కరోనా నేపథ్యంలో చాలామంది తమ అనుభవాలను పంచుకున్నారు. నేను ప్రత్యేకంగా చెప్పేదేముంటుంది అనుకున్నా కానీ రాస్తే బాగుంటుందని ఒక మిత్రుడు ఇచ్చిన సలహాతో ఈ సాహసం చేస్తున్నా.
ప్రకృతి వైపరీత్యాలయిన వర్షం, వరదలు, అగ్ని వంటి వాటి నుండి మనుషులు తమను తాము రక్షించుకోవడం నేర్చుకున్నారు. అలాగే మనుషులు కలరా, మశూచి, చికెన్‌పాక్స్, పోలియో లాంటి అనేక వ్యాధుల బారిన పడ్డారు. క్రమక్రమంగా ఈ వ్యాధులకు టీకాలు, మందులు కనుక్కున్నారు. శాస్త్రీయ జ్ఞానం ఎంతో అభివృద్ధి చెందింది. దాని వెనుక ఎంతోమంది మంచి మనుషులు, మేధావుల కృషి ఉంది. కానీ శాస్త్రీయ జ్ఞానం ఇంత అభివృద్ధి చెందిన తర్వాత కూడా ఒక వైరస్ వలన ఇంత మంది ప్రజలు తమ ప్రాణాలు కోల్పోతున్నారు. ఎంతోమంది తమ ఆత్మీయులను కోల్పోతున్నారు. ఎన్నో కుటుంబాలు పోషించే పెద్దలను కోల్పోయి మరింత పేదరికంలోకి దిగజారిపోతున్నాయి. నిజంగా మనం ఆలోచిస్తే ఇంత నష్టానికి కారణం ప్రకృతిలో పుట్టిన ఒక వైరస్ కోవిడ్-19 నా లేక ఈ నష్టాన్ని తగ్గించడంలో విఫలమైన ప్రభుత్వం మరియు వెనుకబడిన మన సమాజమా.
మనం నిశితంగా పరిశీలించి చూస్తే ప్రపంచంలో అన్ని దేశాలూ ఈ వైరస్ బారిన పడినా, ప్రజల ఆరోగ్యానికి ప్రాముఖ్యతనిచ్చే కొన్ని దేశాలు ఈ సమస్యను ప్రతిభావంతంగా ఎదుర్కొనడం మనకు అర్థమవుతుంది. ప్రజల ఆరోగ్యం గురించి ఏ మాత్రం పట్టించుకోకుండా, వైద్య రంగాన్ని పూర్తిగా ప్రైవేట్ రంగానికి వదిలేసిన దేశాల్లో ప్రజలు ఎక్కువ నష్టానికి గురవడాన్ని మనం గమనిస్తున్నాం. మన దేశంలో యునిసెఫ్ లెక్కల ప్రకారం 2018లో దాదాపు 8,82,000 మంది ఐదు సంవత్సరాలలోపు పిల్లలు చనిపోయారు. మన దేశం ఈ విషయంలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. ఇందులో 68% మంది పిల్లలు పోషకాహార లోపం వలన చనిపోయారు. న్యుమోనియాతో లక్షల మంది పిల్లలు ప్రతి సంవత్సరం చనిపోతున్నారు. కానీ ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. మీడియా కూడా పెద్దగా ప్రచారం చేయడం లేదు. కానీ ఈ కరోనా గురించి మాత్రం ఇంత ప్రచారం జరుగుతోంది. అందరూ భయంతో వణికిపోతున్నారు. ఎందుకంటే, ఈ వ్యాథి కేవలం పేదవారికి మాత్రమే పరిమితం కాదు, ఈ సమాజంలో ఎంతో కొంత భద్రమయిన జీవితం గడుపుతున్న మధ్య తరగతి ప్రజలకు, మేధావులకు, నిరంతరం పనివారి శ్రమపైన ఆధారపడి బ్రతికే ధనవంతులకు కూడా ఈ వ్యాధి అంటుకునే అవకాశం ఉండడం.
నా సొంత అనుభవం :
ఆగస్టు మూడవ తేదీన మా బ్రాంచిలో పనిచేసే ఒక ఉద్యోగిని తనకు జ్వరం, దగ్గు, వాసన, రుచి తెలియకపోవడం వంటి లక్షణాలు ఉన్నాయని చెప్పడంతో ఆమెను టెస్ట్ చేయించుకోమని చెప్పాము. ఆ రోజు ఆమెకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. మర్నాడు కూడా యధావిథిగా పనిచేశాం. కానీ ఆగస్టు ఐదవ తేదీన నేను కూడా ఒక ప్రైవేట్ ల్యాబ్‌లో టెస్ట్ చేయించుకున్నాను. ఆగస్టు 8వ తేదీ సాయంత్రం నాకు కూడా పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చింది. కానీ నాకు ఎలాంటి సింప్టమ్స్ లేవు. మా డాక్టర్‌గారి సలహా మేరకు నేను ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉన్నాను. మా అమ్మ, నాన్నలకు కూడా ఆగస్టు 9వ తేదీన టెస్ట్ చేయించాము. వారిద్దరికీ కూడా పాజిటివ్ అని మర్నాడు ఆగస్టు 10వ తేదీ రాత్రి 11 గంటలకు తెలిసింది. నేను వెంటనే మా డాక్టర్‌కు రిపోర్ట్ పంపించాను. ఆ సమయంలో కూడా మా డాక్టర్‌గారు వెంటనే రెస్పాండయ్యారు. మర్నాడు మా అమ్మా, నాన్నలకు చేయించవలసిన టెస్టులన్నీ నాకు వాట్సాప్‌లో పంపించారు. అందులో సి.టి.స్కాన్‌తో పాటు ఇంకా కొన్ని రక్తపరీక్షలు ఉన్నాయి. నాకు పాజిటివ్ అని తెలిసినా నేనేమీ భయపడలేదు. కానీ మా అమ్మా, నాన్నలకు పాజిటివ్ అని తెలిసిన వెంటనే నా ప్రపంచం తలకిందులయింది. మా నాన్నకు దాదాపు 75 సంవత్సరాలు, అమ్మకు దాదాపు 67 సంవత్సరాలు. అంతేకాక డయాబెటిస్, హైపర్ టెన్షన్, థైరాయిడ్ లాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. అందువల్ల నేను చాలా భయపడ్డాను. ఆ రాత్రి అస్సలు నిద్ర రాలేదు. నా జీవితంలో ఇంతవరకూ ఇలాంటి కష్టం రాలేదు. మొదటిసారి నాకు చాలా పెద్ద కష్టం వచ్చిందని అనిపించింది.
మర్నాడు మా అన్న సహాయంతో అన్ని టెస్టులు చేయించాను. ఆ ఒక్క రోజు దాదాపు రూ.20,000 ఖర్చు చేసి టెస్టులు చేయించాము. సాయంత్రం ఐదు గంటలకు రిపోర్టులు వచ్చాయి. మా డాక్టర్‌గారు చూసి ఎక్కువ స్ప్రెడ్ కాలేదు, ఐదు రోజులు టాబ్లెట్లు వాడమని కోర్స్ ఇచ్చారు. ఐదు రోజుల తర్వాత మరికొన్ని రక్త పరీక్షలను రిపీట్ చేయమన్నారు. 20 రోజుల వరకు ఆక్సిజన్ లెవల్, టెంపరేచర్ రెగ్యులర్‌గా చెక్ చేయమన్నారు. ఆగస్టు 11వ తేదీన ఉదయం చాలా బాధలో ఉన్న నాకు నా మిత్రురాలు సుజాత ఫోన్ చేసింది. నేను మా పరిస్థితి చెప్పగానే ‘ఎవరికీ ఏమీ కాదు, నువ్వు ధైర్యంగా ఉండు. అమ్మవాళ్ళను జాగ్రత్తగా చూసుకో’ అని చెప్పింది. నిజానికి ఆ సమయంలో ఆమె మాటలు నాకు చాలా ధైర్యాన్నిచ్చాయి. ఇంకా అప్పటినుండి 20 రోజుల వరకు నేను మా అమ్మా, నాన్నలకు మా డాక్టర్‌గారి సూచనల మేరకు మెడిసిన్ వాడడం, రెగ్యులర్‌గా ఆక్సిజన్, టెంపరేచర్‌లు చెక్ చేయడం చేశాను. నిజానికి ఈ 20 రోజులలో నేను మా డాక్టర్ గారిని ఎంతో విసిగించాను. కానీ ఆయన మాత్రం చాలా ఓపికగా నాకు సమాధానమిస్తూ, ఎప్పటికప్పుడు టాబ్లెట్స్ చెప్తూ, అమ్మకు షుగర్ లెవల్ కంట్రోల్ చేశారు. మేము ఈ సమస్య నుండి క్షేమంగా బయటపడడానికి ప్రధాన కారణం మా డాక్టర్‌గారు. ఆయనకు చేతులెత్తి సమస్కరిస్తున్నాను. నేను ఫోన్ చేయకపోయినా, నా ఫ్రెండ్ సుజాత చెప్పగానే నాకు ఫోన్ చేసి ధైర్యం చెప్పిన డా.బ్రహ్మారెడ్డి సార్‌కు మనసారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డా.బ్రహ్మారెడ్డి సార్‌ను కూడా ఈ 20 రోజులలో పలుమార్లు ఇబ్బంది పెట్టాను. ఈ కరోనా భయం వల్ల సొంత ఇంటివారే వ్యాధి బారిన పడిన వారికి దూరంగా ఉంటున్న ఈ సమయంలో నా మిత్రులు కొంతమంది అవసరమైతే సహాయం చేస్తామని చెప్పారు. అలాంటి మిత్రులు ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అంతేకాక మా క్షేమం కోరి పలువురు మిత్రులు నాకు రెగ్యులర్‌గా ఫోన్ చేసి మాట్లాడేవారు. వారందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. అడిగిన వెంటనే నాకు సహాయం చేసిన ఎ.వి.అన్నకు, అడగకపోయినా సహాయం చేసిన సాయిప్రకాష్ అన్నకు ధన్యవాదములు. ఇప్పటివరకు నా వ్యక్తిగత అనుభవం చెప్పినా. కానీ మేము క్షేమంగా బయటపడ్డామంటే దానికి చాలా కారణాలున్నాయి.
1. మాకు అడిగిన వెంటనే సహాయ, సహకారాలు అందించిన మా డాక్టర్ గారు.
2. ఒక 20 రోజులలో దాదాపు రూ.50,000 ఖర్చు పెట్టగల స్థోమత ఉండడం
3. మా అందరికీ వండి సమయానికి పెట్టగల ఒక అన్న ఇంట్లో ఉండడం
4. మాకు హోమ్ ఐసోలేషన్‌లో ఉండడానికి తగిన వసతులు గల ఇల్లు ఉండడం
5. మాకు ధైర్యం చెప్పి సహాయం చేయగల మిత్రులు, సోదర, సోదరీమణులు ఉండడం
6. మా అమ్మా నాన్నల సహకారం
7. వైరల్ లోడ్ తక్కువగా ఉండడం.
అయితే ఇలాంటి సదుపాయాలు, సహకారాలు మన భారత సమాజంలో ఎంతమందికి లభిస్తాయి?
నేను మొదట చెప్పినట్లు కోవిడ్ వైరస్ ప్రకృతిలో నుండి పుట్టినా, దాని వలన జరుగుతున్న నష్టానికి మాత్రం మన ప్రభుత్వం, పెట్టుబడిదారీ వ్యవస్థ, వెనుకబడిన మన సమాజాలు కారణం.
వీటికి సంబంధించిన నా అభిప్రాయాలు కూడా మీతో పంచుకుంటాను.
1. ప్రభుత్వం జనవరి 30న మొదటి కేసు వచ్చినప్పుడు అంతర్జాతీయ ప్రయాణాలను నిషేధించి ఉంటే అసలు మన దేశంలో కరోనా విలయ తాండవం చేయగలిగేదా?
2. ప్రపంచంలోనే జనాభాలో రెండవ స్థానంలో ఉన్న మన దేశం ప్రజల ఆరోగ్యంపై పెట్టే ఖర్చు జిడిపిలో కేవలం 1.28% మాత్రమే (ఎన్.హెచ్.పి. 2019 ప్రకారం 2017-18కు). ఇది చాలా పేద దేశాలు ఖర్చుపెట్టే దానికన్నా తక్కువ. ప్రజల ఆరోగ్యం కోసం ఇంత తక్కువ ఖర్చు చేస్తున్నందువల్ల మన దేశంలో కరోనా సోకిన వారికి సరైన వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్నారు.
3. అన్ని ప్రభుత్వ రంగాలను ప్రైవేట్ పెట్టుబడిదారుల పరం చేసే క్రమంలో వైద్య రంగాన్ని కూడా ప్రైవేట్ రంగానికి అప్పగించడం.
4. ప్రభుత్వ ఆస్పత్రులకు నిధులు ఇవ్వకుండా, తగిన సిబ్బందిని నియమించకుండా ఉండడం వలన ఇప్పుడు కరోనా సోకిన వారికి తగిన వైద్యం అందించలేకపోతున్నాయి.
5. ప్రభుత్వం ఆస్పత్రులలో కరోనా రోగులకు సేవచేసే సిబ్బందికి తగిన సౌకర్యాలు కల్పించకపోవడం. పైగా దాని గురించి మాట్లాడిన వారిని వేధించడం.
6. ఎప్పుడైతే వైద్య రంగం ప్రైవేట్ పరమయ్యిందో, కాపిటలిస్ట్ వ్యవస్థ స్వభావం ప్రకారం ప్రైవేట్ ఆస్పత్రులు లాభం సంపాదించడం ధ్యేయంగా పనిచేస్తాయి. ఈ రోజు మనం దాన్ని స్పష్టంగా చూడగలుగుతున్నాము.
7. ఇన్ని రోజులు ప్రజల నుండి లాభాలు పొందిన ప్రైవేటు ఆస్పత్రి వర్గాలు ఇప్పుడు కరోనా నేపథ్యంలో ప్రాణాలు కోల్పోయే పరిస్థితిలో ఉన్నవారిని నిర్దాక్షిణ్యంగా వదిలేసి ప్రభుత్వ ఆస్పత్రికి పొమ్మని సలహా ఇచ్చి తప్పించుకుంటున్నారు.
8. ఇంకా కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు తమ దగ్గరికి వచ్చిన పేషెంట్స్ దగ్గర విపరీతంగా ఫీజులు వసూలు చేసి లాభాలు గడిస్తున్నాయి.
9. కరోనా నేపథ్యంలో ప్రజల కోసం పనిచేస్తున్న వివిధ రంగాలకు చెందిన సిబ్బందికి సరైన సౌకర్యాలు కల్పించకపోవడం.
ఈ రోజు ఇలాంటి పరిస్థితి రావడానికి మన భారత సమాజం కూడా ఒక కారణం. వాటిలో కొన్ని మీ ముందు
ఉంచుతున్నాను.
1. మన సమాజంలోని పౌరులు ఎవరు తమకు ప్రయోజనం చేకూరుస్తారో వారికి ఓటు వేయకుండా తమ కులం వారని, తమ మతం వారని ఓటు వేసి, ప్రజల ఆరోగ్యం గురించి, విద్య గురించి, ఉపాధి గురించి పట్టించుకోని నాయకులను ఎన్నుకోవడం. తమ ప్రయోజనాలను తామే దెబ్బ తీసుకోవడం.
2. ఒక్కొక్క ప్రభుత్వ రంగం ప్రైవేటుపరం అవుతున్నా ఏమీ నిరసనలు తెలుపకుండా ఉండడం. పైగా కొంతమంది మేధావులు ప్రైవేటు రంగాన్ని సపోర్టు చేయడం.
3. ప్రభుత్వ ఆస్పత్రులకు నిధులు ఇవ్వకుండా, వివిధ పథకాల క్రింద ప్రైవేటు ఆస్పత్రులకు నిధులు ఇస్తున్నా, ప్రైవేటు వైద్యం దొరుకుతుందని సంతోషపడ్డారు కానీ, ఎమర్జెన్సీ పరిస్థితిలో ప్రభుత్వ ఆస్పత్రి మాత్రమే దిక్కని ప్రైవేటు ఆసపత్రి పట్టించుకోదని గ్రహించలేకపోవడం.
4. కరోనా గురించి సరైన అవగాహన లేక దాని బారిన పడినవారి పట్ల అమానుషంగా ప్రవర్తించడం. ఈ భయంతోనే కొంతమంది టెస్టులు చేయించుకోక చివరికి అనారోగ్యానికి గురవుతున్నారు. కొంతమంది ప్రాణాలను సైతం కోల్పోతున్నారు.
5. కరోనా రోగులకు సేవ చేస్తున్న ఆస్పత్రుల సిబ్బందిని ఇళ్ళు ఖాళీ చేయమని చెప్పేంత వెనుకబాటుతనం ఉండడం.
6. ప్రజలకు కరోనా గురించి సరైన అవగాహన కల్పించాల్సిన మీడియా కరోనా అంటేనే భయపడే వార్తలు అందించడం. నిరంతరం ఆ వార్తలు చదివిన, చూసిన కొంతమంది తమకు కరోనా సోకిందని తెలియగానే భయపడి ప్రాణాలు కోల్పోతున్నారు, మరికొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
కరోనా మన ప్రభుత్వం, వ్యవస్థల వైఫల్యాన్ని, మన సమాజం వెనుకబాటుతనాన్ని మనకు కళ్ళకు కట్టినట్లు చూపిస్తోంది. కనుక ఇప్పటికయినా ప్రజలు, పౌరులు, మధ్య తరగతి మేధావులు అర్థం చేసుకొని తమకు ప్రయోజనం చేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం, ప్రజలకు అవసరమైన అన్ని రంగాలు ప్రభుత్వ పరిధిలో ఉండాలని పోరాటం చేస్తే తప్ప ఈ పరిస్థితి మారదు.