ఆమె
పాలరాతి సౌధంలో
అందంగా మలచి అలంకరించిన
మీ షోకేస్‌లో బొమ్మ కాదు
ఆమె
మీ శరీరానికి అద్దుకునే
అత్తరు బుడ్డి కాదు
వాడి అవతల పారెయ్యడానికి
ఆమె
షడ్రసోపేతమైన ఆహారం
వడ్డించిన విస్తరి కాదు
తిని గిరాటెయ్యడానికి
ఆమె
తాగిపడేసిన ఖాళీ సీసా కాదు
మీ మోహం వ్యామోహం
తీర్చి విసిరెయ్యడానికి
నీ మూలమూలల్లో పడగవిప్పి
నాట్యం చేస్తున్న ఆలోచనల్ని
కుళ్ళి కంపు కొడుతున్న భావనల్ని
కొత్త చీపుళ్ళతో ఊడ్చి
పాతాళ మాళిగల్లో పాతరెయ్
చీకటి గుయ్యారం
నుంచి బయటికొచ్చి
తరాలుగా కప్పుకున్న ముసుగు తీసి
వెలుతురు వైపు చూడు…
అదిగో…
నీవు వేసిన
సంకెళ్ళు తెంచుకుని
నీ ఆలోచనల పునాదులు
పెకిలించి వేస్తున్నది
నడిచొచ్చిన దారులనొదిలి
నూతన మార్గాల అన్వేషణలో
నువ్వు సృష్టించిన పంజరం
నుండి ఎగిరిపోతున్న పక్షిలా…
గగన విహారంలో
ఆమె…