ఆమె అపరాజిత కాదు మహావిజేత -డా|| చల్లపల్లి స్వరూపరాణి

ఆమె లేని దారి లేదు

ఆమె నాట్లేసి కలుపు తీసి

కోతకోసి కుప్పలేసి

అంట్లు కడిగి దొడ్లు కడిగి

పిల్లా జెల్లా

ముసలీ ముతకా

రొచ్చును యెత్తిపోసి

కోసెడు దూరం నడిచెల్లి నీళ్ళు తెచ్చి

కట్టెలు కొట్టి

చాకిరీలో గొడ్డుతో పోటీ పడి

తానే వొక గొడ్డై

ఏ మర్యాదకీ మన్ననకీ నోచుకోని

దళిత స్త్రీ

స్త్రీలలో అంటరానిది

అంటరానివాళ్ళలో ఆడది

అన్ని పోరాటాల్లో

ఆ మట్టి చేతులు

జెండాలెత్తాయి

లాఠీ దెబ్బలు తిన్నాయి

అంటరాని చీకటిలో

ఆమె ఓ మిణుగురు పురుగు

అజ్ఞానపు అంధకారంలో

ఆమె ఓ దివిటీ!

నిచ్చెనమెట్ల సామాజిక వ్యవస్థలో ఆఖరి మెట్టు మీద ఉండి ఈ సమాజపు మురికిని చేతులతో ఎత్తిపోసి తన రక్తంతో జాతిని సాకిన అట్టడుగు స్త్రీకి ఇక్కడి చరిత్ర పుటల్లో కాసింత జాగా లేదు. సమాజం ముందుకు నడవడానికి అట్టడుగు కులాల స్త్రీలు తోడ్పాటునందించినప్పటికీ వారి త్యాగాలు, కృషి పెద్దగా చరిత్రకెక్కలేదు. అటు సమాజం చేత, ఇటు చరిత్రకారుల చేత మూలకు నెట్టబడి వెలుగులోకి రాని బహుజన స్త్రీల చరిత్రను తవ్వుకు రావడమే ఈ కాలమ్‌ ఉద్దేశం.

ఆమె పరాజిత కాదు, మహా విజేత :

ఆమెకిప్పుడు అరవై ఏళ్ళు. పుట్టుకతో వచ్చిన చక్కటి రూపంతో పాటు తన స్వంత ప్రయత్నంతో సాధించుకున్న ఆత్మగౌరవంతో హుందాగా, నిండుగా కనిపిస్తుంది. ఆమెని చూస్తే బాధితురాలు అనుకోరు… సమాజం తనను నొప్పిస్తే ఆ బాధను జయించి విజేతగా నిలిచిన ఆమె ముఖంలో మొండైన ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుంది… బతుకు చుట్టూ కటిక చీకటి కమ్ముకున్నా సమాజం నుంచి ఛీత్కారాలను, అవహేళనలను పొందినా ఆమె ఆ చీకటిని ఈడ్చితన్ని మొక్కవోని దృఢ సంకల్పంతో తన జీవితాన్ని వెలిగించుకుని తనలాగే విధి వంచితులైన వారికి దారిదీపమై వెలుగొందుతున్న దివిటీ. ఆమె ‘రంగమోల్ల మహాలక్ష్మమ్మ’. ఆమె ఒకనాటి జోగిని, ఇప్పుడు జోగినీ నిర్మూలన సంఘానికి ఛైర్‌పర్సన్‌.

మహాలక్ష్మమ్మ పుట్టి పెరిగింది జోగినీ వ్యవస్థకు చిరునామాగా ఉండే కర్నాటక రాష్ట్రంలోని ‘సౌదత్తి’కి సమీపంలోని తెలంగాణా పల్లె ‘ఊటుకూరు’ గ్రామంలో. ఆ గ్రామం ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లాలో, ప్రస్తుతం నారాయణపేట జిల్లాలో ఉండే ఒక మండల కేంద్రం. మహాలక్ష్మమ్మ తల్లిదండ్రులు ‘పోలమ్మ’, ‘హనుమప్ప’. సామాజికంగా మాదిగ కులానికి చెందిన మహాలక్ష్మమ్మ ఆ ప్రాంతంలోని దళిత స్త్రీల నుదుట ‘ఊరుమ్మడి వస్తువు’ అనే దుర్మార్గమైన రాతను రాసి వారిని తరాలుగా చీకటి కుహురంలోకి తోసిన దుష్ట సంప్రదాయానికి అన్నెం, పున్నెం తెలియని పదేళ్ళ వయసులోనే బలైపోయింది. ఉత్తరాంధ్రలో ‘దేవుడమ్మ’, దక్షిణ కోస్తా, చిత్తూరు జిల్లాల్లో ‘మాతంగి’, రాయలసీమలోని కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ‘బసివి’, తెలంగాణా రాష్ట్రంలో ‘జోగిని’గా రకరకాల పేర్లతో వ్యవహారంలో ఉన్న ప్రచ్ఛన్న వ్యభిచార వ్యవస్థ. ఇది రాజుల కాలం నాటి దేవదాసి వ్యవస్థకి మరొక రూపం. అక్కడంతా దేవుడి పేరునే జరుగుతుంది. ఆమె కనిపించని దేవుడికి పెళ్ళాం. ఆడపిల్లలను దేవుడికి అంకితమివ్వడం అంటే వారు మతం పేరున గ్రామీణ భూస్వామ్యంలో ఊరుమ్మడి సరుకుగా అందరికీ అందుబాటులో ఉండి తీరాలి అనేది వారి జీవితాలపై ‘దేవుడు’ జారీచేసిన శాసనం. ఇప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాలలో గ్రామీణ పెత్తందారుల కనుసన్నల్లో ఈ దారుణమైన ఆచారం నిస్సిగ్గుగా కొనసాగుతోంది. ఒక అంచనా ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలలో సుమారు లక్షమంది దళిత స్త్రీలు ఈ ఆచారంలో మగ్గుతూ కనీసపు మనిషి హోదాకు నోచక నికృష్టమైన బతుకీడుస్తున్నారు.

మహాలక్ష్మమ్మ మేనత్త ఒక జోగిని. ఆమె తల్లిదండ్రులకు పుట్టిన ముగ్గురు ఆడపిల్లల్లో మహాలక్ష్మమ్మే పెద్ద కూతురు, వారికి మగపిల్లలు లేరు. ముసలితనంలో తల్లిదండ్రులను చూసుకుంటుంది కాబట్టి పెద్ద కూతురిని జోగినిగా చేయమని ఆమె తండ్రి హనుమప్పకు ఇరుగు పొరుగు వారు సలహా ఇవ్వడంతో ఆమెను పదేళ్ళకే యాభయ్యేళ్ళ వయసున్న మేనమామ వరసయ్యే వ్యక్తితో ‘బొట్టు’ కట్టించి దేవతకు విడిచిపెట్టారు. తల్లితోపాటు కూలి నాలి చేసి సంసారాన్ని సాకింది. తన ఇద్దరు చెల్లెళ్ళకు మామూలుగా వివాహాలు జరిగాయి. మహాలక్ష్మమ్మ సుమారు ముప్ఫై ఏళ్ళ వయసు వచ్చేవరకు ఆ వ్యవస్థలో కొనసాగింది. ఆ క్రమంలో ఆమెకు ముగ్గురు కూతుళ్ళు, ఒక కొడుకు… మొత్తం నలుగురు పిల్లలు పుట్టారు. వారెవరికీ తండ్రి నుంచి గుర్తింపు లేదు. ఎక్కడికెళ్ళినా ‘జోగిని’ అని చులకనగా చూసేవారు. ఆమె పిల్లలకు కూడా ఆ బాధలు తప్పలేదు. అయినా అవమానాలు దిగమింగుకుని కూలిపని చేసి, బీడీలు చేసి పిల్లల్ని సాకింది. అప్పూ సప్పూ చేసి వారికి చదువు చెప్పించింది. ఇప్పుడు ఇద్దరు కూతుళ్ళను చదివించి పెళ్ళిళ్ళు చేసింది. అల్లుళ్ళిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే. కొడుకు ల్యాబ్‌ టెక్నీషియన్‌. చిన్న కూతురుకి ఇంకా వివాహం కాలేదు.

మహాలక్ష్మమ్మ జీవితం 1990వ దశకంలో మలుపు తిరిగింది. అప్పట్లో మహబూబ్‌ నగర్‌ జిల్లాకు జోగినీ వ్యవస్థ నిర్మూలన కోసం ఏర్పాటయిన ‘ఆశ్రయ్‌’ అనే స్వచ్ఛంద సంస్థ పరిచయమైంది. గ్రేస్‌ నిర్మల ఆధ్వర్యంలో నడిచే ఈ సంస్థ ద్వారా జరిగే కార్యక్రమాల పట్ల ఆకర్షితురాలై మహాలక్ష్మమ్మ, ముందు తాను జోగినీ వృత్తిని వదిలేసి వారితోపాటు ఇతర జోగినీ స్త్రీల విముక్తి కోసం పనిచేయడం మొదలుపెట్టింది. ఇదంతా అంత తేలికగా జరగలేదు. ఆమె ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంది. ఇంటా, బయటా దళిత స్త్రీని కట్టడి చేసే పురుషాధిపత్య కుల సమాజంలో ఒక జోగినీ స్త్రీగా ఉన్న ఆమె తన జీవితాన్ని మార్చుకుని కొత్త జీవితం గడపడానికి ఎంతో ఘర్షణ పడింది. ఆమెకు ముందు నుంచీ ఆత్మాభిమానం ఎక్కువే. అందుకే సమాజం, కుటుంబం మహాలక్ష్మమ్మని జోగినీగా మార్చినా ఆమె ఎన్నడూ ‘రంగం’ చెప్పలేదు, అడుక్కోలేదు. కష్టపడి తల్లిదండ్రులను, పిల్లలను సాకింది. బీడీ కార్మికురాలిగా, వ్యవసాయ కూలీగా, వలస కూలీగా బతకడానికి శారీరక శ్రమ చేసింది. అందుకే ఆమె ‘ఆశ్రయ్‌’ వారి పనికి ఆకర్షితురాలైంది.

ఆశ్రయ్‌ సంస్థ ద్వారా మహాలక్ష్మమ్మ బృందం జాతర జరిగేటప్పుడు గ్రామ గ్రామాన మైకులో ఆడపిల్లలను జోగినీగా అంకితం చేస్తే జరిమానా, జైలు శిక్ష వంటి కఠిన శిక్షలు తప్పవని ప్రచారం చేయడంతో పాటు ఎక్కడన్నా అంకిత కార్యక్రమం జరుగుతోందని తెలిస్తే అక్కడికి పోలీసులను తీసుకెళ్ళేవారు. అయితే వీరు తల్లిదండ్రులకు శిక్ష పడితే కుటుంబమంతా అవస్థ పడుతుందని మానవతా దృష్టితో వారిని మినహాయించి పూజారులను, గ్రామాలలో జోగినీ పెళ్ళి జరగడంలో ప్రముఖ పాత్ర వహించే పెత్తందారులకు శిక్ష పడేలా చేశారు. ‘గొడిముక్కల’ అనే గ్రామంలో పూజారిని అరెస్ట్‌ చేయించడం వారి విజయంగా భావించవచ్చు. మొత్తానికి మహబూబ్‌ నగర్‌ జల్లాలో ఎవరన్నా ఒక స్త్రీని జోగినిగా మార్చాలంటే భయపడే స్థితిని మహాలక్ష్మమ్మ బృందం అందరికీ కలిగించింది.

ఆడపిల్లలను జోగినీలుగా చెయ్యడంలో పోతురాజుల పాత్ర మీద కూడా మహాలక్ష్మమ్మ పనిచేస్తుంది. జోగినీ పెళ్ళి దేవుడితో చేస్తే వచ్చే కట్నానికి ఆశపడి పోతురాజులు ఆ దుర్మార్గానికి ఒడిగడుతున్నారని, అయితే అణగారిన కులాలకు చెందిన ‘తక్కువ రకం’ మతపెద్దలుగా వారు కూడా కుల వ్యవస్థలో బాధితులేనని, ఆయా దేవాలయాలకు చెందిన పోతురాజులకు కూడా పునరావాస సౌకర్యాలు కల్పిస్తే వారు ఆ దురాచారం నుంచి బైటికొస్తారని మహాలక్ష్మమ్మ అంటుంది.

జోగినీ స్త్రీల పునరావాస కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని వారు అడుక్కుతినడం అవమానకరమని, కష్టపడి పనిచేసి బతకాలని ఆ స్త్రీలకు వివరించి చెప్పింది. ఇల్లూ, వాకిలీ లేని జోగినీలకు ఇళ్ళ స్థలాలు, సాగు చేసుకుని బతకడానికి భూములు వచ్చేలా కృషి చేసింది. వారికి ఆధార్‌ కార్డులు, రేషన్‌ కార్డులు వచ్చేలా ఆశ్రయ్‌ సంస్థ ద్వారా కృషి చేసి సాధించింది. మహాలక్ష్మమ్మ జోగినీ వ్యవస్థ నుంచి బైటికి వచ్చాక తిరిగి వివాహం చేసుకోలేదు. తనలాగా ఎవరూ బాధపడకూడదని జోగినీలు మళ్ళీ వివాహం చేసుకుని ఇతర స్త్రీలలాగా సాధారణ గృహస్థ జీవనం గడపాలని కృషి చేసింది. జోగినీలకు పెళ్ళి చేయడం అనేది చాలా కష్టమైన పని. వారికి పెళ్ళి చేయాలంటే సమాజంలోని పెత్తందారులు ఒప్పుకునేవారు కాదు. ఒకసారి ఆమెకి దేవునితో పెళ్ళి జరిగింది కాబట్టి ఆమెని ఎవరూ చేసుకోవడానికి వీల్లేదని నిషేధాజ్ఞలు జారీ చేసేవారు. పెళ్ళి చేసుకోవాలని చూసే జోగినీలను కొట్టి శారీరకంగా హింసించేవారు. ‘ఒకసారి జోగిని అయిన అవిటి పిల్లను ఎవరు చేసుకుంటారు? జోగినీగా ఉంటే ఎవరో ఒకరు బిచ్చం వేస్తారు, దాంతో ఎలాగో బతుకుతుంది’ అని అధికారులు మహాలక్ష్మమ్మకు చెబితే అవిటి వాళ్ళకు అవిటి వాళ్ళతోనే పెళ్ళి జరిపిద్దాం అని అవమానకరమైన ‘జోగినీ’ పేరు మాత్రం వినపడడానికి వీల్లేదని తెగేసి చెప్పింది. జోగినీలు చిన్నవాళ్ళయితే వారిని చదివించడానికి హాస్టల్‌లో చేర్పించేవారు. నానక్‌ పేటలో వారికోసం ప్రత్యేకంగా ఒక స్కూలును కూడా ఏర్పాటు చేసి ఎంతోమంది ఆడపిల్లలను జోగినీ వ్యవస్థ దురవస్థ నుంచి బైటపడేసి చదువు బాట పట్టించింది మహాలక్ష్మమ్మ. ఎన్ని అవరోధాలు ఎదురైనప్పటికీ ఆశ్రయ్‌ సంస్థ ద్వారా గ్రామ గ్రామాన తిరిగి జోగినీలు తమ వృత్తిని వదిలి గౌరవప్రదంగా జీవించాలని మైకు పెట్టి మరీ చెప్పేవారు. మహాలక్ష్మమ్మ జోగినీలను వ్యక్తిగతంగా చైతన్యపరచడానికి కాలికి బలపం ట్టుకుని తిరిగింది. వారు వివాహం చేసినవారిలో ‘హాజమ్మ’ అనే స్త్రీ గొప్ప చైతన్యవంతంగా తయారై మహాలక్ష్మమ్మతో పాటు ఆశ్రయ్‌ సంస్థలో ఒక ముఖ్యమైన కార్యకర్తగా ఎదిగింది.

జోగినీల బిడ్డలకు తండ్రి పేరు ఏది పెట్టాలనేది పెద్ద సమస్య. స్కూల్లో చేర్చాలంటే తండ్రి పేరు తప్పకుండా అడుగుతారు, చెప్పలేని వారికి పరాభవం సర్వసాధారణం. మహాలక్ష్మమ్మ తన పిల్లల చదువు విషయంలో స్వయంగా ఈ సమస్య తీవ్రతను ఎదుర్కొంది. ఈ సమస్య పరిష్కారం కోసం గ్రేస్‌ నిర్మల, మహాలక్ష్మమ్మ, మరొక ఉద్యమ సహచరి హాజమ్మలతో కలిసి అప్పటి మహబూబ్‌నగర్‌ జిల్లా కలెక్టర్‌ దమయంతి సహకారంతో జోగినీల పిల్లలకు వారు చదివే విద్యా సంస్థలలో తండ్రి పేరుతో సంబంధం లేకుండా తల్లి పేరును మాత్రమే పరిగణించాలని నిబంధలను ఏర్పాటు చేస్తూ ప్రత్యేక ఆదేశాలు (జీ.ఓ.) జారీ చేయించడం జోగినీల సంస్కరణలో ఒక పెద్ద ముందడుగు అనుకోవచ్చు. అలాగే అంతంత మాత్రంగా చదువులు చెప్పించే జోగినీల పిల్లలు చదువులో ఇతర విద్యార్థులతో పోటీపడే స్థితి ఉండదు కాబట్టి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ప్రవేశానికి జరిగే ఎంట్రన్స్‌ పరీక్షలో వారికి మార్కులు ఎన్ని వచ్చినా సీటు తప్పకుండా ఇచ్చే ఏర్పాటును కూడా మహాలక్ష్మమ్మ బృందం ఆశ్రయ్‌ సంస్థ ద్వారా చేయగలగడం విశేషం.

జోగినీ స్త్రీల కోసం ప్రారంభించిన పురనావాస కార్యక్రమాలలో అవకతవకలు ఉన్నాయని మహాలక్ష్మమ్మ ఆరోపిస్తోంది. వారి కోసం నిర్మించిన ఇళ్ళు చాలీచాలని చిన్నవే కాక వర్షానికి నీరు లోపలికి చేరడం, గోడలు కూలిపోవడం వంటి ఎన్నో సమస్యలతో వారు ఇబ్బంది పడుతున్నారని, కొందరికి అవి కూడా లేవని, జోగినీ స్త్రీల పునరావాసం విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలని ఆమె వాదిస్తోంది. అలాగే జోగినీ స్త్రీల సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామని చెప్పిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇంతవరకు ముందుకు రాకపోగా ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా రావాల్సిన ఆర్థిక సహాయం కూడా అందడం లేదనీ, గతంలో ‘జీవన జ్యోతి’ వంటి పథకాల ద్వారా జోగినీల పునరావాసం కోసం పదివేలు, ఇరవై వేల రూపాయల నగదు రుణాలు ఇచ్చేవారని, ఇప్పుడు నిథులు పక్కదారి పట్టిపోవడం వలన అటువంటి సదుపాయాలేవీ జోగినీలకు అందడం లేదని, ఇంకా చాలామంది జోగినీ స్త్రీలకు కనీసం నివసించడానికి ఇల్లు కూడా లేదని మహాలక్ష్మమ్మ ఆందోళన వ్యక్తం చేస్తోంది. జోగినీ వ్యవస్థ నుంచి బైటికొచ్చిన స్త్రీల పునరావాసం అంతంత మాత్రంగా ఉంటే ఇంకా తెలుగు రాష్ట్రాలలో వివిధ పేర్లతో ఈ వ్యవస్థ కొనసాగడం ఈ సమాజంపై మాయని మచ్చ అని, అది ఏ పేరుతో, ఎక్కడ కొనసాగినా దాన్ని రూపుమాపడం ప్రభుత్వ కనీస కర్తవ్యమని మహాలక్ష్మమ్మ అంటోంది. ఆమె ఎక్కువగా పనిచేసిన ఆశ్రయ్‌ సంస్థ రాష్ట్ర విభజన తర్వాత దాని కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్‌లోనే ఎక్కువగా కేంద్రీకరించడం, నిధులు లేకపోవడం వలన, తెలంగాణ ప్రాంతంలో జోగినీ స్త్రీల సమస్యలపై పనిచేయడానికి ప్రోత్సాహం తగ్గింది. మహాలక్ష్మమ్మ లాంటి వారికి ప్రభుత్వం సహకరిస్తే ఆ రంగంలో తనకున్న విశేష అనుభవంతో జోగినీ వ్యవస్థను పూర్తిగా రూపుమాపి వారు గౌరవంగా బతకడం కోసం కృషి చేయడానికి ఆమె సిద్ధంగా ఉంది.

మహాలక్ష్మమ్మకి క్రియాశీలక రాజకీయాల గురించి అంతగా తెలియకపోయినా సహజంగానే ఆమెకి చైతన్యం ఉంది. ప్రతి విషయాన్నీ విమర్శనాత్మకంగా పరిశీలించే గుణం ఆమెది. సున్నితంగా మాట్లాడినట్లు కనిపించినా, ఉన్నది ఉన్నట్లు నిక్కచ్చిగా మాట్లాడే నైజం ఆమెకి స్వతహాగా వచ్చింది. తెలంగాణా రాష్ట్రం వస్తే నీళ్ళు, ఉద్యోగాలు వస్తాయని చెప్పి, రాష్ట్రం వచ్చాక ప్రభుత్వ పెద్దలు అభివృద్ధికి బదులు మతాన్ని, మూఢనమ్మకాలను ప్రోత్సహిస్తున్నారని, రాష్ట్ర రాజధానిలో జరిగే బోనాల పండుగ సందర్భంలో పూనకంతో ఉండే స్త్రీల చేత ప్రభుత్వమే స్వయంగా ‘రంగం’ చెప్పించుకుంటుందని, ఇంతకంటే సిగ్గుచేటు ఏముంటుందని మహాలక్ష్మమ్మ విమర్శిస్తోంది.

మహాలక్ష్మమ్మకి సమస్యల సుడిగుండంలో కొట్టుకుపోకుండా ఏటికి ఎదురీదడం అలవాటయింది. తన నలుగురు పిల్లల్ని చదివించి ప్రయోజకులను చేసింది. ఆమెకి అంబేద్కర్‌ అంటే ప్రాణం. ఆయన పుస్తకాలు చదవడానికి ఆమెకు అక్షర జ్ఞానం లేకపోయినా అంబేద్కర్‌ పైన లభించే ఆడియో క్యాసెట్లు, ప్రసంగాలు, పాటలు తెప్పించుకుని వింటుంది. ఆయన భావాల పట్ల ఆకర్షణ ఉన్న మహాలక్ష్మమ్మ ఒకప్పుడు తెలంగాణా పండగలైన బోనాల పండగ చేసి బతుకమ్మ ఉత్సవాలలో పాల్గొనాలని కలలు కనేది. తాను జోగినీ వ్యవస్థ నుంచి బైటపడ్డాక ఆ

ఉత్సవాలన్నీ పై కులాల పండగలేనని, వాటిలో కింద కులాల వారికి చోటు లేదనీ, వాటిపై తనకుండే భ్రమలను తెంపేసుకుని నాస్తికురాలిగా మారింది. జీవితం ఆమెకి ఎన్నో పాఠాలు నేర్పి జ్ఞానం ఇచ్చి ఆ జ్ఞానంతో ఆమెని సంపద్వంతం చేసింది. అరవై ఏళ్ళ వయసులో కూడా చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో కనిపిస్తూ ఎప్పుడూ సమాజం గురించే ఆలోచించే ఆమె జీవితం, ఉద్యమం అందరికీ స్ఫూర్తిదాయకం. మహాలక్ష్మమ్మ బాధితురాలు కాదు, బాధల్ని చీల్చి చెండాడిన ధిక్కార పతాక. సమస్యల సుడిగుండాలకు ఎదురీది, వెక్కిరించిన జీవితంతో కలబడి నిలబడిన మహా విజేత మహాలక్ష్మమ్మ…

Share
This entry was posted in మిణుగురులు . Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.