సమయం కోసం… -అంపశయ్య నవీన్‌

”మీరు పంక్చువాలిటీని స్ట్రిక్టుగా పాటిస్తారు కదా! ఈ రోజు లేటయ్యారేమిటి?” హడావిడిగా హెడ్మాస్టర్‌ రూమ్‌లో ప్రవేశించి అటెండెన్స్‌ రిజిస్టర్‌లో సంతకం చేస్తున్న వాసంతితో అన్నాడు నిరంజన్‌.

”నేను ఇంట్లో బయల్దేరేటప్పటికి కొంచెం లేటయ్యింది. బస్సులో వెళ్తే టైమ్‌కు స్కూల్‌కు అందుకోలేనని ఆటోలో బయల్దేరాను. దార్లో ఆటో ఫెయిలయ్యింది. అరకిలోమీటర్‌ దూరం నడిచే వచ్చాను” అంది వాసంతి నిరంజన్‌ పక్కనే ఉన్న ఖాళీ సీట్లో కూర్చుంటూ.

”అయ్యో! అరకిలోమీటర్‌ నడిచారా? అందుకేనా మీ ముఖం నిండా చెమట బిందువులు కారుతున్నాయి. నాకు ఫోన్‌ చెయ్యలేకపోయారా? నా స్కూటర్‌ మీద క్షణంలో మీ ముందు వాలేవాడిని” అన్నాడు నిరంజన్‌.

హెడ్‌మాస్టర్‌ రూమ్‌లో హెడ్‌మాస్టర్‌ లేరు. రౌండ్స్‌కు వెళ్ళాడని వాసంతికి అర్థమయ్యింది.

”మీకు ఫోన్‌ చెయ్యాలన్న ఆలోచన నాకు రాలేదులెండి… లక్కీగా ఈ రోజు నాకు ఫస్ట్‌ పీరియడ్‌ లేదు. అయినా హెడ్‌మాస్టర్‌ ఏమంటాడోనని భయపడ్తూనే వచ్చాను” అంది వాసంతి.

”రోజూ కరెక్ట్‌ టైముకొచ్చే మిమ్మల్ని ఏమనడులెండి. ఆయన ఇప్పుడే రౌండ్స్‌కి వెళ్ళాడు. నాకూ ఈ రోజు ఫస్ట్‌ పీరియడ్‌ లేదు. మీరింకా రాలేదేమిటని మీకోసమే వెయిట్‌ చేస్తూ కూర్చున్నాను…” అన్నాడు నిరంజన్‌.

”నాకోసం వెయిట్‌ చేస్తూ కూర్చున్నారా… వద్దండి.. నాకోసం మీరెప్పుడూ ఇలా వెయిట్‌ చెయ్యకండి…” అంది వాసంతి కొంచెం చిరాగ్గా.

”అట్లా అంటే ఎలా మేడమ్‌! అనుక్షణం మీ గురించే ఆలోచించే నన్ను మీ కోసం వెయిట్‌ చెయ్యొద్దంటే ఎలా? మిమ్మల్ని ఏ క్షణాన చూశానోగాని…” అతడు ఆ వాక్యాన్ని పూర్తి చేయకుండానే హెడ్‌మాస్టర్‌ ఆ రూమ్‌లో ప్రవేశించాడు.

”ఈరోజు ముగ్గురు టీచర్లు లీవ్‌ పెట్టారు… వాళ్ళు తీసుకోవాల్సిన క్లాసు పిల్లలు వరండాలో చేరి అల్లరి చేస్తున్నారు… ఎన్నడూ లేంది వాసంతి గారూ! మీరీరోజు లేటయ్యారేమిటి? మీరు నైన్త్‌ క్లాసుకెళ్ళగలరా? ఆ క్లాసు తీసుకోవలసిన విష్ణుమూర్తి ఇంకా రాలేదు…” అన్నాడు హెడ్‌మాస్టర్‌.

”నేను నైన్త్‌ క్లాసుకు వెళ్తాను సార్‌. తర్వాత కూడా నేను వెళ్ళాల్సింది నైన్త్‌ క్లాసుకే… ఈ పీరియడ్‌ అయ్యాక కూడా నేను ఆ క్లాసులోనే ఉంటాను” అంటూ వాసంతి హెడ్‌మాస్టర్‌ రూమ్‌ నుండి బయటకు వెళ్ళిపోయింది.

”మీరేమిటి నిరంజన్‌… మీకిప్పుడు క్లాస్‌ లేదా?” అన్నాడు హెడ్‌మాస్టర్‌.

”ఈ పీరియడ్‌ నాకు లీజర్‌ పీరియడ్‌ సార్‌! మీతో ఒక విషయం మాట్లాడాలని ఇక్కడ కూర్చున్నాను”

”ఏమిటో చెప్పండి” అన్నాడు హెడ్‌మాస్టర్‌.

”మన ఎమ్మెల్యే రఘునాథ్‌ మీకో విషయం చెప్పమన్నాడు సార్‌!” అన్నాడు నిరంజన్‌.

”చెప్పండి”

”మన స్కూల్లో పనిచేస్తున్న సురేందర్‌ టీచర్‌ క్లాసులు సరిగ్గా తీసుకోవడం లేదని మీరతనికి మెమో ఇచ్చారట… సురేందర్‌ మన ఎమ్మెల్యేకు కజిన్‌ అవుతాడట… సురేందర్‌ను చూసీ చూడనట్లు వదిలేయమన్నాడు సార్‌!” అన్నాడు.

”సురేందర్‌ విషయం నీకు తెలుసు కదా నిరంజన్‌… ఒక్క రోజన్నా స్కూలుకు టైముకు రాడు. క్లాసులు తీసుకోడు. రిజిస్టర్‌లో సైన్‌ చేసి వెళ్ళిపోతాడు. ప్రతి నెలా జీతం మాత్రం తీసుకుంటాడు. ఇదేమిటని అడిగితే తలతిక్కగా మాట్లాడ్తాడు. అలాంటివాణ్ణి ఎలా భరించటం. వీళ్ళవల్లనే గవర్నమెంట్‌ స్కూళ్ళలో చదువు సరిగ్గా చెప్పరు అనే పేరొస్తోంది. ఇప్పుడు మీరున్నారు. మీకు ఎమ్మెల్యే గారు చాలా క్లోజ్‌. మీకూ రాజకీయాల మీద చాలా ఇంట్రస్టే ఉంది. అయినా మీరు రోజూ స్కూలుకొచ్చి మీ పాఠాలు తీసుకున్నాక బయటికి వెళ్తారు. ఆ సిన్సియారిటీ మీలో ఉంది. కనీసం ఈ మాత్రమైనా పని చెయ్యకపోతే ఎలా? మీరైనా ఒకసారి సురేందర్‌కు చెప్పండి, టైమ్‌కొచ్చి క్లాసులు తీసుకొని వెళ్ళమని చెప్పండి. క్లాసులు సరిగ్గా తీసుకుంటే చాలు… బయటికెళ్ళి మీరూ ఆయనా ఎన్ని నాటకాలైనా ఆడుకోండి” అన్నాడు హెడ్‌మాస్టర్‌.

”అలాగే సార్‌… నేను సురేందర్‌ గారితో మాట్లాడతాను…” అంటూ నిరంజన్‌ లేచాడు. అప్పడే ఫస్ట్‌ పీరియడ్‌ ముగిసి సెకండ్‌ పీరియడ్‌ స్టార్టయినట్లుగా బెల్‌ మోగింది.

సాయంత్రం నాల్గింటికి ఫైనల్‌ బెల్‌ మోగింది. పిల్లలందరూ బిలబిలమంటూ బయటికొచ్చి ఎవరిండ్లకు వాళ్ళు వెళ్ళిపోవడం మొదలెట్టారు.

స్టూడెంట్సందరూ వెళ్ళాక టీచర్స్‌ కూడా బయటికొచ్చారు. ఆ హైస్కూలు వరంగల్‌కు దగ్గర్లోనే ఉండే ధర్మారం అనే ఊర్లో ఉంది. టీచర్లు వరంగల్‌ నుండి ఆ ఊరికి బస్సులో వచ్చి వెళ్తుంటారు.

సిటీ బస్టాప్‌ వైపు నడుస్తున్న వాసంతి వెనకాలే నిరంజన్‌ తన స్కూటర్‌ మీదొచ్చి ”నేను మీ ఇంట్లో డ్రాప్‌ చేస్తాను రండి మేడమ్‌…” అన్నాడు.

”వద్దండి… నేను బస్సులోనే వెళ్తాను” అంది వాసంతి.

”ఆ బస్సు ఎప్పుడొస్తుందో ఏమో… పొద్దున్నే కిలోమీటర్‌ నడిచొచ్చారు. రండి మేడమ్‌… ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారోనని హెజిటేట్‌ చేస్తున్నారేమో… అలా అనుకోవడం వెనకటి మాట… ఈ రోజుల్లో ఎవరూ అలా అనుకోవడం లేదు. ఈ విషయాలను అసలు ఎవరూ పట్టించుకోవడంలేదు” అతడలా అంటుండగానే సిటీబస్సు కిక్కిరిసిన ప్రయాణికులతో వచ్చి ఆగకుండానే వెళ్ళిపోయింది.

”చూశారా.. బస్సు ఆగకుండానే వెళ్ళిపోయింది. మరో బస్సు రావడానికి ఎంత టైమ్‌ పడుతుందో… రండి. పది నిమిషాల్లో మిమ్మల్ని మీ ఇంట్లో దింపేస్తాను” అన్నాడు నిరంజన్‌.

ఆ బస్సు వెళ్ళిపోవడంతో వాసంతి హతాశురాలైపోయింది. ప్రతిరోజూ తను ఈ బస్సులోనే వెళ్తుండేది. ఇంట్లో అమ్మ ఒక్కతే

ఉంది. దగ్గు దమ్ముతో సతమతమైపోతోంది. సాయంత్రం రాగానే డాక్టర్‌ దగ్గరికి తీసుకెళ్తానని చెప్పొచ్చింది. ఈ నిరంజన్‌ చాలా రోజులుగా తన వెంట పడ్తున్నాడు… ”మీరే నా సర్వస్వం” అంటాడు. ”నా గుండెల్లో గూడుకట్టుకొని ఉంటున్నారం”టాడు. ”ఏ రోజన్నా మిమ్మల్ని చూడకపోతే పిచ్చెక్కినట్టుగా ఉంటుంద”ంటాడు… అతడు తనతో అంత మరీ క్లోజ్‌గా మాట్లాడుతుంటే కొంతమంది తన తోటి టీచర్లు నాలుకలు ఆడిస్తూనే ఉన్నారు. గుసగుసలు పెట్టుకుంటూనే ఉన్నారు. అతన్ని ఎంత ఎవాయిడ్‌ చెయ్యాలని ప్రయత్నించినా చెయ్యలేకపోతోంది. తను అందంగా ఉంటానని తనకు తెలుసు. ఈ అందమే అనేకమంది పురుషపుంగవులను తనవైపు తిప్పుతున్నదని కూడా తనకు తెలుసు… మిగతా వాళ్ళు త్వరగానే తనను వదిలేశారు కానీ ఈ నిరంజన్‌ మాత్రం అలా వదలటం లేదు.

”ఏమిటి ఆలోచిస్తున్నారు. రండి వెళ్దాం. ఏమీ కాదు. ఏదో అవుతుందని మీరు ఊహించుకుంటున్నారు తప్ప ఏమీ కాదు” అన్నాడు నిరంజన్‌.

”ఇక లాభం లేదు. ఇతడు తనను వదలడు” అనుకొని వాసంతి అతని స్కూటర్‌ వెనకాల కూర్చుంది. అతడామెను ఆమె ఇంట్లో డ్రాప్‌ చేసేంతవరకు ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగానే డ్రైవ్‌ చేశాడు.

రోజురోజుకు నిరంజన్‌ ఆమెకు దగ్గర కాసాగాడు. అతడంత దగ్గర కావడం ఆమెకిష్టం లేదు. కానీ అతన్నెలా ఆపాలో ఆమెకర్థం కాలేదు.

వాసంతికి ఒక్క వాళ్ళ అమ్మ తప్ప వేరే అక్కచెల్లెళ్ళు గానీ, అన్నదమ్ములు గానీ ఎవరూ లేరు. వాళ్ళమ్మే ఆమెను కష్టపడి చదివించింది. ఈ మధ్యనే వాళ్ళమ్మ ఆరోగ్యం బాగా క్షీణించింది. ఆమెను డాక్టర్ల దగ్గరకు తీసుకెళ్ళడంలో నిరంజన్‌ చాలా సహాయం చేశాడు. చివరకు ఒకరోజు వాళ్ళమ్మ చనిపోయినప్పుడు కూడా అతడు పక్కనే నిల్చొని అన్ని పనులూ చేశాడు. అతడి సహాయం లేకపోతే అంత్యక్రియలు జరపడంలో ఆమె చాలా ఇబ్బంది పడేది. ఇలాంటి వాడొకడు తన పక్కనుండటం అవసరమే అనిపించిందామెకు.

ఇలా జరుగుతుండగా ఒకరోజు అతడొచ్చి ”వాసంతి గారు… ఒక విషయం మీతో చెప్పాలని ఎంతోకాలంగా అనుకుంటున్నాను. ఇంకా ఎక్కువ రోజులు ఆగలేను…” అన్నాడు.

అతడేం చెబుతాడో ఆమె ఊహించింది. అతడు ఆమె ఊహించిందే చెప్పాడు.

”నీకూ ఎవరూ లేరు… నాకూ ఎవరూ లేరు… నీకు పెళ్ళి కాలేదు. నాకూ కాలేదు. మనం ఇక ఆలస్యం చేయకుండా పెళ్ళి చేసుకుందాం వాసంతి” అన్నాడతడు.

ఆమె కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయింది. అతడు తననుండి దీన్ని ఆశించే తనతో అంత క్లోజ్‌గా ఉన్నాడని, తనకు అన్నివిధాలుగా సహాయం చేశాడని ఆమె అర్థం చేసుకుంటూనే ఉంది. కానీ అతని సహాయాన్ని వద్దనేంత సాహసం చెయ్యలేకపోయింది.

”పెళ్ళి చేసుకోవడం అంత అవసరమా? మనం ఇలాగే ఉండలేమా?” అందామె.

”ఉండొచ్చు. కానీ ఈ సమాజం మన గురించి అవాకులు చెవాకులు చెప్పుకుంటుంది కదా! మనకోసం కాకపోయినా ఈ సమాజం కోసమయినా మనం పెళ్ళి చేసుకోవాలిగా” అన్నాడతడు.

”అదీ నిజమేననుకోండి” అందామె ఇంకేమనాలో తోచక.

ఆనాటి నుండి అతడామెతో ఇంకా స్వేచ్ఛగా ఉండసాగాడు. వాళ్ళు పనిచేస్తున్న స్కూల్లో అందరికీ తాము పెళ్ళి చేసుకోబోతున్నామని చెప్పేశాడు. వాసంతిని సినిమాలకు, షికార్లకు తీసుకుపోసాగాడు.

కొన్నిసార్లు ఏ సినిమాకో, షికారుకో వెళ్ళొచ్చాక వాళ్ళింట్లోనే ఆ రాత్రి పడుకోసాగాడు.

ఓ రోజు రాత్రొచ్చి ఆమె పక్కలోనే పడుకున్నాడు. ఆమెను తనవైపు తిప్పుకొని తన పెదవులతో ఆమె పెదవులను కలిపేందుకు ప్రయత్నించాడు.

”పెళ్ళయ్యేదాకా నన్న ముట్టుకోవద్ద”ని ఆమె అతన్ని వదిలించుకుంది.

”కొద్దిరోజులే కదా! ఇప్పుడు మూఢాలట… మంచి రోజులు లేవు. మంచి రోజులు రాగానే మనం గ్రాండ్‌గా పెళ్ళి చేసుకుందాం. కొద్దిరోజుల్లోనే మన పెళ్ళవుతుంది. అడ్డుచెప్పకు వాసంతీ… ప్లీజ్‌!” అన్నాడు ఆమెను మళ్ళీ తనవైపు తిప్పుకొని. ఏదో ఒకరోజు ఆమె ఒక బలహీన క్షణంలో అతనికి వశమైపోయింది.

అతడు క్రమంగా రాజకీయాల్లో పైపైకి పోసాగాడు. లోకల్‌ ఎమ్మెల్యేకు బాగా దగ్గరయ్యాడు. చిన్న చిన్న పైరవీలు, తర్వాత పెద్ద పెద్ద పైరవీలు చేసి డబ్బు కూడా బాగానే సంపాదించసాగాడు. కొద్దిరోజుల్లోనే అతడు చేస్తున్న టీచర్‌ ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తిగా రాజకీయాలకు అంకితమైపోయాడు.

అతని రాజకీయ ఎదుగుదల మున్సిపాలిటీ కౌన్సిలర్‌గా గెలవటంతో ప్రారంభమయ్యింది. కౌన్సిలర్‌గా గెలిచినప్పటి నుంచి అతడు వాసంతి దగ్గరకు రావడం తగ్గించాడు.

”చాలా బిజీగా ఉంటున్నాను… రాజకీయాలంటే ఏమిటనుకుంటున్నావు… ఎంతమందితోనో పోటీ పడాల్సి వస్తుంది. ఎదుటివాడి ఎత్తులకు పై ఎత్తు వేస్తుండాలి… నువ్వేమీ అనుకోకు. త్వరలోనే ముహూర్తం పెట్టిస్తా… మన పెళ్ళికి ముఖ్యమంత్రినే పిలుద్దాం” అని చెబుతుండేవాడు. ఆమె అతని మాటలు నమ్మటం మానేసింది. కొద్దిరోజుల తర్వాత నిరంజన్‌ బాగా డబ్బున్నవాళ్ళ అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడన్న వార్త కూడా వెలువడింది. ఈ వార్త తెలిసినప్పుడు వాసంతి పెద్దగా ఆశ్చర్యపడలేదు. తనలో తాను నవ్వుకొని ఊరుకొంది. ఇదంతా ఊహించిందే అనుకుందామె.

చాలా ఆశ్చర్యంగా రాజకీయ వర్గాల్లో నిరంజన్‌ గురించి అందరూ మంచివాడనే చెప్పుకోసాగారు. చాలా కష్టపడి పైకొచ్చాడని అతనిమీద బోల్డు ప్రేమ ఒలకబోశారు. పత్రికల్లో పనిచేసే జర్నలిస్టులతో కూడా చాలా మంచి సంబంధాల్నే పెట్టుకున్నాడు. ఎక్కడ ఏ అవకాశం వచ్చినా పత్రికలవాళ్ళు నిరంజన్‌ను ఆకాశానికెత్తేస్తూ కథనాల్ని ప్రచురించసాగారు.

నాలుగైదేళ్ళ తర్వాత వాసంతి అతన్ని పూర్తిగా మరచిపోయి తన జీవితాన్ని తాను ఏ అరమరికలు లేకుండా గడుపుకోసాగింది. ఇద్దరు ముగ్గురు ఆమె అందాన్ని చూసి పెళ్ళాడదామని వచ్చినా ఆమె పట్టించుకోలేదు. ఒంటరిగానే బతకాలని నిర్ణయించుకుంది. ఈ లోగా సాధారణ ఎన్నికలొచ్చాయి. అధికారంలో ఉన్న పార్టీయే మళ్ళీ గెలిచింది. నిరంజన్‌ ఎమ్మెల్యేగా ఘనవిజయం సాధించాడు.

ఒకసారి వాసంతి పనిచేస్తున్న హైస్కూల్‌ వార్షికోత్సవానికి నిరంజన్‌ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. అప్పుడాయన ఐదేండ్ల తర్వాత వాసంతిని చూశాడు. అయితే వాసంతి ఇదివరకు పనిచేసిన స్కూల్లో ఇప్పుడు పనిచేయడం లేదు. ఆమెకు వరంగల్‌లోని ఒక గర్ల్స్‌ హైస్కూలుకు ట్రాన్స్‌ఫర్‌ అయింది.

”ఆమె అందంగానీ, ఆకర్షణ గానీ ఏమీ తగ్గలేదు. ఆశ్చర్యం!” అనుకున్నాడు.

వాసంతిని చూడగానే ”హౌ ఆర్యూ? బాగున్నావా” ఆని అడిగాడు.

వాసంతి అతని పలకరింపుకు జవాబుగా ఒక నవ్వు నవ్వి అక్కడినుండి వెళ్ళిపోయింది.

ఆ స్కూల్లో జరిగిన వార్షికోత్సవంలో నిరంజన్‌ చాలా మంచి ఉపన్యాసం చేశాడు. తనొచ్చింది గర్ల్స్‌ హైస్కూల్‌కు కాబట్టి గర్ల్స్‌ను గురించి, వాళ్ళ అభ్యున్నతిని గురించి మాట్లాడాడు.

మనం స్త్రీలను గౌరవించాలన్నాడు. స్త్రీలకు ఎటువంటి అన్యాయం జరగకూడదన్నాడు. అమ్మాయి పుడుతుందని ముందే తెలుసుకొని ఆమెను పిండ దశలోనే చంపెయ్యడం అత్యంత అమానుషం అన్నాడు. ఆడపిల్లలంతా బాగా చదువుకోవాలన్నాడు. వాళ్ళ కోసం ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పింస్తుందన్నాడు. స్త్రీ అభ్యున్నతి కొరకు తన ప్రాణాలైనా ఇస్తానన్నాడు. ఆడపిల్లల పెళ్ళిళ్ళ కోసం ప్రభుత్వం లక్షలు ఖర్చుపెడుతోందన్నాడు. అతని ఉపన్యాసం వింటూ ఆడపిల్లలంతా పరవశమైపోయి అతనికి జేజేలు పలుకుతూ చాలాసేపు చప్పట్లు కొట్టారు. ఉపన్యాసం అయిపోయాక నిరంజన్‌కు ఆ స్కూల్లో గొప్ప సన్మానం జరిగింది. ఆ స్కూల్లో పనిచేసే టీచర్లందరూ ఆడవాళ్ళే. వాళ్ళందరూ కూడా ”మీ స్పీచ్‌ అద్భుతంగా ఉంది సార్‌… స్త్రీ మీద మీకున్న గౌరవం మమ్మల్ని ముగ్ధుల్ని చేసింది” అంటూ అతన్ని వేనోళ్ళ పొగిడారు.

నిరంజన్‌ తన కార్లో ఆ స్కూల్‌ నుండి వెళ్ళిపోతూ మరోసారి వాసంతిని చూశాడు. ఈమెను పోగొట్టుకోవడం నేను చేసిన పెద్ద తప్పు అనుకున్నాడు. తన కారు దగ్గరకు రమ్మని ఆమెకు కబురు చేశాడు.

”మీరోసారి నన్ను కలవండి… మీకేమన్నా కావాలంటే చెప్పండి. మీకు బెస్ట్‌ టీచర్‌ అవార్డు వచ్చిందా? రాకపోతే చెప్పండి ఈసారి మీకే వచ్చేట్టు చేస్తాను” అన్నాడు.

”మీకంత ట్రబుల్‌ అక్కర్లేదు” అంటూ వాసంతి అక్కడినుంచి వెళ్ళిపోయింది.

”ఒకసారి తనను కలుసుకొమ్మని” నిరంజన్‌ వాసంతికి మళ్ళీ కబురు చేశాడు.

ఆమె వెళ్ళలేదు.

మరోసారి ”చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి… తప్పకుండా రావాలి” అని కబురు చేశాడు.

”ఎమ్మెల్యే గారు ఇన్నిసార్లు కబురు చేశాక వెళ్ళకపోతే బావుండదు. ఏ దూర ప్రాంతానికో ట్రాన్స్‌ఫర్‌ చేయించినా చేయిస్తాడు… వెళ్ళిరా” అని ఆమె కొలీగ్స్‌ ఆమెకు గట్టిగా చెప్పారు.

అతడు పంపించిన కారులో వాసంతి అతని ఆఫీసుకు వెళ్ళింది.

ఆమె రాగానే అతని రూంలో అతనిచుట్టూ ఉన్నవాళ్ళంతా వెళ్ళిపోయారు.

అతడు… ఆమె… ఇద్దరే ఆ రూంలో మిగిలారు.

”ఎలా ఉన్నావు? నాకెదురైన పరిస్థితులు… నా జీవితంలో వచ్చిన ఊహించని మార్పులు… వీటి కారణంగా నేను నీకు దూరం కావలసి వచ్చినందుకు చాలా బాధపడ్డానంటే నమ్ముతావా? రియల్లీ సారీ వాసంతీ” అన్నాడతడు ఆమె దగ్గరకొచ్చి ఆమె చేతులు పట్టుకోబోతూ…

ఆమె వెంటనే అతని చేతుల్ని విడిపించుకొని అతనికి దూరంగా జరిగింది.

”దయచేసి నన్ను క్షమించు వాసంతీ…నువ్వింకా పెళ్ళి చేసుకున్నట్లు లేదు. నువ్వు ఒప్పుకుంటే మనం పెళ్ళి చేసుకుందాం. నేను రెండో పెళ్ళికి నా భార్యను ఒప్పిస్తాను” అన్నాడు.

”అక్కర్లేదు.. నన్నిలా బతకనీయండి. నేను వెళ్ళిపోతున్నాను…” అంటూ ఆమె వెళ్ళబోయింది.

”ఒక్క నిమిషం ఆగు. నీకెలాంటి అన్యాయం చెయ్యను. నాతో పెళ్ళికి ఒప్పుకో. నా భార్యకు ఒక యాక్సిడెంట్‌లో వెన్నెముక విరిగి పూర్తిగా బెడ్‌కే పరిమితమైపోయింది. నేను నీతోనే ఉంటాను. మనం ఇదివరకు ఎక్కడ ఆగిపోయామో అక్కడ్నించే మళ్ళీ మన జీవితాన్ని మొదలుపెడదాం. ప్లీజ్‌… నన్ను నమ్ము. నాకిప్పుడు మన సమాజంలో ఎంత మంచి పేరుందో నీవు వినేవుంటావు. నిన్ను పువ్వుల్లో పెట్టి పూజించుకుంటాను…ప్లీజ్‌ నాతో పెళ్ళికి ఒప్పుకో!’

”వద్దు… నువ్వు మళ్ళీ నా జీవితంలో ప్రవేశించే ప్రయత్నం చేయ్యొద్దు… బావుండదు. మీ మానాన మీరు, నా మానాన నేను బతుకుదాం. నన్ను వెళ్ళనీయండి” అంటూ ఆమె అక్కడినుంచి కదలడానికి ప్రయత్నించింది.

అతడామెను బలవంతంగా తన రెండు చేతులతో ఆపడానికి ప్రయత్నించాడు. కానీ ఆమె అతన్ని వదిలించుకుని బయటికొచ్చేసింది. ఆమె స్పర్శ అతన్ని గొప్ప ఆనంద పారవశ్యానికి గురిచేసింది. ఈమెను మరోసారి అనుభవించకపోతే తన జన్మ వృథా అనుకున్నాడు.

సరిగ్గా ఈ రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా ”మీటూ…” అనే ఉద్యమం ప్రారంభమైంది. అనేకమంది స్త్రీలు తమను సమాజంలో గొప్ప వ్యక్తులని పేరున్న పురుష పుంగవులు ఎలా లైంగికంగా వేధించారో వివరంగా చెప్పటం మొదలుపెట్టారు.

వాసంతి తనకూ, నిరంజన్‌కూ మధ్య జరిగిన సంఘటనలన్నీ తనకు అత్యంత ఆప్తురాలైన సుహాసినికి చెప్పింది. సుహాసిని సామాజిక కార్యకర్త. తనకు ఈ మధ్యనే ఆమెతో స్నేహం ఏర్పడింది.

”మీ ఇద్దరి మధ్యా ఇంత జరిగిందా? వెంటనే మీడియాను పిలిచి జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పాలి… నీకు సహాయంగా నేనుంటాను” అంది సుహాసిని.

ఆ మర్నాడే వాసంతి, సుహాసిని మీడియా ముందుకొచ్చారు.

జరిగిందంతా వాసంతి మీడియా వాళ్ళకు సవివరంగా చెప్పేసింది. వాళ్ళడిగిన అనేక ప్రశ్నలకి కూడా ఆమె తొణక్కుండా బెణక్కుండా జవాబులు చెప్పేసింది. ఇద్దరూ క్లోజ్‌గా గడిపిన రోజుల్లో అతడామెకు రాసిన ఉత్తరాల్ని కూడా వాళ్ళకు చూపించింది.

ఆ రోజు సాయంత్రానికల్లా అన్ని టీవీ ఛానెళ్ళలోనూ, మర్నాటి ఉదయం అన్ని వార్తాపత్రికల్లోనూ ఆ వార్త ప్రసారమయ్యింది.

త్వరలోనే మంత్రి కాబోతున్నాడని ప్రచారం పొందిన నిరంజన్‌ రాజకీయ జీవితం అథఃపాతాళానికి క్రుంగిపోయింది.

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.