అమ్మా నన్ను కన్నందుకు… నువ్వు అనుభవించిన పురిటినొప్పుల బాధ తెలియదు నాకు…
నన్ను పెంచడానికి నువ్వనుభవిస్తున్న
న(డ)రక యాతన చూస్తున్నా…!
మనతో కలిసి బతకాల్సిన అయ్య ఇంటి దాపున లేక ఎక్కడుండో ఎట్లుండో తెలియక నువ్వనుభవిస్తున్న ఒంటరి దుక్కాన్ని కళ్ళ చూస్తున్నా…
అమ్మా నాకిప్పుడు ఆకలిగా లేదు…!!
ఆ ఇల్లు ఈ ఇల్లు… ఇల్లిల్లూ తిరుగుతూ నీ చేతుల్తో తోమిన అంట్లు తుడిచిన వాకిళ్ళు
తడిచిన పనిముట్లు లాక్‌డౌన్లో… మనల్ని సద్దిబువ్వకు దూరంచేస్తే
తల్లడిల్లిన నీగుండెను ముక్కలు చేసి నీళ్ళలో రాళ్ళలా ఉడికించి… నన్నూరడించిన
నీ గర్భశోకమూ చనుబాల ధారగా నన్ను తడిపేస్తూనే ఉంది…
అమ్మా నాకిప్పుడు ఆకలిగా లేదు…!
నీలాంటి అమ్మలు కూటికోసం కూలికెళ్తే యజమాని జాలీగా ఇచ్చిన పైకం… వచ్చిన రోగాలకే చాలక…
కాళీ అయిన జండూ బాము సీసా వాసనల్లో చూస్తున్నా…
అమ్మా నాకిప్పుడు ఆకలిగా లేదు…!
బ్యాంకుల వద్ద పైసల కోసం ప్రాణాన్ని కాలే కరోనా ఎండల్లో కాల్చుకున్న తల్లుల్ని…
ఇళ్ళల్లో అయ్యలు ఆగం జేసి
తెచ్చిన పైకం వచ్చిన రొక్కం
వైన్ షాప్ వరుసల్లో ఆవిరైపోతుంటే…
అమ్మా! నాకిప్పుడు ఆకలిగా లేదు!!
(మద్య రహిత ‘మాతృ దినోత్సవం’ కోసం)