పల్లె నుంచి పంతులమ్మగా… రచయిత్రిగా…!! ఓ గ్రామీణ స్త్రీ జీవన ప్రయాణం – కల్పనా రెంటాల

లలిత గారు నాకు దాదాపు రెండు దశాబ్దాలుగా తెలుసు. అల్లాడి ఉమ, ఎం.శ్రీధర్‌ వాళ్ళ ఇంట్లో చూశాను. చాలా నెమ్మదస్తురాలు. ఒద్దికగా మాట్లాడే మనిషి. మృదు స్వభావి, స్నేహశీలి. ఆమె గురించి నాకు ఇంతే తెలుసు. ఉమ, శ్రీధర్‌లతో సాహిత్య చర్చలు చేసేటప్పుడు, ఉమ వాళ్ళ నాన్నగారు, వాళ్ళ దూరపు బంధువు ఒకామె ఉన్న రోజుల్లో… లలిత గారు వంటింట్లో నుంచి ఓ కప్పు కాఫీతో పాటు చిరునవ్వుని కూడా అందించి ఇచ్చేవారు. అది లలిత గారితో మా తొలినాటి పరిచయం.

తర్వాత వైష్ణవి, విశాల్‌ పుట్టాక, వారి ఆటపాటలు కొన్నిసార్లు దృష్టికి వచ్చేవి. మాటల సందర్భంలో, భోజనాల దగ్గర లలిత గారు డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ పద్ధతిలో చదువుకున్నట్లు చెప్తే గర్వంగా అనిపించింది. అప్పటికి తెలిసింది అదే. తర్వాత మేము అమెరికా వెళ్ళిపోయాము. ఇండియాకు వచ్చినప్పుడు ఉమా వాళ్ళ ఇంట్లో లలిత గారిని చూసేవాళ్ళం. కానీ ఆమె కవితలు, కథలు చదవటం మాత్రం ఈ మధ్యనే.

నాకు తెలిసిన లలితను మీకెందుకు పరిచయం చేయాలనుకుంటున్నానో నేను రాసినది చదివాక మీకే అర్థమవుతుంది. కొంతమందికి చదువు ఓ అంది వచ్చిన అవకాశం. మరి కొంతమందికి సాహిత్యం వారసత్వం. కానీ లలితకు ఇలాంటి ప్రివిలైజెస్‌ లేవు. అంతా స్వయంకృషి. కేవలం కృషే కాదు, ఆమె తెలివి తేటల మీద ఇంట్లో వాళ్ళకి, చుట్టుపక్కల వాళ్ళకి బోలేడు అపనమ్మకం. చిన్ననాటి నుంచి అడుగడుగునా అందరినీ నమ్మిస్తూ, తనని తాను ప్రోత్సహించుకుంటూ ఎదిగిన మహిళ లలిత.

లలితకు గొప్ప సంగీత వారసత్వం లేదు, ఇంట్లో లైబ్రరీ లేదు, సందు చివర ప్రభుత్వ గ్రంథాలయం లేదు. అమ్మ, నాన్న గోరు ముద్దలు పెట్టి గారాబం చేసి స్కూలుకి పంపి చదివించలేదు. స్కూలుకి వెళ్ళడం కోసం చాలా దూరం నడిచి వెళ్ళి, చదువుకోవటం కోసం అవ్వ దగ్గర తన్నులు తిన్న బాల్యం ఆమెది. చిన్న వయసులోనే పెళ్ళి కావటంతో ఇంట్లో కోడలుగా, భార్యగా చేయాల్సిన పనులన్నీ చేసి కష్టపడి స్కూలుకి వెళ్ళి చదువుకున్న మహిళ లలిత.

తెలంగాణలోని వరంగల్‌ దగ్గర కడవెండి సీతారాంపురం ఆమె ఊరు. తండ్రి నక్సలైట్‌ ఉద్య మంలో అప్పట్లో యాక్టివ్‌గా పాల్గొన్నాడు. లలిత కుటుంబం ప్రధానంగా వ్యవసాయ ఆధారిత కుటుంబం. అగ్రవర్ణంలో పుట్టిన మహిళ. తాతల కాలం నాటి నుంచీ ఆరే క్షత్రియులు అంటే ఎంతో గొప్ప వంశమే. కానీ అదంతా ఒకనాటి మాట. పెద్ద కులమే కానీ చదువు, ఉద్యోగాల విషయంలో మాత్రం ఎప్పుడూ మొండిచెయ్యే ఎదురైంది. లలితకి తన కులం, వంశం మీద కన్నా బుద్ధిని వికసింపచేసే చదువు మీదనే బోలెడు విశ్వాసం. ఆమె నమ్మకం ఆమెను వమ్ము చేయలేదు. ఇవాళ లలిత స్వాభిమానంతో నిలబడింది అంటే అందుకు ఆమె చదివిన చదువు, ఆమె చదువు ఆధారంగా తెచ్చుకున్న టీచర్‌ ఉద్యోగం.

వరుసగా ముగ్గురాడపిల్లలు పుట్టడం వల్ల అదేదో ఆమె నేరం అయినట్లు లలిత వాళ్ళ అమ్మ, వాళ్ళ అత్తమ్మ దగ్గర నానా అగచాట్లు పడింది. ఆడపిల్ల అంటే వదిలించుకోవాల్సిన భారంగా భావించే కాలం అది. అందువల్ల లలిత 8వ క్లాసులో ఉండగానే చదివింది చాలు అంటూ పెళ్ళి చేసేశారు. ఉన్న ఊర్లో బడి లేకపోవడంతో వేరే ఊరుకి వెళ్ళి చదువుకునేది లలిత. చిన్నప్పటినుంచి లలితకు చదువంటే చాలా ఇష్టం. మంచిగా చదువుకునేది. పెళ్ళంటే ఏంటో తెలియని వయసులో పెళ్ళి జరిగిపోయింది. లలిత చదువుకన్నా పెళ్ళి ముఖ్యమనుకుని ఆమె నాయనమ్మ హడావిడిగా పెళ్ళి జరిపించింది. అక్కడితో నిజానికి లలిత చదువు ఆగిపోయి ఉండేది. అయితే లలిత కొంత అదృష్టవంతురాలు. లలిత అత్తకు కోడలు చదువుకోవాలని కొండంత ఆశ. అందుకని ఇంట్లో, ఊర్లో ఎంతమంది వెక్కిరించి కొక్కిరించినా ఆమె తన పంతం వీడలేదు. కోడల్ని చదవడానికి పంపింది. నీ కోడలు చదివి ఉద్యోగం చేస్తుందా, ఊళ్ళు ఏలుతుందా అని ఇరుగు పొరుగు వారు ఎగతాళి చేస్తే లలిత అత్తమ్మ ఎంతో ధైర్యంగా ”అవును. నా కోడలు చదివి టీచరు అవుతుంది” అంటూ సమాధానం చెప్పేది. ఆ అత్తమ్మ కలను నిజం చేసింది లలిత.

అయితే అదేమీ అంత సులువు తొవ్వ కాలేదు లలితకు. అందుకు లలిత ఎంతగానో శ్రమపడింది. చిన్నతనంలోనే పెళ్ళి కావటం వల్ల అత్తనే అమ్మగా లలితకు ఇంటిపని, వంట పని నేర్పించింది. ఇంటి పనులన్నీ చేసుకుని లలిత స్కూలుకి వెళ్ళి చదువుకుంది. చదువు పట్ల లలిత అత్తమ్మకు ఉన్న అవగాహన, స్త్రీలు చదువుకోవాల్సిన అవసరం ఇవన్నీ లలిత జీవితానికి ఉపయోగపడ్డాయి. చదువుతో పాటు లలిత ఖోఖో లాంటి ఆటల్లో కూడా ఉత్సాహంగా పాల్గొనేది. స్కూలు తరపున ఖోఖో ఆటల పోటీల్లో పాల్గొన్నప్పుడు ఫైనల్స్‌ కోసం వేరే ఊరు వెళ్ళి ఆడాల్సి వచ్చేది. ఇంట్లో వాళ్ళకు, ఊర్లో వాళ్ళకు అబద్ధం చెప్పి అత్తమ్మ లలితను ఖోఖో ఫైనల్స్‌ ఆడడానికి వేరే ఊరు తీసుకెళ్ళి కోడలి ఆటను కళ్ళారా చూసి ఆనందించింది. ఎంత ప్రేమగా ఉండేదో లలిత అత్తమ్మ అంత కఠినంగా ఉండేది. అవసరమైతే కోడల్ని కొట్టి తిట్టేది కూడా.

ఇలా ఎన్నో కష్టనష్టాలకోర్చి పదవ తరగతి దాకా చదువుకుంది లలిత. ఆ తర్వాత కుటుంబ పరిస్థితుల దృష్ట్యా భర్తతో కలిసి హైదరాబాద్‌ వచ్చింది. పాప వైష్ణవి పుట్టింది. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడిన లలిత కుటుంబం హైదరాబాద్‌ వచ్చాక కొత్త దారి వెతుక్కోవాల్సి వచ్చింది. అల్లాడి కుప్పుస్వామి గారింట్లో వంట పనిలో సహాయానికి కుదిర్చారు తెలిసిన వాళ్ళు.

లలిత జీవితానికి అదొక పెద్ద మలుపు. ఆమె జీవితం ఒక కొత్త మార్గంలో నడిచింది అప్పటి నుంచి. అత్తింటి వాళ్ళందరూ లలితను ”నీకేం తెలియదు, నీకేం రాదు” అంటూ ఎప్పుడూ చిన్నబుచ్చి మాట్లాడేవాళ్ళు. అల్లాడి వాళ్ళ ఇంట్లోకి వచ్చిన తర్వాత లలితకు ఓ కొత్త చూపు వచ్చింది. వంట దగ్గర నుంచి అనేక సామాజిక, సాహిత్య, రాజకీయ అంశాల గురించి ఆ ఇంట్లో ఎన్నో నేర్చుకుంది లలిత. ఒక కొత్త ప్రపంచం చూసింది. వంట చేసేశాక తీరిక దొరికినప్పుడు లలిత ఆసక్తిగా పేపర్‌ చదవటాన్ని గమనించారు కుప్పుస్వామి గారు. లలితలోని విద్యాతృష్ణను గమనించి దానికి కొత్త నీరు పోశారు సహృదయులైన కుప్పు స్వామి గారు. అందుకే లలితకు ఆయనంటే కేవలం గౌరవమే కాదు ప్రాణ సమానులుగా భావిస్తుంది. ఆయన పెద్ద మనసు, ఔదార్యం లలితకు కొత్త జీవితాన్ని ప్రసాదించాయి. లలిత ఆ ఇంట్లో ఒక మనిషిగా కలిసిపోయింది. ఆ ఇంటికి వచ్చే లాయర్లు, రచయితలు, చుట్టాలు అందరికీ లలిత తలలో నాలుకలాగా మారిపోయింది. ఆమెను ఎవరూ పరాయి వ్యక్తిగా చూడలేదు. అందరికీ ఆమె ఇంట్లో మనిషిగానే తెలుసు. అల్లాడి కుప్పు స్వామి గారు తాను నమ్మిన సిద్ధాంతాలను ఆచరణలో పెట్టిన గొప్ప మానవతావాది అన్నది లలిత విషయం ద్వారా మరోసారి రుజువైంది. కేవలం ఆయనే కాదు అల్లాడి ఉమ, అల్లాడి సీతారాం, ఎం.శ్రీధర్‌ వీళ్ళందరి సహృదయత గురించి లలిత ఎంతో గర్వంగానూ, సంతోషంగానూ సందర్భం వచ్చినప్పుడల్లా గుర్తుచేసుకుని అందరికీ చెప్తూ ఉంటుంది.

లలిత చేత డిగ్రీ చదివించారు కుప్పు స్వామి గారు. వంటపని చేశాక మిగతా సమయంలో చదువుకోవడాన్ని ఇంటిల్లిపాదీ సమర్థించి సహకరించారు. డైనింగ్‌ టేబుల్‌ దగ్గర, హాల్లో జరిగే రాజకీయ, సాహిత్య చర్చల ద్వారా లలిత ఎన్నో కొత్త విషయాలను నేర్చుకుంది. ఒక కొత్త ప్రపంచాన్ని చూసింది. మంచి మనుష్యులు ఎలా ఉంటారో అర్థం చేసుకుంది.

చదువుకోవటానికి, చదువుకున్న వాటిని ఆచరించడానికి ఉన్న తెగువ, ధైర్యం, నమ్మిన సిద్ధాంతాల కోసం నిలబడటం ఇలాంటివన్నీ ఆ ఇంటి ద్వారా, ఆ ఇంటి మనుష్యుల ద్వారా లలితకు అర్థమైంది. పార్ట్‌టైమ్‌గా ఒక స్కూల్లో తెలుగు టీచర్‌గా పనిచేయడం ప్రారంభించాక ఆమె జీవిత దృక్పథం మరింత విశాలమైంది. అత్తమ్మ, అల్లాడి కుటుంబం ఈ రెండూ కూడా లలిత జీవితాన్ని మార్చాయి అని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు.

స్కూల్లో టీచర్‌గా లలిత మరో కొత్త జీవితాన్ని చూసింది. ఇప్పటిదాకా ఇంటి దగ్గర ఎదుర్కొన్న సందేహాత్మక చూపులు ఇప్పుడు బయట కూడా చవిచూడడం మొదలుపెట్టింది. ఎలాంటి టీచర్‌ ట్రైనింగ్‌ లేకుండా లలిత పాఠాలెలా చెప్తుందో అని అనేకమంది సందేహించారు. అయితే వారి అనుమానాలన్నింటినీ లలిత బద్దలు చేసి తనను తాను నిరూపించుకుని నిలదొక్కుకుంది. అది ఒక్క రోజుతో సాధించలేదు. అందుకు తన వంతుగా లలిత అదనంగా కొంత శ్రమ పడింది. తనను తాను మెరుగుపర్చుకుంది. తెలియని విషయాలను అడిగి తెలుసుకుంది. తెలుసుకున్న దాన్ని పిల్లలకు ఎలా సులువుగా చెప్పవచ్చో తన పద్ధతిలో కరిక్యులంగా రాసుకుంది. స్కూల్లో టీచర్‌గా ఆమె అనేక పరీక్షలు ఎదుర్కొంది. కానీ అన్నింటిలో ఆమె విజయం సాధించింది. స్కూల్లో పిల్లల దగ్గర, ప్రిన్సిపాల్‌ దగ్గర, తోటి టీచర్ల దగ్గర మన్ననలు పొందింది. స్కూలు తనిఖీకి వచ్చిన అధికారులు కూడా లలితను రకరకాలుగా ప్రశ్నలు వేసి ఆమె బోధనా పద్ధతులను, పిల్లలకు ఆమె నేర్పే పాఠాల గురించి ఎంతో ఆసక్తిగా అడిగి తెలుసుకుంటూ ఉంటారు.

ఇలా ఇంటా, బయటా లలితను ఎందరు ఎన్ని రకాలుగా పరీక్షించినా ఆమె ఎప్పుడూ బెదిరిపోలేదు. తనని తాను నిరూపించుకోవడానికి దాన్నొక అవకాశంగా తీసుకొని నిలబడింది. ఆమె ఆత్మవిశ్వాసమే ఆమెను నిలబెట్టంది. ఆమె చదువు ఆమెకు ఆ ధైర్యాన్ని, ఆశను, సాహసాన్ని అందించింది. అందుకే డిగ్రీతో ఆపకుండా లలిత ఎమ్మే కూడా ఇష్టంగా చేస్తోంది. ఆమె చదువు కేవలం డిగ్రీల కోసం కాదు. చదువుకోవటంలో ఉన్న ఆనందం, దానికున్న విలువ, అలాగే ఇంకా చదువుకుంటే పిల్లలకు ఇంకా అనేక కొత్త విషయాలు బోధించవచ్చన్న ఆశ ఆమెను ఉన్నత చదువుల వైపు పురోగమింప చేస్తోంది. అల్లాడి కుటుంబ సభ్యులు ఉమ, శ్రీధర్‌, సీతారాం ఏమంటారంటే ”ఒక ఆత్మీయురాలిగా మాకు సహాయం చేస్తూ మా బాగోగులు పట్టించుకుంటోంది”. వేర్వేరు వర్ణాలు, వర్గాల వారు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఒక కుటుంబంలా కలిసి మెలిసి జీవించగలరు అనటానికి ఇలాంటి సంఘటనలు ఒక ఉదాహరణగా నిలుస్తాయి.

రచయిత్రిగా లలిత :

లలితలో ఒక కవయిత్రి, ఒక కథకురాలు దాగి ఉన్నారన్న విషయం చాలా దగ్గరివాళ్ళకు మాత్రమే తెలుసు. ప్రాణాధికంగా గౌరవించిన కుప్పు స్వామి గారి మరణం లలితకు మానసికంగా పెద్ద దెబ్బ. ఆ బాధను ఆమె ఒక కవిత ద్వారా వ్యక్తీకరించింది. బహుశా అది ఆమె తొలి కవిత కావచ్చు, లేదా అంతకు ముందు ఎన్నో రాసినప్పటికీ అది మాత్రమే ఇతరుల కంట పడి ఉండవచ్చు. ఎందుకంటే మనసులోని భావాల్ని కాగితాలతో పంచుకున్న లలిత వాటిని ఎవరికీ చూపించకుండా చింపి పారేసేది. అందువల్ల అంతకు ముందు రాసినవేవీ ఇప్పుడు దొరకడం లేదు.

తర్వాత తర్వాత లలిత రాసే కవితలు, చిన్న చిన్న కథానికలు చూస్తే చాలా ముచ్చట వేస్తుంది. ఎందుకంటే చిన్న చిన్న విషయాలను తీసుకొని ఆమె వ్యక్తీకరించే తీరు చూస్తే ఆమె సాహిత్యంలో మరింత కృషి చేస్తే మంచి రచయిత్రి అవుతుందని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఉదాహరణకు లలిత రాసిన ఒక కవిత, కథ చదివితే నేను చెప్పే మాటల్లో ఎంత నిజముందో మీరే చెప్తారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన లలితకు అన్నదాత ఆరుగాలం పడే శ్రమ, కష్టం తెలుసు. స్కూల్లో పిల్లల్ని పెద్దయ్యాక ఏమవుతారు అని అడిగినప్పుడు రైతు బిడ్డ కూడా తాను రైతు అవుతానని చెప్పకపోవడం అమెను బాధించింది. దాని మీద లలిత ఒక కవిత, కథ రాసింది. అలాగే ఇళ్ళల్లో పనివాళ్ళ గురించి మరో కథ రాసింది. కథలకు, కవితలకు లలిత ఎన్నుకునే అంశాలు నేల వీడి సాము చెయ్యవు. మన కళ్ళముందు రోజూ కనిపించే అంశాలను ఆమె తనదైన పద్ధతిలో వ్యక్తీకరిస్తుంది. స్త్రీలు చదువుకుంటే సమాజం చదువుకున్నట్లేనని మరోసారి లలిత తన టీచింగ్‌ ద్వారాను, తన రచనల ద్వారానూ నిరూపిస్తోంది.

మన చుట్టూ, మన ఇళ్ళల్లో ఎందరో లలితలు ఉన్నారు. ఈ లలిత చిరు పరిచయం అలాంటి మరెందరో లలితలను గుర్తుపట్టి గౌరవించాల్సిన అవసరాన్ని, సందర్భాన్ని మనకు గుర్తుచేస్తోంది.

లలితకు మనఃపూర్వక అభినందనలు

లలిత రాసిన ఒక కథ, ఒక కవిత…

ఇదేం రోగమో ఏమో! – డి. లలిత

ఒక గ్రామంలో ప్రజల జీవితం. ఒక అందమైన పల్లె. రకరకాల మనుషులుంటారు. రాజయ్య అనే రైతు ఉండేవాడు. అతను పదిహేను ఎకరాల భూమితో వ్యవసాయం చేసేవాడు. వారికి సంతానం లేదు. కానీ మంచి గుణం. ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు సహాయం చేసేది అతని భార్య యాదమ్మ. రాజయ్య కుష్టు రోగంతో ఉన్నాడు. ఆ కాలంలో మందులు లేవు. ఆ రోగంతో బాధపడేవాడు. యాదమ్మ మాత్రం అతన్ని బాగా చూసుకునేది. ఒకబ్బాయిని దత్తపుత్రుడిగా తెచ్చి పెంచుకుందామనుకున్నారు. యాదమ్మ వాళ్ళ పాలోళ్ళ ఇంటికి వెళ్ళి మాకు మట్టెన్నా ఇయ్యు, అన్నమైనా (బిడ్డనైనా) పెట్టు అని కొంగుజాపి అడిగింది. వాళ్ళు మట్టే ఇచ్చారు. వాళ్ళ యారాలు కూసోని గొడ్డుదాని ఇంటికి పిల్లలనిస్తే అరిష్టం మా పిల్లలకు తగుల్తుంది అనుకుంటుంది. అప్పుడు వాళ్ళ చుట్టాల అబ్బాయిని దత్తత తీసుకున్నారు. అట్లాగే వాళ్ళ అన్న బిడ్డను కూడా తెచ్చుకుంది. కొడుకుని మాత్రం బాగా చూసుకునేది. కోడలికి, కొడుకుకి పెళ్ళి చేసింది. ఆ తర్వాత కోడలికి ఆడపిల్ల పుట్టింది. ఆ పిల్లను అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. అలాగే రెండోసారి కూడా ఆడపిల్ల పుట్టింది. అప్పుడు యాదమ్మకు కోపం వచ్చింది. కోడల్ని తిట్టిపోస్తూ సరిగా చూసుకోలేదు. మూడోసారి కడుపొచ్చింది. మగబిడ్డ కలగాలని మొక్కని రాయి లేదు, చెట్టూ పుట్టా లేదు. భూత వైద్యుడి దగ్గరకు తీసుకెళ్ళింది. చెట్టు పసరు పోస్తే కొడుకు పుడతాడని వాళ్ళ నమ్మకం.

అన్నీ తిరిగినా, ఎన్ని చేసినా మళ్ళీ ఆడపిల్లే పుట్టింది. యాదమ్మకు కోపం వచ్చి తిట్టని తిట్టు తిట్టకుండా తిడుతూనే ఉంది. బిడ్డను కన్న బాధకంటే తిట్ల బాధ ఎక్కువైపోయింది. అన్నం కూడా పెట్టేది కాదు. ఎవరైనా వచ్చి అడిగితే మళ్ళీ ఆడపిల్ల పుట్టింది. ఆ ముగ్గురు ఆడపిల్లలను ఎలా పెంచాలో, పెళ్ళిళ్ళు ఎలా చేయాలో. నా కొడుక్కి ఎంతో కష్టం వచ్చింది. నా కొడుక్కి తలకొరివి ఎవరు పెడతారో! నా కొడుకు చేతికింద ఎవరూ లేకపాయె. ఆ రోజునుండి సంవత్సరాలు గడిచినా అదే పురాణం. యాదమ్మకు తెలీదు పాపం. చదువు లేదు. కానీ చాలా తెలివి కలది. ఆ ఊరిలో యాదమ్మకు మంచి పేరు ఉంది. కానీ ఆమె అనుకుంటుంది కొడుకు తప్పు లేదు, అంతా కోడలి తప్పేనని, అందుకే ఆడపిల్లలు పుట్టారని. మగపిల్లలైనా, ఆడపిల్లలైనా ఇద్దరివల్లే పుడతారని ఆమెకు తెలీదు. ఆమే కాదు, ఆ గ్రామంలో ఉండేవారూ అంతే. ఇప్పుడు కూడా అక్కడక్కడా కనబడుతుంది.

రాజయ్యకు కుష్టు రోగం ఎక్కువైపోయింది. కాళ్ళకి పుండ్లయి వాటి నుండి రక్తమూ, చీమూ కారుతుంది. ఒక రకమైన దుర్వాసన వస్తుంది. అతని ఆరోగ్యం రోజురోజుకీ క్షీణిస్తుంది. ఊరిలో ఉన్నవారంతా చూడడానికి వచ్చి అతన్ని ఇంట్లో పెట్టుకోకూడదు, పిల్లలు

ఉన్నారు కదా అని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పి వెళ్ళారు. బాయికాడికి పంపమన్నారు. యాదమ్మకు ఎంతో బాధ కలిగింది. రాజయ్య కోడలికి ఎప్పుడూ ఏమీ చెప్పింది లేదు. కోడళ్ళూ, మనవరాళ్ళూ అందరూ ఎంతో దుఃఖంలో ఉన్నారు. ఆ సమయంలో రాజయ్య, నేను బాయికాడ ఉంటానన్నాడు.

కుష్టురోగిని ఈ సమాజం నుండి వెలివేశారు. అతను ఆ దుఃఖంతో మంచం, రగ్గు, బొంత చేతపట్టుకుని ఇవన్నీ బండిలో వేసి కూర్చున్నాడు. తన జ్ఞాపకాన్ని ఇంట్లో వదిలిపెడుతున్నాడు. తన మనవరాళ్ళతో ఆడుకొనే ఆటలు కూడా ఇక్కడే వదిలి వెళ్ళాడు. అందరి జ్ఞాపకాలు కూడా తన మదిలో భద్రపరచుకొని బాయికాడికి వెళ్ళాడు.

అతను ఆ బాధ దిగమింగుకొని నడుస్తూ పొలం వైపు వెళ్ళాడు. అతన్ని కొట్టంలో ఉంచారు. బర్రెలు, ఎడ్లు కాసేవాడు. పొలం పనులు చేసేవాడు. జీతగాండ్లకు ఆ పని, ఈ పని చెప్పేవాడు. రాజయ్యకు ఆరోగ్యం మళ్ళీ మొదటికొచ్చింది.

ఒక మనిషికి కుష్టురోగం ఉంటే అంటరానితనంగా ఈ సమాజం చూస్తుంది. అది భయంకరమైన రోగం అని సూటిపోటి మాటలతో ఎక్కువ చేశారు. ఆ రోగం ఉండేవాళ్ళను అందరినీ అలాగే చూశారు. ఎందుకంటే ఆ కాలంలో మూఢనమ్మకాలు ఎక్కువగా ఉండేవి. చదువు లేదు. జ్ఞానం లేదు. కుష్టురోగికి మందు లేదు. వాళ్ళు రోగిష్టిగా పుట్టడమే పాపం. రాజయ్య ఓ దేవుడా, నాకీ రోగం ఎందుకు వచ్చిందో, నాకే ఎందుకు వచ్చిందో! నేను ఏ పాపం చేశానో, వచ్చే జన్మలో కూడా ఈ రోగం ఎవ్వరికీ రాకూడదు దేవుడా అనుకున్నాడు.

కుష్టు రోగానికి భూత వైద్యుడితో వైద్యం చేశారు. కానీ ఆ రోగం ఎక్కువైపోయింది. తన కుటుంబం గురించి ఆలోచన. తన ముగ్గురు మనవరాళ్ళ పెళ్ళి చేస్తాడో, లేదో. వారి జీవితం ఏ విధంగా ఉంటుందో! వాళ్ళ పెళ్ళిళ్ళు చూసే ప్రాప్తి లేకుండా చేశావు దేవుడా! అని చెప్పుకున్నాడు. అతను బర్రెల కొట్టంలో ఉండేవాడు. బర్రెలకు గడ్డి వేసేవాడు. తనకు యాదమ్మ ఇష్టమైన తిండి చేసి తన మనవరాలితో పంపించేది. రాజయ్య బర్రెలను చూసుకుంటూ, నేను బర్రెనై పుడితే బాగుండేమో! చెట్టును చూసుకుంటూ, చెట్టుగా ఉండినా బాగుండేమో! పక్షులను చూసి పక్షినై పుట్టినా బాగుండు అని అనుకునేవాడు. తన మదిలో ఎన్నో ఆలోచనలు చేసి చేసి బుర్ర బద్దలైపోయింది.

రాజయ్య రోగం బాగా దగ్గరపడింది. రేపో, మాపో అన్నట్లు ఉన్నాడు. అప్పుడు పాలోళ్ళందరూ బాయికాడ చస్తే ఎట్లా? ఇంటికి తీస్కరా. ఆయన పానం అంతా ఇంట్లోనే ఉంది. బాయికాడ ఛస్తే దయ్యమైతాడేమో అంటే ఇంటికి తీసుకొచ్చారు. రెండు రోజుల్లో చచ్చిపోయాడు. అందరూ చావుకు రాలేదు. పిట్టకేయడానికి వచ్చారు. దినాలకు వచ్చారు.

రైతు ఏమౌతాడు?- డి.లలిత

రైతు బిడ్డ కూడా

రైతు కావాలని అనుకోదు

ఎందుకనీ? ఎందుకనీ?

రైతు బిడ్డ పరిశోధకురాలు కావాలనుకుంటుంది

రైతు ఏమౌతాడు?

కుమ్మరి వారి బిడ్డ కూడా

ఇంజనీర్‌ కావాలనుకుంటుంది

ఎందుకనీ? ఎందుకనీ?

రైతు ఏమౌతాడు?

వడ్ల వారి బిడ్డ కూడా

డాక్టరు కావాలనుకుంటుంది

ఎందుకనీ? ఎందుకనీ?

రైతు ఏమౌతాడు?

చాకలివారి బిడ్డ కూడా

పోలీస్‌ కావాలనుకుంది

ఎందుకనీ? ఎందుకనీ?

రైతు ఏమౌతాడు?

మంగలి వారి బిడ్డ కూడా

ఆఫీసర్‌ కావాలనుకుంటుంది

ఎందుకనీ? ఎందుకనీ?

రైతు ఏమౌతాడు?

మోచీ వారి బిడ్డ కూడా

కలెక్టర్‌ కావాలనుకుంటుంది

ఎందుకనీ? ఎందుకనీ?

రైతు ఏమౌతాడు?

ఎందరో మహానుభావులు

రైతే రాజు అన్నారు కదా!

ఈ సమాజంలో రైతు రాజు కాదు

భిక్షగాడు అని సమాజం అనుకొనేలా

ఈ సమాజం వేలు ఎత్తి చూపింది

రైతుకు మిగిలింది

అప్పు లేదా చావు

చావు శరణ్యమైనది

రైతు బతుకు దుర్భరమైనది.

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.