మనమెవరమూ అన్న మౌలికమైన ప్రశ్న ఉదయించిన కాలం ఇది. ఇప్పుడు బతుకుకే తాళాలు వేసుకునే పరిస్థితి. కనబడకుండా ఇంతటి విధ్వంసాన్ని కరోనా వైరస్ సష్టించింది. కరోనా ఎక్కడుందో తెలియదు. పక్కనుందో తెలియదు. మనలోనే ఉందో తెలియదు. అదిప్పుడు ప్రపంచాన్ని శాసించే స్థితిలో మాత్రం ఉంది. వందలాది మంది రాలిపోతున్నారు. మందు లేదు. అనువైన, అవసరమైన ఆస్పత్రులు లేవు. అంతా అగమ్యం. చుట్టూతా అలముకున్న చీకటి. ఓదార్పుల్లేవు. ఏ ధైర్యమూ లేదు. తొలిరోజుల్లో ఏం జరుగుతుందో తెలియక అందరూ భయపడ్డారు. చెప్పిన అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు. చప్పట్లు కొట్టాం. దీపాలు వెలిగించాం. చేతులు కడుగుతూనే ఉన్నాం. మూతికి మాస్కులు తగిలించుకున్నాం. అయినా ఇంకా కొనసాగుతున్న భయం. అదే ఆందోళన. ఉద్యోగస్తులు సగం జీతాల్లోకి వచ్చారు. రోజుకూలీలు దిక్కులేని స్థితిలోకి నెట్టివేయబడ్డారు.
నడక
‘ఆకాశమే ఇల్లైనవాడికి లోపలికి వెళ్ళే తలుపేదీ?
గడ్డకట్టిన గాలిని సంచీలకెత్తుతున్న కిటికీరెక్కలేవీ?
పనిలేదు. ఇల్లులేదు. డబ్బులు లేవు. అన్నం లేదు. కొందరు అన్నం పొట్లాలు పంచారు. కొందరు డబ్బులు పంచారు. కొందరు వంటసామాగ్రి పంచారు. భరోసా ఇవ్వడానికి కొందరు ముందుకొచ్చారు. తోచిన సాయం చేసారు. అయినా లోలోపల భయం. సొంత ఊరు గుర్తొచ్చింది. తాము పుట్టిన ఊరన్నా ఆదుకుంటుందని, ఓదారుస్తుందని ఆశతో బయల్దేరారు. బస్సులు, రైళ్ళు, అన్నీ… అన్నీ బంద్.
నడకలు మొదలయ్యాయి. చంటిపిల్లలు, గర్భిణీ స్త్రీలు, వద్ధులు, నడివయసువాళ్ళు ఎటుచూసినా రోడ్లమీద నడుస్తూ కనిపించారు. వందల కిలోమీటర్ల దూరం. కొందరు రైలుపట్టాల మీద ముగిసిపోయారు. కొందరు తీరా ఊరుచేరే సమయానికి గుండె ఆగి, నడక చాలించారు. కాళ్ళు పగిలి రక్తసిక్తమైన పాదాలతో కొందరు. రైల్వేస్టేషన్లో చిన్నపిల్లాడు… చనిపోయిన తల్లిపై కప్పిన దుప్పటిని తీసి లేపడానికి ప్రయత్నిస్తున్న దశ్యం కలవరపరిచింది. కన్నీళ్లు పెట్టించింది. మధ్యలో టెంట్లు వేసి భోజనాలుపెట్టే ఏర్పాట్లు చేస్తే, నాలుగు ముద్దలు తిని ముందుకే కదిలారు. అంతటా నడక. ఆదేశ్ రవి పాటలోని కన్నీటి దశ్యమే అంతటా. మనిషి అసహాయుడై రోదించిన ఘట్టాలు. కొన్నాళ్ళకు కొందరు రవాణా ఏర్పాట్లు చేసారు. బస్సులు, ట్రాలీలు, వాహనాలు ఏర్పాటు చేసారు. ఫేస్‌బుక్‌లో, టీవీల్లో ఇవే రోజూ చూస్తూ గుండెను అరచేతిలో పెట్టుకుని బతికేసాం. మాకున్న పరిమితుల్లో, పరిధుల్లో మా ఏరియా చైతన్యపురిలో కొంత సాయం చేయగలిగాం. మా ఏరియాలో మూసీపక్కన గుడిసెలు వేసుకుని బతుకుతున్నవాళ్ళ పరిస్థితి దయనీయం. ఇళ్ళలో పనిచేసుకుంటూనో, రోజువారీ పనులకు వెళుతూనో గడిపే జీవితాలు వాళ్ళవి. ఆక్కడి పరిస్థితులు చూసి, అప్పటికే ఎల్.ఐ.సి ఉద్యోగుల సంఘంవారు చేస్తున్న సహాయక కార్యక్రమాలు తెలుసుకుని అందులో పనిచేస్తున్న ఆత్మీయ కవిమిత్రులు విల్సన్‌రావు గారిని సాయం కోసం అడిగాం. వెంటనే స్పందించారు. ఒక్కో ఇంటికి రెండువేల రూపాయల విలువచేసే వంటసరుకులను సుమారు వంద ఇళ్ళకు పంపిణీ చేసేట్లుగా చూసాం. అదొక తప్తి.
ఈ కరోనా అలజడిని ఎందరో సామాజిక మాధ్యమాల్లో అక్షరబద్ధం చేసారు. కవితలు రాసారు. తమ అనుభవాల్ని రాసారు. పాటలు రాసారు. పాడారు. వీడియోలు చేసి పెట్టారు. సాయపడ్డారు. సాయం చేయడానికి కొందరిని ప్రేరేపించారు. సమాయత్తం చేశారు. మానవహారంగా మనుషుల కోసం మనుషులు ఏర్పడ్డారు.
పుస్తకాలు, కవిత్వం
నా ఫీలింగ్స్‌ని చిన్ని కవితలుగా ఇదే కాలంలో రాసాను. ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసాను. లోపలి ఆందోళనకు, అలజడికి, ఘర్షణకు, అసహాయతకు అవి రూపాలు. వాటినన్నిటినీ ఈ మధ్యే ఒకచోట కలిపితే ఓ దీర్ఘకవిత రూపం వచ్చింది. పుస్తకాలు చదివాను. ఎప్పటినుంచో చదవనివి కొన్ని తిరగేశాను, ‘మా నాయిన బాలయ్య’ అందులో ఒకటి. చదువుకోసం పడిన కష్టాలు, మూడుతరాల ఘర్షణ, అంటరానితనపు వికతరూపం, అట్టడుగు జీవితాల వెనుకబాటుతనం – ఉద్వేగానికి గురిచేశాయి. ‘సత్యవతి కథలు’ ఈ కాలంలోనే చదివాను. సంక్లిష్టమైన జీవన పోరాటంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్న స్త్రీల ఆరాట పోరాటాలూ, విజయాలు, వైఫల్యాలూ ఈ కథల్లో చిత్రించబడ్డాయి. సత్యవతిగారి రచనా ప్రత్యేకత ఏమిటో మరింతగా బోధపడింది. శారదా శివపురపు ‘భారతీయ రచయిత్రులు’ మరొకసారి అలా తిరగేశాను. రచయిత్రుల గురించిన మంచి సమాచారం ఇందులో ఉంది. కుప్పిలి పద్మ సంపాదకత్వంలో వచ్చిన ‘మీ టూ’ పుస్తకంలోని కథలు చదివాను. కొత్త కథకులు ఆశ్చర్యపరిచారు. కడలి ‘ప్రేమలేఖలు’లోని ఆ ఫ్రెష్నెస్ నచ్చింది. శ్రీసుధ మోదుగు కథలసంపుటి ‘రెక్కల పిల్ల’లో కొన్ని కథలు చదివాను. చిక్కని కథలు. ఇక కవితాసంపుటులు – ఆకెళ్ళ రవిప్రకాష్ ‘భూమి పుట్టినరోజు’, దేశరాజు ‘దుర్గాపురం రోడ్’, కోడూరి విజయకుమార్ ‘రేగుపండ్ల చెట్టు’, నరేష్కుమార్ సూఫీ ‘నిశ్శబ్ద’, బిల్ల మహేందర్ ‘తను నేను వాక్యం’, అనిల్ డాని ‘స్పెల్లింగ్ మిస్టేక్’, విజయకుమార్ ఎస్వీకే ‘చిట్టచివరి వాన’, విజయ్ కోగంటి ‘ఒక ఆదివారం సాయంత్రం’, కె.శ్రీకాంత్ ‘శ్రీకాంత్’, మధ్యమధ్యలో దీవి సుబ్బారావు గారి అనువాదం ‘చైనా కవిత్వం’ – ఇవి అడపాదడపా ఈ కాలంలోనే చదివినవి.
‘నెచ్చెలి’ అంతర్జాల పత్రిక కోసం రెగ్యులర్‌గా రాసే ‘కొత్త అడుగులు’ కాలమ్ కోసం ఇటీవలే చనిపోయిన నండూరి జ్యోతి గురించి రాసాను. చనిపోవడం అనే విషయాన్ని గురించి రాయడానికి మనసు అంగీకరించలేదు. చాలా ఉద్వేగానికి గురయ్యాను. విజయవాడ సాహితీమిత్రులు నిర్వహించిన ‘జూమ్ కవి సమ్మేళనం’లో, కేంద్ర సాహిత్య అకాడమీ నిర్వహించిన ‘నారీచేతన’ వీడియో కవిసమ్మేళనంలో మందరపు హైమవతి, షాజహానా, కుంజ కల్యాణిలతోపాటుగా పాల్గొన్నాను. కవిసంగమం నిర్వహించిన ‘జూమ్ యువకవి సంగమం’లో పరోక్షంగా పాల్గొన్నాను.
సినిమాలు
ఎటూ కదలలేని పరిస్థితి. పుస్తకాలూ ఎంతసేపని చదవగలం. వార్తల కోసం టి.వి చూడడం… బెంబేలు పడిపోవడం. చానెల్స్ మార్చుకుంటూ సినిమాలు చూడటం. హిందీ సినిమాలు ఎక్కువే చూసాను. టాయిలెట్, సుయీ దాగా, సూపర్ 30, సీక్రెట్ సూపర్ స్టార్, స్త్రీ, రేప్‌డ్, ఫస్ గయేరే ఒబామా, బేగం జాన్, తుమ్హారీ సులు, షాదీ మే జరూర్ ఆనా, మిస్ తనక్ పూర్ హాజిర్ హో, మిషన్ మంగళ్, ముల్క్, ప్యాడ్ మేన్ ఇంకా… టైటానిక్, ఎం.ఎస్.ధోని – అన్ టోల్డ్ స్టొరీ వంటి సినిమాలు (కొన్ని సినిమాల పేర్లు గుర్తుకురావడం లేదు) చూసాను. రెగ్యులర్ సినిమాలకు సమాంతరంగా జీవితానికి దగ్గరిగా ఉండే ప్రత్యామ్నాయ సినిమాల గురించి తెలుసుకునే అవకాశం ఈ కాలంలో చిక్కింది.
… … …
కరోనా సష్టించిన ఈ గందరగోళంలో ఒకవైపు ఇక్కడి ఆందోళన. మరోవైపు అమెరికాలో ఈ కాలంలోనే పెద్ద కోడలు డెలివరీ ఉండటం, పెద్దవాళ్ళు ఎవరూ తోడులేకుండానే డెలివరీ జరగడం, మా చినబాబు వాళ్ళు గోవాకు పనుల కోసం వెళ్లి అక్కడే లాక్‌డౌన్‌లో మూడునెలలు చిక్కుపడిపోవడం. ఆ సమయంలో అన్పించింది – మన జీవితాలు, మనం అనుకునే పనులు మనం అనుకున్నట్లుగానే జరగవని. ఒక టెన్షన్. దుఃఖం. ఏమీ చేయలేని అశక్తత ఆవరించిన రోజులు. మనం వెళ్ళలేం. వాళ్ళు రాలేరు. ఈ పరిస్థితులు దాటి కొంచెం ఇప్పుడిప్పుడే మానసికంగా నిమ్మళమయ్యాను. ఇంకా కరోనా ఉంది. పాక్షికంగా లాక్‌డౌన్ ఉంది. కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ఎవరం ఎలా ఉంటామో, ఎప్పుడు ఏం ముంచుకొస్తుందో తెలియని స్థితిలో సాగుతున్నాం.
ఈ లాక్‌డౌన్ డైరీ రాయాలని ముందు అనుకోలేదు. నిజానికి ఈ సీరీస్ యాకూబ్ ప్రారంభించాడు. అప్పట్నుంచి ఇది చెయిన్ లాగా ఒకరి తర్వాత ఒకరుగా సాగుతోంది. అన్నీ రెగ్యులర్‌గా చదువుతూనే ఉన్నాను. కానీ మెర్సీ మార్గరెట్ దగ్గర మళ్ళీ నాపేరు నామినేట్ అవుతుందని ఊహించలేదు.