ప్రపంచవ్యాప్తంగా మనుషులు ఇలా ఎవరికి వాళ్ళు వేసే అరెస్ట్‌లో ఉండాల్సి వస్తుందనీ, కలుగుల్లోని ఎలుకల్లా ఉండాల్సి వస్తుందనీ, కలుగుల్లోని ఎలుకల్లా వీధుల్లోకి తొంగి తొంగి చూస్తుంటారనీ, అవసరమైతే ముసుగు దొంగల్లా బయటికి రావలసి ఉంటుందనీ కలలో కూడా ఊహించలేదు. ఊళ్ళకు ఊళ్ళు, దేశాలకు దేశాలు ఇలా ఒకదాని కొకటి సంబంధం లేకుండా మూసివేయడాన్ని లాక్డౌన్ అరటారని తొలిసారి తెలుసుకున్నాం.
ఏమాత్రం ముందస్తు జాగ్రత్తలు, హెచ్చరికలూ లేకుండా రాత్రికి రాత్రి పెద్ద నోట్లు మార్చినంత తేలికగా, సాయంత్రం ఎనిమిది గంటల సమయంలో రాత్రి పన్నెండు గంటల నుండీ దేశమంతా లాక్డౌన్ అనీ, రవాణా మార్గాలన్నీ మూసుకు పోతాయనీ ప్రకటించింది ప్రభుత్వం… సరదాగా ట్రిప్పులకి వెళ్ళిన వాళ్ళూ, చావు పుట్టుకలకీ, పెళ్ళి పేరంటాలకీ, అనారోగ్య బంధు మిత్రుల చూడ్డానికి వెళ్ళిన వాళ్ళు ఎక్కడికక్కడ యిరుక్కుపోయి గిలగిల్లాడిన సందర్భాలు కోకొల్లలు. కొంచెం ఆలస్యంగా…. వలస కూలీల నెత్తుటి పాదముద్రల బరువుతో మనన గుండెలు మంచుముద్దలయ్యాయి. వారి గురించిన ఒక కొత్త ఎరుక సమాజానికి కలిగింది.
అప్పటికే మానవ సంబంధాలను విచ్ఛిన్నం చేసి, మానసికంగా మనిషిని ఏకాకిగా మార్చిన పెట్టుబడిదారీ విధానాలతో సతమతమవుతోన్న మానవాళి నడుమ, కోవిడ్ భౌతిక దూరాలని కూడ పెంచింది. ఒకరికొకరిని అరటరానివారుగా మార్చింది.
ముఖ్యంగా ఈ కరోనా కాలంలో స్త్రీల మీద ఒత్తిడి, పనిభారం పెరిగింది. పనివాళ్ళు లేని అసహాయత బాగా తెలిసొచ్చింది. ఇంటిపని స్త్రీల మీదనే అదనపు భారమై కూర్చుంది. బోడపాటి పద్మావతి చెప్పినట్లు వండింది వండినట్టుగానే, కడిగింది కడిగినట్టుగానే, ఎండలో పెట్టింది పెట్టినట్టుగానే ఉంది. ఈ నేపథ్యంలో నుండి లాక్డౌన్ సమయంలో వర్దీగా ఏం చేశాము అనుకుంటే కొంత అసంతృప్తే మిగులుతుంది…
లాక్‌డౌన్‌కి మురదు అనుకునో, అనుకోకుండానో నేనొక పెద్ద న్యాయ నిర్ణయ కార్యక్రమానికి అరగీకరించి ఉండడంతో మార్చి ఒకటో తారీఖు నుండీ ఉగాది దాగా ఒక పదిహేను కథాసంపుటాలు (అరతా హేమాహేమీలవే) శ్రద్ధగా, ఒక యజ్ఞంలా చదవడం ఒకానొక మంచి అనుభవం.
ఉగాది తర్వాత లాక్‌డౌన్‌ని ఎదుర్కోవడానికీ, అలవాటు పడడానికీ, కరోనాతో కలిసి జీవించడానికీ కొంత సమయం పట్టింది. ఇంట్లో ఎవరయినా దగ్గినా, తుమ్మినా కలవరం, దూరం దూరం జరగడం. ఇంటికెవరయినా (అరుదుగా) వస్తే ప్రేమగా, స్నేహంగా కనీసం మొహమాటంగానయినా లోపలికి పిలవలేకపోవడం. ఇంటి చుట్టూ రెడ్‌జోన్ నిర్మాణం, అరతా ఒక కలలో ఉన్నట్టుగా వురడేది. ప్రభుత్వాలు ఎన్ని టెస్టులు చేస్తున్నాయో, ఎన్ని పాజిటివ్‌లు వస్తున్నాయో, వచ్చిన పాజిటివ్‌లు మరోచోట నెగటివ్లుగా ఎట్లా మారుతున్నాయి. ఇటువంటి కాకి లెక్కలతో కూడిన వార్తలను వింటూ, వాస్తలను బేరీజు వేయలేక సతమతమయిన కాలం, ఏ ఆలోచనలని స్థిరంగా నిలవనీయకుండా అగోచర గమ్యాన్ని కళ్ళమురదు నిలిపింది. ఏం చదవాలన్నా, సినిమా చూడాలన్నా కూడ మనసు నిలిచేది కాదు.
కొంత స్థిమితపడిన తరువాత ఈ సంవత్సరం బుకర్ప్రైజ్కి షార్ట్ లిస్టయిన నవలల మీద మిత్రులు రమణమూర్తి, పద్మప్రియ గార్లు చేసిన విశ్లేషణలు ఒక్కసారిగా చదవడం చైతన్యం కలిగించింది. ఒక విస్తృతమైన నవలని చాలా లోతుగా సమగ్రంగా అతి తక్కువ స్పేస్‌లో సమీక్షించిన ఈ సహచరులిరువురూ అభినందనీయులు. వారం వారం వీరు చేస్తోన్న నవలా పరిచయం చిన్నప్పుడు చదివిన మాలతీ చందూర్ ప్రపంచసాహిత్య పరిచయాలని జ్ఞప్తికి తెచ్చి పురా జ్ఞాపకాలలోకి వెళ్ళిపోయాను.
నిద్రపట్టని కరోనా రాత్రుల్లో ఒక రాత్రి హఠాత్తుగా ‘దేవరగట్టు’ గుర్తొచ్చింది. ఆ కథలో హింస యొక్క వివిధ ముఖాలను గుర్తు చేసుకురటూ, ఎంత ప్రయత్నించినా కథానాయకుడి పేరు గుర్తురాలేదు. వీరేంద్ర అన్పిస్తోంది కానీ వీరేంద్ర కాదు. వీరేంద్ర, చామంతి డా. చంద్రశేఖరరావు నవలలోని పాత్రలు. మరి ఇతడి పేరేమిటా అని ఆలోచిస్తూ అప్పటికప్పుడు దేవరగట్టుని వెతికి పట్టుకుని దేవేంద్రని చూసేదాకా నిద్రపట్టింది కాదు. దేవరగట్టు మళ్ళీ చదువుతున్నపుడు నేనిటీవల చదివిన ‘లాటరీ’ అన్న ఆంగ్ల కథ (షెర్లీ9 జాక్సన్ 1948లో రాసింది) గుర్తొచ్చి మళ్ళీ భయం, బీభత్సం నా చుట్టూ కమ్ముకుంది.
ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎవరికి ఈ లాటరీలో బహుమతి వస్తుందోనన్న ఉత్కంఠ పాఠకుడిలో కలిగిస్తూ మొదలయిన కథ చివరికొచ్చేప్పటికి షాక్‌కి గురిచేస్తూ ఒక కథాబీభత్సాన్ని పాఠకుడి కళ్ళమురదు పెడ్తుంది. లాటరీ అరటే ఇక్కడ బహుమతి గెల్చుకోవడం కాదనీ, మరణాన్ని ఆహ్వానించడమనీ లాటరీ వచ్చిన వ్యక్తిని మిగిలిన వాళ్ళందరూ రాళ్ళతో కొట్టి చంపుతారనీ, తెలిసి పాఠకుడు ఎంతకీ అరగీకరించడు. ఆ లాటరీ వచ్చిన వ్యక్తి ”ఇది న్యాయం కాదు, న్యాయం కాదు” అని అరుస్తూ ఉంటాడు. రాళ్ళ దెబ్బలను తట్టుకుంటూ. ఈ కథలో యింకా చాల కోణాలున్నాయి. అది వేరే విషయం…. ఈ కథ చదివిన తర్వాత మళ్ళీ ‘దేవరగట్టు’ చదువుతున్నప్పుడు ఈ మన సాహిత్య ప్రపంచంలో ‘దేవరగట్టు’ మీద జరగాల్సినంత చర్చ జరగలేదని పదే పదే అన్పించింది. మీ అరదరికీ తెలుసు ఇది జి.వెంకటకృష్ణ రాసిన కథ.
సరిగ్గా అదే సమయంలో జార్జ్ ఫ్రాయిడ్ హత్యోదంతంతో మనమంతా ఊపిరాడకుండా గడ్డకట్టుకు పోయాం. ఉక్కిరిబిక్కిరయ్యాం. జార్జి ఫ్రాయిడ్ ‘ఐ కారట్ బ్రీత్’ అన్న నినాదం మళ్ళీ నాకు ‘లాటరీ’ కథలోని ”ఇది న్యాయం కాదు” అన్న టెన్యీ అరుపుల్ని గుర్తుకుతెచ్చి కలవరపెట్టింది. జాత్యహంకారం ఇంకానా ఇకపై సాగదన్నట్లు కోవిడ్‌ని కూడా అధిగమిస్తూ అమెరికా అరతా నిరసన జ్వాలలు, ఉద్యమ పవనాలు నింగికెగిశాయి. బాధాకరమైన సందర్భమే అయినా ఆ ధిక్కారం ఒక ఆశాజనకం.
వంశీగారు తన కొత్త కథాసంపుటి లాక్‌డౌన్‌కి మురదే పంపి సమీక్షించమని అడిగారు. నాలుగొందల పేజీల పుస్తకం. గోదావరి లంకల్లో, గోదావరి గట్టు మీదో, గోదావరి నదిలోనో, ఇలా గోదావరి చుట్టూ తిరుగుతూ వివిధ రకాల జీవితాలని, అనేక కోణాల్లో నుండి పట్టుకున్న కథలో, కథనాలో అవన్నీ చదివి సమీక్షించడం చాలా సమయమే పట్టింది. ఆ సమయమంతా గోదావరిలో, లంకల్లో, పాపికొండల్లో తిరుగాడుతున్నట్టుగానే అన్పించింది.
లాక్డౌన్ ప్రారంభంలో మా చెర్రీ కోవిడ్ ఐ.సి.యూలో పనిచేయడం గురించి తీవ్రంగా ఆలోచించి నేను ప్యానిక్ అవుతున్నానని గుర్తించి కరోనా మీద జోకులూ, వ్యంగ్య గేయాలూ, పాటలూ పంపి నన్నెప్పుడూ నవ్వించడానికి, ప్రశాంతంగా ఉంచడానికి ప్రయత్నించిన పద్మాకర్ అనేక రాజకీయ పోస్ట్‌ల అరతరార్థాలని గురించి చర్చించేవాడు. చెర్రీ విషయంలో ఎంతగానో అభినందించి, నాకు ధైర్యమిచ్చిన మిత్రులందరికీ కూడ ధన్యావాదాలు.
ఇక అదే పనిగా యూట్యూబ్‌లోకి వెళ్ళి ఎన్.వేణుగోపాల్ వైవిధ్యభరితమైన ఉపన్యాసాలు వినడం లాక్డౌన్ నాకు కలిగించిన మరో మంచి అవకాశం. ఈ సందర్భాన్నిబట్టి కోవిడ్ మీద సుస్పష్టమైన, సుదీర్ఘమైన సామాన్యుడికి కూడ అవగాహన కల్గించేలా వారిచ్చిన స్పీచ్ స్ఫూర్తివంతమైనది. మనందరికీ తెలుసు వారి ఇతర ఉపన్యాసాలు కూడ ఎన్నదగినవే. ఒకటొకటిగా వింటూ ఉన్నాను. అదే సమయంలో తలోజా జైలులో ఉన్న వరవరరావు గారి ఆరోగ్యం పట్ల రేగిన కలకలం మనని కలవరపెట్టింది. వయసు రీత్యా, పారడమిక్ రీత్యా వారినందరినీ విడుదల చేయాలని కోరుతూ వీడియో తీసి పంపడం కూడ ఈ సమయంలోనే జరిగింది.
అదలా ఉంటే కొప్పర్తి, కథావాహిని పేరుతో ప్రతీ శనివారం మంచి మంచి తెలుగు కథల్ని పాతవీ, కొత్తవీ రాంబాబు గారి గళం నుంచి వినడం ఒక మంచి అవకాశం. నాకున్న పనుల ఒత్తిడిలో కథలు చదవడం కంటే వినడం చాల సౌకర్యంగా, సౌలభ్యంగా ఉంది. ఈ క్రమంలో లక్ష్మణశాస్తి గారు కూడ మంచి కథలూ, వ్యాసాలూ విన్పించడం విశేషం.
ఇక ప్రతీ గురువారం పలమనేరు బాలాజీ కవి సంగమంలో చేస్తున్న కవిత్వ విశ్లేషణ అభినందనీయం. ఆ క్రమంలో ప్రతి శనివారం రాత్రి ఎనిమిది గంటలకి ఒక్కో కవిత్వ సంపుటి మీద వినోదిని ఇస్తోన్న టాక్స్ హృదయాలని నింపుతున్నాయి. అలాగే నవలా స్రవంతి కార్యక్రమాలు కూడ…
ఇంకా కొ.కు కథలు ప్రాసంగికతను గురించి ఎస్.జె.కళ్యాణి ‘ఆ కథ ఇప్పుడు చదివితే’ ద్వారా కథలు విన్పించడం, ఆ కథ మీద విశ్లేషణ ఇవన్నీ కూడా ఈ లాక్డౌన్ సమయంలో ఏమాత్రం బోర్ని, బయటకెళ్ళాలన్న ఆలోచనని కలగనివ్వలేదనే చెప్పాలి.
నాకు మరింత స్ఫూర్తినీ, పాండమిక్ విస్మరించగల స్థాయినీ కలిగించింది ‘జాజిపూల పందిరి’. ఆ జాజిపూల పందిరి కింద నిలబడి వెన్నెల్లో హాయిగా ఆడుకుంటున్న ఆడపిల్లల్లాంటి అక్షరాలను పొదివి పట్టుకుని, జీవితం తాలూకూ నిత్య సందర్భాలను సరికొత్తగా అర్థం చేసుకురటూ, అప్పుడప్పుడూ సారంగ నుండి కొన్ని శేఫాలికలను యేరుతూ ఆఘ్రానించడం మరో అనుభవం. థారక్స్ టు వీరలక్ష్మీదేవి.
‘మేరువు’ నవలలో సమాజ దోపిడీకి వ్యతిరేకంగా పోరాటస్ఫూర్తిని, ఉద్యమబాటనీ అన్నిటి సజీవ పాత్రల్ని ప్రవేశపెట్టి, అదంతా ఇప్పుడిప్పుడే జరిగినంత ఉద్వేగాన్నీ, ఉత్తేజాన్నీ పాఠకుడిలో రగిలింప చేసిన నల్లూరి రుక్మిణి అభినందనీయురాలు.
మిత్రులందరితో అని కాదు గానీ పి.సత్యవతి గారిని, సింగమనేని నారాయణగారినీ అప్పుడప్పుడూ పలకరించడం నామినలే. ఎక్కువ కరోనా కబుర్లూ, తక్కువ సాహిత్య కబుర్లూ నడిచినా నమ్మకాన్నిచ్చేవి. ఈ క్రమంలో సింగమనేని గారు ‘గురజాడ అపార్ట్మెంట్’ అన్న మంచి కథని, తాను కన్న కలని విన్పించడం గొప్ప అనుభూతి. అలాగే శ్రీశ్రీ వర్థంతి రోజున వారి ఉపన్యాసం వినే అవకాశం కూడ కలిగింది. మాట్లాడుకోకపోయినప్పటికీ ప్రతీ ఉదయమూ శుభోదయమేనంటూ రంగురంగుల పూలగుత్తుల్ని పంపి నా లాక్డౌన్ సమయాన్ని పరిమళభరితం చేసిన ఓల్గాకి స్నేహాంజలి. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో పవర్ పోకుండా ఉండడం మా అదృష్టమనే చెప్పాలి.
చివరగా, నిజానికి మురదుగా కొండవీటి సత్యవతి, తానూ మనందరిలాగ ఇంట్లోనే వున్నప్పటికీ చెన్నైలో నిలబడిపోయిన శ్రీకాకుళం వలస కార్మికుల దాకా తన సౌజన్య హస్తాన్ని చాచడం, మరెన్ని చోట్లకో ఆమె వంద చేతుల్ని పంపడం, కొంత సడలింపుల తర్వాత కరోనాని కూడా లెక్క చేయకుండా ఆమె, ఆమె బృందం సుడిగాలిలా పర్యటించి మూలమూలలా ఉన్న వలస కార్మికులను వెతికి పట్టుకుని వారి ఆహార బాధ్యతలూ, ప్రయాణపు ఏర్పాట్లు, ఇతర అవసరాలూ దగ్గరుండి చూడడం, అక్కడక్కడా ఉన్నవారిని ఒకచోటికి చేర్చి షెల్టర్ ఏర్పాటు చేయడం ఇదంతా చిన్న విషయం కాదు. ఇదేవిధంగా ఒంగోలు ప్రారతంలో రమాసుందరి బృందం, విశాఖ ప్రారతంలో వేణు, మల్లీశ్వరి, కత్తి పద్మ వంటి వాళ్ళు వ్యక్తిగతంగానూ, బృందాలుగానూ ఆ చుట్టుపక్కలంతా వలస కార్మికులకు అరదించిన నిత్య సేవలు నిజంగా మరువలేనివి… ఈ మిత్రులందరూ చేసిన, ఇంకా చేస్తోన్న నిరంతరాయ సేవను పలవరిస్తూ, నేనీ చుట్టుపక్కల చేస్తోన్న ఉడత సాయాలకు చిన్నబోవడం మరో కోణం.
ఈ మొత్తం కరోనా సమయంలో అత్యరత బాధాకరమైన అరశం వలస కార్మికులు పనిలేక స్వగ్రామాలకు బాటసారులయి తిరుగుముఖం పట్టడం. ఆ ప్రయాణంలో అనేక మరణాలు, మరణాంతక ప్రమాదాలూ, గర్భిణీ స్త్రీల కానుపులు, ఆరు రోజుల పాపతో మళ్లీ కొనసాగిన నడక…. తల్లి మరణం అర్థంకాక నిద్ర అని నమ్మి లేపడానికి ప్రయత్నిస్తోన్న పసివాడూ, రైలు బండి కోసం పడిగాపులు కాస్తూ ఆ రైలు కిందనే తమ ప్రాణాలను పరిచిన పదారు మంది మిత్రులూ ఒకటా, రెరడా ఒక్కొక్కటీ ఒక్కో విషాదగాథ. వారితో దగ్గరగా మెలిగిన మిత్రులు ఆ కథలని చరిత్రలో నమోదు చేయాల్సిన అవసరముంది.
అత్యంత ఆశ్చర్యం కలిగించే విషయమేమిటంటే దోపిడీకి గురయి, మోసగింపబడి ఇంటిదారిపట్టిన ఆ బాటసారుల మౌనం… ఏమాత్ర ధిక్కారంలేని ఆ దీర్ఘ మౌనంలో నుండి ఏమో ఒక కొత్తమనిషి ఆవిర్భవిస్తాడేమో.