నకిలీ!! – పరిమళ పప్పు

ఉదయాన్నే పేపర్‌ చదువుతూ, కాఫీ తాగుతూ ఉన్న చంద్రంతో పక్కనే కూర్చుని వాట్సాప్‌లో మెసేజ్‌లు చూస్తున్న భార్య భానుమతి ”ఏమండీ. ఈ రోజు పేపర్లో మీ కథ పడింది చూశారా?!” అని అడిగింది.

”అవునా చూడలేదే. ఇప్పుడే చూస్తాను ఉండు” అంటూ పేపర్‌లో కథ రాసిన పేజీ తెరిచి చూశాడు చంద్రం. కథ పేరు తనదే, కానీ రచయిత పేరు చూస్తే వేరుగా ఉంది. ”భాను కథ నాది కాదే, ఆ రచయిత ఎవరో నేను రాసిన కథ పేరుతోనే తానూ రాశాడు. హ్మ్‌.. ఏం చేద్దాం” అన్నాడు.

”కథ పేరే కాదండి కథ కూడా మీదే, ఇలా చూడండి ఓ సారి” అంది భాను.

కథ చదివిన చంద్రం అవాక్కయ్యాడు. తాను రాసిన కథే తన పేరుతో కాకుండా వేరేవాళ్ళ పేరుతో ప్రముఖ దినపత్రికలో వచ్చింది. ఎంత అన్యాయం అనుకున్నాడు మనసులో.

”అంతే కాదండి చూడండి. మా వాట్సాప్‌ బృందంలో కూడా అదే కథ వేరే వాళ్ళ పేరుతో చలామణి అవుతూ

ఉందండి” అంది భాను.

”పోనీలే భాను. కథ నాదే కదా. రచయిత పేరు వేరే ఎవరిదో అయితేనేమి. నా కథ మాత్రం బాగానే పేరు గడించింది కదా” అన్నాడు చంద్రం.

”ఏడ్చినట్లు ఉంది. కథకి పేరు వస్తే ఆ పేరు మీకు కాదండి. మీ పేరుతో కాకుండా అతని పేరు వేయించుకున్నాడే ఎవరో ఆ మహానుభావుడు అతనికి వచ్చింది మంచి పేరు. చివరికి మా బంధువులు కూడా ఆ కథ మీరు రాసిందే అంటే నమ్మటం లేదు. ఎలా అండి ఏం చేద్దాం?” అని కొంత అమాయకంగా అడిగింది భాను.

”పోనీలే భాను, అతని పాపాన అతనే పోతాడు. వదిలెయ్యి. మనకెందుకు ఆ గొడవ?” అన్నాడు చంద్రం.

”అదేంటండి అలా వదిలేయమని అంటున్నారు. అతనిమీద కంప్లెయింట్‌ ఇవ్వచ్చు కదా?” అడిగింది.

”ఎవరికి ఇస్తాం, ఏమని ఇస్తాం కంప్లెయింట్‌. నాకే కాదు భాను, ఈ మధ్య ప్రతి రచయిత ఎదుర్కొంటున్న సమస్యే ఇది. ఫేస్‌బుక్‌ లేదా వాట్సాప్‌ బృందంలోనో, ఎవరో సన్నిహితులకు పంపిన కథలు కూడా ఇదుగో ఇలా కాపీ చేయబడి బయటకు వస్తున్నాయి. ప్రముఖ రచయితల కథలు కూడా కాపీ చేయబడుతున్నాయి. ఈ సోషల్‌ మీడియా పుణ్యమా అని ఇదొక రకమైన చౌర్యం ఇప్పుడు. నేనంటే కనీసం కాస్తో కూస్తో అనుభవం ఉన్నవాడిని. ఈ కథాంశం లేదా సారాంశం కాపీ చేయడం అనేది మామూలే. కానీ ఇప్పుడు మొత్తం కథనే కాపీ చేసేస్తున్నారు. ఈ మధ్యనే ఒక అమ్మాయి కొత్తగా రాయడం మొదలుపెట్టింది. పాపం ఆవిడ కథను కూడా కాపీ చేసేశారు. ఆ కథ ఫేస్‌బుక్‌లోను, వాట్సాప్‌లోను చక్కర్లు కొడుతూ తిరిగి ఆవిడ వద్దకే చేరింది. ఏం చెయ్యగలదు పాపం. అప్పటికీ కంప్లెయింట్‌ కూడా ఇచ్చిందంట. కానీ ఆ కాపీ చేసింది ఎవరో తెలిస్తే కదా?”

”మరి మనమేమీ చేయలేమంటారా?”

”మన కథలు ఫేస్‌బుక్‌ లేదా వాట్సాప్‌లో ఎవరికైనా పంపినప్పుడు, మన అనుమతి లేకుండా మన కథని ఎడిట్‌ చేసి వాళ్ళ పేరు మార్చుకునే అవకాశం కానీ ఆప్షన్‌ కానీ లేకుండా ఉంటే బాగుంటుంది. అయినా ఎవరికి వాళ్ళకు తెలియాలి కానీ, ఇలా కాపీ చేసిన కథలతో పేరు సంపాదిస్తే ఒరిగేది ఏమిటో చెప్పు వాళ్ళకి?” అన్నాడు చంద్రం.

”నిజమే అనుకోండి. కానీ మనం ఏదైనా చేస్తే బాగుంటుందని నా ఉద్దేశ్యం” భర్తతో అని, ”ఎలాగైనా ఈ నకిలీ గాళ్ళ పని పట్టాల్సిందే” అనుకుంది మనసులో.

… … …

వారం తర్వాత…

పేపర్‌ చదువుతూ తన కథకి వేరే వాళ్ళ పేరు ఉండడం గమనించాడు సూర్యం. వెంటనే భార్యని పిలిచి ”చూశావా ఉషా! నా కథ పేపర్లో పడింది కానీ వేరే వాళ్ళ పేరుతో. అది కూడా బహుమతి పొందిన కథగా” అన్నాడు.

”అదెలా సాధ్యమండి” అంది ఉష.

”ఇందులో నీ హస్తమేమీ లేదు కదా?” అడిగాడు అనుమానంగా.

”అదేంటండి నన్ను అడుగుతారు. అదేదో తెలిస్తే మీకే తెలియాలి. అది సరే కానీ ఇప్పటివరకు చాలామంది కథలు కాపీ చేసి మీ పేరుతో పంపించారు కదా. వాళ్ళలో ఎవరో మీ మీద కక్షకట్టి ఇలా చేసి ఉంటారు” అంది ఉష.

”అంతేనంటావా ఉషా?”

”మరి చేసిన పాపం ఊరికే పోతుందా ఏమిటి. ఎన్నిసార్లు చెప్పాను మీకు. అలా ఎవరికో కథలు మీ పేరుతో రాస్తే ఏం వస్తుందండి మనకి, వాళ్ళ ఉసురు తప్ప అని. చూశారా ఇప్పుడు మీకు అదే తగిలింది”.

”ఆపు ఉషా, ఇంక ఏమీ మాట్లాడకు” అన్నాడు సూర్యం.

”ఒక మాట అడుగుతాను సూటిగా చెపుతారా?” అంది ఉష.

”ఏమిటది?”

”ఈ రోజు మీ కథకి బహుమతి కూడా వచ్చింది. మీ దగ్గర ఇంత టాలెంట్‌ ఉన్నప్పుడు అలా వేరే వాళ్ళ కథలు ఎందుకండీ మీ పేరుతో కాపీ చేసి వేసుకునేవారు?” సూటిగా అడిగింది ఉష.

ఉష అడిగిన ప్రశ్నకి సమాధానం లేదు సూర్యం దగ్గర. మౌనంగా ఉన్నాడు.

”నిజమే ఉషా. నా కథకి బహుమతి వచ్చిందంటే ఎంతో కొంత నేను బాగానే రాస్తున్నట్లు కదా?! కానీ నాకు చిన్నప్పటి నుంచి నా పేరు పేపర్లో చూసుకోవాలని ఆశ. ఎన్నో కథలను పుస్తకాలకు, పేపర్ల వాళ్ళకి పంపించాను. కానీ ఎవరూ తీసుకోలేదు. కానీ కొన్ని కథలు మాత్రం ఎలా ఉన్నా వేసేవారు. అందుకే నేను అలా కాపీ కథలు పంపించడం మొదలుపెట్టాను. అప్పటినుంచి అన్ని కథలూ పేపర్లో వస్తూనే ఉన్నాయి నా పేరుతో. కానీ ఇప్పుడు నా కథకి బహుమతి వచ్చింది. కానీ అది వేరే వారి పేరు మీద ఉండడం బాధగా ఉంది” అన్నాడు సూర్యం.

”చూశారా, మీ కథ ఒకసారి కాపీ అయితేనే మీకు ఇంత బాధగా ఉంది కదా. మరి కథ రాసిన వాళ్ళు ఆ కథ తమ పేరుతో కాకుండా వేరేవాళ్ళ పేరుతో ప్రచురితమైతే ఎంత బాధపడి ఉంటారు. ఒక్కసారయినా ఆలోచించారా?” అంది ఉష.

”నా కథ ఎవరో కాపీ చేసి ప్రింట్‌ చేయడం వల్ల నేను చేసిన తప్పు నాకు తెలిసి వచ్చింది. ఇకపై ఎప్పుడూ ఎవరి కథనూ కాపీ చెయ్యను” అన్నాడు సూర్యం.

… … …

”చాలా థాంక్స్‌ ఉషా, నువ్వు చేసిన సహాయం నేను మర్చిపోలేను” అంది భాను.

”ఛ! ఛ! ఇంకా నేనే నీకు థాంక్స్‌ చెప్పాలి. నువ్వు నాకు జరిగింది చెప్పడం వల్లనే కదా నేను విషయం తెలుసుకుని మా వారి ప్రవర్తన మారేలా చేయగలిగాను. ఇప్పుడు ఆయన నిజంగా మారిపోయారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదంతా నీ వల్లే జరిగింది భానూ. అది సరే కానీ మనం కలిసి ఎన్నాళ్ళో అయింది కదా, ఇంతకీ సూర్యం మా వారే అని ఎలా కనిపెట్టావు?” అడిగింది ఉష.

”ఓహ్‌! అదా. మీ పెళ్ళికి పిలిచావు కదా. అప్పుడే విన్నాను మీ వారి పేరు. కథలో పేరు చూడగానే మీ వారేనా అనిపించింది. అందుకే అనుమానంగా నీకు ఫోన్‌ చేశాను. లక్కీగా నేను అనుకున్నది నిజమైంది. మనం అనుకున్నది జరిగింది. ఇంకేం అంతా సంతోషమే కదా?”

”అవును! అంతా సంతోషమే. సరే భాను, మనం ఎప్పుడైనా ఒకసారి కలుద్దాం. ఏమంటావు?”

”ఏమంటాను, తప్పకుండా అంటాను”.

Share
This entry was posted in కధలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.