నేను, సజయ… ఒక తెలుగు కరోనా! – ఒమ్మి రమేష్‌ బాబు

కరోనా సోకితే ఇక కాటికే దారి అన్న దురభిప్రాయం సభ్యసమాజంలో బలంగా వేళ్ళూనుకున్నవేళ… నేను ఆ వైరస్‌ బారిన పడ్డాను. చెప్పొద్దూ, ఒకింత కలవరపాటు కలిగిన మాట వాస్తవం. కానీ భయపడలేదు. డీలాపడలేదు. నిస్పృహకి గురికాలేదు. కర్తవ్యం గురించి మాత్రమే ఆలోచించాను. తీసుకోవాల్సిన జాగ్రత్తలని పరిపరి గుర్తుచేసుకుని పాటించాను. చివరకు ఆ వైరస్‌ నుంచి బయటపడ్డాను. నేను తీసుకున్న జాగ్రత్తలు వివరిస్తే కొందరికైనా ఊరటగా ఉంటుందన్న ఉద్దేశంతో ఈ నాలుగు ముక్కలు మీతో పంచుకుంటున్నాను.

అసలే కరోనా కాలం. ఎవరి నోట విన్నా ఇదే మాట. పాత్రికేయ వృత్తిలో ఉండడం వల్ల ఇవే వార్తలతో రోజులు గడిపే సందర్భం. లాక్‌డౌన్‌ ప్రారంభంలో ఒక వారం మాత్రమే సెలవు తీసుకున్నాను. ఆ తర్వాత ఆఫీసుకి రెగ్యులర్‌గా వెళ్తూనే ఉన్నా. కరోనా సోకితే లక్షణాలు ఎలా ఉంటాయో… ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో అందరికీ చెప్తూ ఉన్నాం సజయ, నేను. అప్పటికే నా కొలీగ్స్‌ అందరికీ ఆ వైరస్‌ సోకింది కూడా! అతి శుభ్రం అనే ఓసిడి నాకు ఉన్నప్పటికీ, ముఖానికి మాస్క్‌ ధరించినా, వెంట శానిటైజర్‌ తీసుకెళ్ళి ఘడియ ఘడియకీ ఒకమారు చేతులు శుభ్రం చేసుకుంటున్నా ఏదో ఒక తరుణంలో వైరస్‌కి ఎక్స్‌పోజ్‌ అవుతాననే భావన కూడా నాలో

ఉండింది. (మార్చి నెల నుంచే వలస కార్మికుల కోసం సజయ నిరంతరం బయటే తిరుగుతూ పనిచేసింది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మాకు అనేక మాస్కులు, గ్లోవ్స్‌ అందించింది తేజస్విని మాడభూషి). దీనికి కారణం కరోనా సమూహవ్యాప్తి దశకు చేరుకోవడమే. మీడియా ఆఫీసుల్లో కరోనా కేసులు బయటపడడమూ మొదలైంది. ఎందుకైనా మంచిదని జర్నలిస్టు మిత్రులందరితో కలిసి జూన్‌ రెండో వారంలో ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌ చేయించుకుంటే నెగిటివ్‌ రిపోర్టు వచ్చింది. హమ్మయ్య అనుకున్నాను. ఇలా రోజులు గడుస్తుండగా… జులై 7వ తేదీ నుంచి ఒంట్లో నలతగా అనిపించింది. 9వ తేదీ సాయంత్రం పొడిదగ్గు వచ్చింది. మనసు కొంచెం చలించింది. ఎందుకంటే అలాంటి దగ్గు ఇదివరకు నాకెప్పుడూ రాలేదు. నాదైన శైలిలో ఆ రాత్రి భోజనానంతరం వేడినీళ్ళతో స్నానం చేసి పడుకున్నాను. అర్థరాత్రి జ్వరం, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి మొదలయ్యాయి. జ్వరం మరీ ఎక్కువ లేకపోయినా తీవ్రమైన అనీజీనెస్‌. అవి కోవిడ్‌ సింప్టమ్స్‌…! సజయ నా పక్కనే ఉంది. ఒకింత కంగారనిపించింది. తనకి సింగిల్‌ కిడ్నీ. కరోనా ఏమో తీవ్రమైన అంటువ్యాధి. ఇక రాత్రంతా నాది కలత నిద్రే.

ఉదయం నా జ్వరం గురించి సజయకి చెప్పాను. లక్షణాలను బట్టి తనకు అర్థమయ్యింది. అయినా కంగారుపడలేదు. నన్నూ కంగారుపెట్టలేదు. ఒకపక్క టిఫిన్‌ ఏర్పాట్లు చేస్తూనే మా ఆత్మీయ మిత్రులు డాక్టర్‌ సత్యలక్ష్మి గారికి విషయం చెప్పింది. ఆమె సలహాతో ఆ క్షణం నుంచే సెల్ఫ్‌ ఐసోలేషన్‌లోకి వెళ్ళిపోయాను. నాకు ఈ లక్షణాలు కనిపించిన మొదటి రోజునే మా డొమెస్టిక్‌ హెల్పర్‌ లక్ష్మికి సెలవు తీసుకోమని చెప్పింది సజయ. లాక్‌డౌన్‌ మొదలైన దగ్గర్నుంచీ మా అపార్ట్‌మెంట్‌ సెక్యూరిటీ సిబ్బందికి మేము ప్రతిరోజూ ఉదయాన్నే టీ ఇస్తున్నాము. మా ఫ్లాట్స్‌లోని హిమకు పరిస్థితి వివరించి, ఇకపై టీ ఇచ్చే బాధ్యతను తీసుకోమని కోరాం. అందుకు తను సానుకూలంగా స్పందించారు.

10వ తేదీ ఉదయం పేరాసిటమాల్‌ వేసుకున్నాను. మధ్యాహ్నం జ్వరం కొంత నెమ్మదించి సాయంత్రానికి మళ్ళీ 101 టెంపరేచర్‌ వచ్చింది. ఒళ్ళు నొప్పులు, తలనొప్పి పెరిగాయి. అప్పుడు మరోసారి పేరాసిటమాల్‌ వేసుకున్నాను. కొంతసేపటికి రిలీఫ్‌ వచ్చింది. రాత్రి భోజనం చేసి పడుకున్నాక 11 గంటల తర్వాత తిరిగి సేమ్‌ సింప్టమ్స్‌. దాదాపు ఆ రాత్రి అంతా తడిబట్టతో ఒళ్ళంతా తుడుచుకుంటూ గడిపాను. మర్నాడు ఉదయం మిత్రుడు సువర్ణ సూచనతో మరో సహోద్యోగి ప్రవీణ్‌ సహకారంతో టెస్ట్‌ చేయించాను. అనుమానించిందే నిజమైంది. అక్కడినుంచే ఫోన్‌లో సజయకి విషయం చెప్పాను. ఇంటికి వచ్చి లిఫ్ట్‌ వాడకుండా మెట్లమీదుగా నడుస్తూ నాలుగవ అంతస్తులోని మా ఇల్లు చేరి సెల్ఫ్‌ ఐసోలేషన్‌లోకి వెళ్ళిపోయాను. లిఫ్ట్‌ వాడకపోవడానికి కారణం.. అక్కడ బటన్‌ నొక్కితే దానికి వైరస్‌ అంటుకునే అవకాశముంది. కరోనా అంటువ్యాధి కనుక నా వల్ల ఇతరులకు సోకకుండా జాగ్రత్తలు పాటించాలన్న నియమం ఆ క్షణం నుంచే స్ట్రిక్ట్‌గా పాటించడం మొదలుపెట్టాను. టెస్టుకి వెళ్ళేటప్పుడు కూడా లిఫ్ట్‌ ఉపయోగించలేదు.

ఇక నా సంగతికి వస్తే…. ఆ రోజు నుంచే రెండు పూట్లా పేరాసిటమాల్‌ వేసుకున్నాను. సత్యలక్ష్మిగారి సలహా మేరకు వెంటనే నేను నేచర్‌ క్యూర్‌ ఆసుపత్రిలో చేరాను. సజయ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం. నేచర్‌ క్యూర్‌లో సదుపాయంగా ఉండే కాటేజ్‌ని నాకు కేటాయించారు. అక్కడి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది కనుక త్వరగా కోలుకోవచ్చునని నేనూ భావించాను. అయితే నేను చేరేటప్పటికే పొట్టలో కొంత అనీజీగా ఉంది. సంచికి చిల్లు పడింది. ఆ మరుసటి రోజు వరకు అదే పరిస్థితి. నేచర్‌ క్యూర్‌ డాక్టర్లు భవానీ గారు, నాగలక్ష్మి గారు నాకు పలు జాగ్రత్తలు చెప్పారు. మందులు ఇచ్చారు. సజయ నాకు ప్రైమరీ కాంటాక్ట్‌ కనుక నేచర్‌ క్యూర్‌ ఆస్పత్రిలో తనకి కూడా ర్యాపిడ్‌ టెస్ట్‌ చేశారు. రిపోర్టు నెగిటివ్‌ వచ్చింది. అయితే, నాకు కొత్తగా వచ్చిన అనారోగ్య సమస్యపై ఆస్పత్రి వైద్యులను సజయ సంప్రదించి, వారిని ఒప్పించి మళ్ళీ నన్ను ఇంటికి తీసుకువచ్చేసింది.

13వ తేదీ సాయంత్రానికి నేను మళ్ళీ ఇల్లు చేరాను. నాదైన సెల్ఫ్‌ ఐసోలేషన్‌లోకి వెళ్ళిపోయాను. అదే సమయంలో నాకు కరోనా వచ్చిన విషయాన్ని మా అపార్ట్‌మెంట్‌ అసోసియేషన్‌ పెద్దలకు సజయ చెప్పింది. కామన్‌ వాట్సప్‌ గ్రూప్‌లో వాళ్ళు ఈ సంగతి పోస్ట్‌ చేశారు. అప్పటికి మా అపార్ట్‌మెంట్‌లో నేను మూడవ కరోనా పేషెంట్‌ని. అందులో ఒకరు కోలుకున్నారు, ఒకరు చనిపోయారు. ఈ కారణంగా నా గురించి చెప్పగానే వారిలో అంతర్గతంగా కొంత ఆందోళన కలిగి ఉండవచ్చు. అయినా మా అపార్ట్‌మెంట్‌లోని సహ కుటుంబాల వారు హుందాగా స్పందించారు. నేను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ వాట్సప్‌లో పోస్టులు పెట్టారు. అసోసియేషన్‌ అధ్యక్షులు అశోక్‌ గౌడ్‌ గారు స్వయంగా ఫోన్‌ చేసి ఏ సహాయం కావాలన్నా చేస్తానని భరోసా ఇచ్చారు. తరచూ యోగక్షేమాలు కనుక్కుంటూ ఉండేవారు.

మేము ఇంటికి వచ్చిన కొద్దిసేపటికే సజయ సహా తన మిత్రబృందం సమష్టిగా నిర్వహిస్తున్న హైదరాబాద్‌ కోవిడ్‌ హెల్త్‌ అడ్వకసీ గ్రూప్‌లోని సభ్యులు మా బాగోగుల గురించి వాకబు చేశారు. ఆ సమయంలో పిడబ్ల్యు సంధ్య, లాయర్‌ వసుధ, అన్వేషి సునీత, అమన్వేదిక అను, సుజాత సూరేపల్లి అందించిన తోడ్పాటు మరపురానిది. కొవిడ్‌ రిలీఫ్‌ హెల్ప్‌లైన్‌లో భాగస్తులైన డాక్టర్‌ ఖాలిక్‌ గారికి నేను ఫోన్‌ చేసి స్టమక్‌ అప్‌సెట్‌ అయిందని చెప్తే రెండు రోజులు వేసుకునేలా నాలుగు మాత్రలు, భోజనం తర్వాత వాడేందుకు ఒక సిరప్‌ రాసిచ్చారు. వాట్సప్‌ ద్వారానే ప్రిస్క్రిప్షన్‌ పంపించారు. అప్పుడు రాత్రి 9 గంటలు దాటింది. అయినా అపార్ట్‌మెంట్‌లో మా కింది పోర్షన్‌లో ఉండే శరత్‌ అప్పటికప్పుడు మెడికల్‌ షాప్‌కి వెళ్ళి ఆ మందులు తెచ్చిపెట్టారు. తనకి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే.

ఆ రోజు మొదలు… సెల్ఫ్‌ ఐసోలేషన్‌ అనే ప్రయోగానికి నేను ప్రణాళికాబద్దంగా సిద్దమయ్యాను. ఎప్పుడూ జనంలో

ఉండడానికి ఇష్టపడే సజయ కూడా ‘హోం క్వారంటైన్‌’ అనే కొత్త వ్యాపకంలోకి ప్రవేశించింది. తాత్కాలికమే అయినా మా ఇద్దరికీ ఇదో సవాల్‌. చిరునవ్వుతో స్వీకరించి మాకు తెలిసిన, వైద్యులు చెప్పిన అన్ని సూచనలనూ విధిగా పాటించాము. ఇరవై ఐదు రోజులపాటు మేమిద్దరమూ మా గడపదాటి బయటకు వెళ్ళలేదు.

ఐసోలేషన్‌లో ఉన్నప్పుడు నా హెల్త్‌ రికార్డు మెయింటెయిన్‌ చేయమని డాక్టర్‌ సత్యలక్ష్మి చెప్పారు. అందుకు అవసరమైన థర్మామీటర్‌, ఆక్సీమీటర్‌, బీపీ ఆపరేటస్‌ను సజయ నాకిచ్చింది. నా ఐసోలేషన్‌ పీరియడ్‌ అయిపోయే వరకు ప్రతిరోజూ మూడు పూటలా టెంపరేచర్‌, ఆక్సిజన్‌ లెవల్స్‌, బీపీ రీడింగ్స్‌ చూసుకుని… వాటిని నోట్‌ చేసేవాడిని. రోజువారీ నా ఆరోగ్యం పరిస్థితిని, వాడిన మందుల వివరాలు కూడా రాసేవాడిని. యాంటీబయాటిక్స్‌ వాడే అవసరం నాకు రాలేదు. నేచర్‌ క్యూర్‌ పద్ధతులే ఎక్కువగా అనుసరించాను. మల్టీ విటమిన్‌ టాబ్లెట్స్‌ మాత్రమే తీసుకున్నాను. నాకు కరోనా నిర్ధారణ జరిగిన వెంటనే మాకు కూతవేటు దూరంలోనే ఉండే సజయ వాళ్ళ మేనత్త, ప్రసిద్ద హోమియో వైద్యులు అయిన డాక్టర్‌ టాన్యా గారు నాకు మూడు డోసులు మందిచ్చారు. దాంతో త్వరలోనే రిలీఫ్‌ వచ్చింది. ఐదారు రోజుల్లోనే జ్వరం, ఒళ్ళు నొప్పులు వంటివి తగ్గాయి. ఎనిమిదో రోజు మళ్ళీ స్వల్పంగా జ్వరం, కొంత ఆయాసంగా అనిపించింది. అప్పుడు మరోసారి టాన్యాగారు మందు పంపించారు. అవి రెండు డోసులు వాడగానే ఉపశమనం కలిగింది. ఇదే సమయంలో సజయ వాళ్ళ అక్క డాక్టర్‌ విజయ గారు విజయవాడ నుంచే ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, రెండు మూడు రోజులకి ఒకసారి పలకరిస్తూ ఉత్సాహపరిచారు.

ఇక్కడ నేను ప్రత్యేకించి చెప్పదలచుకున్న విషయం ఏమిటంటే… నా నుంచి కరోనా స్ప్రెడ్‌ అవకుండా తీసుకున్న జాగ్రత్తల గురించి! నేను ఒక గదిలో ఐసోలేషన్‌లో ఉంటే అదే ఇంట్లో సజయ కూడా ఉంది. తనకి వైరస్‌ రాకుండా చూసుకోవాలన్న పట్టుదల నాకు బాగా పెరిగింది. మా కింది పోర్షన్‌లోనూ, మా పక్కన చిన్నపిల్లలున్న కుటుంబాలున్నాయి. అటువైపు నా పొడ సోకకుండా తగిన అప్రమత్తత పాటించాను. ఈ క్రమంలో నాకు రెండు చిక్కు సమస్యలు ఎదురయ్యాయి. నేను తినే భోజనంతో పాటు ఫ్రూట్స్‌ నుంచి వచ్చే తడి చెత్తని బయటికి ఎక్స్‌పోజ్‌ కాకుండా ఎలా మేనేజ్‌ చేయాలి అన్నది ఇందులో మొదటిది. నేను ఐసోలేషన్‌లో ఉన్న గదిని ఆనుకొని ఒక బాల్కనీ ఉంది. అక్కడ పూలమొక్కల కుండీలు ఉన్నాయి. ఏ రోజుకి ఆ రోజు తడి చెత్తని కుండీల్లోని మట్టితో లోతుగా కప్పేసేవాడిని. ఇది నాకు సజయ చెప్పిన ఉపాయమే. రెండోది పొడి చెత్త సంగతి. నా గదిని రోజూ ఊడ్చినప్పుడు వచ్చే చెత్తతోపాటు ఇతర వేస్ట్‌ మెటీరియల్‌ని ఎప్పటికప్పుడు పేపర్‌ కవర్లలో ప్యాక్‌ చేసి ఒక క్లాత్‌ బ్యాగ్‌లో దాచి ఉంచాను. నా ఐసోలేషన్‌ పూర్తయ్యాక ఆ బ్యాగ్‌పై శానిటైజర్‌ బాగా స్ప్రే చేసిన తర్వాతే దాన్ని బయట డస్ట్‌బిన్‌లో పారేశాను. మనవల్ల పారిశుధ్య కార్మికులకు ఎలాంటి సమస్య రాకూడదనే ఇంత జాగ్రత్త! నిజానికి మా ఇంటి నుంచి తడి చెత్త ఎప్పుడూ బయటికి వెళ్ళదు. కంపోస్ట్‌ చేసేస్తాము.

ఐసోలేషన్‌లో ఉన్నప్పుడు నా భోజనాదులపై సజయ చాలా శ్రద్ధ తీసుకుంది. వైరస్‌ ఇన్ఫెక్షన్‌ వల్ల నీరసం వస్తుంది కనుక తేలికపాటి అరుగుదలకి ఆస్కారం ఉండే ఆహారం తయారుచేసి నా గది తలుపు దగ్గర పెట్టేది. టిఫిన్‌, భోజనం, జ్యూసెస్‌ వంటివి వీటిలో ప్రధానం. అన్నం గంజి, ఎండుద్రాక్ష నానబెట్టి బెల్లం కలిపిన నీళ్ళు, నిమ్మరసం తేనె కలిపిన నీళ్ళు, అవిశె గింజలు, చియా లేదా సబ్జా గింజలు నానబెట్టిన నీళ్ళు, నేతిలో వేయించిన బార్లీ గింజల గంజి వంటివి రోజుకొకటి చొప్పున ఇచ్చింది. వాటిని ఉదయం ఏడుగంటలకల్లా పరగడుపున తాగాను. ఎనిమిదింటికి పాలు, గుడ్డు, తొమ్మిది తొమ్మిదిన్నర లోపు టిఫిన్‌. మళ్ళీ పదకొండున్నరకి ఏదన్నా పండు. లైట్‌గా టీ లేదా కాఫీ. రెండు లోపల భోజనం వేడిమీద ఉన్నప్పుడే తినేసేవాడిని. నాకు ఉన్న గాస్త్రైటిస్‌ సమస్య వల్ల కొంచెం కొంచెంగా ప్రతి రెండు గంటలకి ఏదో ఒకటి తినే విధంగా డైట్‌ ఛార్ట్‌ తయారుచేసింది తను. ఉదయం, సాయంత్రం ఆవిరి పట్టేవాడిని. గోరువెచ్చని నీళ్ళు తాగేవాడిని. ఉదయాన్నే చిన్న చిన్న వర్కవుట్స్‌, ప్రాణాయామంతో పాటు బ్రీథింగ్‌ ఎక్సర్‌సైజ్‌లు చేసేవాడిని. నేనున్న గదివైపు ఉదయం ఎండ రాదు. అందుకని ప్రతిరోజూ సాయంత్రం ఒక పావుగంట ఎండలో నిలబడేవాడిని. డి విటమిన్‌ కోసం ఇది చాలా ముఖ్యం.

ఐసోలేషన్‌లో నేను తీసుకున్న మరో జాగ్రత్త… నేను వాడిన పళ్ళాలు, గిన్నెలు, గ్లాసులు, కప్పుల క్లీనింగ్‌కి ఎన్నుకున్న పద్ధతి. వాటిని మొదట సోప్‌ వాటర్‌లో నానబెట్టి బాగా కడిగేవాడిని. అనంతరం మరోసారి వేడినీళ్ళతో శుభ్రం చేసేవాడిని. వాటిని సజయకి ఇచ్చేటప్పుడు చేతులు శానిటైజ్‌ చేసుకుని తీసుకునేది. ఆ తర్వాత కిచెన్‌ దగ్గర సింక్‌లో మరోసారి వాటి పనిపట్టేది. తలుపు వారన ఉండి తనతో మాట్లాడేవాడిని. నాకు కరోనా లక్షణాలు ఉన్నన్ని రోజులూ గదిలో కూడా ముఖానికి మాస్క్‌ ధరించాను. నేను ఐసోలేషన్‌లో

ఉన్నన్ని రోజులూ కష్టమైనప్పటకీ సజయ ఒక్కర్తే ఇంటిపనీ, వంటపనీ చక్కబెట్టింది. మరోవైపు కోవిడ్‌ పేషెంట్లకి హెల్ప్‌ చేయడం కోసం నిరంతరం ఫోన్‌లో మాట్లాడుతుండేది. అవసరమైన పేషెంట్లకి కౌన్సిలింగ్‌ చేసేది. ఈ క్రమంలో తన ఆరోగ్య పరిస్థితిని నేను కూడా ఒక కంట కనిపెడుతూ ఉండేవాడిని. కానీ పని భారాన్ని పంచుకోలేని అసహాయత నాది.

నా ఏకాంతవాసం విచిత్రమైన అనుభవం. ఆరోగ్యం, మనసు దేనికీ సహకరించని వింత స్థితి. ఇలాంటప్పుడు బంధుమిత్రుల పలకరింపులే గొప్ప ఊరట. డాక్టర్‌ సత్యలక్ష్మి గారు తరచూ నాకు ఫోన్‌ చేసి మాట్లాడేవారు. మా పర్చా పద్మావతి గారి బిడ్డ డాక్టర్‌ కమలా స్ఫూర్తి ఎన్నో కబుర్లు చెప్పి నన్ను ఊరటపరిచింది. నా ప్రాణమిత్రుడు నామాడి శ్రీధర్‌ ఆత్మీయ వచనంతో ఏ రోజుకారోజు శాంతపరిచేవాడు. అమెరికాలో ఉన్న మరో ప్రాణమిత్రుడు అఫ్సర్‌ నా పక్కన ఉన్నంత భరోసా ఇచ్చేవాడు. జె.గౌతమ్‌ రెండు రోజులకి ఒక్కసారైనా వీడియో కాల్‌ చేసి మాట్లాడేవాడు. కవిత్వాన్ని నిత్యశ్వాసగా మార్చుకున్న అనంత్‌ చింతలపల్లి, శోభగారు, ఆత్మీయులు డాక్టర్‌ వీణా శత్రుజ్ఞ, రమ మెల్కోటే, కె.లలిత, హెచ్‌బీటీ గీతగారు, జయధీర్‌ తిరుమలరావు గారు, ఏలె లక్ష్మణ్‌ అన్న, కె.శ్రీనివాస్‌ గారు, శివప్రసాద్‌, పెద్ది రామారావు, వినోదిని, ఖాజా… మా అందరి గారాలపట్టి కివీ, బాలు, సాంబు (టీవీ 9), అరవింద, తులసి, చందు, విమలక్క, పతంజలి శాస్త్రి గారు, అపర్ణ, శశి, దేశరాజు, ముక్కామల చక్రధర్‌, కుప్పిలి పద్మ, కృష్ణ, గిరిజ టీచర్‌ గారు, మానస ఎండ్లూరి, డా.శ్రీదేవి, తమ్ముడు శ్రీను, వెంకటేష్‌ (ఆంధ్రజ్యోతి), నందగిరి కిష్టప్ప, ఆంజనేయులు (వార్త బాచ్మెట్‌), చూపు సురేష్‌, వల్లూరి రాఘవ, శ్రీదుర్గ, ఆనంద్‌, రవీంద్రబాబు, కొండా రమేష్‌, ఫణి మోహన్‌, చిత్రలేఖ, ప్రవీణ్‌, ఫాంట్‌ లైన్‌ నిర్మలగారు, బేబి (అనురాధ) గారు, హరినాథబాబు గారు, ప్రమీల గారు, భాస్కర్‌ జోగేష్‌, కోడూరి విజయకుమార్‌, స్కై బాబా, షాజహానా, భావన, శ్రీశైల్‌ రెడ్డి, అమెరికా నుంచి హిమబిందు, తెలిదేవర భానుమూర్తి, మంచి పుస్తకం సురేష్‌, భాగ్యలక్ష్మి వంటి అనేకమంది సాహిత్య, పాత్రికేయ మిత్రులు దఫదఫాలుగా పలకరించారు. విజువల్‌ మీడియా రంగంలో నాతో కలిసి సుదీర్ఘకాలం పనిచేసిన స్నేహ బంధువు, నా శ్రేయోభిలాషి మధురవాణి వీలున్నప్పుడల్లా కుశలాన్ని తెలుసుకున్నారు. ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారు, డైరెక్టర్‌ భానుప్రకాష్‌ గారు ఫోన్‌ చేసి ‘త్వరగా తగ్గిపోతుందిలే’ అని ఎంతో తేలికపరిచారు. అసోసియేట్‌ ఎడిటర్‌ వెంకటకృష్ణ, కో-ఆర్డినేటర్‌ నరసింగరావు, యాంకర్‌ స్వామి, మధుశ్వేత, సహోద్యోగులు నాగరాజు, లావణ్య, అన్సారి, రసూల్‌, కేరింగ్‌ సిటిజన్స్‌ కలెక్షన్‌ మిత్రులు ప్రవీణ్‌, పల్లెటూరి ప్రసాద్‌, కొండల్‌ ఇతర మిత్రులు… నా బాగోగులు తెలుసుకున్నారు. ఆర్కే (పర్ఫెక్టివ్స్‌), జీవన్‌ సార్‌, ఖలీద, సి.వనజ, అంబిక, ఇందిర, ఆషా, శ్వేత, సుజాత, రెయిన్‌ బో హోమ్స్‌ పిల్లలు, గోపరాజు సుధ, కిరణ్‌ విస్సా, నవీన్‌, పద్మ వంగవల్లి, నల్లగొండ విశ్వం, అజోయ్‌ దేవులపల్లి, అమర్‌ దేవులపల్లి, బెజవాడ విల్సన్‌, గాంధీ హాస్పిటల్‌లో పనిచేసే డాక్టర్‌ రమాదేవి వంటి మిత్రులు సజయతో నా గురించి వాకబు చేశారని విన్నప్పుడు నాకెంతో సంతోషం అనిపించింది. మా ఇద్దరినీ పెంచుకుంటున్న చిన్నారి పండుబాబు వాళ్ళమ్మతో కలిసి మాకీ సమయంలో వీడియో కాల్స్‌ ద్వారా సందడి పంచాడు.

నా వైపు, సజయ వైపు ఉన్న తొమ్మండుగురు మేనకోడళ్ళు చిన్నారి, పొన్నారి, పెద్దచిట్టి, చిన్నచిట్టి, కుమారి, పెద్దబేబీ, చిన్నబేబీ, మాధురి, మేఘనల ఫోన్‌ పరామర్శలు, మెసేజ్‌లు, వాళ్ళ పిల్లలు సాస్వి, స్వర, అనూజ, దిత్య, ఆరాధ్యల వీడియో చాట్లు, సజయ వాళ్ళ అక్క కొడుకులు రాహుల్‌ కిన్నెర దంపతులు, వారి పిల్లలు విహాన్‌, వియోనా, శ్రీనివాస్‌ లాలస జంట, వారి పిల్లలు సుహాస్‌, శిశిరల సంభాషణ నాకెంతో ఉత్తేజం ఇచ్చింది. మా బావగారు అజయ్‌, చెల్లి లక్ష్మి, నా తోడల్లుడు పెదబాబు, మావయ్య కాకర్ల నాగేశ్వరరావు గారు చూపిన ఆపేక్ష, మా అమ్మ, అక్క, అన్నయ్య, తమ్ముడు, చెల్లి, మా తమ్ముడి బిడ్డ దివ్య, మేనల్లుడు బాబీ, బావమరిది కీత్‌, వాళ్ళ అమ్మ లక్ష్మీకుమారి, అత్తయ్య సుమతి… ఇలా ఎవరో ఒకరు పరామర్శిస్తూనే ఉన్నారు.

ఐసోలేషన్‌లో ఉన్నప్పుడే నా పుట్టిన రోజు వచ్చింది. అంతకు రెండు రోజుల ముందే ఆంటే జులై 19నే పూలమొక్కలు, స్వయంగా తయారుచేసిన కేక్‌, విందు భోజనం మా ఇంటికి పంపి వారోత్సవాలు మొదలుపెట్టింది వసుధ. ఆ రోజు కలిగిన ఆనందంతో కరోనా నా నుంచి పరారయ్యిందనే చెప్పాలి. ఇక నా పుట్టిన రోజునాడు సజయ వాళ్ళ అమ్మ… మా అత్తయ్య కల్పనగారు ప్రత్యేకంగా చేపల పులుసు, చికెన్‌ కర్రీ, స్వీట్‌ చేసి పెద్దచిట్టి ద్వారా పంపించారు. సజయ మేనత్తగారి ఇంటి నుంచి కూడా విందు భోజనం వచ్చింది. మా బంగారుతల్లి చిన్నచిట్టి కేక్‌ ఆర్డర్‌ చేసి పంపించింది. కొన్ని రోజుల తర్వాత మా అపార్ట్‌మెంట్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు అశోక్‌ గౌడ్‌ గారు, వారి శ్రీమతి సువర్చిత గారు ప్రత్యేకించి మా కోసం చికెన్‌ కూర, బిర్యానీ చేసి పంపించారు. సజయ పట్ల వీరంతా చూపిన ఆపేక్ష, ఆదరాభిమానాలు చూసి కరోనా గుండె కరిగిందో ఏమో… నా నుంచి త్వరగానే జారుకుంది.

రేపు ఐసోలేషన్‌ ముగుస్తుందనగా నా గది అంతటా కెమికల్‌ వాటర్‌ స్ట్రే చేయడం ద్వారా డిసిన్ఫెక్ట్‌ చేశాను. 14 రోజుల తర్వాత ఆ గది నుంచి బయటకు వచ్చే ముందు నేను వాడిన టవల్స్‌, పక్క దుప్పట్లు, గలీబులు.. అన్నింటినీ వేడినీళ్ళలో నానబెట్టి జాడించి ఆరేశాను. అప్పుడు కూడా ఆ బట్టల నుంచి నీటిబొట్లు బయటకు చిందకుండా బాల్కనీలో లోపలివైపు ఆరబెట్టాను. ఇలా ప్రతి విషయంలోనూ క్రమ పద్దతినీ, జాగ్రత్తనీ తూ.చ. తప్పకుండా అనుసరించాను. మొత్తానికి విజయవంతంగా నా ఐసోలేషన్‌ ముగిసింది. ఆ తర్వాత మరో వారం రోజులు హోం క్వారంటైన్‌లో ఉన్నాను. పూర్తిగా కోలుకున్నాను. సజయ కూడా ఆరోగ్యంగా ఉంది. 22 రోజులు పూర్తయిన తర్వాత మిత్రుల సూచన మేరకు ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌ చేయించాము. నాకు నెగిటివ్‌ వచ్చింది. సజయకు రెండో దఫా కూడా నెగటివ్‌ వచ్చింది.

ఆ 21 రోజులు మా ఇంటి గ్రిల్‌కి కూడా తాళం వేసి ఉంచాము. మాకు కావాల్సిన సరుకులు కొన్ని సార్లు బిగ్‌ బాస్కెట్‌ ద్వారా రప్పించుకున్నాం. ఎక్కువ సందర్బాల్లో సజయ మేనత్త బిడ్డ డాక్టర్‌ మైత్రి, తన భర్త శ్యామ్‌ ప్రసాద్‌ కూరగాయలు తమ డ్రైవర్‌ మొహిసిన్‌ ద్వారా పంపించారు. మా రోజువారీ అవసరాలు వారే చూసుకున్నారు. వాచ్‌మేన్‌ మాత్రం పాల ప్యాకెట్లు, పేపర్లు ఇచ్చి వెళ్ళేవాడు. మంచినీళ్ళ క్యాన్‌లు ద్వారబంధం దగ్గర పెట్టేవారు. ఖాళీవి మేము బాగా శుభ్రం చేసి తిరిగిచ్చేవాళ్ళం. ఇలా సకల అంశాల్లో సవాలక్ష జాగ్రత్తలు పాటించాము మేమిద్దరం. ఎందుకంటే ఇది అంటువ్యాధి. మనవల్ల ఎవరికీ అంటకూడదన్న భావనతో!

ఐసోలేషన్‌లో ఉన్నప్పుడు నేను చేసిన మరో పని కోవిడ్‌ పేషెంట్లుగా ఉన్న నా కొలీగ్స్‌, ఇతర మిత్రులకు అవసరమైన ధైర్యం చెప్పడం. సుమారు 15 మందితో రోజూ ఫోన్‌లో మాట్లాడుతుండేవాడిని. వారి ఆరోగ్య పరిస్థితిని వాకబు చేస్తూ, నాకున్న పరిజ్ఞానం మేరకు సలహాలు, సూచనలు ఇచ్చేవాడిని. వారిలో సప్తగిరి, శ్రీహరి అనే మిత్రుల ఆరోగ్యం బాగా విషమించింది. శ్రీహరి అయితే ఆస్పత్రిలో చేరి అయిదు రోజులకు పైగా ఆక్సిజన్‌ మీద ఉన్నాడు. సకాలంలో అందిన వైద్యంతో పాటు మనోధైర్యం వల్ల మాత్రమే తను కోలుకోగలిగాడు. ఇవి కాక ప్రతిరోజూ నా బాల్కనీ నుంచి సాయంసంధ్య వర్ణచిత్రాలను ఫోన్‌ కెమెరాలో బంధించడం, పెన్సిల్‌ డ్రాయింగ్స్‌ వేయడం ద్వారా నన్ను నేను ఎంగేజ్‌ చేసుకున్నాను.

నాకు కరోనా వచ్చిందని తెలిసిన రోజే, అప్పటికి రెండేళ్ళ నుంచీ జైల్లో ఉన్న విప్లవకవి వరవరరావు గారికి కూడా ఈ వైరస్‌ సోకిందన్న వార్త తెలిసి ఒకింత ఆందోళనకు గురయ్యాను. అది లోపల అలా ఉండగానే, నా ఐసోలేషన్‌ మరొక్క రోజులో ముగుస్తుందనగా ఉద్యమాల ఉపాధ్యాయుడు ఉసా కన్నుమూశారు. కరోనా కాటుకు ఆయన ప్రాణం పోయిందన్న వార్త వినగానే నా మనసు తల్లడిల్లిపోయింది. సజయకైతే ఆయన అత్యంత ఆప్తుడు. చిన్నతనం నుంచీ తెలుసు. మేమిద్దరం ఆయన్ని చివరి చూపు కూడా చూడలేకపోవటం బాధాకరమే అయినప్పటికీ, అంత్యక్రియల ఏర్పాట్ల బాధ్యతను ఫోన్‌ ద్వారానే సజయ ఇతర మిత్రులతో సమన్వయం చేసింది. ఉసా దూరమైన బాధ నా హెల్త్‌ మీద ప్రభావం పడింది. హైబీపీ వచ్చింది. బాగా నీరసపడిపోయాను. మెల్లగా ఆ విషాదాన్ని జీర్ణించుకుంటుండగానే మరో పిడుగుపడింది. నాకు పెద్దన్న వంటి గోవింద్‌ (ఫోటోగ్రాఫర్‌)ని కూడా కరోనా కబళించింది. దెబ్బమీద దెబ్బ. నిజానికి వీరిద్దరినీ కాపాడుకోవడం కోసం సజయ, మిత్ర బృందం పడిన తాపత్రయం ఇంతా అంతా కాదు. అయినప్పటికీ పరిస్థితి చేయి దాటిపోయింది. ఈ పరిణామాలతో నా బాడీ రీడింగ్స్‌ అన్నీ డౌన్‌ అయ్యాయి. ఇదే సమయంలో కోవిడ్‌తో మిత్రురాలు కవిత పులి తీవ్ర అనారోగ్యం పాలవడం కూడా ఆందోళన పెంచింది. డాక్టర్‌ సత్యలక్ష్మి గారు అనేక జాగ్రత్తలు చెప్తూ నా మనసుకి ఓదార్పునిచ్చారు. మొత్తానికి నేను కరోనా నుంచి బయటపడ్డాను. కానీ పోస్ట్‌ కోవిడ్‌ సింప్టమ్స్‌ ఉన్నాయి. వాటితో కుస్తీ పడుతున్నాను. పూర్తిగా కోలుకోవడానికి మరికొన్ని రోజులు పట్టవచ్చు. త్వరలోనే పూర్ణారోగ్యం పొందుతానన్న నమ్మకం నాకుంది.

కొవిడ్‌ వచ్చినప్పుడు నాకున్న అవకాశాల మేరకు ఇవీ నేను అనుసరించిన జాగ్రత్తలు. ఎవరికైనా ఇలాంటి సమస్య వస్తే వారికున్న అవకాశాలు, పరిధుల మేరకు ప్రికాషన్స్‌ తీసుకోవడం ఉత్తమం. అన్నింటికంటే ముఖ్యం మన చుట్టూ ఉండే మిత్రులు, బంధువులు, ఇరుగుపొరుగు ఇచ్చే మానసిక స్థైర్యం, భరోసా. నేను పాటించిన పద్దతి, చెప్పే మాటలు కొందరికి చాదస్తంగా అనిపించవచ్చు. కానీ, లైఫ్‌ స్టైల్‌లో వచ్చిన మార్పుల కారణంగా మనలో చాలామందికి అనేక అనారోగ్య సమస్యలు సహజమయ్యాయి. జర్నలిస్టు మిత్రులకైతే పని ఒత్తిడి వల్ల హెల్త్‌ ఇష్యూస్‌ చాలా ఉంటున్నాయి. అందువల్ల ఎవరైనా సరే కొవిడ్‌ సోకకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం, ఒకవేళ సోకితే అప్రమత్తతతో వ్యవహరించడం అత్యవరం.

కొసమెరుపు: నాకు కరోనా వచ్చిన తొమ్మిది రోజుల తర్వాత రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ పరిధిలోని పోలీస్‌ స్టేషన్‌ నుంచీ, రాష్ట్ర ప్రభుత్వ కోవిడ్‌ కంట్రోల్‌ రూమ్‌ నుంచీ ఫోన్లు వచ్చాయి. నా ఆరోగ్యం గురించి వాకబు చేశారు. సంతోషం. నిజానికి ఇది మొదటిరోజునే చేయాల్సిన పని కదా! దొంగలు పడిన ఆరు నెలలకు పోలీసులు రావడం అంటే ఇదేనేమో…!

Share
This entry was posted in కరోనా డైరీస్. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.