మార్చి 8, 2020 గురించి రాయాలంటే ఎప్పుడూ లేని ఒక ఉద్వేగం మనసును కమ్మేస్తోంది. 1975లో ఇండియాలో
ఉమెన్స్ డే మొదలైనప్పటి నుండి నా జీవితానికి ఈ రోజుకు పెనవేసిన బంధం ఎప్పుడూ కళ్ళముందుకొస్తుంది. 45 సంవత్సరాల క్రితం మహిళా సాధికారత, అభ్యున్నతుల కోసం డిక్లేర్ చేసిన అంతర్జాతీయ మహిళా దినాన్ని నమ్ముకునే నేను మా సీతారామపురం నుండి బయలుదేరి హైదరాబాద్ మహానగరానికి వచ్చాను. నలభై సంవత్సరాలలో ఎన్నో అనుభవాలు. ఎన్నో జయాలు, అపజయాలు. మహిళల అంశాల మీద పని చేయాలనే ఆశయానికి నిబద్ధమై ఉన్నాను. 66 సంవత్సరాలు వయసు దాటుతున్నా, ఇంకా పనిచేయాలనే ఉత్సాహానికి అడ్డుకట్ట పడలేదు. శరీరానికి, మనసుకు లంకె కుదరకపోయినా పనిచేస్తూనే ఉన్నాను, చేస్తాను కూడా.
అంతర్జాతీయ మహిళా దినం సందర్భంగా ఎన్నో వ్యాసాలు రాశాను. భూమిక సంపాదకీయాలు రాశాను. ఈ సంవత్సరం మాత్రం దీనిమీద రాయాలంటే ఓ ఉద్వేగం ఊపేస్తోంది. ఈ ఉద్వేగం నా కలాన్ని, నా మనసును మాత్రమే కాదు దేశం మొత్తాన్ని కమ్మేసి ఉంది. 2019 సంవత్సరాంతాన మొదలైన ఓ ఉద్యమ కెరటం ఢిల్లీ నుండి దేశంలోని గల్లీగల్లీకి ప్రవహించిన వైనం గురించి నేనిప్పుడు రాయాలని కూర్చున్నాను. అందుకే ఈ ఉద్వేగం.
పాత సంవత్సరం ముగిసి, కొత్త సంవత్సరం అరుదెంచే వేళ కోసం మామూలుగా జనం చాలా సంతోషంగా ఎదురు చూస్తుంటారు. కొత్త సంవత్సరాన్ని ఎలా ఆహ్వానించాలి, ఏమేమి చేయాలి లాంటి ఎన్నో ఊహలతో ఉంటారు. అయితే ఉరుముల్లేని పిడుగుల్లా పౌరసత్వ సవరణ చట్టం పార్లమెంటులో ఆమోదం పొందిన క్షణం నుంచి దేశంలో పరిస్థితి మారిపోయింది. కొత్త సంవత్సరం కాదు కొత్త ఉపద్రవం వచ్చి పడింది. రాజ్యాంగానికి వ్యతిరేకంగా, రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా మతపరమైన విభజనతో భారత పౌరసత్వం అన్ని మతాల వారికి లభిస్తుంది ముస్లింలకు తప్ప అనే అంశం దేశమంతా ఒక ఉత్పాతాన్ని సృష్టించింది. ఈ దేశంలో బతుకుతున్న ముస్లింల జీవితాలను ఒక అభద్రతలోకి తోసేసింది. నిజానికి ఈ కొత్త చట్టం కేవలం ముస్లింలనే కాదు దళితుల్ని, ఆదివాసుల్ని, కొంపా గూడూ లేని కోట్లాది పేద ప్రజల్ని ప్రమాదంలోకి తోసేసింది. ఒకే ఒక్క చట్టంతో దేశంలోని కోట్లాది ప్రజల పౌరసత్వాన్ని ప్రశ్నార్థకం చేసేసింది. బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలలోని మస్లింలను తప్ప మిగిలిన అన్ని మతాల వారికీ భారత పౌరసత్వం ఇవ్వడానికే ఈ చట్టం తెచ్చామని చెప్పుకుంటున్నారు. ప్రపంచంలో ముస్లింలకు అనేక దేశాలున్నాయి కానీ హిందువులకు భారతదేశమొక్కటే దిక్కని పైకి చెబుతూ దేశాన్ని మత ప్రాతిపదికన చీల్చాలనే అంతర్గత కుట్రని కప్పి పుచ్చుతున్నారు. కానీ ప్రజలు తెలివైన వారు. ఈ కుట్రని పసిగట్టారు. ఎవరు ముందు పసిగట్టారు?
ఢిల్లీ నగరం మీద మునుపెన్నడూ లేని విధంగా శీతగాలి వీస్తూ ఉంది. వందేళ్ళలో కనీవినీ ఎరుగని రీతిలో చలిగాలులు వీస్తున్నాయి. ఆ చల్లటి చలివేళ జామియా విద్యార్థుల్లో కొత్తగా వచ్చిన పౌరసత్వ సవరణ చట్టం విపరీతమైన వేడిని పుట్టించింది. అన్యాయమైన ఆ చట్టం తమ భవిష్యత్తును అంధకార బంధురం చేయబోతోందని అర్థమైంది. జామియా మిలియా యూనివర్శిటీ లోపల శాంతియుతంగా నిరసన ప్రదర్శన చేయాలనుకున్నారు. ప్రజాస్వామ్య దేశంలో తమ నిరసనని ప్రదర్శించే హక్కు ఉందని నమ్మారు. హఠాత్తుగా ఢిల్లీ పోలీసులు యూనివర్శిటీలోకి దూసుకువచ్చారు. అధికారుల అనుమతి లేకుండా యూనివర్శిటీ ఆవరణలోకి ప్రవేశించి నలువైపుల నుంచి మౌనంగా నిరసన చేస్తున్న విద్యార్థుల మీద విరుచుకుపడి విచక్షణారహితంగా కొట్టడం మొదలుపెట్టారు. చాలామంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల దమనకాండని ఆపడానికి, షాహీన్ అనే అబ్బాయిని కాపాడడానికి ఆయేషా రెన్నా, లడీడా ఫర్జానాలు చూపించిన తెగువ, చూపుడు వేలితో పోలీసులనాపిన దృశ్యం సామాజిక మాథ్యమాలలో పెను ప్రకంపనల్ని రేపింది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న దేశవ్యాప్త ఉద్యమానికి ఆయేషా, లడీడాలు ఐకాన్లుగా నిలిచారు. వీరిద్దరూ ఒక నూతన చరిత్ర రచనకి శ్రీకారం చుట్టారు. ‘లడేంగే జీతేంగే’ అంటూ నినదించిన వీళ్ళు ఆధునిక మహిళ చరిత్రను తిరగరాస్తుందని ఢంకా భజాయించి చెప్పిన గురజాడ మహాకవి వాక్కుల్ని నిజం చేసి చూపించారు. జామియా విద్యార్థుల ఉద్యమం షాహీన్‌బాగ్ మౌన నిరసన గుడారానికి పురుడు పోసింది. ఆ విధంగా ఆయేషా రెన్నా, లడాడా ఫర్హానీయాలు భారతదేశ స్త్రీల ఉద్యమాన్ని గొప్ప మలుపు తిప్పారు.
జామియాకు కూత వేటులో షాహీన్ బాగ్ ఉంది. ఒక సాధారణ ప్రాంతం అసాధారణంగా వార్తలకెందుకెక్కింది? షాహీన్‌బాగ్ నుంచి చాలామంది పిల్లలు జామియాలో చదువుకుంటున్నారు. అలా రెండింటికీ విడదీయరాని సంబంధం ఉంది. జామియాలో పోలీసులు జరిపిన దమనకాండ, లాఠీఛార్జి షాహీన్‌బాగ్ మహిళల కన్న పేగుల్ని కదిలించాయి. కన్నీరు పెట్టించాయి. రక్తాలోడుతున్న విద్యార్థులను చూసి దుఃఖంతో కదిలిపోయారు. ఏం చెయ్యాలి? తామేం చెయ్యగలం? నిస్సహాయులుగా చూస్తూ ఉండడమేనా? ఉండలేకపోయారు. తబుస్సుమ్ కళ్ళనిండా నీళ్ళతో అక్కడున్న జెండా గట్టుమీద కూలబడింది. పిల్లల ఒంటి మీద గాయాలు ఆమెను దుఃఖంతో ముంచేశాయి. విపరీతమైన చలిలో అక్కడే కూర్చుండిపోయింది. ”పిల్లలు చలిలో, దెబ్బలతో సతమతమవుతుంటే నేనింటికి ఎలా వెళతాను. వెచ్చటి రజాయిలో ఎలా పడుకుంటాను. నేను ఇంటికి రాను” అంటూ ఇంటికెళ్ళడానికి నిరాకరించింది. ఆమెతో మరో ముగ్గురు కూర్చుని సత్యాగ్రహం మొదలుపెట్టారు. మెల్లగా ఇంకొంతమంది వచ్చి చేరారు. భయంకరమైన డిసెంబరు చలిలో పది, పదిహేను మంది మహిళలతో ఆరు బయట ఒక వేపచెట్టు కింద, జాతీయ రహదారి మీద షాహీన్‌బాగ్‌లో మొదలైన నిరసన ప్రదర్శన ఈ రోజు యావత్తు దేశానికి దిశా నిర్దేశం చేస్తున్నది. షాహీన్‌బాగ్ పోరాట ముఖమైంది. భారత దేశానికే కాక యావత్ ప్రపంచానికి షాహీన్‌బాగ్ మహిళలు దారిదీపాలుగా, స్ఫూర్తి ప్రదాతలుగా మారారు. ఈ రోజు షాహీన్‌బాగ్ ఒక దర్శనీయ స్థలం. పోరాటాలకు ఊపిరులూదే ప్రదేశం. ఢిల్లీ ఎల్లలు దాటి దేశమంతా షాహీన్‌బాగ్‌లు వెలిశాయి. ఒక్క ఢిల్లీలోనే 50 వరకు నిరసన గుడారాలు వెలిశాయి. దేశం మొత్తంమీద 200 వరకు సత్యాగ్రహ నిరసన గుడారాలు తయారయ్యాయంటేనే అర్థమవుతోంది షాహీన్‌బాగ్ ఎంత ప్రభావం చూపిస్తున్నదో. రాజకీయ నాయకుల ప్రమేయం కానీ, పురుషుల ప్రమేయం కానీ లేని ఈ ఉద్యమం కేవలం మహిళల ద్వారానే జరుగుతోంది. నాయకులంటూ లేని ఈ ఉద్యమం సామూహికంగా మహిళల ఆధ్వర్యంలో నడుస్తోంది. వందలాది, వేలాది మహిళలు, పిల్లలు, వృద్ధులు స్వచ్ఛందంగా ఎముకలు కొరికే చలిలో సైతం గుడారాల్లో కూర్చుంటున్నారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకునేవారకూ తామెవ్వరం శిబిరాలను విడిచిపోమని నిర్ద్వంద్వంగా ప్రకటిస్తున్నారు. రూ.500 కోసం, బిర్యానీల కోసం శిబిరాలకొచ్చి కూర్చుంటున్నారనే విమర్శను కన్నీళ్ళ మధ్య తిరస్కరిస్తూ, ”మేము భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి, మతపరమైన విభజనను వ్యతిరేకించడం కోసం పోరాడుతున్నాం. మేము ఈ దేశ పౌరులం. పాకిస్తాన్ వెళ్ళాలనుకుని ఉంటే దేశ విభజన సమయంలోనే వెళ్ళిపోయేవాళ్ళం కదా! మేము లౌకిక రాజ్యమైన భారత్‌లోనే ఉండాలని ఉండిపోయాం. డబ్బుకు, బిర్యానీలకి అమ్ముడుపోయేవాళ్ళం కాదు, ఈ దేశ ప్రేమికులం. తిరంగా ప్రేమికులం” ముక్తకంఠంతో చెప్పారు.
షాహీన్బాగ్లోను, అలాంటి వందలాది నిరసన గుడారాల్లోను పగలు, రాత్రి కూర్చుంటున్న ఈ మహిళలు ఎవరు? ఏ వర్గానికి చెందిన వారు? అని ప్రశ్నలు వేస్తే వచ్చే సమాధానం ఒక్కటే. సాధారణ, మామూలు మహిళలు. ఇళ్ళల్లో ఉండేవాళ్ళు, చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు, ఇంటి పనికి వెళ్ళేవాళ్ళు, కూలికెళ్ళేవాళ్ళు… వీళ్ళతోనే ఈ నిరసన శిబిరాలు నిండిపోతున్నాయి. పనులు పూర్తిచేసుకుని, పిల్లల్ని బళ్ళకు పంపి వచ్చేవాళ్ళు, తమ ఉద్యోగాలను త్వరగా ముగించుకుని వచ్చేవాళ్ళు, కూలి కూడా మానేసి కూర్చుంటున్నవాళ్ళు… మామూలు సాదాసీదా మహిళలు మొదటిసారి ఇలాంటి ధర్నాలలో పాల్గొంటున్నారు. ఉదయాలు శిబిరాలు ఖాళీగా కన్పిస్తే మధ్యాహ్నానికి పిల్లలతో సహా నిండిపోతుంటాయి. రాత్రికి కిటకిట లాడుతున్నాయి. ఈ నిరసన గుడారాల్లో సృజనాత్మకత వెల్లివిరుస్తూ ఉంటుంది. నినాదాల రూపకల్పనలో, బొమ్మలు, కార్టూన్లు, పాటలు, ఖవ్వాలీలతో చైతన్యం వెల్లివిరుస్తుంటుంది. అంబేద్కర్ బొమ్మలు అంతటా కన్పిస్తుంటాయి. తిరంగా జెండాలు ప్రతివాళ్ళ చేతుల్లోను రెపరెపలాడుతుంటాయి. మహిళలు ఎంతో క్రమశిక్షణతో మెలుగుతూ
ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్తున్నారు. ఇటీవలి ఢిల్లీ ఎన్నికల్లో షాహీన్‌బాగ్ పేరు ప్రతి రాజకీయ పార్టీ నాయకుడి నోట్లో పదులసార్లు ప్రస్తావించ బడిందంటేనే షాహీన్‌బాగ్ ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. ఇంత గొప్ప ఉద్యమాన్ని నిర్మించిన షాహీన్‌బాగ్ మహిళలను కలవాలని కలలు కనడం ఉద్యమాలని ప్రేమించేవాళ్ళకి సహజం.
దేశం మొత్తాన్ని చైతన్యపరుస్తున్న షాహీన్‌బాగ్ వెళ్ళాలని, అక్కడి మహిళలను కలిసి మాట్లాడాలని మనసంతా నిండిన కోరికతో నేను, ప్రశాంతి వెళ్ళాం. ఉమన్ స్టడీస్ కాన్ఫరెన్స్ పేరుతో ఢిల్లీ వెళ్ళి షాహీన్‌బాగ్ వెళ్ళాం. పౌరసత్వ సవరణ చట్టం అమలైతే తమ జీవితాల్లో రాబోయే పెనుమార్పుల్ని, ప్రమాదాలను పసిగట్టిన జామియా విద్యార్థులు తమ నిరసనని తెలియచేయడానికి ప్రజాస్వామ్యయుతంగా ప్రయత్నించినపుడు పోలీసులు భయానకంగా ప్రవర్తించి, లైబ్రరీలలో చదువుకుంటున్న విద్యార్థుల్ని సైతం తరిమి తరిమి కొట్టిన దృశ్యాలను దేశం మొత్తం చేష్టలుడిగి చూసింది. నిర్ఘాంతపోయి చూసింది. అయితే షాహీన్‌బాగ్‌లో మేము కలిసిన స్త్రీ మూర్తులు మాత్రం దుఃఖాన్ని, వేదనని పక్కనపెట్టి, గాయపడిన విద్యార్థుల్ని గుండెకు హత్తుకున్నారు. ”మేము సాధారణ మహిళలం. చిన్న చిన్న పనులు చేసుకుని బతికేవాళ్ళం. ఏ రోజూ ఇలా బయటికొచ్చి నినాదాలు చేసిన వాళ్ళం కాదు. నిరసన శిబిరాల్లో పాల్గొనడం ఇదే మొదటిసారి. సి.ఏ.ఏ. తీసేసేవరకు మేము నిరసన ఉద్యమం నడుపుతాం” అంటూ ముక్తకంఠంతో చెబుతున్న ఆ సాధారణ స్త్రీలే ఈ రోజు స్త్రీల ఉద్యమాన్ని మలుపు తిప్పారు. వందలాది, వేలాది స్త్రీలు రోజుల తరబడి ఇళ్ళను, వాకిళ్ళను వదిలేసి తమ సమయమంతా శిబిరాల్లోనే గడుపుతున్నారు. ఈ శిబిరాల్లో వెల్లివిరుస్తున్న ”సిస్టర్హుడ్” అబ్బురమనిపిస్తుంది. అప్పటివరకు ఈ మహిళలు ఒకర్నొకరు కలిసింది లేదు. పరిచయాల్లేవు. కానీ శిబిరంలో ఒక సామూహిక శక్తిగా వారు పరిణామం చెందిన తీరు ఆశ్చర్యం గొలుపుతుంది. వారి మధ్య పూల మధ్య దారంలా ఒక బంధం కనిపించీ కనిపించకుండా అల్లుకున్న వైనాన్ని శిబిరాల్లో చూసి తీరవలసిందే. ఢిల్లీలో షాహీన్‌బాగ్‌తో సహా ఎన్నో ఇతర నిరసన శిబిరాల్లోను అచ్చం ఇదే స్థితి. మేము మాట్లాడిన మహిళల్లోని క్రమశిక్షణాయుత ప్రవర్తనకు మూలం వాళ్ళ ముందున్న లక్ష్యం. రోజుల తరబడి అదే నిబద్ధతతో మెలగడానికి కారణం వారి మనసుల్లో పౌరసత్వ సవరణ చట్టం కలిగించిన అలజడి, అభద్రత, భవిష్యత్తు పట్ల ఆందోళన. మా కళ్ళల్లో సైతం నీళ్ళు పెట్టించిన వారి మానసిక వేదన, దుఃఖం. ఇవన్నీ కలగలసిన ఒక మహోద్యమాన్ని మేము ప్రత్యక్షంగా చూశాం. అనుభవించాం. చెప్పలేని ఉద్వేగానికి గురయ్యాం.
అందుకే నేను ఈ మార్చి ఎనిమిది, అంతర్జాతీయ మహిళా దినం గురించి రాయడానికి కలం చేతిలో తీసుకున్నప్పుడు కళ్ళారా చూసిన ఉద్యమం గుండెల్లో ఉప్పొంగడం మొదలుపెట్టింది. ఈ ఉద్యమం ఎటు పయనిస్తుంది, ఫలితమేమిటి అనే దానిమీద నాకు దృష్టి లేదు. వారు తమ లక్ష్యాన్ని సాధించేవరకు పోరాడతారన్న దాంట్లో నాకేమీ అనుమానాల్లేవు. అయితే ఈ సామాన్య స్త్రీలు నిర్మించిన ఉద్యమం మాత్రం చరిత్రలో నిలిచి ఉంటుంది. ఆధునిక మహిళ చరిత్రను తిరగరాస్తుందనే కవి వాక్కుకి సజీవ సాక్ష్యాలు ఈ సామాన్య స్త్రీ మూర్తులు. అంతర్జాతీయ మహిళా సంవత్సరం సందర్భంగా ఈ మహిళా మూర్తులకు శిరస్సు వంచి నమస్కరిస్తూ, వారి స్ఫూర్తిని నిండుగా గుండెల్లో నింపుకుంటున్నాను.