ఒక తల్లిని నమ్మనివాళ్ళు ఎవరుంటారు? అది తెచ్చిపెట్టుకున్న నమ్మకం కాదు, ఎవరో చెబితే ఏర్పరచుకున్నదీ కాదు. అదే భావనతో గౌరి కూడా తల్లిలాంటి దేశాన్ని మొదట నమ్మింది. చివరివరకూ నమ్మింది. కానీ ఆమె ఆ నమ్మకంలో ఉండగానే బలైపోయింది. గౌరీ లంకేష్ ప్రజాస్వామ్య వ్యవస్థనూ నమ్మింది. తన కళ్ళముందు ప్రజాస్వామ్యం అడుగడుగునా వంచన పాలవుతున్నా ఇంకా ఇంకా సన్నని ఆశ రెపరెపలాడుతుంటే ఆమె ఈ వ్యవస్థలో ప్రజాస్వామ్యం ఉంటుందనీ నమ్మింది. కానీ ఆ నమ్ముకమూ దారుణంగా వమ్మయింది.
బహుశా గౌరి ఇప్పుడు ఉండి ఉంటే ఇంకా తన మాతృభూమిని నమ్ముతూ, ప్రజాస్వామ్యాన్ని నమ్ముతూనే ఉండేది. నిజానికి భారత పౌరులందరూ దేశాన్నీ, ప్రజాస్వామ్యాన్నీ నమ్ముతూనే ఉంటారు.
నమ్మకమనే ఆశావహ దృక్పథం పౌరులకు అవసరం కూడా. దేశాన్ని నమ్మడమంటే దేశాన్ని ప్రేమించడం, ప్రజాస్వామ్యాన్ని కాంక్షించడం, ప్రేమించడం. నమ్మకం కూడా ఏమార్చి మోసం చేస్తుందని అనుకోలేని అమాయకత్వం, స్వచ్ఛత గౌరిది. నిర్భయం కూడా భయానకం అవుతుందని గౌరి దుర్మరణంతో మరోసారి రుజువైంది. అయితే ఆమెకు లోలోపల కొన్ని భయాలుండవచ్చు అయినా ఆమె ఆ భయాలను పట్టించుకొని ఏ జాగ్రత్తలూ తీసుకోలేదు.
గౌరిది సత్యదృక్పథం, సత్యమార్గం. అదే ఆమె నమ్మకం. ఇంకా చెప్పాలంటే ఆమె మరింత భోళాతనంతో మన పాలకులు రాజకీయ ఎత్తుగడగా మనల్ని నిత్యం ఊదరగొట్టి నమ్మించే ‘ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సంక్షేమ రాజ్యం’ అనే అందమైన స్వప్నాన్ని నమ్ముతూనే వచ్చింది. అంతర్లీనంగా పొదుముకున్న ఈ భావనలు ఆమెను క్రూరంగా అంతం చేశాయి. దాన్ని విశ్లేషించుకునేందుకు ఆమె లేదు, మనమంతా ఉన్నాము.
జాతీయ ప్రజానాయకులు కలలుగన్నట్లుగానే గౌరికి కూడా ఆ వారసత్వం దేశీయంగా వచ్చింది. అందుకు బలమైన మూలం దేశ రాజ్యాంగం. ఆమె సర్వశక్తులూ ధారపోస్తూ తన అందమైన స్వప్నం సాకారమయ్యేందుకు పోరాడింది. తమ గుప్పిట అధికారాన్ని బిగించి ఆధిపత్యాన్ని, పెత్తనాన్నీ వెలగబెట్టే శక్తులతో నిర్విరామంగా, నిర్భయంగా పోరాడింది. నమ్మకద్రోహానికి పచ్చని చెట్టుగా దహించబడింది.
ఆమె ప్రజాస్వామిక వాది, మేధావి, మానవతావాది, లౌకికవాది, ప్రజాపక్షవాది. ఆమె సేవలు ఈ సమాజానికి బహుముఖంగా అందాయి. ఒక జర్నలిస్టుగా ఆమె నిలకడ, నిబద్ధత జర్నలిజానికి మెరుపులు అద్దింది, ఆదర్శంగా నిలిచింది. ఆమె సామాన్యులలో చేరిన సామాన్యురాలు. సత్యం కోసం తొణకకుండా నిలబడిన సత్యవాది. విలువల్ని ఆభరణాలుగా ధరించిన అభ్యుదయవాది. ఆ విలువల్ని ధ్వంసం చేయడానికి ఆమెను హత్యచేశారు. అందుకే పాలకవర్గం లోకం కోసమైనా ఆమె హత్యానంతరం దొంగ ఏడుపైనా ఏడవలేదు. ఆమెను లేకుండా చేయాలనే ఉద్దేశ్యం నెరవేరినందుకు మౌనాన్ని ఆశ్రయించింది పాలకవర్గం.
అనాదిగా జరుగుతున్న నేరం అసమ్మతి, విమర్శ నోరు మూయడం. అందుకు గెలవలేక ఎంచుకున్న మారణాయుధం చంపడం. ఇది భౌతిక హత్య కాదు, విలువల్ని తుడిచిపెట్టే చర్య అనుకోవాలి.
దేశంలో పరిస్థితులు ప్రమాదకరంగా, విషాదకరంగా ఉండడం మనం గ్రహించి ప్రతి నిత్యం అనుభవిస్తున్న యాతనే. ఒక అంతు తెలియని ఊబిలోకి జారిపోతోంది సమాజం. బహుళత్వం ఉనికి అంతరించిపోతున్నది. ఏకత్వానికి పెద్ద పీట వేయబడుతున్నది.
ఇప్పుడు స్వతంత్ర గణతంత్ర సర్వసత్తాక సార్వభౌమత్వపు భారతదేశానికి 73 ఏళ్ళు. ప్రతిరోజూ దిగజారిపోతూనే
ఉన్న దేశ సమగ్రత, సార్వజనీన సౌభ్రాతృత్వపు సంఘీభావం. అయితే మన భాగ్యం ఏమిటంటే విలువలున్న భారతదేశం కొంత బతికే
ఉంది. అందుకే నమ్మకానికి బలైపోయిన నమ్మకం కొందరి, మనందరి అస్థిత్వంలో, వ్యక్తిత్వంలో బతికే ఉంది. గౌరిని హత్య చేసిన దౌర్జన్యాన్ని, చట్టాన్ని చిత్తుకాగితం చేసే తత్వాన్ని ‘దేశం’ ఎప్పటికీ క్షమించదు. గౌరి ప్రాణాలర్పించిన విలువలను నిలబెట్టే, పోరాటస్ఫూర్తిని కొనసాగించే వారసులు ఇంకా చైతన్యపు జల్లులుగా వర్షిస్తూనే ఉన్నారు.
ఆమెను తెలిసినవాళ్ళు నిటారుగా నిలిచి ఉంటారు. ఆమె తెలియని వాళ్ళు సైతం ఇప్పుడు ఆమెను తెలుసుకున్నారు. రోజు రోజుకూ ఇంకా తెలుసుకుంటూనే ఉన్నారు. గౌరి ఇప్పుడు దేశమంతా ప్రతిధ్వనించే ప్రజాస్వామ్య నినాదం. అదే మన ధైర్యం, భరోసా. గౌరి ఆలోచనలు మనలో పచ్చగా తలెత్తుతున్న మొలకలు.
గౌరికి నివాళిగా మనం ప్రజల పక్షం వహిస్తూ నిస్సంకోచంగా ప్రజా సమస్యల గురించి మాట్లాడాలి. మానవీయ విలువల కోసం ఉద్యమ కెరటాలమై ఒడ్డును తాకుతుండాలి. గౌరి స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, మానవీయతలను బాధ్యతగా హక్కుగా చేపట్టింది. ఆమె ఒక పౌర-కార్యకర్తగా పరిణితితో పరిణామం చెందింది. ఆమె స్వేచ్ఛా మానవి. మన అందరి ప్రియబాంధవి. అమరత్వం పొందిన అతి సామాన్యజీవి. నివాళులు!