వలస పాలనలో (1857 వరకు) స్త్రీ విద్య : ఒక సమీక్ష – డా|| కొట్టు శేఖర్‌

భారత ఉపఖండంలో సంస్కరణోద్యమం మరీ ముఖ్యంగా స్త్రీ విద్య వ్యాప్తి -సాధికారతలపై విస్తృతమైన అవగాహన, విమర్శనాత్మకమైన విశ్లేషణ, లోతైన పరిశీలన జరగాలంటే వలస పాలనలో-ప్రధానంగా బెంగాల్‌లో ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలన ప్రారంభమైన నాటి నుండి (రమారమి 1765) ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం తరువాత కంపెనీ నుండి అధికారం బ్రిటిష్‌ రాణికి బదిలీ అయిన నాటి వరకు (1858) – జరిగిన పరిణామాలను నిశితంగా పరిశీలించాలి. ఈ వ్యాసాన్ని ఆ కాల పరిమితికి కుదించడానికి ప్రధాన కారణం ఆ శకంలోనే సంస్కరణకు తొలి అడుగు పడడం. రెండవ కారణం 1858 నుండి 1947 వరకు జరిగిన పరిణామాలపై సమాచారం మెండుగా లభ్యం కావడం. అందుచేత ఈ వ్యాసం కంపెనీ పాలనలో స్త్రీ విద్య యొక్క తీరు తెన్నులను చర్చిస్తుంది.

మద్రాస్‌: తమ వాణిజ్యాన్ని వృద్ధి చేసుకోవడానికి ఉపఖండానికి వచ్చిన డచ్‌, బ్రిటిష్‌, పోర్చుగీస్‌, ఫ్రెంచ్‌, డానిష్‌ కంపెనీల వర్తక అధికార గణాలతో పాటు క్రైస్తవ మిషనరీలు కూడా మత ప్రచారానికై తరలి వచ్చాయి. అయితే 1813 వరకు బ్రిటిష్‌ ఈస్ట్‌ ఇండియా కంపెనీ తమ భూభాగంలో మత ప్రచారాన్ని వర్తకానికి అడ్డుగా భావించి ప్రోత్సహించలేదు. 1756లో ట్రాన్క్వెబర్‌ డేనిష్‌ మిషన్‌ అనే డెన్మార్క్‌కు చెందిన క్రైస్తవ సంస్థ ట్రిచినాపోలి, శ్రీరంగం పట్టణాలలో రెండు పాఠశాలలను స్థాపించింది. దీనికి కొనసాగింపుగా ఈస్ట్‌ ఇండియా కంపెనీ 1782లో మద్రాసులో, 1791లో బెనారస్‌లో ఉన్నత విద్యాసంస్థలను స్థాపించింది. 1822లో మద్రాస్‌ గవర్నర్‌ సర్‌ థామస్‌ మన్రో దక్షిణ భారతంలో పాఠశాల విద్యపై చేయించిన సర్వేలో ప్రతి గ్రామంలో గురుకులం లేదా మదరాస చదువు చెపుతూ ఉండేవన్న నిజం వెల్లడైంది. నాటి మద్రాస్‌ గవర్నర్‌ సర్‌ థామస్‌ మన్రో రాష్ట్రంలో (ఒరియా, తెలుగు, కన్నడ, తమిళ, మళయాళ ప్రాంతాల) విద్యా వ్యవస్థపై జరిపిన సర్వేలో శూద్ర, అతి శూద్ర (వృత్తి మరియు అస్పృశ్య కులాల వారు) కులాలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు బ్రాహ్మణ విద్యార్థుల కంటే ఎక్కువగా ఉండేవారని తెలిసింది. అయితే వారిలో అస్పృశ్య కులాల వారి సంఖ్య వివరాలు లేవు. మలబార్‌లో పాఠశాలలో 11,963 మంది బాలురు, 2,190 మంది బాలికలు (వారిలో 1,122 మంది ముస్లింలు)

ఉండేవారని తెలిసింది.

ఆ సర్వే ప్రకారం చాలా చోట్ల దేవదాసి కుటుంబాలకు చెందిన బాలికలపై సహ విద్య విషయంలో ఆంక్షలు ఉండేవి కావని తెలుస్తోంది. ఈ పాఠశాలలను పంచాయతీలు, క్రైస్తవ మిషనరీలు, దాతలు, హిందూ ముస్లిం పెద్దలు నిర్వహించేవారు. వాటిలో బోధన, విషయ పరిజ్ఞానం క్రమ పద్ధతిలో ఉండేవి కావు. పైగా విద్యార్జన పూర్తిగా ఆసక్తి, శక్తి సామర్ధ్యాలపై ఆధారపడి ఉండేదని వీణా మజుందార్‌ తన గ్రంథం ”ఎడ్యుకేషన్‌ అండ్‌ సోషల్‌ ఛేంజ్‌, త్రీ స్టడీస్‌ ఆఫ్‌ నైన్టీన్త్‌ సెంచరీ” (1972)లో పేర్కొన్నారు.

బెంగాల్‌: 18వ శతాబ్దంలో ఆధునిక భారత పునరుజ్జీవ ఉద్యమ పితామహుడైన రాజా రామ్మోహన్‌ రాయ్‌ సంస్కరణోద్యమంలో పాల్గొనడం ప్రారంభించారు. బాల్యంలోనే ఆయనకు మూడు వివాహాలు జరిగాయి. ఆ అనుభవమే ఆయనను బాల్యవివాహాల పట్ల విముఖతను కలిగించి ఉండవచ్చు. సతీసహగమనానికి వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటం జగద్విఖ్యాతమైనది. బ్రహ్మ ఆధ్మాత్మిక వాసనలు వంటబట్టించుకున్న ఆయనకు సంస్కరణోద్యమంలో క్రైస్తవ మిషనరీలు, కులీన వర్గాలు, బ్రాహ్మణులు, కంపెనీ అధికారులు సహకరించారు. ఆయన కంపెనీ ప్రభుత్వానికి పంపిన అర్జీలలో స్త్రీ విద్య గురించి బలమైన వాదనలను వినిపించారు.

ఈస్ట్‌ ఇండియా కంపెనీ యాక్ట్‌ 1813లో లేదా చార్టర్‌ యాక్ట్‌ 1813 కంపెనీ పాలిత ప్రాంతాలలో విద్యా వ్యవస్థలో పెను మార్పులు ప్రవేశపెట్టింది. ఈ చట్టం క్రైస్తవ మత సంస్థలకు విద్యావ్యాప్తి మత ప్రచారాలకై అధికారిక అనుమతినిస్తూ ఆ కార్యానికి లక్ష రూపాయలు కేటాయించింది. నాటి నుండి క్రైస్తవ మిషనరీలు మత ప్రచారాన్ని ఉధృతం చేయడంతో పాటు విద్యా వ్యాప్తికి కూడా కృషి చేశాయి. మిషనరీలలో మహిళలు అధిక సంఖ్యలో ఉండేవారు. 1818లో చిన్సుర పట్టణంలో క్రైస్తవ మిషనరీలు బాలికల పాఠశాలను ప్రారంభించాయి. 1819లో కొద్ది మంది ఆంగ్ల మహిళలు కలకత్తాలో ‘కలకత్తా ఫిమేల్‌ జువెనైల్‌ సొసైటీ’ ని స్థాపించి నలభై మంది బాలికలను విద్యావంతులను చేశారు. ఇదే క్రమంలో కలకత్తాలో శ్యామ్‌ బజార్‌, జోన్‌ బజార్‌, ఎన్తలిలలో బాలికల పాఠశాలలు నెలకొల్పారు. 1838 నాటికి బుర్ద్వాన్‌ జిల్లాలో 175 మంది బాలికలు చదువుకునేవారు. అయితే కొన్నాళ్ళకు ఆ పాఠశాలలు నిర్వహణా లోపం వల్ల మూతబడ్డాయి. 1840లో ఒరియా మాట్లాడే ప్రాంతంలో ఉన్న కటక్‌లో బెక్లి అనే ఆంగ్ల మహిళ స్థాపించిన అనాథ శరణాలయ పాఠశాలలో 465 మంది బాలికలు చదువుకునేవారు.

1849లో గవర్నర్‌ జనరల్‌ కౌన్సిల్‌లో న్యాయశాఖ సభ్యుడైన జాన్‌ ఎలియట్‌ డ్రింక్వాటర్‌ బెథూన్‌ కలకత్తాలో బాలికల పాఠశాల స్థాపించాడు. నాటి బెంగాల్‌ సంస్కరణవాదుల సహకారంతో నడిచిన ఆ పాఠశాల హిందూ బాలికల పాఠశాలగా మారింది. బెథూన్‌ మరణం తర్వాత కొంత ఇబ్బందులెదుర్కొన్నా, 1856లో బెంగాల్‌ ప్రభుత్వం దాని నిర్వహణ బాధ్యతను తీసుకోగా 1879లో ఆ పాఠశాల ఆసియాలోనే ప్రప్రథమ మహిళా కళాశాలగా అవతరించింది. 1848లో పూనాలో ఉపఖండపు సామాజిక విప్లవానికి పితామహుడైన మహాత్మా జ్మోతిరావు ఫూలే, ఆయన భార్య సావిత్రి బాయి బొంబాయి రాష్ట్రంలో తొలి బాలికల పాఠశాలను స్థాపించారు. 1850 నాటికి బెంగాల్‌లో 26 పాఠశాలల్లో 690 మంది బాలికలు, 28 బోర్డింగ్‌ పాఠశాలల్లో 836 మంది బాలికలు చదువుకునేవారు. అలా విద్యార్థినుల సంఖ్య వేలకు చేరుకోవడానికి క్రైస్తవ మిషనరీల కృషిని ప్రధాన కారణంగా చెప్పవచ్చు.

ఇక మెకాలే మినిట్‌గా (1835) ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం, వివాదాస్పదమూ అయిన ‘ది ఇంగ్లీష్‌ ఎడ్యుకేషన్‌ యాక్ట్‌’ను ఉపఖండపు సాంస్కృతిక స్వభావాన్ని మార్చివేసే ప్రయత్నంగా అభివర్ణించవచ్చు. వలస పాలన సౌలభ్యానికి సరిపడా గుమాస్తాల సమూహాన్ని తయారుచేసే మార్గాలను మెకాలే ఒక వలస పాలన సమర్ధకునిగా, ఆంగ్లేయుడిగా సూచించడం ఏ మాత్రం ఆశ్చర్యం కలిగించదు. పనిలో పనిగా భారత భాషలను, అపారమైన జ్ఞాన సంపదను చులకన చేసి ఆంగ్ల విద్య ఆంగ్లీకరణ మాత్రమే శరణ్యమని తేల్చేశాడు. ఆ మినిట్‌లో స్త్రీ విద్య గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. 1854లో ఉడ్స్‌ డిస్పాచ్‌గా ప్రఖ్యాతమైన సర్‌ ఛార్లెస్‌ ఉడ్‌, గవర్నర్‌ జనరల్‌ డల్హౌసీకి పంపించిన నివేదిక ఆంగ్ల మరియు స్త్రీ విద్యకు ఎంతగానో ఉపకరించింది.

పంజాబ్‌: స్త్రీల విద్య విషయంలో కొన్ని కోణాల నుండి పరిశీలిస్తే, బెంగాల్‌, మద్రాస్‌ల కన్నా పంజాబ్‌ ముందంజలో

ఉండేది. కంపెనీ పాలనకు పూర్వమే మహారాజా రంజిత్‌ సింగ్‌ ఏలుబడిలోనే ‘ఖైదా’ (ప్రథమ వాచకాలు, ప్రైమర్‌లు) రూపొందించబడ్డాయి. 1849 నాటికే లాహోర్‌ నగరంలో 18 బాలికల పాఠశాలలు ఉండేవి. ప్రతి గ్రామంలో పంజాబీ ‘ఖైదా’ సరఫరా జరిగేది. పంజాబీ మహిళల్లో అత్యధిక శాతం అక్షరాస్యులై గురుముఖీ ‘లండా’ లిపిలో వ్రాయగలిగేవారు. ఈ ఖైదాలను ఇళ్ళల్లోనే చదువుకునేవారు. 1857లో తిరుగుబాటును అణచివేసే క్రమంలో కంపెనీ సేనలు తమకు బాసటగా ఉన్న సిక్కుల అభివృద్ధిని దెబ్బకొట్టాలని ఒక పథకం ప్రకారం పంజాబ్‌లో ఇళ్ళల్లో ఉన్న ఖైదాలను తగులబెట్టారు. ఎప్పటికైనా వారు తమకు పక్కలో బల్లెమని తలచి కంపెనీ వారు ఈ పథకానికి పాల్పడ్డారు. దాంతో మహిళల విద్య కుంటుపడి పోయింది. పంజాబ్‌లో 1857కు పూర్వం 3,30,000 మంది విద్యార్థినీ విద్యార్థులుండగా 1859కు అది 19,000కు పడిపోయింది. ఈ వివరాలు జీ.బీ.లెయిట్నిర్‌ ‘హిస్టరీ ఆఫ్‌ ఇండిజెనెస్‌ ఎడ్యుకేషన్‌ ఇన్‌ పంజాబ్‌’ (1882) గ్రంథంలో పొందుపరిచారు.

చర్చ: బెంగాల్‌, బొంబాయి, మద్రాస్‌ రాష్ట్రాలలో స్త్రీ విద్య నల్లేరు నడకలా సాగలేదు. ఛాందస వర్గాలు మహిళా సాధికారతకు ఏదో విధంగా అడ్డుపడుతూనే ఉన్నాయి. కులీన వర్గాలు తమ ఇళ్ళల్లోనే బాలికలకు బోధన ఏర్పాటు చేసేవారు. ప్రాక్‌ పశ్చిమ సంస్కృతుల సంఘర్షణలో ప్రగతి కాముకులైన ఓరియెంటలిస్టులదే పై చేయి అయింది. కంపెనీ పాలనపై ‘చరిత్ర రచన’ (హిస్టోరియోగ్రఫీ)ను నిశితంగా పరిశీలించినట్లయితే సంస్కరణలను ఉన్నపళంగా ప్రవేశపెట్టాలని కంపెనీ పాలకులు ఏనాడూ అనుకోలేదు. వారు భారతీయుల ద్వారా తమ భావాలను వ్యక్తపరచి వారినే కార్యోన్ముఖుల్ని చేసేవారు. వ్యాసంలో గణాంకాలు కొన్ని వాస్తవాలను వెలుగులోనికి తీసుకువస్తాయి. మన్రో నివేదిక ప్రకారం కంపెనీ పాలనకు పూర్వమే ఉపఖండమంతా కొన్ని వేల వీథి బడులు, దేవాలయాల ప్రాంగణాలు, గురుకులాలు, మదరసాలు తమ తమ సాంప్రదాయ రీతుల్లో విద్యాబోధన చేసేవారు. అయితే ఈ విస్తృతమైన నెట్‌వర్క్‌లో ఆధునికత, సమానత్వం ప్రస్ఫుటంగా లోపించేవి. ఆ పునాదులపై వలస పాలన సంస్కరణల వల్ల ఒక మహోన్నతమైన విద్యావ్యవస్థ నిర్మితమయింది. క్రైస్తవ మిషనరీలు ఏ ఉద్దేశంతో చేసినా వారి కృషి స్త్రీ విద్యావ్యాప్తిలో చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గది. వలస పాలకులలో ప్రగతి కాముకులతో రాజా రామ్మోహన్‌ రాయ్‌, మహాత్మ ఫూలే, విద్యాసాగర్‌, రాధాకాంత్‌ దేభ్‌, గోరి మోహన్‌ విద్యాలంకార్‌, డిరోజియో, దక్షిణారంజన్‌ ముఖర్జీ, రామ్‌ గోపాల్‌ ఘోష్‌ లాంటి సంస్కరణాభిలాషులు చేయి కలిపి ఆధునిక భారతానికి బీజాలు వేశారు. 19వ శతాబ్దపు మొదటి అర్థ భాగంలో వనరుల దోపిడీ, హింస ఎంత జరిగాయో సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాటానికి కూడా అంతే ఉధృతంగా సాగింది. నేడు వెల్లివిరుస్తున్న చైతన్యానికి, ఒక మహోద్యమంలా పురోగమిస్తున్న స్త్రీ వాదానికి ఆ యాభై ఏళ్ళలోనే అసలైన పునాదులు పడ్డాయి.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.