పదిహేనేళ్ళ ఒక అమ్మాయి ఒకరోజు కాలేజి నుంచి ఇంటికి వస్తూ వర్షంలో చిక్కుకుపోతుంది. బస్టాప్‌లో ఎదురుచూస్తున్న ఆమెకు కారులో వెళ్తున్న ఒక యువకుడు లిఫ్ట్ ఇస్తాడు. ఆధునికమైన ఆ కార్‌ని, అందులో హంగులను విభ్రాంతిగా చూస్తున్న ఆమెపై అందులోంచి తేరుకోకముందే అఘాయిత్యం జరుగుతుంది. ఏడుస్తూ ఇంటికి వచ్చిన కూతుర్ని చూసి తల్లి భోరుమంటుంది. కానీ కాసేపే… వెంటనే తేరుకున్న తల్లి తన కూతుర్ని తలారా స్నానం చేసి రమ్మంటుంది. జరిగిన సంఘటన ఆమె శరీరానికి అంటిన మలినం లాంటిదేనని… తలస్నానం చేయడంతోనే ఆ మలినం పోయిందని కూతురికి ధైర్యం చెప్తుంది. ఆ తర్వాత ఆ కూతురు ఎప్పుడూ కార్‌వైపు తొంగి చూడలేదంటూ ముగిస్తాడు రచయిత. 1967లో జయకాంతన్ అగ్నిప్రవేశం అనే పేరుతో రాసిన కథ ఇది.
ఈ కథలో ఎవరికీ పేర్లుండవు. ఆమె, అతను, తల్లి, పక్కింటి ఆమె గొంతు. అంతే. జయకాంతన్ దృష్టిలో ‘ఆమె’ సర్వనామం. కానీ, 50 సంవత్సరాల క్రితం రాసిన ఈ కథ ప్రకంపనలు సృష్టించింది. సాంప్రదాయాన్ని మంట కలిపాడని జయకాంతన్ మీద యుద్ధం ప్రకటించారు ఒక వర్గం పాఠకులు. ఆ విమర్శలకు జయకాంతన్ సమాధానం చెప్పలేదు. సరే, మీరనుకున్నట్లే కథని మార్చి చూపిస్తా… అన్నాడు. ఎందుకంటే విమర్శకి ప్రతి విమర్శ చేసి ఊరుకునే రచయిత కాదాయన. సమాజపు స్వరూపాన్ని కాచి అవపోసన పట్టిన మేధావి.
అప్పుడు ఆ కథని విస్తరించి ఒక పెద్ద నవల తీసుకువచ్చాడు. ఇంగ్లీషులో ఁూట ఎవఅ aఅస ఎశీఅవఅ్‌రఁ గానూ, తెలుగులో ‘కొన్ని సమయాలు, కొందరు మనుష్యులు’ గానూ అనువదించబడింది ఆ నవల. నవలలో పాత్రలకి పేర్లు పెట్టాడు. నాయక పేరు గంగ. అత్యాచారం జరిగాక తల్లి కూతుర్ని తన కడుపులో పెట్టి దాచుకోదు. నానా యాగీ చేస్తుంది. గంగ అన్న, వదిన ఆమెను ఇంట్లో నుంచి తరిమేస్తారు. తన తప్పు లేకపోయినా సమాజంలో ప్రతి పాత్రా ఆమె పట్ల తీర్పరి అవుతుంది. కష్టపడి చదువుకుని ఎల్.ఐ.సి.లో సూపరింటెండెంట్‌గా ఉద్యోగం సంపాదిస్తుంది గంగ. మేనమామ ప్రాంపకంలో పెరిగినా, మేమమామ ఆమె పట్ల ఎబ్యూజ్‌కి పాల్పడినా గంగ ఎదురు తిరగదు. ఒకవిధమైన న్యూనతతో బాధపడే గంగ అణకువగా, చాలా మెతకగా ఉంటుంది. కాలక్రమంలో ఆమెపై అఘాయిత్యం చేసిన ప్రభు చిరునామా తెలుసుకుంటుంది. అతని కుటుంబానికి దగ్గరవుతుంది.
అసలు గంగ ఎలాంటి జీవితం కోరుకుంది?? ఇది ఎవరికీ పట్టదు. ఆఫీసులో సబ్‌స్టాఫ్, మేనమామ, ప్రభు, తల్లి, అన్నయ్య, వదిన… అందరూ ఆమె పట్ల పెద్ద తీర్పరులవుతారు. గంగ మనసుని అర్థం చేసుకునేవాళ్ళే ఉండరు. గంగ జీవితాన్ని చక్కదిద్దుతున్నామన్న భ్రమలో ఆమె మనసుకి చేసే గాయాలకి అంతు ఉండదు. ఒంటరి అయిన గంగ నిరాశలోంచి వైల్డ్‌గా మారిపోతుంది. ప్రభు పట్ల ద్వేషంతో, తర్వాత స్నేహంతో మొదలైన ప్రయాణం… ప్రేమ దగ్గర ఆగి గంగని ఒక గందరగోళ స్థితిలోకి నెట్టేస్తుంది. నిరాశలోంచి బయటపడడానికి గంగ తాగుడుకి బానిసవుతుంది. అందరిపట్లా సబ్మిసివ్‌గా, తన పట్ల న్యూనతగా ఉన్నంతసేపూ ఆడపిల్లంటే గంగలా ఉండాలని మెచ్చుకుని తృప్తిపడిన చుట్టూ మనుషులు… ఆమె వైల్డ్‌గా మారిన తర్వాత ఆడపిల్ల ఎలా ఉండకూడదో ఉదాహరణగా గంగని చూపడం మొదలుపెడతారు.
– ఇది రెండవ కథ.
ఈ కథ తమిళంలో సినిమాగా వచ్చింది. జయకాంతన్‌కి సాహిత్య అకాడమీ అవార్డుని తెచ్చిపెట్టింది. కానీ, జయకాంతన్‌కి తృప్తి కలగలేదు. ఒక పాత్ర ఒక రచయితనీ, తమిళ పాఠకులనూ, అనువాదం అయ్యాక తెలుగు పాఠకుల్నీ 20 సంవత్సరాల పాటు వెంటాడింది అంటే ఆ కథకి ఎంత సార్వజనీనత ఉండాలి?? రచయితకి సమాజపు పోకడల పట్ల ఎంత అవగాహన ఉండాలి? గంగ ఏమయ్యింది అన్న చర్చ సాహితీ లోకాన్ని 20 ఏళ్ళపాటు వెంటాడింది. ఈ కథ రాసిన తర్వాత చాలా సంవత్సరాలు మధనపడ్డాక జయకాంతన్ ఁఔష్ట్రఱ్‌ష్ట్రవతీ +aఅస్త్రa?ఁ అని ఇదే కథని పొడిగిస్తూ మరొక నవల రాశారు. గంగ ఎక్కడికెళ్తోంది? అనే పేరుతో తెలుగులో జిళ్ళేళ్ళ బాలాజీ అనువాదం చేశారు. ప్రభుకి, కుటుంబానికి దూరమైన గంగ అందరికీ దూరంగా వారణిసికి వెళ్తుంది. తాను చేసిన తప్పుకి పశ్చాత్తాపడి ప్రభు ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. అజ్ఞాతంగా ఎక్కడో ఒక మెకానిక్‌గా పనిచేస్తూ ఉంటాడు. అనేకానేక మలుపులు తిరిగిన తర్వాత గంగ కాశీలో గంగా ప్రవేశం చేయడంతో మూడవదీ, చివరిదీ అయిన గంగ కథ ముగుస్తుంది.
గంగకి అంతకు మించి వేరే దారి లేదని రచయితా, సాహిత్య లోకం నిర్ణయించినా… నిజానికి అది సమాజ పోకడల ఆధారంగా వాస్తవికతకు అద్దం పట్టినా… గంగ పట్ల సహానుభూతి ఉన్న ఏ పాఠకుడైనా ఆమె పాత్ర ‘అగ్ని ప్రవేశం’ కథతో ముగిసి ఉంటే బాగుంటుందనే కోరుకుంటాడు. ఒక పొరపాటు, లేదా ఒక ప్రమాదం జరిగినప్పుడు ఆమె తల్లి కూతుర్ని నిజంగా అలా కడుపులో పెట్టుకుని కాపాడుకుని ఉంటే గంగ జీవితం ఎంత చక్కగా ఉండి ఉండేది. కానీ చివరికి అంత తెలివైన, చక్కనైన గంగ ఏమయ్యింది?
మూడు పుస్తకాలు ఎంత వాస్తవంగా ఉంటాయంటే, రెండవ నవలలో ఆఫీసు వర్ణన, సహోద్యోగుల ప్రవర్తన… మనం చాలా చోట్ల చూసినట్లే ఉంటాయి పాత్రలన్నీ. గంగ వదిన పాత్ర, ప్రభు భార్య పాత్ర మనకి అడుగడుగునా కన్పిస్తారు. గంగకి అలా జరిగి ఉండకూడదని మన మనస్సు కొట్టుకుపోతుంది. కానీ ఏం లాభం మనం మారనంతవరకూ గంగ లాంటి పాత్రలు అన్యాయమైపోవాల్సిందే.
జయకాంతన్ ఒక కథ రాశారు. పాఠకులు కొన్ని విమర్శలు చేశారు. కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. ఆయన తన కథ ద్వారానే సమాధానం చెప్పాడు. ఈ సారి ఆయనకే తృప్తి కలగలేదు. మళ్ళీ తన కథని ముందుకు తీసుకువెళ్ళారు. ఇలా ఒక సంఘటనని, కొన్ని పాత్రల్ని మనతో పాటు రెండు దశాబ్దాల పాటు సజీవుల్ని చేసి నడిపించాలంటే సమాజపు లోతుల్ని ఎంతగా అధ్యయనం చేసి ఉండాలి? ఇదే కాదు. జయకాంతన్ అన్ని రచనల్లోనూ ఈ స్పష్టత కనిపిస్తుంది. కమ్యూనిస్టు యోధునిగా, సామాజిక శాస్త్రవేత్తగా పేరుపడ్డ జయకాంతన్ రచనలు మనలో రేకెత్తించే ఆలోచనలు మామూలుగా ఉండవు.