(గత సంచిక తరువాయి…)
కారాగారం
సాహిత్య ప్రతిభావంతులైన గొప్ప రచయితల దేశ విదేశ నవలా వాజ్మయంలో గొప్ప నవలలున్నాయి. మానవ జీవితంలోని ఎత్తుపల్లాలు, జీవన సార్థకత, పరిస్థితుల ప్రభావం, పాత్రల ఆత్మశీలత అవి వర్ణిస్తాయి. అటువంటి గొప్ప నవలలకు దుర్గాబాయి జీవితం ఏమీ తీసిపోదు. ఇంకా చెప్పవలసి వస్తే ఆ నవలల సృజనాత్మక ప్రతిభాచిత్రణ కన్నా ఆమె జీవితం గొప్పది, ఉత్కృష్టమైనది. ఏమంటే ఆమె సాహసం, త్యాగమయత, నిర్భీతి, దేశభక్తి, పట్టుదల, జీవితాదర్శాలు, సృజనాత్మక రచనలలో సాధారణంగా కన్పించక పోవచ్చు. మానవ ప్రకృతిలోని సహజాతాల ఉల్బణం, స్వభావ చిత్రణ, పాత్రల సజీవ మనోవృత్తులు, శైలి, శిల్పం మొదలైన వాటికి సృజన సాహిత్యంలో ప్రాధాన్యముంటుంది.
కానీ దుర్గాబాయి జీవితం వీటికి అతీతమైనది. సాహిత్యం మానవ చిత్రణ అయితే దుర్గాబాయి జీవితం దైవ చిత్రణ అనిపిస్తుంది. అందుకనే కల్పన కన్నా వాస్తవికత ఒక్కొక్కప్పుడు అద్భుతంగా
ఉంటుంది అనే సూక్తి పుట్టి ఉంటుంది. దుర్గాబాయి జీవిత సంఘటనలన్నీ ఈ సత్యాన్ని నిరూపిస్తాయి. భారతదేశపు ఇరవయ్యో శతాబ్దపు అత్యంత విభ్రమాస్పదమైన జీవితం ఆమెది.
అంబూరు (వాలాజాపేట రైల్వేస్టేషన్)లో ఆమెను అరెస్టు చేసి రాత్రివేళ కాబట్టి ఆమెను అరణిలో కలెక్టరు బంగళాకు తీసుకొని వెళ్ళారు పోలీసులు, జిల్లా మేజిస్ట్రేట్, కలెక్టరూ, ఆ అధికారీ. ఆయన ఆదరాబాదరా విచారణ జరిపి, చట్టబద్ధమైన ప్రభుత్వం పట్ల విద్రోహ నేరం కింద ఆమెకు ఏడాది విడి ఖైదు విధించారు. ఆమెను రాయవెల్లూరు జైలుకు తీసుకువెళ్ళి అక్కడ అధికారులకు అప్పగించారు పోలీసులు. దక్షిణ భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో రాయవెల్లూరుకు చాలా ప్రసిద్ది ఉంది. కొన్ని వేలమంది సత్యాగ్రహులను ఆ కారాగారంలో నిర్బంధించి ఉంటుంది అప్పటి ప్రభుత్వం. దక్షిణ భారతదేశ స్వాతంత్య్రోద్యమ నాయకుల స్వీయచరిత్రలలో ఈ జైలు కన్పించినంత తరచుగా మరే కారాగారం ప్రసక్తి రాదు.
దుర్గాబాయిని రాత్రికి రాత్రి అరెస్టు చేసి రాయవెల్లూరుకు తరలించారన్న విషయం ప్రజలకు తెలిసింది. వాళ్ళు బాధాపరితప్త కోపోద్రిక్త హృదయులై జైలు ఆవరణ సింహద్వారం ముందు నినాదాలు చేశారు. ఉద్వేగ భరితులై, గుంపులు గుంపులుగా చేరుతున్నారు. చొచ్చుకుని వస్తున్న వాళ్ళను నిలువరించడం జైలు సిబ్బందికి, పోలీసులకు కష్టమైపోతున్నది.
అప్పట్లో రాయవెల్లూరు జైలు సూపరింటెండెంట్ కల్నల్ తాడేపల్లి శంకరశాస్త్రి. ఈయన గురించిన మానవీయ ఉదంతాలు తిరుమల రామచంద్ర స్వీయచరిత్ర ‘హంపీ నుంచి హరప్పాదాక’లో కూడా ప్రసక్తమైనాయి.
దుర్గాబాయి అరెస్టుకు ఆందోళన చెందుతున్న నిరసనకారులను అదుపు చేయడం ఎట్లాగో తెలీని జైలు అధికారులకు శంకరశాస్త్రి దూరదృష్టి ఉపకరించింది. దుర్గాబాయమ్మనే వచ్చి ఆ ప్రజాసందోహాన్ని శాంతింపజేయవలసిందిగా ఆయన ఏర్పాటు చేశారు. ఆమె వచ్చి గాంధీజీ ఉపదేశాలను పాటించవలసిందిగా వాళ్ళకు నచ్చచెప్పి శాంతింపచేసింది.
రాయవెల్లూరు జిల్లాలో స్త్రీ ఖైదీలకు వేరే ఏర్పాటు ఉండేది. ఆమెతో పాటు ఆచంట రుక్మిణమ్మ, పొణకా కనకమ్మ, సంగం లక్ష్మీబాయమ్మ, దిగుమర్తి జానకీబాయి మొదలైన మహిళా ఖైదీలుండేవారు. జైల్లో మహిళా ఖైదీలకు కొంత స్వేచ్ఛ ఉండేది. కఠిన శిక్షా నిబంధనలుండేవి కావు. అంతేకాక దుర్గాబాయి ఎక్కడ ఉంటే అక్కడ దైన్యమూ, విషాదమూ, భయమూ, నిరుత్సాహమూ, నిర్వేదం ఉండడానికి వీల్లేదు. సంతోషమూ, సంతృప్తి, స్వావలంబనమూ, సఖ్యత, సందడి ఉండవలసిందే అని ఆమెతో జైలు జీవితం అనుభవించిన తోటి మహిళా ఖైదీల వివరణ.
అత్యంత ప్రేమాస్పదురాలైన ఒక స్నేహితురాలి పెళ్ళికి ఆమె స్నేహితురాళ్ళు ఓ పదిమంది వెళ్ళినప్పుడు ఎంత
ఉల్లాసంగా, ఉత్సాహంగా, కులాసా కబుర్లతో, నవ్వులతో, కేరింతలతో, వేళాకోళాలతో గడుపుతారో అటువంటి వాతావరణాన్ని దుర్గాబాయి ఎక్కడైనా సృష్టించగలదని, అయితే ఆమెకు ఆ మాత్రం తీరుబాటు, వెసులుబాటు ఉండాలే కాని, ఆమెతో నిర్విచారంగా గడపవచ్చునని రాయవెల్లూరులో ఆమెతో జైలు శిక్షలనుభవించిన స్త్రీ ఖైదీల అనుభవ జ్జాపకాలు, దుర్గాబాయి జీవిత చరిత్ర రాసిన రచయితలు, రచయిత్రలు పేర్కొన్నారు.
కృష్ణవేణి అని ఒక తరుణ వయస్కురాలు భర్తతోపాటు తానూ సత్యాగ్రహంలో పాల్గొని జైలు శిక్ష పొందింది. ఆమెను రాయవెల్లూరు కారాగారంలో నిర్బంధించారు. రెండు మూడు నెలలయ్యేసరికి ఆమె అప్పటికే తాను గర్భవతినని తెలుసుకుంది. ఆమె ఎటువంటి భయ సంభ్రమాలకు లోనుకాకుండా దుర్గాబాయి ఆమెను ఉల్లాసపరిచేది. ఏడవ నెల రాగానే జైల్లోనే ఆ గర్భవతికి పసుపు కుంకుమలు, సూడిదలు అనే వేడుకను కూడా దుర్గాబాయి నిర్వహించింది. అంటే పేరంటం జరిపిందన్నమాట. తోటి ఖైదీల నుంచి తలా ఒక రూపాయి ఇప్పించి బోల్డు పూలు తెప్పించింది. పెళ్ళికూతురు పూలజడ అల్లడంలో దుర్గాబాయికి ఉన్న నేర్పు కాకినాడ అంతా ఆమె చిన్నతనంలో ఎంతో సంబరంగా చెప్పుకునేవారు కదా! కృష్ణవేణిని కొత్త చీరతో, జడ నిండా పూలతో సింగారించింది దుర్గాబాయి.
జైల్లో ఖైదీలకు అధికారులు ప్రతిరోజు ఆహారపు కొలతలు (రేషన్) ఇచ్చేవారు. అంతకు పూర్వపు రోజుల్లో జైలు సిబ్బందే భోజనం తెచ్చి పడేసేవాళ్ళు. కానీ, తమకిచ్చే రేషన్ పదార్థాలను తమకు ఇప్పిస్తే తామే ఆ ఏర్పాటు చేసుకుంటామని ఖైదీలు అర్థించగా జైలు అధికారులు అంగీకరించారు. అందువల్ల ఎవరికి కావలసిన పదార్థాలు వారు కోరుకొని అందరూ వంటలైన తర్వాత వాటిని పంచుకొనేవారు. అలాగే జైల్లో తమ విధులను పంచుకొనేవారు. ఆహార పదార్థాల రేషన్‌లు అధికారుల నుంచి తీసుకొని వచ్చే బాధ్యత రుక్మిణీ లక్ష్మీపతి నిర్వహించేవారు. ఆమె స్త్రీ ఖైదీలందరిలోకి పెద్దామె. పట్టభద్రురాలు. అనుభవశాలి. విజ్ఞురాలు. సంగీత విదుషీమణి. మృదువైన స్వరంతో చక్కగా కృతులు పాడేవారు. వీణావాదనం కూడా చేసేవారు. తోటి ఖైదీలకు ఇంగ్లీషు నేర్పేవారు. జైలు ఉద్యోగులతో బహు సౌమ్యంగా వ్యవహరించేవారు.
ఇక దుర్గాబాయి వీణావాదనలో నిపుణురాలు. ఆమె గాత్ర విద్యలో కూడా సమర్ధురాలే. ఆమె పాడే జాతీయ గీతాలు కదన కుతూహలాన్ని కలిగించేవి. స్వాతంత్య్రోద్యమ చైతన్యోత్సాహాన్ని తెచ్చిపెట్టేవి. వింటున్నవారి మనోద్వేగ వాతావరణాన్ని విద్యుత్తరంగం చేసేవి అని శ్రీమతి నేతి సీతాదేవి, దుర్గాబాయి రాయవెల్లూరు జైలు జీవితాన్ని గురించి తన గ్రంథంలో ఒక ప్రకరణమే రచించారు. దుర్గాబాయి తన సహచర ఖైదీలకు హిందీ పాఠాలు నేర్పేవారట. ఆమె హిందీ పాఠాలు బహు ఉత్తేజకరంగా ఉండేవట. మధ్య మధ్య చిన్న చిన్న నాటకాలు, రసవత్తరమైన ఘట్టాలను కూడా ఆమె ప్రదర్శింపచేసేది. దుర్గాదాసు, మేవాడ పతనం వంటి నాటక దృశ్య ఘట్టాలు ఖైదీలకు ఎంతో దేశభక్తి ప్రబోధకంగా ఉండేవి. ఆమె అప్పటికి పదేళ్ళ నుంచి హిందీ పాఠాలు బోధిస్తూనే ఉంది తన విద్యార్థులకు.
జైల్లో నిస్తేజంగా, మందకొడిగా కాలం గడపకుండా తమ రంగు చీరలలో అందుకనువైన అనుగుణమైన చిన్న చిన్న భాగాలు వేరుపరచి త్రివర్ణ పతాకాలు తలపింపచేసేట్లు ఆ చీర ముక్కలను సూది దారాల ద్వారా కలిపి కుట్టి వాటిని పతాకాలుగా రూపొందించి జైలు వసారాలలో వాళ్ళు జాతీయోద్యమ నినాదాలను ప్రదర్శనలు కూడా జరిపేవారు. ఈ ఆగడాల్ని భరించలేక జైలు అధికారులు అట్లా రంగుల కలయికకు వీలు లేకుండా చీరలు వాళ్ళనుంచి జప్తు చేసేవారట. సాధ్యమైనంత వరకు తెలుపు రంగు, దానికి దగ్గర ఉండే చీరలే వాళ్ళ ఉపయోగంలో ఉండేటట్లు చర్యలు తీసుకున్నా తెల్లచీరలకే ఆకుపసరు పూసి, విడిభాగాలకు కుంకుమనో, లత్తుకనో పూసి, మధ్య రాట్నం చిత్రించి మళ్ళీ వాళ్ళు జాతీయ త్రివర్ణ పతాక రూపకల్పన సునాయాసంగా సాధించేవారు.
సాయంత్రాలు బాడ్మింటన్ ఆడేవారు. శిక్షాకాలం పూర్తయి విడుదలయ్యేవాళ్ళు దుర్గాబాయిని, ఆమె ఉత్తేజకర సాహచర్యాన్ని వీడవలసి వస్తోందని కన్నీళ్ళు పెట్టుకునేవారు. అంతేకాక జైల్లో ఇంకొక ఆనవాయితీ ప్రవేశపెట్టింది దుర్గాబాయి. అదేమంటే కొత్తగా వచ్చేవారికి స్వాగతం, విడుదలై వెళ్ళిపోయేవారికి వీడ్కోలు. ఈ సన్నివేశాలు ఆత్మీయ స్నేహితురాళ్ళ ప్రసంగాలతో, ప్రబోధాలతో సాగేవి. మళ్ళీ త్వరగా అరెస్టయి రావాలి అని శుభాశంసలు పలికేవారు తోటి ఖైదీలు. అంటే సత్యాగ్రహోద్యమం మరింత ముమ్మరం కావాలని ఆశించడం. మరి కొత్తగా వస్తున్న వారికి మరేం బెంగ పెట్టుకోకండి, వియ్యాలవారి విడిదిల్లుగా ఇక్కడ గడపవచ్చునని వాళ్ళకు భరోసా పలకడం.
విడుదలై వెళ్ళేవారితో జైలు వార్తలు, నిర్వహణ రీతులు, రావలసిన సంస్కరణల గురించి బయట ఉద్యమాన్ని నడుపుతున్న నాయకులకు వార్తలు చేరవేసేవారు దుర్గాబాయి బృందం. అట్లానే కొత్తగా వస్తున్న ఖైదీల ద్వారా సత్యాగ్రహోద్యమ ఫలితాలను, పర్యవసానాలను తెలుసుకుంటూ ఉండేవారు. వీటిని లిఖితపూర్వకంగా నాయకులకు చేరవేయడానికి కాగితం చీటీల మీద వార్తా సేకరణ చేసి అవి జైలు అధికారుల సోదాలలో బయటకు పొక్కకుండా తాము ఉపయోగించే దిండ్లు చీల్చి, ఈ సమాచార పత్రాలను వాటిలో కట్టుదిట్టంగా ఉంచి మళ్ళీ ఆ దిండ్లను ఎప్పటిలాగా ఉండేలా కుట్టివేసేవారు.
దుర్గాబాయిని చూడడానికి తల్లీ, తమ్ముడూ నెలకోసారి రాయవేలూరు జైలుకు వచ్చి ఆమెను చూసిపోతున్నప్పుడు ఆమె మరికొన్ని వివరాలు, ముఖ్య వార్తలు సేకరించేది. వాళ్ళు దుర్గాబాయికి ఊరగాయలు, నెయ్యి కూడా తెచ్చి ఇస్తుండేవారు. వీటినామె తోటి ఖైదీలతో పంచుకునేది. అప్పుడప్పుడామె, జైలులో రాజభోగాల గురించి స్వీయ కవితలల్లి అనుచరగణాన్ని నవ్విస్తూ ఉండేది. మొత్తానికి ఆమె సమక్షంలో తోటి ఖైదీలు చీకూ చింతా లేకుండా గడిపారు. పైగా ఈ మహాయజ్ఞంలో పాల్గొంటున్నందుకు వాళ్ళకు ఉత్తేజకరంగా కూడా అనిపించేది.
మధ్యమధ్య అర్థరాత్రి, అపరాత్రి జైలు అధికారులను, చిరుద్యోగులను ఆటలు పట్టించి వినోదం పొందుతుండే వాళ్ళు. ఏదో ప్రమాదం ముంచుకొని వచ్చినట్లు కేకలు వేస్తే జైలు అధికారులు నిద్రాభంగమై పరుగులు పెట్టేవాళ్ళు. అది ఖైదీలకొక వినోదం. తీరా దృశ్య స్థలానికి వస్తే అక్కడ ప్రమాద సూచనలేమీ ఉండేవి కావు. జైలు ఉద్యోగుల ఆర్భాటం, హడావుడి, సణుగుడు, విసుగులను వాళ్ళు వెళ్ళిన తర్వాత తాము అభినయించి ఆనందించేవారు స్త్రీ ఖైదీలు.
జైల్లో ఈ స్త్రీ ఖైదీలకు అన్నింటికన్నా ముఖ్యమైన కార్యక్రమం ఒకటి ఉండేది. అది ఏంటంటే నూలు వడకడం. పోటీలు పడి చర్ఖామీద నూలు వడికేవాళ్ళు వారు. రెండు వందల గజాల నుంచి రెండు వేల గజాల వరకు నూలు వడికేవారంటే వాళ్ళ దీక్ష ఏమిటో అర్థం చేసుకోవచ్చు. దుర్గాబాయి క్రమం తప్పకుండా 2000 గజాల నూలు తీసేదట రోజూ. పైగా ఆమె అతి సన్నని, నాజూకైన, అందమైన నూలు తీసేదట.
ఒకరోజు జైలు సూపరింటెండెంట్ భార్యాసహితుడై ఆడ ఖైదీల నిర్బంధావాసపు బాగోగులు పరిశీలించడానికి వచ్చాడు. అప్పుడు దుర్గాబాయి రాట్నం మీద నూలు తీస్తున్నది. ఆ నూలు నాజూకుతనానికి సూపరింటెండెంట్ భార్య ఎంతో ముచ్చట పడింది. అప్పుడు దుర్గాబాయి అప్పటిదాకా తీసిన నూలును ఒక చిలపలాగా రూపొందించి సూపరింటెండెంట్ గారి భార్య మెడలో వేసి ఆమెకు బహుకరించిందట. అప్పటి జైలు సూపరింటెండెంట్ మేజర్ ఖాన్. ఆయన భార్య విదేశీ (యూరోపియన్) వనిత. ఈ విధంగా తనకు దుర్గాబాయి స్వాగతం చెప్పడం, పొందికైన నూలు దండను బహుకరించడంతో ఆ ఆంగ్లేయ వనిత మహదానందపడిపోయి మరుసటి రోజున దుర్గాబాయి బృందానికి బుట్టెడు పళ్ళు పంపిందట.
ఇటువంటి సంఘటనలు, సన్నివేశాలు స్వాతంత్య్రోద్యమ సమరంలో కొన్ని సంభవిస్తూ ఉండేవి. గుంటూరులో అప్పటి సూపరింటెండెంట్ ఇంగ్లీషు దొర. ఆయన భార్య ఐరిష్ వనిత. ఐర్లండ్ ప్రజలు స్వతహాగా స్వాతంత్య్ర ప్రియులు. వాళ్ళు ఇంగ్లండుపై యుద్ధాన్ని కూడా ప్రకటించారు స్వాతంత్య్రం విషయంలో. అందువల్లనే తెలుగునాట నుంచి ‘లా’ చదవటానికి వెళ్ళే విద్యాధికులు ఐర్లండును ఎంపిక చేసుకొనేవారు. ఈ ఐరిష్ వనిత తన భర్తను సత్యాగ్రహోద్యమ నాయకులను అమానుషంగా, క్రూరంగా దండనలకు గురిచేస్తే మనమధ్య మర్యాదగా ఉండదు అని కూడా హెచ్చరించినట్లు కోటంరాజు రామారావు స్వీయచరిత్రలో ఉంది. కోటంరాజు వారే ఇంకొక ఆసక్తిదాయకమైన విషయం కూడా ప్రస్తావించారు స్వీయ చరిత్రలో. అదేమంటే కొండా వెంకటప్పయ్యగారు అప్పటికే అరవై ఏళ్ళు దాటినవారు, సత్యాగ్రహులందరికీ పూజనీయుడు, ప్రేమపాత్రుడు. గాంధీగారే కొండా వెంకటప్పయ్య గారిని గురించి ఆంధ్రదేశం వచ్చినప్పుడు తన కార్యక్రమ నిర్వహణ సంయోజకుడు వెంకటప్పయ్యగారే కాబట్టి ‘ఏడీ నా జైలరు’ అని వెంకటప్పయ్యగారిని గురించి ఉద్దేశించి చమత్కరించేవారని కొండావారే స్వీయచరిత్రలో ప్రసక్తం చేశారు. కొండా వెంకటప్పయ్యగారు గాంధీజీ కన్నా వయసులో రెండేళ్ళు పెద్ద. గాంధీగారు ఆయనతో చాలా చనువుగా వ్యవహరించేవారని కొండా వారి స్వీయచరిత్ర ద్వారా తెలుస్తున్నది.
ఇక కోటంరాజు వారి స్వీయచరిత్రలో వర్ణించిన సన్నివేశం ఏమంటే కొండా వారికి జైల్లో ఆహార సౌకర్యం కొరవడింది. జైలు వాళ్ళు ఇచ్చే ఆహారం ఆయనకు పడడం లేదు. తినలేకపోతున్నాడు. ఆ వయసులో ఆయన వంట ఏమి చేసుకుంటాడు? ఈ విషయం గ్రహించి ఒక పోలీసు అధికారి గుంటూరు అంతటికీ గొప్ప వంటరాజుగా ప్రసిద్ది చెందిన, పాక కళాప్రపూరుణ్ణి సంప్రదించి ‘ఏమయ్యా, పంతులుగారి సేవ చేసుకుంటావా?’ అని అంగీకరించజేసి, సత్యాగ్రహోద్యమంలో పాల్గొంటున్నాడు, ప్రమాదకారి అని ఆ వంటాయనపై అభియోగం మోపి కటకటాల వెనక్కు నెట్టాడట.కొన్నాళ్ళయినా ఆయన వెంటకప్పయ్యగారికి భోజనం తయారు చేస్తాడు కదా! అని. కోటంరాజు రామారావుగారు వర్ణించిన ఈ ఉదంతంలో ఆయనవి కొంత హాస్యోక్తి, దేశభక్తి ప్రవృత్తి ఉండవచ్చు కానీ, దేశీయాధికారులలో కొందరికి భారత స్వాతంత్య్రోద్యమం పట్ల సానుభూతి ఉండేదని ఆనాటి చారిత్రక సత్యాలు చెబుతున్నాయి. కోటంరాజు రామారావు స్వీయచరిత్ర పేరు ‘పెన్ ఈజ్ మై స్వోర్డ్ (కలమే నా ఖడ్గం)’. ఆయన భారతదేశం గర్వించదగిన పత్రికా సంపాదకులలో ప్రముఖుడు.
రాయవెల్లూరు జైలులో అజమాయిషీ అధికారి మేజర్ ఖాన్ శ్రీమతి జైలులో స్త్రీ ఖైదీల పట్ల కనబరచిన మెప్పూ, సానుభూతీ ఆవిడ వారికి పంపిన బుట్టెడు పండ్లే సాక్ష్యమిస్తున్నాయి. దుర్గాబాయి జైల్లో తొమ్మిది నెలలో, పది నెలలో వడికి తీసిన ప్రశస్తమైన నూలును కండెలుగా భద్రపరచి ఒకసారి తల్లి ఎప్పుడో తనను చూడడానికి వచ్చినపుడు ఆమెకు అందచేసింది. దాంతో పొందికైన ధోవతుల జత నేయించవామ్మా అని కూడా కోరింది. ఈ ధోవతుల జతకు అందమైన ఆకుపచ్చ అంచు రేఖలుండాలని కూడా చెప్పింది.
ఇట్లా ఎందుకామె కోరుకున్నదంటే తాను పధ్నాలుగేళ్ళ బాలికగా ఉన్నప్పుడు కాకినాడ కాంగ్రెస్ సమావేశాలలో జవహర్‌లాల్ నెహ్రు అటువంటి ఆకుపచ్చ అంచు ఖద్దరు పంచె ధరించడాన్ని ఆమె చూసింది. అటువంటి ధోవతులు ఆయనకు ఇష్టమేమోనని ఆ బాలిక మోజుపడింది. జైలు నుంచి దుర్గాబాయి విడుదలైన తర్వాత అప్పుడే జరుగుతున్న కాంగ్రెస్‌కు (1931) ఆమె హుటాహుటిన వెళ్ళింది. అప్పుడామె తల్లిగారి ద్వారా తాను నేయించిన ధోవతుల చాపు కూడా తీసుకొని వెళ్ళింది. జవహర్‌లాల్ నెహ్రుకు వాటిని బహుకరించింది. ఆయన చాలా ఆనందించి ఆ సమావేశాలలోనే ఒకరోజు వాటిని ధరించి వేదిక మీద కనపడ్డారామెకు. అప్పటికి జవహర్‌లాల్ నెహ్రుకు నలభై ఏళ్ళు దాటి ఒకటో, రెండో ఏళ్ళు ఉంటాయేమో. ఆయన ‘ఏమమ్మా! ఎవరైనా చెల్లికి మాడలో, మాన్యాలో బహుకరిస్తారు కానీ నువ్వేమిటి అన్నగారికే అరుదైన సత్కారం చేస్తున్నావే’ అని మేలమాడాడుట. ఆమె ఎంతో ఆనందం పొంది ఉంటుంది. దుర్గాబాయి కన్నా నెహ్రు ఇరవై ఏళ్ళు పెద్ద. ఆయనకొక చిన్న చెల్లి ఉంటే ఆమెలాగా ఉండేదేమో!
ఇది భవిష్యదృత్తాంతం. కానీ రాయవెల్లూరు జైలులో దుర్గాబాయి అంత దీక్షగా, తమకంతో వడికిన ప్రశస్తమైన నూలు ప్రియమైన అన్న వంటి నెహ్రుకు బహుకరణార్థమే అని ఆమె అంతరాంతరాలలో ఆశించి ఉండవచ్చు.
ఇదిలా ఉండగా ఉప్పు సత్యాగ్రహం ఉప్పెనను నిభాయించుకోలేకపోయింది బ్రిటిష్ ప్రభుత్వం. ఆ తాకిడిని నిలువరించలేకోయింది, తట్టుకోలేకపోయింది. దేశవ్యాప్తంగా ఒక లక్ష మంది కారాగార శిక్ష అనుభవించారని అంచనా. అందువల్ల బ్రిటిషు ప్రభుత్వం మహాత్మాగాంధీతో సంప్రదింపులకు సమాయత్తమైంది.
In January 1931 Gandhi and several other top Congress leaders were released from prison. There followed conversations between Gandhi and the Viceroy Lord Irwin, leading to the Gandhi – Irwin agreement of March 5, Lord Irwin promised, that the Congress would call off civil disobedience and send representatives to the second round table conference, which met in London from September 4 to December 1. P. 254. Editorial.
Note: The Gandhi reader by Homer A. Jack – second Impression, January 30, 1984. The editorial note – is to the writing of Mahadev Desai entitled ” The Real conference”.
ఈ సమావేశం లండన్‌లో సెప్టెంబరు 14 నుంచి డిసెంబరు 1 వరకు జరగబోతున్నది. లండన్‌లో గాంధీజీ దినచర్య కార్యక్రమాలను మహాదేవ దేశాయి తన వ్యాసంలో విపులంగా వర్ణించారు.
గాంధీ-ఇర్విన్ ఒడంబడిక ఫలితంగా మార్చి 7, 1931 తేదీన దుర్గాబాయి రాయవెల్లూరు జైలు నుంచి విడుదల పొందింది. ఆమె వెంటనే మద్రాసు చేరి అక్కడ నుంచి కరాచీ కాంగ్రెస్‌కు హాజరు కావడానికి కరాచీ వెళ్ళింది. 1931లో కరాచీ కాంగ్రెస్ సమావేశం జరిగింది. కరాచీ కాంగ్రెస్ ముగియగానే ఆమె బొంబాయిలో జరుగుతున్న హిందుస్థాన్ సేవాదళ్ శిక్షణ శిబిరంలో అధ్యయన తరగతులకు హాజరైంది.
లండన్‌లో జరుగుతున్న గాంధీ-ఇర్విన్ సంప్రదింపులు విఫలమైనాయి. మళ్ళీ భారతదేశంలో సత్యాగ్రహోద్యమం ముమ్మరంగా పుంజుకుంది. బొంబాయి నుంచి (ఇప్పుడు ముంబై) దుర్గాబాయి కాకినాడ వచ్చింది. అక్కడ సత్యాగ్రహోద్యమం తీవ్రతరమైంది. కాంగ్రెస్ సభలను, సమావేశాలను చెదరగొట్టడానికి, వాటిపై జులుం ప్రదర్శించడానికి కాకినాడలో పోలీసు అధికారి డప్పుల సుబ్బారావు అకృత్యాలు, మితిమీరిపోయాయి. (డప్పుల సుబ్బారావు అసలు పేరు బయపునేడి సుబ్బారావు) కాంగ్రెస్ సభలు జరిగే చోట తన డప్పుల బృందంతో వక్తల ప్రసంగాలు శ్రోతలకు వినపడనీయకుండా, సభాసదులంతా ఆందోళన చెందేట్లుగా విపరీతంగా డప్పు చప్పుళ్ళ ప్రదర్శనలు ఏర్పాటు చేయించేవాడు సుబ్బారావు. అందువల్ల అతడికి ఆ పేరు వచ్చింది. అతడు ముస్తఫా ఆలీఖాన్ తాబేదారు. తన పై అధికారిని మెప్పించి కితాబు అందుకోవాలని అతని తాపత్రయం.
కాకినాడలో అనుదినం సభలు జరిపి, విదేశీ వస్త్ర దహనం, మద్యపాన నిషేధం, ఖద్దరు అమ్మకాలపై బ్రహ్మాండమైన ప్రచారం సాగించారు సత్యాగ్రహులు. ఒకసారి కాకినాడ పురమందిరం సభలో పెద్దలు పట్టుబట్టి దుర్గాబాయి చేత జాతీయ గీతాలు, స్వాతంత్య్ర పోరాటపు పాటలు పాడించాడు. ఆ సభకు అధ్యక్షులు బులుసు సాంబమూర్తి గారు. డప్పుల సుబ్బారావు ఆ సభ జరగనీయకూడదనే పట్టుదలతో ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి పరిసరాలన్ని అదిరిపోయేట్లు డప్పుల చప్పుడు ఏర్పాటు చేశారు. అప్పుడు సభలోని వారంతా ఆ డప్పుల చప్పుడు హోరును మించిపోయేటట్లు దుర్గాబాయి పాడుతున్న పాట చరణాలను అందుకొని పాడడం సాగించారు. సుబ్బారావుకు శృంగభంగమయింది.
ఆ తరువాత బులుసు సాంబమూర్తి గారు స్వాతంత్య్రోద్యమ ద్షీను, సత్యాగ్రహ కార్యక్రమాన్ని ఆవేశ గంభీరంగా ప్రబోధిస్తుండగా ఆయన ప్రసంగం రాజద్రోహ పూరితంగా ఉందని తన పోలీసు బలగంతో భయంకరంగా లాఠీఛార్జి జరిపించాడు సుబ్బారావు. స్వయంగా తాను కార్యరంగంలోకి దూకి సాంబమూర్తి గారి శిరస్సు బద్దలయ్యేట్లు ఆయన్ను మోదాడు. ఆయన స్పృహ తప్పి పడిపోయాడు. రక్తం మడుగు కట్టింది వేదికపై. అయినా కాకినాడలో సత్యాగ్రహోద్యమం ఆగలేదు. ఇంకా ఉధృతమైంది. ఖద్దరు అమ్మకాలు ఊపందుకున్నాయి. ‘విదేశీ వస్తువుల అమ్మకాలు నిరాకరించాలి, నిషేధించాలి, బహిష్కరించాలి’ అని విక్రయశాలల ముందు నిరసన ప్రదర్శనలు పెద్దపెట్టున సాగాయి. కల్లు విక్రయించే చోట్ల మద్యం అమ్మే చోట్ల సత్యాగ్రహుల అమ్మకపు నివారణ దీక్షలు, ఆటంక ప్రయత్నాలు బలవత్తరమైనాయి.
దుర్గాబాయి తల్లి కృష్ణవేణమ్మ గారు అంతకు పన్నెండేళ్ళ ముందే అంటే 1920, 21 ప్రాంతాల నుంచే కాకినాడలో ఖద్దరు అమ్మకాలను ఇంటింటికీ తిరిగి సాగించేవారు. ఇప్పుడు కూడా మరింత పట్టుదలతో ఖద్దరు ప్రచారాన్ని ఆమె కొనసాగించారు. అందువల్ల ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. శిక్ష కాలానికి కన్ననూరు పంపించటానికి ముందు కృష్ణవేణమ్మ గారిని విచారణ జరపడానికి ముందు నేరస్తురాలిగా కాకినాడ జైలులో కొన్నాళ్ళు ఉంచారు. ఆమెను చూసి మాట్లాడడానికి వెళ్ళిన దుర్గాబాయిని కూడా కొన్నాళ్ళు ఆ సబ్ జైలులో ఉంచారు.
ఆ తర్వాత దుర్గాబాయిని మళ్ళీ రాయవెల్లూరు జైలుకు మార్చారు. ఆ జైల్లో ఈసారి ఆమెను నిర్భంధించిన సందర్భంగా స్త్రీల ప్రత్యేక విభాగం లేదు. కొత్తగా వచ్చిన ఖైదీలను, పాత ఖైదీలతో పాటే ఒక పెద్ద హాలులో డెబ్భై, ఎనభై మందిని నిర్బంధించిన చోటనే ఆమెను కూడా చేర్చారు. జైళ్ళకు వచ్చే సత్యాగ్రహోద్యమ నిర్బంధితులకు జైళ్ళలో చోటు చాలక ఇట్లా చేయవలసి వచ్చి పెద్ద హాలులో మనిషి పడుకోగల దిమ్మలు ఏర్పాటు చేసి పక్క పక్కనే ఖైదీలను ఉంచేవారని తిరుమల రామచంద్ర స్వీయ చరిత్రలో చెప్పారు. ఆయనా 1930 సత్యాగ్రహంలోనే రాయవెల్లూరు జైలులో సుమారు ఒక సంవత్సర కాలం శిక్ష అనుభవించారు. (చూ.హంపీ నుంచి హరప్పా దాకా)
(ఇంకా ఉంది)