(గత సంచిక తరువాయి…)
ఆంధ్ర మహిళ
ఆంధ్ర మహిళ అనే పదబంధం వినిపించగానే దుర్గాబాయి వ్యక్తిత్వం దాని సమానార్థకంగా స్ఫురిస్తుంది. అట్లానే దుర్గాబాయి పేరు వినబడగానే ఆంధ్ర మహిళా సభ కళ్ళముందు రూపు కడుతుంది. ఈ మూర్తులకు అంతటి అవినాభావ సంబంధం ఉంది. 1938లోనే ఆంధ్ర మహిళా సభకు అంకురార్పణ జరిగిందనుకోవాలి. 1937లో మద్రాసు అసెంబ్లీకి బులుసు సాంబమూర్తిగారు స్పీకరుగా ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత దుర్గాబాయి కుటుంబం మద్రాసు చేరింది. దుర్గాబాయి తమ్ముడు నారాయణరావు సాంబమూర్తిగారి వ్యక్తిగత సహాయక కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. అప్పుడు దుర్గాబాయి ఇంకా వాల్తేరులో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో రాజనీతి శాస్త్రంలో ఆనర్సు చదువుతోంది. వేసవి కాలపు సెలవులలో ఆమె మద్రాసు వచ్చి కుటుంబంతో గడిపేది. అప్పుడు వాళ్ళు 14, ద్వారకా, మైలాపూరులో ఉండేవారు. దుర్గాబాయమ్మ తల్లిగారు కృష్ణవేణమ్మ గారు ఏనాడూ నిర్వ్యాపారంగా కాలాన్ని గడిపే వ్యక్తి కాదు. ఇరుగు పొరుగు మహిళలూ, వాళ్ళ పిల్లలూ ఆమె చుట్టూ చేరేవారు. ఆమె అక్కడ సేవా సదన్ స్కూల్లో టీచర్‌గా కూడా పనిచేసేవారు. ఆమె ఇంటి దగ్గర తీరిక వేళల్లో పిల్లలకు పాటలు, పద్యాలు, హిందీ పాఠాలు, నాటక ప్రదర్శనలు, రంగవల్లులు తీర్చడాలు నేర్పుతుండేవారు. అట్లా 14, ద్వారకా, మైలాపూర్‌లో కృష్ణవేణమ్మగారు ఒక మహిళా సమితిని ఏర్పరచిన మూడు నెలల్లో 30 మంది దాకా సభ్యులు చేరారు. ‘లిటిల్ లేడీస్ ఆఫ్ బృందావన్ కాలనీ’ అని మురిపమైన పేరు సంపాదించుకొన్నదా సమితి.
సంగీతం, నృత్యం, చిత్రలేఖనం తరగతులు కూడా వివిధ ప్రాతిపదిక స్థాయిన కృష్ణవేణమ్మగారే ప్రారంభించారు. 1938లో ఈ మహిళా సమితి ప్రథమ వార్షికోత్సవం జరుపుకుంది. చెన్నపట్నానికంతా అప్పుడు ఈ క్లబ్బు సంగతి తెలిసింది. మహిళలెందరో ఆనందాశ్చర్య చకితులైనారు. రుక్మిణీ అరండేల్ వంటి ఒక ప్రముఖ కళాకారిణి, యావద్భారత ఖ్యాతిగల సంస్థా నిర్వాహకురాలు, ‘లిటిల్ లేడీస్ క్లబ్’ ప్రథమ వార్షికోత్సవానికి అధ్యక్షత వహించారంటేనే ఒక్క సంవత్సరంలోనే ఈ ఔత్సాహిక సంస్థ ఎంత పేరు, ప్రతిష్టలు, సామాజిక వికాస దోహదమూ చేసిన గుర్తింపు పొందిందో స్పష్టమవుతోంది. 1939లో జరిగిన రెండో వార్షికోత్సవానికి శ్రీమతి రంగమ్మ ఓబులరెడ్డి అధ్యక్షత వహించారు. చెన్న నగరంలోని అన్ని ప్రాంతాల నుంచీ ఈ మహిళా సమితి కార్యకలాపాలతో ఉత్సాహితులై మహిళలు, నృత్య, సంగీత, చిత్రలేఖనాలలో శిక్షణ పొందడానికి విద్యార్థినులూ వచ్చేవారు. అప్పటికి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆనర్సు చదువు పూర్తి చేసుకుని దుర్గాబాయమ్మ కూడా ఈ ‘క్లబ్బు’ కార్యక్రమాలను విస్తరింపచేయడానికి, పటిష్టమైన కార్యప్రణాళిక ఏర్పాటు చేయడానికి చెన్నపట్నం చేరింది.
ఆనాడు సాహిత్య సాంస్కృతిక విద్యా కార్యకలాపాలకు తెలుగువారందరికీ మద్రాసు ముఖ్య కార్యస్థానంగా ఉండేది. తెలుగు జిల్లాల శ్రీమంతులు, జమీందారులు, సంస్థానాధిపతులు అనేక కార్యకలాపాలతో తరచూ మద్రాసు నగరంలోనే గడుపుతుండేవారు. ఇక్కడి ఉన్నత న్యాయస్థానంలో తెలుగు జిల్లాల వారికి ఎన్నో వ్యాజ్యాలు నడుపుకోవలసిన అక్కర ఉండేది. ఇక రాజకీయాలకు దక్షిణ భారతదేశానికంతటికీ చెన్నపట్నమే ముఖ్య కేంద్రం. 1940వ సంవత్సరం వచ్చేటప్పటికి జయపురం మహారాజా విక్రమదేవవర్మ గారు దుర్గాబాయి నిర్వహిస్తున్న మహిళాభ్యుదయ కృషికి ఐదువేల రూపాయల విరాళం ఇచ్చారు. అప్పటికే మహిళా సమితి సభ్యుల సంఖ్య నూరు దాటింది. సభ్యులంతా సంవత్సరం చందాలు ఇచ్చేవాళ్ళు. దుర్గాబాయికి తమ మహిళా సంఘం కార్యకలాపాలు విశాల ప్రాతిపదికపై విస్తరించాలని అభిలాష ఉండేది. దానికి తగిన ఆర్థికమైన వనరులు, విశాలమైన సమావేశస్థలమూ కావాలి. 14, ద్వారకా, మైలాపూర్‌లోని మహిళా సమితి వసతి సౌకర్యం అందుకు ఏ మాత్రం సరిపోవడం లేదు. బులుసు సాంబమూర్తిగారు ఎంతో పలుకుబడి గలవారు. చెన్నపురి ఆంధ్ర మహాసభకు ఆయన అప్పుడు అధ్యక్షులు. ఉభయ తారకంగా ఉంటుందని తమ మహిళా సమితిని ఆంధ్ర మహాసభ అనుబంధ మహిళా విభాగంగా గుర్తించవలసిందనీ, ఆర్థిక సహాయం, వసతి సౌకర్యం, అందువల్ల ఇతోధికంగా సమకూడుతాయనీ దుర్గాబాయమ్మ, సాంబమూర్తిగారిని అర్థించడం, అందుకాయన వెంటనే సమ్మతించడం జరిగింది. 3, మాధవబాగ్‌కు మహిళా సమితి కార్యస్థానం మరింత విస్తృత కార్యక్రమాలతో చేరిపోయింది. 1940లో మహిళా సమితి వార్షికోత్సవానికి విక్రమ దేవవర్మగారు అధ్యక్షత వహించడంతో చెన్నపట్నంలో మహిళా సమితికి గొప్ప గుర్తింపు వచ్చింది. ఆ వార్షికోత్సవంలో సంగీత, నృత్య, నాటిక ప్రదర్శనలతో చెన్న నగరమంతా ఆనందం పొందింది.
1941వ సంవత్సరంలో చెన్నపురి ఆంధ్ర మహాసభ రజతోత్సవాలు జరిగాయి. సాహిత్య కార్యక్రమాలతో, చిత్రకళా ప్రదర్శనలతో, సంగీత నృత్య ప్రదర్శనలతో ఈ రజతోత్సవాలు వైభవంగా జరిగాయి. ముఖ్యంగా తెలుగువారంతా సమధికోత్సాహంతో పాల్గొన్నారు. ఈ ఉత్సవాలు, సంస్థ పట్ల మమత్వం చూసిన తర్వాత దుర్గాబాయికి తమ మహిళా సమితి కూడా ఒక స్వతంత్ర ప్రతిపత్తితో, ప్రత్యేక సంస్థగా విలసిల్లాలని కోరిక కలిగింది. అప్పుడు తాము తలపెట్టిన మహిళా వికాస కార్యక్రమాలు మరింత వేగవంతంగా, మరింత ప్రయోజనకరంగా, మహిళలకు అండదండలు చేకూర్చేవిగా, కళావికాసం, చేతివృత్తుల శిక్షణపరంగా, పురోగతిని సాధించవచ్చునని తోచింది. శ్రీ సాంబమూర్తి గారితో సంప్రదించగా వారు అందుకు అంగీకరించారు. ఆయన సలహాతోనే ఆంధ్ర మహిళా సభ ప్రత్యేక ప్రతిపత్తి గల మహిళా వికాసోద్యమ సంస్థగా ఆవిర్భావం పొందింది.
అంతకు పూర్వం పది సంవత్సరాల కిందట మద్రాసులో దుర్గాబాయి ఉప్పు సత్యాగ్రహం సందర్భంగా చరిత్ర సృష్టించింది. 21 రోజులు సత్యాగ్రహం నిర్వహించింది. దక్షిణ భారతదేశానికంతటికీ గొప్ప పేరు తెచ్చింది. గాంధీజీ సిద్ధాంతాలు విజయం సాధిస్తాయని నిరూపించింది. ఇప్పుడామె ఎం.ఎ, బి.ఎల్ ను వారణాసిలో మాలవ్యాజీ స్థాపించిన విశ్వవిద్యాలయంలో చదువుకొని వచ్చింది. హిందీలో, ఇంగ్లీషులో, తమిళంలో, తెలుగులో వాగ్దాటి కలది. మద్రాసు హైకోర్టులో న్యాయవాద వృత్తిలో రాణిస్తోంది. ఈ కారణాలన్నింటివల్లా ఆంధ్ర మహిళా సభ ఆశయాలకు, లక్ష్యాలకు వదాన్యులు, శ్రీమంతులు, పత్రికల వారూ, సామాన్యులు కూడా అండదండలుగా నిలిచారు. అదీకాక స్వాతంత్య్రోద్యమ ఆవేశం, ఆవేదన ఉండనే ఉన్నాయి.
1920లలోనే పిఠాపురం సంస్థానం వారు రాణి చిన్నమాంబదేవి ప్రేరణతో ఒక మహిళా సభ నిర్వహించినప్పుడు పదేళ్ళ వయసున్న దుర్గాబాయి ఆ సభలో పాల్గొని తన బాలికా పాఠశాల విద్యార్థినులచే జాతీయ గీతాలు పాడించింది, తానూ పాడింది. జాతీయోత్సాహం కలిగించే రంగస్థల కార్యక్రమాలు నిర్వహించింది. ఇప్పుడు ఆంధ్ర మహిళా సభ ద్వారా సమాజాన్ని ఎంతో చైతన్యవంతం చేస్తోంది. 1940 మూడో వార్షికోత్సవం నాటికే వృత్తి విద్యా శిక్షణ సంస్థను కూడా నిర్వహిస్తోంది. అనేక చేతివృత్తులను పునరుద్ధరించింది. నిస్సహాయులైన మహిళలకు ఎందరికో ఆశ్రయం కల్గిస్తోంది. చాపలల్లడం, నవారు నేయడం, కాగితాలు తయారు చేయడం, అద్దకం, చేనేత వస్త్రాలు ఉత్పత్తి చేయడం, బొమ్మలు సృష్టించి వాటిని రంగులు వేసి అత్యంతాకర్షణీయంగా తయారు చేయడం, సంగీతం, నృత్యం, చిత్రలేఖనం తరగతులు నిర్వహించడం, హిందీ బోధించడం, బెనారస్ విశ్వవిద్యాలయానికి మెట్రిక్ పరీక్షలకు వెళ్ళడానికి శిక్షణనివ్వడం, మొదలైన కార్యక్రమాల ద్వారా ఆమె ఎందరికో బతుకు తెరువుకు ఆధారమైంది. ఇన్ని సంచలన కార్యక్రమాల ద్వారా ఆమె మహిళా చైతన్యాన్ని జాగృతం చేస్తుండడంతో ఆంధ్రదేశంలోని సంస్థానాల రాణివాసాలన్నింటినీ ఆమె ఎంతగానో ఆకర్షించింది. సంస్థ తరపున ఆమె గాయక బృందాలను కూర్చింది. నాటక ప్రదర్శన జట్టులను ఏర్పాటు చేసింది. ఏలూరు, కాకినాడ, పిఠాపురం, రాజమండ్రి వంటి చోట్ల సాంస్కృతిక కార్యక్రమాలను, సంగీత కచేరీలను తన ఔత్సాహిక బృందాల చేతనే ఇప్పించి పెద్దలను, జమిందారులను, ధనవంతులను ఆకట్టుకొంది. మద్రాసు నగరంలో అయితే తన సంస్థ సుశిక్షితులైన కార్యకర్తల ద్వారా ఇల్లిల్లు తిరిగి పత్రం, పుష్పం, ఫలం, తోయంలాగా విరాళాలను సేకరించింది.
ఇవన్నీ వినీ, చూసీ, జమిందారిణి ఫాయాలో ఉన్నవారు ఆంధ్ర మహిళా సంస్థకు పెద్ద పెద్ద విరాళాలందజేశారు. మీర్జాపురం రాణి లజ్‌చర్చ్ రోడ్డులో విశాలమైన నివేశన స్థలాన్ని మహిళా సభ కోసం కొనిపెట్టింది. అట్లానే బొబ్బిలి రాణి మహిళా విద్యాలయానికి, బాలికల వసతి గృహానికి లక్ష రూపాయలపైనే విరాళమిచ్చింది. కాళహస్తి సంస్థానం జమీందారిణి రాజ్యలక్ష్మీదేవి అవసరమనుకొన్నప్పుడల్లా భూరివిరాళమందించింది.
1942 యుద్ధ వాతావరణంతో ముఖ్యంగా సముద్రతీర ప్రాంతాలవారు ఎంతో భీతావహులై పట్టణాలను ఖాళీచేసి వేర్వేరు ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కూడా దుర్గాబాయి చెన్నపట్నంలోని మెట్రిక్ విద్యార్థినులను పరీక్షలు రాయించడానికి బెనారస్ తీసుకువెళ్ళింది. కొన్నాళ్ళు మద్రాస్ నగరంలో పౌరజీవనం స్తంభించినప్పుడు దుర్గాబాయి కుటుంబమంతా కొన్ని వారాలు కాళహస్తి సంస్థానంలో గడిపివచ్చారు.
1941 నుంచి 46 వరకు చాలా స్వల్పకాలంలోనే దుర్గాబాయి ఆంధ్ర మహిళా సభను ఎంతగానో అభివృద్ధికి తెచ్చింది. చదువు, సంగీతం, నృత్యం, చిత్రలేఖనం, వృత్తి విద్యా కోర్సులు, లఘు పరిశ్రమల ఉత్పత్తులు, వినోద పర్యాటకులకు ఆవాసాలు, స్వల్పకాలిక తరగతుల విద్యాశిక్షణ, నర్సింగ్ కోర్సులు, శిశు, మాతా ఆరోగ్య సంరక్షణా సంబంధ వైద్య విద్యా తరగతులు, శిక్షణా కార్యక్రమాలు, భోజన వసతి సదుపాయ మందిరాలను దుర్గాబాయి తన ఆంధ్ర మహిళా సభ ద్వారా నిర్వహింపచేసింది. అంగవైకల్యం గల పిల్లల కోసం ప్రత్యేక శ్రద్ధ చూపి వారికోసం యాంత్రిక అవయవాలు తయారుచేసే సంస్థాగత శిక్షణ నిర్వహింపచేసింది.
1946లో గాంధీజీ హిందీ ప్రచార సభ వారి రజతోత్సవాల ప్రారంభోత్సవం చేయడానికి మద్రాస్ వచ్చినప్పుడు ఆయన ఆశీస్సులతో తాను నిర్మించిన మహాభవనాల ప్రారంభోత్సవం కూడా నిర్వహించింది.
1939లో తన ఆనర్సు కోర్సు పూర్తి చేసుకుని మద్రాసు నగరం చేరి సంక్షేమ సమాజ కార్యకలాపాలలో ప్రవేశించేనాటికి ఆమెకు 30 ఏళ్ళ వయసు. అప్పుడామె లా కోర్సులో చేరింది. న్యాయవాద విద్యలో గణనీయంగా కృతార్ధులై మద్రాసు హైకోర్టులోనే తన ప్రాక్టీసు ప్రారంభించింది. సివిల్, క్రిమినల్ వ్యాజ్యాలలో ఎంతో పేరు తెచ్చుకుంది. ఆనర్సు పూర్తి కాగానే టాటా ఫండమెంటల్ ఇన్‌స్టిట్యూట్ వారి స్కాలర్‌షిప్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో ప్రవేశాహ్వానం, ఇన్నర్ టెంపిల్‌లో న్యాయశాస్త్ర ఉన్నత విద్యాధ్యయన అవకాశం లభించాయి. కానీ 1942 ప్రపంచ యుద్ధ బీభత్స వాతావరణం వల్ల ఆమె ఆ అవకాశాలను ఉపయోగించుకోలేదు. ఒక విధంగా స్వతంత్ర భారత నవ నిర్మాణానికి అది మేలు చేసింది.
1958లో ఆంధ్ర మహిళా సభ కార్యకలాపాలు, శిశు మాతా సంరక్షణ సేవలు, ఉపాధ్యాయ శిక్షణ విద్యాలయంతో పాటు ఉన్నత విద్యాసంస్థలు నెలకొల్పడం, వృత్తివిద్యా కోర్సుల విస్తరణలు, అన్ని రకాల వైద్య సౌకర్యాలతో గొప్ప వైద్య పరిశోధనా సంస్థలు, చికిత్సాలయాలు హైదరాబాద్‌కు విస్తరించాయి. ఆ తర్వాత సంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో కూడా అవి నెలకొన్నాయి. నేడు ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఆంధ్ర మహిళా సభ ఒక అత్యుత్తమ సామాజిక సేవా సంస్థ.
మూడు, నాలుగు దశాబ్దాల కాలలో ఆంధ్ర మహిళా సభ దక్షిణాదినంతా ప్రభావితం చేసింది. 1941లో ప్రత్యేక స్వతంత్ర వ్యవస్థా నిర్వహణ రూపొందించుకున్న ఈ మహా సంస్థ సంస్కరణ, సామాజిక దీక్షా సేవాసంస్థ దుర్గాబాయి 1981లో స్వర్గతి చెందేనాటికి ఆంధ్ర దేశంలో 12 జిల్లాలలో తన సేవా కార్యక్రమాలు, పునరుజ్జీవన పథకాలు విస్తరించడంతో పాటు నూటికి పైగా తన బోధన కేంద్రాలు, ఉపాధి సముపార్జన సంస్థలు, విద్యాశిక్షణ సంస్థలుగా ఒక గొప్ప వ్యవస్థారూపం సంతరించుకొంది.ఈ మహా సంస్థ పుట్టుక, అభివృద్ధి ఒక జీవనదిని తలపింపచేస్తున్నది.
రాజ్యాంగ నిర్మాణ సభ
1947లో భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించింది. అంతకు రెండేళ్ళ నాడే అది కనుచూపు మేరలో సాక్షాత్కరించింది. 1940 దశకంలోని తొలి సంవత్సరాలలో ప్రపంచ యుద్ధ పర్యవసనాలు, అనేక చారిత్రక పరిణామాలు, సమీకరణలు, ప్రపంచ దేశాల పరిస్థితులు, భారతదేశంలో స్వాతంత్రోద్యమం తీవ్రతరం కావడం సంభవించాయి.
ఒక ప్రజాస్వామ్య స్వతంత్ర దేశానికి, ప్రభుత్వానికి తనదైన రాజ్యాంగం అత్యంత అవసరం. రాజ్యాంగాన్ని బట్టే ఎన్నికలు, ప్రజాప్రతినిధుల చట్టసభలు, న్యాయస్థానాలు, ప్రజల హక్కులు, కార్యనిర్వాహక శాఖ ఉత్తర్వులు, పత్రికా స్వాతంత్య్రం, ప్రజా సామాన్య జీవనం నిర్ణీతమవుతాయి.
అందువల్ల రాజ్యాంగ నిర్మాణ సభ ఏర్పాటైంది.
”లాయరుగా దూరదృష్టి, తార్కిక శక్తి ఉన్న దుర్గాబాయి పేరు రాజ్యాంగ నిర్మాణ సభ్యుల జాబితాలోకి ఎక్కింది. శ్రీ ప్రకాశం, రాజాజీ, కామరాజ్ ప్రభృతులప్పట్లో ఆమె పేరును రాజ్యాంగ నిర్మాణ సభకు ప్రతిపాదించడం జరిగింది. తత్ఫలితంగా ఆ సభలకు హాజరు కావలసిందిగా, ఢిల్లీ నుంచి ఆమెకు ఆహ్వానం వచ్చింది” అని దుర్గాబాయి జీవిత చరిత్రలో నేతి సీతాదేవి పేర్కొన్నారు. (పుట.201)
రాజ్యాంగ నిర్మాణ సభ సన్నాహక కార్యక్రమాలు 1946లో ప్రారంభమయ్యాయి. లాయర్‌గా అప్పటికే దుర్గాబాయి విశేషమైన పేరు, ప్రఖ్యాతి తెచ్చుకుంది. ఆమె న్యాయవాద వృత్తిలోనే కొనసాగితే ఉన్నతోన్నత స్థానాలు పొందే అవకాశం ఉందనీ, సమాజ సేవలో అప్పటికే నిమగ్నమై ఉందనీ, కాబట్టి రాజ్యాంగ నిర్మాణసభ సభ్యత్వం అంగీకరించవద్దనీ ఆమె అభివృద్ధిని కాంక్షించేవారు కొందరు ఆమెకు సలహా ఇచ్చారు.
కానీ రాజ్యాంగ నిర్మాణ సభ్యత్వం ఆమెకు ఎంతో ఆకర్షకమైంది. జాతి పురోగమనంలో అది అత్యంత కీలకమైన సన్నివేశం. ఒక చారిత్రాత్మక ఘట్టం. అంతేకాక ఒక సంవత్సర కాలంలోనే రాజ్యాంగం సంరచన పూర్తి చేయగలమని పెద్దలు ప్రారంభంలో ఊహించారు. కానీ అది పూర్తి కావడానికి నాలుగు సంవత్సరాలు పట్టింది. 1946 డిసెంబరు 9 నుండి రాజ్యాంగ నిర్మాణ సభలు మొదలయ్యాయి. దుర్గాబాయి రాజ్యాంగ సభ సభ్యత్వం ఆమోదించింది.
ఇక్కడ ఆంధ్ర మహిళా సభ కార్యకలాపాలు సమర్థులైన కార్యనిర్వహణ దక్షులకు ఆమె అప్పగించింది. పర్యవేక్షణకు తన తల్లి, తమ్ముడూ ఉండనే ఉన్నారు. మొదటి రెండు సంవత్సరాలు ఆమె వారం వారం ఢిల్లీ నుంచి మద్రాసు వచ్చి ఇక్కడి కోర్టు పనులు నిర్వహించుకునేది. కానీ రాజ్యాంగ నిర్మాణ సభ పనుల ఒత్తిడి వల్లనైతేనేమి, ఇంటి దగ్గర కూడా చట్టసభ పనులు చూసుకోవలసిన అగత్యం వల్లనైతేనేమి ఢిల్లీలోనే ఆమె అప్పటి ఉన్నత న్యాయస్థానంలో తన వృత్తి నిర్వహించడానికి నిర్ణయించుకుంది. అప్పట్లో ఆ ఉన్నత న్యాయస్థానాన్ని ‘ఫెడరల్ కోర్టు’ అనేవారు. ఫెడరల్ కోర్టులోనూ ఆమె ‘కేసు’లు వాదించేది. అప్పుడు ఢిల్లీలో ‘ఇంటరెమ్ పార్లమెంటు’ కూడా ఏర్పడి పనిచేసేది. రాజ్యాంగ నిర్మాణ సభలోనూ, ఇంటరెమ్ పార్టమెంటులోనూ దుర్గాబాయి మేధావిగానూ, రాజనీతిజ్ఞరాలుగానూ, సమాజ సంక్షేమతత్త్వ చింతనాపరురాలిగానూ కొద్దికాలంలోనే పేరు తెచ్చుకుంది.
ముఖ్యంగా హిందూకోడ్ బిల్లు చర్చలో ఆమె చూపిన వాద నైపుణ్యం, తార్కిక ప్రతిభ అత్యంత ప్రశంసనీయమైనవని అప్పటి విషయాలు తెలిసినవారు రాశారు. హిందూ కోడ్ బిల్లు ఏమి నిర్దేశిస్తున్నదంటే సమాజ పురోగతిలో ఆర్థిక, సామాజిక, నైతిక, రాజకీయ, స్వాతంత్య్రం స్త్రీ పురుషులిద్దరికీ సమానంగా ప్రవర్తింపచేయాలని. సనాతన సంప్రదాయ వర్గాల వారు ఈ బిల్లు పట్ల ఎంతో ఆందోళన చెందారు. హిందూ సంస్కృతికి, సామాజిక వ్యవస్థకు గొప్ప ప్రమాదం కలుగబోతున్నదని నిరసనలు వ్యక్తం చేశారు. కానీ వారి ఆందోళనలు, భయాలూ క్రమేపీ సద్దుమణిగాయి. 1949లో హిందూ కోడ్ బిల్లును నవ భారత నిర్మాత డా|| బి.ఆర్.అంబేద్కర్ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. విడాకుల హక్కు, స్త్రీల ఆస్తి హక్కు, హిందూ కోడ్ బిల్లు నిర్దేశించడం జరిగింది. హిందూ కోడ్ బిల్లును గట్టిగా సమర్ధించి అది చట్ట రూపం పొందడానికి దుర్గాబాయి కృషి ఎంతో ఉంది. అంతేకాక రాజ్యాంగంలోని కొన్ని స్మృతి విధాన ప్రకరణలను రూపొందించడంలో ఆమె పాత్ర ఎంతో ఉంది. రాజ్యాంగ సభ చట్ట నిర్ణాయక చర్చలలో, వాదోపవాదాలలో ఆమె 750 సవరణలు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. హిందూ కోడ్ బిల్లు రూపకల్పనలో ప్రతిపాద స్వరూప నిర్ధారణ సంఘం (స్టీరింగ్ కమిటీ)లో దుర్గాబాయి సభ్యురాలు. ఆమె అభిప్రాయాలను, వాదనలను డా|| అంబేద్కర్ శ్రద్ధతో, ఆసక్తితో పరిశీలనలోకి తీసుకునేవారు. ముఖ్యంగా లాయర్‌గా, అనుభవజ్ఞురాలిగా, స్త్రీలకు జరిగే అనేక అన్యాయాలను స్వయంగా గ్రహించగల వ్యక్తిగా ఆమె హిందూ కోడ్ బిల్లు చట్టంగా రూపొందటానికి శాయశక్తులా కృషి చేసిందని దుర్గాబాయి చరిత్రకారులు రాశారు.
చట్టసభలో ప్రతిపాదించే ముసాయిదా తీర్మానాలన్నింటినీ ఆమె సాకల్యంగా ముందుగానే సమీక్షించింది. ఆమె కొన్ని సందర్భాలలో సభాధ్యక్ష పదవీ బాధ్యతలను కూడా నిర్వహించింది. ఇట్లా అధ్యక్ష స్థాన బాధ్యతా నిర్వహణను చేపట్టవలసిన వారి జాబితాలో ఆమె పేరు కూడా ఉండడం వల్ల (ప్యానెల్ ఆఫ్ ఛైర్మన్) ఆమె ఎన్నో ముఖ్యమైన చట్టాలు ఆమెదం పొందిన సందర్భాలలో అధ్యక్ష స్థానాన్ని సమర్ధంగా నిర్వహించింది. కాన్సిట్యుయంట్ అసెంబ్లీ స్పీకర్ మావలంకర్ మహాశయుడు దుర్గాబాయికి అధ్య్ష స్థానం వహించే అవకాశాలు చాలా కలిగించేవారు.
ఒకసారి చర్చలలో ఒక సభ్యుడు అధ్యక్ష స్థానాన్ని ‘సర్’ అని సంబోధించి తన అభిప్రాయ ప్రకటనకు ఉపక్రమించాడు. అప్పుడు కొందరు సభ్యులు ఆ సంబోధన సరికాదన్నారు. అందులోని ఐచిత్యానౌచిత్యాల ప్రసక్తి తెచ్చారు. అప్పుడు సభాధ్యక్ష స్థానం నుంచి దుర్గాబాయి అధ్యక్ష స్థానం వహించిన వ్యక్తిని లింగ వివక్ష పట్టింపు లేకుండా ‘సర్’ అని సంబోధించవచ్చునని ‘రూలింగ్’ (అధికారిక తీర్పు) ప్రకటించింది. అది అందరి హర్షామోదాలకు పాత్రమైంది.
అంతేకాక ఆమె ఎప్పుడూ సామాన్య ప్రజలకు మేలు కలిగేలా పన్నుల నిర్ణయం, ఆదాయ వ్యయ ప్రతిపాదనలు ఉండాలని వాదించేది. మంత్రివర్గంలో వారెవరైనా ఆమెను చిన్నపుచ్చే విధంగా తమ వాక్చాతుర్యాన్ని ప్రదర్శించినా ఆమె చిన్నబుచ్చుకునేది కాదు. ఉదార హృదయంతో పరిగణించేది. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒక సందర్భంలో ఆమెను ఈ విషయంలో ఎంతగానో మెచ్చుకున్నారు. స్వయంగా ఆమె దగ్గరికి వచ్చి అభినందించారు. వల్లభాయ్ పటేల్, ఆయన కుమార్తె మణిబెన్ పటేల్‌ను దుర్గాబాయి మద్రాసు వచ్చి ఆంధ్ర మహిళా సభ కార్యక్రమాలను చూడవలసిందిగా తరచూ ఆహ్వానించేదని ఆమె జీవిత చరిత్రకారులు రాశారు.
ఒకసారి సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఒకరు, సుప్రీంకోర్టు స్థాయికి తగిన గ్రంథాలయం లేదనీ, దాన్ని సమకూర్చుకోవడానికి ఆర్థిక వనరులు తగినన్ని అవసరమనీ, అందుకుగాను బడ్జెట్‌లో తగినంత మొత్తం కేటాయించేట్లు వల్లభాయ్ పటేల్‌కు సిఫార్సు చేయవలసిందిగా దుర్గాబాయిని అర్థించారట. అప్పుడు సర్ తేజ్‌బహదూర్ సఫ్రూ వ్యక్తిగత సేకరణ గ్రంథాలయమంతా సుప్రీంకోర్టుకు విరాళంగా అందేలా వల్లభాయ్ పటేల్ సహాయం చేసినట్లు కథనం.
దుర్గాబాయి రాజ్యాంగ నిర్మాణ సభా సభ్యత్వం ఆధునిక భారతదేశ చరిత్రలో విస్మరించరానిది. ”ఈనాడు స్త్రీ ఉద్యోగావకాశాలు పొందినా, విద్యావకాశాలు సవాలక్ష పొందగలిగినా, ఆస్తి హక్కు, అరణపు హక్కు కలిగి ఉన్నా, వివాహానికీ, విడాకులకు కూడా హక్కులు పొంది ఉన్నా, మరి ఇతర అనేక హక్కులు పొంది ఉన్నా పురుషునితో పాటు ఆమెకు నవ్య ప్రపంచంలో వ్యక్తిత్వం పెంచుకోగలిగిన హక్కులు కలిగినా, వీటన్నింటికీ ఆనాడు రూపొందిన రాజ్యాంగ విధానాన్ని నిర్ణయించిన అనేకమంది సభ్యులతో పాటు దుర్గాబాయి కూడా బాధ్యురాలు” అని నివాళి అర్పించారు దుర్గాబాయి జీవిత చరిత్ర రచయిత్రి నేతి సీతాదేవి – (పుట 215- 1977).
ఆమె ఢిల్లీలో న్యాయవాద వృత్తి ప్రాక్టీసు చేస్తుండగా అక్కడి ఉన్నత న్యాయస్థానంలో ఒక దొంగ సంతకం కేసు (వ్యాజ్యం) విచారణకు వచ్చింది. ఈ కేసు నిజ నిర్ధారణ కోసం దుర్గాబాయి సిమ్లా వెళ్ళి సాక్ష్యాధారాలు సేకరించింది. సిమ్లా వెళ్ళిన సందర్భంగానే ఆమె ధ్కరు బాబాను కలుసుకొన్నది. ధ్కరు బాబా ఆమెనెంతో అభిమానించేవారు, గౌరవించేవారు. 1946లో ఆంధ్ర మహిళా సభ భవన ప్రారంభోత్సవానికి, దానికి అనుబంధంగా వసతి గృహ నిర్మాణ ప్రారంభోత్సవానికి ధ్కరు బాబా వచ్చి ఆ వేడుకలలో పాల్గొన్నారు.
ఆమె గొప్పతనానికి, స్వాతంత్య్రానంతరం భారతదేశంలో మహిళాభ్యుదయానికి దుర్గాబాయి సాగించిన కృషే గొప్ప తార్కాణం. ఆమె స్ఫూర్తితో, ఆమె కలిగించిన భావ పరివర్తనతో, సాధించిన ఆత్మ విశ్వాస పరిణతితో మహిళలు అన్ని రంగాలలోనూ బాధ్యతాయుతమైన పదవులలో, హోదాలలో, అధికారాలలో, విధాన నిర్ణయాలలో రాణించారు, రాణిస్తున్నారు, రాణిస్తారు.
1940లో జరిగిన ఆంధ్ర మహిళా సమితి మూడో వార్షికోత్సవంలో కార్యదర్శి నివేదికలో ఆమె ఇలా చెప్పింది.
”ఆంధ్ర నారీ జనోద్ధరణ మా ఆశయం. ఆంధ్రాభ్యుదయం మా ఆదర్శం. ఆంధ్ర మహిళా విద్యావ్యాప్తి, కళా వికసనం, విజ్ఞానాభివృద్ధి జయప్రదంగా కొనసాగిస్తూ, స్త్రీ ఉద్యమానికీ, దేశ సౌభాగ్యానికీ, ఉపకరించడం మా ఉద్దేశ్యం. ఆరంభించిన రెండు సంవత్సరాలలోనే, మా సభ శాఖోపశాఖలై పెంపు గాంచిందనడానికి గర్విస్తున్నాం. ప్రారంభించిన మా విద్యాశాఖ పని చేయగలుగుతోంది. మా నృత్య, గాన, చిత్రలేఖన విభాగాలు మాత్రం అత్యుత్సాహంతో పనిచేస్తున్నాయి. ఇప్పుడిప్పుడే నెలకొన్న మా పారిశ్రామిక విభాగం గురించి మాకంత చింతలేదు” అని ఆమె ఆత్మవిశ్వాసం ప్రకటించారు. 1940లోనే కాళహస్తి రాణి రాజ్యలక్ష్మీ మురళీకృష్ణరావు ఆంధ్ర మహిళా సమితి పారిశ్రామిక శిక్షణ విభాగం కార్యకలాపాలకు 25 వేల విరాళమిచ్చారు. ఆ రోజుల్లో 25 వేల విరాళమంటే సామాన్యమైన మొత్తం కాదు. ఈ విరాళంతో దుర్గాబాయి చెన్నపట్నంలో శాంథోమ్ ప్రాంతంలో పారిశ్రామిక ఉత్పత్తి సంస్థను నెలకొల్పారు. అప్పుడే వారు ఒక ముద్రణాలయాన్ని కూడా స్థాపించుకున్నారు.
1941 ఆంధ్ర మహిళా సభ నాలుగో వార్షికోత్సవం జరిగింది. ఈ సభలకు అధ్యక్షత వహించడానికి సరోజినీ నాయుడు హైదరాబాద్ నుంచి వచ్చారు. మహిళా సభ కార్యకలాపాలను ఆమె ఎంతో ప్రశంసించారు.
1944లో హైదరాబాద్ వచ్చిన దుర్గాబాయిని ఆంధ్ర యువతీ మండలి వారు గౌరవించారు. ఆ సభకు అధ్యక్షత వహించిన దుర్గాబాయమ్మకు సరోజినీ నాయుడు తాను అస్వస్థురాలిగా ఉన్నాననీ, ప్రసంగించలేననీ ముందు చెప్పినా భావోద్వేగంతో దుర్గాబాయి సాగిస్తున్న మహిళా వికాస కృషిని ఎంతగానో ప్రశంసించారు.
1940లోనే తెలుగు వారి ప్రముఖ దినపత్రిక సంపాదకీయంలో ఆమె ప్రశంసితురాలైంది. 1950 వచ్చే సమయానికి ఆమె రాజ్యాంగ సభ నిర్వహించే అధ్యక్ష స్థానానికి ఎదగగలిగింది. మహిళా వికాసాన్ని దృఢతరం చేయగలిగింది.