తనివి తీరనంతలా
ఆస్వాదించడం, అనుభూతించడం
ఆరాధించడమే కదా!
అయితే…
నేనూ ప్రేమిస్తున్నా…నిరంతరం
నా హృదయాంతరాల్లోంచి… అదే పనిగా
పొద్దున్నే…
మా చెరువు అద్దంలో ముస్తాబయ్యే
ఉదయసూరిన్నీ ప్రేమిస్తున్నా
ఆ పక్కనే…
తుషారబిందువులద్దుకొని తలలూపే
గరికపోసల్నీ… ప్రేమిస్తున్నా
పసిపాప బోసినవ్వులనీ…
పక్షుల కిలకిలా రావాలనీ…
పచ్చదనం నిండిన పంటచేలనీ ప్రేమిస్తున్నా!
నీలిమేఘాల కదలికలనీ
రాలిపడిన నెమలీకలనీ
రంగురంగుల సింగిడీనీ… ప్రేమిస్తున్నా!
ఉత్తుంగ తరంగాలనీ…
ఉన్నతశిఖరాలనీ
వంకలుగా సాగిపోయే సెలయేటినీ…
మా చూరు అద్దంలోంచి తొంగిచూస్తున్న
నిండు చందురుడినీ ప్రేమిస్తున్నా!
చెంగునదూకే లేగదూడనీ రంగుల సీతాకోకనీ
మల్లెల్లాంటి మనుషులనీ
మనుషుల్లోని మంచితనాన్ని
అంతకు మించి
నన్ను నేను ప్రేమించుకుంటున్నా!
ప్రేమించడమంటే…
మరేమో కాదు…
పండుగలా ఒక్కరోజుతో పార్కుల్లో గడిపి
చేతులు దులుపుకునేది ఎంత మాత్రం కాదు
అది నిరంతరం కొనసాగే అలౌకిక చింతన…!