పెట్టుబడికి కొన్ని ప్రత్యేకమయిన లక్షణాలున్నాయి. దానికి దర్శనీయత (ఙఱరఱపఱశ్రీఱ్‌వ) చాలా ఎక్కువ. అది ఎక్కడున్నా కొట్టొచ్చినట్టు కనబడుతుంది. దాని మనుగడకు హేతుబద్ధమయిన అకౌంటింగ్ అవసరం కాబట్టి అది తన ఉనికిని తాను గణాంకాల యుక్తంగా ప్రకటించుకుంటుంది. అందువల్ల పెట్టుబడి గురించి విషయ సేకరణ సులభం. అవసరమయిన కూడికలూ, తీసివేతలూ, నిష్పత్తులూ తానే చేసి పట్టికలలో ఇస్తుంది కాబట్టి దానిని విశ్లేషించడమూ సులభమే.
పెట్టుబడికి లోబడని విషయాలకు ఈ లక్షణాలు ఉండవు కాబట్టి వాటిని విశ్లేషించడం కష్టం. దేశంలోని ఫ్యాక్టరీలలో ఎంతమంది కార్మికులున్నారు, వాళ్ళు రోజుకు ఎన్ని గంటలు పని చేస్తారు, ఎన్ని కోట్ల రూపాయల ఉత్పత్తి చేస్తారు, ఇత్యాది విషయాలను సంబంధిత ప్రభుత్వ శాఖలు వివరంగా లెక్కగట్టి తరచుగా ప్రచురిస్తుంటాయి. అయితే స్వంత కమతాల మీద తాము తినడం కోసం పండించుకునే రైతులు, భూస్వాముల దగ్గర వెట్టిచాకిరీ చేసే పాలేర్లు, రికార్డు లేకుండా భూమిని కౌలుకు తీసుకొని సాగుచేసే కౌలుదార్లు, ఇళ్ళల్లో చాకిరీ చేసే స్త్రీలు, తమ తల్లిదండ్రుల చేతి వృత్తులకూ, చిల్లర వ్యాపారాలకూ సాయంగా పనిచేసే చిన్నపిల్లలు, క్వారీలలోనూ, గనులలోనూ కాంట్రాక్టు లేబర్‌గా పనిచేసే కూలీలకు చేయూతగా పనిచేసే భార్యాపిల్లలు, అడవి సంపదను రకరకాల పెత్తందార్లకు వెట్టిగా సేకరించి సరఫరా చేసే గిరిజనులు- వీళ్ళ శ్రమ పెట్టుబడితో ప్రత్యక్షంగా మారకం చెందదు కాబట్టి దానికి లెక్క ఉండదు. ఏ గణాంకాల పట్టికలలోనూ కనిపించదు. దీనిని విశ్లేషించడం కష్టం. చుట్టూ ఉండే పెట్టుబడి చేసే ఆర్భాటంలో ఇది లేనేలేదనే భ్రమ సులువుగా కలుగుతుంది.
ఇటువంటివి చాలా ఉదాహరణలు ఇవ్వవచ్చు. బజారులో ఎన్ని రకాల సబ్బులు దొరుకుతాయో తెలుసుకోవాలంటే ఒక్క పూటలో తెలుసుకోవచ్చును గానీ దేశంలో ఎన్ని రకాల పంటలు పండుతాయో తెలుసుకోవడం కష్టం. వరి, గోధుమ, పత్తి, పొగాకు, చెరుకు మొదలయినవి ఏదో ఒక మేరకు పెట్టుబడికి లోనయి సాగవుతాయి కాబట్టి వీటిని చూడని వాళ్ళకు కూడా వీటి గురించి తెలుసు కానీ, జొన్నలు, రాగులు, సజ్జలు అనే పంటలున్నాయని చెబితే తప్ప తెలీదు. ఇక కొర్రలు, సామలు, అనుములు మొదలయిన ధాన్యాల గురించయితే వాటిని పండించే వాళ్ళకు మాత్రమే తెలుసు. మన రాష్ట్రంలో పత్తి కేవలం 3.5 శాతం సేద్యపు భూభాగంలో వేస్తారనీ, పొగాకు 2 శాతం సేద్యపు భూభాగంలో మాత్రమే వేస్తారనీ, జొన్నలు 16.6 శాతం, సజ్జలు, రాగులు, కొర్రలు, సామలు మొదలయినవి మరొక 12.2 శాతం సేద్యపు భూభాగంలో వేస్తారనీ చెప్తే చాలామంది ఆశ్చర్యపోతారేమో! (ఇవి 1982-83 గణాంకాలు. ఇప్పటి లెక్కలు కొద్దిగా అటూ ఇటూగా అదే రాశిలో ఉంటాయి) పత్తి, పొగాకు రైతుల సమస్యల గురించి చాలా విన్నాము గానీ సజ్జలు, కొర్రలు, సామలు, రాగులు పండించే రైతుల సమస్యల గురించి ఎవరూ విని ఉండరు. వాళ్ళకు సమస్యలు లేవని కాదు, వాళ్ళూ అడపాదడపా ఆత్మహత్యలకో, ఆకలి చావులకో పాల్పడరని కాదు. పెట్టుబడి ‘మహత్యం’ అటువంటిది. అది ఉన్న మేరకు దేదీప్యమానంగా ప్రకాశిస్తూ తక్కినదేదీ లేదనే భ్రమ కలిగిస్తుంది.
మరొక ఉదాహరణ. మనకు చిన్నప్పటి నుండీ పరిచయం ఉన్న చాలా చెట్ల పేర్లు మనకు తెలీదు కానీ యూకలిప్టస్ మొక్కను అందరం గుర్తుపట్టగలం. యూకలిప్టస్ మొక్కకు గల సామాజిక, రాజకీయ, ఆర్థిక ప్రాముఖ్యాన్ని గురించి చాలా చర్చ జరుగుతుంటుంది. అయితే (ఉదాహరణకు) తెలంగాణ జిల్లాలు సామాజిక, రాజకీయ జీవితంలో తాటిచెట్లకున్న ప్రాముఖ్యం అక్కడ ఉన్నవాళ్ళకు సహితం సరిగ్గా తెలీదు. రోడ్డు పక్కన అర ఎకరం భూమిలో యూకలిప్టస్ మొక్కలు కనబడితే మనకు వెంటనే ‘సామ్రాజ్యవాదం’ స్ఫురిస్తుంది. పక్కనే రెండు ఎకరాలలో చింత తోపు కనబడితే మాత్రం మనకు ఏమీ స్ఫురించదు. ఆ చింతలు స్థానిక భూస్వాములు లేక పెత్తందార్ల గుప్పిట్లో ఉండవచ్చును లేదా వాటిని ప్రజలంతా తమ అవసరాల కోసం యధేచ్ఛగా వినియోగించుకుంటూ ఉండవచ్చును లేదా (రాయలసీమలో చాలా చోట్ల జరుగుతున్నట్లు) గ్రామ పంచాయతీ ఆ చెట్ల వినియోగాన్ని కాంట్రాక్టర్లకు ఇచ్చి తాను రెవెన్యూ పొందుతూ ఉండవచ్చు. ఆ రెవెన్యూ మళ్ళీ కొద్దిమంది జేబులలోకి పోతూ ఉండవచ్చు. వీటిలో ఒక్కొక్క పరిస్థితికీ ఒక్కొక్క రాజకీయమైన ‘అర్థం’ ఉంటుంది. అయితే మనకు చింత చెట్లను చూస్తే అవేవీ స్ఫురించవు.
సమాచార రంగంలోనూ, విశ్లేషణా రంగంలోనూ సరుకుల మార్మికత (commodity fetishism) బలంగా పనిచేస్తుంది. నీరు దీనికి మరొక ఉదాహరణ. దేశంలో బీరు, బ్రాంది, విస్కీ వంటి మాదక ద్రవ్యాలు ఎక్కడెక్కడ ఎంతెంత ఉత్పత్తి అయ్యేదీ, ఎక్కడెక్కడ ఎంతెంత అమ్ముడుపోయేదీ (అధికార లెక్కలూ, దొంగ లెక్కలూ కలిపి) తెలుసుకోగలం గానీ నీటిని గురించి గణాంకాలు దొరకడం కష్టం. అది పెట్టుబడికి కొంత మేరకు ఒక వనరుగా ఉపయోగపడుతున్నప్పటికీ పూర్తిగా పెట్టుబడి గుప్పిట్లోకి పోలేదు కాబట్టి దాని గురించి పరస్పరం పొంతనలేని అంచనాలు మాత్రమే దొరుకుతాయి. నీటికొరత (కరువు) వచ్చినప్పుడే వీటిని గురించి కుతూహలం కలుగుతూ ఉంటుంది. కరువు ఎందుకు వస్తుంది, ఎట్లా పోతుంది అనే విషయాలు తెలుసుకోవడం అవసరం అవుతుంది. దీనికి సమాధానం చెప్పాలంటే పెట్టుబడినీ, దాని పెత్తనం వల్ల మనకు వచ్చే కష్టాలనూ చర్చించి ఊరుకోకుండా కొంచెం లోతుగా విశ్లేషించాలి. కరువు గురించిన చర్చ సామ్రాజ్యవాదంతో ముడిపెట్టకుండా జరగదు అని అంటే (‘కరువూ, సామ్రాజ్యవాదమూ కవలపిల్లలే’, నాగార్జున, అరుణతార, మార్చి 88 సంచిక) ముడిపెట్టి ఊరుకుంటే విషయం సగం కూడా అర్థం కాదు. ఆధునిక ప్రపంచంలో చాలా విషయాలకు సామ్రాజ్యవాదంతో ఏదో ఒక సంబంధం ఉంటుంది. అయితే ఏదో ఒక సంబంధం ఉండడానికీ, కార్యకారణ సంబంధం ఉండడానికీ చాలా తేడా ఉంది.
నీటి వనరులు (1)
మనం ఉపయోగించే నీటిని పరిశోధకులు మూడు రకాలుగా వర్గీకరిస్తారు. ఉపరితల జలాలు (surface water), నేల జలాలు (soil water), భూగర్భ జలాలు (underground water). ఉపరితల జలాలంటే వర్షపాతం లేక కొండలమీద మంచు కరగడం వల్ల నదులలో, చెరువులలో వచ్చి చేరే నీరు. నేల జలాలంటే నేల పైభాగంలోని మట్టిలో తేమ రూపంలో ఉండే నీరు. వర్షాధారమయిన మెట్ట సాగుకు ఇదే నీటివనరు. భూ జలాలంటే భూమిలోకి ఇంకిపోయి, బావులు, చెరువులలో ‘ఊట’ రూపంలో మనకు ఉపయోగపడే నీరు. ఈ మూడు రకాల నీటివనరుల నష్టాన్నీ చర్చించినప్పుడే కరువు అనేది అర్థమవుతుంది.
ఇందులో మొదటి రకం నీటి వనరును నదుల మీద, వాగుల మీద ప్రాజెక్టులు (భారీ లేక మధ్యతరహా ప్రాజెక్టులు) నిర్మించడం ద్వారా వినియోగించుకుంటాము. వీటికి ఎక్కువ పెట్టుబడి అవసరమవుతుంది. కాబట్టి నీటిపారుదల సౌకర్యాలు అనగానే మనకు ఈ ప్రాజెక్టులే జ్ఞాపకం వస్తాయి. అయితే ప్రస్తుతం వీటి వల్ల సేద్యపు భూమిలో 12 శాతానికి మాత్రమే నీరు లభిస్తోంది. నదీజలాల వినియోగాన్ని నూటికి నూరుపాళ్ళు అభివృద్ధి చేసినా (కె.ఎల్.రావుగారి గంగా-కావేరీ కాలవలతో సహా) 33 లేక 40 శాతం సేద్యపు భూ భాగానికి మాత్రమే నదీ జలాల ప్రాజెక్టుల వల్ల నీరు వస్తుంది. ప్రాజెక్టుల నిర్మాణానికి భారత ప్రభుత్వం సామ్రాజ్యవాదుల నుండి పెద్ద ఎత్తున అప్పులు తెచ్చుకుందనీ, ఆ అప్పులు మన ఆర్థిక రంగానికి భారంగా తయారయ్యాయనీ, ఇప్పుడు నిధుల కొరత ఏర్పడి ప్రాజెక్టులు ఆగిపోయి రిజర్వాయర్లు ఎండిపోయాయనీ నాగార్జున చేసిన విశ్లేషణ (అందులోని లోపాలు అటుంచి) ఈ నీటి వనరుకు మాత్రమే వర్తిస్తుంది.
మూడవ రకం నీటి వనరును (భూ జలాలు) మనం ప్రధానంగా బావుల రూపంలోనూ, చెరువుల రూపంలోనూ వినియోగించుకుంటున్నాము. (చెరువు నీటిలో ఉపరితల జలాలు, భూ జలాల ఊట రెండూ కలిసి ఉంటాయి-అయితే చెరువుల కింద జరిగే సేద్యం మొత్తం సేద్యంలో నాలుగవ వంతు కూడా లేదు. కొత్తగా చెరువుల నిర్మాణం అసలు జరగడం లేదు కాబట్టి భవిష్యత్తులో ఇంకా తగ్గుతూ పోతుంది.) అయినా ఈ నీటివనరు ఎప్పుడూ కూడా నదీ జలాల ప్రాజెక్టుల కంటే ఎక్కువగానే సాగునీరు సరఫరా చేస్తోంది. ప్రస్తుతం దేశంలోని సేద్యపు భూమిలో 18 శాతానికి బావులు, చెరువుల నుండే నీరు లభిస్తోంది. మొత్తం భూజలాలను సద్వినియోగం చేస్తే ఇది 40 శాతానికి పెరగగలదు. నిజానికి ఈ నీటివనరు అభివృద్దికి పెద్ద ఎత్తున పెట్టుబడిని సమకూర్చాల్సిన అవసరం లేదు. బావులను ఎక్కువగా వ్యవసాయదారులు తమ స్వంత పెట్టుబడితో లేదా స్వంత పూచీ మీద అరువు తెచ్చుకునే పెట్టుబడితో అభివృద్ధి చేయడం జరుగుతోంది. చెరువుల విషయానికొస్తే ప్రస్తుతం వాటిని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరుగుతోంది. దీనికి కారణం నిధుల కొరత మటుకు కాదు. భూజలాల అభివృద్ధికీ, సక్రమ వినియోగానికీ ఇప్పుడున్న వ్యవసాయ సంబంధాలూ, భారత ప్రభుత్వం వ్యవసాయ విధానమూ ముఖ్య అవరోధంగా ఉన్నాయి.
ఇకపోతే మిగిలింది రెండవదైన నేల జలాల వనరు. దీనిని మనం అసలు ఒక నీటివనరుగానే గుర్తించడంలేదు. దీనిమీద ఆధారపడే భూమిని నీటిపారుదల వసతి లేని వర్షాధారమయిన భూమిగా వర్గీకరిస్తున్నాం. ఆ కారణంగా కరువును గురించి చర్చించేటప్పుడు ఈ భూమిని గురించి చర్చించేదేమీ లేదని భ్రమపడుతున్నాం. అయితే ఈ భూమి ‘తేమ’ను నిలుపుకునే శక్తిని కోల్పోవడం కూడా ‘కరువు’ లక్షణాలలో ఒకటి. అది ఎందుకు జరుగుతుందో చూడకుండా కరువు పూర్తిగా అర్థం కాదు. ప్రస్తుతం సాగుభూమిలో 70 శాతం వర్షాధారంగా ఉంది. మొత్తం నదులనూ, వాగులనూ భూజలాల సేద్యానికి వినియోగించుకున్నా కూడా ఇంకా 20 శాతం వర్షాధారంగా
ఉంటుంది. భూసార అభివృద్ధి చర్యలను విస్తారంగా చేపట్టి, ప్రస్తుతం సాగుకు పనికిరాకుండా పోయిన భూమిని పూర్తిగా సాగులోకి తెస్తే దేశంలోని మొత్తం సాగుభూమిలో వర్షాధారమయిన భూమి 40 శాతానికి పెరుగుతుంది. అంటే ఎన్ని ప్రాజెక్టులు కట్టినా, ఎన్ని వేల గొట్టపు బావులు వేసినా వర్షాధారమైన వ్యవసాయం మన ఆర్థిక రంగంలో ప్రముఖ స్థానాన్ని కలిగి ఉంటుంది.
అంతేకాదు. మనకు లభించే వర్షపాతంలో 30 శాతాన్ని మాత్రమే మనం వినియోగించుకుంటున్నామనీ, 70 శాతం వృధాగా పోతోందనీ అంచనా. అంటే 30 శాతం మాత్రమే భూమిలోకి ఇంకి భూజలాలలో కలవడమో లేక నేలలో తేమగా నిలవడమో లేక రిజర్వాయర్లలోకి చేరి కాలవల ద్వారా ఉపయోగపడడమో జరుగుతోంది. 70 శాతం వృధాగా సముద్రంలోకి పోవడమో, ఆవిరి అయిపోవడమో జరుగుతోంది. ఇది జరగడానికి కారణం ఏమిటో, ఈ నీటిని వ్యవసాయానికి ఉపయోగించడానికి చేపట్టగల చర్యలకు ప్రస్తుతం వ్యవస్థలో ఉన్న ఆటంకం ఏమిటో చూడాలి.
ఇంకా చూడవలసినది ఉంది. మన దేశంలో మొత్తం 80 కోట్ల ఎకరాల భూమి ఉంది. ప్రస్తుతం సాగులో 36 కోట్ల ఎకరాలు, అడవుల జాబితాలో మరొక 14 కోట్ల ఎకరాలు కలిపి 50 కోట్ల ఎకరాలు కాగితపు లెక్కల ప్రకారం వినియోగమవుతున్నాయి. అయితే మిగిలిన 30 కోట్ల ఎకరాలు పూర్తిగా నిరుపయోగమైనవి కాదనీ, అందులో దాదాపు 20 కోట్ల ఎకరాలు వన్య లేక వ్యవసాయ అవసరాలకు ఉపయోగపడగల నేలలే కానీ భూసార విధ్వంసం వల్ల వట్టిపోయాయని ఒక అంచనా. అంతేకాక, ప్రస్తుతం వ్యవసాయం జాబితాలోనూ, అడవుల జాబితాలోనూ ఉన్న 50 కోట్ల ఎకరాలలో కనీసం 20 కోట్ల ఎకరాలు ఏదో ఒక మేరకు భూసార విధ్వంసానికి గురయి పూర్తి
ఉత్పాదకత ఇవ్వలేకుండా ఉన్నాయని మరొక అంచనా. ఈ భూసార విధ్వంసానికి గల కారణాలనూ అర్థం చేసుకోవాలి.
వీటన్నింటి వెనుక మనకు కనిపించేది ఏమిటంటే సామ్రాజ్యవాదం, వ్వవసాయ వర్గ వ్యవస్థ పరస్పరాశ్రితాలుగా దేశాన్ని తమ గుప్పిట్లో పెట్టుకొని ప్రజలను కరువు పాలు చేయడం. వ్యవసాయ సంబంధాలను పదిలంగా రక్షిస్తూ ‘అభివృద్ధి’ సాధించాలనే విషయంలో భారత ప్రభుత్వానికీ, సామ్రాజ్యవాదానికీ ఏకీభావం ఉంది. భారత ప్రభుత్వానికి ఈ దృక్పథం ఉండడానికి దాని వర్గ స్వభావం కారణం. గ్రామీణ ప్రాంతాల ధనికవర్గాల (భూస్వాములు, అభివృద్ది చెందిన ప్రాంతాల ధనిక రైతాంగంలోని అగ్రభాగం) భారత పాలకవర్గాలలో ఒక సెక్షను. వాళ్ళ అవసరాలను సాధించడం, సంరక్షించడం భారత రాజ్యాంగ యంత్రం కర్తవ్యాలలో ఒకటి. వాళ్ళ ప్రతినిధులు అన్ని పాలకవర్గ పార్టీలలోనూ పుష్కలంగా ఉన్నారు. లోక్‌సభలోని ప్రజాప్రతినిధులు ఏయే సామాజిక వర్గాలకు చెందినవారని కొచానెక్ (2) చాలాకాలం క్రితం విశ్లేషణ చేశాడు. మొత్తం లోక్‌సభలోని కాంగ్రెస్ పార్టీ సభ్యులలో 71 శాతానికి గ్రామాలలో భూములు ఉన్నాయనీ, 42 శాతానికి భూమే ప్రధాన జీవనాధారం అనీ, 20 శాతానికి 50 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉందనీ చెప్పాడు. తాము ‘వకీళ్ళ’మని చెప్పుకున్న 54 మంది కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులలో 38 మందికి భూములు కూడా ఉన్నాయనీ, తాము ‘సంఘసేవకులం’ అని చెప్పుకున్న 65 మందిలో 25 మంది భూములు గలవారనీ ఆయన అన్నాడు. రాష్ట్ర అసెంబ్లీలలో అయితే ఈ ఆసాముల సంఖ్య ఇంకా ఎక్కువ ఉందని అన్నాడు. ఈ గణాంకాలు రెండవ లోక్‌సభ (1957-62)కు సంబంధించినవి. ‘హరిత విప్లవం’ ఫలితంగా పార్లమెంటు, అసెంబ్లీలలోని ‘వ్యవసాయదారుల’ సంఖ్య క్రమంగా పెరుగుతోందే కానీ తగ్గడం లేదని తరువాతి పరిశోధకులు అంటారు.(3) భారత రాజ్యాంగయంత్రం మీద భూస్వామ్య వర్గానికి గల పట్టుకు ఇది కారణం కాదు, ఫలితం.
పర్యవసానంగా భారత ప్రభుత్వం తన వ్యవసాయ అభివృద్ధి విధానంలో వ్యవసాయ సంబంధాలను ముట్టుకోవడానికి ఇష్టపడదు. సామ్రాజ్యవాదానికి కూడా ఈ విషయంలో అభిప్రాయ భేదం లేదు. భారత వ్యవసాయరంగంలోకి అమూలాగ్రం ప్రవేశించే అవసరం గానీ, ఉద్దేశం గానీ, సామర్ధ్యం గానీ సామ్రాజ్యవాదానికి లేదు. అనుకూలమయిన ప్రాంతాలలో కొంత లోతుగానూ, ఇతర ప్రాంతాలలో పైపైన మాత్రమే ప్రవేశించడం సామ్రాజ్యవాద పెట్టుబడి అవసరాలకు సరిపోతుంది. మొత్తంగా భూస్వామ్య వర్గమూ, అనుకూలమయిన ప్రాంతాలలో దానితోపాటు ధనిక రైతాంగ వర్గమూ సామ్రాజ్యవాదం మార్కెట్ అవసరాలకు సరిపోతాయి. ఈ వర్గాలకు తన సరుకులు అమ్ముకొని వీళ్ళనుండి తనకు కావలసిన ముడిసరుకులు కొనుక్కుంటుంది. భారత ప్రభుత్వం ఈ వర్గాలకు చవకగా ఎరువులు, డీజిల్, కరెంట్, సేద్యపు నీరు సరఫరా చేయడమే కాక కాంట్రాక్టులు, సహకార బ్యాంకులు, మార్కెటింగ్ సంస్థలు, పంచాయతీ రాజకీయ వ్యవస్థలు వీళ్ళ చేతుల్లో పెట్టి వీళ్ళ సాంప్రదాయక పెత్తనానికి కొత్త ఆలంబన కలిగించి, వీళ్ళ ఆదాయం అత్యధికంగా పట్టణాలలో అనుత్పాదక వ్యాపారం, వర్తకం, సినిమాలు, సారాయి కాంట్రాక్టులు, ఇళ్ళ స్థలాలు తదితర రంగాలలోకి, కొంతమేరకు పరిశ్రమలలోకి పోవడానికి కావలసిన పూర్వ నిర్మాణ సదుపాయాలను (infrastructure) కలుగజేస్తుంది. ఈ క్రమంలోనే సామ్రాజ్యవాదం అవసరాలు తీరుతాయి. ఉభయతారకమయిన ఈ ఏర్పాటే భారత ప్రభుత్వ వ్యవసాయ విధానానికి పునాది.
ఈ రాజకీయ చట్రంలో భాగంగానే నీటిపారుదల వసతులను అభివృద్ధి చేయడం జరుగుతోంది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రాజెక్టుల మీద పెద్ద ఎత్తున పెట్టుబడులను కేంద్రీకరిస్తున్నారు. కానీ చెరువుల వంటి చిన్ననీటి వనరుల నిర్వహణనూ, అభివృద్ధినీ నిర్లక్ష్యం చేస్తున్నారు. భూజలాల వినియోగాన్ని (బావులు, గొట్టపు బావులు) వ్యవసాయదారులు తమ స్థోమతను బట్టి సమకూర్చుకోగల ప్రైవేటు పెట్టుబడులకు వదిలేస్తున్నారు. ఆ ప్రైవేట్ పెట్టుబడిలో అధిక భాగాన్ని మళ్ళీ ప్రభుత్వమే ఆస్తులు గల వ్యవసాయదారులకు బ్యాంకు రుణాల రూపంలో సరఫరా చేస్తుంది. అతి కీలకమైన భూసార సంరక్షణ, భూ వనరుల నిర్వహణ గురించి మాత్రం అప్పుడప్పుడూ ఉపన్యాసాలు ఇవ్వడంతో సంతృప్తి చెందుతున్నారు. తమ అవసరాలు సాధించుకోవడానికీ, తమ ఆస్తులనూ, పెత్తనాన్నీ కాపాడుకోవడానికీ ఇదే సరయిన వ్యూహం అని భారత పాలక వర్గాలూ, సామ్రాజ్యవాదులూ స్పష్టంగానే అర్థం చేసుకున్నారు. స్థోమత గల వ్యవసాయదారులు భూవనరులను లాభదాయకంగా వినియోగించుకోవడం కోసమే వ్యవసాయ బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు, భూమి తనఖా బ్యాంకులు, కమర్షియల్ బ్యాంకుల గ్రామీణ శాఖలు, ఎ.డి.బి. విభాగాలూ ప్రారంభించబడ్డాయి. వీటికి కావలసిన మూల ధనం రిజర్వు బ్యాంకు సరఫరా చేస్తుంది. (సహకార బ్యాంకుల’ పెట్టుబడిలో 50 శాతం రిజర్వు బ్యాంకు పెట్టుబడే). వీటిలో కమర్షియల్ బ్యాంకుల శాఖలను మినహాయిస్తే తక్కిన వాటిమీద పెత్తనమూ గ్రామీణ భూస్వామ్య వర్గానిదే. అప్పులు ఎవరికి దొరికేదీ, ఎంత దొరికేదీ ఏ మేరకు నిధులు స్వాహా చేసేదీ వాళ్ళే ప్రధానంగా నిర్ణయిస్తారు. వాళ్ళ భూస్వామ్య పెత్తనానికి సామ్రాజ్యవాద పెట్టుబడి ఒక కొత్త ఆలంబన. ఇక నదీజలాల ప్రాజెక్టులకు అవసరమయ్యే భారీ పెట్టుబడులలో చెప్పుకోదగ్గ భాగాన్ని సామ్రాజ్యవాదం అప్పుల రూపంలో సరఫరా చేస్తుంది. అందులోనూ ప్రధానంగా సామ్రాజ్యవాద ద్రవ్య పెట్టుబడికి (Finance Capital) కేంద్రమయిన ప్రపంచబ్యాంకు సరఫరా చేస్తుంది. నైసర్గికంగా అనుకూలమయిన ప్రాంతాలలో వేగంగా ‘అభివృద్ధి’ సాధించి అక్కడ ధనిక వర్గాలను మరింత ధనవంతులను చేస్తూ, వారి సాంప్రదాయిక భూస్వామ్య పెత్తనానికి కొత్త వత్తాసు కలిగిస్తూ, తద్వారా తన అవసరాలు సాధించుకునే వ్యూహంలో భాగంగా ఈ పని చేస్తుంది.
‘కరువు’ వచ్చినప్పుడల్లా నదీజలాల ప్రాజెక్టుల గురించి పాలకవర్గాలు తమలో తాము కొట్లాడుకొంటాయి. ఇతర నీటి వనరుల వినియోగం గురించి, భూ వనరుల నిర్వహణ గురించి, భూసార సంరక్షణ గురించి, భూ జలాల పొదుపు గురించి మాట్లాడడం ఎవరికీ శ్రేయస్కరం కాదని వాళ్ళకు తెలుసు. నాగార్జునసాగర్ జలాలు, శ్రీశైలం కాలువ, కె.సి.కెనాల్, రాజోలిబండ స్కీం, తెలుగు గంగ ప్రాజెక్టుల గురించి అసెంబ్లీలో గొడవలు పెట్టుకొని నిరాహారదీక్షకు పాల్పడే రాజశేఖరరెడ్డి, మైసూరారెడ్డి, రాంభూపాల్ చౌదరి తదితర కాంగ్రెస్ నేతలు తమ బంధుమిత్రులూ, సజాతులూ, సవర్గీయులూ తరతరాలుగా రాయలసీమలో భూములనూ, ఇతర వనరులనూ తమ గుప్పిట్లో పెట్టుకుని రాజ్యం ఏలిన వైనంగానీ, ఇవాళ తాము ఆ ప్రాంతపు మిగులు సంపదనంతా కాంట్రాక్టులూ, వర్తకాలూ, సారాయి, ఇళ్ళస్థలాలూ తదితర అనుత్పాదక రంగంలోనూ, రాజకీయ పెత్తనం కోసం జరిపే ఆర్భాటంలోనూ, ముఠా తగాదాలలోనూ నిష్ప్రయోజనంగా వృధా చేస్తున్న వైనంగానీ ‘కరువు’కు ఎంతగా దోహదం చేశాయో చెప్పడానికి ఇష్టపడరు. ఢిల్లీకి పోయి దెబ్బలు తిని వచ్చిన తెలుగుదేశం నాయకులు కూడా ప్రభుత్వ పెట్టుబడుల గురించి మాట్లాడతారే కానీ ఈ వాస్తవాన్ని చెప్పరు… ఇద్దరూ ఇద్దరే కాబట్టి.
కరువు
అడవుల నష్టాన్ని గురించి బాధపడడం సమంజసమే కానీ దానికీ, కరువుకూ గల సంబంధం ఏమిటో చూడకపోతే మన అంచనా అతిశయోక్తుల పాలవుతుంది. అడవులు వర్షాన్ని తేమ రూపంలో నిలుపుకుంటాయి. చెట్ల ఆకులు, వేర్లు, గడ్డి నీటిని నిలుపుతాయి. ఆ నీరు ఆవిరిగా మారి తిరిగి వర్షానికి దోహదం చేస్తుంది. అందువల్ల అడవుల నష్టం ప్రత్యక్షంగా అనావృష్టికి దారితీయగలదు. దక్షిణ అమెరికాలోని అమెజాన్ నదీలోయ అడవులను నాశనం చేయడం వల్ల బ్రెజిల్ దేశం అనావృష్టి పాలయి, తత్ఫలితంగా కరువు పాలయిందని అంటారు. అమెజాన్ నదీ లోయలో కురిసే వర్షంలో 75 శాతం అక్కడి అడవుల నుండి ఆవిరయ్యే నీరేనని అంచనా.
అయితే మన దేశంలో కరువుకు అనావృష్టి కారణం కాదు. వర్షపాతం గురించి లెక్కలు కట్టడం మొదలుపెట్టిన నాటినుంచీ ఇప్పటిదాకా ప్రతి సంవత్సరం వర్షపాతాన్ని గణాంకశాస్త్ర పద్ధతులలో విశ్లేషించిన పరిశీలకులు చెప్పేదేమిటంటే వర్షపాతంలో స్వాభావికంగా ఉండే హెచ్చుతగ్గులే కానీ (random variations) క్రమబద్దమయిన తగ్గుదల (regular decline) లేదని. దేశం మొత్తం మీదే కాదు, కరువుకు ప్రత్యేకంగా పేరు పొందిన రాజస్థాన్ రాష్ట్రంలోనూ, మన రాష్ట్రంలోని రాయలసీమ జిల్లాలలో కూడా వర్షపాతంలో గత వందేళ్ళలో క్రమబద్ధమయిన తగ్గుదల ఏమీలేదు.
మరి ‘కరువు’ ఎందుకు వస్తోందంటే కురిసిన వర్షాన్ని సక్రమంగా వినియోగించుకోవడంలో క్రమేపీ మనం మరింత విఫలం అవుతున్నాం. నదీజలాలకు ప్రాజెక్టులు కట్టలేకపోతున్నాం. కట్టిన ప్రాజెక్టులను సరిగ్గా నిర్వహించలేకపోతున్నాం. భూ వనరులను శాస్త్రీయంగా నిర్వహించకపోవడం వల్ల నేలమీద కురిసిన నీరు నేలలోకి ఇంకి, భూజలాలలో కలవకుండా వృధాగా పోతోంది. ఉన్న భూజలాలను కూడా మనం చాలా అశాస్త్రీయంగా వినియోగించుకుంటున్నాం. భూసారాన్ని సంరక్షించలేకపోవడం వల్లనే కురిసిన వర్షాన్ని నేల ‘తేమ’ రూపంలో నిలుపుకోలేకపోతోంది. వ్యవసాయ క్షేత్రాలుగా ఉన్నవి బంజర్లుగా మారుతున్నాయి.
ఇప్పుడు ప్రాజెక్టుల వైఫల్యాన్ని గురించి చాలా చర్చ జరుగుతోంది కాబట్టి చర్వితచర్వణంగా వాటి గురించి మళ్ళీ చెప్పనవసరం లేదు. పైన చెప్పినట్టు, కట్టగల ప్రాజెక్టులన్నీ కట్టేసి నదీజలాలను నూటికి నూరు శాతం వినియోగించేసుకున్నా అది మొత్తం సాగుభూమిలో 38 లేక 40 శాతానికి మాత్రమే నీరు ఇస్తుంది. తక్కిన 60 శాతం సాగుభూమి భూజలాల మీద, నేలలోని తేమమీద ఆధారపడక తప్పదు. సాగులోకి తేగల నేలనంతా సాగులోకి తెస్తే ఇది 70 శాతానికి పెరుగుతుంది. కాబట్టి ఏనాడయినా భూవనరుల నిర్వహణ, భూసార సంరక్షణ, భూజలాల సక్రమ వినియోగం మన దేశంలో ప్రధాన సమస్యలుగానే ఉంటాయి. అడవుల సంరక్షణకు ఇందులో అంతర్భాగంగా ప్రాముఖ్యం ఉంటుంది.
నేలమీద మొక్కలు, గడ్డిచెట్లు ఉంటే ఆ నేలలో పడిన వర్షం నెమ్మదిగా నేలలోకి ఇంకి భూజలాలలో కలవడమో, లేక చిన్న చిన్న వాగులలోకి ప్రవహించి చెరువులలోనూ, నదులలోనూ చేరి ఉపరితల జలాలుగా ఉపయోగపడడమో జరుగుతుంది. మొక్కలు, చెట్లు, గడ్డి లేని నిస్సారమయిన నేల వర్షం నీటిని నిలపలేదు. ఆ నీరు భూమిలోకి ఇంకకుండా వేగంగా పల్లపు ప్రాంతాలకు వరదలయి ప్రవహిస్తుంది. ఆ క్రమంలో సారవంతమయిన మట్టి అంతా కొట్టుకుపోయి సారహీనమయిన గడ్డి నేల మిగులుతుంది. ఇలా కొట్టుకుపోయిన మట్టి చివరకు చెరువులలో, నదులలో చేరి వాటి ‘గర్భం’లోని నేలమట్టాన్ని పెంచుతుంది. దానివల్ల చెరువులకు గండిపడడం, నదులలో అకస్మాత్తుగా వరదలు రావడం జరుగుతుంది. అందుకే కరువూ, వరదలూ పెనవేసుకుని పెరుగుతున్నాయి. కిందటి సంవత్సరం అసాధారణమైన కరువు పరిస్థితులు ఒకవైపు ఉండగా, ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల దగ్గర ఒక వాగులో అకస్మాత్తుగా వరదలొచ్చి దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ కొట్టుకుపోయి చాలామంది చనిపోయారు. ఆ వాగులన్నింటినీ కలుపుకునే గోదావరికి ఏటూరునాగారం దగ్గరా, భద్రాచలం దగ్గరా వరదలొచ్చి గ్రామాలకు గ్రామాలే కొట్టుకుపోయాయి. నాలుగైదేళ్ళ క్రితం తెలంగాణ జిల్లాలలో చాలా చెరువులకు గండిపడి వరదలొచ్చాయి. ప్రాణనష్టం జరగలేదు కానీ సేద్యపు భూములలో ఇసుక మేటవేసి నిరుపయోగమయ్యాయి. నిజానికి తెలంగాణ, రాయలసీమ జిల్లాలలో చెరువుల గర్భంలోని నేలమట్టమెంతగా పెరిగిందంటే వేసవికాలంలో చూస్తే అది చెరువు గర్భం అయిందీ, పచ్చిక బయలు అయిందీ తెలీదు.
భూవనరుల దుర్వినియోగం వలన ఉపరితల జలాలలోనూ, భూ జలాలలోనూ కలవవలసిన వర్షపు నీరు ఈ విధంగా వరదై భూసారాన్నీ, ప్రాణాలనూ నష్టపరచడమే కాకుండా ఎందుకూ పనికిరాకుండా పోతోంది. ప్రపంచంలోకెల్లా అత్యధిక వర్షపాతం లభించే ప్రాంతం అస్సాంలోని చిరపుంజి అని చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నాము. ఇవాళ అదే చిరపుంజి నీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది. వర్షపాతం తగ్గడమే దీనికి కారణం కాదు. వర్షం ఎప్పటిలాగా పడుతూనే ఉంది. అయితే అడవుల నాశనం వల్ల నేల ఆ వర్షాన్ని నిలుపుకోలేకపోతోంది. అదంతా కొట్టుకొనిపోయి బ్రహ్మపుత్ర నదిలో చేరి అస్సాంలోనూ, బంగ్లాదేశ్‌లోనూ వరదలకు కారణమవుతోంది. వర్షాకాలం అయిపోగానే చిరపుంజి బావులలో నీళ్ళుండడంలేదు. మన దేశ నైసర్గిక పరిస్థితులలో అడవుల నష్టానికీ, కరువుకూ ఉన్న సంబంధం ఇదే. మనది బంగాళాఖాతంలోనూ, అరేబియా సముద్రంలోనూ అల్పపీడనం ఏర్పడడం వల్ల కురిసే రుతుపవన వర్షపాతం కాబట్టి ఇక్కడ అడవుల నష్టానికీ, వర్షపాతం పరిణామానికీ సంబంధం పెద్దగా ఉండదు. అడవుల నష్టం భూ వనరుల నష్టంలో అంతర్భాగంగా కరువుకు దోహదం చేస్తుంది. అయితే భూ వనరులంటే అడవులే కాదు. బంజర్లు, పచ్చిక బయళ్ళు, తోపులు, బీళ్ళు, సాగుభూములు, పడావు భూములు అన్నీ కలిస్తేనే భూ వనరులవుతాయి. వీటి అశాస్త్రీయ నిర్వహణకు అదే ఫలితం ఉంటుంది. వీటి దుర్వినియోగం వలన ఇప్పటికే 20 కోట్ల ఎకరాలు (దేశ విస్తీర్ణంలో 25 శాతం) నిరుపయోగమయ్యాయనీ, మరొక 20 కోట్ల ఎకరాలు ఏదో ఒక మేరకు వట్టిపోయాయనీ, పైన చూశాము.
వర్గవ్యవస్థ (1)
భూ వనరుల సక్రమ నిర్వహణకు భూమి కొద్దిమంది గుప్పిట్లో ఉండడం ప్రధాన అవరోధం. భూ వనరుల శాస్త్రీయ నిర్వహణ సమిష్టి ప్రాతిపదిక మీద మాత్రమే జరగగలదు. ఒక గ్రామంలో ఏయే పంటలు ఎంత పండించాలి, ఏ భూమిని సాగు కోసం వినియోగించాలి, ఏ భూమిని పచ్చిక బయళ్ళుగానో, తోపులుగానో వినియోగించాలి, ఆ గ్రామంలో నీటి వనరులు ఏ మాత్రం ఉన్నాయి, వాటిని పెంపొందించడం కోసం ఆ గ్రామ పరిసరాలలోని బంజర్లు, బయళ్ళు, తోపులు, అడవులు మొదలయిన భూ వనరులను ఏ విధంగా నిర్వహించాలి ఇట్లాంటి విషయాలన్నీ సమిష్టి ప్రాతిపదిక మీద నిర్ణయించినప్పుడే సక్రమమయిన నిర్వహణ సాధ్యమవుతుంది. లేనప్పుడు ధనవంతులు తమ బలాన్ని బట్టి, పేదలు తమ అవసరాన్ని బట్టి వినియోగించుకోవడం జరుగుతుంది. వనరులను శాస్త్రీయంగా నిర్వహించడం ధనవంతుల వ్యక్తిగత ప్రయోజనాల దృష్టికి అవసరం కాదు, పేదలకేమో ఆచరణ సాధ్యం కాదు.
మన దేశంలో ఫ్యూడల్ దశలో గ్రామాలలోని బంజర్లు, బయళ్ళు, అడవులు మొదలయిన ప్రకృతి వనరులు భూస్వాములకు, ఇతర ‘గ్రామ పెద్దలకు’ పుల్లరి రూపంలోనూ, కలప తదితర వనసంపద రూపంలోనూ ఒక ప్రధాన దోపిడీ సాధనంగా ఉండేవి. బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తరువాత ఈ భూములను పట్టా చేసుకుని పూర్తిగా స్వంతం చేసుకునే అవకాశం వాళ్ళకు దొరికింది. ఆ వారసత్వం ఈనాటికీ కొనసాగుతోంది. గ్రామాలలోని భూ వనరులలో అత్యధిక భాగం నేటికీ కొద్దిమంది గుప్పిట్లోనే ఉంది. సాగుభూమి మాత్రమే కాక బంజర్లు, బీళ్ళు, గ్రామ పరిసరాల్లోని అడవులు కూడా కొద్దిమంది ప్రయోజనాలకే ఉపయోగపడుతున్నాయి. వాళ్ళు వాటి సంరక్షణ గురించిన ఆలోచన లేకుండా ధ్వంసం చేస్తున్నారు. పేద ప్రజల మాటకొస్తే వాళ్ళూ గత్యంతరం లేక వనరులను ధ్వంసం చేస్తున్నారు. తమకున్న కొద్దిపాటి భూమిని భూసారం క్షీణించే పద్థతిలో వినియోగించడం అశాస్త్రీయం అని వాళ్ళకు తెలిసినా, పొట్టకూటి కోసం ఆ పనే చేస్తారు. దానివల్ల వాళ్ళ భూములు వట్టిపోవడమేగాక, ఆ వట్టిపోయిన నేలలో కురిసిన వర్షం వరదగా ప్రవహించి ఇతరుల భూముల్లోని భూసారాన్ని నాశనం చేస్తుందంటే అది తమ ‘బాధ్యత’గా భావించడం వాళ్ళకు సాధ్యం కాదు. సాగుభూమే కాదు, బయళ్ళలో పశువులను మరీ ఎక్కువగా మేపిినా, బంజర్లలో చెట్లు ఎక్కువగా కొట్టేసినా ఇదే జరుగుతుంది.
భారత ప్రభుత్వ వ్యవసాయ విధానం ఈ వ్యవస్థనే ప్రాతిపదికగా తీసుకుంది. గ్రామీణ ప్రాంతాలలో భూమి తదితర వనరులు ఉన్నవాళ్ళ అవసరాలు తీర్చడం కోసం ఎరువులు, మందులు, పెట్టుబడి, డీజిల్, కరంట్ సరఫరా చేయడం; వ్యవసాయ సహకార వ్యవస్థను, మార్కెటింగ్ వ్యవస్థను రూపొందించడం; గ్రామాలలో భూప్వాముల పెత్తనం కొనసాగడం కోసం పంచాయితీ, అసెంబ్లీ రాజకీయాలను ప్రవేశపెట్టి ఆ నిర్మాణాన్ని ప్రభుత్వ రంగ ‘అభివృద్ధి’ విధానాలతో ముడిపెట్టడం; ఈ వర్గాన్నీ, అనువయిన ప్రాంతాలలో ఈ వర్గంతోపాటు ధనిక రైతాంగాన్నీ సామ్రాజ్యవాదులకు కావలసిన అమ్మకం-కొనుగోలు మార్కెట్‌గా తీర్చిదిద్దడం; ఇదీ భారత ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవసాయ విధానం. ఈ వ్యూహంలో భూ వనరుల సక్రమ నిర్వహణకు స్థానం లేదు. నిజానికి గ్రామీణ ప్రాంతాల నుండి లభించే మిగులు సంపద భూవనరుల సక్రమ నిర్వహణకు సరిపోతుంది. కానీ అది ప్రస్తుతం కొద్దిమంది గుప్పిట్లోనే ఉంది. ప్రభుత్వం దాని మీద కనీసం ఆదాయపు పన్ను కూడా సేకరించదు. అంతేకాకుండా ఆ మిగులు సంపదను గ్రామాలలో మదుపు పెట్టవలసిన అగత్యం లేకుండా పట్టణాలకు తరలించి కాంట్రాక్టులు, సినిమాలు, వర్తకం, చిన్న పరిశ్రమ తదితర రంగాలలో మరింత లాభదాయకంగా వినియోగించడానికీ, రాజకీయ తంత్రాలలో కుతంత్రాలలో వెచ్చించి తమ పెత్తనం పెంచుకోవడానికి కావలసిన నిర్మాణం అంతా ప్రభుత్వమే చేసిపెడుతోంది.
భూ జలాల విషయం కూడా అంతే. గ్రామాలకు కరెంటు, డీజిల్, పంపుసెట్లు, గొట్టపు బావులు వచ్చిన తరువాత వెనుకబడ్డ ప్రాంతాలలో కూడా స్థోమత గల భూస్వాములూ, ధనిక రైతులూ బావుల్ని లోతుగా తవ్వించుకొని పంప్ సెట్లు పెట్టించుకొని (లేదా బోర్‌వెల్స్ వేయించుకొని) భూజలాలను వెలికితీసి తమ పొలాలలో మాత్రం పంటలను పుష్కలంగా పండించుకోవడం చూస్తున్నాం. వాళ్ళు బోర్‌వెల్స్‌ను అంత లోతుగా వేయించుకుంటే తక్కిన రైతులకు మామూలుగా దొరికే నీళ్ళు కూడా దొరకవు. అంతకంటే ముఖ్యంగా దీనివలన భూజలాల సమతుల్యం దెబ్బతింటుంది. భూజలాలలోకి వచ్చిచేరే నీటికంటే తీసే నీరు ఎక్కువ ఉంటోంది. ఈ రకంగా భూజలాలను దుర్వినియోగం చేయడమే రాయలసీమలో కరువుకు కారణం అనీ, వర్షపాతం ఎప్పుడూ ఇంతకంటే ఎక్కువ లేదనీ ఓల్సెన్ అనే పరిశోధకుడు అంటాడు. నిజానికి వర్షపాతం తక్కువగా ఉండే రాయలసీమలాంటి ప్రాంతంలో తరతరాలుగా పండిస్తోన్న రాగులు, జొన్నలు, సజ్జల బదులు నీరు ఎక్కువగా అవసరమయ్యే వరి వంటి పంటలను ప్రోత్సహించడమే ప్రస్తుత వ్యవసాయ వర్గ వ్యవస్థ, వ్యవసాయ విధానం కల్పించిన అశాస్త్రీయ పరిణామం. నీటికి ప్రస్తుతానికి పెట్టుబడి దృష్టిలో ధర లేదు కాబట్టి అది విలువలేనిదై పంపుసెట్లు, గొట్టపు బావులు వేసుకోగలవాళ్ళకు అది ‘ఫ్రీ’గా దొరుకుతోంది. నీటి ఖరీదు లెక్కగట్టకుండా అంచనా వేస్తే రాగులు, జొన్నల కంటే వరి పంట మూడు నాలుగు రెట్లు ఎక్కువ దిగుబడి ఇస్తుంది కాబట్టి ఇది హేతుబద్ధమయిన విధానంగా చెలామణి అవుతోంది కానీ, ఒక ఎకరానికి ఎంత దిగుబడి అని కాక, ఒక ఎకరానికి, ఒక మి.మీ. వర్షపాతానికి ఎంత దిగుబడి అని లెక్కగడితే వరికంటే జొన్నలు, రాగులు ఎక్కువ దిగుబడినిస్తాయని గిరియప్ప అనే పరిశోధకుడు నిరూపిస్తాడు.
నీరు ‘ఫ్రీ’ కావడం వల్ల భూస్వాములకూ, ధనిక రైతులకూ ఉపయోగపడే వ్యవసాయ విధానమే ఇప్పుడు అమలవుతోంది. మధ్యతరగతి రైతులు కూడా అప్పో సొప్పో చేసి వాళ్ళను అనుకరించే ప్రయత్నం చేస్తుంటారు. ఫలితంగా కరువు పెరుగుతుంది. కరువు పెరిగినకొద్దీ బావులను మరింత లోతుగా తవ్వడం, పంపుసెట్లు పెట్టించడం, బోర్‌వెల్స్ వేయించడం ఎక్కువ అవుతుంది. గమనించవలసిన విషయం ఏమిటంటే బోర్‌వెల్ కంపెనీలు ఎక్కువగా కరువు ప్రాంతాల భూస్వామ్య వర్గానికి చెందిన వ్యక్తులవే ఉంటాయి. ముఖ్యంగా తెలంగాణలో నల్గొండ, రాయలసీమలో కర్నూలు జిల్లాలకు చెందిన వ్యక్తులు బోర్‌వెల్ కంపెనీలు పెట్టుకొని కరువు కాలంలో లక్షాధికారులవుతున్నారు. (కాంగ్రెస్ నాయకుడు రాజశేఖరరెడ్డి వీరిలో ఒకరు.) బోర్‌వెల్ రిగ్గులు తయారుచేసేది సామ్రాజ్యవాద లేక స్వదేశీ గుత్త పెట్టుబడిదారులయితే వాటిని కొనుక్కొని బోర్‌వెల్ కంపెనీలు పెట్టుకునేది కరువు ప్రాంతాల భూస్వామ్య వర్గంలో పుట్టి రాజకీయాల ద్వారా, కాంట్రాక్టుల ద్వారా ఎదిగినవాళ్ళు; వాటిని ఉపయోగించుకునేది కరువు ప్రాంతాల భూస్వామ్య ధనిక రైతాంగ వర్గాలయితే వాటి వల్ల నష్టపోయేది కరువు ప్రాంతాలలో అసలే తక్కువయిన భూ జలాల మీద ఆధారపడే సామాన్య రైతాంగం.
వర్షం నీటిలో 30 శాతం మాత్రమే మనం వినియోగించుకుంటున్నామనీ, తక్కినది వృధాగా పోతోందనీ మనం పైన చూశాము. వర్షం నీరు ఇసుక నేలలలో, రాతి నేలలలో, వ్యవసాయానికి పనికిరాని వాగులలో పడి వృధా కాకుండా ఉండాలంటే, ఆయా ప్రాంతాల నైసర్గిక స్థితిని దృష్టిలో ఉంచుకొని చిన్నచిన్న ఆనకట్టలూ, కాలువలూ, రిజర్వాయర్లూ, చెరువులు నిర్మించడం అవసరమవుతుంది. ఇది భూ వనరుల నిర్వహణకు అనుబంధంగా సాగాలి. ప్రస్తుతం కొన్ని గ్రామాలలో స్వయం సేవక సంస్థలు ఆదర్శవంతంగా ఈ పనిని చేపడుతున్నాయి. గుజరాత్‌లోని ఒక గ్రామంలో ఇటువంటి ప్రయోగం ద్వారా సేద్యపు నీరు 40 ఎకరాలకు లభించేది 800 ఎకరాలకు (20 రెట్లు) పెరిగిందని ఒక రిపోర్టు. ఇది సర్వత్రా సాధ్యం కావాలంటే వ్యవసాయ సంబంధాలు సమిష్టి ప్రాతిపదిక మీద నిర్మాణం కావడం అవసరం.
శాస్త్రీయమైన నీటివనరుల నిర్వహణకు గానీ, భూవనరుల నిర్వహణకు గానీ నిధులు పెద్దగా అవసరం లేదు. వ్యవసాయక విప్లవం విజయవంతమై సమిష్టి లేక కమ్యూన్ వ్యవస్థ ఏర్పడితే, ప్రస్తుతం వ్యవసాయ రంగంలో ఏపాటి మిగులు లభిస్తోందో అది సరిపోతుంది. కానీ ప్రస్తుతం ఆ మిగులు కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతమవుతోంది. దానిమీద ఆదాయపు పన్ను లేకపోగా అది వ్యవసాయానికి వినియోగం కాకుండా రాజకీయాలు, కాంట్రాక్టులు, సినిమాలు, గృహ నిర్మాణం, వర్తకం తదితర రంగాలలోకి పోతోంది. మన దేశంలో వ్యవసాయం కంటే పరిశ్రమల కంటే వేగంగా పెరుగుతోంది ఈ ‘తృతీయ రంగమే’. దీనికి చక్కటి సంకేతం గృహనిర్మాణ పరిశ్రమ. అన్ని సంక్షోభాలనూ తట్టుకొని పెరుగుతున్న గృహ నిర్మాణ రంగాన్ని పరిశీలిస్తే అందులో సంఖ్య రీత్యా స్వల్పభాగం పెద్ద నగరాలలోని మేడలు కాగా, అత్యధిక భాగం గ్రామీణ ప్రాంతాల భూస్వామ్య వర్గంలో పుట్టి ‘తృతీయ రంగం’ ద్వారా లక్షలు సంపాదించుకుని పట్టణాలలో మిద్దెలు కట్టుకుంటున్న కుటుంబాలవి. ఈ ప్రస్తావన ఇక్కడ ఎందుకు తీసుకొస్తున్నానంటే గృహనిర్మాణ పరిశ్రమకూ, అడవుల నష్టానికీ సన్నిహిత సంబంధం ఉంది. ప్రభుత్వం సామ్రాజ్యవాద పెట్టుబడికి ఉపయోగపడే యూకలిప్టస్ వనాలను ఎంతగా ప్రోత్సహిస్తోందో గృహోపకరణాలకు (తలుపు చెక్కలు, కుర్చీలు, బల్లలు, బీరువాలు వగైరా) అవసరమయ్యే టేకు వంటి కలప రకాల ప్లాంటేషన్లనూ అంతగా ప్రోత్సహిస్తోంది. దొంగచాటుగా జరిగే స్మగ్లింగ్ వీటికోసమే ఎక్కువ జరుగుతుంది. ఈ కలప వాడకంలో అత్యవసరమయిన దాన్ని మినహాయిస్తే ఆర్భాటపు కట్టడాలలో కనిపించేది సామాజికంగా నష్టదాయకమైనదే. ఈ కలపను అటవీశాఖ వారి టింబర్ డిపోలలో కొనుక్కునే కాంట్రాక్టర్లు, రవాణా చేసే లారీ యజమానులు, వాటిని ముడి సరుకుగా ఉపయోగించే ‘కోత మిషన్ల’ సేఠ్‌లు, ఫర్నిచర్ వ్యాపారం చేసే వర్తకులు, వాటితో ఆర్భాటంగా ఇళ్ళను అలంకరించుకునే ఘరానా వ్యక్తులు, అందరూ స్థానిక పెత్తందార్లే. వీళ్ళ జాతకాలు తీసి చూస్తే వీరిలో అత్యధిక భాగం ఇప్పుడు కాకపోతే తమ తాత తండ్రుల కాలంలో భూస్వాములయి
ఉంటారు. అడవుల నాశనానికి సామ్రాజ్యవాదులెంతగా బాధ్యులో వీళ్ళూ అంతగానే బాధ్యులు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయవలసిన మిగులు సంపద వీళ్ళ చేతులలో చిక్కి సామాజికంగా హానికరమైన వినియోగానికి పోతోంది.
యూకలిప్టస్ పెంపకంలో కూడా సామ్రాజ్యవాదానికీ, భూస్వామ్య వర్గానికీ ఉమ్మడి ప్రయోజనం ఉంది. ప్రభుత్వం బంజరు నేలల్లో యూకలిప్టస్ వేయడాన్ని ప్రోత్సహించడమే కాక, స్వంత భూములలోనూ ప్రోత్సహిస్తోంది. దీన్ని ఎక్కువగా ఉపయోగించుకుంటున్నది భూస్వామ్య ధనిక రైతాంగ వర్గాలకు చెందినవాళ్ళు. పట్టణాలలో వర్తకాలూ, వృత్తులూ ఉన్న వాళ్ళు. ‘కూలివాళ్ళ బెడద’ తప్పించుకోవాలని ఆశించేవాళ్ళు గతంలో పళ్ళతోటలు వేసుకున్నట్లు ఇప్పుడు యూకలిప్టస్ తోటలు వేస్తున్నారు. ప్రభుత్వం వాళ్ళకు మొక్కలు చవగ్గా సరఫరా చేయడమే కాక, ఎదిగిన చెట్ల కొనుగోలుకు ఏర్పాటు కూడా చేస్తోంది. అయితే యూకలిప్టస్ చెట్టు వేళ్ళు భూమిలోకి బాగా లోతుగా పోయి భూజలాలను తీసుకుంటాయి. (గొట్టపు బావుల్లాగా) దాని వలన భూజలాలు దెబ్బతిని పరిసర ప్రాంతాలలోని బావులు ఎండిపోయే ప్రమాదం ఉంది. దానివలన నష్టపోయేది సామాన్య రైతాంగం కాగా లాభం పొందేది సామ్రాజ్యవాదులు, గుత్త పెట్టుబడిదారులు, భూస్వాములు.
దీనిని బట్టి చూస్తే వ్యవసాయక విప్లవం ఇరుసుగా గల నూతన ప్రజాస్వామిక విప్లవమే కరువు సమస్యను పరిష్కరించగలదని అర్థమవుతుంది. ఒక కాలు గ్రామాలలో, ఒక కాలు పట్టణాలలో పెట్టి బతుకుతున్న భూస్వామ్య వర్గానికి చెందిన భూములను మొత్తంగా తీసేసుకుని ప్రజలపరం చేయాలి. ధనిక రైతాంగం భూములకు ఒక కుటుంబానికి స్వంత శ్రమమీద బ్రతకడానికి సరిపోయేంత పరిమితి విధించి తక్కినది ప్రజలపరం చేసి సమిష్టి వ్యవసాయ సంబంధాల ప్రాతిపదిక మీద వ్యవసాయాన్ని పునర్నిర్మించాలి. వ్యవసాయంలో వచ్చే మిగులులో దేశ పారిశ్రామికీకరణకు పోయేదాన్ని మినహాయించి తక్కినదంతా గ్రామవనరుల సమిష్టి నిర్వహణకూ, స్థానిక పరిశ్రమలకూ వినియోగించాలి. ఈ సమిష్టి గ్రామీణ వ్యవస్థ ప్రాతిపదికగా గల సమాజాన్ని నిర్మించుకున్నప్పుడే ‘కరువు’ సమస్య పరిష్కారమవుతుంది. దానికి కావలసినది సామ్రాజ్యవాద వ్యతిరేక జాతి విముక్తి పోరాటం కాదు; భూస్వామ్య వ్యతిరేక, సామ్రాజ్యవాద వ్యతిరేక నూతన ప్రజాస్వామ్య విప్లవ పోరాటం.
– (కరువు – వ్యవసాయ సంబంధాలు పుస్తకం నుంచి)