ఇతివృత్తానికి ప్రవేశిక:
చరిత్రలో 2020 సంవత్సరం అంటేనే కోవిడ్-19 మహమ్మారి సంవత్సరంగా నిలిచిపోతుంది. భారతదేశంలో మాత్రం ఈ ఏడాది మహిళలపై, అందులోనూ బలహీనవర్గాలకు చెందిన మహిళలమీద మునుపెన్నడూ లేనంత దారుణమైన హింసకి గుర్తుగా
ఉండిపోతుంది. ప్రభుత్వ ఉదాసీనత వల్ల ప్రభావితం కాని రంగం అంటూ మిగల్లేదు. కోవిడ్-19ని 2020 మార్చిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ మహమ్మారిగా ప్రకటించినప్పటినుంచి మహిళలపై జరిగిన దారుణమైన నేరాలు కొన్నింటిని ఇక్కడ ప్రస్తావించాం. గడచిన ఐదేళ్ళలో మహిళలు పలురకాల సామాజిక, ఆర్థిక, రాజకీయ, భౌతిక పతనాలకు గురయ్యారు. పౌష్టికాహార లోపం, ఆర్థిక భద్రత పడిపోవడం, మహిళలపై పెరిగిన సామాజిక నేరాలు వీటిలో ఉన్నాయి. డాక్టర్ ఇందు అగ్నిహోత్రి తన వ్యాసంలో చెప్పినట్లుగా, మహిళలపై జరుగుతున్న హింసను మరింత సమగ్రంగా అర్థం చేసుకుని దాన్ని ప్రతిఘటించాలి. అసమానత్వం, సామాజికంగా వస్తున్న ఆధిపత్య ధోరణులు, వివక్షాపూరితమైన విధాన నిర్ణయాలు… వీటన్నింటిలో మూలాలు పాతుకుపోయి ఉండడం వల్ల ఏర్పడిన సామాజిక సంక్షోభం ఇది. వనరులకు అందుబాటు, విధాన రూపకల్పన, న్యాయం… వీటన్నింటినుంచి మహిళలను దూరంగా ఉంచడం వల్ల హింస చోటు చేసుకుంటోందని గుర్తించాలి.
ఇవే కాకుండా మహిళలకు రకరకాల సవాళ్ళు కూడా ఎదురవుతున్నాయి. రేషన్ సరుకుల భద్రత, తమ కుటుంబానికి ఆహారం సమకూర్చుకోవడం, గ్రామాల్లో సామూహిక వంటశాలలు నడపడం, క్వారంటైన్ కేంద్రాలకు, తిరిగి వస్తున్న వలస కార్మికుల కుటుంబ సభ్యులకు సాయం అందచేయడం… లాంటి పనులెన్నో ఉంటున్నాయి. ఈ సమయంలో చాలా మంది మహిళలు తిండిలేక అలమటించి, వ్యాధుల బారిన పడి, తగిన వైద్య సదుపాయాలు అందుబాటులో లేక, ఏదో తెలియని మానసిక వేదనకు గురయ్యారు. కులం, వర్గం, మతం, వైకల్యం, లైంగిక అసమానత్వం, ప్రాంతం… ఇలా రకరకాల కారణాలతో ఈ సమస్యలు మరింత ఎక్కువవుతున్నాయి. వీటిలో ప్రతి ఒక్క అంశం వల్ల మహిళలు ప్రభుత్వం అందచేసే వనరులు, సేవలను పొందలేకపోతున్నారు. ప్రభుత్వాల నుంచి వచ్చే స్పందనల వల్ల వారికి ఇప్పటికే ఉన్న సమస్యలు, అసమానతలు మరింత ఎక్కువ కాకుండా, మహిళల ఆత్మగౌరవానికి, స్వాతంత్య్రానికి భంగం వాటిల్లకుండా, వాళ్ళ గొంతు వినిపించడానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రభుత్వాలు చూసుకోవాలి.
ఉన్నదున్నట్లుగా…
భారతదేశంలో మహిళా కార్మిక శక్తి భాగస్వామ్య రేటు కేవలం 23.4% (2019 నాటికి) మాత్రమే ఉంది. 2011-12లో 33.1% నుంచి 2017-18లో 25.3% అంటే 7.8% పడిపోయింది (ఆర్థిక సర్వే 2020). దీనివల్ల అంతర్జాతీయంగా మహిళలు, పురుషుల మధ్య ఉన్న అంతరానికి సంబంధించిన సూచీలో భారతదేశం మొత్తం 153 దేశాల జాబితాలో 112వ స్థానంలో నిలిచింది. చాలామంది మహిళలు అసంఘటిత రంగంలో ఉండడంతో వేతనాల నష్టం, సామాజిక భద్రత లేకపోవడం, ఇంట్లో జీతం బత్తెం లేని బండ చాకిరీ… ఇలాంటి వాటివల్ల తీవ్రంగా నష్టపోతున్నారు.
మహిళలపై గృహ హింస:
జాతీయ మహిళా కమిషన్ వెల్లడించిన వివరాల ప్రకారం 2020 మార్చి 2వ తేదీ నుంచి 8వ తేదీ మధ్య 116 ఫిర్యాదులు అందాయి. అదే మార్చి 23 నుంచి ఏప్రిల్ 1 మధ్య ఏకంగా 257 ఫిర్యాదులొచ్చాయి. వీటిలో 69 గృహ హింసకు సంబంధించినవే. మిగిలిన ఫిర్యాదులలో గౌరవంగా జీవించే హక్కుకు సంబంధించిన ఫిర్యాదులు 35 నుంచి 77కు పెరిగాయి. ఇలాంటి కేసులు సాధారణంగా ఆడ మగ తేడా, వర్గం, లేదా కులానికి సంబంధించిన వివక్ష వల్ల వస్తాయి. ఏప్రిల్, మే నెలల మధ్యలో మహిళలపై 22 రకాల నేరాలకు సంబంధించి 3027 ఫిర్యాదులు వచ్చాయి. వాటిలో 1428 (47.2%) గృహ హింస, ఇంట్లో భాగస్వాముల హింసకు సంబంధించినవే.
ఎన్.ఎఫ్.హెచ్.ఎస్. సమాచారం ప్రకారం హింసను ఎదుర్కొనే మహిళల్లో 86 శాతం మంది ఎప్పుడూ సాయం అడగలేదు. 77% మంది అసలు ఆ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు కూడా. ఇలా గృహ హింసపై మౌనం పాటించడం, సేవలు, మద్దతు అందుబాటులో లేకపోవడం లాంటివి ఈ సమయంలో మరింత ఎక్కువగా కనిపించాయి. వాటికి తోడు సెల్ ఫోన్లు అందుబాటులో లేకపోవడం, రవాణా సమస్యలు ఈ సమస్యను మరింత పెంచాయి.
మహిళల బృందాలు కూడా హింసకు సంబంధించి తగిన సాయం అందకపోవడంపై కేసులు నమోదు చేశాయి. గృహ హింసకు వ్యతిరేకంగా పోరాడుతున్న అమన్ నెట్‌వర్క్ కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రికి, మహిళా కమిషన్‌కు, నీతి ఆయోగ్‌కు ఒక వినతిపత్రం సమర్పించింది. మహిళలపై నేరాలకు సంబంధించి అందించే సేవలన్నింటినీ అత్యవసర సేవలుగా ప్రకటించాలని అందులో కోరింది. చాలా బృందాలు సలహాదారుల, హెల్ప్‌లైన్ నంబర్లను కూర్చి, వాట్సప్ గ్రూపుల ద్వారా కూడా హింస బాధితులు, టెలి కౌన్సిలింగ్ పొందినవారు దేశవ్యాప్తంగా పలు మహిళా బృందాలు, ట్రాన్స్ గ్రూపులు ప్రచారాలు చేశాయి.
మహిళలపై లాక్‌డౌన్ ప్రభావాల మీద మహిళల బృందాలు కొన్ని పరిశీలనలు చేశాయి. ఈ అధ్యయనంలో భాగంగా, గృహ హింస కేసుల్లో బాధితులకు వివిధ సేవల అందుబాటు, సమస్య పరిష్కార వ్యవస్థ ఎలా ఉన్నాయో దేశంలోని ఏడు రాష్ట్రాల్లో ప్రత్యేక పరిశీలన చేసింది. లామ్-లింటి చిత్తర నేరాలు (ఎల్.సి.ఎన్) అనే సంస్థ బాధితులకు అందుతున్న సేవలో చాలా లోపాలు ఉన్నట్లు ఈ పరిశోధనలో తేలింది.
ఈ వ్యవధిలో మానసిక ఆరోగ్య సమస్యలు తీవ్రతరమయ్యాయి. భౌతిక దూరానికి తీసుకుంటున్న చర్యలు ఆందోళన, కుంగుబాటును మరింత పెంచాయి. మహిళలపై ఈ ప్రభావం చాలా తీవ్రంగా పడింది. నయాపైసా జీతం, బత్తెం లేకుండా బోలెడంత బండ చాకిరీ చేయాల్సి రావడం, తమ సంరక్షణకు సమయం లేకపోవడం లాంటి సమస్యలు వారికున్నాయి. పురుషులతో పోలిస్తే మహిళలకు ఆందోళన, కుంగుబాటు లాంటి మానసిక సమస్యలు వచ్చే ప్రమాదం రెట్టింపు ఉందని పరిశోధనలు తెలియచేస్తున్నాయి. లైంగిక దాడి లాంటి వాటి వల్ల మహిళలు తరచు తీవ్రమైన బాధకు గురవుతారని, అందువల్ల వారికి పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్లు (పీటీఎస్డీ) వస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.
మానసిక ఆరోగ్య సమస్యల వల్ల భారతదేశంలో 2012-2030 సంవత్సరాల మధ్య కలిగే ఆర్థిక నష్టం సుమారు 1.3 ట్రిలియంట్ డాలర్లుగా ఉంటుందని అంచనా.
మొత్తం ప్రజారోగ్య వ్యవస్థలో 70%కి పైగా మహిళలే ఉంటారు. వారిలో హెల్త్ వర్కర్లు, పారిశుధ్య కార్మికులు, పారా మెడికల్ సిబ్బంది, సంరక్షకులు… ఇలాంటి వాళ్ళకు ఆరోగ్య వ్యవస్థలో అట్టడుగు స్థానం, అత్యల్ప వేతనం ఉంటాయి. కొన్ని నెలలపాటు సరైన వేతనాలు, రక్షణ పరికరాలు లేకుండానే ఆస్పత్రులు తమతో ఎలా పనిచేయిస్తున్నాయో బయటి ప్రపంచానికి చెప్పేందుకు నర్సులు కొన్నిచోట్ల సమ్మెలకు దిగారు. మహిళా నర్సులు ఏ మాత్రం పరిశుభ్రత లేని, అరక్షితమైన, ఇరుకైన బసలో ఉంటే, మగ వైద్యులకు మాత్రం హోటళ్ళలో ఉండే సౌకర్యాలు పొందారు.
దేశంలో దాదాపు 10 లక్షల మందికి పైగా ఆశా వర్కర్లున్నారు. వాళ్ళు చాలా రాష్ట్రాల్లో కనీస వేతనాల కంటే తక్కువకు అత్యధిక ముప్పు ఉండే పరిస్థితుల్లో పనిచేయాల్సి వస్తోంది. ఫౌండేషన్ ఫర్ రీప్రొడక్షన్ హెల్త్ సర్వీసెస్ చేసిన పరిశోధన ప్రకారం, లాక్‌డౌన్ సమయంలో 8 లక్షల వరకు అరక్షిత గర్భస్రావాలు జరిగాయి. వాటిలో 1750 మంది తల్లులు మరణించారు. 23 లక్షల అవాంఛిత గర్భాలు వచ్చాయి.
ప్రతిరోజూ దాదాపు 10 వేల మంది మహిళలకు కాన్పు సంబంధిత సమస్యలు వస్తున్నాయని అంచనా. వాటికి ప్రత్యేకమైన వైద్య సంరక్షణ కావాల్సి ఉన్నా, అది అందుబాటులో ఉండట్లేదు. గర్భిణులు ప్రసవ సమయంలో వైద్య చికిత్సలు కావాలని కోరినా, ఆస్పత్రుల్లో వారికి ప్రవేశం దొరకట్లేదని తెలుస్తోంది. ఇళ్ళు, రైళ్ళు, రోడ్లు, రైల్వేస్టేషన్లలో బిడ్డలకు జన్మనిచ్చే మహిళలు కొన్నిసార్లు బిడ్డ ప్రాణాలను, మరికొన్నిసార్లు తమ ప్రాణాలనూ కోల్పోతున్నారు. లక్షలాది మంది బాలికలకు నెలసరి సమయంలోనూ సరైక రక్షణ లభించడం లేదు (దాస్ గుప్తా).
మరోవైపు, జీవనోపాధి లేకపోవడంతో మహిళలకు తినడానికి తిండి దొరక్క, అప్పులపాలై, విపరీతమైన ఒత్తిడి, అరక్షిత వలసల కారణంగా కరోనాయేతర ఆరోగ్య సమస్యలు రావడం, వాటికి చికిత్సలు లభించకపోవడం లాంటి సమస్యలున్నాయి. ఈ మహమ్మారి సమయంలో అత్యవసర ప్రాథమిక చికిత్స అందుబాటులో లేకపోవడం వల్ల మహిళలకు, బాలికలకు, లైంగికంగా విభిన్న వ్యక్తులకు తీవ్రమైన ముప్పుగా పరిణమించింది. వాళ్ళు లాక్‌డౌన్ సమయంలో తగిన రక్షణ, గర్భనిరోధాలు, రక్షణ చర్యలు లేక లైంగిక హింసకు బలయ్యారు.
చిత్రకూట్ ట్రాఫికింగ్ కేసు వార్త 2020 జులైలో బయటికొచ్చింది. ప్రభుత్వం, ఇతర సంస్థలకు కాంట్రాక్టర్లు, స్థానిక కార్యకర్తలకు ఉండే చీకటి సంబంధాలను అది బయటపెట్టింది. పేదరికం కారణంగాను, ఆకలి పెరిగి, పౌష్టికాహారం లేక అల్లాడే పేద, గిరిజన బాలికలను (12 ఏళ్ళవారు) వాళ్ళ కుటుంబానికి డబ్బు పంపే నెపంతో కాంట్రాక్టర్లు వ్యభిచార కూపాల్లోకి దించుతున్నారు. ఢిల్లీకి చెందిన నాలుగు మహిళా సంస్థలు ఈ ఘటనపై న్యాయ విచారణకు డిమాండ్ చేశాయి. అధికారులు దీన్ని కప్పిపెట్టేందుకు చేసిన ప్రయత్నాలను ఖండించాయి.
ట్రాన్స్‌జెండర్ వ్యభిచారులు, సాధారణ వ్యభిచారులు, అసంఘటిత రంగంలోని కార్మికులు, దివ్యాంగులు… వీళ్ళందరి జీవనోపాధి తీవ్రంగా దెబ్బతిన్నట్లు కథనాలు వచ్చాయి. దానివల్ల వీళ్ళు తీవ్ర పేదరికంలోకి వెళ్ళి గూడు కూడా కోల్పోయారు. వీళ్ళను వైరస్ వాహకాలుగా భావించి అవమానాలకూ గురిచేశారు. వైరస్‌ను వ్యాపింపజేస్తున్నారంటూ భారతదేశంలో సెక్స్ వర్కర్లని కించపరుస్తూ అమెరికన్ సంస్థ ‘యేల్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్’ చేసిన అధ్యయనం జరుగుతున్న దుష్ప్రచారానికి తోడయ్యింది. తగిన సాక్ష్యాధారాలు లేకుండా, సంబంధిత సమీక్షలు లేకండా నిష్పూచిగా తెచ్చిన సదరు అధ్యయనాన్ని కొందరు సెక్స్ వర్కర్లు మహిళా సంఘాల మద్దతుతో గట్టిగా సవాలు చేయడంతో యేల్ తన అధ్యయనాన్ని ఉపసంహరించుకోవాల్సి వచ్చింది.
జవాబుదారీతనం కోసం డిమాండ్లు:
అమన్ నెట్‌వర్క్‌లో భాగంగా ఉన్న కొన్ని మహిళా సంఘాలు మహిళలపై హింసకు సంబంధించిన సేవలను అత్యవసర సేవలుగా ప్రకటించాలని మహిళా మంత్రిత్వ శాఖకు వినతిపత్రాలు సమర్పించాయి. అందులో ఏమున్నాయంటే:
సేవలు, పరిష్కార వ్యవస్థను బలోపేతం చేసి, ప్రభుత్వంలోని వ్యవస్థాగత సేవలన్నింటి మధ్య (హెల్ప్‌లైన్లు, న్యాయస్థానం, పోలీసులకు ఫిర్యాదులు, రవాణా సేవలు, షెల్టర్లు తదితరాలు) సమన్వయం ఏర్పరచాలి.
గృహ హింస (నివారణ) చట్టంలో కచ్చితంగా పేర్కొన్నట్లు, మహిళల భద్రత దృష్ట్యా, వారిపై దాడిచేసేవారిని ఇళ్ళనుంచి తరలించాలి. ఒకవేళ మహిళలు ఇళ్ళనుంచి వెళ్ళాలనుకుంటే మాత్రం ఆమెకు సరైన ఆశ్రమాలు, రక్షణ పరిమితంగానే ఉన్నాయి.
సరైన సమయానికి ఆమెకు న్యాయ సహాయం, కౌన్సెలింగ్, మానసిక చికిత్స అందేలా చూడాలి.
బాధితులకు ఈ సమయంలో అత్యవసర వైద్య సేవలు అందాలి, లేకపోతే గాయాల కారణంగా వాళ్ళు మరిన్ని బాధలకు లోనవుతారు. సమగ్ర లైంగిక, పునరుత్పత్తి వైద్య సేవలు, మాతృత్వ వైద్యసేవలతో పాటు, సురక్షిత గర్భస్రావాలకూ వారికి వైద్యసేవలు అందాలి.
బాధితులకు ఆర్థిక, సామాజిక భద్రతా చర్యలు, ఆహార భద్రత, ప్రమాదంలో ఉన్న మహిళల విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. చాలా కుటుంబాల్లో చిట్టచివర తినేది వాళ్ళే అవుతారు. పెళ్ళయినవారు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, ద్వైలింగేతర-అంటే ట్రాన్స్‌జెండర్‌కు చెందిన అందరికీ ప్రాణాధార, జీవనోపాధి ప్యాకేజీలను గౌరవంతో అందించాలి.
భౌతిక భద్రత, శారీరక సమగ్రత ఉండేలా చూడాలంటే:
మహిళలపై నేరాలు పెరుగుతుండడంతో వీటిని అరికట్టేందుకు సమర్థమైన సేవలు ఉండాలి. అంటే హెల్ప్‌లైన్‌లు, వన్‌స్టాప్ కేంద్రాలు, మెడికో లీగల్ కేసుల అందుబాటు, ఆ ప్రాంతంలో ఉండే సామాజిక కార్యకర్తలు, బృందాల వారి వద్దకు వెళ్ళి బాధితులకు సాయం చేయాలి. పోలీసులు కూడా మహిళల విషయంలో మరింత సున్నితంగా వ్యవహరించేలా చూడాల్సిన అవసరం ఉంది. వాళ్ళు మహిళా సంఘాలతో కలిసి పనిచేస్తూ మహిళలు/బాలికల రక్షణకు తగిన ప్రణాళికలు రూపొందించాలి. దాడులకు పాల్పడేవారిని ఇళ్ళనుంచి తరలించేందుకు తగిన మార్గాలు వెతకాలి.
ఇక రాజకీయ కోణంలో చూస్తే, విధాన రూపకల్పనలో మహిళలను భాగస్వాములను చేయాలన్న డిమాండు సుదీర్ఘకాలంగా
ఉంది. దాన్ని పునరుద్ఘాటించి, అమలు చేయాలి. ఆకలి, భద్రత, వైద్యసేవలు అందుబాటు, వివక్ష, అణగదొక్కడం, పక్కన పెట్టేయడం, వారి గుర్తింపు అదృశ్యంగా ఉండిపోయేలా చేయడం వంటివి కొనసాగినన్నాళ్ళు మహిళలు వారి గొంతు వినిపించలేరు. భాగస్వాములు వారి గొంతును వినిపించేలా చేయాలి.
క్రియాశీలంగా ఒక సంరక్షణ ప్రణాళికను రూపొందించడానికి బాధితుల్ని, వారికి చేదోడువాదోడుగా ఉన్నవారిని కూడా కలవాల్సి ఉంది.
ఆపత్సమయంలో ఆశాకిరణం:
1. ఈ మహమ్మారి కాలంలోనూ వివిధ అన్యాయాలు, మహిళలపై హింసకు వ్యతిరేకంగా నారీలోకం గళమెత్తడం సానుకూలాంశం. అది చిత్రకూట్ బాలికల అక్రమ రవాణా కానివ్వండి, బీహార్‌లోని అరారియాలో సామూహిక అత్యాచార బాధితురాలు, ఆమె మద్దతుదారుల విషయం కానివ్వండి. చిత్రకూట్ ఘటనను యూపీ హైకోర్టు సుమోటోగా స్వీకరించి ప్రభుత్వాన్ని నిలదీసింది.
2. లాక్‌డౌన్ సమయంలో గర్భిణులకు ఆస్పత్రులు అందుబాటులో ఉండేలా భరోసా ఇవ్వాలంటూ ‘మహిళల ఆరోగ్యం’ కోసం వేచిచూస్తున్న సమా రిసోర్స్ గ్రూప్ ఢిల్లీ హైకోర్టులో ఒక పిల్ దాఖలు చేసింది. దీనిపై ఏప్రిల్ 2020లో ఈ కింది ఆదేశాలు వెలువడ్డాయి.
వయోవృద్దుల కోసం రెండు రోజుల్లోగా ఏర్పాటు చేయనున్న హెల్ప్ లైన్‌ను గర్భిణులకు కూడా వర్తింపచేయాలి. తద్వారా వారు అవసరమైనప్పుడు వైద్య పరీక్షలు, ప్రసవానికి ముందు, తర్వాత వైద్యులతో సంప్రదింపుల కోసం ఆస్పత్రులకు వెళ్ళేందుకు రవాణా సౌకర్యం వీలు కల్పించాలి. అందుకు రవాణా సదుపాయం కూడా ఏర్పాటు చేయాలి. హెల్ప్‌లైన్ నంబరును వార్తాపత్రికలు, సామాజిక మాధ్యమాల ద్వారా మరియు ఢిల్లీ పోలీసు శాఖ ద్వారా వీలున్నచోటల్లా తగినంతగా ప్రచారం చేయాలి.
ఆయా ప్రాంతాల్లో గర్భిణులు, ముఖ్యంగా వారిలో తీవ్ర ముప్పు విభాగంలో ఉన్న వారి వద్దకు వెళ్ళి అనుశీలన చేసేందుకు ఆశా కార్యకర్తలు, ఎఎన్‌ఎంలను తగిన సంఖ్యలో అందుబాటులో ఉంచుతామని ఢిల్లీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. గర్భిణులకు ముఖ్యంగా చివరి మూడు నెలల కాలంలో తగిన సహాయం అందచేస్తామని తెలిపింది. గర్భిణులు ప్రసవానికి ముందు, ప్రసవం సమయంలో, ప్రసవానికి తర్వాత కూడా ఆస్పత్రులకు వెళ్ళేందుకు రవాణా సదుపాయం కూడా కల్పిస్తామని పేర్కొంది.
కోవిడ్ హాట్‌స్పాట్ ప్రాంతాల్లో నివసించే గర్భిణులు, వారి కుటుంబసభ్యులు లాక్‌డౌన్ సమయంలో ఎలాంటి అడ్డంకులను ఎదుర్కోనవసరం లేకుండా కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వాలు సంయుక్తంగా కృషి చేయాలి.