యక్తిగత పోరాటాలని అర్థం చేసుకోవటానికి, బలోపేతం చేయటానికి అవసరమయిన సామాజిక సంస్కృతిని ఎలా రూపొందించాలి అన్న ప్రశ్నకి దారితీస్తుంది. చట్టాలు కొన్ని వనరులు కల్పిస్తాయి గానీ, వాటిని వాడుకోవడానికి బాధితుల వద్ద అవసరమయిన వనరులు ఉండవని, న్యాయస్థానాలని చేరుకోవటానికి కావాల్సిన మార్గాలు మన సమాజంలో ఇంకా రూపొందలేదన్న విషయం మనందరికీ తెలిసిందే. ఆయా రాజకీయ మార్పుల కోసం పోరాడుతున్న సంఘాలుగా మనం ఈ సంక్లిష్ట మార్పులను గురించి అర్థం చేయించడానికి అవసరమయిన సాంస్కృతిక, సామాజిక వనరులు ఏ విధంగా సమకూర్చుకోగలం?

లైంగిక హింస, వేధింపులు, వ్యక్తిగత స్వేచ్ఛా భావజాలంతో పాటు అంతే తీవ్రంగా ఆధునిక రంగాల్లో – విద్యా రంగంలో, మీడియా రంగంలో, సినిమా రంగంలో ఇంకా అనేక రంగాల్లో నైతికత పేరుతో అమలవుతున్న, పెరుగుతున్న సామాజిక పెత్తందారీ తనాన్ని, పితృస్వామ్యాన్ని గురించి అటువంటి అవగాహన ఏర్పరచుకోవడం, సమాజంలో పెంచటం ఎలా? ఇది సమాజంలో ఆమోదింపబడిన నైతికతతో విభేదిస్తుంది. కాబట్టి దీని గురించి చర్చించటం కూడా కష్టమే. ఇప్పటకీ లైంగిక హింసకీ, వేధింపులకీ పరిష్కారం నేరస్థులకు తీవ్ర శిక్షలు వెయ్యటంగానే సమాజం, బాధితులు చూస్తున్నారు. ఆయా స్త్రీలని, బాధితులని సంబాళించి, స్థిరపరచి, సమాజంలో అవమానానికి గురవ్వకుండా చేయాల్సిన ప్రయత్నాలు ప్రారంభం కూడా కాలేదు. ఇతర లింగాల వ్యక్తులకీ, స్త్రీలకీ, పురుషులకీ చట్టంలో, చట్టం బయటా అవసరమయిన సహాయ సహకారాలు ఏమిటన్న అవగాహన కూడా మనకి ఉందా?

కుల, లింగపరమయిన తీవ్ర అసమానతలు ఉన్నప్పటికీ కుటుంబ వ్యవస్థ మాత్రమే కొత్త దంపతులకి ఇప్పటికీ ప్రధాన సహకార వ్యవస్థ. కులాంతర వివాహాలు చేసుకున్న యువతీ యువకులకి, కుటుంబాల నుండి ఎదురవుతున్న హింస నుండి రక్షణ మాత్రమే కాక, అనేక ఇతర సహాయ సహకారాలు కూడా అవసరమవుతాయి. కొంత వెసులుబాటు ఉన్నప్పటికీ కులాంతర, మతాంతర వివాహాలు చేసుకోవడం చట్టపరంగా ఇప్పటికీ కష్టమే. రిజిస్ట్రార్‌ ఆఫీసు నుండి మేజిస్ట్రేట్‌ కోర్టు క్లర్కుల వరకు తల్లిదండ్రులకి, బంధుగణానికి

ఉప్పందించడానికి సిద్ధంగా ఉంటారు. వయోజనులుగా యువతీ యువకుల్ని గుర్తించడానికి చట్ట వ్యవస్థని సిద్ధపరచటం అత్యంత అవసరం. దాంతోపాటు కులం, మతం, జెండర్‌ సంప్రదాయాలని ధిక్కరించడానికి సమాజాన్ని సాంస్కృతిక పరంగా సిద్ధం చేయడం అవసరం. దానికి ముందుగా వివిధ సంఘాల మధ్య చర్చ, సహకారం చాలా అవసరం. దళిత సంఘాలు, హక్కుల సంఘాలు, స్త్రీల సంఘాలు, విద్యార్థి సంఘాలు మొదలైనవి ఆయా సంసిద్ధత, సహకారం, సామర్ధ్యం, పెంపొందించుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయా?

ఇవి తేలిగ్గా సమాధానం దొరికే ప్రశ్నలు కావు. ప్రస్తుత హింసాపూరిత, నయా ఉదారవాద సందర్భంలో లైంగిక హింస, వేధింపులు పెరగబోతున్నాయి తప్ప తగ్గేవి కావన్నది హక్కుల కార్యకర్తలనందరినీ కలవర పెట్టే విషయం. కానీ ఇదే చారిత్రక సందర్భం లైంగికత గురించి కొన్ని విషయాలను వ్యక్తిగతాన్ని ముందుకు తెచ్చి లైంగిక హక్కుల స్పృహకి దారి తీస్తోందనడంలో ఏ సందేహం లేదు. స్త్రీ పురుష సంబంధాల్లో లైంగిక ఆనందం పురుషులతో పాటు స్త్రీలకి అంతే అవసరం అని ముందుకు తెచ్చింది. అంతేకాదు, లైంగిక ఆనందం పర లైంగిక సంబంధీకులకి మాత్రమే కాక సమ లైంగికులకి కూడా ఒక జీవన హక్కుగా ముందుకు వచ్చింది. రెండవది, భాగస్వామి అంగీకారం/అనుమతి/సమ్మతి లేకుంటే అది శృంగారం లేదా సెక్స్‌ కాదని, దాన్ని అక్కర్లేని స్పర్శ, వేధింపులు లేదా దాడి అనాలనే స్పృహ కల్పించింది. భాగస్వామి అంగీకారం శృంగారంలో ఇంత ప్రధాన అంశంగా ఇంతకు ముందు చర్చలోకి రాలేదు. స్త్రీలు, పురుషులు, ఇతర జెండర్ల వ్యక్తులు తమకి కావలసిన భాగస్వాముల్ని, ఒకే జెండర్‌లోనో, ఇతర జెండర్లలోనో, లేదా పర కులాలలోనో, మతాలలోనో వెతుక్కునే స్వాతంత్య్రం ఉండాలన్న స్పృహ ఆయా యువతీ యువకులపై పెరుగుతున్న హింస మధ్యలోనే రూపుదిద్దుకుంటోంది. వీటితోపాటు, అన్ని విషయాల్లాగే, లైంగిక జ్ఞానం విద్యాలయాల్లో ఇప్పటికైనా ఇవ్వాలని ప్రచారం చేయడం అవసరం అన్న ఆలోచన, స్త్రీలు, పురుషులు వివాహానికి ముందు సెక్స్‌లో పాల్గొనడం తప్పు కాదని, కానీ అది బాధ్యతతో చేయాలని, భార్య అయినా, భార్య కాకపోయినా ఆమె అంగీకారం ప్రతిసారీ అవసరమేనన్న ఆలోచనలు – ఇవన్నీ హక్కుల స్పృహని పెంచేవే. ఆయా వ్యక్తులకి తమ శరీరంపై, జీవితంపై, ఆనందంపై అధికారాన్నిచ్చేవే. దాంపత్య శృంగారంలో భార్య అనుమతి అవసరం అని అందరూ భావించే రోజు కూడా త్వరలో రావాలని ఆశిస్తూ ఇంక ముగిస్తాను. (అయిపోయింది.)

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.