చీకటిపడింది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. రాణి కాలేజి నుంచి ఇంకా రాలేదని ఎదురు చూస్తూ ఇంట్లోకి బైటకి తిరుగుతోంది శారద. క్యాంప్‌కి వెళ్ళిన భర్త రావడానికి రెండు రోజులు పడుతుంది. ఈలోగా రాణితో మాట్లా డాలని నిర్ణయించుకుంది. నిన్న మధ్యాహ్నం రాధిక వచ్చినప్పుడు మాటల్లో మాటగా అన్నా, ప్రత్యేకించి అది చెప్పడానికే వచ్చిందని తర్వాత అర్థమయింది. అప్పట్నుంచి మనసు మనసులో లేదు. ఆందోళన పడుతూనే ఉంది. కూతుర్ని చూస్తుంటే భయమేస్తోంది. ఎందుకంటే రాణి చాలా తెలివైన పిల్ల. ఏదైనా ఆలోచించి నిర్ణయించుకుంటుంది. ఏది ఏమైనా తన నిర్ణయానికి కట్టుబడి ఉంటుంది. ఆ విషయానికి అందరూ మెచ్చుకుంటారు. ఇప్పుడు రాధిక చెప్పిన విషయం మాత్రం మింగుడు పడట్లేదు.
రాధిక కొడుకు ప్రభు కూడా రాణి కాలేజిలోనే చదువుతున్నాడు. కాలేజీలో జరిగే విషయాలను తల్లితో పంచుకుంటూ ఉంటాడు. ఆ రోజు కూడా అలాగే వాళ్ళ కాలేజీలో జరగనున్న స్టూడెంట్స్ యూనియన్ ఎలక్షన్స్ గురించి మాట్లాడుతూ అభ్యర్థులు కులాల వారీగా ప్యానెల్స్‌ని తయారు చేసుకోవడం గురించి చెప్తూ రాణి చురుగ్గా ఉంటుంది కనుక తనని నిలబెట్టాలనుకుంటే ఆమె ప్రేమిస్తున్న అబ్బాయి వేరే కులం అని, తనసలు కులాన్నే కాదనుకుంటోందని, ఇలాంటి అమ్మాయిల వల్ల తమ కులపు గౌరవం, హోదా ఎలా దిగజారిపోతోందో, ఎలా ప్రమాదంలో పడబోతోందో ఆవేశంగా వెళ్ళగక్కాడు. అది విన్న రాధిక ఆగలేక మర్నాడు పనిగట్టుకుని శారద దగ్గరికి వెళ్ళి చెప్పేసింది.
అప్పట్నుంచి శారదకి ఒకటే బాధగా ఉంది, అన్నీ తనతో చెప్పే కూతురు ఈ విషయం చెప్పలేదని, కులంకాని కులపు వాడితో ప్రేమలో పడిందని, అతనితోనే జీవిత మని అందరికీ చెప్పిందని, అసలు పెళ్ళి విషయంలో తనకి తానే ఎలా నిర్ణయించు కుంటుందని, ఆమె నిర్ణయంతో తమకు పని లేదని, సాఫ్ట్వేర్ కంపెనీ నడుపుతున్న తమ బంధువుల అబ్బాయికిచ్చి చెయ్యాల్సిందేనని, తనతో చెప్తే తనకి కెరీర్ ముఖ్యం అంటుందని ఆ ప్రస్తావన తేకూడదని, భర్త రాగానే మాట్లాడి ముహూర్తాలు పెట్టించేయాలని… ఆలోచనల ప్రవాహంలో కొట్టుకుపోయి కూతురొచ్చినట్లు కూడా గమనించలేదు.
ఫ్రెష్ అయ్యి వచ్చిన రాణి తల్లి పక్కన కూర్చుంటూ ‘ఏంటమ్మా ఆలోచిస్తున్నావు?’ అని అడిగేసరికి ఉలిక్కిపడింది. రాణి ముఖం చూస్తూనే కోపం, ఆందోళన ఎటో పోయాయి. ఆలోచనలు ఆగిపోయాయి. తల్లి ముఖంలో మారిపోతున్న భావాలని గమనించిన రాణి ‘నాన్న ఫోన్ చేశారా’ అని అడిగింది ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ. తన కూతురు ఏదో చెప్పాలనుకుంటోందని అర్థమైంది శారదకు. ఫ్లాస్క్‌లో పోసి ఉంచిన కాఫీ రెండు కప్పుల్లో తీసుకొచ్చి స్థిమితంగా కూర్చుంది వినడానికన్నట్లు.
ఈ సంవత్సరంతో చదువైపోతుం దని, పై చదువులకి గ్యాప్ తీసుకోవాలనుకుం టోందని, క్యాంపస్ సెలక్షన్స్‌లో వచ్చిన
ఉద్యోగంలో చేరిపోయి, తర్వాత భవిష్యత్తు గురించి ప్లాన్ చేసుకోవాలనుకుంటోందని చెప్పి ఆగింది రాణి. ఉద్యోగం కోసం తాను ఢిల్లీ వెళ్ళాల్సి వచ్చినా భయపడాల్సింది లేదని, తన క్లాస్మేట్, మంచి ఫ్రెండ్, తను ప్రేమించిన పవన్ కూడా అదే కంపెనీలో చేరబోతున్నాడు కనుక ఇద్దరూ కలిసుండొచ్చని చాలా మామూలుగా చెప్తున్న కూతుర్ని ఎప్పట్లా మామూలుగా తీసుకోలేకపోయింది శారద. తను టూర్ వెళ్ళాలనుకున్నా, ఎవరికే సాయం చేయాలనుకున్నా, తన నిర్ణయాలని, తన ఛాయిస్‌ని తాము ఎప్పుడూ కాదనలేదు. కానీ ఈ విషయానికి మాత్రం తన మనసు ఎదురు తిరుగుతోంది.
అందుకే కటువుగా అంది ‘అలగా జనంతో కలిసి బ్రతకాలనుకుంటున్నావా’ అని. ‘నాకు కుల పట్టింపులు లేకపోవచ్చు కానీ నీ పెళ్ళి నీది మాత్రమే కాదు, కుటుంబంలోని మిగతా పిల్లలందరి మీద పడుతుంది దాని ప్రభావం. నా చెల్లెళ్ళు, తముళ్ళు పిల్లల మీద, నీ పెదనాన్న, చిన్నాన్నల పిల్లల మీద… అందరి మీద పడుతుంది. ఎంత అవమాన పడాలో. కులం పోయిందని వాళ్ళకి సంబంధా లు రాకపోతే, పెళ్ళిళ్ళవకపోతే నువ్వు హ్యాపీగా ఉంటావా? పైగా కలుసుంటామంటున్నావు. పెళ్ళి కూడా కాదు!’ తల్లి మాటలకి అడ్డు పడకుండా నవ్వుతూ చూస్తున్న రాణిని పట్టుకుని ‘ఇవన్నీ నా మాటలు కాదు తల్లీ! లోకం నీకు తెలుసు. నువ్వు పట్టించుకోవు కానీ నన్ను బ్రతకనిస్తారా’ అంటూ కన్నీరు మున్నీరైంది.
మొట్టమొదటిసారి కూతురి దగ్గర మనసు అట్టడుగు పొరల్ని తెరిచి పరిచింది శారద. తల్లి చెప్తున్న మాటలకు నిశ్చేష్టు రాలైంది రాణి.
తను డిగ్రీలో చేరిన కొన్ని నెలల్లోనే శివని, అతని తెలివిని, మర్యాదతో కూడిన అతని వ్యక్తిత్వాన్ని ఇష్టపడడం; కాలేజి లైబ్రరీలోనో, గ్రౌండ్లోనో కాపు కాసి మాటకలపబోతే ‘అమ్మాయిగారు… మీరు బాగా చదువుకోండి, నన్ను చదువుకోనివ్వండి. ప్రొఫెసర్ అవ్వాలనే నా కల నెరవేర్చుకోని వ్వండి’ అన్న శివ మాటల అర్థం తెలుస్తున్నా కొట్టిపారేసింది. ‘నాకేం కావాలో నేనే నిర్ణయిం చుకోగలను. నా జీవితం నేను మలుచుకుం టాను. పెద్దవాళ్ళకి భయపడేది లేదు’ అని అనేది. మొదటి ఏడాది పరీక్షలైపోయినై. సెలవుల్లో 15 రోజుల్లోనే సంబంధం ఖాయం చేసి పెళ్ళి తేదీ చెప్పిన తల్లిదండ్రుల్తో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. శివని కలిసే దారి మిగల్చలేదు. ఇల్లు దాటనివ్వలేదు. అన్నీ కజిన్సే అమర్చేశారు. పెళ్ళైన నాలుగోరోజు ఫ్రెండ్స్ వస్తే ఏడ్చింది. అంతలోనే భర్త రావడంతో ఆగిపోయింది. ఫ్రెండ్స్ వెళ్తూ చెప్పారు ‘శివ యాక్సిడెంట్లో పోయాడని, కేసు నమోదు చెయ్యలేదని!’ శారదకి అర్థమైంది తన కుటుంబమే శివని చంపేసుంటారని. మొదటి యానివర్సరీ నాటికే తెలిసింది భర్తలో ఒక అపరిచితుడున్నాడని.
ఇప్పుడు మళ్ళీ అదే రిపీట్ అవ్వబో తోందని ఊహించుకుంటూ భయపడుతున్న తల్లితో ‘అమ్మా! నేను నీలా ఉండకూడదని, రాణిలానే ఉండాలని కదా ఇన్నాళ్ళూ చెప్పావు. నేను నాలానే ఉంటాను. నువ్వు భయపడొద్దు’ అని ఓదార్చింది, ధైర్యం చెప్పింది. ఆత్మవిశ్వా సంతో, సంకల్ప బలంతో ఉన్న కూతుర్ని గుండెకి హత్తుకుంది శారద.
కానీ ప్రశ్నలు బుర్రని తొలిచేస్తు న్నాయి. కులం కూడు పెడుతుందా? మన జాతిని నడపాల్సింది రాజ్యాంగమా? కుల రాజకీయమా? ఇంకెన్ని తరాలకి ఈ కులం కూలుతుంది?