చరిత్రకెక్కని వీర వనిత టి.ఎన్‌.సదాలక్ష్మి – సిలపాక వెంకటాద్రి

చరిత్ర ఎప్పుడూ త్యాగాలమీదే పురుడు పోసుకుంటుంది. ఆ త్యాగాల నేల మీద చిందిన రక్తపు ఆనవాళ్ళు ప్రతిక్షణం తిరుగుబాటు సంకేతాన్ని ఎగురవేస్తూనే ఉంటాయి. అలా దళితుల త్యాగాల మీద పునాదులు వేసుకొన్న దొరల సర్కారు దళితుల పోరాటాలు, త్యాగాలు చరిత్రకెక్కకుండా కుట్ర చేశాయి. దళితుల అభివృద్ధి కోసం ఎన్నో ఉద్యమాలు చేసి చివరి శ్వాస వరకు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తపించిన వ్యక్తి టి.ఎన్‌.సదాలక్ష్మి. సదాలక్ష్మి గారిపై కూడా ఇలాంటి ధోరణినే అవలంబిస్తూ తెలంగాణ ద్రోహులకు ప్రముఖ స్థానాన్ని కల్పించడంలో తలమునకలవుతూ అసలు తెలంగాణ పోరాట యోధులను, వీరవనితలను మరిచిపోవడం వివక్షతా పాలనను తలపిస్తుంది.

నిజాం నియంతృత్వ పాలన ఒకవైపు, మరో పక్క నిచ్చెన మెట్ల కులవ్యవస్థలో రోజు రోజుకు పడగలు విప్పుతున్న విషవలయపు కులవివక్షతో దళితులు, అణగారిన వర్గాలు మరింతగా అణచివేయబడుతూ అంటరానితనానికి గురవుతూ బానిసలుగా బతుకుతున్న కాలమది. ఈ సమయంలో హైదరాబాద్‌ కేంద్ర బిందువుగా అనేక సామాజిక ఉద్యమాలు జరుగుతున్నాయి. ఈ సమయంలోనే 1928 జనవరి 25వ తేదీన కొండయ్య, కర్రె గోపమ్మ దంపతులకు ఏడవ సంతానంగా మాదిగ ఉపకులమైన మెహతర్‌ కులంలో జన్మించింది సదాలక్ష్మి. దళిత ఉద్యమ చరిత్రలో ఈ కాలం ‘రాడికల్‌ పీరియడ్‌ ఆఫ్‌ దళిత్‌’గా పేరొందింది.

సదాలక్ష్మి కుటుంబం పట్టణ ప్రాంతంలో ఉండడం వల్ల సామాజిక గౌరవం, ఆర్థికాభివృద్ధి, విద్య యొక్క ప్రాధాన్యతను ఎరిగిన కుటుంబం కావడంతో వీరి ప్రధాన వృత్తయిన పాకి పనితో పాటు అనేక రకాల కూలి పనులు చేస్తూ కుల, ఆర్థిక సంఘర్షణలు ఎదురైనప్పటికీ సదాలక్ష్మిని ఆమె తల్లిదండ్రులు చెన్నైలోని ప్రముఖ విద్యాసంస్థలో ఉన్నత చదువులు చదివించారు. బాల్యంలో సదాలక్ష్మి జీవితంలో ఒక అరుదైన సంఘటన జరిగింది. సరిగ్గా స్వాతంత్య్రానికి మూడు సంవత్సరాల ముందు 1944 సెప్టెంబర్‌లో ‘షెడ్యూల్డ్‌ కాస్ట్‌ ఫెడరేషన్‌’, ‘హైదరాబాద్‌ డిప్రెస్డ్‌ క్లాసెస్‌ అసోసియేషన్‌’ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో డా||బి.ఆర్‌.అంబేద్కర్‌ ప్రసంగం సదాలక్ష్మి జీవితాన్ని విపరీతంగా ప్రభావితం చేసింది. అత్యంత పేద కుటుంబంలో పుట్టి ఎటువంటి రాజకీయ నేపథ్యం లేకుండా తన అంకిత భావం, విద్యార్హతలతో, స్వయం కృషితో కాంగ్రెస్‌ పార్టీలో ప్రముఖ నాయకురాలిగా ఎదిగి 1957లో కామారెడ్డి నుండి, 1962లో నిజామాబాద్‌ జిల్లా ఎల్లారెడ్డి నుండి రెండు దఫాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1960లో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా, 1963లో మహిళా మంత్రిగా, ఎమ్మెల్సీగా బడుగు, బలహీన వర్గాల వికాసానికి కృషి చేశారు. అదే సమయంలో జాతీయ నాయకుడిగా ఉన్నటువంటి బాబు జగ్జీవన్‌రాంతో కలిసి దేశవ్యాప్తంగా ఉన్న దళితుల కోసం కూడా పనిచేశారు.

సదాలక్ష్మి గారి జీవితం ప్రతి క్షణం పోరాటమయమే. సమాజంలో ఉన్నటువంటి బడుగు, బలహీన వర్గాల సమస్యలు మరియు తెలంగాణలో అడుగడుగునా అణచివేయబడుతున్న దళిత జాతి సమస్యలతో పాటు వారి ఔన్నత్యానికి పోరాటాలు జరిపే సందర్భంలో కులపరమైన, సామాజిక పరమైన విక్షతతో పాటు పురుషాహంకారపు వివక్షను కూడా తీవ్రంగా ఎదుర్కొన్నారు. అయినా అవమానాన్ని, ఆవేదనను లెక్కచేయకుండా తన చిరునవ్వుతోనే అన్ని సమస్యలను పరిష్కరించడం తన పోరాట పటిమ, స్త్రీ ఔదార్యంతో పాటు మాతృమూర్తిత్వానికి కొలమానాలు. ఆంధ్ర వలస పాలనలో నేలంతా తెలంగాణ నినాదంతో వేడెక్కుతోంది. అదరి గొంతులోంచి ధ్వనించే మాటొక్కటే జై తెలంగాణ, జై తెలంగాణ. తరాల తండ్లాట. ఎక్కడ చూసినా వలస బతుకుల కన్నీండ్ల కొట్లాటే. బిగిసిన పిడికిళ్ళకు నిర్ద్వంద్వపు సంకెళ్ళు చుట్టుముడుతూ ఉమ్మడి రాష్ట్రంలో దొరలు దోపిడీదారులే పాలకులై పెద్ద మనుషుల ఒప్పందాన్ని తుంగలో తొక్కి, నీళ్ళను మళ్ళించి నిరుద్యోగాన్ని పెంచి పోషించి, ఎండిన చెరువులన్నీ రైతన్నను ఎక్కిరిస్తుంటే, గుక్కెడు నీళ్ళు లేక గొంతెండిపోయి, కాలిన కడుపులు అన్నం మెతుకుల కోసం ఆరాటపడుతూ ప్రతి ఒక్కరూ పోరాటబాటవైపు అడుగులు వేస్తున్నారు. సీమాంధ్ర సర్కారు తూటాల కంచెలు వేస్తుంటే తమ ప్రాణాలను అర్పిస్తూ ఉద్యమానికి ఊపిరి పోసిన తొలి దశ ఉద్యమానికి తన వంతు గొంతుకగా గర్జించి అందరి గొంతుకగా నిలిచిన సదాలక్ష్మి గారు తెలంగాణ తొలి దశ పోరాటంలో ప్రధాన పాత్రను పోషించారు. తెలంగాణ రాష్ట్ర సాధనను మొదటినుంచి కాంక్షించిన అసలు తెలంగాణ వాది సదాలక్ష్మి. పైగా వేల సంవత్సరాలుగా అణచివేతకు, అంటరానితనానికి గురవుతూ దళితులకు బానిసత్వాన్నే పౌరసత్వంగా ఆపాదిస్తున్న ఆధిపత్య అగ్ర కుల అహంకారానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం బాల్యం నుంచి అలవాటు కావడంతో తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడపడంలో తన వంతు ముఖ్య పాత్ర పోషించారు. స్త్రీ తెగింపును, పోరాటాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు.

1968లో అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి లావాలా విస్తరిస్తున్న తెలంగాణ పోరాటాన్ని అణచివేయడానికి ఉద్యమంలో భాగస్వామ్యం అవుతున్న విద్యార్థి నాయకులు, ఉద్యమకారులపై విచక్షణా రహితంగా దాడులు జరుపుతున్న సమయంలో ఒక అధికార పార్టీ నాయకురాలు అయ్యుండి కూడా పార్టీ అవలంబించే కఠిన నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఆ ఉద్యమంలో పనిచేస్తున్న విద్యార్థులతో కలిసి

ఉద్యమాన్ని ఉధృతం చేయడంతో పాటు ఉద్యమ కార్యాచరణ రూపొందించి విద్యార్థులతో కలిపి ప్రజలలో తిరుగుతూ తెలంగాణ రాష్ట్ర సాధనపై అవగాహన కల్పిస్తూ ఆంధ్ర పాలక దురాగతాలను ఎండగడుతూ ప్రజలందరిలో తెలంగాణ ఉద్యమ పోరాట స్ఫూర్తిని, చైతన్యాన్ని నింపారు. ఈ క్రమంలోనే ‘తెలంగాణ ప్రజా సమితి (టి.పి.ఎస్‌.)’ని స్థాపించడం దానికి ఛైర్మన్‌గా మదన్‌మోహన్‌ను నియమించడం తెలంగాణ పోరాటంలో ఒక ముఖ్య ఘట్టంగా చెప్పుకోవచ్చు.

1969 ఉద్యమంలో ముఖ్య భూమికను పోషిస్తూ తెలంగాణ ప్రాంతాన్నంతా తిరుగుతూ ప్రజాప్రతినిధుల నుంచి సామాన్య కార్యకర్తల వరకు ప్రతి ఒక్కరిని తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములను చేస్తూ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళడంలో నైతిక మద్దతును కూడగట్టడంలో తన శక్తికి మించిన కృషి చేయడం అనేది కేవలం సదాలక్ష్మిగారికే చెందింది. తెలంగాణ ఉద్యమంలో భాగంగా మే 27న సదాలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన సత్యాగ్రహం, మానవహారం లాంటి వివిధ కార్యక్రమాలన్నింటినీ ప్రభుత్వం భగ్నం చేసి అందులో పాల్గొన్న వారందరినీ అరెస్ట్‌ చేసి జైలుకు పంపడం జరిగింది. తెలంగాణ అంతటా అట్టుడుకుతున్న ఉద్యమ ఉధృతి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కుదిపేసింది. ఆ సమయంలో హైదరాబాద్‌కు హుటాహుటిన చేరుకున్న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీకి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవసరాన్ని వివరించడంలో సదాలక్ష్మి కీలక పాత్ర వహించారు. ప్రజలంతా తెలంగాణ ఉద్యమాన్ని సదాలక్ష్మి గారి ఆధ్వర్యంలో శాంతియుతంగా చేస్తున్న క్రమంలో తెలంగాణా ప్రజా సమితి (టి.పి.ఎస్‌.) అధ్యక్షతతో పాటు ఉద్యమ వర్గాలను చెన్నారెడ్డికి అప్పగిస్తే చెన్నారెడ్డి విశాలాంధ్ర మద్దతుదారుడిగా నిర్ణయం తీసుకోవడమే కాకుండా కొంతమంది విద్యార్థులు చనిపోవడం సదాలక్ష్మి గారిని తీవ్రంగా కలచివేసింది. నిజానికి చెన్నారెడ్డికి ముందువరకు కూడా తెలంగాణ ప్రజా సమితి (టి.పి.ఎస్‌)లో కీలక పాత్ర పోషిస్తూ తెలంగాణ ఉద్యమాన్ని సదాలక్ష్మి నడిపించడం విశేషం. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే సదాలక్ష్మి గారిని కాదని ఉద్యమ నాయకత్వం బాధ్యతలు చెన్నారెడ్డికి అప్పగించడం అనేది ఒక దళిత స్త్రీ నాయకత్వాన్ని జీర్ణించుకోలేని అగ్ర కులాల అహంకార స్వభావం చాలా స్పష్టంగా కనిపిస్తుంది.

అంతేకాకుండా అగ్రకుల తెలంగాణ నాయకత్వం వారి స్వప్రయోజనాల కోసం వివిధ రకాలుగా ఉద్యమాన్ని నీరుగార్చి ఆంధ్ర వలస పాలకుల పంచన చేరి తెలంగాణ వ్యాప్తంగా 369 విద్యార్థి

ఉద్యమకారుల బలికి కారణమయ్యారు. అందుకే సదాలక్ష్మి గారు ఎప్పడూ అనే విషయం ఏమిటంటే ఇక్కడ దొరలకు కావలసింది తెలంగాణ రాష్ట్రం ఒక్కటే కాదు, ఆర్థిక వనరుల దోపిడీ. అంతేకానీ బడుగు, బలహీన వర్గాల ఆశలు, ఆశయాలు, అభివృద్ధి వారికి అవసరం లేదు కాబట్టి మనం సామాజిక తెలంగాణ కోసం పోరాడాల్సిన అవసరం ఉందనే విషయం తరచూ చెబుతుండేవారు.

తెలంగాణ రాష్ట్ర సాధనకు జరిగిన పోరాటం ఒక పర్యాయమయితే దళిత ఆత్మగౌరవ పోరాట అస్తిత్వ పోరాటం మరొక పర్యాయంగా చెప్పవచ్చు. తెలంగాణ ఉద్యమంలాగే దళిత ఆత్మగౌరవ పోరాటాలు అంతే ప్రాధాన్యతను సంతరించుకోవడం విశేషం. సదాలక్ష్మి ప్రత్యక్ష రాజకీయాలలో క్రియాశీలంగా

ఉంటూనే దళిత ఆత్మగౌరవ అస్తిత్వ పోరాటాలలో మాల మాదిగల (మామాల)తో కలిసి పాల్గొనేవారు. మాదిగ అస్తిత్వ రాజకీయాలలో భాగంగా తన గురువైనటువంటి ముదిగొండ లక్ష్మయ్య (ఈయన ఆ రోజుల్లో ‘అరుంధతీయ మతంగ మహాసభ’కు నాయకత్వం వహించారు) గారి ప్రేరణతో దక్షిణ భారత మాదిగ ఉద్యమాన్ని నిర్మించి దానికి చారిత్రక ప్రాధాన్యతను కల్పించిన వారిలో సదాలక్ష్మి ప్రముఖులు. డా||బి.ఆర్‌.అంబేద్కర్‌ హిందూ ధర్మానికి, బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా జరిపిన నిరతంతర పోరాటాల ఫలితంగా సాధించి పెట్టిన ఎస్‌.సి. రిజర్వేషన్‌ ద్వారా దళిత జాతి అభివృద్ధి వైపు అడుగు వేస్తుందనుకున్నారు, కానీ రిజర్వేషన్‌ ఫలాలు కేవలం ఒక సామాజిక వర్గం అనుభవించడం, దళితులలో పీడితులుగా ఉన్నటువంటి మాదిగ, మాదిగ ఉపకులాలను మరింత వెనుకబాటు తనానికి గురిచేయడం సదాలక్ష్మిగారిని ఆవేదనకు గురిచేసింది. దాంతో దండోరా ఉద్యమానికి అడుగులు వేశారు.

మాదిగ జాతి వెనుకబాటు తనాన్ని గుర్తించిన సదాలక్ష్మి ఎస్సీ రిజర్వేషన్‌ హేతుబద్దీకరణ, ఆవశ్యకతను తెలుపుతూ 1972లో అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావుకి రిజర్వేషన్‌ హేతుబద్దీకరణ మెమొరాండమ్‌ ఇవ్వడంతో పాటు వర్గీకరణపై దళిత జాతికి అవగాహన కల్పించడంలో కొంత విజయం సాధించారు. 1992లో నిజాం కాలేజ్‌ గ్రౌండ్స్‌లో జరిగిన ‘ఆది జాంబవ అరుంధతి సభ’ నుంచి అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర రెడ్డిని వర్గీకరణ చేయాల్సిందిగా కోరారు. తర్వాతి కాలంలో దండోరా ఉద్యమాన్ని నిర్మించడం అప్పుడు యువకులుగా ఉన్నటువంటి కృష్ణ మాదిగ, కృపాకర్‌ మాదిగలతో

ఉద్యమ ప్రణాళికను రూపొందించడంతో పాటు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యమానికి కావలసిన ఆర్థిక, సామాజిక మద్దతును కూడగడుతూ యావత్తు మాదిగ జాతికి పెద్ద దిక్కుగా నిలిచారు. ఎస్సీ వర్గీకరణ

ఉద్యమానికి కేంద్ర బిందువుగా నిలిచినటువంటి సదాలక్ష్మి ఇంటినుంచే అనేక దళిత ఉద్యమాలు జీవం పోసుకున్నాయి. అందులో భాగంగానే అగ్ర కుల దౌర్జన్యంతో మాదిగ నెత్తురు నేల చిందింది. కారంచేడు ఉద్యమానికి దగ్గరగా ఉన్న ప్రకాశం జిల్లా ఈదుముడిలో 1994 జులై 7వ తేదీన ఎమ్మార్పీయస్‌ స్థాపించడం జరిగింది. సదాలక్ష్మి గారు అనేక ఉపన్యాసాలలో వర్గీకరణ అంశంపై మాట్లాడుతూ ‘వర్గీకరణ అనేది కులాల మధ్య విభజన కాదు. యావత్తు ఎస్సీలో ఉన్న 59 కులాల సామాజిక, ఆర్థిక, రాజకీయాభివృద్ధికి పునాదిలాంటిది. రిజర్వేషన్లు అనేవి ఏ ఒక్క వర్గానికో లేదా ఏ ఒక్క కులానికో పరిమితం కావు. అవి 59 కులాలకు చెందినా ఆ హక్కులు అందరికీ సమానంగా దక్కాలి. అప్పుడే ఎస్సీలో ఉన్న అన్ని కులాలు, ఉపకులాలకు విద్య, ఉద్యోగాల్లో సమన్యాయం జరగడంతో పాటు వారు సామాజికంగా, ఆర్ధికంగా, రాజకీయంగా ఎదిగే అవకాశం ఉంటుంది. అందుకోసమే దళిత జాతి సమన్యాయం, సమానాభివృద్ధి కోసం మన దళితులంతా వర్గీకరణ (హేతుబద్ధీకరణ)కు మద్దతు ఇవ్వడం ద్వారా నిజమైన అంబేద్కర్‌ వాదులుగా, వారసులుగా చరిత్రలో నిలిచిపోతాం’.

దళిత ఉద్యమం, తెలంగాణ ఉద్యమం, స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలు, మానభంగాలే కాక గ్రామాలను పట్టి పీడిస్తున్న సారా వ్యతిరేక ఉద్యమం లాంటి ప్రజాస్వామిక పోరాటాల్లో ప్రత్యక్షమై ప్రజల తరపున గర్జించిన గొంతుక సదాలక్ష్మి. తన పట్టుదలతో, తెగింపుతో దళిత జాతికి, స్త్రీ జాతికి ఒక కొత్త చైతన్యాన్ని నూరిపోస్తూ, స్త్రీ వాద ఉద్యమాలకు పునాదులు వేశారు. 1940 నుంచి నేటి తెలంగాణ రాష్ట్ర సాధన వరకు జరిగిన ఏ పోరాట చరిత్ర గురించి చెప్పుకున్నా సరే సదాలక్ష్మి గారి త్యాగాలను, పోరాటాలను ప్రస్తావించకుండా చరిత్ర గురించి చర్చించడమంటే ఆ చరిత్ర, చరిత్ర అనిపించుకోదు. అనుక్షణం ఉద్యమాలే ఆయువుగా గడిపిన సదాలక్ష్మి గారిది అరుదైన వ్యక్తిత్వం. మార్పు కోసం జరిగిన ప్రతి పోరాటంలో పదవుల కోసం కాకుండా ప్రజల క్షేమం కోసం ప్రజా ఉద్యమాలలో ఆమె భాగస్వామ్యం అయ్యారు. అందులో భాగంగానే దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో దేవుడు అందరికీ సమానం అయినప్పుడు అవకాశాలు కూడా సమానంగా కల్పించాలి అనే నినాదంతో దేవాలయ ప్రధాన అర్చకులలో దళితులకు కూడా అవకాశంతో పాటు సహపంక్తి భోజనం లాంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా అమలుకు కృషి చేశారు.

తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర సాధన కోసం గానీ మరే ఇతర సామాజిక ఉద్యమాలతో కానీ ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఎటువంటి పాత్ర వహించని వారికి పట్టం గడుతూ సదాలక్ష్మి చరిత్రను మరుగున పడేసే ప్రయత్నం చేస్తోంది. అయినా కూడా ప్రభుత్వంలో, ప్రతిపక్షంలో ఉన్నటువంటి దళిత ప్రజా ప్రతినిధులు కూడా సదాలక్ష్మి గారి పోరాట స్ఫూర్తిని గురించకపోవడం బాధాకరమైన విషయం. సదాలక్ష్మి ఉద్యమాలు తెలంగాణకు మాత్రమే పరిమితం కాలేదు. సదాలక్ష్మి చేసిన అనేక దళిత, సామాజిక, స్త్రీ వాద ఉద్యమాలు మిగతా రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు మహారాష్ట్ర మొదలైన ప్రాంతాలకు కూడా తన పోరాట స్ఫూర్తిని నిలిపింది. తెలంగాణ పోరాట వీరత్వానికి, స్త్రీ చైతన్యానికి ప్రతీకగా నిలిచిన వీరవనిత సదాలక్ష్మి తన కుటుంబాన్ని కూడా పక్కకుపెట్టి నిమ్న వర్గాల సామాజిక శ్రేయస్సు కోసం నిరంతరం పాటు పడింది. అన్ని వర్గాల ప్రజల కోసం పోరాడినటువంటి జాతీయ స్థాయి నాయకురాలైన టి.ఎన్‌.సదాలక్ష్మి గారిని కేవలం దళిత జాతి నాయకురాలుగా మాత్రమే గుర్తించడం అనేది అగ్రకుల అహంకారానికి అద్దం పడుతుంది.

బంగారు తెలంగాణ అంటూ అందరినీ మభ్య పెడుతున్న తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు బంగారు భవిష్యత్తు ఇస్తుందో లేదో తెలియదు కానీ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమంలో జైలుకెళ్ళిన విద్యార్థి నాయకులను రక్షించడం కోసం తన వద్ద ఉన్న వెండి సామగ్రి, వెండి బాసండ్లతో పాటు ఆస్తి పాస్తులను సైతం అమ్మి తెలంగాణ ఉద్యమాన్ని బ్రతికించిన సదాలక్ష్మి గారిని ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం గుర్తించి సదాలక్ష్మి జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలి. విజ్ఞాన కేంద్రాలతో పాటు భవిష్యత్‌ తరాలకు ఆదర్శంగా ఉండేందుకు విగ్రహాలను ప్రతిష్టించడం ద్వారా ఆమె త్యాగాలను గుర్తించిన వారమవుతాము. సదాలక్ష్మి గారి జయంతి, వర్థంతి లాంటి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించడం తెలంగాణ ప్రభుత్వ నైతిక బాధ్యత. 60 ఏండ్ల రాష్ట్ర సాధన కల నెరవేరిన సందర్భంలో సామాజిక ఉద్యమాలకు చిహ్నంగా నిలిచిన సదాలక్ష్మి గారిని సదా స్మరించుకుందాం.

(జులై 24 టి.ఎన్‌.సదాలక్ష్మి గారి వర్థంతి సందర్భంగా నాలుగు సంవత్సరాల క్రితం నాటి వ్యాసం)

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.