బచ్చే పౌచ్‌…!

భండారు విజయ

సుడులు తిరుగుతున్న గాలి దుమారాన్ని ఛేదించుకుంటూ పరుగున ఇంట్లోకి వచ్చి పడింది రాజవ్వ. తన జీవితంలాగే ఈ గాలిదుమారం కూడా ఆమె మనసును అతలాకుతలం చేస్తోంది. పొద్దుననగా ఇంట్లో ఒంటరిగా వదిలివెళ్ళిన పిల్లలు ఏమయ్యారో అన్న బాధ ఒకవైపు ఉంటే, మరోపక్క పక్కింటి శంకరయ్య వికారపు చూపులన్నీ తన గుడిసెవైపే ఉండడం మరో బాధ. నోట్లోకి, కళ్ళలోకి కొట్టుకొచ్చిన దుమ్మును ఆరు బయటున్న కుండలోంచి చెంబుడు నీళ్ళను తీసుకుని ముఖం కడుక్కొంది. మిగిలిన నీళ్ళను నోట్లో పోసుకుని కాండ్రించి ఉమ్మేసింది. తడిక తలుపును తోస్కుంటూ లోపలికికెళ్ళి చూసింది.

పెద్దోడు పొయ్యిమీద ఛాయ్‌ చేస్తున్నట్లున్నాడు. చిన్నోడు వాడి పక్కనచేరి పొయ్యి కింద మంట ఎగేస్తున్నాడు. చంటిది ఇంకా నిద్ర లేచినట్లు లేదు. బరబరా పోయి పిల్లోడి చేతిలో ఉన్న మసిగుడ్డ తీసుకుని ఛాయ్‌ గిన్నె పొయ్యి మీద నుంచి దింపింది. పెద్దోడు బాసిన్ల బుట్టలో ఉన్న ఛాయ్‌ వడబోసుకునే జాలీ పట్టుకొచ్చి గ్లాసుమీద పెట్టిండు. రాజవ్వ కొడుకు తెచ్చిన మూడు గ్లాసుల్లో ఛాయ్‌ వంపి తన బొడ్లో దోపిన బట్టసంచిలో దాచిన బ్రెడ్డు పాకెట్టు తీసి కొడుకులకు చెరి మూడు ముక్కలు ఇచ్చి తనూ రెండు ముక్కలు చేతుల తీసుకుంటూ ”జల్ది తినండి కొడకా.. మీరు ఛాయ్‌ తాగినంక చెల్లెను నిద్రలేపి ఛాయ్‌ తాగించి ఆడుకోండి. నే పనికి బోయి జల్ది వస్త” అంది.

ఉరుకులు పరుగులు పెట్టలేక యాష్టకొస్తుంది. వచ్చిన పైసలన్ని కూడేసినా, ఇంటి కిరాయి పోంగా నలుగురికి తిండి గడుసుడు కష్టమైతంది. పనికోసం తెల్లారగట్ల లేచి ఇంట్ల పనులు చేసుకొని, పోరగాండ్లను ఇంటికాడ యట్టికి వదిలేసి పోవుడు మస్తు బాధగున్నది. ఏం జేస్తది మరి? గట్లనే దులిపేసుకుంటా పోతున్నది. ఏం చేద్దామన్నా అన్నీ పైసలతోనే పనాయే. ముదనష్టపు ముండకొడుకు పోరగాండ్లను పందిగన్నట్లు కని పెంచనీక లేకుండా పారిపోయే. వాడి కోసం యెతికెతికి పానం పోయినట్లైంది. దొంగ సచ్చినోడు పోయినోడు పోక ఇద్దరుగల్సి సంపాదించిన సంపదనంత దోచుకొని నిలువ నీడ లేకుండా చేసిపోయే. ఏడ్వని రోజు లేదు. ఎంతేడ్చినా పైసలు రాలి పడవు. పానం కూడా పోదూ. గీ కష్టాలు పోవాలంటే గా పర్వతాలు చెప్పిన పనే మంచిగున్నది. పోయి వాన్ని గలవాల అనుకుంటా పిల్లగాండ్లను ఇంట్లో బెట్టి బయట తాళం యేసి పర్వతాలు ఇంటి వైపుగా నడిచింది.

కొత్తపుంతలు తొక్కుతోన్న సమాజంలో సాదా, సీదా మనుషులు, కడు పేద, బడుగు, బలహీన వర్గాలు బతుకుడు కష్టమౌతుంటే, మనిషి మెదడుతో పాటు శరీరం కూడా ఒక వ్యాపార కేంద్రం అయింది. మనిషి పుట్టుక, గిట్టుక రెండూ కూడా సైన్సు చేతుల్లోకి వచ్చేసిన కాలంలో మనం ఇప్పుడు జీవిస్తున్నాం… మొన్న పనికాడ అనసూయమ్మగారు మాట్లాడుతుంటే ఇన్నది తను. గదేందమ్మా గట్లనబడితివి అంటే గప్పుడు ఆయమ్మ ఏం జెప్పింది? గదేదో దేశంలో మగాళ్ళు లేకుండా పిల్లల్ని ఆడోల్లే కంటున్నరంటనే రాజవ్వా అంది. గప్పుడు తనకు అర్థంకాలే కానీ మొన్న పర్వతాలు చెప్పినదానికి నోరెళ్ళబెట్టింది. గిప్పుడు పట్నంలో పిల్లల్ని తల్లే కనక్కరలేదే రాజవ్వా? తల్లులు కానోళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని కని ఇయ్యొచ్చు అన్నడు. ‘గదెట్లా అన్నా’ అంటే గప్పుడు చెప్పిండు.

”పైసలు గావాలనని అంటున్నవు గందా రాజవ్వా…! నువ్వు గనక నా మాట ఇంటే గదెట్లనో జెప్తా” అని చెప్పిండు. నిజమే! ఇప్పుడు తనని ఆడిపోసుకునేటోళ్ళు, తిట్టి సాపిచ్చేటోళ్ళు ఎవరున్నరు గనుక? మొదనష్టపు మొగడు పారిపోయే? అన్నా, అయ్యా సచ్చిపోయే? ఉన్న అవ్వను ఒప్పించుడు పెద్ద కష్టం కాదులే.. అనుకుంటూ నడక వేగం పెంచింది.

… … …

రాజవ్వ పయిట నిండుగా కప్పకుని పర్వతాలు దారిచూపిన ఇంట్లోకి నడిచింది. రాజవ్వ తన జీవితంలో ఇంతవరకూ చూడని ప్రపంచంలోకి అడుగుపెడుతున్నట్లుగా అడుగులు వేస్తూ చుట్టూ కలియజూసింది. బిత్తర చూపులు చూసుకుంటూ మెల్లగా తన యెనకాల్న నడిచొస్తున్న రాజవ్వకేసి ఉరిమి చూస్తా వేగంగా రమ్మని సైగ చేసిండు పర్వతాలు. పక్కచూపులు కట్టిపెట్టి సింహం బోనులోకి నడుస్తున్న మేకపిల్ల లెక్క పర్వతాలు ఎనకాలే మెల్లగా నడిచి వెళ్ళింది రాజవ్వ.

లోపల నగిషీలు చెక్కిన పెద్ద సోఫాలో ఇద్దరు స్త్రీలు ఒకరి పక్కన ఒకరు కూర్చొని ఉన్నరు. ఎదురుగా ఇద్దరు మగవాళ్ళు ఉన్నారు. పర్వతాలు అక్కడున్న వారందరూ తనకు అంతకుముందే పరిచయం ఉన్నట్లుగా నమస్తే సార్లూ, నమస్తే అమ్మా! అంటూ అభివాదం చేశాడు.

డాక్టర్‌ స్థానిక పర్వతాలు వైపు చూస్తూ ”ఆమెకు అన్ని విషయాలు చెప్పి తోల్కొని వచ్చినవా? లేదా?” అని అడిగి, రాజవ్వ వైపు తిరిగి, ”ఏమ్మా, పర్వతం నీకు అన్నీ చెప్పిండా? నీకు నిజంగానే ఇష్టం ఉందా ఈ పనిచేయనీక” అడిగింది.

రాజవ్వకు ఏం చెప్పాలో నోరు మెదపక తలవంచుకునే తల ఊపింది ఇష్టమే అన్నట్లుగా. అక్కడున్న ఇద్దరు స్త్రీలలో ఒక స్త్రీ రాజవ్వ వైపు చూసి తన దగ్గరికి రమ్మని సైగ చేసింది. పర్వతాలు ఏమంటడో అనుకుంటా అతనివైపు చూసింది రాజవ్వ. పర్వతాలు రాజవ్వను చూస్తూ వెళ్ళు అని సైగచేయడంతో అటువైపుగా నడిచింది.

ఎర్రగా, పొట్టిగా ఉన్నా రాజవ్వ శారీరకంగా కాస్త దృఢంగానే ఉంటుంది. ఐదో క్లాసు దాకా ఊళ్ళో ఉన్న సర్కారు బడికి బోయి చదువుకుంది.

చిన్నప్పుడు రాజవ్వ కబడ్డీ బాగా ఆడేది. క్లాసులో లీడరుగా కూడా పని చేసింది. కొన్ని రాజకీయ ఎత్తుగడలు ఆమెకు వెన్నతోనే అబ్బాయని చెప్పొచ్చు. ఎదుటివాడిని కబడ్డీలో ఎలా చిత్తుచేయాలో రాజవ్వకు తెలిసినంతగా మరే ఆటగాడికీ తెల్వదు. కానీ ఇప్పుడు తానున్న పరిస్థితి, భర్త అర్థంతరంగా నడిసంద్రంలో వదిలి పొయ్యేసరికి బాధతో, దుఃఖంతో కృంగిపోయి కాస్త అమాయకంగా, బేలగా కనబడుతోంది.

రాజవ్వ అన్న ఆ ఊర్లో చిన్న సైజు బాడీ బిల్డరు. ఎప్పుడూ కసరత్తులు చేసే అన్నను చూస్తా పెరిగింది. అన్న అండ చూసుకుని ఊర్లో వాళ్ళమీద అప్పుడప్పుడూ పెత్తనం కూడా చెలాయించేది. ఆ ఊర్లో ఉన్న చదువుతో తండ్రి చదువు మాన్పించినా, కబడ్డీ ఆడనీక మాత్రం అడ్డుకోకపోవడంతో పెండ్లయ్యేదాక చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడ కబడ్డీ పోటీలు బెట్టినా ఆడేది. అన్ని పోటీల్లో వీళ్ళ టీమే గెలిచి బహుమతి పొందేది. మగపిల్లల జట్టులో ఒక్కతే ఆడపిల్ల కావడంతో చాలాసార్లు రాజవ్వను మొదటిసారి టీములోకి తీసుకోవడానికి ఇష్టపడేటోళ్ళు కాదు. అన్న పైల్మాన్‌ అనే భయంతో రాజవ్వను జట్టులోకి రానిచ్చారు. గెలుపు వీరి టీమ్‌దే అయింది. ఇక అప్పటినుంచి రాజవ్వ తమ జట్టులో ఉంటే చాలు గెలుపు వస్తదన్న ధీమా ఊరివారికి కలిగింది. ఒక్కోసారి నెలసరి టైములో పోటీలుంటే రాజవ్వ ఆటకు పొయ్యేది కాదు. రాజవ్వ లేని ఆట ఓడిపోతామనిచెప్పి మిగతా జట్టు పిల్లలు పోటీకే బోవడానికి ఇష్టపడేవాళ్ళే కాదు.

అల్లారుముద్దుగా ఇంట్లో, ఊరి వాళ్ళ మధ్య మెదిలిన రాజవ్వకు పెండ్లిచేసి పట్నం సాగనంపినంక ఎందుకోగని దుక్కలా ఉన్న అన్న గుండాగి సచ్చిపోయిండు. అవ్వా, అయ్యా అన్నను మేపనీక ఉన్న నాలుగెకరాల్లో మూడెకరాలు అమ్ముకున్నరు. మధ్యనే తండ్రి గూడా ముసలితనంతో సచ్చిపోయిండు. ఇక ఊర్లో తనకంటూ ఉన్న ఒక్కగానొక్క మనిషి తన అవ్వే. తల్లిని పట్నం వచ్చి తనకాడ ఉండమంటే వచ్చి నాల్గొద్దులు ఎప్పుడూ ఉన్నది లేదు. పిల్లగాండ్లు బతిమిలాడి అడిగితే ‘ఊరును వదలి ఉండలేను బిడ్డా’ అంటూ వచ్చిన రోజే ఎల్లిపోతనని కాళ్ళల్లో చెప్పులు బెట్టుక వస్తది.

రాజవ్వ ఆలోచనలను తుంచేస్తూ ”రాజవ్వా! నా పేరు వసుధ. ఈ సారు మా వారు రాజేశ్వరంగారు. నువ్వు బిడ్డను కని ఇవ్వాల్సింది మా కూతురు శ్రీజ, అల్లుడు వివేకానందలకు. వాళ్ళకు పెళ్ళై పది సంవత్సరాలు అవుతున్నా పిల్లలు కలగడం లేదు. తప్పని పరిస్థితుల్లో మేము డాక్టరు గారి సలహా మేరకు ఈ పద్దతికి ఒప్పుకుంటున్నం. తర్వాత నువ్వేమీ ఇబ్బంది పెట్టకూడదు. డాక్టరు గారి మీద ఉన్న నమ్మకం మమ్మల్ని ఈ పని చేయిస్తోంది” అంది డాక్టర్‌ స్థానిక స్నేహితురాలు వసుధ.

”అమ్మా నేను గరీబుదాన్నే గానీ మోసగత్తెను కాను. నా ముగ్గురు పిల్లల్ని పెంచనీకే పర్వతాలన్న జెప్పిన ఎంటనే బాగా ఆలోచించే గీ పనికి ఒప్పుకున్నా. పానం బోయినా నేను మాటతప్పేదాన్ని కాదు” రాజవ్వ వసుధకు మాత్రమే వినబడేట్లుగా మెల్లగా నేలచూపులు చూస్తూ అంది.

”సరే… అయితే, డాక్టరమ్మ చెప్పినట్లుగా నీకేమి అవసరం ఉన్నా మేం నిన్ను చూసుకుంటాం. దాని గురించి నువ్వేమీ దిగులు పడమాకా. నా బిడ్డకు నువ్వు ఒక నలుసును కనిస్తే మా పిల్ల కాపురం కూడా చక్కబడ్తది. మేమిచ్చే డబ్బు మీ పిల్లల భవిష్యత్తుకు

ఉపయోగపడతది” అంది వసుధ.

… … …

రాజవ్వను పరీక్షించిన తర్వాత డాక్టర్‌ స్థానిక మెడలోని స్టెతస్కోప్‌ టేబుల్‌ మీద పెడుతూ చిరునవ్వుతో ”ఏం రాజవ్వా నువ్వీ పనిని ఇష్టంతోనే చేస్తున్నవా? ఎవరి బలవంతం మీదా చేయడం లేదు కదూ” అడిగింది.

రాజవ్వ చీరను సరిచేసుకుంటూ టేబుల్‌ మీద నుండి దిగి ”గట్లేం లేదమ్మా. ఇష్టం లేకుంటే గింత దూరం నేనెందుకొస్తనమ్మా” అంది.

”నీవు ఇప్పటికే ముగ్గురు పిల్లల తల్లివి. మళ్ళీ గర్భం మోయడం అంటే కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. నీ ఆరోగ్యం పాడవకుండా చూసే పూచీ నాదే. కానీ, అందుకు నువ్వు మేం చెప్పినట్లుగా తిండి తినాలి. మందులు వాడాలి. అవసరమైతే నీ పిల్లలకు కొన్ని రోజులు దూరంగా కూడా ఉండాల్సి రావచ్చు. చెప్పినప్పుడు ఏమీ పని చేయకుండా విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటది. ఇవన్నీ కూడా నువ్వు ఆలోచించుకోవాలి మరి. ఈ విషయాలు పర్వతాలు నీకు చెప్పాడో లేదో అందుకోసం జెప్తున్నా. మళ్ళీ ఆలోచించుకుని రేపు సాయంత్రం ఒకసారి వస్తే… ఎప్పుడెప్పుడు రావాలో చెబుతా” అంది డాక్టర్‌ స్థానిక.

”అమ్మా! మరి గీ పని చేయనీక ఎన్ని పైసలు ఇస్తారో జెబితే జర మాయమ్మతో సోంచాయించి వస్తా” అంది రాజవ్వ.

”ఓకే! అయితే ఇప్పుడే పిలుస్తా ఉండు ఆ అమ్మను” అంటూ కాలింగ్‌ బెల్‌ కొట్టింది. తెల్లని చీర కట్టుకున్న నర్సు రాగానే ”లోపల వసుధమ్మా, సారూ ఉన్నారు. వెళ్ళి వాళ్ళను ఒకసారి రమ్మను” అంది.

లోపలి నుండి పొద్దున తాను వచ్చినప్పుడు సోఫాలో కూర్చున్న జంటతో పాటు మరో వ్యక్తి వచ్చి డాక్టర్‌ స్థానిక ఎదురుగా ఉన్న కుర్చీల్లో కూర్చున్నారు. స్థానిక వాళ్ళవైపు చూస్తూ ”అన్ని టెస్టులు చేశాను వసూ. రేపు శ్రీజను, వివేకానందను తీసుకొని వస్తే కొన్ని విషయాలు వాళ్ళతో కూడా మాట్లాడాల్సి ఉంటుంది. ఒకసారి వాళ్ళు కూడా రాజవ్వను చూసుకున్నట్లుగా ఉంటుంది. వివేకానంద ఎప్పుడెప్పుడు హాస్పిటల్‌కు రావాలో రేపు చెబుతాను. రాజవ్వ బ్లడ్‌ గ్రూప్‌ ఎలాగూ మనకు సరిగ్గా సరిపోయింది కనుక మనం మన ప్రయత్నంలో ఉండవచ్చు. రాజవ్వా! నీకు మరొక విషయం చెబుతున్నా జాగ్రత్తగా విను. రేపొద్దున నువ్వు ఎలాంటి గడిబిడి చేయకుండా పేపర్లమీద సంతకాలు చేయాలి. ఆ సంగతి నీకు తెలుసు గదా” అడిగింది డాక్టర్‌ స్థానిక.

రాజవ్వ తలవొంచుకునే తెలుసు అన్నట్లుగా తల ఊపింది.

అప్పుడే అక్కడికి వచ్చిన పర్వతాలు రాజవ్వను చూస్తూ ”ఇగో రాజవ్వా! ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. నీ బిడ్డల రక్షణ కోసం ఈ అమ్మవాళ్ళు అన్ని ఏర్పాట్లు జేస్తరు. నువ్వు బిడ్డను కన్నాక మారుమాట్లాడకుండా వీళ్ళకు ఆ బిడ్డను ఇచ్చి వెళ్ళిపోవాలి. కాదని ఎదురు తిరిగితే మరి నీకే నష్టం. ఆలోచించుకో. ఏదైనా జరిగితే అటు డబ్బూ రాదూ ఇటు బిడ్డా నీకు దక్కదు” కాస్త కటువుగానే చెప్పాడు పర్వతాలు.

”గట్లనే అన్నా. నువ్వు జెప్పినట్లే జేస్త గానీ, ఎన్ని పైసలు ఇస్తారో జెప్పకపోతిరీ” అంది తలవొంచుకునే.

”అమ్మా జెప్పుండ్రి.. బీద బొడ్డి. పాపం మగడు దీన్ని, పిల్లల్ని వదిలేసి పారిపోయిండు. వాడి తలపండు పగలా. గప్పటిదాకా సంపాదించిన పైసలన్నీ గా గాడిద కొడుకు ఎత్తుకుపోయి ముండలకు పెట్టిండు. వాడి కోసం ఎతికెతికి ఇక వాడు రాడని ఆడకూతురు ఒక్కతే కష్టపడి పోరగాండ్లను సాకుతోంది. జర సోంచాయించి చెప్పుండ్రి. నాకేమి ఇయ్యద్దు గానీ గామెకు ఏమిస్తారో చెప్పుండ్రి. బేరం కుదిరితే రేపొస్తది. లేకుంటే ఆమె తోవ ఆమె బోతది” వీలైనంత సౌమ్యంగానే అన్నాడు పర్వతాలు.

డాక్టర్‌ స్థానిక వారి సంభాషణ వింటూ ఆలోచించి ”చెప్పండి రాజేశ్వర్‌. నాకు వేరే పని ఉంది. మీరు మాట్లాడుతూ ఉండండి” అంటూ అక్కడినుంచి నడుచుకుంటూ పై అంతస్తులో ఉన్న తన పోర్షన్‌లోకి వెళ్ళిపోయింది.

”నువ్వే జెప్పు పర్వతాలు… పోయిన ఏడాది ఈ డాక్టరమ్మ దగ్గరే మా బంధువుల అమ్మాయికి గర్భసంచిని అరువు ఇచ్చిన ఆమె నాలుగు లక్షలు తీసుకుందట. గవే ఇయ్యనీక సిద్ధంగున్నం. కానీ అవిగాక ఇప్పుడు, రాజవ్వకున్న ముగ్గురు పిల్లల్ని సంవత్సరం పోషించాల. వాళ్ళతో పాటు వాళ్ళను చూసుకునే ముసలి తల్లిని కూడా పోషించాల. అన్నీ గల్పితే ఇంకా మస్తుగా మాకు ఖర్చు ఉంటది. మాకీ సాయం చేస్తున్నందుకు నీకు ఓ ఇరవై వేలన్నా ఇయ్యాల్నా? ఇంకా డాక్టరమ్మా ఖర్చులూ ఉంటాయి గదా. అంతా తడిసి మోపెడు అవుతోంది” ఊపిరి ఆడనట్లుగా గడగడా చెప్పాడు వసుధ మగడు రాజేశ్వరం.

”గదేంది సారూ గట్ల మాట్లాడుతరు? బిడ్డను కనిచ్చుడంటే మాటలా…! ఆడమనిషికి మళ్ళీ జన్మించడమే గదా సామీ! గా సంగతి మీకు నేను జెప్పాల్నా? ఏదైనా ఇకటించి రాజవ్వ పానానికి ఏమైనా ఐతే దాని బిడ్డలు అన్నాయమై పోతరు. నాకెందుకు సామీ గా పాపం? పుట్టకొకరు, గుట్టకొకరై రోడ్లంట బడ్తరు పోరగాండ్లు. పా! రాజవ్వా గీ బేరం కుదిరేది కాదుగానీ, రేపు ఇంకో దొరసాని తన మనమరాలు కోసం కావాలన్నది. పోదాం పా” ఎదుటివాళ్ళను బెదిరించే ధోరణిలోనే అన్నాడు పర్వతాలు. అంతలో డాక్టర్‌ స్థానిక అక్కడికి రావడంతో అందరూ మౌనంగా ఉండిపోయారు.

డాక్టర్‌ అందరి మౌనాన్ని ఛేదిస్తూ ”ఏం నిర్ణయం చేశారు?” అని అడిగింది.

”అమ్మా డాక్టరమ్మా! గీ బేరం కుదరదు లేమ్మా. ఇగ పోతాం. ఐదు లక్షలకు ఒక్క పైసా తగ్గినా రాజవ్వ ఒప్పుకోదమ్మా…! ఆ అయ్య గన్ని పైసలు ఇయ్యలేడంట. బతికుంటే బలుసాకు తింటది బొడ్డి. అమ్మా! పోతం మరీ. గా సుధేష్ణమ్మ దవాఖానాలో ఒక అమ్మకు గావాలెంట. వాళ్ళు గా పైసలు ఇస్తమన్నరు” మీరు ఒప్పుకోకపోతే ఇగ పోతమన్నట్లుగా మరోసారి బెదిరించాడు పర్వతాలు.

ఒక గంటసేపు మల్లగుల్లాలు పడ్డాక డాక్టర్‌ స్థానిక ఆ దంపతులను ఒప్పించింది. అడ్వాన్సుగా ఇప్పుడు పదివేలు ఇస్తామని, ఇల్లు వాకిలి అన్నీ చూసి చక్కబెట్టినాక మిగిలిన నలభై వేలు ఇస్తామని ఒక కాగితంలో రాయించింది. మిగిలిన నాలుగున్నర లక్షల క్యాష్‌, పాపో బాబో పుట్టినాక వాళ్ళ చేతుల్లో పెట్టేటప్పుడు ఇస్తమని కాగితం రాయించింది. ప్రతినెలా రాజవ్వ ఇంటి పోషణకు పదివేలు క్యాష్‌ ఇచ్చేటట్లు, ఇంట్లోకి కావలసిన సరుకులు, మిగిలిన అవసరాలు తీర్చేటట్లుగా నిర్ణయించారు. ఇకపోతే రాజవ్వ చెకప్‌లు, మందులు, తిండి మొదలగు అవసరాలన్నీ కూడా వాళ్ళే చూస్తామని రాసి ఇచ్చారు. రాజవ్వ వాళ్ళిచ్చిన కాగితాలు అన్నీ తన బొడ్లో ఉన్న సంచిలో పెట్టి మళ్ళీ సంచిని బొడ్లో జాగ్రత్తగా దోపుకుంది.

పర్వతాలు చేతిలో పదివేల రూపాయలు పెడుతూ డాక్టర్‌ స్థానిక రాజవ్వ వైపు చూస్తూ ”రాజవ్వా నువ్వు నేను పిలిచినప్పుడల్లా ఇక్కడ ట్రీట్‌మెంట్‌కు రావాలి. ఇందా ఈ పదివేలు తీసుకుని పిల్లలకి, నీకు శుభ్రమైన బట్టలు కొనుక్కో. మన హాస్పిటల్‌ దగ్గర్లో రేపు నీకు కిరాయి ఇల్లు చూసి పర్వతాలు చెబుతాడు. ఆ ఇంట్లోకి నువ్వు నీ పిల్లల్ని, నీకు సాయంగా మీ అమ్మని తెచ్చిపెట్టుకో. అన్ని సరుకులు మన సారువాళ్ళ డ్రైవర్‌ తెచ్చి ప్రతినెలా ఇచ్చిపోతడు” అంది.

వాళ్ళ ముగ్గురికీ దండాలు చెప్పి రాజవ్వా, పర్వతాలు బయటపడ్డారు.

”రాజవ్వా గీ ముచ్చట ఎక్కడా చెప్పమాకు. మూడో కంటికి తెల్సినా బాగుండదు. పాపం గా అమ్మోళ్ళ బిడ్డకు మస్తు ఆస్తి ఉందంట. పెళ్ళై పది సంవత్సరాలు అవుతున్నా పిల్లలు పుట్టలేదని, గిప్పుడు గిట్ల గీ పద్దతి వచ్చిందని పైసలు బెట్టి పిల్లల్ని కంటున్నరు” అన్నాడు పర్వతాలు.

”ఏమో అన్నా. పైసలకు ఆశబడి పెద్దపని చేస్తనని నే ఒప్పుకున్నా. కానీ భయమేస్తుందన్న. రేపు మాయవ్వ ఏమంటదో? నా పిల్లగాండ్లు పెద్దైనాక ఏం తిట్టిపోస్తరో” కండ్లసంటి ఉబికి వచ్చిన కన్నీళ్ళను తుడుచుకుంటూ అన్నది రాజవ్వ.

”గదేంది చెల్లే గట్టనబడితివి. మరి ఇష్టం లేకుంటే వదిలేయి. వాళ్ళు డబ్బున్నోళ్ళు. మనలాంటి వాళ్ళు ఎవరో ఒకరు వాళ్ళకు దొరకకపోరు” రాజవ్వ దుఃఖాన్ని అర్థం చేసుకున్న పర్వతాలు ఆమె బాధ పంచుకున్నట్లుగా అన్నాడు.

”అట్లగాదులే అన్నా. ఒప్పుకున్నాక గిప్పుడు ఎట్లా కాదంట గనీ, అన్నా వాళ్ళు నీకు కొన్ని పైసలన్నా ఇయ్యకబోయిరి గందా” ఆశ్చర్యంగా అడిగింది.

”అయ్యో చెల్లే! వాళ్ళ దగ్గర పైసలు తీసుకునేటందుకు నేనేమన్నా గీ దందాలు జేసే బ్రోకరునా? గా డాక్టరమ్మది గూడా మా ఊరే. మేమిద్దరం చిన్నప్పుడు మా ఊరి బడిలో ఒకటి నుంచి ఐదు వరకు కల్సే చదువుకున్నం. ఆయమ్మ భర్త కూడా మంచి డాక్టరు. ఆయన కొన్ని రోజులు ఈయమ్మతో మంచిగనే ఉన్నడు. ఏమైందో ఏమో… ఒకరోజు ఇంట్లో నుంచి ఎల్లిపోయి వేరే ఆమెతో కల్సి బతుకుతున్నడు. ఈయమ్మ విడాకులు తీసుకోలేదు గానీ, ఉన్న ఒక్కగానొక్క బిడ్డను పెంచనీక నమ్మకంగా ఉంటామని ఊర్లో వ్యవసాయం చేసుకునే నన్ను, నా భార్యను తెచ్చి తన ఇంట్లోనే పెట్టుకుంది. అప్పటి నుండి మమ్మల్నే కాదు, మా పిల్లల్ని కూడా ఆమె పోషిస్తోంది. నాలుగైదేళ్ళ క్రితం డాక్టరమ్మ కూతురు చదువు కోసం గదేదో దేశం పోయినాది. బిడ్డ విదేశాలకు పోయినంక డాక్టరమ్మ తల్లిదండ్రులను తెచ్చి ఇంట్లో పెట్టుకుంది. వాళ్ళొచ్చినంక మేము వేరే ఇల్లు చూసుకుని ఉంటున్నం. నా భార్య రోజూ వచ్చి ఆయమ్మకు అన్ని పనులు చేసిపెట్టి పోద్ది. నేను ఆయమ్మ జెప్పిన బయట పనులన్నీ చేసుకుంటూ వాళ్ళింట్లో ఉన్న తోటపని గూడా జేస్తా. మా ఇద్దరికీ ఆయమ్మే నెలకు జీతంగా ఇరవై వేలు ఇస్తుంది. మా పిల్లల చదువు చూస్తుంది. ఇంగ నాకు డబ్బులు ఎందుకు జెప్పు?” అన్నాడు.

”మరి నన్ను వేరే దవఖానకు తోల్కబోతనంటివి. వాళ్ళను బెదిరిస్తివి” అంది రాజవ్వ.

”అదా! ఊర్కనే. వాళ్ళను బెదిరీయనీక అన్నా. గట్ల అనకపోతే నీకు ఇప్పిస్తానన్న పైసలు ఎట్లిప్పిస్తా చెల్లే!” నవ్విండు.

… … …

రాజవ్వకు ఐవీఎఫ్‌ ట్రీట్‌మెంట్‌ మొదలెట్టి రెండు నెలలు అయింది. ముగ్గురు పిల్లల్ని కని

ఉండడం వల్ల గర్భసంచి కొంచెం కిందకు జారింది. డాక్టర్‌ స్థానిక తన తెలివితో పాటు శక్తినంతా కూడేసి రెగ్యులర్‌గా ట్రీట్‌మెంట్‌ ఇస్తోంది. రాజవ్వ తల్లి పోశవ్వ బిడ్డ జేస్తున్న పని వద్దని ముందుగాల మొరాయించినా తర్వాత రాజవ్వ అన్నీ వివరించి చెప్పినంక మాట్లాడకుండా ఊరుకుంది. పిల్లలిద్దర్నీ పర్వతాలు ఇంటి దగ్గర్లో ఉన్న ఇంగ్లీషు మీడియం బడిలో జేర్పించాడు. చంటిదాన్ని పోశవ్వ జూసుకుంటోంది. వసుధ మేడం వాళ్ళ డ్రైవర్‌ ప్రతి నెల రేషన్‌ తెచ్చి ఇంట్లో ఏసిపోతున్నడు. అప్పుడప్పుడు పర్వతాలు వచ్చి యోగక్షేమాలు తెల్సుకుంటా బోతన్నడు. డాక్టర్‌ స్థానిక పట్టు వదలకుండా చేస్తున్న ట్రీట్‌మెంట్‌లో మూడోసారి ఐవిఎఫ్‌కు అన్నీ సిద్ధం చేసుకుంది. ఈసారి తాను తప్పక విజయం సాధిస్తానన్న నమ్మకం వమ్ము కాలేదు. రాజవ్వకు ప్రెగ్నెన్సీ నిలిచిందన్న కబురు ఒక వారం రోజులు అయ్యేదాకా ఎవరికీ చెప్పకుండా తర్వాత మెల్లిగా వసుధకు కబురుచేసి తియ్యని కబురు చెప్పి ఊపిరి పీల్చుకుంది.

రాజవ్వకు ప్రగ్నెన్సీ నిలిచి మూడో నెల నిండుతున్న సందర్భంగా తమ సంతోష సూచకంగా ఒకరోజు డాక్టర్‌ స్థానికను, రాజవ్వను ఒక ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో విందుకు ఆహ్వానించారు వసుధ కుటుంబం. శ్రీజ, వివేకానందలు రాజవ్వను దగ్గరగా కూర్చోబెట్టుకుని మాట్లాడుతున్నారు. మాటల్లో రాజవ్వ పెద్దకొడుకు పదేళ్ళవాడని, ఐదో తరగతి చదువుతున్నాడని తెలుసుకున్న శ్రీజ వాడిని తన స్నేహితురాలు నిర్వహిస్తున్న హాస్టల్‌ వసతి ఉన్న పాఠశాలలో చేర్పించి మొత్తం చదువుని తాను భరిస్తానని చెప్పడంతో రాజవ్వకు సంద్రంలో ఈదుతున్న తనకు ఒక ఆలంబన దొరికినట్లు అనిపించింది.

రాజవ్వకు తన అనంత దుఃఖానికి కారణభూతమైన భర్త సైదులు గుర్తుకు వచ్చిండు. వాడికెప్పుడు ఆడోళ్ళ యావ తప్ప మరేం ఉండేది కాదు. పెద్దోడు రెండు నెలలకు ముందే పుట్టినాడని బాగా తాగొచ్చి వీడసలు తనకు పుట్టనేలేదని గలాటా పెట్టుకున్నాడు. నువ్వు ఎవ్వడితోనో పండుకుని కడుపు తెచ్చుకుంటే మీ పైల్మాన్‌ అన్న నాకిచ్చి బలవంతంగా పెండ్లి చేశాడని గొడవకు దిగాడు. తనకు సిగ్గుబోయి, సచ్చిపోయినట్లయింది. రాముడు శంకించినప్పుడు సీతమ్మోరు భూమిలోకి కూరుకు పోయినట్లుగా తను గూడా గట్లనే పోతే బాగుండుననుకుంది. కానీ తన అన్నే సైదులుకు నాలుగు దెబ్బలు తగిలించాక చిన్నోడు పుట్టేదాంక నోరుమూసుకుని ఉన్నడు. అన్న ఎప్పుడైతే సచ్చిపోయిండో గప్పటి నుంచి ఏకు మేకైనట్లుగా ఆడపిల్ల బుట్టేనాటికి ఇంటికి రావడమే మానేసిండు. తాను వాడ్ని ఎన్నిసార్లు దేవులాడి, బతిమలాడి ఇంటికి తోలుకొచ్చినా ”ఆడపిల్లను కన్నవు గదే బద్మాష్దానా..” అంటూ ఒళ్ళంతా కుళ్ళబొడిచి తప్పతాగి వచ్చి పచ్చి బూతులు తిట్టేటోడు. రెండు రోజులుండి మూడో రోజు పత్తా లేకుండా పారిపోయేటోడు. గొడవజేసి గోలబెట్టినప్పుడల్లా ఆడమనిషినని గూడా చూడకుండా మెత్తగా కొట్టి అర్థరాత్రుల్లోనే ఏడకో ఎల్లిపోయేటోడు. సంపాదించిన పైసలతో పాటు తన తండ్రి తామిద్దరి పేర్ల మీద రాసిచ్చిన అర ఎకరం పొలం కాయితాలను ట్రంకు పెట్టెలో దాచుకుంది తను. అవి ఎప్పుడు ఎత్తుకుపోయిండో కూడా తనకు తెల్వదు. అవి గొంటబోయిన నాటి నుంచి ఈనాటికి ఏడేళ్ళు అవుతున్నా వాడి పత్తానే లేదు. కళ్ళలో

ఉబికి వస్తున్న కన్నీళ్ళను తుడుచుకుంటూ శ్రీజ కాళ్ళకు దండం పెట్టబోయింది రాజవ్వ. దూరంగా వీళ్ళనే గమనిస్తున్న వసుధ డాక్టర్‌ స్థానికను అటువైపు చూడమన్నట్లుగా సైగ చేసింది.

డాక్టర్‌ స్థానిక చెప్పిన వివరాల ప్రకారం రాజవ్వ కడుపులో పెరుగుతున్న బిడ్డ పుష్టిగా, ఆరోగ్యంగా ఉందని తెల్సినప్పటి నుంచి వసుధ ఆనందానికి హద్దులు లేకుండా ఉంది. శ్రీజను అత్తింటివారు పెట్టిన ఆరళ్ళు గుర్తుకువచ్చి కొంగుతో కళ్ళు తుడుచుకుంది. పోయినసారి బోంబేలో ఐవీఎఫ్‌ ట్రీట్మెంట్‌ చేయిస్తే పది లక్షలదాకా ఖర్చు చేశామని, అయినా సక్సెస్‌ కాలేదని నానామాటలు అన్నారు. వాళ్ళ అత్తగారి చెల్లెలయితే ఏకంగా శ్రీజకు పిల్లలు పుట్టరని, రెండో పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకోవాలని నానా రభస చేసింది. లేకపోతే డైవోర్సు ఇప్పించేస్తామని బెదిరించింది. ఆనాటి సంఘటనలు కళ్ళ ముందు కదలాడి వసుధ గొంతు దుఃఖంతో పూడుకొని పోయింది. డాక్టర్‌ స్థానిక భర్త తనకు దూరపు బంధువు. ప్రస్తుతం వాళ్ళిద్దరూ కల్సి జీవించలేకపోతున్నా, భర్తకు దూరపు బంధువైనా తమ సమస్య చెప్పినప్పుడు ఎంతో ఆదరణతో స్పందించి తమకు ధైర్యం చెప్పింది. ఈసారి సరోగసీ ద్వారా ట్రై చేద్దామని తనే అంది. దాని ఫలితమే రాజవ్వ ప్రస్థానం. అన్నీ గుర్తుకు వచ్చి వసుధ డాక్టర్‌ స్థానిక చేతులు తీసుకుని కళ్ళకు అద్దుకుంటూ కృతజ్ఞతలు చెప్పుకుంది.

… … …

డాక్టర్‌ స్థానిక పర్యవేక్షణలో రాజవ్వకు ఎనిమిదో నెల నిండి తొమ్మిదిలో పడింది. పెద్దోడు ఇప్పుడు శ్రీజ సాయంతో హాస్టల్‌లో

ఉంటూ ఆరో తరగతి చదువుకుంటున్నాడు. మంచి మార్కులు కూడా తెచ్చుకుంటున్నాడు. చిన్నోడు, ఆడపిల్ల ఇద్దరూ తమ ఇంటి పక్కనే

ఉన్న ప్రైవేటు బడికిపోయి ఇంగ్లీషు మీడియం చదువుతున్నారు. ముగ్గురు పిల్లలకు మంచి ఆహారం, మంచి బట్టలు కట్టుకుంటూ కళ్ళముందు తిరుగుతూ ఉంటే రాజవ్వ మనసు ఇంతకు ముందు ఎన్నడూ తెలియని ఆనందాన్ని అనుభవిస్తోంది. తన తల్లి కూడా తనను బాగానే అర్థం చేసుకుంది. మొదట్లో కాస్త గలాటా చేసినా తర్వాత సర్దిచెప్పినాక అర్థం చేసుకుంది. ఎప్పుడన్నా గిట్లాంటి ఇంతలు ఇన్నామా? చూసామా? అని దవడలు నొక్కుకున్నా మెల్లమెల్లగా తనకు ఆ పైసలు ఎంత అవసరమో తెలుసుకుని మౌనం దాల్చింది.

కూతురుకు ఆ మూడు పురుడ్లకు ఎట్లా సపర్యలు చేసిందో, ఇప్పుడు కూడా ఈ కాన్పుకు కల్మశం లేని తన తల్లితనాన్ని పోశవ్వ పోషిస్తోంది. రాజవ్వకు తల్లిని చూసి జాలేసింది. తన తల్లి మాత్రం ఏం సుఖపడింది? తండ్రి వ్యవసాయం చేసినన్ని రోజులు ఆయనతో పాటే కష్టపడింది. అన్న పైల్మాన్‌ అవ్వడానికి ఎంత భారాన్ని మోసిందో తనకు తెలియంది కాదూ. తాము తిన్నా తినకున్నా అన్నకు రోజుకు పది కోడిగుడ్లు తినిపించేది. ఇంట్లో పైసలు ఉంటాయో ఉండవో అని ఇంటినిండా కోళ్ళను, గొర్రెలను కొంటూ, వాటిని పెంచి కొడుక్కి రెండు రోజులకొకసారి చికెన్‌, మటన్‌ వండిపెట్టేది.

అన్న తమ ఇంటి పక్కనే ఉన్న సుశీలను ప్రేమించి పెండ్లి చేసుకున్నాక అయ్యా, అవ్వలను ఓర్వలేని సుశీలతో ముసలోళ్ళకు మస్తు కష్టాలు వచ్చి పడ్డయి. సుశీల పేరుకే మంచిగుంటది. గుణం జూస్తే ఉట్టి సుప్పనాతి బుద్ధే. కాకపోతే అన్నను ప్రాణంగా చూసుకుంటుందని తల్లిదండ్రులు చూసీచూడనట్లు ఊరుకున్నరు. అన్న, అయ్యా చనిపోయినంక తన ఇద్దరు బిడ్డల్ని తీసుకుని సుశీల వాళ్ళ పుట్టిల్లు జేరింది. ఉన్న వ్యవసాయం చేయలేక పైసలు లేక మిగిలిన ఎకరా భూమిని అమ్మి, వచ్చిన పైసలను కొడుకు బిడ్డల పేరు మీద ఊరి సర్పంచుతో మాట్లాడి బ్యాంకులో వేసి డిపాజిట్‌ చేయించింది పోశవ్వ. ఉన్న ఒక్కగానొక్క ఇల్లును కోడల్నే తీసుకొనమని చెప్పింది. కానీ ఊరి సర్పంచు అందుకు ఒప్పుకోలేదు. నువ్వు సచ్చిపోయినంక వాళ్ళే దీసుకుంటరు గానీ అప్పటిదంకా అవ్వనే ఉండమని తీర్పు జెప్పిండు. తన దగ్గరికి వచ్చేదంకా ఆ ఇంట్లోనే ఉంటూ తోచింది ఉడకేసుకుని కాలం ఎల్లదీస్తున్నది ఇన్నాళ్ళు. ఉండడానికి మట్టి గోడల ఇల్లే అయినా ఇల్లు పెద్దగుంటదని, ఒక్కతి ఉండలేక బడిలో పాఠాలు చెప్పే పంతులుకు వెయ్యి రూపాయల కిరాయికి నాలుగు రూములు ఇచ్చి తాను రెండు రూముల్లో ఉంటోంది.

”ఏంది బిడ్డ గట్ట కూర్చున్నవేంది? నెలలు నిండుతున్నాయి గందా… ఒక్కచోటే గట్ల కూర్చుంటే లోపలున్న బిడ్డకు ఊపిరాడదు. ఇగో కాస్త గీ పండ్లరసం తాగి కాసేపు అటు, ఇటు నడువు బిడ్డా” అంది పోశాలు.

తల్లి జ్ఞాపకాల నుండి బయటకు వచ్చిన రాజవ్వ గోడపట్టుకుని మెల్లగా లేచి నిలబడింది. తల్లి ఇచ్చిన పండ్లరసం తాగుతూ అబ్బా అంటూ నొప్పితో అరిచింది. పోశవ్వ తల్లిపేగు కదిలినట్లైంది. ”ఏమైంది బిడ్డా? భద్రం! జర మంచం మీద పండు బిడ్డా. పొట్టకు కొబ్బరినూనె రాస్తే లోపల ఉన్న బిడ్డ సక్కగా కదులుతది” అంది.

రాజవ్వ నవ్వుకుంటా ”అవ్వా, జర జెప్పే. నిజ్జంగా నా మీద నీకు కోపంగా లేదంటవా” తల్లి ముఖకవళికలు గమనిస్త అడిగింది రాజవ్వ.

”ఎందుకు బిడ్డా కోపం? బిడ్డలు ఏం జేసినా కడుపులో దాచుకునేదే తల్లి. నేనూ నీకు తల్లినే గందా. ఎందుకుంటది బిడ్డా నీ మీద నాక్కోపం?” అమాయకంగా రాజవ్వను జూస్తా అంది పోశవ్వ.

”గదిగాదే అవ్వా… ఎవరి బిడ్డనో కడుపులో మోస్తున్నా గందా… అందుకని”

”పిస్సదానా నువ్వెవరి కోసం బిడ్డను మోస్తున్నవో… ఎందుకు మోస్తున్నవో నాకెరికైనంకా ఎందుకుంటది బిడ్డా నీ మీద కోపం? నువ్వు జేస్తున్న పని ఎవ్వతి జేస్తదో చెప్పు? తన బిడ్డనే తాను మోయలేక పిల్లల్ని కనడం గూడా నామోషి, బద్ధకం అయిపోతున్న ఈ గడ్డు రోజుల్లో పానాన్ని పణంగా బెట్టి ఎవతి జేస్తది బిడ్డ గింత మంచి పని?”

”అవ్వా! ఒకటి జెప్పనా.. నువ్వేమి నన్ను యడ్డియ్యకు గనీ. నా మనసులో మాట జెప్తున్న. నా కడుపులో ఇప్పుడు తిరుగుతున్న ఈ బిడ్డ రేపు బయటకొచ్చిన క్షణమే శ్రీజమ్మోళ్ళు నీకు నాకూ కనబడకుండా తోల్కబోతరు. ఈ జన్మకే కాదూ మరే జన్మకు కూడా ఈ బిడ్డ మనకు కనబడడు. ఈ బిడ్డను కన్నతల్లిగా రేపు నేను ఎంత దుఃఖాన్ని దిగమింగుకోవాలో? గది తలచుకుంటే నాకైతే భయమేస్తందే అవ్వా” పొట్టమీద చేతితో రుద్దుకుంటూ తన్మయత్వంతో కూడిన దుఃఖంతో అంది రాజవ్వ.

”బిడ్డా! నీ పొట్టలో పెరుగుతున్న బిడ్డ నీది ఎట్లయితదే పిస్సదానా? గా ముచ్చట నీకు ఎరకనే గందా బిడ్డా. గిప్పుడు గీ బిడ్డ మీద పానం పెంచుకుంటే ఎట్లా చెప్పు? నువ్వు బిడ్డను కని ఇచ్చినందుకు డబ్బులు తీసుకుంటలేవా? గది ఒప్పుకునే గందా గీ దందా జేస్తున్నవు. గిప్పుడు గిట్లంటే ఎట్ల బిడ్డా!” రాజవ్వ తల నిమురుతూ గుండెకు హత్తుకుంది పోశవ్వ.

”గంతేనంటావా. గీ బిడ్డ మీద నాకేం పానం కొట్టుకోకుండా ఉంటదంటవా? ఎందుకోనే అవ్వా. నా ముగ్గురు పిల్లల మీద ఎంత పేముందో గీ బిడ్డ నాది గాదని తెల్సినంక గూడా గంతే పానం కొట్టుకుంటుందే. ఏం జెయ్యాలే? జెప్పూ” కండ్ల పొంట కారుతున్న కన్నీళ్ళను తుడుచుకుంది రాజవ్వ.

”బిడ్డా! పైసలు తీసుకుని బచ్చేపోచ్‌ను కిరాయికి ఇచ్చినవు. గంతే గానీ నువ్వేమైనా గా అయ్యతో కల్సి పండుకున్నవా ఏంది జెప్పు? గుడ్డు… బొడ్డు వాళ్ళవే అయినంకా పొద్గుడుదేముంటదే పిస్సదానా గవేమీ బెట్టుకోమాకు. బిడ్డను గని ఇచ్చేసినవంటే వాళ్ళు సంతోషపడతారు. నీ పిల్లలూ మంచిగైతరు. గా గత్తరోడు జేసిన మోసానికి బరాబరు” రాజవ్వను వదిలేసి పోయిన అల్లుడ్ని తిట్టుకుంటా అంది పోశవ్వ.

… … …

కాన్పు పదిరోజులకు అవుతదని డాక్టరమ్మ చెప్పడంతో రాజవ్వ, పోశవ్వ ఇద్దరూ గల్సి. పిల్లలిద్దర్ని బడికి పంపినంక పక్కనే ఉన్న చర్చికి పోయొద్దామని అనుకున్నరు. రాజవ్వ బైట తలుపుకు తాళం వేస్తుండగా పర్వతాలు రొసబోసుకుంటూ పరిగెత్తుకుంటా వచ్చి రాజవ్వ ఎనక నిలబడ్డడు. ”రాజవ్వా.. నీ మొగుడు యాదన్న నీ కోసం పాతింటికాడా వాకబు చేస్తున్నడు. అక్కడోళ్ళు ఏం జెప్పిండ్రో ఏందో? గిప్పటికి అక్కడి నుంచి ఎల్లిపోయిండు. ఎందుకైనా మంచిది. వాడి కంట నువ్వు కనబడకపోతే మంచిగుంటది. జర కాన్పు అయ్యేదాకా వాడికి చిక్కకుండా జాగ్రత్తపడాలా” తాళం వేసి తనవైపు తిరిగిన రాజవ్వనుద్దేశించి అన్నడు.

”ఏ ముసల్దానా..! జర నువ్వు గూడా జాగ్రత్తగుండు. బయటకు పోమాకా. పిల్లల్ని గూడా బడికే కాదూ బయటకు కూడా పోనీయకుండా ఇంట్లోనే ఉండుండ్రీ. గీ పదొద్దులు” రొప్పుతూ అన్నాడు పర్వతాలు.

రాజవ్వ, పోశవ్వల గుండెల్లో ఒక్కసారిగా పెద్ద రాయిబడినట్లయింది. ఇద్దరూ ఒకరి మొఖాలొకరు చూసుకున్నారు. ఇంట్లో రాయి దీయబోయి కూట్లో రాయేసుకున్నట్లైంది ఇద్దరి పరిస్థితి. పోశవ్వ రాగం అందుకుంది. ”అయ్యో బిడ్డా! పాపిష్టోడు ఇప్పుడొచ్చి ఏం గలాటా జేస్తడో ఏందో? సావన్నా రాకపోయే ఆడికి. గిప్పుడెట్లా బిడ్డా” అనుకుంటూ రాగాలు దీసింది.

రాజవ్వ మనసు పరిపరి విధాల ఆలోచిస్తోంది. ఇప్పుడు వాడొచ్చి గోలజేస్తే ఏం చేయాలో అర్థమైతలేదు. అయినా ఏడేళ్ళు నా నుంచి పారిపోయినోడు, కన్నబిడ్డల్ని గాలికి వదిలేసి మంది ఆడోల్ల ఎంబడి తిరిగి తిరిగి, గిప్పుడు వచ్చి నా పెండ్లాం అంటే పోవడానికి తనకు సిగ్గూ ఎగ్గూ లేదా ఏంది? ఒక్కసారిగా రాజవ్వ ఒంట్లోకి ఎక్కడలేని ధైర్యం వచ్చినట్లైంది. నడిసంద్రంలో ఒదిలేసి పోయిన మొగడు గురించి వాడొదిలేసి పోయిన పిల్లల గురించి కాదూ తనిప్పుడు ఆలోచిస్తోంది. ఎన్నో ఆశలతో ఎంతో ఉత్సాహంగా తన కడుపులో ఆరోగ్యంగా పెరుగుతున్న బిడ్డ, ఎప్పుడెప్పుడు భూమ్మీద పడదామా అని ఎదురుచూస్తున్న తనలో కదులుతున్న బిడ్డ గురించి ఆలోచిస్తోంది రాజవ్వ. బిడ్డ పుట్టగానే ఆ బిడ్డను ఎవరికి అందజేయాలో వారి గురించి… వారు తనకు చేసిన సహాయం గురించే తను ఇప్పుడు ఆలోచిస్తోంది. అంతే! ఆ తర్వాత తనకు, తన పిల్లలకి ఏమైనా ఫర్వాలేదు. తన పిల్లల్ని రక్షించుకునేందుకు తను ఎంచుకున్న మార్గంలో ఎవరు అడ్డు వచ్చినా తాను లెక్క చేయదు. అవసరమైతే ఎవరినైనా వదులుకుంటుంది. తన ఇజ్జత్తును తను కాపాడుకునే తీరుతుంది. తనకు ఏం కావాలో తనకు బాగా తెల్సు! తన శరీరం తన ఇష్టం… అంతే!

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.