దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ -అక్కిరాజు రమాపతి రావు

(గత సంచిక తరువాయి…)

‘ఎ’ క్లాసునిచ్చి ఆరు నెలల శిక్ష విధించారామెకు రాయవెల్లూరు విచారణాధికారులు. అలా డెబ్భై, ఎనభై మంది నానా రకాల ఖైదీలతో తనను ఉంచడానికి బాధపడి దుర్గాబాయి జైలు అధికారులను ‘నియమ నిబంధనల మాట అటుంచండి కనీస మానవత్వం దృష్ట్యానైనా ఇంత దారుణంగా ఏర్పాటు చేయవచ్చా జైలు అధికారులు’ అని వాళ్ళను నిలదీసిందంట ఆ ఖైదీలందరి ముందే. దాంతో జైలు అధికారులు, సిబ్బందీ భయపడిపోయారు. మర్నాటి నుంచీ ఖైదీలందరినీ చైతన్యవంతులను చేసి, పురిగొల్పి జైల్లో కూడా ఆందోళన, తిరుగుబాటు సృష్టిస్తుందేమోనని వాళ్ళు వణికిపోయి ఉంటారు. ఆమె గత చరిత్ర వాళ్ళకు తెలియకుండా ఉంటుందా?! మద్రాసు రాష్ట్ర అత్యున్నత హోదాగల పోలీసు అధికారి మేజర్‌ జనరల్‌ కన్నింగ్‌హాం ఆమెను ఆడసింహంగా అభివర్ణించాడు. ఆ సందర్భం ఏంటంటే

ఉప్పు సత్యాగ్రహ స్వాతంత్య్ర పోరాటపు దేశభక్తులపై అతడు సాగించిన దౌర్జన్యం, కిరాతక చర్యలు, హింసా క్రౌర్యాలు ఒక విచారణ సంఘం ముందుకు పరిశీలనకు వచ్చినప్పుడు దుర్గాబాయిని గురించి ఉలిక్కిపడుతూ అతడు చూపిన ప్రతిస్పందన అది. అందువల్ల ఈసారి ఆమెను రాయవెల్లూరు జైలులో ఉంచడం ప్రమాదకరమని అక్కడి జైలు అధికారులు భావించారు, భయపడ్డారు. దాంతో ఆమెను వేరే జైలుకు మార్చాలని రంగం సిద్ధం చేసుకున్నారు.

ఒక్క రోజు కూడా ఆ జైల్లో ఆమె ఈసారి గడపకుండానే మర్రోజు సాయంత్రం అతి రహస్య ప్రయత్నంతో మధుర జైలుకు మార్చారు. ఈసారి ఆమెకు గట్టి గుణపాఠం నేర్పాలనీ, జైలంటేనే బెంబేలెత్తిపోయి, గడగడ వణికిపోయేటట్లు చేయాలని అతి భయంకర పరిస్థితులు కల్పించారు. మధుర జైలులో ఆమెకు ఒళ్ళు జలదరించిపోయే ఏకాంత భయానక శిక్ష అది. గది తలుపులు మూసి, సూర్యరశ్మి కూడా సోకకుండా ఒంటరితనంతో గడపవలసిన శిక్షా విధి అది. అంతేకాక ఆమె ఏకాంత భయానక శిక్షావాసం ఏర్పాటు పక్కనే మరణశిక్షకు గురయిన నరహంతక ఖైదీల ఆవాసపు ఏర్పాట్లు ఉండేట్లుగా ఆమె జైలు గదిని ఏర్పరిచారు.

తమకు మరణశిక్ష అమలు జరిపే రోజు దగ్గర పడుతున్నకొద్దీ ఆ మానవ హంతకులు రాత్రింబవళ్ళు, ముఖ్యంగా రాత్రిళ్ళు ప్రాణాలవిసిపోయేట్లు కరుణాకాతరంగా, భయంకరంగా ఏడుపులు సాగిస్తుండేవాళ్ళు. ఒకరి ఏడుపు విని తక్కిన గదులలోని హంతకులు కూడా పెద్ద పెట్టున ఏడ్చేవాళ్ళు. ఇట్లా ఆ బృంద రోదలను హృదయ విదారకంగా సాగేవి. ఆ ఏడ్పులు విని దుర్గాబాయి హడలిపోవాలని జైలు అధికారుల అభిమతం. రోజూ ఇదే ఘోరం సంభవిస్తుండేది. ఆ ఖైదీలు ఏడుపులు అణచుకొంటూ మధ్యమధ్య జైలు అధికారులను పరమఘోరమైన తిట్లు, నిందా వాక్యాలు, అశ్లీలాలతో దూషిస్తూ ఉండేవాళ్ళు. అవన్నీ వినవలసి వచ్చేది దుర్గాబాయికి. వజ్రాదపి కఠోరాణి చేసుకొన్నది ఆమె హృదయాన్ని. మరి ఏమి చేయగలదు?

ఆహారం పేరుతో ఒక ఇనుప మూకుడులో ఒక ద్రవపదార్థాన్ని (అంబలో, గంజో) పరమ అపరిశుభ్రంగా వచ్చి తేలుతున్న పురుగులతో సహా అందించేవారని సత్యాగ్రహ ఖైదీల అనుభవాలు ఎందరో రాసుకున్నారు. అట్లానే మూసి ఉన్న తలుపుల కింద ఊచల ఖాళీ ప్రదేశం ద్వారా పదార్థాన్ని దుర్గాబాయి గదిలోకి తోసేవారట, అందుకు నియుక్తులైన జైలు సిబ్బంది.

ఇది చాలక రోజూ చాటలో జొన్నలు పోసి పిండి విసరాలని చెప్పి ఆమెకు ఇచ్చేవారుట. గదిలోనే తిరగలి కూడా ఉండేదేమో! లేదా రోలు రోకలి లాంటి సాధనం అమర్చేవారో ఏమో! ఆమెది ఏకాంత వాస శిక్ష కదా? ఇదీ చాలక వారం వారం మిరపకాయలు దంపించే ఏర్పాటు ఉండేదట. ఇటువంటి పరమ క్రూరమైన హింసలతో ఆమె చిక్కి శల్యమైపోవటమే కాకుండా మానసికంగా కుంగిపోయినట్లు ఆమె జీవిత చరిత్రకారులు రాశారు. అటు తరువాత కాలంలో ఆమెకు ‘ఫిట్సు’ (మూర్ఛలు) వచ్చేవనీ, అపస్మారక చేతనావస్థలో స్వాతంత్య్ర గీతాలు, హిందీ పాటలు ఆలపించేదనీ, అప్పగించేదనీ, అసంబద్ధంగా అవచేతన నుంచి మాట్లాడేదని కూడా తెలుస్తున్నది. ఇట్లా వారం వారం కారం దంచడం, జొన్నలు విసరడం వల్ల ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. ఒంట్లో విపరీతంగా వేడి పుట్టి, శరీరంపై కురుపులు వచ్చాయి అవి పెరిగి పుండ్లై చీము నెత్తురులు స్రవించేవి. అయినా ఆత్మబలంతో ఆమె వీటన్నింటినీ భరించేది.

ఇట్లా ఉండగా ఒకరోజు ఆమె కళ్ళ ఎదుటే మరింత ఘోరం జరిగితే అత్యంత సాహసంతో ఆమె దాన్ని నివారించింది. దుర్గాబాయి నిర్బంధితురాలైన అరగది పక్కనే ఇంకొక అరగది ఉండేది. అయితే వాటిని వేరు చేస్తున్న గోడ మాత్రం ఒక మనిషి ఎత్తు మాత్రమే

ఉండేది. ఈ గోడపై నుంచి కప్పు వరకు రెండు గదులను విడివిడిగా ఉంచుతూ ఒక తడిక ఉండేది. ఒకరోజు ఇంకా ఊరంతా సద్దు మణగలేదు, నిశి రాత్రి కాలేదు, ఆమెకు ప్రాణం సొమ్మసిల్లి కటిక నేల మీదనే ఒక బొంతపైనో, ఈతాకుల చాపమీదనో నిద్రలో కూరుకొని పోయింది. ఇంతలో పసిపిల్ల ఏడుపు వినపడింది. ఆ ఏడుపు కూడా విన్నవారి గుండె నీరు కారేలా ఉంది. ఎవరో గొంతు పిసికి కడతేరుస్తున్నట్లు అత్యంత దైన్యంగా ఉంది. దానికి తోడు ఇద్దరు స్త్రీలు ఒకరినొకరు తోసుకుంటూ, తిట్టుకుంటూ, నెట్టుకుంటూ జగడమాడుతున్నట్లు వినిపిస్తున్నది. రాను రాను పసిగుడ్డు రోదనం జాలి పుట్టిస్తున్నది. ఆమెకు మెలకువ వచ్చింది.

దుర్గాబాయి ఇక ఆగలేకపోయింది. ఆ కిరాతకం ఏమిటా అని ఆమె ఒళ్ళు జలదరించింది. ఏ ఆధారంతో ఆ గోడను ఎలా ఎగబ్రాకిందో, ఆ గోడపై ఉన్న తడికను ఎలా నెట్టి వేసిందో గోడ ఎక్కి అవతలవైపు దూకింది.

అవతల గది భాగంలో చూస్తే ఒక స్త్రీ తన సందిట ఉన్న పసిపిల్ల పీక నొక్కుతున్నది. ఇంకొక స్త్రీ ఆ పసిపిల్ల గొంతు నులుముతున్న స్త్రీతో పెనుగులాడుతున్నది. అమిత భయానకమైన దృశ్యం అది. ఇద్దరూ అరుచుకుంటున్నారు. తిట్టుకుంటున్నారు. కొట్టుకుంటున్నారు. ఒకరినొకరు తోసుకుంటున్నారు. పిల్లను రక్షించే ఉద్దేశ్యంతో కాదు, భక్షించే ఉద్దేశంతో (చంపివేసే ఉద్యుక్తతతో ఉంది కన్నతల్లి). ఒక్క ఉదుటున ఆ రాక్షసి తల్లి చేతిలో నుంచి పసిపిల్లను లాక్కుంది దుర్గాబాయి. హృదయానికి హత్తుకొని పొదుపుకున్నది. తన చేతులతో గట్టి రక్షణ కలిగించింది. అయితే ఆ స్త్రీలు ఊరుకోలేదు. ఒక్కుమ్మడిగా ఇద్దరూ కలిసి దుర్గాబాయిపై విరుచుకుపడ్డారు. చేతికందినచోటల్లా ప్రహరిస్తున్నారు, రక్కుతున్నారు, నెట్టివేస్తున్నారు. ఆ తర్వాత దుర్గాబాయికి అర్థమైన విషయం ఏమిటంటే కన్నతల్లే తన పేగు బంధాన్ని, కన్నబిడ్డను గొంతు పిసికి చంపి ఆ నేరాన్ని తన శత్రువుపైకి నెట్టి ఆమెకు మరణశిక్ష పడేందుకు కసితో, క్రోథంతో, ఆ పనికి పూనుకున్నది అని. అక్కడ తానొక్కతే కదా సాక్ష్యం! వాళ్ళిద్దరూ యావజ్జీవ కారాగారశిక్షను అనుభవిస్తున్నారో, లేదా అంతకంటే తీవ్రమైన శిక్షను అనుభవిస్తున్నారో, ఇద్దరినీ ఒకే అరలో ఉంచడానికి జైలు అధికారులు ఏమాలోచించారో, విడివిడిగా చోటు చాలకనో, స్త్రీలే కదా సర్దుకుపోతారులే అనుకున్నారో కానీ ఇలా జరిగింది. ఆ ఇద్దరూ దుర్గాబాయిని తాడనం చేస్తున్నారు, తంతున్నారు. గొడవ గొడవగా గొంతు చించుకుంటున్నారు. ఈ క్రూరమైన తోపులాటలో పసిపిల్లను ఎలాగైనా చంపి పరస్పరం ఆరోపించుకొని తీవ్రమైన శిక్షను రెండోవారు అనుభవించేలా చేయాలని వాళ్ళ రక్కసి అక్కసు.

దుర్గాబాయి భూమ్మీద చేయాల్సిన మహత్కార్యాలు ఇంకా చాలా మిగిలి ఉన్నాయి కనుక ఆమె బతికిపోయింది. ఆ పసిపిల్లల వంటి వారినెందరినో ఆమె రక్షించాల్సి ఉంది. నేరప్రవృత్తిని సమాజంలో నియంత్రించవలసి ఉంది. కాబట్టి ఆ నిశిరాత్రి వేళ జైల్లో కలరా కేసు ఏదో వినికిడి అయి ఉండడం వల్ల ఉన్నతాధికారులు పహరాకి వచ్చారు. ఈ అరుపులు, కేకలు, గందరగోళం వాళ్ళ దృష్టికి వచ్చాయి.

జైలు అధికారులు కఠిన ఏకాంత నివాస శిక్ష అనుభవిస్తున్న దుర్గాబాయి ఆవాసానికి వచ్చారు. కేకలు, అరుపులు వినపడుతున్న గది తాళాలు తెరిపించారు. ఇద్దరు నేరస్తులైన ఆడవాళ్ళు కొడుతుండగా కూర్చుని సర్వశక్తులనూ ఒడ్డి పసిబిడ్డకు ఆచ్ఛాదిస్తున్న దుర్గాబాయిని చూశారు. ‘నువ్విక్కడెందుకున్నావమ్మా?!’ అని ఆమెను అడిగారు. అప్పుడు జైలు అధికారులకు అసలు విషయం తెలిసింది. దుర్గాబాయి సాహసానికి, ఆపన్నివారణ స్వభావానికి, ధైర్య స్థైర్యాలకు అద్భుతం చెందారు. చిత్రప్రతిమలైపోయారు. ఆమె పట్ల గౌరవం, ఆదరం, అభిమానం కలిగాయి వారికి. ఆ పసిబిడ్డకు ప్రథమ చికిత్సలు, వైద్య సదుపాయాలు కలుగచేసి, ఏ అనాథ శరణాలయానికో పంపించే ఏర్పాట్లు చేసి ఉంటారు.

ఇంతటి మహోత్కృష్ట సాహసకార్యానికి, ప్రాణ రక్షణకు, ఆర్ద్ర స్వభావానికి ఆమె పట్ల పరితాపంతో కూడిన జాలితో ‘ఇందుకు గాను నీకు కొంత మేలు చేస్తాము. ఉపకారం చేయడానికి ఆలోచిస్తాము. మీకేం కావాలో చెప్పండి’ అని అడిగారు జైలు అధికారులు. అప్పుడామె తనను ఆ చోటు నుంచి మార్చి సౌకర్యం కలిగించాల్సిందనో, లేదా అనారోగ్యం దృష్ట్యా వైద్య సదుపాయం కలగచేయాల్సిందనో, కఠిన శిక్ష మాఫ్‌ చేయమనో కోరలేదు. ‘ఏమీ తోచకుండా మనస్సు అశాంతి పాలవుతున్నది. పొద్దుపోకుండా

ఉంది. ఒక వీణ తెప్పించి ఇవ్వండి’ అని కోరింది జైలు అధికారులను. వాళ్ళు దిగ్భ్రమ పాలై ఉంటారు. నివ్వెరపోయి ఉంటారు.

ఆమె కోరినట్లే ఆమెకు వీణను తెచ్చిపెట్టారు. అప్పటినుంచి ఆమె పట్ల జైలులో గౌరవాభిమానాలు, అభిమానం పెరిగాయి. ఏ ప్రశాంత నిశీధ సమయాన్నో, చల్లని తెల్లతెల్లని ఉషఃకాల స్వాగత పూర్వకంగానో కాసేపు ఆమె వీణ వాయిస్తూ తన్మయురాలవుతుంటే ఆ వీణా స్వననిస్వనం ప్రసరించినమేర జైలు ఖైదీలకు జోలపాటలాగా ఉండేది, తల్లి మనసులాగా అనిపించేది.

ఆరు నెలల శిక్షే కాబట్టి ఆ శిక్షా కాలం ఆ తర్వాత త్వరలోనే ముగిసి ఉంటుంది. దుర్గాబాయి విడుదలై ఉంటుంది. కానీ ఆమె కృశీభూతదేహం మాటేమిటి? ఆమె ఫిట్స్‌ మాట ఏమిటి? అవి ఆమెను చాలాకాలం వెన్నంటాయి. మధుర జైలు నుంచి ఆమె విడుదల పొందినప్పుడు ఆమె తమ్ముడు ఆమెను తన చేతులపై ఆసరా ఇచ్చి వెలుపలికి తీసుకొని రావలసి వచ్చిందని దుర్గాబాయి జీవిత చరిత్ర రచయితలు చెబుతున్నారు.

మధురలో మీనాక్షి అమ్మవారు కొలువై ఉంది. తన పేరే పెట్టుకున్న ఈ దుర్గ తల్లికి ఈ చెర ఎందుకు? చెరసాల శిక్ష ఎందుకు? శుంభ నిశుంభ అసురగణాన్ని ఈ శక్తి స్వరూపిణి అహింసా వ్రతాచారణంతో ఎట్లా జయిస్తుందో పరీక్షించడానికి కదా! ‘నిష్కోధా, క్రోథశమనీ, సాంద్రకరుణా, సర్వజ్ఞా, సమానాధికవర్జితా’ అని తన స్తుతి నామాలను ఎంతవరకు నిరూపిస్తుందో చూడడానికా?

1933లోనే దుర్గాబాయి మధుర కారాగారం నుంచి విడుదలైంది. ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోయింది. ఇక ఎక్కువరోజులు జీవించదేమో అనే దుఃఖభీతి ఆమె తల్లినీ, తమ్ముడ్నీ కుంగతీసింది.

అప్పట్లో డా.రంగాచారి దక్షిణాది అంతటా పేరు మోసిన గొప్ప డాక్టరు. వైద్య చికిత్స కోసం దుర్గాబాయి కుటుంబం ఆయనను ఆశ్రయించింది. ‘ఇక దుర్గాబాయి రాజకీయాలకు స్వస్తి చెప్పాలి. ఉద్యమాలకు ఉద్వాసన పలకాలి.

ఉద్వేగం, ఉద్రేకం, ఉత్తేజం కూడనే కూడవు. సాధ్యమైనంతవరకు ఉల్లాసంగా ఉండడానికి ప్రయత్నించాలి. పాత జ్ఞాపకాలన్నీ పదిలంగా తుడిచివేయాలి. జైలు జీవితాన్ని మరచిపోవాలి. మనస్సుని ప్రశాంతంగా

ఉత్సాహంగా ఉంచే ఏదైనా వ్యాపకం చూసుకోవాలి. సభలకూ, సమావేశాలకూ అసలే పోకూడదు’ అని ఆయన దుర్గాబాయి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి చెప్పాడు. ఆమె కోలుకోవాలంటే ఇంతకు మించిన చికిత్స లేదని కూడా చెప్పాడాయన.

అప్పటికి 1934వ సంవత్సరం వచ్చేసి ఉంటుంది. దుర్గాబాయి నెమ్మదిగా, నింపాదిగా ఆలోచించింది. పరిస్థితులను ఆకళింపు చేసుకుంది. నియత విద్యార్జనపై ఆమె మనసు మళ్ళింది. ఎంతవరకు చదువుకోగలిగే వీలుంటే అంతవరకు చదువుకోవాలనుకొంది. స్వావలంబనం, స్వశక్తి, ఆర్థిక స్వాతంత్య్రం సంపూర్ణంగా సముపార్జించుకోవాలనుకొంది. ‘ప్రారబ్దార్థము లుజ్జగింపరు కదా ప్రజ్ఞానిధుల్‌ గావునన్‌’ అన్నాడు భర్తృహరి. నిజమే! తాను నిశ్చయంగా విద్యార్జనకు పూనుకొంది. అయితే తనకు చదువు చెప్పేవారెవరు?

కాంగ్రెస్‌ పెద్దలకు ఆమె ఇప్పుడు చదువు మొదలుపెట్టడం ఇష్టం లేదు. ఆమె అప్పటికే స్వాతంత్య్రోద్యమంలో అఖిల భారత స్థాయి సముపార్జించింది. ఉద్యమానికి ఆమె గొప్ప అండదండలు చేకూర్చింది. బులుసు సాంబమూర్తిగారికైతే ఆమె ఏ పాఠశాలలోనో, ఏ విద్యాసంస్థలోనో చేరి చదవటం అసలు ఇష్టం లేదు. కానీ ఆయన పరిస్థితులను అర్థం చేసుకున్నాడు.

అప్పట్లో గోపరాజు రామచంద్రారావు (గోరా) అని సంఘ సంస్కరణాభిలాషి ఉండేవారు. ఆయన మేధావి. ఉదార హృదయుడు. ఉదాత్త భావ సంపన్నుడు. మనీషి. సమ సమాజ భావనకు, కుల రహిత, మత రహిత, దైవ భావన రహిత సంస్కారం అలవడాలనీ, పెంపొందాలనీ ఆయన నిష్కర్ష. ఇందుకోసం ధైర్యంగా, ఎటువంటి ఆటంకాలైనా ఎదుర్కోవడానికి ఆయన ఆచరణాత్మకంగా సిద్ధపడ్డాడు. చెప్పింది చేసి చూపాడు. త్రికరణశుద్ధి గల గొప్ప వ్యక్తి. కాకినాడలోని పిఠాపురం రాజావారి కళాశాలలో ఆయన వృక్షశాస్త్రం బోధించే ఆచార్యుడిగా పనిచేసేవారు. ఆయన సిద్ధాంతాలు, బోధనలు, ఆచరణలు సమాజానికి రుచించకపోయినా ఆయన జంకలేదు. కళాశాల విద్యార్థులు ఏ కొంచెమైనా ఆయనను ఆదర్శంగా తీసుకొంటారేమోనని కళాశాల పాలకవర్గం ఆయనను ఉద్యోగం నుంచి తొలగించింది. ఆయన స్వాతంత్య్రోద్యమంపట్ల నిష్ట కలవాడే. జాతీయోద్యమం పట్ల సానుభూతి పరుడే. కానీ నాస్తికవాది. తన సిద్ధాంతం ప్రచారం చేసేవాడు. అంటరానితనం రూపుమాసిపోవడానికీ, వాళ్ళలో అభ్యుదయ చైతన్యం కలిగించడానికి ఆయన కృషి చేసేవాడు. తద్వారా ఆయన కాంగ్రెస్‌ ఉద్యమ కర్తలకు కొంతవరకు సన్నిహితుడే. ఖద్దరు ప్రచారం, అస్పృశ్యత నిర్మూలన, కులభేదాలు పాటించకపోవడం ద్వారా శ్రీ గోరా కాకినాడ సమాజంలో ప్రముఖ వ్యక్తి అయ్యాడు. కళాశాల అధ్యాపక వృత్తి నుంచి ఆయన నిర్బంధ పదవీ విరమణ చేసిన తర్వాత ప్రైవేటుగా, విద్యార్థులకు బెనారస్‌ విశ్వవిద్యాలయం మెట్రిక్‌ పరీక్షలకు తర్ఫీదు ఇస్తుండేవారు. కాంగ్రెస్‌ ప్రబోధాలలో, కార్యక్రమాలలో కొంతవరకు పాల్గొంటూ ఉండేవారు. వెనుక ఎప్పుడో తాను చదువుకోవడం సాగిస్తానని దుర్గాబాయి తన అభీష్టం ప్రకటించినప్పుడు అందుకు అంగీకరించమని బులుసు సాంబమూర్తిగారు ఇప్పటి ఆమె ఆరోగ్యం, కుటుంబ పరిస్థితుల దృష్ట్యా గోరా గారిని ఆమెకు చదువు చెప్పి బెనారస్‌ విశ్వవిద్యాలయం మెట్రిక్యులేషన్‌ పరీక్షకు సిద్ధపరచవలసిందిగా అర్థించారు. ఆమె సామాజిక స్థాయి, కార్యక్రమాలను బట్టి ఆమె ఇంటికి వెళ్ళి చదువు చెప్పడానికి గోరా ఆమోదించారు. ఎప్పుడైనా ఆమె కూడా ఆయన ఇంటికి వెళ్ళి పాఠాలు అభ్యసించేదేమో! దుర్గాబాయి భర్త సుబ్బారావు గారు కూడా ఆమె చదువుకోవడానికి చాలా దోహదం చేసేవారు. అందుకు సర్వాత్మనా సహకరించారు. ఈ విధంగా తనకు 24, 25 ఏళ్ళ వయసున్న దుర్గాబాయి ఎప్పుడో ఆగిపోయిన తన చదువు లోకరీతిని మళ్ళీ ప్రారంభించింది. అది ఆమె జీవితంలో గొప్ప మలుపు. భారతదేశ సాంఘిక సంక్షేమ ప్రగతిలోనే గొప్ప మలుపుగా భావించాలి. అడపాదడపా స్వాతంత్య్రోద్యమంలో, కార్యకర్తల అభ్యర్థన మేరకు ఆమె పాల్గొంటూనే ఉండి ఉండవచ్చు. కానీ ‘నిశ్చితార్దంబు వదలరు నిపుణమతులు’ అన్నట్లు తన చదువు పట్లనే ఆమె శ్రద్ధనంతా కేంద్రీకరించింది.

8. విద్యావ్యాసంగం

ఎంత కాదనుకొన్నప్పటికీ కాంగ్రెస్‌ సభలకూ, సమావేశాలకూ ఆమె హాజరు కాక తప్పేది కాదు. హిందీ ప్రచారంలో కూడా పాల్గొనక తప్పదు. పరీక్షలు రాయడానికి పూర్తిగా ఏడాది కూడా వ్యవధి లేదు. గోరా కొంచెం అసంతృప్తి చెందుతూ ఉండేవారు ఆమె తన పరీక్షను ఎలా గట్టెక్కిస్తుందా అని.

మెట్రిక్యులేషన్‌ పరీక్ష రాయాలంటే ఐదు పఠనీయ విషయాలు ఎన్నిక చేసుకోవలసి ఉండేది ఆ రోజుల్లో. లెక్కలు అక్కర్లేకపోవడం ఒక ఊరట, ఒక సౌలభ్యం. ఇంగ్లీష్‌, హిందీ, వృక్షశాస్త్రం, భూగోళ శాస్త్రం, శరీర శాస్త్రంలను దుర్గాబాయి పరీక్ష విషయాలుగా ఎంచుకుంది. ఆమె ఏకసంధాగ్రాహి. జట్టు విద్యార్థినులతో ఆమె బెనారస్‌ వెళ్ళింది పరీక్ష రాయడానికి. కానీ ఇంతలో ఒక అవాంతరం వచ్చింది. సరిగ్గా పరీక్షల సమయానికి ఆమెకు అస్వస్థత – ఒంటిమీద తడపర (ఆటలమ్మ, మీజిల్స్‌) వచ్చింది. కానీ ఆమె ధైర్యస్థురాలు కావడం వల్ల అప్పటి కాశీ విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులు పండిత మదనమోహన మాలవ్యజీని కలుసుకొని తన అస్వస్థతను తెలయజేసింది.

మాలవ్యాజీ ఉదార సహృదయుడు. ఉదాత్త సంస్కారం కలవాడు. విద్యార్థి లోకాన్ని ఎంతో వాత్సల్యంతో చూసేవారు. అదీకాక దుర్గాబాయిని గురించి ఆ రోజుల్లో కాంగ్రెస్‌ జాతీయోద్యమం వారందరికీ బాగా తెలుసు కదా! ఢిల్లీ నుంచి పల్లెదాకా ఆమె పేరు సుపరిచితమే కదా! దక్షిణాది ఉప్పు సత్యాగ్రహపు ధీరవనితను గురించి ఆయనకు పూర్వమే తెలిసి ఉంటుంది. ఆ మహానుభావుడు ఆమె విడిగా కూర్చుని పరీక్ష రాసే ఏర్పాట్లు చేశాడు. దుర్గాబాయి పరీక్ష పేపర్లన్నీ చక్కగా రాసింది. ప్రథమ శ్రేణికి కొంచెం తక్కువ మార్కులతో కృతార్థురాలైంది. ఆమె చదువు మొదలుపెట్టేప్పుడే గోరా హెచ్చరించారు. ‘ఒక్క మెట్రిక్యులేషన్‌ పరీక్షతోనే ఆగకూడదు. ఎం.ఎ. దాకా నిరాఘాటంగా సాగిస్తేనే నేను చదువు చెప్పటానికి ఇష్టపడతాను’ అని ఆయన ఇదివరలో చెప్పే ఉన్నారు.

ఆమె బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయంలోనే ఇంటర్మీడియట్‌ కొనసాగించింది. అక్కడ స్త్రీలకు హాస్టల్‌, వసతి సౌకర్యమూ ఉన్నాయి. ఎక్కడ ఉన్నా, ఏ పనిలో ఉన్నా ఆమెకు ఆత్మవిశ్యాసం, ఆత్మాభిమానం అధికం. అప్పట్లో మహిళలు హాస్టల్‌లో ఫలానా వేళ తర్వాత హాస్టల్‌ విడిచి బయటకు పోకూడదనీ, ఫలానా వేళ తర్వాత హాస్టల్‌లోకి ప్రవేశించకూడదనీ వసతి గృహ విద్యార్థినులు కొన్ని వేళలు నిర్బంధంగా పాటించవలసి ఉండేది. హాస్టల్‌ విద్యార్థినులకూ, దుర్గాబాయికి ఈ నిర్బంధ బంధనాలు నచ్చలేదు. జాగ్రత్తలు ఉండడం మంచిదే. నియత వేళలు పాటించడం అవసరమే కానీ, కర్ర పుచ్చుకుని కాపలా ఉన్నట్లు సెలవు రోజుల్లో కూడా ఈ వేళలు పాటించి తీరాల్సిందే. ఏ కొంచెం ఇందుకు భిన్నంగా జరిగినా విద్యార్థినులను హాస్టల్‌లోకి రానీయమనడం బాగాలేదనిపించింది. ఈ నిబంధనలను సడలించేట్లు, సరళీకృతం చేసేట్లూ ఆ సంబంధిత అధికారులకు ఆమె నచ్చచెప్పగలిగింది. ఆమెకు ఉచిత భోజనం, గృహ వసతి సౌకర్యం, ఉచితంగానే విశ్వవిద్యాలయంలో విద్యార్జన చేయగల వెసులుబాటు లభించాయి. కాబట్టి చదువు సాగించడం ఆర్థికంగా సమస్య కాలేదు. మాలవ్యాజీ తన విశ్వవిద్యాలయ విద్యార్థులందరి పట్లా ఆత్మీయ భావంతో చనువుగా, ప్రేమాభిమానాలతో వ్యవహరించేవారు. దుర్గాబాయి అంటే ఆయనకు ప్రత్యేకమైన అభిమానం.

ఈ లోపు కాకినాడలో దుర్గాబాయి కుటుంబంలో ఒక సమస్య వచ్చి పడింది. ఆమె తమ్ముడు నారాయణరావు అప్పుడు కాకినాడ కళాశాలలో చదువుతుండేవారు. ఆయన తన స్నేహితులు, ఇంకా కొందరు పెద్దవారి ప్రోత్సాహం, సహాయ సహకారాలతో సమాజంలోని చెడులను, పెద్దమనుషులం అనుకునేవారి వంచనలను, స్వార్థ ప్రయోజనా కాంక్షలను బహిరంగపరచే ఒక లిఖిత పత్రికను నిర్వహిస్తూ

ఉండేవారు. ఆ పత్రిక పేరు ‘క్రిటిక్‌’. ఈ పత్రికలో నాస్తిక సిద్ధాంత ప్రబోధ వ్యాసం రాసినందుకే కాలేజీ యాజమాన్యం గోరాగారిని ఉద్యోగం నుంచి తొలగించింది. ‘క్రిటిక్‌’ పత్రిక ఒక సంచికలో కళాశాల నిర్వహణ తీరును, పెద్దల అపభ్రంశపు తీరును నారాయణరావు విమర్శించారు. అందువల్ల కళాశాల నుంచి నారాయణరావును బర్తరఫ్‌ చేశారు. కృష్ణవేణమ్మ గారు (దుర్గాబాయి తల్లి) వెళ్ళి కళాశాల యాజమాన్యం పెద్దలను, ప్రిన్సిపాల్‌ను కలిసి కొంత ఔదార్యం చూపించవలసిందని అర్థించినా దాన్ని వారు పెడచెవిన పెట్టారు. కుటుంబానికి ఆధారం కావలసిన నారాయణరావు చదువు నిమిత్తమైనా, తల్లీ కొడుకులు కాకినాడను విడిచిపెట్టవలసి వచ్చింది. అంతేకాక బి.ఎ.లో ఒక సంవత్సరం మళ్ళీ చదవవలసి వచ్చింది. కృష్ణవేణమ్మగారు అధైర్యపడలేదు. వాళ్ళు కాపురాన్ని రాజమండ్రికి మార్చారు. అక్కడ కళాశాలలో చేరారు నారాయణరావు. ఈ విధంగా నారాయణరావు చదువు ఒక యేడు నష్టమైంది. రాజమండ్రిలో జాతీయ బాలికా పాఠశాలలో హిందీ అధ్యాపకురాలిగా పనిచేస్తూ కృష్ణవేణమ్మగారు కుటుంబాన్ని పోషించవలసి వచ్చింది. దుర్గాబాయి బెనారస్‌లో రెండో సంవత్సరం ఇంటర్మీడియట్‌ చదువుతున్న నాటి పరిస్థితులవి. నారాయణరావు బి.ఎ. చదువు పూర్తికాగానే ఆయన కూడా బెనారస్‌లో ఎం.ఎ. చదవటానికి వెళ్ళారు.

దుర్గాబాయి ఇంటర్మీడియట్‌లో ప్రథమ గణ్యతతో ఉత్తీర్ణురాలైంది. అక్కడే ఆమె రాజనీతి శాస్త్రంలో బి.ఎ.(ఆనర్స్‌) కూడా చదవాలని కుతూహలం చూపింది. అయితే మాలవ్యాజీ అందుకు అవకాశం కల్పించలేదు. మహిళలు రాజనీతి శాస్త్రం చదవడమేంటి? అనే అభ్యంతరం అలా ఉంచి విశ్వవిద్యాలయంలో అటువంటి సంప్రదాయం లేదు, ఏర్పాటు లేదు. పురుష విద్యార్థులు చదువుకోవటానికి ఆనర్స్‌ కోర్సులో ఆ అవకాశం ఉంది కానీ, స్త్రీల తరగతులలో ఆ అధ్యయన విషయం లేదు. ఏకైక విద్యార్థినిగా పురుషుల తరగతులలో ఆమె చదవడానికి మాలవ్యా పండతుడికి సమ్మతం కాకపోయింది. మరే కోర్సులోనైనా చేరవలసిందనీ, దానికి తగిన సహకారం, ఉచితంగా చదువుకునే ఏర్పాటు తాను కలిగించగలనని వైస్‌ ఛాన్సలర్‌ భరోసా ఇచ్చినా దుర్గాబాయికి అంగీకారం కాకపోయింది మాలవ్యాజీ ప్రతిపాదన. ఆమె బెనారస్‌ విశ్వవిద్యాలయం విడిచిపెట్టక తప్పలేదు. నారాయణరావు మాత్రం అక్కడే తన ఎం.ఎ. చదువు సాగించాడు.

దుర్గాబాయి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో రాజనీతి శాస్త్రం చదువుదామని వచ్చింది. విశ్వవిద్యాలయం పెద్దలను కలిసింది. అప్పటి వైస్‌ ఛాన్సలర్‌ కట్టమంచి రామలింగారెడ్డి. ఆమె విశ్వవిద్యాలయంలో ప్రవేశించడానికి తనకు అంగీకారమే అయినా, ఆడవారికి భోజన, వసతి గృహం లేదే అని ఆయన ఆమె ఆనర్స్‌ రాజనీతి శాస్త్రం కోర్సులో చేరడానికి సౌముఖ్యం చూపలేదు. అటువంటి సొంత ఏర్పాటు ఏదో తాము చేసుకుంటే తనకు ‘సీటు (ప్రవేశం)’ ఇస్తారా?! అని అడిగింది దుర్గాబాయి రెడ్డిగారిని. దానికేం! అని ఉంటారు రెడ్డిగారు. ఎనిమిదేళ్ళ వయసు నుంచే విద్యాసంస్థ నిర్వహణలో రాటుదేలిన దుర్గాబాయికి ఈ సమస్య పరిష్కరించడం ఒక లెక్కలోనిది కాదు. ఆమె వెంటనే పత్రికి ప్రకటన ఒకటి వెలువరించింది. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చదువుకునే విద్యార్థినులకు హాస్టల్‌ (ఆవాస, భోజన సౌకర్యం) సదుపాయం గురించి ఆలోచిస్తున్నామని, ఆసక్తి కలవారు అంటే అందులో చేరదలచి ముందుకొచ్చేవారు స్పందించగలరు అని ఆ ప్రకటన సారాంశం. ఆమె ఆశించినట్లే పది, పన్నెండు మంది అభ్యర్థులు అందుకు సిద్ధపడ్డారు. ఇకనేం! హాస్టల్‌ను ఏర్పాటు చేసింది దుర్గాబాయి. మళ్ళీ వెళ్ళి రెడ్డిగారిని కలిసి తన ప్రవేశార్హతను నిరూపించగా కట్టమంచి వారు రాజనీతి శాస్త్రంలో ఆనర్స్‌ కోర్సు చదవటానికి ఆమెకు అనుమతించారు. స్వయంగా దుర్గాబాయి చొరవ తీసుకుని విద్యార్థినుల వసతి గృహం ఏర్పాటు చేసిందే, అది తమకు చిన్నతనం అనుకున్నారో ఏమో డా|| కట్టమంచి రామలింగారెడ్డి గారు ఐదారు నెలల్లోనే విశ్వవిద్యాలయం తరపునే అటువంటి హాస్టల్‌ నిర్వహించడానికి సంసిద్ధులైనారు. ఇక దుర్గాబాయికి ఆ సమస్య తీరిపోయింది.

మూడేళ్ళు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో రాజనీతి శాస్త్రంలో ఆనర్స్‌ చదివింది. మామిడిపూడి వేంకట రంగయ్యగారు ఆ కోర్సుకు ప్రధానాధ్యాపకులు. శ్రీ వేంకట రంగయ్యగారి స్వీయ చరిత్రలో ఈ ముచ్చట్లన్నీ ఉన్నాయి. దుర్గాబాయమ్మ ఆ రోజుల్లో తనకు పుత్రికాప్రాయంగా తమ ఇంట్లో మెలిగేదని ఆయన చెప్పారు. ఇంటిల్లిపాదికీ ఆమె ఎంతో అభిమానపాత్రురాలని ఆయా సన్నివేశాలను ఆయన వివరించారు. అప్పటికి 1937 సంవత్సరం కూడా గడిచిపోయి ఉంటుంది. బ్రిటిష్‌ ప్రభుత్వపు నూతన రాజ్యాంగ ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఎన్నికలు వచ్చాయి. బాధ్యతాయుత ప్రజా ప్రభుత్వం మద్రాసు రాష్ట్రానికి వచ్చింది. శాసనసభ వచ్చింది. సి.రాజగోపాలాచారి ముఖ్యమంత్రిగా, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు రెవెన్యూ మంత్రిగా కొత్త ప్రభుత్వం ఏర్పడింది. బులుసు సాంబమూర్తిగారిని రాష్ట్ర శాసనసభకు సభాధ్యక్షుడు (స్పీకర్‌)గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సాంబమూర్తిగారు దుర్గాబాయి సోదరుడు నారాయణరావును తన వ్యక్తిగత సహాయక కార్యదర్శిగా నియామకం చేసుకున్నారు. అప్పటికి వారణాసి విశ్వవిద్యాలయం నుంచి ఆయన ఎం.ఎ. పట్టభద్రులైనారు.

దుర్గాబాయి కుటుంబం మద్రాసుకు చేరుకుంది. రాజనీతి శాస్త్రంలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రథమ గణ్యతతో కృతార్థురాలైన దుర్గాబాయి కూడా చెన్ననగరం చేరుకుంది. ఆమెకు బి.ఎల్‌. కూడా పూర్తి చేయాలని ఆకాంక్ష. స్థిర సంకల్పురాలైన దుర్గాబాయి వంటి గొప్ప వ్యక్తులు సిద్ధసంకల్పులు కూడా అవుతారు. వాళ్ళు మధ్య మధ్య ఎదురయ్యే ఎటువంటి ప్రలోభాలను లెక్కచేయరు. ‘తనిసిరే వేల్పు లుదధి రత్నముల చేత’ అన్నాడు కదా భర్తృహరి.

1937 సంవత్సరం ఎన్నికల జోలికి పోలేదు దుర్గాబాయమ్మ. వాటిని గురించి పట్టించుకోలేదు. ఆమె ఎన్నికలలో పోటీ చేసి శాసనసభలో ప్రవేశించి ఉంటే ఏదో ఒక పదవి చిన్నదో పెద్దదో లభించి ఉంటే ఆమె మహత్తర ప్రతిభ అంతా విపథమైపోయి ఉండునేమో! ఆంధ్ర మహిళా సభ వంటి గొప్ప సంస్థలను నిర్మించటంలో ఇంకా ఆలస్యం జరిగి ఉండునేమో! వెనుకబడిపోయి ఉండునేమో! చెన్ననగర శాసనసభ ప్రభుత్వం మూణ్ణాళ్ళ ముచ్చటే అయింది. ఇంతలో రెండో ప్రపంచ యుద్ధ మేఘాలు కమ్ముకొచ్చాయి. బ్రిటిష్‌ ప్రభుత్వం భారతీయుల అంగీకారం, సమ్మతి లేకుండానే యుద్ధ ప్రయత్నాలలో భారతదేశాన్ని నిమగ్నం చేసింది. యుద్ధ సన్నద్ధ ప్రచారం, సన్నాహ చర్యలు ప్రారంభించింది. ఇందుకు నిరసనగా రాష్ట్ర ప్రభుత్వాలు రాజీనామా చేశాయి. మళ్ళీ సత్యాగ్రహోద్యమం ప్రారంభమైంది. బి.ఎల్‌. చదువుతున్న దుర్గాబాయి మళ్ళీ స్వాతంత్య్రోద్యమ రాజకీయాల జోలికి వెళ్ళలేదు, పట్టించుకోలేదు.

1937వ సంవత్సరం నుంచే ఆమె తల్లి, తమ్ముడూ చెన్నపట్నం వాస్తవ్యులైనారు కదా! అప్పుడు మద్రాసులో, 14 ద్వారకాలో

ఉండేవారు. అంటే ఇంటి చిరునామా అది. ఆ కాలనీ పేరు బృందావన కాలనీ. అది మైలాపూరులో ఉండేది. చుట్టూ విశాలమైన ఆవరణ, వెనుకవైపు బోలెడే ఖాళీ పెరడు ఉండేవి. ఎటు చూసినా పూల మొక్కలు తమ అందమైన వన్నె వన్నెల పూలతో చూపరులను పలుకరించేవి. స్పీకరు గారి కార్యదర్శిగా నారాయణరావుగారి వసతి గృహం కదా అది. ఇంట్లో కొడుకూ, కోడలు, ఒక చంటి పాపతో ఉండే కృష్ణవేణమ్మగారికి పొద్దుపోవడం ఎట్లా? ఆమెది పని లేకుండా కాలక్షేపం చేసే స్వభావం కాదు కదా! మందగించక ముందుకడుగు వేసే స్వభావం కదా! అయినప్పటికీ చెన్నై (అప్పుడు మద్రాసు) చేరగానే ఆమె సేవాసదనంలో హిందీ అధ్యాపకురాలిగా చేరిపోయారు. శెలవు రోజులేం చేయాలి? రికామీగా కాలం గడపడమెలా? అసలే ఆమెది నలుగురిని పోగుచేసి కాలం సద్వినియోగం చేసే స్వభావం. ఆమె దుర్గాబాయి తల్లిగారు కానీ మరొకరు మరొకరు కాదే! చుట్టుపక్కల ఇళ్ళవాళ్ళు వచ్చి ఆమెతో ఆప్యాయత పెంచుకునేవారు. వాళ్ళకామె పాటలు నేర్పేది, హిందీ నేర్చుకోండని ప్రోత్సహించేవారామె. బొమ్మలు ఎలా వేయాలో శిక్షణనిచ్చేది. ముగ్గులు వేయడంలో ప్రావీణ్యం నేర్పేది.

చుట్టుపక్కల ఇళ్ళవారి పిల్లలు ఇళ్ళలో ఉండేది తక్కువా, ఆమె చుట్టూ చేరేది ఎక్కువా అయింది. ఆ ముచ్చట్లు వాళ్ళు ఇంటికి వెళ్ళి చెబుతుండేవారు. కథలు విన్పిస్తుండేవారు. మురిపెంగా బొమ్మలు, ముగ్గులు గీసి తల్లికీ, తండ్రికీ చూపేవారు. నేర్చుకున్న పాటలు పాడి వినిపించేవారు. పిల్లలలో చలాకీతనమూ, చురుకుతనం, హుషారు, ఉల్లాసమూ రోజు రోజుకూ ఎక్కువవుతుండడం చూసి ఆ పిల్లల తల్లులు కూడా కృష్ణవేణమ్మ గారి చుట్టూ చేరడం, ఆమె పాటలు వినడం, కథలు ఆలకించడం అలవాటు చేసుకున్నారు. ఆ విధంగా అక్కడ ఒక పాఠశాల వాతావరణం నెలకొంది. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న సంవత్సరాలలో మధ్య మధ్య సెలవులకు దుర్గాబాయి మద్రాసు వచ్చేది. తమ కుటుంబంలో జరుగుతున్న కాలక్షేపాలతో ఆమె సంబరపడేది. ఆ పిల్లలకూ, తల్లులకూ హిందీ, తెలుగు పాటలు, నాటకాలు, ప్రదర్శనలలో అభిరుచి కల్పించేది, వాళ్ళతో కలిసిపోయేది.

1938 వ సంవత్సరంలో చెన్నపట్నానికి ఆకాశవాణి కేంద్రం వచ్చింది. ఆకాశవాణి కేంద్ర ప్రసారాలకు, ముఖ్యంగా స్త్రీల కార్యక్రమాలకు, బాలానందం కార్యక్రమాలకు దుర్గాబాయి, ఆమె తల్లిగారు కృష్ణవేణమ్మ తమ ఇంట్లో గుంపు కడుతున్న చిన్నపిల్లలకూ, తల్లులకూ శిక్షణనిచ్చే వాళ్ళు. ఆయా కార్యక్రమాలకు తర్ఫీదునిచ్చేవారు. తమ సంస్థకు వాళ్ళు ‘లిటిల్‌ లేడీస్‌ క్లబ్‌ ఆఫ్‌ బృందావన్‌’ అని పేరు పెట్టుకున్నారు. కిశోర శిశు వినోదోల్లాస బృందావనం అన్నమాట అది. నగరమంతా వీళ్ళ ఖ్యాతి తెలిసింది. ఆయా ప్రాంతాలలో చిన్న చిన్న శాఖలుగా కూడా వీళ్ళ కార్యక్రమాలు ఏర్పాటయ్యాయి. దుర్గాబాయి వచ్చినప్పుడు వీళ్ళ సందడి మరీ ఎక్కువయ్యేది. నగరంలో సాంస్కృతిక కార్యక్రమాలలో, దసరా వేడుకలలో వీళ్ళచేత ప్రదర్శనలు ఇప్పించేది దుర్గాబాయి. అదీ వాళ్ళ సరదా. ఉత్సాహం, ఉబలాటం, పెద్దలకూ, పిల్లలకూ కూడా వేడుక.

దుర్గాబాయమ్మ తన ఇరవై నాలుగో యేట డిగ్రీ చదువులలో ప్రవేశించి ఆరేడేళ్ళలో ఎం.ఎ, బి.ఎల్‌ అయింది. అదీ ఆమె ప్రజ్ఞ, ప్రతిభ, ప్రావీణ్యత. ‘డిగ్రీలు లేని పాండిత్యము వన్నెకు రానట్టి’ పాడు కాలాన్ని ఆమె ఎంతో మంచికాలంగా పరిణమింపచేసింది

(ఇంకా ఉంది)

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.