పని వనంలో పచ్చగా పూస్తూ
పరిమళాలు వెదజల్లే లేలేత పూల రెమ్మల్ని
ఆస్వాదించే నెపంతో అంగాంగాల్ని ఆబగా తడిమే
విషపు నాలుకలున్న మనుషుల సంకుచితత్వాన్ని
‘మీ టూ’… అంటూ కొన్ని సుమబాలలు
ఇప్పుడిప్పుడే గుట్టు విప్పుతున్నాయి
చదువులాకాశంలో, చుక్కల లోకంలో
వెన్నెల కురుస్తున్న చక్కని చందమామల
చెక్కిలి నునుపుదనాల్ని చిదిమేసే గ్రహణాల
చీకటి జాడల చేదు నిజాల్ని…
‘మీ టూ’… అంటూ మరికొన్ని విరిబాలలు
ఇప్పుడిప్పుడే గుట్టు విప్పుతున్నాయి.
పొలం నిండా పరుచుకున్న వ్యవసాయ క్షేత్రంలో
పొద్దు గుంకేవరకూ పొట్టగట్టుకొని పనిచేస్తూ
ఓ నాలుగు కూలి గింజల్ని రేపటి గట్టునెట్టుకొని
పేదరికాన్ని భారంగా నెట్టుకొస్తూ
లోపలి గుండెల్లో దాచిపెట్టుకున్న దిగులు బావిని
నవ్వు మొహంతో కప్పిపుచ్చి
జీవన సేద్యంలో అలసిన గువ్వలు చిమ్మిన స్వేదమలాల్ని
లొట్టలేసుకుని చప్పరించే గుంట నక్కల వంటి గుట్టును
‘మీ టూ’… అంటూ మరికొన్ని గువ్వలు
ఇప్పుడిప్పుడే గుట్టు విప్పుతున్నాయి.
ఒంటినిండా రంగుల కలల్ని పూసుకుని
నింగిలో స్వేచ్ఛగా విహరించే తూనీగల తోకల చివర్లను
ఆశల దారంతో ముడివేసి ఆట బొమ్మల్లా ఆడిస్తూ
అవకాశాల అంగడిలో అమ్మకం పెట్టే
మనుషుల చీకటి ముఖాల్ని
‘మీ టూ’… అంటూ మరికొన్ని తూనీగలు
ఇప్పుడిప్పుడే గుట్టు విప్పుతున్నాయి.
తోడు లేక మోడువారిన లేడి పిల్లల
ఒంటరి జీవితాల పంచన చేరి
కన్నీటితో తడిసిన శ్వేతదేహాన్ని
నీలి కళ్ళ కామంతో చూస్తూ,
మృగతృష్ణతో మంచినీటి చెలమలకూ
మంటపెట్టే తోడేళ్ళ ఒంటికంటిన తిమ్మిరి పైత్యాన్ని
‘మీ టూ’… అంటూ మరికొన్ని లేడికూనలు
ఇప్పుడిప్పుడే గుట్టు విప్పుతున్నాయి.
ప్రకృతి చుట్టూ పెరుగుతున్న పశుతత్వాన్ని
పుణ్యభూమిలో పారాడుతున్న నీచత్వాన్ని
మూలాల నుండి పెకిలించాలని
గుండె ఘోషను గొంతు భాషగా చేసుకొని…
కొన్ని గాయపడ్డ కన్నీటి చుక్కలు
‘మీ టూ’… అంటూ మనసుల్ని తడిచేస్తున్నాయి
ఇప్పుడిప్పుడే మనుషుల్ని ప్రశ్నిస్తున్నాయి.