నాలుగ్గోడల నడుమ…. దేవి

”ప్రభుత్వం వెనువెంటనే చర్యలు తీసుకోకపోతే రానున్న తరంపై విధ్వంసకర ప్రభావం పడుతుంది.” బ్రిటిష్‌ పార్లమెంట్‌ సభ్యుడు లాక్‌డౌన్‌ జరిగిన రెండు వారాల్లోగా చేసిన ఈ వ్యాఖ్య కరోనా గురించో విద్య గురించో కాదు. పెరుగుతున్న గృహ హింసపై అతని ఆందోళన ఇది. ఏప్రిల్‌ మొదటి వారంలో ఒక్క లండన్‌ నగరంలోనే గృహ హింసకు సంబంధించి నాలుగు వేల అరెస్టులు జరిగాయి. షెల్టర్‌హోంలు నిండిపోయాయి. కొత్త షెల్టర్‌ హోంల ఏర్పాటు అవసరమయింది.

బ్రిటన్‌ ప్రభుత్వం కరోనా వ్యాప్తిని అరికట్టడంలో నిమగ్నమై ఉన్నాగానీ ప్రతిపక్షాలతో కలిపి హౌస్‌ కమిటీ వేసింది. ఆరు నెలల లాక్‌డౌన్‌ కాలంలో గృహ హింస, స్త్రీలపై జరిగే నేరాల నివారణ-సాంత్వన కోసం 75 మిలియన్‌ పౌండ్లను కేటాయించింది. స్వచ్ఛంద సంస్థలు, పోలీసులు, న్యాయ వ్యవస్థ కరోనా ప్రత్యేక పరిస్థితిలో స్త్రీలకు సహాయం చేయడానికి కొత్త పద్ధతుల అన్వేషణకు దిగారు.

జెండర్‌ ఇండెక్స్‌లో మొదటి పాతిక స్థానాల్లో ఉన్న యూరోప్‌ దేశాలు క్యూబా, వియత్నాం, కొరియా, న్యూజీలాండ్‌, ఆస్ట్రేలియా దేశాలు లాక్‌డౌన్‌ సందర్భంలో స్త్రీలు, పిల్లలపై జరిగే హింసపై సత్వరం స్పందించాయి, ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. హెల్ప్‌లైన్లలో 49 శాతం పెరుగుదల గమనించగానే అత్యవసర నిధులు, యంత్రాంగం సమకూర్చాయి.

”మీరు ఒంటరిగా లేరు” (యు ఆర్‌ నాట్‌ ఎలోన్‌) అనే క్యాంపెయిన్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేశారు. కిరాణా షాపుల్లో, మాల్స్‌లో, మెడికల్‌ దుకాణాల్లో ప్రత్యేక కోడ్‌ పదాలు ఇచ్చారు. ఆ పదం వాడితే ఆ స్త్రీని కాపాడే బాధ్యత రక్షణ యంత్రాంగం తీసుకుంటుంది.

”ఇది సన్నిహిత ఉగ్రవాదం (ఇంటిమేట్‌ టెర్రరిజం). కరోనా సంక్షోభం లోపల ఇది మరొక సంక్షోభం. రెండింటినీ ఒకేసారి ఎదుర్కోక తప్పదు. గృహహింస సంక్షోభాన్ని వాయిదా వేయలేం” అని ఐక్యరాజ్య సమితి పేర్కొంది.

మూడు నెలల పాటు లాక్‌డౌన్‌లో ప్రపంచవ్యాప్తంగా అదనంగా ఐదు కోట్ల గృహహింస కేసులు నమోదయ్యాయి. లాక్‌డౌన్‌ ఏడాది కొనసాగితే ఇంకా అదనంగా 6.5 కోట్ల కేసులు వస్తాయని జాన్‌ హాప్‌కిన్స్‌ యూనివర్శిటీ (యుఎస్‌ఎ), విక్టోరియా యూనివర్శిటీ (ఆస్ట్రేలియా), ఐక్యరాజ్యసమితి జనాభా నిఘా సంస్థ (పిఆర్‌ఎ) అంచనా వేశాయి.

స్త్రీలు ఇంటిలో బందీలైపోయారు. వారూ బయటకు వెళ్ళరు, భర్తలు కూడా వెళ్ళే పరిస్థితి లేదు. అప్పటికే హింస గల కుటుంబాల్లో ఫోన్ల వైర్లు కత్తిరించారు. ఫోన్లు పగులగొట్టారు. సామాజిక మాధ్యమాల యాప్‌లను తొలగించారు. కంప్యూటర్‌లు హ్యాక్‌ అయ్యాయి. 24 గంటలూ నిఘా నీడలో బితుకు బితుకు మంటూ బతకడం…

బయట ఉద్యోగాలు చేస్తూ, మిత్రుల్ని, సహోద్యోగుల్ని కలుస్తూ వివిధ వ్యాపకాల్లో ఉండి భార్యను హింసించే పని వాయిదా పడడం లేదా సమయం తక్కువ గడపడం వల్ల తీవ్రత తగ్గడం సాధారణంగా జరిగేది. ఉద్యోగాలు చేసే స్త్రీలు, బయట ఉపాధి గల స్త్రీలు ఇంటినుండి బయటపడడం, తోటి వాళ్ళతో మాట్లాడడం, చెప్పుకోవడం, అవసరమైతే ఇంతో అంతో సహాయం పొందగలననే కాస్తంత ధైర్యం ఉండేది. ఇంట్లోనే ఉండే స్త్రీలకయితే భర్త బయటకు వెళ్ళిన సమయం ఊరట కాలం. లాక్‌డౌన్‌లో ఇవేం లేకుండా భార్యాభర్తలు పూర్తిగా ఇంట్లోనే గడపడంతో ఉద్రిక్తతలు, భయాందోళనలను పెంచింది. హింస స్థాయి తీవ్రమయ్యింది.

ఖాళీగా ఉండడం… ఇంట్లో అందరూ ఉండడం… అందరికీ సేవలు చేయడం, వండి పెట్టడం.. ఇంటి పనిభారం స్త్రీలకు విపరీతమైంది. ఇంటి పని పంచుకునే అలవాటు, పిల్లల సేవ చేసే భర్తలు భారతదేశంలో చాలా తక్కువ. ఇంట్లోనే ఉండి ఏమీ తోచక బయటకు వెళ్ళే దారిలేక పిల్లలు అల్లరి చేయడం సహజమే. వారి ఆటలు, శబ్దాలు పెద్దల కోపానికి, అసహనానికి కారణమై పిల్లలపై భౌతిక, మానసిక హింస పెరగడం అనివార్యం. లేదా పెద్దల మధ్య ఉద్రిక్తతలు పిల్లలపై తీర్చుకోవడం కూడా జరగవచ్చు.

వంట రుచిగా ఉండటం చాలదు వెరైటీగా కావాలి. కాలక్షేపం కోసం అనేకసార్లు కావాలి. సామాజిక మాధ్యమాలు టి.వి… ప్రత్యేకించి పోర్న్‌ చూడడంతో పిచ్చెక్కించే కోరికలు… ఉన్న ఒక్క గది లేదా రెండు గదుల ఇళ్ళల్లో (దేశంలో 60 శాతం మందికి పైగా) అనుకున్నప్పుడల్లా ఏకాంతం లభించదు… ఈ తాపాన్ని, కసిని భార్యాపిల్లలపై చూపడం వేరేవిధంగా…

మద్యం అకస్మాత్తుగా ఆగిపోయింది. విత్‌డ్రాయల్‌ లక్షణాల గురించి స్త్రీలకు తెలియదు. నిస్త్రాణం… కోపం, నిరాశ నిస్పృహ, డిప్రెషన్‌ అన్ని లక్షణాలు ఉంటాయి. డీ-ఎడిక్షన్‌ సెంటర్ల గురించి సమాచారం గాని, ప్రచారం గాని లేదు. అసలు విత్‌డ్రాయల్‌ లక్షణాలు ఉంటాయనే ఎక్కువమందికి తెలియదు. ”మందు” దొరకని కసి కూడా ఇంటామెపైనే చూపడం..

వీటన్నింటి కంటే ముఖ్యంగా ఇంటి ఆదాయం అనుకోకుండా తగ్గిపోవడం… ప్రభుత్యోద్యోగులు 50 శాతం జీతం పొందగా 86 శాతం చిరుద్యోగులు, అసంఘటిత కార్మికులు ఉపాధి కోల్పోయారు. ప్రైవేటు రంగం భారీగా ఉద్యోగాలు తీసేసింది. ప్రతి చిన్న అవసరానికి కటకట… సరుకులు దొరకవన్న అభద్రత… ఉపాధి దొరకదని భయం. అసలు కరోనా మహమ్మారికి బలయిపోతామేమోనన్న (టివిల పుణ్యమాని) భీతి.. వీటిని ఎవరితో పంచుకోవాలి? ఎవరు ఓదార్చుతారు. దీనికితోడు అంతో ఇంతో సంపాదించే భార్య ఉపాధి కోల్పోతే ఇక ఆ ఇంట్లో

ఉద్వేగాలకూ, ఉద్రిక్తతలకూ అదుపు ఏముంటుంది. మగవాళ్ళు కుటుంబ విషయాల్లో సలహా కోసం చేసే ఫోన్‌ కాల్స్‌ 17 శాతం పెరిగాయి.

”కుటుంబం ఎక్కువకాలం కలిసి గడిపే ప్రతి సందర్భంలోనూ (పండుగలు, సెలవులు వగైరా) కుటుంబ హింస పెరుగుతుంది అన్నది బ్రిష్టర్‌ యూనివర్శిటీ అధ్యయనం.

మామూలు సమయంలోనే పరిస్థితి ఇలా ఉంటే ఇక కరోనా అనిశ్చితిలో చెప్పేదేముంది. పైగా జీవితం బుద్బుధప్రాయం కాబట్టి కోర్కెలన్నీ తీర్చేసుకోవాలనే ఆరాటం కూడా కొంతమందిలో మొదలైంది. అది ఎదుటివారి భావాల్ని లక్ష్యపెట్టని దశకు చేరి మరెవరూ బయటి స్త్రీలు అందుబాటులో లేరు కనుక భార్యలపై లైంగిక అత్యాచారాలకు పాల్పడితే అది కుటుంబ నియంత్రణ సాధనాలు అందుబాటులో లేక కోరుకోని గర్భాలకు కారణమయింది.

కొసమెరుపుగా మన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ గృహ హింస తీవ్రత ఎంత మాత్రం పట్టలేదు. దీన్ని ఒక సమస్యగా కూడా వారు భావించట్లేదు. మార్చి 25 నుండి మే 21 లోపల 68 రోజుల్లో 1,479 కేసులు రిజిస్టరయ్యాయి. గత పది సంవత్సరాల్లో మార్చి-మే మధ్య ఎప్పుడూ ఇన్ని కేసులు రాలేదు. మన దేశంలో గృహ హింసను భరించే స్త్రీలలో 86 శాతం మంది ఎప్పుడూ సహాయం కోరరు. 77 శాతం మంది తమపై హింస జరుగుతోందని కూడా ఎవ్వరితో చెప్పుకోరు. కేవలం 11 శాతం మందే ఎవరో ఒకరికి కనీసం చెబుతారు.

ఉత్తర్‌ప్రదేశ్‌లో అత్యధికంగా 600 కేసులు నమోదయ్యాయి. రాజధాని ఢిల్లీలో ప్రతి పది లక్షల జనాభాకి 32 కేసులు వచ్చాయి. ఇది జనాభా నిష్పత్తి ప్రకారం చూస్తే అత్యధికం. సహాయం కోరిన 14 శాతం మందిలో కేవలం 7 శాతం మంది మాత్రమే సంబంధిత వ్యక్తులు అంటే పోలీసు, డాక్టర్‌, లాయర్‌, స్వచ్చంద సంస్థల సహాయం కోరారు.

శారీరక హింసకు గురయిన వారిలో 11.6 శాతం మంది మాత్రమే బయటవారి సహాయం కోరగా లైంగిక హింసకు గురయిన 80.5 శాతం మందిలో 9.8 శాతం మంది మాత్రమే సహాయం కోరారు.

ఇవన్నీ చీఖీనూ 15-16 నుండే కాక ఇటీవల జాతీయ మహిళల కమిషన్‌ ఇచ్చిన గణాంకాల నుండి తీసుకున్నవే. సామాజిక మాధ్యమాల్లో సహాయం కోసం వెతుక్కునే వారి సంఖ్య 300 శాతం పెరిగింది. గణాంకాలు చెప్పగలిగే యూరోప్‌ దేశాల్లో కరోనాతో మరణించిన వారికంటే గృహ హింస వలన మరణించిన స్త్రీలు 25 శాతం ఎక్కువని తేల్చారు. మన దేశంలో తేల్చడానికి అలాంటి గణాంకాలను ఎవరూ తీయడం లేదు.

వైద్య సిబ్బందిలో 70 శాతం ఆశా, అంగన్వాడీల్లో 100 శాతంగా మహిళలే ఉన్నారు. పనిభారం ఒక్కటే కాదు… ఇంట్లో హింస, బయట లైంగిక హింస కూడా వీరిపై చెప్పుకోలేని రీతిలో ఉన్నాయి. అమ్మాయిలు ఇళ్ళల్లోనే ఉండిపోవడం వల్ల జరిగే లైంగిక వేధింపులు కనీసం ఫిర్యాదు చేసే స్థితి కూడా లేదు. ఇక లాక్‌డౌన్‌లో మునిగిన పోలీసు యంత్రాంగం ఈ ఫిర్యాదులను అస్సలు ఖాతరు చేసే స్థితిలో లేరు.

సందట్లో సడేమియా లాగా కర్నాటక హైకోర్టు జూన్‌ ఆఖరి వారంలో లైంగిక దాడి నిందితునికి బెయిల్‌ మంజూరు చేసింది. నేరం యొక్క తీవ్రత ఒక్కటే కారణంగా ఒక పౌరునికి బెయిల్‌ నిరాకరించడం సరికాదంటూ గాయం మీద కారం పోసింది. రేప్‌ కేసుల్లో బాధితుల్ని బెదిరించే అవకాశం ఉన్న కారణంగా అది నాన్‌ బెయిలబుల్‌ నేరంగా ఉందనే విషయం కనీసం పరిగణించలేదు.

ఒడిషా ఆదివాసీ అమ్మాయి ఒంటరిగా పట్నానికి వస్తే రక్షించాల్సిన పోలీసులు ఇంటికి పంపుతామని చెప్పి సామూహిక అత్యాచారం చేశారు. ఇంటికి పంపి మళ్ళీ మళ్ళీ పిలిచి స్టేషన్‌లో అత్యాచారం చేయగా ఆ 14 ఏళ్ళ బాలిక గర్భవతి అయింది. దీనిపై కనీసం పత్రికల్లో వార్తలు లేవు.

బీహారు అరేరియా గ్యాంగ్‌రేప్‌ బాధితురాలు కోర్టులో తన ఫిర్యాదు చదివి వినిపించమన్నందుకుగాను దయగల జడ్జిగారు ఆమెను, ఆమెకు సహాయపడిన ఇద్దరు సామాజిక కార్యకర్తలను కోర్టు ధిక్కార నేరంపై జైలుకు పంపాడు. లైంగిక దాడి చేసిన నిందితులు రేప్‌ చేసిన క్షణం నుండి బాధితురాలిపై సామాజిక మాధ్యమాల నిండా బూతులు తిడుతున్నా ఎఫ్‌ఐఆర్‌ నమోదు కాలేదు. చివరికి మేజిస్ట్రేట్‌ దగ్గరికి వెళ్తే ఆయన ఏకంగా జైలుకి పంపి పుణ్యం కట్టుకున్నాడు. నిందితులు పాలక పార్టీకి సన్నిహితులని వేరే చెప్పనక్కర్లేదు.

ఘజియాబాద్‌లో జర్నలిస్టు విక్రమ్‌సింగ్‌ను తొమ్మిది మంది గూండాలు నడిరోడ్డున కారులో నుండి గుంజి కొట్టి తలపై కాల్చారు అతని బిడ్డలిద్దరూ చూస్తుండగా. అతను చేసిన నేరమల్లా తన మేనకోడలిని గూండాలు వేధిస్తున్నారని ఫిర్యాదు చేయడమే. గూండాలు తన ఇంటి దగ్గర రెక్కీ నిర్వహిస్తున్నారని అతను పోలీసులకు చెప్పినా వాళ్ళు పట్టించుకోలేదు. యాంటీ రోమియో స్క్వాడ్‌తో వేధింపులు మాయమయ్యాయనీ… ఎన్‌కౌంటర్లతో గూండాలే లేకుండా పోయారనీ ప్రకటించుకున్న యోగి ప్రభుత్వ నిర్వాకమిది.

ఇట్లా లెక్కకు మించిన ఘటనలు చెప్పుకోవచ్చు గానీ…పాలకులకు కరోనా ఒక వంకే తప్ప కరోనా నివారణ గానీ… స్త్రీలపై జరిగే హింసగానీ ఏదీ పట్టకపోగా… ఈ పరిస్థితిని హక్కులు కాలరాయడానికి వాడుకుంటున్నారని స్పష్టమవుతోంది.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.