స్త్రీవాద కవిత్వం – ఆవిర్భావ, ఆవశ్యకతలు – సూరేపల్లి పద్మావతి

వస్తు వైవిధ్యం అనేది ఆధునిక కవిత్వ ప్రత్యేక లక్షణం. ప్రాచీన కవితా ధోరణులైన పురాణ కవిత్వం, ప్రబంధ కవిత్వాలలో కథా ఇతివృత్తం ప్రసిద్ధం, నాయికా నాయకులు దివ్వులు, దివ్యాదివ్యులు అనే నియమం ఉండడం వల్ల వస్తు వైవిధ్యానికి అవకాశం తక్కువ. మానవాతీతమైన వ్యక్తుల చుట్టూ, శక్తుల చుట్టూ పురాణ, ప్రబంధాలు పరిభ్రమించడం వల్ల వస్తువునకు పరిమితులేర్పడినాయి. ఆధునిక కవిత్వం అనేది ఆధునిక జీవితమంత విశాలమైనది, ప్రపంచమంత విస్తృతమైనది, సమాజమంత లోతైనది కావడం వల్ల సహజంగానే వస్తు వైవిధ్యానికి అవకాశం లభించింది. దళితవాద కవిత్వం, స్త్రీవాద కవిత్వం, మైనారిటీవాద కవిత్వం మొదలైనవి శాఖోపశాఖలుగా ఆధునిక కవిత్వం వస్తు విస్తృతిని, వైవిధ్యాన్ని సాధించింది.

స్త్రీల అనుభవాలను, అనుభూతులను స్త్రీల దృక్కోణం నుండి స్త్రీలే వర్ణించాలన్న ఆలోచనా విధానంతో ఆవిర్భవించిన సాహిత్య ధోరణి ‘స్త్రీ వాద సాహిత్యం’. తెలుగులో ‘స్త్రీ వాదం’ అన్న పదాన్ని ‘ఫెమినిజం’ అన్న ఆంగ్ల పదానికి సమానార్థకంగా వాడుతున్నాం. మానవ సమాజంలో సగభాగంగా ఉన్న స్త్రీలు లైంగిక వివక్ష కారణంగా పురుషుల కంటే తక్కువ సాంఘిక స్థాయిలో ఉండడాన్ని ప్రశ్నిస్తూ వచ్చిన మానవీయ ఉద్యమమే ‘స్త్రీ వాదం’. అణచివేతకు గురవుతున్న స్త్రీలు విముక్తి కోసం తపన పడుతూ, తమ స్వీయ చైతన్యాన్ని, ఆత్మాభిమానాన్ని పెంపొందింపచేసుకోవడంలో రూపొందిన ఆలోచనా ధోరణే స్త్రీ వాదం. సమాజాన్ని, సాహిత్యాన్ని, చరిత్రను స్త్రీల దృక్పథంతో పరిశీలించే ‘లో చూపు’ను స్త్రీ వాదం తెలిపింది. ఒక కొత్త తరం కవయిత్రులనూ, రచయిత్రులనూ ఈ ధోరణిని తెలుగు సాహిత్య రంగంలో సృష్టించుకుంది. తెలుగు సాహిత్యంలో జాతీయోద్యమ, కాల్పనిక, దళిత అభ్యుదయ, విప్లవ ఉద్యమాల తర్వాత అత్యంత ప్రభావం చూపిన ఉద్యమం స్త్రీ వాద కవిత్వోద్యమం. 1975 తర్వాత రూపుదిద్దుకుని, 1985 నుండి స్థిరపడి క్రమంగా అన్ని ప్రక్రియలకూ విస్తరించిన ఉద్యమం స్త్రీ వాద కవిత్వోద్యమం.

స్త్రీవాద రచయిత్రులు, విమర్శకులు స్త్రీ వాదాన్ని అనేక రకాలుగా నిర్వచించారు. వీటిని నిర్వచనాలు అనడం కంటే కూడా వివరణాత్మక రూపంలో ఉన్న వ్యాఖ్యానాలు అనడం సమంజసం. ప్రముఖ రచయిత్రి సావిత్రి రాసిన ”ఈ దేశంలో ఇదో వర్గం” కథ తొలిసారి స్త్రీ సమస్యలను స్త్రీలే చెప్పుకున్న విధానానికి నాంది అయిందని చెప్పవచ్చు. తర్వాత ఇల్లిందల సరస్వతీదేవి ”పెళ్ళికూతుళ్ళు” నవలలో వివాహ వ్యవస్థ ఎలా ఉండాలనే విషయాన్ని తన పాత్రలైన కాంచనలత, పద్మలతలతో చర్చ పెట్టించారు. వైవాహిక జీవితంలో స్త్రీ, పురుషులిద్దరికీ సమాన గౌరవం ఉండాలని ఆకాంక్షించారు. స్త్రీ వాదం కొన్ని విషయాలను ముందుకు తెచ్చి చర్చకు పెట్టిందని ”నీలిమేఘాలు”లో ప్రముఖ స్త్రీ వాద రచయిత్రి ఓల్గా చెప్పారు. పితృస్వామ్యం, జెండర్‌, (లింగ వివక్ష), అణచివేత, ఇంటి చాకిరీ స్వభావం మొదలైన ఎన్నో విషయాల గురించి కొత్త ఆలోచనలను రేపింది. పద్మలత మాటల్లో ”స్త్రీ వాద దృక్పథమంటే, స్త్రీల జీవితాల్లోని సాంఘిక, ఆర్థిక, రాజకీయ అంశాలను పురోగామి దిశగా మలుపు తిప్పగల దృక్పథమ”ని చెప్పారు. ”ఫెమినిజం (స్త్రీ వాదం) అనేది స్త్రీ, పురుష సమానత్వాన్ని కాంక్షిస్తుందేగాని స్త్రీలనీ, పురుషులనీ విడదీయదు, సామాజికంగానూ, ఆర్థికంగానూ, లైంగికంగానూ స్త్రీలను దోపిడీ నుంచి విముక్తి చేసే రాజకీయ సిద్ధాంతమే ఫెమినిజం” అని జయప్రభ గారు అన్నారు. వాసిరెడ్డి సీతాదేవి రచించిన ‘వైతరణి’ నవల, ఆస్తిహక్కు లేక స్త్రీల జీవితం నరకప్రాయంగా మారుతుందనే విషయాన్ని వ్యక్తపరిచారు. జొన్నలగడ్డ లలితాదేవి ”అగ్నిపుత్రి” నవలలో లైంగిక దోపిడీకి బలయ్యే స్త్రీల వ్యథలను కళ్ళకు కడుతుంది. భారతదేశ వ్యాప్తంగా వచ్చిన స్త్రీ వాద ఉద్యమాలు ఎటువంటి ఆశయంతో వచ్చాయో విశ్లేషిస్తూ డా|| రావి ప్రేమలత ”స్త్రీ సమాజంలో పురుషునితో సమానంగా కలిసి జీవించడం, స్త్రీ దృక్పథంతో కూడా ప్రపంచాన్ని, సాహిత్యాన్ని పరిశీలించడం, తమ శరీరాలపై, తమ జీవితాలపై అధికారం కలిగి ఉండడం, స్త్రీలోని వ్యక్తిత్వాన్ని, సృజనాత్మక శక్తిని పెంపొందించడానికి ప్రయత్నించడం, స్త్రీ ఇంటిపనికి కూడా విలువనివ్వడం మొదలైనవి”. డా||కాత్యాయని విద్మహే, ”స్త్రీ పురుషుల మధ్య అసమానతలున్నాయని, వాటి కారణంగా కుటుంబంలోనూ, సమాజంలోను స్త్రీలు అణచివేతలకు, పీడనకు గురవుతున్నారని” తెలిపారు. ఆ విధమైన స్త్రీల జీవితాలను అనుభవాలను వస్తువుగా చేసి రాస్తే అది ”స్త్రీ వాద కవిత్వం”. స్త్రీగా పుట్టడమే శాపమని భావించేలా ఈ పితృస్వామ్య వ్యవస్థ చేస్తుంది కనుక తమ ఉనికే నిషిద్ధమని చెబుతూ ”శ్రీమతి” ఈ కవిత రాశారు.

”నేనమ్మలో ఉన్నప్పుడు నేనొక స్త్రీని

నేను కావాలని అమ్మ కోరుకుంటున్నట్లు నేనొక నిషిద్ధ జీవిని

నాన్నకు తెలియగానే మొన్నటిదాకా నా నవ్వు నిషిద్ధం

ఈడ్చి చెంప పగలగొట్టిన నాన్న దెబ్బకి నిన్న నా చదువు నిషిద్ధం

నేనెవరో నాకు తెలిసింది నేడు నా బ్రతుకు కూడా నిషిద్ధమే”

పూర్వకాలం నుంచీ ఒక ప్రక్క స్త్రీని మాతృమూర్తిగా, ఇంటికి దీపంగా, త్యాగశీలిగా పరిగణిస్తూ మరొక ప్రక్క బానిసగా, వ్యక్తిత్వం లేని, స్వేచ్ఛలేని అజ్ఞానిగా చూస్తున్నారు.

ముగింపు : స్త్రీ వాద కవిత్వం వ్యవస్థను ప్రశ్నించడంతో ప్రారంభమైంది. పితృస్వామ్య వ్యవస్థ కారణంగా సమాజంలో వేళ్ళూనుకున్న ద్వంద్వ ప్రమాణాలను, స్త్రీ పురుషుల అసమానత ‘అతి సహజమని’ పరిగణించే ఆలోచనా విధానం మారాలి. జీవితాన్ని, ప్రపంచాన్ని స్త్రీల దృక్పథం నుంచి చూడవలసిన అవసరం ఎంతైనా ఉంది. అన్ని రంగాల్లోనూ స్త్రీ సమానహక్కునీ, స్వేచ్ఛనీ కోరుతుంది. వైవాహిక జీవితంలో ఇద్దరికీ సమాన గౌరవం ఉండాలని ఆకాంక్షిస్తుంది.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.