పాజిటివ్‌గా ఉండండి – నెగటివ్‌గా అయిపోతారిలా!! – స్వర్ణ కిలారి

చైనాలో పుట్టి కంటికి కనిపించని జీవి ఒకటున్నదని, దాని వల్ల వేలాదిమంది ప్రాణాల మీదికి వస్తున్నదని జనవరి, ఫిబ్రవరి నెలల్లో అనుకుంటా పత్రికల్లో చదివాము. కరోనా మన ఇండియాకి వచ్చిందని మార్చి నెల మొదటివారంలో తెలిసింది. తొలుత హైదరాబాద్‌లో ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగికి వచ్చిందని కంగారుతో ఆ బిల్డింగ్‌ మొత్తం హుటాహుటిన ఖాళీ చేయించేశారు. వర్క్‌ ఫ్రం హోమ్‌ అప్షన్‌ కూడా ఇచ్చారు ఆ కంపెనీ వాళ్ళు. మూడో వారం నుండి లాక్‌డౌన్‌ ప్రారంభమయింది. ఆ రోజు నుండి దిలీప్‌ రోజూ ఆఫీసుకి వెళ్ళి వస్తున్నాడు కాబట్టి ముందు జాగ్రత్తగా సెల్ఫ్‌ క్వారంటైన్‌లోకి వెళ్ళిపోయాడు. అప్పటినుంచి తనకి పని వత్తిడి కూడా రెట్టింపైంది. అదే సమయంలో వలస కార్మికులు పడుతున్న ఇబ్బందులు చూసి వైజాగ్‌లో ఉన్న మల్లీశ్వరి గారి పిలుపు మేరకు హైదరాబాద్‌లో కొంతమేరకు నాకు తెల్సిన సాయం చేయగలిగాను. అలా కొన్నాళ్ళు గడిచాక వ్యాధి విస్తృతంగా వ్యాపించడం మొదలుపెట్టింది. మొదట్లో ఎవరో తెలియని వ్యక్తులకు వచ్చింది. కానీ, త్వరలోనే మన దగ్గరి వాళ్ళకు కూడా వస్తుందని అర్థమయింది.

నాకెలా తెలిసిందంటే… ఒకరోజు ఒళ్ళు కాస్త వేడిగా అనిపించింది. రాత్రికల్లా ఎక్కువైపోయి పారాసిటమాల్‌ వేసుకునే స్థితి ఏర్పడింది. అలాగే రెండో రోజు కూడా పారాసిటమాల్‌ వేసుకున్నా. 99-100 ఉండేది టెంపరేచర్‌. రెండో రోజుకు మాతోనే ఉండే చెల్లి కూతురు దరహాసకు కూడా జ్వరం మొదలైంది. ఎందుకో కరోనా వచ్చిందా అన్న అనుమానం వచ్చి వెంటనే దిలీప్‌తో అన్నాను. రేపు ఉదయం టెస్ట్‌కి వెళ్దాం అన్నాడు. తర్వాత రోజు ఇద్దరం కోఠిలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రిలో టెస్ట్‌కి శాంపిల్‌ ఇచ్చి వచ్చాం. రిపోర్ట్‌ వచ్చేసరికి మా పరిస్థితి ఏంటంటే, జ్వరం తగ్గిపోయింది కానీ బాగా నీరసం, దగ్గు, కాస్త బ్రీతింగ్‌ ప్రాబ్లం, వాసన, రుచి కోల్పోవడం, తలనొప్పి. రిపోర్టులో నాకు, దరహాసకు పాజిటివ్‌ అని వచ్చింది. ముందు కొంచెం ఆదుర్దా పడ్డాము. వెంటనే తేరుకుని తర్వాత ఏం చేయాలో ఆలోచించాము.

వాడిన మందులు : వెంటనే తెలిసిన ఇద్దరు గవర్నమెంట్‌ డాక్టర్లతో ఫోన్‌లోనే మాట్లాడి, వారిచ్చిన ప్రిస్క్రిప్షన్‌ ట్రీట్‌మెంట్‌ తీసుకోవడం మొదలుపెట్టాము. మొదటి నాలుగు రోజులు పారాసిటమాల్‌, తర్వాత డాక్టర్స్‌ చెప్పినట్లుగా విటమిన్‌ సి, డి, జింక్‌ మరియు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఒక యాంటీబయాటిక్‌ కూడా ఇచ్చారు. ప్రతిరోజూ థర్మామీటర్‌తో జ్వరం చెక్‌ చేసుకోవడం, పల్స్‌ ఆక్సిమీటర్‌తో ఆక్సిజన్‌ ఝ్‌బతీa్‌ఱశీఅ చూసుకున్నాము.

తీసుకున్న ఆహారం : ఆ రోజు నుండి బలవర్ధకమైన ఆహారం తీసుకున్నాము. ఉదయం ఒకసారి కషాయం, ఉడకబెట్టిన గుడ్లు, నానబెట్టిన బాదం, మొలకలు, అల్పాహారం, మధ్యాహ్నం భోజనం. మళ్ళీ సాయంత్రం ఒకసారి కషాయం, ఒక ఫ్రూట్‌ జ్యూస్‌, రాత్రికి చపాతీ, ఒక కప్పు పసుపు వేసిన పాలు. రెండ్రోజులకు ఒకసారి భోజనంలో చికెన్‌ కూడా తీసుకున్నాము.

నేనేం చెప్పాలనుకుంటున్నానంటే : ఇదొక కొత్త వ్యాధి. లక్షణాలు ఒక్కొక్కరికీ ఒక్కోలా ఉన్నాయి. లక్షణ తీవ్రతను బట్టి ఆస్పత్రిలో

ఉండాలా, ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉండాలా అనేది నిర్ణయించుకోవాలి. కానీ ఏదయినా ఖచ్చితంగా డాక్టర్‌ సలహాతోనే చెయ్యాలి. 95 శాతం భయపడాల్సిన అవసరం లేదు. ఈ వ్యాధి తగ్గి, మనం ఆరోగ్యంగా బయట పడాలంటే ముఖ్యంగా కావలసింది ధైర్యం. ఇది నా విషయంలో రుజువయింది. అసలు నాకు అనుమానం వచ్చినప్పటి నుంచి రెండోసారి నెగటివ్‌ వచ్చేవరకూ నేను ఒక్కరోజు కూడా భయపడలేదు. అలాగని చాలా ఈజీగా కూడా తీసుకోవద్దు. అనవసరంగా తిరగడం, పాజిటివ్‌ వచ్చినా చెప్పకుండా అందరితో కలవడం మంచిది కాదు. మనం తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకుంటూ ఒక ఆశావహ దృక్పథంతో ఉంటూ కరోనాను జయించవచ్చు.

కరోనా రావడం పెద్ద నేరం, ఘోరం కాదు. రహస్యంగా ఉంచాల్సిన అవసరమూ లేదు. మన చుట్టుపక్కల వాళ్ళు జాగ్రత్తగా

ఉంటూ ఎక్కువ వ్యాప్తి చెందకుండా నివారించవచ్చు. అలాగే ఒకవేళ కరోనా వచ్చినా, తర్వాత మనం కోలుకున్నామనే విషయం మీ వాళ్ళందరికీ చెప్పండి. అది చాలామందికి ధైర్యాన్ని ఇస్తుంది.

కరోనా టైంలో నేను చేసిన పనులు : ఓటిటిలో ఎప్పటినుండో చూడాలనుకున్న సినిమాలు చూశాను. ఎప్పటినుండో పెండింగ్‌లో

ఉన్న ఒక రెండు ఆర్టికల్స్‌ పూర్తి చేయగలిగాను. రోజూ కొన్ని యోగాసనాలు, గదిలోనే కాసేపు నడక. మధ్యలో రెగ్యులర్‌గా ప్రభుత్వ కాల్‌ సెంటర్‌ నుండి ఫోన్‌ చేసి ఆరోగ్యం ఎలా ఉందో వాకబు చేశారు. ఐసోలేషన్‌ కిట్‌ కూడా పంపిస్తామంటే అవన్నీ నా దగ్గర ఉన్నాయి, కిట్‌ వద్దు అని చెప్పాను. నాతో పాటు రూమ్‌లో దరహాస కూడా ఉండడం వల్ల పెద్దగా బోర్‌ కొట్టకుండా ఒకరికొకరం అన్నట్లు

ఉండగలిగాం. రెండు వారాల పాటు అనుక్షణం మమ్మల్ని కనిపెట్టుకుని, ఇంట్లో అందరికీ కావాల్సినవన్నీ అందించింది చెల్లి ఇందిర.

ఇక రోజూ ధైర్యం చెబుతూ మందులు, ఆహారం సమయానికి తీసుకొమ్మని చెబుతూ మాకు అందిస్తూ, ఓపికగా కబుర్లు చెబుతూ, కరోనా జయించిన వారి వివరాలు మాకు తెలియచేస్తూ కొండంత అండగా నిలబడ్డాడు దిలీప్‌. నాకు పాజిటివ్‌ వచ్చిందని తెలిసి అన్ని విధాలా ధైర్యం చెప్పిన కుటుంబసభ్యులూ, నా మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదములు. నాకు అర్ధమయిందేమిటంటే, కరోనా పట్ల మనకు ఉండాల్సింది అప్రమత్తత, భయాందోళనలు కాదు!

Share
This entry was posted in కరోనా డైరీస్. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.