మనుషులనీ, మనుగడలనీ లోతుగా అధ్యయనం చేస్తూ… వస్తువుల ఆత్మల్నీ వాస్తవాల గమ్యాల్నీ కూలంకషంగా తెలుసుకున్న వారే ఆయా భావాలని అందమైన కవితా వాక్యాలతో అలంకరించగలరు. తమదైన విలక్షణ శైలి ప్రదర్శించి వారి కవిత్వ లోకంలోకి తీసుకెళ్ళి అలరించగలరు. అట్టి అనుభూతికి సాక్షీభూతంగా చెప్పదగినది ”జొన్నకంకి”.
కవిత్వం రాయడమనే మెట్టు నుండి పుస్తకంగా రూపుదిద్దుకునే మెట్టుకు మధ్య ఎంతో సంఘర్షణ చోటు చేసుకుంటుంది. ఇట్టి మానసిక ఘర్షణలో ఎప్పటికప్పుడు కృతకృత్యురాలవుతూ నాలగో పుస్తకంగా సాహితీ క్షేత్రంలో ”జొన్నకంకి”గా ఉదయించారు కవయిత్రి శ్రీమతి నాంపల్లి సుజాత గారు. నెమలీకలు అనే నానీల పుస్తకంతో తమ ప్రస్థానం మొదలుపెట్టిన వారు ”మట్టి నా ఆలాపన” (కవితా సంపుటి) మట్టి నానీలు వెలువరించి కవిత్వంలో తమదైన శైలిలో రాణిస్తున్నారు.
54 కవితలతో వచ్చిన ఈ ”జొన్న కంకి”లో సాధారణ వస్తువులనే కళాత్మక దృష్టితో చూసినప్పుడు ఆయా వస్తుజాలం ఎలా ప్రాణం పోసుకొని పలకరిస్తాయో మనకి బాగా అర్థమవుతుంది. జొన్నకంకి అనే కవితతోనే ప్రారంభమైన ఈ పుస్తకంలోని కవితాంశాలను సమాజ సంస్కరణకు చెందినవి, పర్యాటక ప్రాకృతిక జ్ఞానానికి చెందినవి, ఉపాధ్యాయ వృత్తి ఔన్నత్యానికి చెందినవి మరియు కొన్ని ఆసక్తికరమైన వస్తుజాలాలకు సంబంధించినవిగా వర్గీకరించి చూడవచ్చు.
”నాటిన ఒక విత్తనం
భూమి పొరల్తో పోరాటం చేసి
దోసెడు ముత్యాలతో బయటపడింది”
అంటూ జొన్నకంకితో వారికున్న అనుబంధాన్ని, ఆనందాన్ని పంచుకుంటూనే… ”జొన్న కంకీ
మెట్ట పొలాల్లో వెలసిన జానపద జాణ
తెలంగాణను అభిషేకించిన విత్తనాల వాన” అని తమ ప్రాంతీయ అభిమానాన్ని, నిలబడ్డ నేల ప్రాభవాన్ని గొప్పగా ఆవిష్కరించారు.
‘చిలుకల పేరు’ కవితలో
”ముద్దబంతి పూలకి
పాకం కట్టినట్టు
చెక్కరి శిల్కలు
ఆకాశం నుండి ఎగిరొచ్చి
మెడలో వాలినంత ఆనందంగా ఉండేది” అని బాల్యపు పీర్ల పండగను శిల్కలంత తియ్యగా దండ కట్టి బాల్యమెవరికైనా బంగారమేనన్న స్పృహను కలిగించి పాఠకులను వారి కవిత్వేంద్రజాలంతో అప్పటికప్పుడే చిన్నపిల్లలను చేశారు.
”చిన్నా అంతలోనే ఆరిపోయావా?!” అనే కవితలో
”చౌరస్తాలో నిలబడ్డ బిడ్డా!
నాలుగు దారులూ కాక
ఏ దారిలో వెళ్ళిపోయావో?!” అనే ఆర్దృతా వాక్యాలతో ప్రారంభించి బ్రతుకులో గెలుపోటముల పాత్రని చక్కగా అక్షరీకరించారు. ఒకవైపు పిల్లల్లో మానసిక స్థైర్యాన్ని నింపుతూనే అటు పరీక్షా మూల్యాంకన, పెద్దలకు క్షేత్రస్థాయి స్థితిగతులను విడమర్చి చెప్పి కవిత యొక్క సామాజిక బాధ్యతను పాటించారు.
ప్రపంచ శాంతిని కోరే సహృదయం గల వారిగా, లం చేత సంఘ సంస్కరణకు పూనుకున్న గొప్ప ఆలోచనకారిగా ”వద్దే వద్దు” కవితలో
”యుద్ధమంటే
ముక్కలు ముక్కలుగా
నిన్ను నువ్వు నరుక్కోవడమే” అనే వాక్యాల ద్వారా స్పష్టం చేశారు.
”ఇవి చిన్న చిన్న గుట్టలే కావచ్చు
కానీ ఎవరెస్టు అధిరోహించడానికి
అభ్యాస నివేశాలు” అంటూ ”పాండవుల గుట్టలు” గురించి, ఆకాశ అనకొండ అని మెట్రో రైలు గురించి, మనాలి నుండి నేను సౌందర్యాన్ని మోసుకొచ్చాను అంటూ ‘మనాలిలో ఒకరోజు’లో మనాలి సోయగాల్ని గురించి, ఇలా ఇంకొన్ని పర్యాటక శోభాయమైన కవితలతో తమ ప్రకృతి ఇష్టతనీ, చారిత్రక విశిష్టతని హృద్యంగా ప్రకటించడం జరిగింది.
సాంఘిక ఉపాధ్యాయురాలైన వారు వృత్తిని ఎంతలా ప్రేమిస్తారో వివరించే కవితలుగా ”ఇన్విజిలేషన్”, ”వీడలేమంటూ”, ”ఓ రోజు క్లాస్‌రూంలో” అనే వాటిని చెప్పుకోవచ్చు.
”ఓ దిశా…
జంతువులను చదివిన డాక్టర్‌వి కదా!
మృగాళ్ళనెందుకు
పసిగట్టలేదు బిడ్డా” అని ”దిశా నిర్దేశం”లో మహిళలపై పెట్రేగిపోతున్న అమానవీయ ఉదంతాలకి వేదన చెందుతూనే మహిళామణులందరూ అపరకాళిగా మారాలని ఉద్బోధ చేశారు.
”నిజానికి
నేను బయట నడుస్తున్నట్టే ఉంటుంది మీకు
కానీ అవి నాలోకి నేను వేసే అడుగులు” అనే తాత్వ్తిక చింతన కలిగించే కోణం ఆవిష్కరించారు వీరి ”నా ఉదయం నడక” అనే కవితలో…
ఇలా జొన్నకంకిని ఒలుసుకుంటూ పోతే ప్రతి కవితా దేనికదే అద్భుతంగా ఆకట్టుకుంటుంది. స్త్రీ వాదం తొంగి చూస్తున్న కవయిత్రిగా, వృత్తి పట్ల నిబద్ధతగల ఉపాధ్యాయురాలిగా, సమాజ సంస్కరణకై కలం చేబట్టిన కాళికలా, ప్రకృతి రమణీయతకు కరిగిపోయే సున్నిత మనస్కురాలిగా, కంటికి దొరికిన ప్రతి వస్తువుకీ కవితా సన్మానం చేయగలిగే నేర్పూ కూర్పూ కలిగిన ఉదాత్త హృదయురాలిగా కవయిత్రి నాంపల్లి సుజాత గారి గురించి అభిప్రాయపడవచ్చు. ఆయా సుగుణాలు ప్రతిఫలించే రీతిలోనే జొన్నకంకి ఆసాంతం కవితా విందుని అందించి మధుర భావనకి లోనుచేస్తుంది.