మృదువైన సంగీతం… మధురమైన గాత్రం… చల్లని సాయంత్రం… గోప, బిజుల పాటకు సాంప్రదాయ బిహు నృత్యం చేస్తున్న అస్సామీ యువతులు. శీతాకాలపు సంధ్య చీకట్లలో, సన్లైట్ బల్బుల కాంతిలో, ఎరుపు గోధుమ రంగుల మేఖలా, చాదర్ ధరించి, నడుంపై చేతులు చేర్చి, కొద్దిగా ముందుకు వంగి, భుజాలను లయబద్ధంగా ముందుకి, వెనక్కి కదుపుతూ గుండ్రంగా తిరుగుతూ పంటలు బాగా పండి ఇంటికొచ్చిన ఆనందాన్ని వ్యక్త పరుస్తూ… పశువులకీ పక్షులకీ, పిట్టలకీ పురుగులకీ, భూమికీ మేఘానికీ, దీనులకీ పెద్దలకీ… అందరికీ పంచి మనమూ తిందాం… కలిసి పంచుకు తిందాం… పాటలతో పాటు బిహు నృత్యం సాగుతూనే ఉంది.
నృత్యం చేస్తున్నదల్లా ఉన్నట్లుండి ఒక్కసారిగా మోకాళ్ళపై కూర్చుండిపోయింది గీత. ఏమైందంటూ అందరూ చేరారు. గీత కళ్ళనుండి ఏకధారగా కన్నీరు బుగ్గల మీదుగా కారిపోతూనే ఉన్నాయి. విషయం అర్థమైనట్లు అందరూ చుట్టూ కూర్చుండిపోయారు. అందరి ముఖాల్లోనూ అలసట… అది అప్పటివరకు నృత్యం చేయడం వల్ల వచ్చింది కాదు. చీకట్లు పడుతుండగా మొదలుపెట్టి అర్థరాత్రిదాకా సాగే మాఘ మాసపు బిహు నృత్యం వారినెప్పుడూ అలసటకు గురిచేయలేదు. ఇప్పుడు మాత్రం వారి ముఖాల్లో అలసటే కాదు, వారి మనసుల్లోని వేదన, కోపం, నిస్పృహ, ఆందోళన కూడా కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి.
మెల్లగా సాంత్వన పరిచి ఏంటని అడిగితే గోప, గీతలతో పాటు కల్ప, రజని, షాబానో కూడా గబగబా మాట్లాడడం మొదలుపెట్టారు.
గత ఆరు నెలలుగా ఊర్లో సగం మంది లేరని, ఇంటికి ఇద్దరు చొప్పున వంతులేసుకుని ఊళ్ళు పట్టుకుని తిరుగుతున్నారని, సరైన తిండి నిద్ర లేదని, ఒకే ఒక పనిమీద అందరూ తిరుగుతున్నారని, అసలిదంతా ఏంటని, దేశంలో ఏం జరుగుతోందని ఒకరి తర్వాత ఒకరిగా బాధపడ్డారు. వారిలో సగం మందికి జనన ధృవీకరణ పత్రాలు లేవని, తమకే లేకపోతే తమ తల్లిదండ్రులవి, తాత ముత్తాతలవి, వారి తాతలవి ఎక్కడ్నుంచి వస్తాయని ఆక్రోశించారు. తాతలు, తాతల తాతలు ఎక్కడ్నుంచి వచ్చారో ‘లెగసీ సర్టిఫికెట్’ తెస్తే కానీ వీలు కాదని, ఈ గడ్డపై పుట్టి ఈ మట్టిలో కలిసిపోయిన ఎవరైనా వారిక్కడివారే అని నిరూపించడానికి, తమ అస్తిత్వాన్ని నిరూపించుకోవడానికి పడుతున్న తిప్పల గురించి చెప్తుంటే ఎవరికీ ఆవేశం ఆగట్లేదు.
కొన్ని ఊర్ల పేర్లు మారిపోయాయి. వెతుక్కుని ఊర్లకి వెళ్తే పంచాయితీ ఆఫీసుల్లో అధికారులు పట్టించుకోరు. ఏ సమయంలో చూసినా కనీసం 50 మంది ఆ ఆఫీసు ముందు క్యూలు కట్టి ఉంటారు. సాధారణంగా ఎవరూ తెలిసిన వాళ్ళు ఉండరు. చిన్న పల్లెలు, తిండి దొరకదు, పనవ్వడానికి ఎంతసేపు-ఎన్నాళ్ళు పడుతుందో తెలవదు. ఎవరు ‘మనవాళ్ళో’, ఎవరు ‘బైటివాళ్ళో’ తెలియక ఆ ఊరివాళ్ళు కొత్తగా వచ్చిన వారిని అనుమానంగా,
కొంత భయంగా చూడడం… గంటల తరబడి క్యూలలో నిలబడి తీరా ఆఫీసరు దగ్గర కొచ్చేసరికి వంశ వృక్షమంతా చెప్పించడం, ఎక్కడన్నా తడబడితే అనుమానం. ప్రశ్నలతో వేధించడం…
అందరూ అలా లేకపోయినా, ‘కొందరు’ పనిగట్టుకుని రావడం, అధికారుల కన్నా ఎక్కువ ప్రశ్నించడం, మీ వంశంలో ఎవరన్నా కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్నారా? పెళ్ళైన వాళ్ళకే పుట్టారా? రోహింగ్యాలతోనో, బంగ్లా ముస్లింలతోనో సంబంధాలు లేవని నిరూపించగలవా? అని అనుమానపు, అవమానపు మాటలు విన్నప్పుడు మాత్రం ఎన్నార్సీ కావాలని అడిగిన కొంత మంది వల్ల అస్సామీయులందరూ ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి రావడం అసహనాన్ని, కోపాన్ని కలిగిస్తోందంది రజని, షాబానో చేతిని తన చేతిలోకి తీసుకుంటూ. దర్జీ అయిన తన ముత్తాత ఊరికి వెళ్ళినపుడు అక్కడి అధికారి నుండి ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తు చేసుకుంది ఫాతిమా.
అసలు ఆసుపత్రులే లేనిచోట, దాయి పురుడు పోస్తే పుట్టినవారికి, బడి ముఖమే చూడని వారికి, మెరుగైన పని కోసమో, జీవనాధారం కోసమో, వ్యాపారం కోసమో దూర రాష్ట్రాలకి వెళ్ళిపోయిన వారి కుటుంబాలు జనన ధృవీకరణలు ఎక్కడ్నుంచి తెస్తారని కోపించింది కల్ప. అసలే పేదవారు, పనిచేసుకుని బ్రతికేవారు రోజుల తరబడి పనులు వదులుకుని పిల్లల చదువులకో, పెళ్ళిళ్ళకో అని దాచుకున్న కొద్దిపాటి డబ్బుని ‘లెగసీ సర్టిఫికెట్’ తెచ్చుకోవడానికి ఖర్చు పెట్టేసి ఇక వారసత్వంగా తన పిల్లలకి ఏమివ్వాలో తెలియని స్థితిలో మతి పోగొట్టుకుంటున్న వారిని ఎవరు పట్టించుకుంటున్నారు? ఏదైనా అడగబోతే ముందు నువ్వు ఈ దేశపు వారసత్వమేనని నిరూపించుకో అంటూ కొరడాల్లాంటి మాటలు ఝళిపిస్తున్నారని వాపోయింది గీత.
‘ఏ కులం, ఏ మతం, ఏ ప్రాంతం అని మేం ఎంచుకుని పుట్టామా? మా పెద్దలు ఉన్నచోట వనరులున్నంత వరకు అందరూ కలిసి మెలిసి సంతోషంగా ఉన్నారంట. అభి వృద్ధి చేస్తామంటూ వచ్చి వనరులన్నీ దోచుకుని, అందరూ సమానంగా అను భవిస్తున్న వాటిమీద ఆధిపత్యాన్ని తెచ్చుకుని, స్వంతం చేసుకుని అక్కడ పనిచేస్తున్నవారిని బానిసలుగా చూస్తుంటే ఏమనకపోగా వత్తాసిచ్చిన రాజకీయ రాబందుల్ని ఈ ప్రశ్నలు అడగరేం? వారికవసరం లేదా వారసత్వ నిరూపణ? వడ్డించేవాడు మనవాడైతే… అన్నట్లు ఏ విలువలూ లేకుండా, నైతిక బాధ్యత మర్చిపోయి ‘మిగతా వాళ్ళందర్నీ’ శత్రువులుగా చూస్తున్న ‘వారి’ అసలు వారసత్వం ఏంటి? అస్తిత్వం ఏంటి? ఇవన్నీ అడిగేవాళ్ళు, ముందు వాళ్ళ లెగసీని నిరూపించుకుని అప్పుడు కదా మిగతా అందర్నీ అడగాలి’ అని అడుగుతున్న బిజు ప్రశ్నలకి జవాబేది!
‘ఈ నేలే మా లెగసీ… ఈ మట్టే మా నిరూపణ… ఏ పత్రాలూ మాకవసరం లేదు… ఉన్నా మేం చూపించం. మా భాష, మా సంస్కృతి, మా జీవనం.. ఎన్నో భాషలు, ఎన్నో సంస్కృతులు, ఎన్నో జీవన వైవిధ్యాలు… ఇదే మా భారత్… ఇదే మా దేశం… హమ్ బుల్ బుల్హై ఇస్కీ, ఏ గుల్సితా హమారా… దీనికోసం పోరాడుతాం… విజయం సాధిస్తాం…’ ఏక కంఠంతో అంటున్న వైవిధ్య గళాల నిరసన నిప్పులు ఎగసి ఫాసిజాన్ని మసి చేయడం తథ్యం కాదా!!