18వ శతాబ్దం, మరాఠా రాజ్యం చివరి బాజీరావు పేష్వా పాలనలో కులతత్వం, స్వార్థపరత్వం, అసూయా ద్వేషాలు, అగ్ర కులస్థుల భోగలాలసత్వంతో అస్తవ్యస్థంగా పతనపు అంచులకు వేళ్ళాడుతూ ఉంది. పేష్వా ఆశ్రితులూ, బ్రాహ్మణులూ తప్ప మిగతా సమాజమంతా క్రూరమైన అణచివేతకు గురై బానిసల్లా శవప్రాయపు బతుకులీడుస్తున్న వాతావరణం. ప్రజలు నిస్సహాయంగా బాధలనుభవిస్తున్న ఆ కాలంలో పేష్వా బాజీరావు 1818లో మరణించడంతో మరాఠ్వాడా ఆంగ్లేయుల పాలనలోకి పోయింది. పాలక వర్గంలో గొప్ప మార్పు జరిగిపోయింది. కానీ ఆంగ్లేయులు గ్రామపాలనా వ్యవహారాలలో, ప్రజల నిత్య జీవన విషయాలలో ఎలాంటి జోక్యం కలుగజేసుకోలేదు.
యావత్ ప్రపంచం ఆధునిక శతాబ్దంలోకి అడుగుపెడుతున్న మహత్తర సమయం అది. భారతదేశం రాజకీయ స్వాతంత్య్రం పొంది భౌగోళిక సరిహద్దులతో ఒక సార్వభౌమాధికార దేశంగా అవతరించడానికి ఇంకా వంద సంవత్సరాల పైన కాలం గడవాల్సి ఉంది.
శూద్రులూ, అతి శూద్రులూ పేదరికంలో, బానిసత్వంలో మానవ హక్కులు లేని హీనమైన, దీనమైన జీవచ్ఛవాలుగా బతుకులీడుస్తున్న దుర్భర కాలంలో, మరాఠా ప్రాంతం జవజీవాలూ కోల్పోయి కళాకాంతులు లేని చీకటిలో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో చిట్టచివరి పేష్వా మరణానంతరం పది సంవత్సరాలకు కారు మబ్బులను చీల్చుకుంటూ కొత్త సూర్యుడుదయించినట్లు 1827-28 సంవత్సరంలో పూణె నగరంలో ‘మాలి’ కులస్థులైన గోవిందరావు, చిమ్మానాయిలకు జోతీరావు జన్మించారు. 1831 జనవరి 3న సతారా జిల్లాలోని శిఖాలా గ్రామానికి సమీపంలోని మారుమూల పల్లెలో ఖండోజీ నేవ్‌సే పాటిల్, లక్ష్మీబాయిలకు సావిత్రీబాయి జన్మించింది. 1840లో వీరిద్దరికీ వివాహం జరిగింది. తన 11వ ఏట జోతీరావు ఇంటికి వచ్చిన సావిత్రీబాయి అత్యంత చురుకుగా ఇంటి పనులు చేస్తూ ఇల్లు చక్కబెట్టే పెద్దరికం సంతరించుకుంది.
మిషనరీ పాఠశాలలో చదువు సాగించిన జోతీరావు ఒక బ్రాహ్మణ మిత్రుని పెళ్ళి ఊరేగింపులో తనకు జరిగిన అవమానంతో దుఃఖించి, జ్ఞానోదయం కలగడంతో అసమ సమాజం మూలాలను శోధిస్తూ పురాణాలను అధ్యయనం చేసి కుట్ర పూరితమైన కులవ్యవస్థకూ, బ్రాహ్మణాధిపత్యానికి వ్యతిరేకంగా సామాజిక సంస్కరణలకు ముందడుగు వేశాడు.
1848లో మార్క్ ఏంగిల్స్ ప్రకటించిన కమ్యూనిస్టు మ్యానిఫెస్టో వచ్చిన సంవత్సరమే పూణెలో మొట్టమొదటి బాలికా పాఠశాలను జోతీబా ప్రారంభించడం ఒక చారిత్రక పరిణామం. ఈ పాఠశాలలో పనిచేయడానికి మహిళా టీచర్ ఆవశ్యకత ఉన్నందున జోతిబా మిత్రుని సోదరి ఫాతిమా షేక్, సావిత్రీబాయిలకు తగు శిక్షణనిప్పించి వారిని ఆ పాఠశాలలో ఉపాధ్యాయులుగా నియమించాడు. జనవరి 1న పూణెలోని బుధవారప్పేటలో భిడే గృహంలో ఈ పాఠశాల ప్రారంభం కాగా ఆనాటి కరుడుగట్టిన మత సమాజంలో శూద్ర స్త్రీలు చదువుకొని గడపదాటి పాఠశాలల్లో విద్య నేర్పే స్థాయికి చేరుకోవడంతో ‘ధర్మ భ్రష్టత’కు తొలి అడుగు పడింది. 17 ఏళ్ళ వయసులోనే సమాజ ఉన్నతికి సాహసించి చదువు నేర్పి ఉపాధ్యాయురాలైన సావిత్రీబాయి ఆధునిక భారతదేశపు తొలి ఉపాధ్యాయురాలిగా సరికొత్త చరిత్ర నెలకొల్పింది. మైనార్టీ వర్గం నుండి ఫాతిమా షేక్ సాహసించి మొట్టమొదటి మైనార్టీ వర్గపు ఉపాధ్యాయురాలిగా చరిత్రకెక్కింది. ఇందుకు గాను వారు కులీన సమాజంతో ఎదుర్కొన్న కష్టాలు, దాడులు అనేకం. వారిద్దరూ భయం వదిలించుకుంటూ బలంగా ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ తమ విద్యాబోధన లక్ష్యాన్ని కొనసాగించారు.
అది మొదలు ఫూలే చేపట్టిన అన్ని సంస్కరణ ఉద్యమాలలో జోతిబా భావించినట్లుగా ”స్త్రీలు పురుషుల కంటే
ఉన్నతులు” అని నిరూపిస్తూ సావిత్రీబాయి తన సహకారాన్నీ, భాగస్వామ్యాన్నీ అందిస్తూ పోయింది. జోతిబా చదువు కొనసాగడానికీ, ఆయన ఉద్యమ స్ఫూర్తికీ తన సహకారాన్నీ, ప్రోత్సాహాన్నీ అందించిన మరొక స్త్రీ సుగుణాబాయి క్షీరసాగర్. సంవత్సరం వయసప్పుడే జోతీబా తల్లి మరణించింది. అతని ఆలనా పాలనా చూసింది బాల వితంతువైన రక్తబంధువు సుగుణాబాయి.
బ్రాహ్మణుడైన పరమానంద్ జోతీబాకు మంచి మిత్రుడు. ఆయన ఆధునికతను స్వాగతించే ధైర్యవంతుడు. మామా పరమానంద్ అహంకార రహితుడు, భేషజాలకు పోనివాడు. ఆయన జోతీబా, సావిత్రీబాయిల ధైర్య సాహసాలను, సంస్కరణ భావాలను ప్రశంసించేవాడు. స్త్రీలు సామాజిక బాధ్యతను నిర్వర్తించడానికి చదువుకొని విద్యావంతులు కావాలని భావించేవాడు. సావిత్రీబాయికి చదువు నేర్పించి ఆమె శూద్ర బాలికలే కాదు, బ్రాహ్మణ బాలికలకు కూడా చదువు చెప్పే స్థాయికి తీసుకురావడం, శూద్రులై ఉండి ఉన్నత చదువులూ, సంస్కారానికై సమాజం కోసం పాటుపడడం మామా పరమానంద్‌ను ఎంతో ప్రభావితం చేసింది. ఇలాంటి కొందరు బ్రాహ్మణ, బ్రాహ్మణేతర మిత్రులు, పెద్దలు, మానవతా వాదుల సహకారం, ప్రోత్సాహం జోతీబాను సాహసవంతమైన, త్యాగపూరితమైన సంస్కరణోద్యమాలకు నడిపించింది.
నాటి వ్యవస్థలో నిమ్నకులాల ప్రజలదీ, స్త్రీలదీ దయనీయమైన స్థితి. సవర్ణులైన బ్రాహ్మణులు వితంతువులైన తమ ఇంటిలోని స్త్రీలను లైంగికంగా లోబర్చుకునేవాళ్ళు. ఆ స్త్రీలు గర్భం దాలిస్తే కుటుంబ, కుల పరువు పోతుందని వారిపై నాటు ప్రయోగాలు చేసేవాళ్ళు. సావిత్రీబాయి పాఠశాలకు వెళ్ళి వచ్చే క్రమంలో దారిపొడుగునా ఇళ్ళల్లో తలపై కొంగులు ప్పుకున్న స్త్రీలు తలుపు చాటునుండి తనను గమనించడం చూసేది.
జోతీబా థామస్ పెయినె రాసిన ‘మానవుని హక్కులు’ అనే పుస్తకాన్ని చదివి ఎంతో ప్రభావితం అయితే, సావిత్రీ బాయి నల్లజాతి వారి స్వాతంత్య్రం కోసం పోరాడిన థామస్ క్లార్క్‌సన్ జీవిత చరిత్ర చదివి ప్రభావితమయి మానవ హక్కుల కోసం జోతీబాతో కలిసి నడిచింది.
స్త్రీలు గడప దాటడం, చదువుకోవడం అప్రతిష్ట, ధర్మ భ్రష్టత అని గర్హించే సమాజంలో తొలుత ఆ రెండు పనులూ సావిత్రీబాయితో చేయించాడు జోతీబా. అందుకు వాళ్ళు రోజూ దూషణలకూ, వేధింపులకూ గురయ్యారు. ఇటుక రాళ్ళతో కొట్టించుకున్నారు. ఒక దశలో 1000 రూపాయలకు కిరాయి గుండాలతో చంపించే ప్రయత్నం జరిగింది. జోతిబా తండ్రి పెద్దల బెదిరింపులకు భయపడి ఈ చదువుల ఉద్ధరణ మానకుంటే ఇల్లు విడిచి వెళ్ళిపొమ్మంటూ వాళ్ళను ఇంట్లోంచి వెళ్ళగొట్టాడు.
ఫాతిమా షేక్ ఔదార్యంతో ఆమె ఇంట చేరిన ఫూలే దంపుతలు తర్వాత బ్రాహ్మణ బాల్య వితంతువులు కౌమార్యంలో గర్భం దాల్చితే పిల్లల్ని కని వదిలి వెళ్ళడానికి తమ ఇంటినే బాలహత్యా ప్రతిబంధక్ గృహంగా మార్చి నిస్సహాయ యువతులకు ఆశ్రయమిచ్చారు. 1853 జనవరి 28న ప్రారంభించిన ఈ ఆశ్రమంలో చిమ్మాబాయి అనే వితంతువు కన్న బాలుడిని దత్తత తీసుకున్నారు ఫూలే దంపతులు. యశ్వంతరావ్ ఫూలేగా పేరుపెట్టి వైద్య శాస్త్రం చదివించారు. సత్యశోధక్ సమాజానికి చెందిన మిత్రుని కుమార్తె రాధాబాయితో అతని వివాహం జరిపించారు. 1873వ సంవత్సరం నాటికి బాలహత్యా నిరోధక గృహంలో 66 మంది శిశువులు జన్మించారట.
బ్రాహ్మణ వితంతు స్త్రీలకు శిరోముండనం చేయడాన్ని నిలిపివేయడానికి సావిత్రీబాయి మంగలి వాళ్ళను సమావేశ పరచి వారితో ఇకపై తమకు అక్క, చెల్లెలు, తల్లుల సమానమైన ఆ స్త్రీలకు శిరోముండనం చేసి వారిని వికృతం చేయబోమని ప్రతిజ్ఞ చేయించింది. బొంబాయి నగరంలో రెండువేల మంది మంగలి సోదరులు ఈ సమస్యపై ఊరేగింపు చేయడం పెద్ద సంచలనం.
1876-77 సంవత్సరాల్లో మహారాష్ట్రలో తీవ్రమైన కరువు సంభవించింది. వ్యాపారస్థులు గోడవున్లలో దాచిన తిండి సరుకును పూణె మెజిస్ట్రేట్ దగ్గరికెళ్ళి జప్తు చేయాలని సత్యశోధకుల ద్వారా ఒత్తిడి తెచ్చి ఆ సరుకునంతా విడుదల చేయించారు ఫూలే దంపతులు. కరువు సమయంలో ఆహార ధాన్యాలను సేకరించడం, గంజి కేంద్రాలు నిర్వహించడంలో సత్యశోధక సమాజ సభ్యులు ముందున్నారు. తమ ఇంటిలోనే స్వయంగా తానే రొట్టెలు చేసి వందలాదిమంది పిల్లల ఆకలి తీర్చేది సావిత్రీ బాయి.
1864వ సంవత్సరంలో ఒక వైష్ణవ వితంతువైన యువతికి పునర్వివాహాన్ని జరిపించారు ఫూలే దంపతులు. అటు పూణెలో చుట్టుపక్కల గ్రామాల్లో దళిత బాల బాలికలతోపాటు అన్ని కులాల బాలికలకూ పాఠశాలలు తెరవడం, విద్యావిప్లవ సిద్ధాంతాన్ని అమలు చేయడం, వితంతు, అనాధ స్త్రీలకు, పిల్లలకూ ఆశ్రమాన్ని స్థాపించడం, సత్యశోధక సమాజ్ ద్వారా సామాజిక కార్యక్రమాలు చేపట్టడం, తమ ఇంటి ఆవరణలోని మంచినీళ్ళ బావిలో నీళ్ళు తోడుకునేందుకు ఊరిలోని దళితులకు ప్రవేశం ఇవ్వడం, కులాంతర వివాహాలు, స్త్రీ విద్య, దురాచారాలూ, మూఢాచారాలకు వ్యతిరేకంగా పనులు చేయడం… నేటికి 170 ఏళ్ళ క్రితపు సమాజంలో జరిగిందంటే, దానికి ఆద్యుడైన శూద్ర వీరుడు, విద్యా విప్లవ సంస్కరణ శూరుడు, తాత్వికుడు, దార్శనికుడు అయిన జోతిబా ఫూలే వల్లనే. ఒక శూద్ర స్త్రీగా ఫూలేవల్ల జ్ఞానవంతురాలై ఆ వెలుగుదారుల్లో మహోన్నతమైన కార్యాచరణతో భారతీయ నారీలోకానికి ఆదర్శమార్గం చూపించిన సావిత్రీబాయి 66వ ఏట 1897 మార్చి 10వ తేదీన ప్లేగు వ్యాథిగ్రస్థులకు సేవచేస్తూ ఆ వ్యాధి సోకి పరినిర్యాణం చెందింది. ఈ జనవరి 3 ఆమెకు 189వ జయంతి. ఆ మహాసేవామూర్తులకు నీరాజనాలు!