ఆరో ఆడపిల్ల – ఉమా నూతక్కి

చిన్న పుస్తకం. చాలా చిన్న కథ. సమాజంలో పురుషాధిక్యత ఎంత లోతుగా పాతుకుపోయి ఉందో చెప్పే కథ. కానీ చదివాక మామూలుగా ఉండదు. పిల్లలు లేని శంకర్‌ రామన్‌ గుడి ప్రాంగణంలో దొరికిన పాపను తెచ్చుకుని ”కాదంబరి” అని పేరు పెట్టుకుని ప్రేమగా పెంచుకుంటాడు. పూల వ్యాపారి అయిన శంకర్‌ రామన్‌ దగ్గర ఇంకో అయిదుగురు అనాధ బాలికలు పని చేస్తూ ఉంటారు. వాళ్ళకి కూడా ఇంతే ప్రేమగా పూల పేర్లు పెట్టుకుంటాడు శంకర్‌ రామన్‌. రోజా, కమలం, కనకాంబరం, మల్లి, సంపంగి… వీళ్ళతో పాటు కూతురు కాదంబరి.

నాట్యాచార్యుడు శివమణి…

సంగీతం నేర్పడానికి వచ్చిన పొన్నయ్య భాగవతార్‌.

లెక్కల టీచర్‌ వేద నాయకం…

చివరికి శారీరకంగా, మానసికంగా అసమతుల్యత ఉన్న స్నేహితురాలు పవిత్ర కూడా. ఆమెని ఒక ఆడపిల్లగా… కేవలం ఆడపిల్లగా చూశారు. ఆమె శరీరాన్ని కోరుకుని మనసుని తీవ్రంగా గాయపరిచారు. అన్నీ భరించి చదువులో మేటి అయ్యి డాక్టర్‌ అవుదామనుకుంటుంది కాదంబరి. కానీ ఆ ఊరి శాస్త్రి గారి రూపంలో అనాధ అయిన కాదంబరి కులం మీద ఈసారి నీడ పడింది. అప్పటిదాకా అంత ప్రేమ చూపించిన తండ్రి కూడా ఆమెను తన వారసురాలిగా గుర్తించకుండా తిరస్కరించేటప్పటికి కాదంబరి మనసు ముక్కలైపోతుంది. తనకి వారసులు లేరు కాబట్టి ఇక వ్యాపారం కూడా అక్కర్లేదన్నట్లు తండ్రి వదిలేయడం కాదంబరి తట్టుకోలేకపోతుంది.

పురుషాధిక్యత స్త్రీల మనసుని ఎంత గాయపరుస్తుందో చాలా సున్నితంగా కళ్ళముందు పరుస్తారు రచయిత. గాయపడిన కాదంబరి ఇంట్లోంచి వెళ్ళిపోయి అనాథగా తన జీవితాన్ని మళ్ళీ మొదలు పెడుతుంది. అంతకు ముందు తండ్రి పూల కొట్లో పని చేసే ఐదుగురు అనాధ పిల్లల్లాగే ”ఆరో ఆడపిల్ల”గా జీవితం మొదలు పెట్టడంతో కథ ముగుస్తుంది. సమాజంలో వేళ్ళూనుకుపోయిన పురుషాధిక్యత యొక్క వికృత స్వరూపాన్ని మన కళ్ళముందు నిలబెట్టే వచనమిది. ఇది కథ కాదు. కథకుడు మన ముందు సృష్టించిన విస్తృత ప్రపంచం. ఈ ప్రపంచం రోజూ మనం చూసే నకిలీ నవ్వుల ప్రపంచం కాదు. అందరి ముసుగుల్నీ తొలగించి చూపించేస్తుంది. ఇందులో ఎక్కడికక్కడ వచ్చే స్త్రీ పాత్రల అంతఃసంఘర్షణలూ… వారి వారి మనస్తత్వపు లోతులూ కథనాన్ని మన మనసులోకి వడపోస్తున్నట్లు అనిపిస్తాయి.

‘నాలుగో ఏడాది జ్ఞాపకాలకే నలభై ఏళ్ళ ఎదుగుదల తనలో ఉన్నప్పుడు, ఆ జ్ఞాపకాలని మాన్పే తైలం లేనివాళ్ళు వాటిని మభ్యపెట్టడం ఎలా సాధ్యం?’ అదే అనుమానం వస్తుంది కాదంబరికి, శంకర్‌ రామన్‌ని మామయ్య అని కాక నాన్నా అని పిలవమని పదే పదే చెబుతున్నా నాన్న అన్న పిలుపు అలవాటు కాకపోవడంతో తను (శంకర్‌ రామన్‌) సొంత నాన్న అని చెప్పి మభ్యపెట్టాలని ప్రయత్నించినప్పుడు! అవును మరి జ్ఞాపకానికి వయసుతో పనిలేదు. అది ఎంత చిక్కగా మనసులో ముద్రించుకు పోయిందో అని తప్ప జ్ఞాపకాలని చెరపలేనప్పుడు వాటిని మాయపుచ్చడం తప్పు అన్న భావాన్ని చాలా సున్నితంగా మనకి చెప్పారు రచయిత సేతు.

ఆడవాళ్ళ మనసు ఎంత సున్నితమో గోమతి పాత్ర ద్వారా చక్కగా చెప్పడం జరిగింది. శంకర్‌ రామన్‌ గుడిలో నుండి ఆ పిల్లను తీసుకురావడం మొదలు ఆ పిల్ల పొడే గిట్టదు గోమతికి. అప్పటికి మూడుసార్లు తనకి గర్భ విచ్ఛిత్తి జరిగినా తనకి సొంత పిల్లలే కావాలనే సాదాసీదా స్త్రీ మనస్తత్వం కాస్తా, శంకర్‌ రామన్‌ ఊళ్ళో లేనప్పుడు కాదంబరికి ఒళ్ళెరగని జ్వరం వస్తే తల్లడిల్లిపోయే తల్లి మనస్తత్వం బయటకి రావడం జరుగుతుంది. ఎంత ఇష్టం లేని వారి విషయంలో అయినా, ఆడవాళ్ళల్లో సహజంగా ఉండే మాతృ స్వభావం మారదు అని చాలా సహజ సన్నివేశం ద్వారా చెప్పారు.

ఇందులోనే ఒకచోట గోమతి, శంకర్‌ రామన్‌ల సంతానలేమి గురించి రాస్తూ రచయిత అంటారు ”పిల్లల నవ్వులు లేని ఊరు… పూలు విరియని ఉద్యానవనం… శాపగ్రస్తమైన మట్టివైపు వసంతాలు తొంగి చూడవు” ఒకసారి వాటిని ఊహించుకుంటే ఆ ఊహకే భయం వేస్తుంది. అలాంటి శాపగ్రస్త జీవితాలపై వసంతంలా కాదంబరి వచ్చి నిలిస్తే… చివరకు ఆ వసంతాన్ని నాశనం చేసుకున్నది ఎవరు…? ఆ వసంతాన్ని తీసుకువచ్చిన అదే శంకర్‌ రామన్‌. ఎందుకంటే… తన మనసులో ఎవరో నాటిన విషబీజాలు! వంశాల అస్తిత్వం కోసం… వారసత్వాల కొనసాగింపు కోసం కన్నబిడ్డగా సాకిన కాదంబరి కడుపు పండించమని సలహా ఇచ్చిన శాస్త్రి లాంటి వాడి మాట విని తన వ్యక్తిత్వాన్ని పూర్తిగా హననం చేసుకున్న శంకర్‌ రామన్‌ మీద అసహ్యం తప్ప మరేమీ కలగదు.

అవును కదా మరి… ”పూల మెత్తదనం కావాలి తల్లి మనసుకి. ఒక తల్లికి రెండు రకాల పిల్లలు ఉండవచ్చు… పుట్టినోళ్ళు-పుట్టనోళ్ళు. కాదంబరిని నీ పుట్టని పిల్లగా అనుకోవాలి. అలా చేయటంలోనే ఉంది గొప్పదనం. మాతృత్వం కన్నా పవిత్రమైనది మరొకటి లేదు ఆడజన్మలో. ఈ పిల్లను పెంపుడు తల్లిగా ఆదరించకూడదు. కన్నతల్లిగానే చూడాలి. కన్నతల్లి చేసే పెద్ద తప్పులను కూడా మన్నించే పిల్లల పసిమనసులు పెంపుడు తల్లి తాలూకు చిన్న చిన్న తప్పులను కూడా భరించవు. సప్తసముద్రాల చీకటి జలరాశి ఉంది కన్నతల్లికి, పెంపుడు తల్లికి మధ్య” అని గోమతికి ఉద్భోద చేసిన మనిషి తండ్రి ఎలా కట్టు తప్పకూడదో ఎందుకు ఆలోచించలేకపోయాడు? స్త్రీకి వర్తించిన ధర్మాలు పురుషులకి వర్తించవా? తండ్రంటే కాపాడే వాడుగా ఉండాలి కానీ కాలయముడుగా అనిపించకూడదు కదా?

హిస్టరీ టీచర్‌ వేదనాయకం పలకరింపు పేరుతో ఇంటికి వచ్చి అకస్మాత్తుగా ముద్దుపెట్టుకున్నప్పుడు కాదంబరి ఆలోచనా స్రవంతిని రచయిత ఎలా రాశాడో చూడండి. ”మగాడంటే చొచ్చుకుపోయే ఒక చూపు – ఆ తరువాత అనుకోని నిమిషంలో భుజం మీద పడే వెచ్చని చేయి – వణికే పెదవులు – సెంటు పొగాకుల తాలూకు తీక్షణ గంధం – బుగ్గకి నొప్పి కలిగించే దాడి రోమాలు – లొంగతీసుకునే పెదవులు – ఆ తరువాత రక్తం చిమ్మే చుంబనపు గుర్తులు పెదవి పైన – దానివల్ల గుండెలోని మంట – మగాళ్ళందరూ వేద నాయకాలే – ఒకే వేదనాయకం తాలూకు భిన్న ముఖాలు – అంతా ఇంతేనన్న మాట – ఇక్కడ కాదంబరి అనే నేను లేను. నాదైన హృదయ స్పందనలూ లేవు. బయట కనబడే నా శరీరం కూడా లేదు. ఉన్నదల్లా కొన్ని అవయవాలు మాత్రమే – నా శరీరాన్ని కోసి కొన్ని అవయవాలుగా మార్చేశాడు అతడు. అందమైన కొన్ని అవయవాలు కలవవలసిన రీతిలో కలిస్తే అది కాదంబరి అనే అమాయకురాలైన ఆడపిల్ల అవుతుంది.” స్త్రీల మనసు లోతుల్ని ఎరిగిన రచయితకు మాత్రమే ఇలా రాయడం సాధ్యం. ఆ రాత కేవలం ఒక పుస్తకంలో రాయబడ్డ వచనం కాదు. కఠోరమైన నిజం… కాదని ఏ ఆడపిల్ల అయినా అనగలదేమో అడిగి చూడండి. ఏ చూపు వెనకాల ఏ ఆలోచనలున్నాయో ప్రతి ఆడపిల్లా సహజసిద్ధంగా పసిగట్టగలదు… కానీ ఆ చూపుల అర్ధాలను అయిన వాళ్ళకైనా చెప్పడానికి సంకోచిస్తుందంటే సమాజం ఎలాంటి అపభ్రంశపు స్థానంలో ఉన్నట్లు?

రచయిత సేతు గారికి స్త్రీల మీదే కాదు, పూల మీద కూడా అంతే అభిమానం ఉన్నట్లు వెల్లడవుతుంది పుస్తకం ఆసాంతం చదివితే. వీలు కుదిరినప్పుడల్లా పూల గురించి అద్భుతంగా రాశారు. అదే పూలని స్త్రీలతో పోల్చారు. ”పూలను మొక్కల మీదే చూడాలి – అంతేకానీ పూల కొట్టువాడి కొట్టు గదుల్లో కాదు. దయాహీనంగా కోసేటప్పుడు వాటికీ ప్రాణం ఉందనే సంగతి మనం మరచిపోతున్నాం. అలా పాడవుతున్నాయి మన జన్మలు. అలా పూల శాపం అందుకుంటున్నాం.”

‘దేన్నైనా సరే దాని సహజ వాతావరణం నుంచి దూరం చేసే హక్కు మనకు లేదు కదా, కాదంబరీ. కొండవార ప్రాంతాల్లో, పొలాల గట్ల మీద, ముళ్ళ కంచెల మీద ఎదిగే పూలను కోసి, బుట్టల్లో వేసి ఊరు దాటించి, ట్రెయిన్‌లో ఇక్కడ చేరుస్తున్నప్పుడు అవి ఎంత దుఃఖిస్తాయి అని ఆలోచించావా. ఆ తరువాత వాటి గుండెల మీద దయారహితంగా సూదులతో దారాలు ఎక్కించి, పాపం! మహా పాపం!’ అదిగో… ఆ పూల శాపం వల్లనే తనకు పిల్లలు పుట్టలేదన్న గోమతి దుఃఖమిది. ఈ రచనకి పూల వ్యాపారాన్ని నేపథ్యంగా తీసుకోవడంలోనే పూలకి, స్త్రీలకి ఒకేలా ఉండే సున్నితత్వపు అంశాన్ని వెల్లడి చేయడానికి ఒక చక్కని వేదిక కుదిరింది. ”తాళి కట్టిన వాడికి యోగ్యత లేకపోతే ఆ పసుపుతాడుకేం విలువ ఉంది? ఉరి పోసుకునే తాడు కాదుగా అది” అంటూ కాదంబరి తాళికున్న విలువను లెక్కగట్టడం తప్పుగా అనిపించదు. ఎలా అనిపిస్తుంది, రోజూ కొన్ని పదుల కొద్దీ వార్తల్లో అనేక విషయాలు నానుతుంటే. మనసులుగా కలవవలసిన బంధాన్ని, తాళి కలపగలదా? తాళితో ఒక్కటయ్యామని మనసుల్ని ఒక్కటిగా చేసుకోగలిగిన ఏ కొందరో ఉండి ఉండవచ్చు కానీ.. ఆ తాళి అన్న పదానికి విలువ కట్టుకొని ఉరికొయ్యలకి వేలాడిన దేహాలు ఎంత విలువని రాస్తున్నాయి ఆ పసుపు తాడుకి. ఆలోచిస్తుంటే అంతు దొరకడం లేదు.

ఒక్కొక్క పువ్వూ వాడిపోతూ రాలిపోతూ… రంగూ వాసనా లేని వసంతం జీవితాల్లోకి వస్తే ఎలా

ఉంటుంది? ఎప్పుడైనా ఆలోచించారా? ”ప్రకృతి ఒడిలో గాలి, వాన, మంచు, ఎండ తగిలి కొండవార ప్రాంతాల్లోనూ, బహిరంగ భూముల్లోనూ ఎవరికీ తెలియకుండా ఎదిగే అడవిపూలు… వాటికి ఊరు, కులం, గోత్రాలు

ఉంటాయా? ఊరికీ కులానికీ అతీతమైన అడవి పూల లాంటి అయిదుగురు అనాధలైన వికలాంగ అమ్మాయిలని పూల పేర్లతో పిలిచే అందమైన మనసున్న శంకర్‌ రామన్‌ వాళ్ళ కులగోత్రాల గురించి, పుట్టుకల గురించి మాట్లాడుతూ వంకరచూపులు చూస్తుంటే… ఆకలైనా ఆత్మాభిమానం తరువాతే అన్నట్లుగా ఒక్కొక్కరూ వెళ్ళిపోతుంటే… అది రంగూ వాసనా లేని వసంతం కాక మరేమిటి. చివరకు ఆ అయిదుగురి లాగానే నిష్క్రమించిన ”ఆరో ఆడపిల్ల” కాదంబరి. ఆ నిష్క్రమణ వెనకాల ఎన్ని తరాల స్త్రీ చరిత్ర ఉన్నదో అర్థమయితే చాలు.

గొప్ప పుస్తకం. కూ= స్వామి గారి అనువాదం భలే ఉంది.

(సేతు ప్రముఖ మళయాళ రచయిత. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, కేరళ సాహిత్య అకాడమీ అవార్డు లాంటి ఎన్నో అవార్డులను పొందిన రచయిత. దాదాపుగా 30 పుస్తకాలు రాశారు.)

Share
This entry was posted in పుస్తక సమీక్షలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.