చిట్టితల్లీ! చిట్టితల్లీ!
చిదిమావెందుకు తల్లీ! నీ చిన్ని బొమ్మని
పోఁ… ఐ హేట్ మమ్మీ ఆఁ.. ఆఁ…
నా క్యూటీ జడలు
జుట్టంతా కుదిపి పాడుచేసింది.
అమ్మా… మాతృ హృదయినీ!?
ముద్దు మురిపాల కూతురి కురులెందుకు కదిపావమ్మా…
దాని ‘డాడి’ నాపై అర్థం లేకుండా అరిచాడు
ఏమండోయ్ శ్రీవారు
అనురాగం అందించే ఇల్లాలిపైనా నీ ప్రతాపం?
జీతం అడిగితే మా యజమాని చెంప పగలగొట్టాడు
యజమానిగారూ! యజమానిగారూ!
పొట్టకూటి సేవకుడు విధేయుడు
కొట్టావా? చేతులెలా వచ్చాయి?
దయలేదా నీకు?
నీకు మాత్రం లంచంలో నా వాటా అడిగితే
బూతులు తిట్టే పై అధికారి ఉండడా ఏమిటి…?
పై అధికారీ! పై అధికారీ!
నీకంటే చిన్న అధికారి నెందుకు దూషించావయ్యా
చేతులు జోడించి, చెప్పలేను మంత్రిగారు నా నోరు నొక్కేశారు
మంత్రిగారూ! మంత్రిగారూ!
ప్రశ్నిస్తే నోరు నొక్కేస్తావా
స్వేచ్ఛకు తావు లేదా!???
ప్రభువులు నాపై చేయని నేరాలు మోపి
శిరస్సు ఖండిస్తానంటే నేనేం చేయను??
ప్రభువా! సర్వాధికార సార్వభౌమా!!
మన్నించండి… ప్రభో!
విచారణలేని తమరి దండన ప్రజలందరితో
తప్పులు చేయిస్తుంది
తేలుకు పెత్తనమిస్తే
తెల్లవార్లూ కుడుతుందంటారు
పాపం తగలదూ?
మీరే ఒప్పుకుంటున్నారుగా
తేలుకు పెత్తనమిచ్చామని
అందుకే… అందుకే
పదవి నాది
పాపకర్మం మీది
మతిలేని రాతలూ, పిచ్చి విమర్శలూ, వెర్రి విశ్లేషణలు గాక
అన్యాయాలు, అక్రమాలు
వేధింపులు… గ్యాంగ్ రేప్‌లు… అత్యాచార హత్యలు
అంటూ ఏమిటయ్యా మీ వెధవ గోల
రాజనీతిని అవినీతి అంటారా?
హు ఁ… హుఁ… హుఁ…
నా ”బంగారు కొండిని” విరుస్తానంటే నేను కుట్టనా?
(పరిష్కారం: కుట్టించుకోకుండా తప్పించుకుంటూ కొండి నిలిచే సఫలయత్నం)