(భూమిక నిర్వహించిన కథ, కవితల పోటీలో మొదటి బహుమతి పొందిన కథ)
థియేటర్ ఆఫ్ ఆర్ట్స్ డిపార్ట్‌మెంట్…
తరగతులు అయిపోయాయి; డిపార్టుమెంటులో విద్యార్థులెవరూ లేరు. ప్రొఫెసర్ శంకరరావు ఒక్కరే తన ఛాంబర్‌లో ఏదో పనిలో నిమగ్నమైవున్నారు. అప్పుడప్పుడూ వాచీవైపూ, తలుపువైపు చూస్తున్నాడు. ఇంతలో తలుపుదగ్గర చప్పుడైంది. అతడి కళ్లు ఆశగా విప్పారాయి.
”మే ఐ కమిన్ సార్..” శ్రావ్యమైన గొంతు తలుపు అవతలనుండి..
”ఓహ్! సరోజా.. నీకెన్ని సార్లు చెప్పాను.. నా దగ్గరకొచ్చేటప్పుడు అనుమతి అడగనవసరంలేదని..రా.. రా.. నీకోసమే చూస్తున్నాను..” చేతులు పిసుక్కుంటూ ఆమె కళ్లల్లోకి చిలిపిగా చూశాడు శంకరరావు. ఆ చూపులు తాళలేక సరోజ తల దించేసుకుని ”రమ్మన్నారట.. ఎందుకుసార్..” అనడిగింది.
శంకరరావు అసహనంగా కుర్చీలోంచి లేచి ”ఏంటి సరోజా! ఏం తెలియనట్లు కొత్తగా అడుగుతావు.. టైమంతా ఇలాగే గడిపేస్తున్నావ్.. అప్పుడే పిహెచ్‌డి మూడో సంవత్సరంలోకి వచ్చేశావు.. ఈ ఏడాది నేను అప్రూవల్ ఇవ్వాలి. ఇంకా చాలా వర్క్ పెండింగులో ఉండిపోయింది. నువ్వు చూస్తే ఇంకా మొగ్గలా ముడుచుకునే ఉన్నావు.. ఇలా అయితే ఎలా?!.. పిహెచ్‌డి ఎలా పూర్తి చేస్తావ్?” గుంభనంగా అన్నాడు.
సరోజ ఏం మాట్లాడలేదు. మౌనంగా నేలచూపులు చూస్తుండిపోయింది.
అతను ఆమె దగ్గరకంటా వచ్చి ”ఏంటి.. మాట్లాడవేంటి సరోజా! నేనడిగిన విషయం గురించి ఏమాలోచించావు.. అసలెందుకింతలా బెట్టు చేస్తున్నావు.. లోకంలో ఎక్కడా జరగని విషయమేం కాదుకదా.. యూనివర్సిటీల్లో ఇది కామన్ అయిపోయింది ఈ రోజుల్లో.. తప్పదు.. నీ భవిష్యత్తుకోసమైనా ఆలోచించవా.. ఎంతో పైకి రావలసినదానివి.. పైకి తీసుకురావాలని నేను చూస్తుంటే…” అని ఆమె గెడ్డం పట్టుకుని తల పైకెత్తాడు. ఆమె కళ్లల్లో నెత్తురు చుక్కలేదు. నిర్వీర్యంగా అతడివైపు చూశాయవి!
”సర్.. ప్లీజ్.. సర్.. నేనలాంటిదాన్ని కాదు సార్.. నేను మీ స్టూడెంట్‌ని సార్..”
”పిచ్చి సరోజా! నేను మాత్రం అలాంటివాడినా.. అవసరం అలాంటిది.. ప్రొఫెసరా.. స్టూడెంటాఖ అన్నది కాదు సమస్య. నువ్వు ఆడ.. నేను మగ.. ఇది ఆడ మగ అవసరం.. దానిని నువ్వు అర్థం చేసుకోవాలి.. నేను మాత్రం మనిషిని కానా.. నాకు మాత్రం కోరికలుండవా.. చెప్పు..”
సరోజ చెవులు మూసుకుంది. తన కోరిక ఎంతకీ తీర్చడంలేదని అప్పటికే శంకరరావు నషాళానికి ఎక్కి ఉన్న కోపం ఒక్కసారిగా భగ్గున మండింది. ఆడదాన్ని అక్కున చేర్చుకోవాలంటే ఆవేశం పనికిరాదని ఆ మంట అదుపు తప్పకుండా దానిమీద కాసిన్ని నీళ్లు చిలకరించి అతడు లాలనగా మాట్లాడడానికి ప్రయత్నించాడు.
సరోజ అదేమీ పట్టనట్టుగా ”సర్! ఇదిగోండి సార్.. మీరడిగిన మెటీరియల్..” అని అతని చేతికి పేపర్ల కట్టని అందించింది. శంకరరావు వాటిని తిప్పి చూశాడు.. చూశాడు.. చూశాడు.. ఎక్కడ కాలిందో ఏమో, ఒక్కసారిగా ఆ పేపర్లని సరోజ మొఖానికేసి విసిరికొట్టాడు. పేపర్లు చిందరవందరగా గదంతా చెల్లాచెదురయ్యిపోయాయి. సరోజ బిక్కచచ్చిపోయింది.
”ఇదిగో నేను తల్చుకుంటే నీ పిహెచ్‌డిని మొదటి సంవత్సరంలోనే క్యాన్సిల్ చేయించేసేవాడిని.. పోనీలే అని దయతలిచాను.. ఏదో ఒకరోజు ఒప్పుకుంటావని ఇంతదాకా రానిచ్చాను.. మిడిల్‌క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చావు.. ఇంత మిడిసిపాటా?!.. నన్ను కాదని నువ్వు పిహెచ్‌డి చేయగలవా? ఆఁ చెయ్యగలవా?!” అంటూ గద్దించాడు. తన డిపార్టుమెంటు మిగతా డిపార్టమెంట్లకు దూరంగా
ఉండడంమూలాన తన కేకలు ఎవరికీ వినిపించవని ఏమాత్రం తగ్గకుండా కేకలు వేశాడు. ”ఏదో పిహెచ్‌డి అయిపోతే టీచింగ్ అసోసియేట్ పోస్టు ఇప్పిద్దాంలే అనుకున్నాను.. కానీ ఎంతకీ అర్థం చేసుకోవే.. వెళ్లు.. ఇక నీ పిహెచ్‌డికి అప్రూవల్ ఇవ్వను.. నీ థీసిస్‌మీద సంతకం చెయ్యను.. ఏం చేసుకుంటావో చేసుకో.. పో.. గెటవుట్.. ఇక నాకు కనిపించకు..” ఉరిమాడు.
ఆ ఉరుములకు సరోజ అదిరిపోయింది. ”సార్.. సార్.. ప్లీజ్ సార్.. అలా అనకండి సార్.. మీ కాళ్లు పట్టుకుంటాను సార్..” అని అతని పాదాలపై పడింది. అతను కాళ్లను వెనక్కి లాగేసుకున్నాడు. సరోజ ముందుకెళ్లి అతని కాళ్లు పట్టుకుంది. అతనికి అంతలోనే ఏమైందో.. ఏ నరంలోంచి అతని బుర్రలోకి ఏ మాయదారి సర్పం నెత్తికి పాకిందో ఉన్నట్టుండి ఐసయ్యిపోయాడు. వంగి ఆమె భుజాలపై చెయ్యి వేసి ఆర్తిగా తడుముతూ పైకి లేపాడు.
”ఎందుకు నువ్విలా కష్టపడతావు.. నన్నెందుకిలా కష్టపెడతావు.. ఇదంతా నీకూ నాకూ అవసరమా చెప్పు.. నేను నిన్ను కష్టపెట్టను.. సుఖపెడతాను.. ఒక్కసారి ఒప్పుకో ప్లీజ్.. బతిమాలుతున్నాను..” అతని చేతులు ఆమె భుజాలపైనుండి కిందకు దిగిపోతుండగా సరోజ తేరుకుని గభుక్కున అతడిని దూరంగా నెట్టింది. ”ప్లీజ్ సరోజా.. సరోజా.. ప్లీజ్.. సరోజా.. కాదనకు సరోజా..” అంటూ అతడు మీద మీదకు వచ్చాడు. సరోజ దూరం దూరంగా జరిగింది. పొయ్యిమీద ఎసరులా పొంగింది అతగాడి కోపం!
”ఇదిగో ఇదే నీకు ఫైనల్‌గా చెప్పడం.. నేను అడిగింది ఇచ్చావా సరేసరి.. లేకపోతే ఇక నీ పిహెచ్‌డి సంగతి మర్చిపో.. నీకు ఒక్కరోజు టైమిస్తున్నాను.. ఆ లోపు నువ్వు ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే నీ పిహెచ్‌డి క్యాన్సిల్ చేసేస్తాను. అసలు నీకు పిహెచ్‌డి చేసే అర్హతే లేకుండా చేసేస్తాను. ఎంతకాలమని చూడాలి.. దేనికైనా ఓ హద్దంటూ ఉంటుంది.. ఇక నేను ఆగలేను.. ఒప్పుకుంటే రేపు చీకటిపడ్డాక నేను చెప్పిన చోటుకి రా.. కష్టమైనా ఇష్టం చేసుకుని రా.. నేను చెప్పాల్సింది చెప్పాను.. ఆపై నీ ఇష్టం వచ్చినట్టు ఏడు..” ఆఖరి మాటగా చెప్పాడు శంకరరావు.
సరోజ మాన్ప్రడిపోయింది. అతడి మాటలు రేపిన మంటలు తన గుండెను మండిస్తుండగా ఆమె అక్కడి నుండి నిశ్శబ్ధంగా నిష్క్రమించింది.
… … …
శాతవాహన హాస్టల్..
ఆ హాస్టల్ మూడో అంతస్తులోని తన రూములో ఒంటరిగా సరోజ తలగడలో ముఖం దూర్చి రోదిస్తూ ఉంది. తన నిస్సహాయతని నిందిస్తూ కుమిలిపోతూ ఉంది. ఎన్ని కలలు కన్నది తను! థియేటర్ ఆర్ట్స్‌లో మాస్టర్ డిగ్రీ చేయాలని, పిహెచ్‌డీ కూడా చేసి యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా చేరాలని… ఎన్ని కలలు కన్నది!! ఇప్పుడు ఆ కలలన్నీ కల్లలు అవుతాయా? ఎంతో పొందికగా తను కట్టుకుంటున్న ఆశలసౌధం తన కళ్లముందే కుప్పకూలిపోతుందా? ఆమెలో అంతులేని భయం పేరుకుంది. ”ఎన్ని నాటకాలు రాశాను… ఎంత గొప్పగా స్టేజీ నాటకాలు ఆడాను.. ఎన్ని బహుమతులు గెలుచుకున్నాను.. ఎంతమంది ఉద్దండుల ప్రశంసలు అందుకున్నాను.. ఎంత మంది షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్లు నాచేత మాటలు రాయించుకున్నారు. ఆఖరుకి సినిమాల్లో కూడా అవకాశాలొచ్చాయి.. ఇన్ని సుగుణాలు ఉన్న నాకు, నా పిహెచ్‌డీకి ఎన్ని రిమార్కులు వేస్తున్నాడు ప్రొఫెసర్..” ఆలోచనలు.. ఆలోచనలు.. ఆలోచనలు.. ఎడతెగని ఆలోచనలు…
ఇంతలో ”దబ్.. దబ్” మని తలుపు చప్పుడు! సరోజ లేచి వెళ్లి తలుపు తీసింది. ఎదురుగా రాగిణి. తన కొలీగ్. తనతోపాటూ పిహెచ్‌డి చేస్తోంది. నాటకాలు బ్రహ్మాండంగా ఆడుతుంది. ఆమె లోనికి వస్తూ ”ఏంటి డల్‌గా ఉన్నావు?” అని సరోజవైపు సందేహంగా చూస్తూ అడిగింది.
సరోజ ”ఏంలేదు.. కూర్చో..” అంటూ కుర్చీ చూపించింది. రాగిణి కూర్చుని ”కళ్లేమిటి ఎర్రగా ఉన్నాయి.. ఏదో ఉంది.. ఏం జరిగింది?” అని రెట్టించింది. సరోజ మాట్లాడలేదు. ”నువ్వు నోరు విప్పడంలేదంటే ఏదో జరిగిందనే కదా అర్థం.. కొన్ని రోజులుగా చూస్తున్నాను.. నువ్వు మరీ డల్‌గా కన్పిస్తున్నావు.. ఏం జరుగుతోంది నీవెనుక.. నా అనుమానం నిన్ను ఆ శంకరరావుగానీ టార్చర్ పెట్టడంలేదుకదా..” అని సరోజ దగ్గరకు వచ్చి ఆమె భుజంపై చెయ్యి వేసి కుదిపింది. సరోజ దుఃఖం ఆపుకోలేకపోయింది. ఆమెను పట్టుకుని భోరున ఏడ్చేసింది.
”ఎయ్ సరోజా! చిన్నపిల్లలా ఏడుస్తావేంటి? ఆపు.. ముందు ఏం జరిగిందో చెప్పు..”
సరోజ జరిగిందంతా చెప్పింది. చచ్చిపోవాలనిపిస్తోందని ఏడ్చింది.
రాగిణికి మాచెడ్డ కోపమొచ్చింది. ”చచ్చి ఏం సాధిస్తావు.. నీవాళ్లకు కడుపుకోత మిగులుస్తావు.. అంతకుమించి ఏం సాధిస్తావు..” నిష్టురమాడింది. ఆమె లేచి కిటికీ వద్దకు వెళ్లి అందులోంచి యూనివర్సిటీని చూస్తూ ”ఈ సమాజంలో చావలేని దుస్థితిలో ఎందరో పరిస్థితులకు లొంగి బతుకులు వెళ్లదీస్తున్నారు. నువ్వూ అలా పరిస్థితులకు సర్దుకుపో.. సర్దుకుపోతే సమస్యలన్నీ సద్దుమణిగిపోతాయి..” వెనక్కి తిరిగి సరోజవైపు నర్మగర్భంగా చూసింది.
సరోజకు మండుకొచ్చింది. రాగిణివైపు ఎర్రగా చూసింది. ఆమె ఉద్దేశాన్ని గ్రహించి ”నేనన్నదాంట్లో ఏమన్నా తప్పుందా? అటో ఇటో ఏదోటి చేయాలికదా.. శంకర్రావు మాట వింటే నీ జీవితం పల్లకీ ఎక్కుతుంది. లేదంటే నువ్వు బోయీలా మిగులుతావు.. ఏది బెటర్ నీకు..” అనింది రాగిణి.
”ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు?” అని అరిచింది. ఆ అరుపు గదిలో ప్రకంపించింది.
”నీ కోపం నామీద కాదే.. ఆ శంకర్రావుమీద చూపించు.. చూడు సరోజా! ఈ లోకంలో బతకాలంటే ఒకటి: ఈ లోకానికి లొంగిపోవాలి. రెండు: నిన్ను వాడుకోవాలని చూసే లోకాన్ని లొంగదీసుకోవాలి. మూడు: పరిస్థితులకు దూరంగా పోవాలి. లొంగిపోవాలి అనుకుంటే నేను చెప్పినట్టు చెయ్యి.. లేదా లొంగదీసుకోవాలి అనుకుంటే మాత్రం పోరాటం చెయ్యి.. లేదా మీ ఇంటికి పో.. అంతేగానీ చస్తాను.. గిస్తాను.. అని చావుకబుర్లు చెప్పకు.. నాకు చిరాకు..” అని చెప్పి చురుచురామని గదిలోంచి వెళ్లిపోయింది రాగిణి.
చాలాసేపు రాగిణి మాటలు సరోజ మదిలో మార్మోగాయి. ఆమె మాటల్లోని నిజం ఆమెకు తెలిసొచ్చింది. ఈ ప్రపంచంలో మనిషి బతకాలంటే పరిస్థితులకు లొంగిపోవాలి. లొంగిపోతే తన ఆశలసౌధం కూలిపోకుండా వుంటుంది. లేదంటే కూలిపోతుంది. మరిప్పుడు ఏం చేయాలి? లొంగిపోవాలా? మరి లోకాన్ని లొంగదీసుకుంటే? లోకాన్ని లొంగదీసుకోవడమా?! ఎలా? తను లొంగదీయగలదా? ఆడదాన్ని! అందునా నిస్సహాయురాల్ని! ఎలా లొంగదీయగలను? మళ్లీ ఆలోచనలు.. ఆలోచనలు.. ఆలోచనలు.. ఒకటే ఆలోచనలు! ఎంతసేపు కూర్చుందో తనకే తెలియదు. సమయమెంత అయ్యిందో గుర్తించనేలేదు. లేచి కిటికీ వద్దకు వచ్చింది. బయట యూనివర్సిటీ ఆవరణలోని చెట్లపై నల్లని చీకట్లు కమ్ముకుంటున్నాయి. మనసంతా విషాదంగా వుంది. ఏం చెయ్యాలి? లొంగిపోవాలా? లొంగదీసుకోవాలా? ఏం చెయ్యాలి? ఏమీ పాలుపోవడంలేదు సరోజకు. చూస్తుండగా గదిలో చీకటి పేరుకుపోయింది. ఆ చీకట్లో తను కలిసిపోయింది. లైటు వేసుకోవాలన్న బుద్ధి కూడా పుట్టలేదు. మెల్లగా గది తలుపుతీసి బయటకు నడిచి రాగిణి రూముకి వెళ్లింది. రూములో రాగిణి ఒక్కతే వుంది. వెళ్లి మంచంపై మౌనంగా కూర్చుంది.
వాతావరణాన్ని తేలికపర్చాలని ”టీ తాగుతావా?” అనడగింది రాగిణి. పెట్టివ్వమంది సరోజ. టీ కావలసినప్పుడు బయటకు వెళ్లి తాగడం ఇబ్బందని ఒక స్టౌను కొని రూములో పెట్టేసుకుంది రాగిణి. తనకు కావలసినప్పుడల్లా టీ పెట్టుకు తాగుతుంది. సరోజకి టీ పెట్టి కప్పులో పోసి ఇచ్చింది. తను టీ తాగుతూ సాలోచనగా సరోజ వైపు చూసింది.
”ఏమాలోచించావు?”
సరోజ తను ఏం చేయాలనుకుంటోందో ఆమెకు చెప్పింది. ఆ మాటలు విని ”అంతే! అటో ఇటో ఏదోటి తేల్చేసుకోవాలి.. ప్రొసీడ్.. నా హెల్ప్ నీకు ఎప్పుడూ వుంటుంది.” అని రాగిణి లేచి సరోజవద్దకు వెళ్లి ఆమె తాగిన టీ కప్పును అందుకుని వాష్ బేసిన్‌లో పెట్టింది.
”అనుకుంటున్నానుగానీ.. భయం వేస్తోంది. నీ హెల్ప్ కావాలి..” అని తన బేలతనాన్ని బయటపెట్టింది.
”అదిగో.. అలా బేలగా ఉంటే పనులు కావు.. ఏదైనా ధైర్యంగా చెయ్యాలి.. ధైర్యే సాహసే లక్ష్మి అని ఊరకనే అన్లేదు పెద్దలు..” ఊరడించింది రాగిణి.
”అది కాదు.. విషయం బయటకు పొక్కి అంతా అభాసుపాలు అయిపోతుందేమోనని నా భయం.. ఎలా ఈ గండం నుంచి గట్టెక్కాలో సరిగ్గా తెలియడంలేదు.. గుట్టుగా పని జరిగిపోయే మార్గం చెప్పు..” అడిగింది సరోజ.
అలా కాదు ఇలా.. ఇలా కాదు అలా.. అని చాలాసేపు తర్జనభర్జన పడి ఒక నిర్ణయానికి వచ్చారు ఇద్దరూ. మాటల్లోపడి సమయమే తెలియలేదు వాళ్ళకి. రాత్రి తొమ్మిదయ్యిపోయింది. ”కేంటీన్‌కు టైమయ్యిపోయింది. కట్టేస్తాడు.. పద.. పద..” అని రాగిణి తొందరపెడితే సరోజ లేచింది. ఇద్దరూ కేంటీన్‌కు వెళ్లి భోంచేసి ఎవరి గదుల్లోకి వాళ్లు వెళ్లిపోయారు. శంకర్రావుకు కాల్ చేద్దామనుకుంది సరోజ. ”అమ్మో అలా వద్దు వద్దు..” అని ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది. నేరుగా అతనిని కలిసి మాట్లాడడమే మంచిదనుకుంది. రాత్రి ఆమెకు నిద్ర పట్టలేదు. తెల్లారితే తన బతకు ఏమవుతుందోనన్న ఆలోచనలతో జాగారం చేసింది.
… … …
మెయిన్ క్యాంటీన్..
ఉదయం 11 గంటలవేళ.. ఆ సమయానికి శంకర్రావు రోజూ అక్కడికొచ్చి టీ తాగుతారు. సరోజ అటుగా నడుచుకుంటూ వెళ్లింది. శంకర్రావు క్యాంటీన్ ఆవరణలోని ఓ చెట్టుకింద నల్లజనపరాతి కుర్చీలో కూర్చుని టీ సేవిస్తున్నారు. తనవద్దకు వస్తున్న సరోజను చూసి ”పిట్ట వలలో చిక్కినట్టేనా” అని సంశయంగా చూస్తుండిపోయాడు.
ఆమె దగ్గరకు రాలేక కాస్త దూరంలో నిలబడిపోయింది. ”రా.. రా.. సరోజా.. టీ తాగుదువుగానీ..” అని ఉబలాటంకొద్దీ పిలిచాడు. ఆమె బెరుకుగా వచ్చింది. కూర్చోమంటే కూర్చుంది.
”ఏమిటి విషయం.. నేను రమ్మనకుండానే వచ్చావు..” అని కొంటెగా చూసాడు శంకర్రావు. అతడి చూపులకు తాళలేక దిక్కులు చూస్తుండిపోయింది సరోజ.
”సరే.. చల్లకొచ్చి ముంత దాచడందేనికి.. చెప్పు.. ఎందుకొచ్చినట్లు?”
”అది.. అది..” అంటూ ఆమె నసిగింది.
”నసుకుతావెందుకు.. సూటిగా విషయం చెప్పు..”
”అది.. మీరన్నదానికి..”
ఆమెను మాట పూర్తి చెయ్యనివ్వకుండానే ”ఆఁ.. నేనన్నదానికి.. ఒప్పుకున్నావా? ఒప్పుకున్నావా?” ఆత్రంపడిపోతూ అడిగాడు.
”అది సార్..” అని మాటలు మింగేసింది.
శంకర్రావు ఓపలేకపోయాడు. ”ఎయ్.. విషయమేంటో వేగంగా చెప్పు.. అవతల క్లాసుకు టైమవుతోంది..” అంటూ అసహనంగా కదిలాడు.
”అది కాదు సార్.. మీరన్నట్లుగా కానియ్యండి..” ఆ మాట చెప్పలేక చెప్పలేక చెప్పేసింది సరోజ.
శంకర్రావు ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. తను యూనివర్సిటీలో ఉద్యోగం కొట్టినప్పుడు కూడా అంత సంబరపడిపోలేదు. పట్టలేని సంతోషంతో ”ఇక నీకేం బెంగలేదు.. నీకు నేనున్నాను.. నీకు ఉద్యోగం వచ్చేటట్లు నేను చూసుకుంటాను.. ఇక నువ్వు కామ్‌గా వుండు.. నువ్వేం చెయ్యనవసరంలేదు.. అంతా నేను చూసుకుంటాను..” అంటూ ఉక్కిరిబిక్కిరి అయిపోయాడు. ఎవరైనా చూస్తే బాగోదని తమాయించుకుని ”సరే అయితే, బీచ్‌రోడ్డులో ఒక హోటల్ ఉంది.. అక్కడకెళ్లిపోదాం..” అని తొందరచేశాడు.
”హోటల్‌లో వద్దు సార్..”
”మరి లాడ్జికి పోదామా?”
”అమ్మో! లాడ్జికి వద్దు సార్..”
”మరెక్కడికి వెళ్దాం.. పోనీ నా ఫ్రెండు రూములో..”
”అమ్మో! వద్దు సార్.. బయట తెలిస్తే బాగోదు..”
”ఎక్కడికీ రానంటే ఎలా?” విసుక్కున్నాడు శంకర్రావు.
”పోనీ నా ఇంటిలో.. మా ఆవిడను అందాకల్లా ఎక్కడికైనా పంపించేస్తాను..”
”వద్దుసార్.. ఎవరి కంట్లోనైనా ఈజీగా పడతాం.. ఇక్కడే ఎక్కడయినా..” అంటూ అయోమయంగా చూసింది.
”ఇక్కడ ఎలా కుదురుతుంది?” అని ఆలోచనలోపడ్డాడు శంకర్రావు. ”సరే పద.. డిపార్టుమెంటుకు పోదాం..” అని లేచి బయలుదేరాడు. తన వెంట సరోజ నడిచింది.
”ఓ పని చేద్దాం.. మన థియేటర్ ఆఫ్ ఆర్ట్స్ ఆడిటోరియం అయితే బెటర్.. ఏ బెంగా వుండదు..”
సరోజలో వణుకు పుట్టింది. ”సార్ విషయం మనద్దిరి మధ్యనే ఉంటుంది కదా.. మూడో కంటికి తెలిస్తే నేను చచ్చిపోతాను సార్.. చావే నాకు శరణ్యం..”
”సరే.. సరే.. ఎవ్వరికీ తెలియనివ్వను.. సాయంత్రం ఏడు గంటల సమయంలో ఆడిటోరియానికి వచ్చెయ్.. లోపల నేను వెయిట్ చేస్తుంటాను. ఆ సమయంలో అటుగా ఎవ్వరూ రారు.. ఎవరికంటా మనం పడం.. మూడో కంటికి తెలియదు.. నేను అన్ని జాగ్రత్తలూ తీసుకుంటాను.. నువ్వేం భయపడవలసిన పనిలేదు..” అని ధైర్యం నూరిపోశాడు.
… … …
థియేటర్ ఆఫ్ ఆర్ట్స్ ఆడిటోరియం..
యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆఫీసుకి కిలోమీటరు దూరంలో మిగతా డిపార్టుమెంట్లకు ఎడంగా విసిరేసినట్లుగా ఉంటుంది ఆ ఆడిటోరియం. ఎప్పుడో యూనివర్సిటీ వార్షికోత్సవాలప్పుడు తప్ప మరెప్పుడూ అటుదిక్కు చూడరు. యూనివర్సిటీ కార్యక్రమాలకు రిజిస్ట్రార్ ఆఫీసు పక్కనున్న ఎస్.వి. సుబ్బారెడ్డి ఆడిటోరియాన్నే వాడతారు. అందువల్ల థియేటర్ ఆఫ్ ఆర్ట్స్ ఆడిటోరియం దుమ్ముకొట్టుకుపోయి నిర్మానుష్యంగా ఉంటుంది. పగటివేళ అడపాదడపా థియేటర్ ఆఫ్ ఆర్ట్స్ డిపార్టుమెంటుకు పనిమీద వచ్చిపోయేవాళ్లు తప్ప అటుగా పెద్దగా రాకపోకలు సాగవు. ఇక చీకటైతే అటుగా ఎవ్వరూ పోరు.
అలాంటి సమయంలో సరోజ ఒంటరిగా అటుగా బయలుదేరింది. ఆమెకు, దారిపక్కని వృక్షాలు జడలు విరబోసుకుని స్వాగతం పలుకుతున్నట్లున్నాయి. బిక్కుబిక్కుమంటూ ఆమె దిక్కులు చూసుకుంటూ నడుస్తోంది. ఆమె నడకలో తడబాటు. ఒక కాలు ముందడుగు వేస్తే మరో కాలు వెనక్కి లాగుతోంది. ఒడ్డుకు చేరి వెనక్కి మళ్లుతున్న కెరటాన్ని, దాని వెనుక వచ్చే కెరటం తనతోపాటు మళ్లీ ముందుకు లాక్కెళ్లినట్లుగా ఆమెను ఏదో శక్తి ముందుకే నడిపిస్తోంది. ఆడిటోరియం దగ్గర లైట్లు ఏవీ వెలగడంలేదు. ఎప్పుడూ వెలగవు. సెల్ వెలుగులో దారి వెతుక్కుంటూ ప్రహరీ గేటు దగ్గరకు చేరుకుంది. పాత ఇనుప గేటు. ఆ గేటును మెల్లగా తెరిచింది. అది కీచుమని అరిచింది. సరోజ ఒళ్లు జలదరించింది. ఒక్కక్షణం స్థాణువులా నిలబడిపోయింది తను. అక్కడ ఏ అలికిడీ లేదు. తను నాలుగైదు సార్లు ఆ ఆడిటోరియానికి వెళ్లిన అనుభవం వుంది కాబట్టి చీకటిలో అడుగులో అడుగు వేసుకుంటూ ఆడిటోరియం అరుగుమీదకు అడుగుపెట్టగలిగింది. భారీ ఆడిటోరియం! 50 ఏళ్ల కిందట రాతితో కట్టిన కట్టడం అది. దాని తలుపులు పాత సినిమాహాలు రేకు డోరుల్లా వుంటాయి. నాలుగు డోర్లు దాటుకుని వేదికదగ్గర వుండే మొదటి డోరు వద్దకు వెళ్లింది. డోరు గెడపై చెయ్యివేసింది. వేళ్లు వణికాయి. చెయ్యి వెనక్కి తీసేసుకుంది. కాసేపటికి ధైర్యం చేసి తలుపు లాగి లోనికి తొంగి చూసింది. లోనంతా చీకటి! కటిక చీకటి!! ఏదో చీకటి గుహ నోరు చాచి తనను మింగేస్తున్నట్లు అనిపించి తటాలున వెనుకడుగు వేసింది. లోపల శంకరరావు మాస్టారు కనిపించలేదు. ”ఎక్కుడున్నారు? ఆయన వచ్చాడో లేదో? ఏం జరగబోతోంది ఇప్పుడు? పులి నోట్లోగానీ తల పెడుతున్నానా? నా జీవితం ఏం కాబోతుంది? కుక్కలు చింపిన విస్తరి కాదు కదా?” బుర్ర పిచ్చెక్కిపోతోంది తనకి. మతిచెడినదానిలా లోనికి అడుగుపెట్టింది. పిన్ను పడితే వినబడేంత నిశ్శబ్ధం ఆ ఆడిటోరియంలో! సెల్ టార్చ్ వేసి చుట్టూ చూడబోయింది. వెనక ఓ నల్లటి ఆకారం! కెవ్వున అరవబోయింది. ఆమె అరిచేంతలో ఆమె నోటిని తన చేతులతో మూసేసి వెననుండి పావురాన్ని పట్టేసినట్లు పట్టేశాడు శంకరరావు.
”వదలండి.. వదలండి..” అని ఆమె గింజుకుంది. కామంతో ఉన్మత్తుడైపోయాడేమో ఉడుంపట్టు పట్టేశాడు. సరోజ ఎంత గింజుకున్నా అతని పట్టునుండి తప్పించుకోలేకపోయింది. శంకరరావు ఆరాటంతో ఆమెను ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నాడు.
”మాస్టారు నేను చెప్పేది వినండి.. ప్లీజ్ మాస్టారు.. ప్లీజ్.. వదలండి..” ప్రాథేయపడుతోంది సరోజ.
”ఇంతవరకూ వచ్చాక ఇక మాటలేంటి సరోజా.. ప్లీజ్ కోపరేట్..” అని సెల్ టార్చ్‌ను ఆమె మొఖంపై వేసి ”ఎంత అందం సరోజా నీది.. ఈ అందం కోసమేకదా ఇంతకాలం ఎదురుచూసింది.. ప్లీజ్ కోపరేట్.. ప్లీజ్ కోపరేట్ సరోజా..” అని వేదిక ముందుభాగాన విశిష్ట అతిథులకోసం వేసి ఉంచిన సోఫాల్లోని ఒకదానిలో ఆమెను బలవంతంగా పడదోశాడు. ఆమెపై పడి పాశవికంగా ఆమెను ఆక్రమించబోయాడు.
”ప్లీజ్ నన్ను రక్షించండీ..” ఆ అరుపు ఆడిటోరియంలో ప్రతిధ్వనించింది.
మరుక్షణం వేదిక మీద ఎర్రటి తెర పక్కకు తీయబడింది; ప్రదర్శనకు ముందు తీయబడినట్లుగా.
వెనువెంటనే ఎవరిదో ”లైట్స్ ఆన్..” అన్న కేక ఆడిటోరియం వేదిక పక్కగదినుండి వినవచ్చింది.
ఒక్కసారిగా వేదికపై వెలుగు పరుచుకుంది. వేదిక మీద మధ్యభాగంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్!! తన కళ్ల ముందు జరుగుతున్న అకృత్యం చూసి ఆయన నిశ్చేష్టుడైపోయాడు.
ఈ హఠాత్ పరిణామానికి అవాక్కయిపోయాడు శంకరరావు. కదలకుండా సరోజను అదిమిపెట్టి, వేదికవైపు తలతిప్పి చూశాడు. వేదికమీద వీసీ గుడిముందు ధ్వజస్తంభంలా నిలబడి తనవైపు ఎర్రగా గుర్రుగా చూస్తున్నాడు. చింత నిప్పులను వర్షిస్తున్నాయి అతని కళ్లు! ”ఇదేమిటి? ఇలా ఎలా జరిగింది?!” అని శంకరరావు నీరుగారిపోయాడు. అతనిలోని మగతనం జావగారిపోయింది. సరోజపైనుండి లేచాడు. చేతులు అప్రయత్నంగా దండలు కట్టేసి వణడం మొదలెట్టాయి. వీసీ పోలీసులకు ఫోన్ చేశారు.
రాగిణి వేదిక పక్క గదినుండి వేదికమీదకొచ్చింది. ‘మంచికో చెడుకో ఎవరికైనా ఓ రోజు వస్తుంది’ గుర్తుందా సార్ ఈ డైలాగు.. ఇది మీరు ఓ నాటకంలో మాచేత పలికించిన డైలాగే సార్! కానీ ఇప్పుడు అది నాటకంలోని డైలాగు కాదు సార్.. మీ నిజజీవితంలో పలికిన డైలాగు..” అని ఆక్రోశంగా అంది.
వెనుకనుండి చప్పట్లు! శంకరరావు తల వెనక్కి తిప్పి చూశాడు. మరుక్షణం ఆడిటోరియంలోని లైటన్నీ వెలిగాయి. వేదిక ముందు ఆరేడు వరుసల తర్వాతి కుర్చీల్లో విద్యార్థులు! ”వీళ్లంతా ఎక్కడినుండి వచ్చారు? ఎంత మోసం?!” నీళ్లు నమిలాడు. గుటక పడలేదు.