గాలి సుతిమెత్తగా కదులుతోంది…
దట్టమైన మేఘాలు నల్లగా ఆకాశాన్ని పర్చుకున్నాయి…
ఆకుపచ్చని వాసనేదో తియ్యగా
కదులుతూ వెళ్ళిపోతోంది…
చిటారు కొమ్మన మిఠాయిలా…
వెచ్చని జ్ఞాపకం కళ్ళను చుట్టి
గతాన్ని వెన్నంటి పాకుతోంది
సుదీర్ఘంగా వేళ్ళాడుతున్న గాయాలు ఎండిన మట్టిపెళ్ళలై
ఒక్కొక్కటిగా ఒడలి
రాలి పడిపోతున్నాయి
పారుతున్న నీళ్ళ అడుగున దాగిన
పచ్చని నాచు వెక్కిరిస్తోంది
అప్పుడప్పుడూ వచ్చిపోతున్న
ఎండమావులు మత్తుగా
మన రూపాలని కదిలించి మాయమై పోతున్నాయి…
ఏమి చెప్పాను ప్రియతమా!
ప్రశాంత నిశ్శబ్దత భరించడం ఎంత కష్టంతో కూడుకున్నదో కదూ…!
నలిగి, కాలి, చీరుకొనిపోయిన
మనసును మెలిపెడుతూ
ఒక నిట్టూర్పు…
నన్ను కృంగతీస్తూ వ్యాపిస్తోంది
దేహం నుంచి బలవంతంగా విడిపోయిన నా నువ్వు
ఇక తిరిగి రావన్న నిజం
అబద్ధమైతే ఎంత బాగుండు…?
అన్ని నదులు సముద్రంలో ఒక్కసారే కలువలేనట్లే…!
నీ… నేను మరణించి
చాలా యుగాలు గడిచిపోయాయి
శూన్యంలో నిర్విరామంగా
ఎంతకాలం పయనించేది…?
అందుకే…
మండుతున్న సూర్యుడి మీదకు
రెక్కలూపుతూ తిరిగి వెళ్ళిపోతున్నాను
బంధించిన ఆ ప్రేమ జాగ్రత్త సుమీ!