కళ్ళల్లో రెండు దృశ్యాలు – శ్రీనివాస్‌ సూఫీ

బస్తీలోని ఆ మురికివాడను ఒక విరోధాబాస ఆక్రమించింది. మొదటిది దారి చెప్పులు తొడుక్కొని నడిచెల్లిన తమ వాళ్ళలో కొందరిని కరోనా పురుగు కరిచిందని… రెండోది క్లిష్ట సమయంలో ప్రతికూలతపై గెలుపు జెండా ఎగరేసిన మహిళా స్ఫూర్తిని ప్రపంచానికి తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వం ఆహ్వానం.. మహిళలంతా అదే చెట్లకింద సమావేశమై ఉండగా… అందరి కళ్ళల్లో ఒక విచారం, మరొక ఆనందం.. వాటికి కారణమైన కొద్దినెలల క్రితంలోకి వెళ్ళారందరూ…

హఠాత్తుగా ఆకాశం మబ్బుకమ్మి పట్టపగలే చీకట్లు అలుముకుంటున్నాయ్‌ అచ్చం వీళ్ళ బతుకుల్ని ముసిరిన గ్రహణం మాదిరిగా… ఈ మాయదారి గత్తర ఇప్పట్ల ఇడిసేటట్టు లేదు. పది, పదేను దినాల్‌ దాటిపాయె పనులు దొరక్క… పొయ్యిల పిల్లి లేత్తల్లేదు అన్నాడు ఎంకటాద్రి బుర్ర గోక్కుంటూ. అవునే ఏందో లాకడవునంట ఎంతకొదుల్తలేదు అని నిట్టూర్చాడు సామేల్‌ ఎంకటాద్రికి మద్దతుగా. కరోనా పురుగు కరుత్తదంట… నగరంలో అపార్ట్‌మెంట్‌ నిర్మాణ పనులతో పొట్టపోసుకునే అడ్డా కూలీలు వాళ్ళు. మహారాష్ట్ర ప్రాంతం నుంచి వలసవచ్చిన అరవై కుటుంబాల వాళ్ళు శివారు ప్రాంతంలోని ఖాళీ జాగాలో గుడిసెలు వేసుకొని ఉంటున్నారు. కల్లోలం సృష్టించిన కరోనా వైరస్‌ వీళ్ళ బతుకులను అగమ్యంలోకి నెట్టింది. పనులేవీ లేకపోవడంతో ఇదుగో ఇట్లా చెట్ల కింద చేరి భవిష్యత్తును చర్చించుకుంటున్నారు.

ఆడేడ్నో బియ్యం పంచుతరటని ఈడేడ్నో కూరగాలిస్తరంటని చేతులు జాసుకుంట ఎందాకని ఉరుకుతం. మనమేమన్న బిచ్చపోల్లమా… ఏదో మనకున్న దాంట్లో కుక్కకో పిల్లికో ఇంత బెట్టినోళ్ళమే. బతుకులిట్ల ఇప్పుడు ఆగమాయె అంటూ ఏడుపు లంకించుకుంది రమణమ్మ చీరకొంగుతో కళ్ళనీళ్ళొత్తుకుంటూ.

ఇగ సత్తమో బత్కతమో ఎట్టా పనుల్లేకపాయె మనూరుబోయి ఈ సావేందో ఆడ్నే సద్దం పారి అంటూ తన నిర్ణయం ప్రకటించింది ఏడుపు గొంతుతో ఆదెమ్మ. ఊకో వొదినె, ఊకో అక్కా అంటూ ఇంకో నలుగురు ఆడోళ్ళు వాళ్ళను ఊరడించే యత్నం చేస్తున్నారు. ఆడోళ్ళ దుఃఖం మొగోళ్ళందరినీ కదిలించింది. వాళ్ళంతా తమ ప్రాంతానికి వెళ్ళిపోవాలనే నిర్ణయించుకొచ్చారు.

మరుసటి రోజు తెల్లవారుఝామునే పెట్టేబేడా సర్దుకొని కాలిబాట పట్టిపోతుంటే టీవీ ఛానెళ్ళు ఆ దృశ్యాలను ప్రసారం చేయడంతో స్పందించిన ప్రభుత్వం వాళ్ళను అడ్డుకొని వెనక్కు తిప్పి పంపాలని ఆదేశించడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఎక్కడివాళ్ళక్కడ ఉన్న చోటునే ఉండాలని ఒక్కో కుటుంబానికి నిత్యావసరాలు, ఆర్థిక సాయం ప్రభుత్వం అందచేస్తుందని నచ్చచెప్పేందుకు ప్రయత్నించినా తాము వెళ్ళి తీరతామని భీష్మిస్తూ వాళ్ళు రోడ్డుపైనే ధర్నా చేయడంతో పోలీసులు వారిని బలవంతాన అక్కడినుండి తరలించారు. కానీ అప్పటికే సగానికి పైగా కుటుంబాలవారు ఇతర మార్గాల్లో సరిహద్దులు దాటారు.

కట్‌ చేస్తే… మిగిలిన దాదాపు పాతిక కుటుంబాల వాళ్ళు మరుసటిరోజు అదే చెట్ల నీడలో సమావేశమయ్యారు. మున్సిపాలిటీ వాళ్ళొచ్చి ఆ ప్రాంతంలో చెత్త దిబ్బలు తొలగిస్తూ ఏవో రసాయనాలు పిచికారి చేస్తున్నారు. రొటీన్‌కు భిన్నంగా ఆడవాళ్ళు మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారు ఇన్నాళ్ళు తమ గొంతులకు ఎవరో వేసిన ముడిని ఎవరికి వారు విప్పుకుంటున్నట్లు. కానీ అందరూ నోటికి దస్తి గుడ్డో, చీర కొంగులో అడ్డం పెట్టుకుని మాట్లాడుతున్నారు. మగవాళ్ళు కొందరు సెల్‌ ఫోన్‌ చూసుకుంటుంటే ఇంకొందరు చుట్టలు చుట్టుకుంటున్నారు. ఇంకొందరు ఫోన్‌లో మాట్లాడుతున్నారు. ఇంకొందరు జియో నెట్‌లో వీడియోలు చూస్తున్నారు, కానీ చాలామంది ఆడోళ్ళ మాటలను ఆసక్తిగా వింటున్నారు.

పొట్ట చేతపట్టుకుని ఎక్కడికని పోతాం, ఎక్కడైనా ఇంతే ఉంది. ఏదో పుట్టి పెరిగిన మన ఊరన్న మమకారం తప్ప ఊళ్ళో ఏముంది. ఏమీ లేకనే కదా ఇట్ల ఎగిరొచ్చినం. కరోనా గూడ అక్కడ ఎక్కుబున్నదంట. ఎటూ బోవద్దు ఈడ్నే ఇంకేదన్న పనిజేసుకుని కలో గంజో తాగుదాం. ఏదో ఉపాయం ఆలోచించుదాం అంటూ కర్తవ్య బోధ చేసింది శ్రీలక్ష్మి. పనోళ్ళలో పదో తరగతి దాక చదివినోళ్ళలో ఈమె ఒకతి, వయసు పాతిక సంవత్సరాల లోపే ఉంటుంది.

నువ్వు జెప్పేది మంచిగనే ఉన్నది గనీ అన్ని యాపారాలు బంద్‌ అంటున్నరు గదా! మళ్ళ మనకు పనెట్ట దొర్కుతది… ముందు కూర్చోబెట్టుకున్న బిడ్డ తలలో పేలు కుక్కుతూ నొక్కి అడిగింది నలభై ఏళ్ళ రంగమ్మ. అవునే పనిలేకనే కదా ఈ తిప్పలు అంది కమలమ్మ అద్దంలోకి చూస్తూ పాపిట తీసుకుంటూ. ఏదో సామెత జెప్పినట్టుందే నీ యవ్వారం అంటూ ఏదో విసుక్కుంది డెబ్బయ్యేళ్ళ చుక్కమ్మ. అయితే మనమే ఏదో యాపారం చేద్దాం మళ్ళీ స్థిరంగా పలికింది శ్రీలక్ష్మి. ఈసారి మగవాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు.

ఉన్న యాపారాలన్నీ బంద్‌ జేయిత్తే ఇంగ మనమేం యాపారం జేత్తమే, అయినా పెట్టుబడి ఏడకెళ్ళొత్తది, మనకాడ అన్ని డబ్బులాడియి అంది రంగమ్మ. ఈడ్సి తన్నినా ఒక్కళ్ళింట్ల ఎయ్యిరూపాయిల్లేవు అంది చుక్కమ్మ.

టీవీల్లో చూస్తున్నం గదా కిరాణ కొట్లకి, కూరగాయ దుక్నాలకి ఏం అబ్జక్షన్‌ లేదని అంది శ్రీలక్ష్మి ఏదో నిర్ణయానికొచ్చినట్లు. అంటే… అంది ఇంకా అర్థం కానట్టు కమలమ్మ. అంటే ఏందెహె, సరుకుల కొట్టు, కూరగాల కొట్టు పెడదాం అంటాంది సీలచ్చిమి అని వివరించింది రంగమ్మ. అట్నా… పెడితే మాత్రం మనకాడెవులు కొనక్కపోతరట్ల అని సందేహపడింది చుక్కమ్మ. సుట్టుపక్కల కాలనీలోళ్ళొచ్చి కొనక్క పోవుడే కాదు మనం గూడ మొగోళ్ళతో ఇంటింటికి సరుకులు డోర్‌ డెలివరీ చేపిద్దాం… మాస్కులు, సానిటైజర్లంట. అయ్యి సుత మనమే తయారుచేసి ఇంటింటికి అమ్ముదాం అని తన ఉపాయాల్ని వివరించింది శ్రీలక్ష్మి.

ఉపాయాల్జరే గానీ డబ్బులేడికెల్లి ఎత్తకొత్తరల్ల చివరి సందేహంగా అడిగింది చుక్కమ్మ. గిరిగిరి దీసుకుందమా అలవాటు ప్రకారం అంది కమలమ్మ. ఒద్దత్తా గిరిగిరంటే మిత్తి ఎక్కువైతది అంది శ్రీలక్ష్మి. మరెట్లనే ఎంత లేదన్న మూడు లచ్చలన్న ఉంటేగానీ ఇయ్యాన్నీ అవుతయ్‌ అంది రంగమ్మ. బంగారం రేటు బాగనే ఉందిగా, మెళ్ళల్లయ్‌ అమ్ముదాం. మళ్ళ మనం చెయ్‌ దిప్పుకున్నంక సూసుకోవచ్చు, అతిక వడ్డీలు ఆనికెందుకు మేపాలి అంది కమలమ్మ.

మనకు డ్వాక్రా లోన్‌ అయిదు లక్షలు వొచ్చేది ఉంది. అయ్యెట్నో రాబట్టి ఆటితో యాపారం అనుకున్నా… కానీ కమలమ్మ పిన్ని చెప్పింది గూడా బాగానే ఉంది లోన్‌ వొచ్చేలోగా ఇట్లా యాపారం షురూ జేద్దాం, లోనొస్తే యాపారాన్ని బట్టి ఆలోచిద్దాం అంది శ్రీలక్ష్మి. మెడలో కాసు అరకాసు బంగారం అమ్మే ఆలోచనను ఖండిస్తూ కొందరు మొగోళ్ళు నోరు తెరవబోగా ఇంకొందరు ఆగమన్నట్లు వాళ్ళను వారించారు.

అనుకున్న ప్రకారం తెలిసిన మార్వాడీ వద్ద నగలు అమ్మి ఎవరెవరి నగకు ఎంతెంత డబ్బొచ్చిందో ఆ మేరకు ఎవరి పెట్టుబడి ఎంతో లెక్క రాసుకున్నారు. మొగవాళ్ళ సాయంతో హోల్సేల్‌ దుకాణాల్లో పెద్ద సంఖ్యలో సరుకు తెచ్చి సూపర్‌ మార్కెట్లలో తీరుగా వాటిని ప్యాకింగుల్లో నింపారు. ఒక షట్టర్‌ మాటాడుకొని స్థానిక కార్పొరేటర్‌తో ఓపెనింగ్‌ చేయించడంతో ఆ వార్త పత్రికల్లో వచ్చింది.

మహిళలు నిత్యావసరాల విక్రయాల్లో సామాజిక దూరాన్ని ప్రోత్సహిస్తూ సరుకులు డోర్‌ డెలివరీ చేస్తుండడం, వినియోగదారుల ఫోన్‌ నంబర్లు సేకరించి ఆర్డర్‌ ద్వారా సరుకులు కోరిన వెంటనే సరఫరా చేస్తున్న విధంపై ప్రచారం జరగడంతో ఆ అంశాన్ని కొన్ని పత్రికలు ప్రత్యేక కథనంగా మహిళాభ్యున్నతి కోణంలో ప్రచురించాయి. మహిళల భర్తలు, కొడుకులు సరుకులు తేవటం, ప్యాకింగులు చేయటం, ఫోన్‌ నంబర్లకు సరుకులు ఇచ్చిరావటం… వంటి పనుల్లో సాయపడుతున్నారు.

ఒకవైపు కిరాణా దుకాణం జోరుగా సాగుతుండగానే రావాల్సిన లోన్‌ మంజూరు కావటంతో వ్యాపారాన్ని మరింత విస్తృతం చేశారు. యూట్యూబ్‌లో శానిటైజర్లు, మాస్కుల తయారీ తెలుసుకుని ఆ యూనిట్‌నూ ప్రారంభించారు. కిరాణా సామగ్రి తీరుగానే వీటి విక్రయ బాధ్యతనూ మగవాళ్ళు తీసుకున్నారు. మహిళలు ఆర్థిక స్వయం సమృద్ధి సాధించేందుకు చేస్తున్న ప్రయత్నాలకు ప్రభుత్వమూ సహకారం అందించింది.

మాస్కులు, శానిటైజర్లను ఈ మహిళల నుండి కొనుగోలు చేయాలని సూచించడంతో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఆర్డర్లు ఇవ్వసాగాయి. రెండు విధాలా మహిళలు పురోగతి చెందడంతో రాజకీయ, సేవా సంస్థలు సైతం వీరికి తోడ్పాటునిచ్చేందుకు ముందుకొస్తున్నాయి.

అంతా ఆనందంగానే ఉండగా అప్పుడే తెలిసిన ఒక వార్త వాళ్ళను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. ఆ రోజు పోలీసులు అడ్డుకున్నా సరే వాళ్ళ కళ్ళుగప్పి వెళ్ళిన నలభై కుటుంబాలకు చెందిన కొందరు వైరస్‌ బారినపడ్డారని… కానీ ఆ తర్వాత తెలిసిన మరో వార్త వారిని సంతోషాన నిలిపింది. కష్టాలనెదుర్కొని, పేదరికంపై పోరాడి గెలిచిన వారి స్ఫూర్తిదాయక గాధను ప్రపంచ మహిళలకు తెలియజేయవలసిందిగా వాళ్ళకు కేంద్ర ప్రభుత్వపు ఆహ్వానం అందింది.

Share
This entry was posted in కధానికలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.