కరోనా డైరీస్‌ – ఫీల్డ్‌ టీమ్‌

ఇటీవల ప్రపంచాన్ని, దేశాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి. పేద, గొప్ప, ఇక్కడ, అక్కడ అనే తేడా లేకుండా అంతటా తన ప్రభావాన్ని చూపిస్తోంది. మొదట విమానాలలో ఎక్కి దిగే ఉన్నవాళ్ళకే వస్తుందనేది కాస్తా ఇప్పుడు విశ్వవ్యాప్తమైపోయింది. దాంతోపాటే ఆ వైరస్‌ వ్యాప్తి గురించి, వైరస్‌ రాకుండా ఎలా ఉండాలి, వచ్చినా ఎలా బయటపడాలి, అసలు రాకుండా ఉండడానికి ఏం టీకా వేయాలి, ఏం మందులు వాడాలనే దానిపైన అన్ని రకాల మీడియా మాధ్యమాలలో ‘అంతులేని కథ’లా కొనసాగుతోంది. అందరూ వైద్యులే, అందరూ సలహాలిచ్చేవాళ్ళే. అందులో పనిలో పనిగా ప్రైవేట్‌ హాస్పిటల్స్‌ దోపిడీ, సర్కారు ఆసుపత్రి అసహాయత కలిసి అసలు ప్రజలే వారి జబ్బుని వాళ్ళే అనుకుని, వాళ్ళే వైద్యం చేసుకునేదాకా వచ్చింది.

ఈ సందర్భంలో కరోనా వీరులు, కరోనాను జయించినవారు అంటూ వారికి నీరాజనాలు పలికారు. ఇంతమంది లక్షలు ఖర్చుపెట్టి హాస్పిటల్‌కెళ్తే, కొంతమంది ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం చేయించుకుంటే, కొంతమంది ఇళ్ళల్లోనే తెలిసిన వైద్యుల సలహాలతోనో, ఆస్పత్రి వాళ్ళు ప్రకటించిన పథకాలతోనో వైద్యం చేయించుకుంటున్నారు. దీని గురించిన చర్చ ప్రక్కన బెడితే మన బస్తీలలో, మన హైదరాబాద్‌ స్లమ్స్‌లో పరిస్థితిని ఒకసారి చూద్దాం. ఇది ఒక అవలోకనం. అంతేకానీ ఇది మాత్రమే కాదు. భూమిక ఒక పది బస్తీలలో పనిచేస్తుంది. ఒక్కో బస్తీది ఒక్కో పరిస్థితి. అయితే ఆ ప్రజలకు రోగనిరోధక శక్తి ఉండడమో, ఎదుర్కొన్న, ఎదుర్కొంటున్న సమస్యల వలన రాటుదేలిన దృఢత్వమో కరోనాకి మించి ఎదురవుతున్న సమస్యలో ఏమో కానీ ఇప్పటివరకూ ఈ మహమ్మారి ఈ బస్తీలపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపకపోవడం సంతోషించే విషయమే. ఎక్కువమంది ఇంట్లోనే ఉండి స్థానిక ఆశా వర్కర్‌ ద్వారానో, లేదా వారికి తెలిసిన మేరకో వైద్యం చేసుకుంటున్నారు. మాకు తెలిసినంతవరకు నాగమయ్యకుంటలో తొమ్మిది కేసులు వస్తే ఒక్కరు మాత్రమే ఆస్పత్రిలో ఉన్నారు. చాలామంది భయం వలనే హాస్పిటల్‌కు వెళ్ళడం లేదంటున్నారు. ఇరుకు ఇళ్ళు, మనుషులు ఐసోలేషన్‌లో
ఉండగలిగేంత సదుపాయాలు లేకపోవడం వలన కూడా ఒకరి నుండి ఒకరికి తొందరగా వ్యాపిస్తుంది. కొంతమంది జలుబు, దగ్గు లాంటివి వచ్చినా టెస్ట్‌ చేయించుకున్న దాఖలాలు లేవు. తీవ్రమైన జ్వరం, జలుబు ఉంటేనో లేదా పనిచేసే దగ్గర టెస్ట్‌ చేయించుకోమని చెబితేనో మాత్రం తప్పనిసరిగా టెస్ట్‌ చేయించుకుంటున్నామని చెప్పారు.

అయితే చాలామంది తమను బయటపెట్టుకోవడానికి ఇష్టపడడం లేదు. తమకి కరోనా వచ్చిందని చెబితే పనిచేసే దగ్గర ఇబ్బంది అవుతుందని అన్నారు. ఒకళ్ళిద్దరు ప్లాస్మా ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఒకసారి వాళ్ళను పలకరిద్దామా.

నా పేరు వెంకటరమణ. నాకు 85 సం||రాలు. నేను కూడా ఇక్కడే బస్తీలో ఉంటాను. నేను, నా భార్య ఉంటాము. ఒక గది మాది. నా భార్యకు పక్షవాతం. మా ఇళ్ళన్నీ దగ్గర దగ్గరగా అనుకొని ఉంటాయి. నాకు మొదట సర్ది, దగ్గు, తుమ్ములు వచ్చాయి. నా కొడుకు నన్ను కోరంటి ఆసుపత్రికి తీసుకుపోయాడు. టెస్ట్‌ చేపించుకొన్నాను. కరోనా వచ్చిందని చెప్పారు. నా భార్యకు లేదన్నారు. నాకేమీ భయం వేయలేదు. ”దాన్ని మనం తరిమి గొట్టాలి కానీ దానికి భయపడుడేంది” అనుకున్నాను. నాకు స్కానింగ్‌, ఎక్స్‌రేలు కూడా తీశారు. నాకు బిపి కూడా ఉంది. నేను తెలిసిన వాళ్ళ సహాయంతో ప్రభుత్వ ఆస్పత్రిలో చేరాను. అక్కడ ఎవరి రూములు వారికే. ఒక్కొక్కరికి ఒక్కో గది, విడివిడిగా ఉన్నాయి. ఒకరితో ఒకరు మాట్లాడుడు లేదు, చూసుకొనుడు లేదు. డాక్టర్లు, నర్సులు మాత్రమే వచ్చేటోళ్ళు.మూడు పూటలా గోళీలు ఇచ్చేటోళ్ళు. నాకు వాటి పేర్లు తెలవదు. రెండు సార్లు చాయి, అరటిపండు ఒకటి, గుడ్డు ఒకటి ఇచ్చేవాళ్ళు. పొద్దున్న, రాత్రి టిఫిన్‌ పెట్టేటోళ్ళు. ఒక పూట కూరగాయలతో భోజనం ఇచ్చేటోళ్ళు. తలుపుకొట్టి అక్కడ పెట్టి వెళ్ళిపోయేవారు. మేము తీసుకునేవాళ్ళం. 14, 15 రోజుల తర్వాత తక్కువయింది. అప్పుడు మళ్ళీ టెస్ట్‌ చేయించారు. నెగటివ్‌ అన్నారు. అయినా ఇంటికి పంపించలేదు. డాక్టర్‌ మంచిగా ఇంకో రెండు, మూడు రోజులుండి పొమ్మన్నారు. మొత్తం 19 రోజులున్నా ఆసుపత్రిలో. ఇంటికి వచ్చేటప్పుడు కూడా గోళీలు ఇచ్చారు వేసుకోమని. ఇప్పటికి కూడా వాడుతున్నాను. మంచిగుంది. ఆసుపత్రిలో ఉన్నప్పుడు నాతోనే చిన్న ఫోన్‌ ఉండేది. నా కొడుకు, మనవళ్ళు, కోడళ్ళు ఫోన్‌లో మాట్లాడేటోళ్ళు. ఏమీ లేదు. మంచిగున్నాను.

నా పేరు దుర్గ. నేను బాగ్‌లింగంపల్లి పరిసరాల్లో ఒక బస్తీలో ఉంటాను. కూకట్‌పల్లిలో ఉండే ఒక ఆఫీసులో హౌస్‌ కీపింగ్‌ పని చేస్తుంటాను. మా బస్తీ నుంచి ఆటోలో వెళ్తాను. లేదా మా తమ్ముడు వదిలిపెడుతుంటాడు. ఈ కరోనా సమయంలో రోజూ జాగ్రత్తలు పాటిస్తున్నాను. మా ఇంట్లో రెండు రూమ్‌లు ఉంటాయి. నేను, నా భర్త, ఇద్దరు పిల్లలు ఉంటాము. పిల్లలు ఊరికి వెళ్ళారు. నాకు సర్ది చేసింది. డోలో, సి-విటమిన్‌, డి-విటమిన్‌ గోళీలు వాడమని దోస్తులు సలహా ఇచ్చిండ్రు. మామూలు గోళీలు వేసుకున్నాను. మూడు రోజులయినా తగ్గలేదు. మా ఆఫీసులో వాళ్ళు కరోనా టెస్ట్‌ చేయించుకోమన్నారు. అంతే నాకు భయమేసింది. మా తమ్ముడు వచ్చాడు. తనకు తెలిసిన వాళ్ళు ఉన్నారని, వాళ్ళతో మాట్లాడి నేచర్‌ క్యూర్‌ హాస్పిటల్‌కు తీసుకుపోయారు. అక్కడ ఉదయం వెళ్ళి టెస్ట్‌కు ఇచ్చాము. నాకు ఒకటే బాధ. ఏడుపు వస్తోంది. ఏడుస్తూనే ఉన్నాను. మధ్యాహ్నం 3:30 గంటలకు నర్స్‌ వచ్చి టెస్ట్‌ రిజల్ట్స్‌ ఇస్తూ నీకు పాజిటివ్‌ అని చెప్పింది. అంతే ఒక్కసారి నాకు ఒళ్ళు ఝల్లుమంది. దానికన్నా ముందు నా చుట్టూ, ముందున్నవాళ్ళు, వెనకున్నవాళ్ళు దూరంగా వెళ్ళిపోయారు. ఒక్కదాన్నయిపోయానని ఏడుపు వచ్చింది. ముఖం అంతా స్కార్ఫ్‌ కట్టుకుని మా తమ్ముడి ఆటో ఎక్కి ఇంటికొచ్చేశాను. హాస్పిటల్‌లో ఇక్కడున్న ఆశా వర్కర్‌కి చెప్పమని గోళీలు ఇచ్చారు. నేను భయపడి ఆశా వర్కర్‌కి చెప్పలేదు. ఇంటికి వచ్చి నా భర్తకు చెప్పాను. చుట్టుపక్కల వాళ్ళని దూరంగా ఉంచమని, పిల్లలని దగ్గరికి రానీయవద్దని చెప్పాను. అంతే, తెల్లారేసరికి బస్తీ మొత్తం తెలిసిపోయింది. ఇంక చుట్టుపక్కలవాళ్ళ గోల మొదలయింది. ఇక్కడ ఉండవద్దు, వెళ్ళిపొమ్మన్నారు. అంతలో బస్తీ లీడర్ల ధమ్‌కీ మొదలయ్యింది. ఇవి చిన్న, చిన్న ఇళ్ళు. ఇక్కడ ఉంటే అందరికీ వస్తుంది, హాస్పిటల్‌కి వెళ్ళండి అన్నారు. ఇక్కడ ఉండొద్దు అంటూ మనిషికో మాట అన్నారు. నాకు ఈ కరోనా వచ్చినదానికంటే వాళ్ళ ధమ్‌కీలకే ఎక్కువ బాధ వేసింది. ఎక్కువ బాగ లేకుండా అయిపోయింది. కానీ నేను గట్టిగా ఇంట్లోనే ఉంటాను, ఇంట్లోనే ఉండి తగ్గించుకుంటాను, నా దగ్గరికి ఎవ్వరూ రావొద్దు, నేనూ ఎక్కడికీ రాను అన్నాను. నా భర్త ఉదయమే పాల ప్యాకెట్‌ కోసం వెళ్తే, అందరూ కలిసి అరిచి పంపించేశారు.

నేను, నా భర్త చెరొక రూమ్‌లో ఉన్నాము. నేనే వండేదాన్ని. మా అమ్మ, చెల్లి ఫోన్‌చేసి ఏడవవద్దని ధైర్యం చెప్పారు. మా తమ్ముడు, తన స్నేహితులు గుడ్లు, చికెన్‌ తెచ్చి బయటపెట్టేవారు, ధైర్యం చెప్పేవారు. మేము తీసుకుని వండుకునేవాళ్ళం. పొద్దున్న రెండు, సాయంత్రం రెండు తినేవాళ్ళం. చికెన్‌ బాగా తిన్నాము. వేడినీళ్ళు మాత్రమే తాగుతున్నాము. ఆవిరి పెట్టుకున్నాము. జలుబు తగ్గిపోయిన తర్వాత వారం రోజులకు ఇద్దరం ఫీవర్‌ హాస్పిటల్‌కి వెళ్ళి పరీక్ష చేయించుకొన్నాము. హాస్పిటల్‌కు వెళ్ళే ముందు రోడ్డుమీద ఎవ్వరూ ఉండొద్దు అని చెప్పాము. దాంతో ఎవ్వరూ లేరు. ఫీవర్‌ హాస్పిటల్‌లో కరోనా టెస్ట్‌ చేయించుకుంటే ఇద్దరికీ నెగటివ్‌ అని వచ్చింది. 14 రోజుల తర్వాత ఆఫీసుకు వెళ్తున్నాను. ఇప్పుడు బాగుంది. నేను ప్లాస్మా ఇవ్వడానికి సిద్దంగా ఉన్నాను. చుట్టుపక్కల వాళ్ళు బాగా ఉన్నారు. వాళ్ళకి తెలియదు కదా! సమాఖ్య లీడర్‌ వాణి, భూమిక వాళ్ళ సహకారంతో వారం రోజులకు సరిపడా రేషన్‌ ఇప్పించారు.

నేను లావణ్య, ఆశాగా పనిచేస్తుంటాను. ఇప్పుడయితే కరోనా వచ్చిన వాళ్ళని గుర్తించి, మందులు (సి, డి విటమిన్స్‌) ఇస్తుంటాము. ధైర్యం చెబుతుంటాము. నాకు బ్యాక్‌ పెయిన్‌ వచ్చింది. దాంతోపాటే జలుబు వచ్చింది. అలసటగా ఉండేది. మా మేడమ్‌ టెస్ట్‌ చేయించుకోమని సలహా ఇచ్చింది. అంబర్‌పేట ప్రభుత్వ పాఠశాలలో 20 రోజులు క్యాంప్‌ పెట్టారు. అక్కడ అందరం టెస్ట్‌ చేయించుకున్నాం. నలుగురు ఎఎన్‌ఎంలకు, ముగ్గురు ఆశా వర్కర్‌లకు కరోనా వచ్చింది. నాకు భయమేసింది. ఏడ్చుకున్నాను. కానీ మా మేడమ్‌, తోటి ఆశా వర్కర్లు మనం ఒకరికి ధైర్యం చెప్పేటోళ్ళం, మనం ఏడిస్తే ఎట్ల అన్నారు. అంతే ధైర్యం తెచ్చుకున్నా. మాది ఉమ్మడి కుటుంబం. తొమ్మిదిమంది ఉంటాము. మూడు బెడ్‌రూమ్‌లు ఉండే ఇల్లు మాది. నన్ను గాంధీ ఆస్పత్రిలో చేరమన్నారు. కానీ నాకు భయమేసి చేరలేదు. ఇంట్లోనే ఉన్నాను. ఇంట్లోనే ఒక గది నాకిచ్చారు. వేరే ఆశా వర్కర్‌ సి, డి విటమిన్స్‌ ఇచ్చేది. ఎక్కువగా పండ్లు తిన్నాను. వేడినీళ్ళు తాగాను. పాలల్లో పసుపు వేసుకుని తాగాను. రోజుకి మూడుసార్లు ఆవిరి పట్టేదాన్ని. బి.కాంప్లెక్స్‌, సి, డి విటమిన్లు తీసుకున్నాను. రోజూ రూమ్‌ని శానిటైజ్‌ చేసుకునేదాన్ని. పక్క బట్టలను రోజూ శుభ్రం చేసుకునేదాన్ని. నా పనితోనే నాకు సరిపోయేది. ఫోన్‌లో వీడియోలు చూసుకుండేదాన్ని. మొదటి మూడు రోజులు భయంగా ఉన్నాను. ఇతర ఆశా వర్కర్స్‌, భూమిక వాళ్ళు ధైర్యం చెప్పారు. తర్వాత ధైర్యం తెచ్చుకున్నాను. 5, 6 రోజులకు తగ్గిపోయింది. 14 రోజుల తర్వాత మళ్ళీ అక్కడే టెస్ట్‌ చేయించుకున్నాను. ఈ సారి నెగటివ్‌ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ నా పని నేను చేసుకుంటున్నాను. ఇంకా ఎంతో ధైర్యంగా, గట్టిగా విషయాలను చెప్పగలుగుతున్నాను. నేను ”కరోనా బారిన పడి బయటకు వచ్చాను. ఏం భయంలేదు” అని మిగిలినవారికి చెబుతున్నాను.

Share
This entry was posted in కరోనా డైరీస్. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.