ఒకనాటి సామాజికి స్థితిగతులను అంచనా వేయడానికి సాహిత్యం ఎంతగానో తోడ్పడుతుంది. సమాజానికి, సాహిత్యానికి అవినాభావ సంబంధం ఉంది. సమాజంలోని స్థితిగతులు సాహిత్య ప్రక్రియల్లో ప్రతిఫలించబడతాయి. సాహిత్య ప్రక్రియలు అనగా నవల, కథ, వచన కవిత్వం మరియు గేయం ఏదైనా కావచ్చు. ఈ సాహిత్య ప్రక్రియల్లో సమకాలీన సామాజిక స్థితిగతులను అత్యంత ప్రభావవంతంగా ప్రజల ముందు
ఉంచడంలో గేయం ప్రముఖ పాత్ర పోషిస్తుంది. కవితలు చేయలేని పని గేయం చేస్తుంది. వంద వ్యాసాలు చేయలేని పని గేయం చేస్తుంది.
”గేయం శతఘ్నికన్నా గొప్పగా పనిచేస్తుంది” (సుద్దాల హన్మంతు) అంతటి శక్తివంతమైన గేయం, ప్రజలను సామాన్య” స్థితి నుండి ఉన్నత స్థితికి నడిపించడంలో ఉపయోగపడుతుంది. ఇలాంటి గేయాల్లో ప్రజల తత్వం, ప్రజల అమాయకత్వం, కష్టసుఖాలు, లక్ష్యాలు, ఆలోచనా విధానాలు, ప్రభుత్వాల పనితీరు, ప్రజలతో మమేకమై ప్రకృతి చిత్రణలు వర్ణించబడుతాయి. సామాజిక అస్థిత్వం, సామాజిక చైతన్యం ద్వారా వ్యక్తమవుతుంది. సామాజిక చైతన్యంలో మనిషి భావాలు, అభిప్రాయాలు, నైతిక, రాజకీయ, సైద్ధాంతిక దృక్పథాలు, సౌందర్యదృష్టి, తాత్విక, మత భావాలు, సాహిత్యాది కళలు అంతర్భాగాలుగా ఉంటాయి. సామాజిక అస్థిత్వాన్ని కాపాడడంలో చైతన్య గీతాలు ప్రముఖ పాత్ర పోషిస్తూనే సమాజ స్థితిగతులను కూడా వ్యక్తపరుస్తాయి. అంతటి శక్తివంతమైన గేయాలు ప్రాచీనమైనవి. గేయాన్ని గీతం అని అంటారు. పదం, సంకీర్తన అనే పదాలు కూడా పర్యాయపదాలుగా కూడా వాడబడుతున్నాయి.
”గాయతే ఇతి గీతం” (పాడేది, పాడబడేది)
”గాతు మర్హంతి గేయం” (గాన యోగ్యమైతే గేయం)
(గురుబాల ప్రబోధిని – అమరకోశం. పుట : 140 (ప్రథమ కాండ))
అని అమరకోశం గీతం, పాట, గేయం అనే అర్థాన్ని వివరిస్తుంది.
సుప్రసిద్ధ విమర్శకుడు సి.యమ్.బౌరా ”ప్రిమిటీవ్ సాంగ్” అనే గ్రంథంలో పాట ప్రాచీనత గురించి తెలుపుతూ ”ప్రాచీన శిలాయుగం నాటి ఆటవిక తెగలవారు ఎలాంటి పాటలు పాడుకున్నారో వాటి స్వరూప స్వభావాలు ఎలా ఉన్నాయో, శాస్త్రీయమైన ఆలోచనా ధోరణిలో ఒక ప్రతిపాదన చేశాడు. పాట క్రీ.పూ.2500 ప్రాంతం నాటికే ఉన్నట్టు సుమేర్, ఈజిప్టు లిఖిత గ్రంథాల్లో ఆధారాలు కనిపిస్తున్నాయని, ఇప్పటికీ తెలిసినంత వరకు మొదటి సుబేరియన్ పాట సుదీర్ఘమైన, కథాత్మకమైన కవిత అని, అందులో వేదాంత విషయాలు, విశ్వసృష్టి విషయాలు, వర్ణితాలైనాయని, ఆ తర్వాత కొంత కాలానికి ఆ కవితలు దేవుళ్ళు, దేవతల కీర్తనలతో నిండిపోయానని, అతి ప్రాచీనమైన ఈజిప్టు దేశ భాషా గీతం కీ.పూ.2350 ప్రాంతం నాటిదని సి.యమ్.భేరా తెలిపాడని ఆధునికాంధ్ర గేయ కవిత్వంలో జి.చెన్నకేశవరెడ్డి వివరించారు.
(ఆధునికాంధ్ర గేయ కవిత్వం – జి.చెన్నకేశవరెడ్డి పుట.7)
అంతటి ప్రాచీనతను కలిగిన గేయం గురించి ఆదికవి నన్నయ శ్రీమహాభారతం, ఆదిపర్వం, అష్టమాశ్వాసంలో అర్జునుడి తీర్థయాత్ర ఘట్టంలో నాగకన్య ఉలూచి అర్జునుడ్ని చూసి
”నీ గుణములు దొల్లుయు నా
గీ గీతములందు విని, తగిలినపుడు మనో
జాడగంటిని
భాగీరథి యందు నిన్ను బరహిత చరితా!” (8-135)
అంటూ నాగీ గీతాల గురించి ప్రస్తావించారు. ఇలా మనస్సులోని భావాలను వ్యక్తం చేసే పరిణామ క్రమంలో గేయం పరిణితి చెందుతూ వచ్చింది.
12వ శతాబ్దంలో కుమార సంభవంలో ఉయ్యాల పాటలు (4-89), రోకంటి పాటలు, సువ్వి పాటలు 6-87 అని నన్నే చోడడు, పండితారాధ్య చరిత్ర గ్రంథంలో పర్వత ప్రకరణంలో ఏలల (పుట, 433), వెన్నెల పదాలు (పుట 513) అని పాల్కురికి సోమన ప్రస్తావించారు. 14వ శతాబ్దంలో ‘వసంత విలాసం’లోని నాచన సోముని రచనగా
”వీణా గానము వెన్నెల తోట
రాణ మీరగ రమణుల పాట
ప్రాణమైన పిన బ్రాహ్మణ వీట
… … …
జాణలు మెత్తురు జాజర పాట’ను పేర్కొంటూ వేటూరి ప్రభాకరశాస్త్రి గారు ఉత్తర హరివంశ పీఠికలో ప్రస్తావించారు. 15వ శతాబ్దంలో భీమేశ్వర పురాణంలో ”యక్షగానాలు” అని, ”గీతాలు” (5-103) అని శ్రీనాథుడు పేర్కొన్నారు. అదే విధంగా పోతన భాగవతంలో పాటలు (10-505) అనే పదం ప్రాచీన కాలం నుండి ఉపయోగించబడిందని తెలుస్తున్నది. పాటలు ప్రాచీన కాలం నుండి నేటి ఆధునిక కాలం వరకు క్రమ పరిణామం పొందుతూ సమాజ గతులకు అనుగుణంగా దాని ప్రాముఖ్యతని సంతరించుకుంటూనే ఉన్నాయి. 1909 సం||లో ప్రజల్ని చైతన్యవంతులను చేయడానికి, మనిషి విలువలను తెలపడానికి ”మాలవాండ్ర పాట” అని ఆంధ్రభారతి పత్రికలో అచ్చయ్యింది. ఈ పాటలో
”అందారు పుట్టిరి హిందమ్మ తల్లికి
అందారు ఒక్కటై ఉండాలి సక్కంగ
కష్టమ్ములొచ్చినా నిష్టూరమొచ్చినా
ఇష్టమ్ముగా నుండి కట్టుగనుందాము”
అంటూ జాతీయ సమైఖ్యతా భావాల్ని తెలుపుతూ, అస్పృశ్యత అను భేదాభిప్రాయాలను విడనాడి భారతీయులందరూ ఒక్క తల్లి బిడ్డలుగా ఉండవలెనని ఒక అజ్ఞాతకవి సెలవిచ్చారు. ఈ గేయ రచనా కాలంలో సమాజంలో కుల, మత అంతరాలు ప్రజల్లో ప్రబలంగా ఉన్నాయని ప్రస్ఫుటమవుతున్నది. కుల మతాల అంతరాలకు బాధితులైనవారు, బాధించిన వారు సమాజంలో ఉన్నారని ఈ గేయం ద్వారా ఆనాటి స్థితిగతులను అంచనా వేయవచ్చు.
గురజాడ అప్పారావు వెలువరించిన ‘దేశమును ప్రేమించుమన్న’ అనే గేయంలో నాటి రచనా నేపథ్యాలకు భిన్నంగా ఉంది. దేశ సంపదను, కట్టడాలను, నదులను కీర్తించే స్థానంలో మనుషులను ప్రేమించమన్నారు. దేశభక్తిని పెంపొందించుకోవడమంటే మంచిని పెంచుకోవడమేనని తెలుపుతూ..
”స్వంత లాభం కొంత మానుకో
పొరుగు వాడికి తోడుపడవోయి
దేశమంటే మట్టికాదోయి
దేశమంటే మనుషులోయి”
అని ప్రజల్ని దేశభక్తివైపునకు మళ్ళిస్తూ సామాజిక చైతన్యాన్ని కోరుకున్నారు. రాయప్రోలు సుబ్బారావు 1914 సం||లో…
”ఏ దేశమేగినా ఎందుకాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా”
అని రచించిన దేశభక్తి గేయంలో ప్రజలు ఎక్కడికి వెళ్ళినా మాతృదేశాన్ని తక్కువ చేసి మాట్లాడకూడదని జాతి గౌరవాన్ని ఉన్నత స్థానంలో నిలుపడానికే సంసిద్ధులై ఉండవలెనని ప్రజల్ని చైతన్యపరిచారు.
జాతీయోద్యమంలోకి దేశ ప్రజలను ఆహ్వానించడానికి, దేశభక్తి భావనల్ని తెలుపుతూ గరిమెల్ల సత్యనారాయణ
”పొడుపు కొండ మీద – పొడిచె నల్లప్రొద్దు
తడయ కింకను వేగలేరా – భారత తల్లికి పుట్టితివేరా!
వేగుచుక్క తోడ వేకువ మేల్కొంచి
మరచినావు ఓరీ – యోగ ముద్రలు
భోగ సక్తుడవై చెడ్డావు”
అని మేలుకొలుపు గీతాన్ని పాడుతూ భారత జాతి యావత్తూ ప్రజల్లో జాతీయోద్యమ చైతన్యాన్ని నింపే ప్రయత్నం చేసి సఫలీకృతులయ్యారు.
శ్రీ బెల్లంకొండ చంద్రమౌళి శాస్త్రి అదే అడుగు జాడల్తో నడుస్తూ…
”మేలుకొనుడు, మేలుకొనుడు! మేలిమి బంగారు ఉషస్సిది
ఓ నిద్రమత్తులారా! ఓ భద్రప్రపత్తులారా!
ఈ ప్రాభాతవేళను-మీ ప్రాంగణములు తెరువుడు అని తెలుపుతూ మేల్కొలుపు గీతాన్ని రాశారు.
ఈ గేయంలో పశు పక్ష్యాదులు, గుడి గంటలు, పూలు, కాలువలు మేల్కొనుటకు ముందే ప్రజలు మేల్కొని
ఉద్యమంలో క్రియాశీల పాత్రను పోషించవలెనని ప్రజల్ని చైతన్యపరిచారు.
గేయం ఒక కాలం నాటి సామాజిక, ఆర్థిక, సాంఘిక స్థితిగతులను తెలుపుటే కాకుండా, ప్రజలు పడుతున్న కష్టాలను చూపిస్తూ వారిని ఆ కష్టాల నుండి తప్పించే పరిష్కారాలను కూడా గేయ రచయితలు ఎంతగానో ప్రయత్నం చేశారు. గేయ రచయితలు సామాజిక చైతన్యాన్ని దృష్టిలో పెట్టుకుని రచన గావిస్తారని అర్థమవుతున్నది. గేయం ప్రజల్ని ఏకం చేయడంలో, ఒక లక్ష్యం కోసం పనిచేయించడంలో, ఒక ఒరవడిని అనుసరిస్తూ, ప్రజల్ని అభ్యున్నతి వైపునకు నడిపించడంలో ముఖ్య భూమిక పోషిస్తున్నది.
సాహిత్యంలో విద్వాంసులు వ్రాసిన గేయాలు సామాన్య ప్రజల హృదయాలను ప్రభావితం చేయలేదు. కానీ ప్రజా కవులు వ్రాసిన గేయాలు ప్రజలను ఎంతగానో ప్రభావితం చేశాయి. సాహిత్య కవులు, విద్వాంసులు రాసే భాష, వాడే పదాలు సగటు సామాన్య ప్రజలకు అర్థం కావు. అదే ప్రజాకవులు వాడే పదాలు, ఉపయోగించే భాషాశైలి వాస్తవ పరిస్థితులను సగటు మనిషి అర్థం చేసుకునేలా, ఆలోచింపచేసేలా ఉండి సమాజంలో మార్పు కొరకై ఉద్యమించే స్థాయికి చేరుస్తాయి.
జాతీయోద్యమ కాలంలో మన మాతృదేశం యొక్క గొప్పదనాన్ని దేశనాయకుల గొప్పదనాన్ని వారి యొక్క త్యాగనిరతిని, నాయకత్వ లక్షణాలను కొనయాడడానికి గేయాలు ఎంతగానో ఉపయోగపడినాయి. జాతీయోద్యమంలో వ్రాసిన గేయాలు ప్రధాన పాత్ర పోషించాయి. రాయప్రోలు, గరిమెల్ల బసవరాజు, అప్పారావు వ్రాసిన గేయాలు జాతి సమైక్యతకు నాంది పలుకుతున్నాయి. జాతీయోద్యమం తరువాత గేయ కవుల ఆలోచనా ధోరణి గేయాల్లో ఇట్టే కనిపిస్తుంది. వారి ఆలోచన జాతీయ చైతన్యం నుండే భావకవిత్వం వైపు మళ్ళింది. భావ కవిత్వం వైపు మళ్ళిన వారు సామాజిక సమస్యలను రచనల్లో రాయడానికి నిరాసక్తత చూపుతారు. సామాజిక అసమానతలు, దోపిడీలు, దురాగతాలు సమాజంలో ఎక్కువైన క్రమంలో రచయితల ఆలోచనలు అభ్యుదయ భావజాలంపై మొగ్గుచూపడం మొదలైంది.
ఇంకా కొంతమంది రచయితల గేయాల్లో కార్ల్‌మార్క్స్ ప్రభావం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఈ గేయాల్లో ప్రజలందరూ సమానమే ఎక్కువ తక్కువలు చూడకూడదన్న భావజాలాన్ని వ్యక్తం చేశారు. వారి సంక్షేమాన్ని కోరి, నిమ్న జాతి వర్గాల అభ్యున్నతిని కాంక్షించారు. అవి వారి హృదయాలను కొల్లగొట్టాయి. ప్రజా కవులు ప్రాంత భాషా ధోరణులు, సాంప్రదాయాలు, వారి అలవాట్లు, వారి ప్రేమ గేయాల్లో పొందుపరచడం వల్ల అలాంటి గేయాలు ప్రజాదరణ, మన్ననలు పొందాయి. ఇలా ఆదరణ పొందిన గేయాలు వారి హృదయాల్లోకి హత్తుకుపోవడమే కాకుండా వారిని చైతన్యపరచడానికి వారి లక్ష్యాన్ని గుర్తు చేయడానికి కూడా ఎంతగానో ఉపయోగపడ్డాయి.
నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధపోరాటం ఆనాడు ఎందరినో కవులుగా, గాయకులుగా,
ఉద్యమకారులుగా తయారు చేసింది. నిజాం నిరంకుశత్వాన్ని దగ్గర్నుండి చూడలేని పోరాట యోధులు వారి ఆలోచనల్ని గేయాలుగా తీర్చిదిద్దారు. వారి గేయాల ద్వారా అలనాటి తెలంగాణ ఉద్యమాన్ని, ప్రజల కష్టాన్ని అర్థం చేసుకోవచ్చు. సుద్దాల హన్మంతు రాసిన ‘పల్లెటూరి పిల్లగాడా’ గేయంలో…
”పల్లెటూరీ పిల్లగాడా
పసులగాసే మొనగాడా
పాలు మరచీ ఎన్నాళ్ళయిందో
ఓ పాలబుగ్గల జీతగాడా!”
(పల్లెటూరి పిలగాడా – సుద్దాల హన్మంతు జులై 2010, పుట : 62)
అంటూ పసి ప్రాయంలో జీతగాండ్లుగా చేరి, పశువుల యజమానులైన దొరల వల్ల శారీరక, మానసిక హింసలు అనుభవిస్తున్న పసిపిల్లల హృదయ విదారక జీవన విధాన నేపథ్యాలకు కంటతడి పెట్టించే విధంగా సుద్దాల హనుమంతు రచన గావించారు. అది అతని ప్రజా సమస్యల దర్శనానికి నిదర్శనం. ఈ గేయ రచనా కాలంలో దొరల దోపిడీతత్వం, పీడించే స్వభావం, ప్రజల మూల్గులు ఇట్టే కనబడతాయి. పాలబుగ్గల జీతగాండ్ల పరిస్థితి గేయ రూపంలో వచ్చిందంటే జీతగాండ్ల పరిస్థితి ఎంత దయనీయ స్థితిలో ఉందో గమనించవచ్చు, ఎంత పీడనకు లోనయ్యారో ఇట్టే అర్థమవుతుంది.
గేయం సామాన్య ప్రజల్ని చైతన్యపరచడానికి ఉపయోగపడింది. వారిలోని సామాజిక అవగాహనను పెంపొందించేందుకు, సరైన దారిలో నిలిపేందుకు, వ్యక్తిగత సామాజిక స్పృహ కలిగించేందుకు ఎంతగానో ఉపయోగపడింది గేయం. భారత జాతీయోద్యమంలో ఒక జెండా అయ్యి విదేశీ పాలకులను మన దేశం నుండి తరిమికొట్టింది. చైతన్యగీతాలు సామాన్య ప్రజల పక్షాన నిలబడి పనిచేసినాయి. చైతన్య గేయాలు అభ్యుదయ రచనల్లో పిడికిలెత్తి నిలబడ్డాయి. విప్లవోద్యమ రచనల్లో భూస్వాములను తరిమికొట్టే ఎర్రజెండా అయి విరుచుకుపడ్డాయి. ప్రాంతీయ ఉద్యమాలకు ఊతకర్ర అయ్యాయి. యన్.జి.రంగా, తుమ్మల వెంకట రమణయ్య, గజ్జెల మల్లారెడ్డి, శ్రీ శ్రీ గేయ రచనల్లో సామాజిక అభ్యుదయాన్ని కాంక్షించారు. ఇలాంటి నేపథ్య గేయ రచనలు 1935 సం||లో ప్రారంభమై 1965 సం||లో చివరి దశను చేరుకున్నాయి.
1967 సం|లో నక్సల్‌బరి ఉద్యమం ప్రారంభమయింది. ఆ ఉద్యమం రైతులు, భూస్వాములకు మధ్య జరిగింది. దాని యొక్క ప్రభావం శ్రీకాకుళంలో మొదలై తెలంగాణకు పాకింది. విప్లవ గేయ రచయితలు వంగపండు, గద్దర్ రాసిన గేయాలు ఒక తుపాకిలో తూటాల్లా మారి సమాజంలో ప్రభావాన్ని చూపాయి. గన్‌ను గురిపెట్టి పేల్చితే ఒక్క ప్రాణం కోల్పోతాం కానీ ఒక విప్లవ గేయం ఒక చెడు చేసే వ్యక్తిని చేయకుండా, చెడు పనికి ప్రభావితులయ్యే ప్రజలను చెడుపై తిరగబడండని, ప్రజలను మంచి దారిలో నడవమని విప్లవచైతన్య గేయాలు మార్గనిర్దేశనం చేశాయి. అందుకే గేయం ఒక శతఘ్ని కన్నా గొప్పదని (సుద్దాల హన్మంతు) అంటారు. రచన స్వభావం ఏదైనా, పోరాటమైనా, సమైక్యతైనా, జాతీయోద్యమమైనా, అభ్యుదయమైనా రచయితలు ప్రజల్ని చైతన్యపరచినది గేయం. అందుకే చైతన్య గేయం సాహిత్యానికి, సమాజానికి, పోరాటాలకి అవినాభావ సంబంధం ఉంది.