పండగొచ్చి పోగానే
అప్పటి వరకూ సీతాకోకల సమూహాలతో హోరెత్తిపోతూ వెలిగిన ఇల్లు
ఉన్నట్టుండి చీకటిని కౌగిలించుకుంది
మొన్నటి వరకూ సందడి సందడిగా ఉన్న ఆమెను
ఆమె లేనితనాన్ని
వెళ్ళిపోయాక గుర్తించగలిగాను
వీథిలోని విశేషాలను విన్నా వినకపోయినా
చిక్కని కాఫీతో పాటు
కట్టేసిన మోగే రేడియోలా ఆమె
చెవులలోకి కమ్మగా ఒంపేది
ఒక మనిషి లెక్క తగ్గితే
బ్రతుకులో ఇంత కొలవలేనంత శూన్యం ఆవహిస్తుందని తెలీనే తెలీదు
జీవితంలో మొట్టమొదటిసారి నేను లెక్క తప్పినట్టే అనిపించింది
నన్ను ఆలంబనగా చేసుకుని ఆమె పందిరిలా అల్లుకుందని
ఇన్నాళ్ళూ మిడిసిపడ్డాను
ఆమెను పునాదిగా చేసి నేను బలపడ్డానని
గుర్తించనే లేదు
నిశ్శబ్దం కమ్ముకున్న గదిలోని గుబులు పొగతో
గుండె అంతా మసిబారింది
ఫాను రెక్కలల్లారుస్తూ
పైకప్పుకు వేళ్ళాడుతున్న గబ్బిలంలా అగుపిస్తోంది
కిటికీలోంచి చూసిన దృశ్యాలనే చూసి చూసి
చూపులు అరిగిపోయి చత్వారం వచ్చింది
ఆమె సున్నా నేను ఒకటిననే గర్వంతో
నా పక్కన నిలబడితేనే ఆమెకు విలువ అని
ఇన్నేళ్ళూ తలపోసాను
ఆమె లేక ఇప్పుడు ఒంటరి అంకెలా
సాయంసంధ్యపు మలుపులో
ఆమె తలపుల వలలో చిక్కి చేపపిల్లలా కొట్టుకుంటున్నాను
మొట్టమొదటిసారి
చేతులలోకే కాదు
హృదయంలోకి కూడా ఆమె చిత్రాన్ని తీసుకుని
వాకిట్లో కన్నీళ్ళతో నిలబడ్డాను
ఇప్పుడు పండగ కోసమో పబ్బం కోసమో కానేకాదు
చెప్పుల్లో కాళ్ళు పెట్టుకుని
ఆమె పిలుపు కోసం ఆతృతగా ఎదురుచూస్తూ…