అప్పుడే ఢిల్లీకి వచ్చి నాలుగో రోజు. టీ బ్రేక్‌లో టీ సిప్ చేస్తుంటే రమణి గుర్తొచ్చింది జయకి. ఈ సమయంలో రమణికి సహాయంగా ఉండాల్సింది. ఒక్కటే ఎంత తిప్పలు పడుతున్నదో మనసులోనే అనుకున్నదామె.
అంతలో బీప్ శబ్దం… మొబైల్ చూసింది. రమణి నుంచి మెసేజ్.
ఆశ్చర్యం తనని తలుచుకుంటూ ఉండగా తన నుండే మెసేజ్… సాయంత్రం వరకూ బిజీగా ఉంటానని మెసేజ్ పెట్టిందేమో.
ఓపెన్ చేసింది. చాలా పెద్ద మెసేజ్.
టీనేజ్‌లో వచ్చిన మొదటి లవ్ లెటర్ అందుకోగానే కలిగే ఉద్విగ్నత జయలో.. ఆ భావోద్వేగాలు ఆ మెసేజ్ చదవమని మనసు తొందర పెడుతున్నప్పటికీ ఆ క్షణంలో చదవలేని స్థితి… తప్పని నిరీక్షణ… మాటలకందని అనుభూతిని లోలోపలే బంధించింది.
ట్రైనింగ్ సెషన్స్ అవగానే రూమ్‌కి వచ్చింది. ఫ్రెష్ అవకుండానే ఫోన్ తీసింది రమణి మెసేజ్ కోసం.
‘జయా… నేనిలా రాయొచ్చో రాయకూడదో తెలియదు. చాలా సందర్భాల్లో ముసురుకమ్మిన నా మనసుకు ధైర్యం చెప్పావ్. గమ్యం తెలియక కొట్టుమిట్టాడుతున్నప్పుడు నీవేం భయపడాల్సింది లేదని భరోసా ఇచ్చావ్. చల్లని స్నేహ స్పర్శ అందించావ్.
నా గుండె గది లోపల మరుగుతున్నదాన్ని అప్పుడప్పుడు నీ ముందు విప్పడం… లేదా కన్నీటితో నా తలగడలో దాచేయడం… అదేగా నాకు తెలిసింది… అందుకే…
నేనింకా చిన్నపిల్లనా నాకు సంబంధం చూడడానికి. నా కలలు నన్ను కననీయండి. ఇప్పుడిప్పుడే రెక్కలు మొలిచి ఎదగడానికి ప్రయత్నిస్తున్నా.. నన్ను స్వేచ్ఛగా ఎగరనివ్వండి అంటూ రచన సున్నితంగా తిరస్కరించినప్పడూ…
కొంతకాలానికి నా కలల రాకుమారుడిని నీకు తెచ్చి చూపిస్తాలే… బెంగపడకమ్మా.. అర్థం చేసుకో… అన్నప్పుడూ, ఎవరిని తీసుకొచ్చి నా ముందు నిలుపుతుందోనని బెంగటిల్లుతుంటే నువ్వేగా… నన్ను ఊరడించింది.
కాలాలు, రుతువులు ఈ ప్రకృతిలో ఎంత సహజమో… వయసొచ్చిన పిల్లలకి పెళ్ళి కూడా అంతే సహజం. తనకు నచ్చినవారితో జతకట్టాలనుకోవడం తప్పేమీ కాదని, సృష్టిలో మనిషి తప్ప ఏ జీవికీ ఎదుటివారు జత కుదర్చడం జరగదని బుజ్జగించావ్.
తల్లిగా నువ్వెంత ప్రేమిస్తున్నావో అంతకంటే ఎక్కువ ప్రేమ దొరికింది నీ కూతురికి అని చెప్పావ్.
నాన్న జ్ఞాపకాలు తెలియని నా కూతుర్ని, నాన్న లేడని దిగులు చెందకు, అమ్మ ఉందిగా… ఆమెతో కలిసి నీ ఆనందాన్ని ఆస్వాదించు అని రచనని ఊరడించావు. ఇప్పుడు ఏం చెబుతావో… రెండు బండరాళ్ళ నడుమ ఇరుక్కుపోయిన ఈ తల్లీ కూతుళ్ళ వేదనని ఎలా బయటకి లాక్కొస్తావో… అంచనాలు తారుమారైపోయాయి. స్వేచ్ఛా విహంగంలా ఉన్న నా కూతురు తన రెక్కలను తానే నరికేసుకుంటున్నదా… అందమైన పూవు తన రేకలు తానే జార్చుకుంటున్నదా… సందేహం నన్ను నిలువనివ్వడంలేదు. భయంతో వణికిపోతున్నాను.
ఒక్కగానొక్క బిడ్డ, తండ్రిలేని బిడ్డ అని అతి గారాబం చేశానో లేక నేనే అతిగా స్పందిస్తున్నానో అర్థం కావడంలేదు.
నిన్నటి వరకూ బాగుంది. కొత్త పెళ్ళికూతురు ఎలా ఉంటుందో అట్లాగే ఉంది.
కానీ, ఈ రోజే…
నీకు తెలుసుగా… నా కూతురుది కండిషన్స్ లేని ప్రేమ. అదే ఎదుటివాళ్ళ నుంచి కోరుకుంటుంది. ఏమైందో… శోభనం ఏర్పాటు చేసిన హోటల్ నుండి రచన ఒక్కటే వచ్చింది. అతను రాలేదు.
దాని గుండెల్లో అలజడి, ఆ కళ్ళలోని కారుమేఘాలు కనిపించకుండా ఉండాలని విశ్వప్రయత్నం చేస్తున్నట్లు ఈ తల్లి మనసు పసిగట్టింది.
అతని గురించి అడిగితే, దానికి జవాబివ్వకుండా ప్రేమంటూ చుట్టూ తిరిగిన అతని ప్రేమేంటో ఇప్పుడర్థమైంది. కాటువేసిన మనిషిని ఎట్లా ఎదుర్కోవాలో… ఎట్లా యుద్ధం చేయాలో… సర్వశక్తులూ కూడదీసుకుంటున్నా…
అమ్మా… ఆడపిల్లంటే ఒద్దికగా, పొందికగా ఉండాలని చిన్నప్పటి నుండి పోరి పోరి నేర్పాలని ప్రయత్నించావ్. కానీ, అది తప్పని ఇవ్వాళే అర్థమయింది. యుద్ధ విద్యలు నేర్చుకోవాలనీ, ఎప్పటికప్పుడు యుద్ధం చేయడం ఎలాగో తెలుసుకోవాలని తెలుసుకున్నానమ్మా…
ఏంటమ్మా… అవమాన భారం ఆమెదేనా, నిందలు ఆమెకేనా… అంటూ ఒళ్ళో తల పెట్టుకుంది. లోపలినుండి పొంగి వస్తున్న దుఃఖానికి అడ్డుకట్ట వేస్తూ వణుకుతున్న కంఠంతో తన గాయాలకు తానే లేపనం పూసుకొని చికిత్స చేసుకుంటున్నది.
నేనేంటో నిరూపించుకోవాలి. అతను తప్పని రుజువు చేయాలి అంటున్నది. రచన మాటల్లో ఆవేశం, దుందుడుకు తనం లేవు. సముద్రమంత లోతు ఉన్నది దాని మాటల్లో.
కానీ… అసలు విషయం ఏమిటో అర్థం కావడంలేదు.’
ఆ మెసేజ్ చదివిన దగ్గరనుండి అమాంతం రమణి దగ్గరకు రెక్కలు కట్టుకు వెళ్ళాలని, దగ్గరకు తీసుకుని ఓదార్చాలని మనసు ఆరాటపడుతోంది. ప్చ్… పాపం తనకి కష్టం మీద కష్టం వచ్చి మీద పడుతోంది.
రమణి ఆడపడుచు మాత్రమే కాదు ఆప్తమిత్రురాలు కూడా. తల్లిగా రమణి ఆందోళనని, ఆరాటాన్ని, ఆవేదనని అర్థం చేసుకోగలదు. కానీ అసలు విషయం ఏమిటో బుర్రకు అందడం లేదు. ఆలోచనలతో వేడెక్కిపోయింది. రెండు చేతులతో కణతలు ఒత్తుకుంది జయ.
ఆ అబ్బాయి కోసమే, అతని ఇంట్లో వాళ్ళని ఒప్పించుకోవడం కోసమే ఇన్నేళ్ళు ఆగి పెళ్ళి చేసుకున్న రచన గురించిన ఆలోచనలు చిందరవందరగా…
ఇంటర్ కమ్‌లో రూమ్ సర్వీస్‌కి ఫోన్ చేసి టీ ఆర్డర్ చేసింది.
‘సారీ రమణీ… నేనిప్పుడే నీ మెసేజ్ చూసుకోగలిగాను. నువ్వు నా స్పందన కోసం ఎదురు చూస్తుంటావని ఈ మెసేజ్.
అనుక్షణం అవమానాలు, నిందలు, ఎదురు దెబ్బలు అన్నింటినీ ఎదుర్కొంటూనే ముందుకు సాగుతున్నావ్. ఇప్పుడేంటి ఇట్లా అయిపోతున్నావ్? నువ్వే ఇంత బేలవయితే ఇక రచనకి ఏమి చెప్పగలవు చెప్పు. కొత్త జంట మధ్య ఏదో మాటా మాటా వచ్చి ఉంటుందిలే. దానికే ఇంత టెన్షన్ పడతావేం. అంతా సర్దుకుంటుంది.
చూడు, ఇంకా కొన్ని గంటల్లో అంతా సర్దుకుంటుంది.
పరిస్థితి సరిదిద్దే బాధ్యత నాది సరేనా…’ అని తన భుజస్కందాల మీద వేసుకుంటూ మెసేజ్ పెట్టింది జయ.
ఫ్రెష్ అయి వచ్చి రచనకి ఫోన్ చేసింది. కాల్ తీసుకోలేదు. హాయ్ అంటూ మెసేజ్ పెట్టింది.
రచన పెళ్ళయిన మర్నాడే తప్పనిసరి పరిస్థితుల్లో ఆఫీసు పనిమీద ఢిల్లీ వచ్చింది తను. వచ్చిన దగ్గర్నుండి పని ఒత్తిడి. నిన్న
ఉదయం ఫోన్ చేసినప్పుడు ఇంకాసేపట్లో అల్లుడు, కూతురు వస్తారని చాలా ఉత్సాహంగా చెప్పింది. వారికి ఇష్టమైన వంటకాలు తయారు చేయించే పనిలో ఉన్నానని చెప్పింది రమణి.
నిన్నటికి, ఇవ్వాల్టికి పరిస్థితిలో ఎంత తేడా..
‘అనుకున్నవన్నీ గెలుచుకుంటూ వచ్చాను. ప్రేమలో కూడా గెలిచాననుకున్నా అత్తా… కానీ ఘోరంగా ఓడిపోయాను. ఉన్న పళాన పాతాళంలో పడిపోయాను’ అంటూ రచన మెసేజ్.
తను ఇప్పుడు మాట్లాడే స్థితిలో లేనని తాను కూడా మెసేజ్ పెట్టింది జయ.
‘కాళ్ళ పారాణి ఆరకముందే ఏ కష్టం వచ్చిందిరా చిట్టితల్లీ. కట్నకానుకల గురించి ఏమన్నా అన్నాడా.. కులం, మతం గుర్తొచ్చాయా… ఆస్తి, అంతస్తు తక్కువయ్యాయా… ఏమిటట అతని బాధ… లేక అతనిలో లోప…’ వెంటనే రచన నుండి కాల్ వచ్చింది.
”అవునత్తా… అతనిలో లోపం ఉంది” టక్కున అన్నది రచన కన్నీటిని గొంతులోనే పూడ్చేస్తుండగా.
”ఒక్క రాత్రికి లోపం కింద జమకట్టేయకు. మొదటిసారి కదా… తొందరలో… తెలియని భయంవల్లో… అలా జరిగిపోతుంది… అలా అని అతను పనికిరాడని వెంటనే అంచనాకి రావడం సరికాదురా…” నచ్చచెప్పే ధోరణిలో.
”స్టాపిట్ అత్తా… స్టాపిట్” అరిచేసింది. కొన్ని క్షణాలు ఇద్దరి మధ్య మౌనం తర్వాత ”నేను పంపిన వాట్సప్ మెసేజ్ చూశావా?” ప్రశ్నించింది రచన.
”ఊహు… నేను వాట్సాప్ ఎక్కువ వాడను కదా… ఎప్పుడు పంపావు” అడుగుతూనే వాట్సప్ మెసేజ్ ఓపెన్ చేసింది జయ.
”అత్తా… నేనేం చేశానని నాకీ శిక్ష అత్తా… నిన్నటివరకూ నన్నూ, నా వ్యక్తిత్వాన్నీ ప్రేమించానన్న వ్యక్తి, నేను అతనికి దొరకటం తన అదృష్టం అని పొంగిపోయిన వ్యక్తి, నా వెంటపడి జీవితాంతం నాకు నువ్వు తోడుగా ఉండాలన్న వ్యక్తి ఒక్కపూటలో ఇట్లా మారిపోయాడేంటత్తా… నాకు తెలియకుండా నా శరీరంపై పరీక్షలు ఏంటి? నా శీలంపై పరీక్షలేంటి?
అవమానం భారం మోయడం చాలా కష్టంగా ఉందత్తా… నేరం చేయకుండానే నేనీ శిక్ష మోయడానికి సిద్దంగా లేనత్తా… ఇదేనా ప్రేమించిన వ్యక్తిపై అతనికి ఉండే ప్రేమ? అసలు దీన్ని ప్రేమ అంటారా… అనుమానం అంటారా… ఇటువంటి అనుమానాలతోనా అతనితో నా జీవితాన్ని ప్రారంభించేది? పంచుకునేది..? తట్టుకోలేకోతున్నాను. ఈ దేశంలో మగవాళ్ళు కృష్ణుడిలా ఎంతమంది గోపికలతోనైనా గడుపుతారు. కానీ రాముడిలా భార్యని అనుమానిస్తారు, అవమానిస్తారని ఇప్పటివరకు విన్నాను, పుస్తకాల్లో చదివాను.
ఇప్పుడు అది నా జీవితంలో నాకే నడిచొస్తుందని, అనుభవం ఎదురౌతుందని ఎప్పుడూ అనుకోలేదు. అభి కృష్ణుడో, రాముడో నాకు తెలియదు. కానీ అతను ఎంతమంది స్త్రీలతో గడిపితే అంత గొప్పవాడన్న భావన అతని మాటల్లో బయటపడింది. అలనాటి రాముడిలా భార్య శీలాన్ని శంకించడం మొదలైంది. అంతా ఒక్క పూటలో… ప్రపంచం తిరగబడినట్లున్నదత్తా…
అభి… అప్పుడప్పుడూ నా మొబైల్ చేతుల్లోకి తీసుకుని చూస్తుంటే… అంతా క్యాజువల్‌గా తీసుకున్నా… అతనిలో దాగిన భూతాన్ని గ్రహించలేకపోయాను… అదంతా ఇప్పుడు అర్థమవుతోంది.
కొత్త జీవితం గురించిన ఊహల ఊయలలో ఊరేగుతున్న నా రెక్కలు అమాంతం తెగిపడి విలవిలా కొట్టుకుంటున్నాయత్తా… అతనితో గడపబోయే జీవితపు ఫలాలు మధురంగా ఉంటాయనుకున్నా కానీ ఇంత చేదుగా, వికృతంగా ఉండి నన్నింత క్షోభ పెడతాయని… భవిష్యత్‌నే ప్రశ్నగా మారుస్తాయని అస్సలు ఊహించనేలేదు.
ఒక్క పూటకే ఇంత కంపరంగా, నీచంగా, వేదనగా ఉంటే ఇటువంటి వ్యక్తితో జీవితమంతా కలిసి నడవగలనా… అనేకానేక ప్రశ్నలు నా మెదడును చీమల పుట్టలా తవ్వేస్తూ… విస్తరిస్తూ…
నేనేంటో నీకు తెలుసుగా అత్తా, నన్ను నేనుగా నిలబెట్టుకోవాలన్న బలమైన కాంక్షతో నడుస్తున్న ఈ కాలపు ఆడపిల్లను. నన్నేం చేయమంటావ్. నాలో జరుగుతున్న ఘర్షణని అమ్మ ముందు పరువలేకపోయాను. తల్లిగా అమ్మ ఆవేదన, ఆందోళన ఏ విధంగా ఉంటుందో ఊహించలేని పసిదాన్ని కాదు కదత్తా… అందుకే అమ్మకి చెప్పలేదు. ఇప్పటికే ఆమె చూపుల్లో అనేక ప్రశ్నలు… నన్ను బాణాల్లా తాకుతున్నాయి.
ఈ సందిగ్ధావస్థలో నువ్వు మాత్రమే నాకు సరైన దిశానిర్దేశం చేయగలవని నా నమ్మకం. ఒక సామాజిక శాస్త్రవేత్తలా నువ్వు లోకాన్ని చాలా చూశావ్. అక్కడ నువ్వెంత బిజీగా ఉన్నావో తెలియదు. ముఖా ముఖి చెప్పలేక ఈ మెసేజ్ పెడుతున్నా… వీలయితే ఫోన్ చేస్తావని ఆశిస్తూ…”
”అయామ్ వెరీ సారీరా బంగారు తల్లీ…” బాధగా నిట్టూర్చింది జయ.
”అత్తా అతనికి శారీరక లోపం ఉంటే నేనస్సలు లెక్కచేసేదాన్నే కాదు. అతని నిజస్వరూపం తెలిసిన తర్వాత ఒక్క క్షణం కూడా అతని ఉనికి భరించలేకపోతున్నాను. అతని నిజరూపాన్ని పసిగట్టలేని నన్ను నేను నిందించుకోవడం తప్ప ఎవరినీ ఏమీ అనలేను” అంటూ జరిగిన సంఘటన చెప్పింది.
రచన చెప్పింది వింటుంటే మైండ్ బ్లాక్ అయి నిస్సత్తువ ఆవరించింది.
రేపు ఈవెనింగ్ డైరెక్టుగా నీ దగ్గరకే వస్తున్నా… అమ్మ, నువ్వు జాగ్రత్త. ఎక్కువ ఆలోచన చేయకండి అని ఏవేవో చెప్తుంటే…
‘నన్ను నేను నిలుపుకోవడానికి పడే యాతన ఎవరికర్థమవుతుంది? నాకు తప్ప. అమ్మ, నువ్వు, మామయ్య ఎవరున్నా…’ ఏదో చెప్పబోయి ఆగింది. ఒక్క క్షణం తర్వాత ‘అత్తా డోంట్ వర్రీ… ఐ విల్ టేక్ కేర్ మై సెల్ఫ్… బట్, అమ్మ గురించే… ‘ అని తనకు ధైర్యం చెబుతున్న రచనతో ఏవేవో నాలుగు మాటలు మాట్లాడి ఫోన్ పెట్టేసినా హృదయంలో మెలిపెడుతున్న బాధ ఆమెలో.
అభి మీద అప్పటివరకూ అభిమానం క్షణంలో ఎగిరిపోయింది. రచన వ్యక్తిత్వం మీద గౌరవం రెట్టింపైంది. అదే సమయంలో రమణి ముఖం కళ్ళముందు కదలాడి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టుగా ఉంది పరిస్థితి. తల్లీ కూతుళ్ళిద్దరిలో ఎంత అంతర్మథనం…
అభి చేసిన పనికి మనసు కుతకుత ఉడికిపోతుంటే విషయం తేల్చుకుందామని అతనికి ఫోన్ చేసింది జయ.
”లోలోపల నేనెంత తగలబడిపోతున్నానో మీకేం తెలుసు… స్వచ్ఛమైన ప్రేమతోనే ఆమెను చేపట్టాను. కానీ ఆమె నన్ను మోసం చేసింది. ఆమె మాత్రమే కాదు మీరందరూ… అందరూ కల్సి నన్ను మోసం చేశారు. గర్భవతి అయిన మీ అమ్మాయిని నాంటగట్టారు” ఎలాంటి ఉపోద్ఘాతం లేకుండా ఎదురు దాడి ప్రారంభించాడు.
”షటప్… నోర్ముయ్యరా… ఎవడ్రా నీకు చెప్పింది…” గాండ్రించింది.
”వాంతులవుతుంటే ఏదో తేడా చేసిందనుకున్నా. కానీ… నేను పెట్టిన టెస్టులో ఫెయిలయ్యింది. అప్పుడే అర్థమయిపోయింది. అసలు విషయం”
”ఏమర్థమయింది…” ఎగిసి వస్తున్న కోపాన్ని, తిట్లను నొక్కిపెడుతూ.
”శోభనం రాత్రి బెడ్‌షీట్స్‌పై ఎర్రటి మరకలే లేవు. వేవిళ్ళు కనిపిస్తూనే ఉన్నాయి. టెస్ట్ చేయించా. ఇప్పుడు ఆ రిపోర్టుల కోసమే బయలుదేరుతున్నా…” అవహేళనతో అన్నాడతను.
కొద్ది క్షణాల క్రితం రచన చెప్పిన మాటలు మదిలోకొచ్చాయి.
దూకుడుగా ఆక్రమించుకుంటున్న అతన్ని ఆపలేక తీవ్రమైన నొప్పితో విలవిల్లాడుతూ… అవమానంతో ఆ రాత్రంతా నిద్రలేదనీ… తన పనికానిచ్చుకుని నిద్రలోకి జారుకున్న అతను ఉదయం లేవగానే పక్కదుప్పట్లను పరీక్షించి చూస్తుంటే ఎందుకో అర్థం కాలేదనీ, స్నానం చేసి రెడీ అయి తనను పదమంటూ హాస్పిటల్‌కి తీసుకుపోతే వాంతులతో నీరసించిపోయిన తన మీద ప్రేమతో అనుకున్నాననీ చెప్పింది.
తనని పరీక్ష చేసి, బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి పంపి డాక్టర్‌తో అతను మాట్లాడుతున్నప్పుడు అతనెందుకు తీసుకొచ్చాడో అర్థమయింది అసలు విషయం.
వాళ్ళ మాటలు నా చెవిన పడుతున్నాయని తెలియని అతను తన అనుమానాలు డాక్టర్ ముందు వెళ్ళగక్కడం, ఆవిడ చీవాట్లు వేయడం అన్నీ స్పష్టంగా అనిపిస్తున్నాయి. ఆకుపచ్చని తెరల మధ్యలోంచి దారిచేసుకొచ్చి రచనకు వినిపించాయి.
”ఆమెకు తెలియకుండా… ఆమె శరీరంపై నీ నియంత్రణ… పట్టు ఏమిటి?” ఆవేశం ముంచుకొచ్చి అరిచింది జయ.
”ఆమె నాదయినప్పుడు, మరి ఆ శరీరం నాదే కదా…” పెద్దగా నవ్వేశాడతను. ఈ చిన్న విషయం తెలియదా అన్నట్లుగా ఉందా నవ్వు.
”సరే… నీవనుకుంటున్నట్లు రిపోర్ట్స్ పాజిటివ్ వచ్చాయే అనుకుందాం. మరి నువ్వు వర్జిన్‌వేనా…” కోపాన్ని అణుచుకుంటూ ప్రశ్నించింది.
”నేను మగాడ్ని…” అహంకారపు జవాబు.
”ఎంత అహంకారం. ఛీ..ఛీ.. నువ్వు తగలబడడం కాదు ఎదుటివారిని తగలబెడుతున్నావ్. ఎదుటివారిలోకి దూరి ఏం దొరుకుతుందా అని వెతికే మానసిక రోగివి. మా పిల్ల జీవితాన్ని పున్నాగపూల వాసనతో గుబాళింప జేస్తావనుకున్నాం గానీ… మొగలి పొదకు చుట్టుకున్న పామువని అనుకోలేదు. బుసలు కొడుతున్న ఆధిపత్య ధోరణి…”
”నా భార్యను నేను మాత్రమే తొలిసారి తాకాలని, చేరువ అవ్వాలని, ఆమెలో నేను మాత్రమే ఉండాలని కోరుకోవడం తప్పెలా అవుతుంది?”
”మరి నువ్వు… నీకు ఆమె మాత్రమే మొదటిది కావాలని ఎందుకనుకోవు?”
”నేను మగవాడిని అంటే… మగవాడ్ని… మగవాడంటే అట్లాగే ఉంటాడు. నేను ఎంతమందితో తిరిగినా, ఎంతమందితో లైంగిక సంబంధాలు పెట్టుకున్నా, నా భార్య నాకు మాత్రమే పరిమితం కావాలనుకుంటాను. నన్ను గురించి తప్ప మరో మగాడి గురించి ఆలోచించకూడదని అనుకుంటాను. అందులో తప్పేంటి?”
”లైంగికత గురించి తెలియని నీకు మగవాడివన్న అహం… ఇంత విషపూరిత సంస్కృతిలోంచి వచ్చావనుకోలేదు… నీ మెదడులో ఇంత చెత్త కూరుకున్నావని తెలియదు. ఎక్కడికి పోతాయి… పురుషస్వామ్యం వేళ్ళూనుకుపోయిన వ్యవస్థలోంచే కదా నువ్వూ వచ్చింది… వర్జినిటీ గురించి తెలుసా…” వస్తున్న కోపాన్ని అణిచిపెట్టుకుంటూ అన్నది. పరిస్థితి చక్కదిద్దాలంటే కొంత సంయమనం అవసరం అన్న ఆలోచన ఆమెది.
”ఎందుకు తెలియదు. వర్జినిటీ టెస్ట్ ఫర్ ఉమెన్, వర్జినిటీ టెస్ట్ ఫర్ ఫిమేల్, వర్జినిటీ టెస్ట్ అని చాలా సెర్చ్ చేసి తెలుసుకున్నా” నిర్లక్ష్యంగా అని ”మీ అమ్మాయితో నా ప్రేమ చారిత్రక తప్పిదం. అంత పొగరుమోతుని, గర్విష్టిని, అహంకారిని, విలువల్లేని దాన్ని చేసుకోవడం చారిత్రక తప్పిదమే కదా. నా…” అతను ఇంకేదో అనబోతుండగా
”హు… పువ్వు రెమ్మల్ని తుంచేసిన నీకు నీ సొంత కిటికీలోంచి చూస్తే అట్లాగే అగుపిస్తుంది… కోడి తల కోసేసి కళ్ళనీళ్ళు పెట్టుకున్నట్లుంది నీ వ్యవహారం… చీదరగా ఉంది. కుళ్ళి కంపు కొడుతున్న నీ మాటలు వింటుంటే…” జయకి ఈడ్చి ఎడమకాలి చెప్పుతో తన్నాలన్నంత కోపం వచ్చింది. చీకటి సొరంగాల్లో దాచేసిన మేనకోడలి గాయాలు… ఎంత సలుపుతున్నాయో… అతను మోపిన నేరం చిన్నదా… ఏ యువతి మాత్రం తట్టుకోగలుగుతుంది? తప్పనిసరిగా తీసి చెత్తబుట్టలో పడేయాల్సిన వ్యక్తి అతను.
వెళ్ళు… వెళ్ళి ఆ రిపోర్టులేవో తొందరగా చూడు. తానేంటో తప్పక నిరూపించుకుంటుంది నా రచన. ఎవరి నిజరూపం ఏమిటో స్పష్టమవుతుంది. పసిదాని తలమీద ఎంత బరువైన బండ దొర్లించావో నీకు తెలుస్తోందో లేదో… కానీ నీ జీవితం మీద నీవే దొర్లించుకున్నావని తెలుస్తుందిలే… వెళ్ళు. వేళాకోళపు నవ్వు బిగ్గరగా అవతలివైపు నుండి.
నవ్వుకోవయ్యా… నవ్వుకో… బాగా నవ్వుకో… కాసేపయితే నవ్వుకోవడానికి నీవుండవుగా… నీ తప్పుడు ఆలోచనలు, అనుమానం తప్ప.
రచన ఈ కాలం ఆడపిల్ల. తెలివితేటలు, ఆలోచన, వివేచన, అందం, చదువు, మంచి ఉద్యోగం అన్నీ ఉన్న అమ్మాయి. జీవితం పట్ల నిర్దిష్టమైన అభిప్రాయాలున్నాయి. కొత్త జీవితంలోకి ఎన్నో ఆశలతో, ఊహలతో అడుగుపెట్టిన అమ్మాయి మనసు, ఆత్మగౌరవం కోసం ఎదుర్కొనే సవాళ్ళు ఏనాటికైనా ఆ పురుష అహంకారికి అర్థమవుతుందా… కుటుంబమంతా రచనకు అండగా నిలబడాలనుకున్నదామె.
జెండర్ ఎడ్యుకేషన్, సెక్స్ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల అతనలా ప్రవర్తించి ఉంటాడా? ఇతనేనా… మగపిల్లలు ఇలాగే
ఉంటున్నారా… ఏమో…
చెల్లెలింట పెళ్ళి పనుల్లో అన్నీ తానై చూసుకున్న రేవంత్ నిన్నటివరకూ అక్కడే ఉన్నాడు. ఈ రోజు ఉదయం ఆఫీసు
ఉండడంతో ఆఫీసుకెళ్ళిపోయాడు. అతనికి ఈ విషయం తెలిసి ఉండకపోవచ్చు. అన్నతో చెప్పడానికి రమణి ఇబ్బందిపడి
ఉండొచ్చు అనుకున్న జయ భర్తకి ఫోన్ చేసి విషయం చెప్పింది. వెంటనే రమణి ఇంటికి వెళ్ళి మనోధైర్యాన్ని ఇవ్వమని కోరింది జయ.
లేచి రేపటి సెషన్ కోసం కావాల్సిన స్లైడ్స్ రెండు, మూడు తయారు చేసుకుందామని లాప్‌టాప్ అందుకుంది జయ. కానీ పని చేయలేకపోతోంది. కాసేపట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ రిపోర్ట్స్ వస్తాయి. సందేహం లేకుండా నెగటివ్ అనే వస్తాయి.
అప్పుడు క్షమించమంటూ వస్తాడా… రచన క్షమించగలదా…
వర్జినిటీ టెస్ట్ చేయకూడదని ఎప్పుడో ఎక్కడో చదివిన గుర్తు. అసలు వర్జినిటీ అంటే ఏమిటి…
ఎప్పుడూ సెక్స్‌లో పాల్గొనకపోవడమేనా…
ఒకవేళ ఒక మహిళ మరో మహిళతో సెక్స్ చేస్తే…? ఆమె వర్జిన్ అవుతుందా…
రేప్ వంటి సంఘటనలకు గురయితే… ఆమె వర్జినిటీ కోల్పోయినట్లేనా…
అతనికి వర్జిన్ టెస్ట్ ఎట్లా చేస్తారు… అతనికి అవసరం లేదా…
ఆలోచిస్తుండగా ”అమ్మాయి బాగా చదువుకోవాలి. అతనితో సమానంగా డబ్బు సంపాదించాలి. అందంగా ఏ ఐశ్వర్యారాయ్‌లానో ఉండాలి. ఆమె శరీరం ఫ్రెష్‌గా అతని కోసమే కాచుకుని కూర్చోవాలి. కానీ ఆమె మనసు వీళ్ళకక్కరలేదాంటీ…” దాదాపు పదిహేనేళ్ళ క్రితం మిత్ర అన్న మాటలు మదిపొరల్లోంచి తొలుచుకుని ముందుకు తోసుకొచ్చి జయ కళ్ళముందు నిలిపాయి.
… … …
బస్సు బయలుదేరడానికి సిద్ధంగా ఉంది.
నా పక్క సీటు ఖాళీగా ఉంది. ఇక ఎవరూ రారేమో… లేదా మధ్యలో ఎక్కుతారో… ఎవరూ రాకపోతే ఎంచక్కా ఫ్రీగా కూర్చోవచ్చు లేదా పడుకోవచ్చు అనుకున్నా.
డ్రైవర్ బండి స్టార్ట్ చేశాడు. డ్రైవర్ వెనక సీట్లోనే కూర్చున్నానేమో అతని పక్కన కిటికీ తీసి ఉండడంతో చలిగాలి రివ్వు రివ్వున తోసుకొస్తున్నది. బస్సు బయలుదేరుతున్నా అన్నట్లు హారన్ శబ్దం చేసింది. బయట నించుని బాతాఖానీ చేస్తున్న ఒకరిద్దరు గబగబా బస్ ఎక్కుతున్నారు. కిటికీలోంచి బయటికి చూస్తున్నా…
”జాగ్రత్త వెళ్ళగానే ఫోన్ చెయ్యి బుజ్జీ… ఇక్కడి విషయాలు బుర్రలో పెట్టుకుని చదువు పాడుచేసుకోకు…” ఇంకా ఏవో చెప్తూ ఓ తండ్రి.
”బస్సు దిగేటప్పటికి ఇంకా తెల్లారదేమో. కాసేపు ఆగి సిటీ బస్‌లో వెళ్ళు. ఆటోలో వద్దు. ఎవర్నీ నమ్మలేకుండా
ఉన్నాం…” అప్పటికి ఎన్నిసార్లు చెప్పాడో మళ్ళీ చెప్తున్నాడు భర్త.
అతనికేసి చూసింది. నలభై దాటి ఉంటాయి. అది ఆమెపై ప్రేమతోనా… బాధ్యతతోనా… భయంతోనా… ఆలోచనలు.
ఎంజిబిఎస్ బస్‌స్టేషన్ చాలా కోలాహలంగా ఉంది. బహుశా దూరప్రాంతాలకు రాత్రి ప్రయాణానికి సిద్ధమై వచ్చిన వాళ్ళతో…
కొన్ని బస్సులు పాయింట్ కోసం ఎదురుచూస్తూ…
నేను వెళ్ళాల్సిన బెంగుళూరు బస్సు కదిలిపోతే ఆ పాయింట్‌లోకి రావడానికి మరో బస్సు సిద్ధంగా ఉంది. రైళ్ళు, విమానాలు, బస్సులు ఎన్ని ఉన్నా ఎన్నింటిలో ప్రయాణం చేస్తున్నా ఇంకా ఇంతమంది జనం… పుట్టలు పగిలిన చీమల్లాగా బస్టాండులో జనం వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళతో.
హడావిడిగా కదిలిపోతున్న జనంలో పరుగులాంటి నడకతో యువతి కత్తిరించిన జుట్టును అలా వదిలేసింది. నిర్లక్ష్యంగా గాలికి కదులుతున్న జుట్టు ఒకచేత్తో పైకి తోస్తూ, మరో చేత్తో బ్యాగ్. ఆ చేతి భుజానికే వేలాడుతున్న హ్యాండ్ బ్యాగ్. వెనక వీపుకు తగిలించి మరో బ్యాగ్. ఎత్తు చెప్పుల టకటక వినిపించడం లేదు కానీ… ఆ నడక చూస్తుంటే ఎక్కడ పడిపోతుందో అన్న కంగారు నాలో.
ఎత్తు చెప్పుల గురించి ఆలోచిస్తున్నంతలో నా పక్కన దబ్బున బ్యాగ్ పడేసి డ్రైవర్‌కి డబ్బులిచ్చిందామె.
డ్రైవర్ దగ్గర టికెట్ తీసుకొచ్చాక ఒక బ్యాగ్ పైన సర్ది ఒకటి కాళ్ళ దగ్గర సర్దుకుంది. హమ్మయ్య అన్నట్లుగా దీర్ఘశ్వాస వదిలింది ఎత్తు చెప్పులమ్మాయి. ఆ తర్వాత మొబైల్‌లో ఏవో మెసేజ్‌లు పెట్టినట్లుంది.
అప్పటికి బస్సు కదిలిపోయింది. మరో ఐదు నిమిషాల తర్వాత నెమ్మదిగా పక్కకు తిరిగి చిరునవ్వు విసిరింది. పెదవులపై నవ్వు మొలిపించి ఆ అమ్మాయిని చూపులతో కొలుస్తున్న జయ.
చూడచక్కని అమ్మాయే. కళ్ళు చిన్నవే గానీ సూటిగా ఎదుటివాళ్ళ మనసులోకి దుర్భిణీ వేసినట్లుగా చూస్తున్నాయి. ఆ అమ్మాయి నవ్వులో ఏదో ప్రత్యేకత ఉన్నట్లనిపించింది.
”హమ్మయ్య ముందు సీటు దొరికింది నయం. పోయిన సారి వెనక సీటు. పక్కన ఎవరో పెద్దాయన కదా అని ధైర్యంగా కూర్చున్నానా… వెధవ్వేషాలు… ఈడ్చి నాలుగు తన్నాలనిపించింది. అలా చేయాలంటే భయం. రాత్రంతా అతని చేష్టల్ని భరించగలనా. నాకు నేనే ధైర్యం చెప్పుకుని చివరికి పిన్నీసుతో గీరేసాను. నా నుండి అలాంటి చర్య ఊహించి ఉండడు. ముసలి నక్క. అబ్బా అని అరిచి వెంటనే సర్దుకుని కూర్చున్నాడు. అతని అరుపుకు కొందరు ఏమిటన్నట్లుగా చూడ్డంతో ఇబ్బందిగా కదిలాడు. ఇక నా జోలికి రాడని నిర్ధారించుకున్నాక హాయిగా నిద్రపోయా…” గలగలా నవ్వుతూ చెప్పేసింది ఆ అమ్మాయి… నాతో ఎప్పటినుండో పరిచయం ఉన్నట్లుగా.
పేరడిగితే ”మిత్ర… సుమిత్ర… హాహ్హా… అంతా మిత్ర అంటారు” నవ్వుతూ చెప్పింది.
మాట్లాడుతూనే ఉంది కానీ ఆమె చూపుల్లో ఏదో బెదురూ, భయం. కాల్స్ తీసుకోలేదు. మళ్ళీ మళ్ళీ మోగుతూనే ఉంది. విసుక్కుంటూ సిమ్ తీసి బ్యాగ్‌లో పడేసింది.
ఆమె ప్రవర్తన విచిత్రంగా తోచి ”అదేంటమ్మా కాల్ తీసుకోకుండా అలా చేశావ్” అన్నా పెద్దరికంగా.
”తప్పదండీ… నేను హాస్టల్‌కి చేరేవరకూ ఇలా మోగుతూనే ఉంటుంది. నాతోపాటు నా చుట్టూ ఉన్నవాళ్ళకీ నిద్ర
ఉండదనీ… ” కదిలే బస్సులోంచి కదిలిపోతున్న దృశ్యాల్ని చూస్తోంది.
‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ కోఆపరేషన్ అండ్ ఛైల్డ్ డెవలప్‌మెంట్’లో ఒక ట్రైనింగ్ ప్రోగ్రాంకి వెళ్తున్న జయకి ప్రారంభ కార్యక్రమం అయిన వెంటనే సెషన్ ఉంది. పడుకుంటే బాగుంటుంది కానీ నిద్ర రావడంలేదు. కళ్ళు తెరిచి ఉంటే ఈ పిల్ల నిద్రపోనిచ్చేట్లు లేదు. అందుకే కళ్ళు మూసుకుని కూర్చుంది.
బహుశా ఆ పిల్ల కూడా కళ్ళు మూసుకుందేమో… కదలికలు లేవు.
పైకి చలాకీగా కనిపిస్తున్న ఈ అమ్మాయి కళ్ళ వెనక గూడుకట్టుకున్నదేదో ఉందనిపిస్తోంది. నిద్రపోతోంది. నిద్రలో పక్క భుజంపైకి ఒరిగింది.
నా కూతురు స్వర్ణ కూడా ఇంతే… ఇలా బస్సు ఎక్కగానే అలా నిద్రలోకి జారిపోతుంది. కాకపోతే అది చిన్నపిల్ల అనుకుని
కళ్ళు మూసుకుంది. నిద్రపడుతూ ఉంది.
”అమ్మా… అమ్మా…” నిద్రలోనే ఏడుస్తూ మెడ చుట్టూ చేతులు చుట్టుకోవడంతో ఉలిక్కిపడ్డా.
ఆ వెంటనే అంత చదువు చదివి ఏం లాభం? నువ్వొట్టి పిచ్చి మాలోకానివి. అందర్నీ నమ్మేస్తావ్. దొర ఎవరో దొంగ ఎవరో తెలీదు, జాగ్రత్త అని చెప్పే అత్తగారి మాటలు గుర్తొచ్చాయి.
ఈ పిల్ల… సందేహం తలెత్తింది… మెడలో గొలుసు ఉందో లేదో చూసుకున్నాను. దాని స్థానంలో అది భద్రంగానే ఉంది.
ఛఛ… తప్పుగా ఆలోచిస్తున్నానా… ఎందుకైనా మంచిది అనుకుంటూ ఆమెను నెమ్మదిగా విడిపించుకుంటుంటే మిత్ర కళ్ళు తెరచి నాకేసి చూస్తూ ”సారీ ఆంటీ…” అంది కానీ ఆమెలో ఆ దుఃఖం గొంతులో…
కొన్ని క్షణాల ముందు చొచ్చుకొచ్చిన సందేహాల్ని తోలేసి ఏమైందమ్మా… నిద్రలో అమ్మని కలవరిస్తున్నావ్… అన్నా
అమ్మ గుర్తొచ్చిందనీ, ఫోన్‌కి అందనంత దూరంలో ఉందనీ, తనకూ అమ్మ దగ్గరకు పోవాలనుంది కానీ అంత ధైర్యం లేదనీ చెప్పింది.
అయోమయంగా చూస్తున్న నావైపు తిరిగి ”తన జీవితంలాగా నా జీవితం కావొద్దని అమ్మ తాపత్రయం. గద్దలు తన్నుకుపోకుండా కావలి కాసుకుంటానమ్మాయ్ అనేది. కట్టుకున్న మొగుడు, తోడబుట్టిన తమ్ముడు రాబందులై అమ్మను పీక్కు తినేశారు” అంటూ దీర్ఘమైన నిట్టూర్పు విడిచింది.
కొద్ది క్షణాల తర్వాత నా ఒళ్ళోంచి తలలేపి నా మొహంలోకి ఆ చీకట్లో చూడ యత్నిస్తూ ”వర్జినిటీ టెస్ట్ ఆడవాళ్ళకేనా… మగవాళ్ళకుండదా” అడిగింది. ఈ పిల్ల వయసెంత… పదిహేడు పద్దెనిమి దేళ్ళుండొచ్చు… మహా అయితే పందొమ్మిది అంతే… బెంగుళూరులో ఫార్మ.డి మొదటి సంవత్సరం చదువుతోంది.
వర్జినిటీ టెస్టా… అని ఆశ్చర్యపడుతుంటే ”అదేంటి… అలా అడుగుతున్నారు…మీకు తెలియదా… ఆడపిల్ల కన్యో కాదో తెలుసుకునేందుకు చేస్తారట కదా. అది చేయిస్తానని మా మామయ్య, అమ్మమ్మ ముహూర్తం నిర్ణయించారు. అది తప్పించుకోవడానికి పారిపోయి వచ్చేశా…”
నిర్ఘాంతపోయి ఆమెనే చూస్తుంటే ”మీకు తెలియదు. మా మామయ్య మూర్ఖుడు. పరమ మూర్ఖుడు. బుద్ధి జ్ఞానం లేని మూర్ఖుడు. తన పెళ్ళాం కన్యగా ఉండాలట. మరి తను మాత్రం అచ్చోసిన ఆంబోతులాగా ఊరుమీద పడి తిరిగొస్తాడు. నచ్చిన ఆడది పడకలోకి రావాలంటాడు. అప్పుడు ఆ ఆడవాళ్ళ కన్యత్వం పోదా… మా అమ్మమ్మ నాశనం చేసింది… వాడికేం మగాడు అంటూ…”
మా అమ్మ చాలా అందగత్తె. ఆ రోజుల్లోనే కొత్తగూడెం సింగరేణి కాలేజిలో డిగ్రీ చదివింది. అప్పుడు ఎవరినో ప్రేమించింది. కుల మతాల అడ్డుగోడలు ఉన్నాయిగా. చివరి పరీక్షలు రాయకుండానే మా అమ్మమ్మ తన తమ్ముడికిచ్చి పెళ్ళి చేసింది. మా నాన్నకి చేయడం మా తాతయ్యకి ఇష్టం లేదట కానీ అమ్మ ఎక్కడ తలవంపులు తెస్తుందోనని ఒప్పుకున్నాడట.
ఆస్తులు ఎక్కడికీ పోవు అని అమ్మమ్మ తలచింది. అమ్మ ప్రమేయం లేకుండానే అమ్మ పెళ్ళయిపోయింది.
చిన్నప్పటి నుండి హాస్టళ్ళలో ఉండి చదువుకున్న అమ్మ తర్వాత భద్రాచలం దగ్గర్లో గోదావరి ఒడ్డున ఉన్న కుగ్రామంలో బందీ అయిపోయింది. కనీస రవాణా సౌకర్యాలు లేని ఊళ్ళో లంకంత కొంపలో… నాన్నో, తాతయ్యో జీప్‌లో తీసుకుపోతే తప్ప మరో చోటుకు పోలేని స్థితి.
మా నాన్న నా పుట్టుకకు కారణమయ్యాడేమో కానీ అమ్మకెప్పుడూ భర్త కాలేదు. అంటే భర్తలా ప్రవర్తించలేదు. అమ్మ ప్రేమ కథ తెలుసుగా… కానీ నాన్న ప్రేమాయణాలు ఆనాటి నుండీ ఈనాటికీ వదల్లేదు. నా మీద ప్రేమ ఉందో లేదో తెలియదు. ఏనాడూ నన్ను దగ్గరకు తీసుకుని మురిసిపోయింది లేదు.
అమ్మే నన్ను పెంచింది. అమ్మమ్మ వద్దని ఎంత వారించినా అమ్మ పట్టుబట్టి నన్ను హాస్టల్‌కి పంపింది చదువు కోసం.
నాకు ఊహ తెలిసేసరికి మామయ్య కాలేజికి వచ్చాడు. ఎప్పుడూ నా మీద అజమాయిషీ, అధికారం చెలాయించేవాడు. నా ఇంట్లోంచి పో అని అరిచేసేదాన్ని. నీ ఇల్లా… ఇది నా ఇల్లు… మా నాన్న కట్టించిన ఇల్లు. మీ నాన్న, మీ అమ్మ, నువ్వు నా ఇంట్లో
ఉంటున్నారు అనేవాడు. అప్పుడు నాకు తెలిసేది కాదు కానీ తర్వాత అది నిజమేనని తెలిసింది.
ఆస్తి, అంతస్తు, కులం, అధికారం ఎన్నిటినుంచో వచ్చిన మదం ఎక్కి ఉన్న మామయ్యతో నా పెళ్ళట.
మోసేది ఏముంది. మాసిన బట్టలు ఇంటికి తెచ్చెయ్ అని చెప్పింది అమ్మమ్మ. నాకు పని తప్పుతుందని అట్లాగే తెచ్చేదాన్ని. ఆ దుస్తులపై మరకలు ఉన్నాయేమోనని పరీక్షించేది అమ్మమ్మ. ఒక్కోసారి చాకలి చిన్నమ్మ మరకలేవీ లేవమ్మా అని ఉతకడానికి పట్టుకుపోయేది.
ఓ రోజు అమ్మమ్మ చూడకుండా చాకలి చిన్నమ్మనడిగా… ఎవరివీ చూడకుండా నా బట్టలే ఎందుకు అట్లా చెక్ చేస్తావ్ అని.
ఆడమగా కలిస్తే అయ్యే మరకలు ఉన్నాయేమోనని నసిగిందామె. మొదట ఆమె మాటలు నాకు అర్థం కాలేదు. తర్వాత అర్థమయ్యాయి. నా మీద అంత నిఘా ఉందా… నా మీద నా వాళ్ళకి నమ్మకం లేదా… చిరాకేసింది. బాధ అనిపించింది.
”నిజంగానే అట్లా మరకలు అవుతాయా ఆంటీ… లోపల్నుంచి ఏమైనా కారుతుందా…” అమాయకపు ప్రశ్న నా మొహంలోకి గుచ్చి గుచ్చి చూస్తోంది ఆ పిల్ల మొహం.
చీకటిని చీల్చుకుంటూ చెట్టు చేమల్నీ వెనక్కి నెట్టేస్తూ వేగంగా దూసుకుపోతోంది బస్సు. నా మనసు ఆ వేగాన్ని అందుకోలేక వెనకబడిపోయింది.
అందుకేనేమో ఆమె చివరగా చెప్పిన మాటలు మొదట నాకు అర్థం కాలేదు. అర్థమయ్యాక షాక్. మనుషులు ఇలా కూడా
ఉంటారా… అని.
భారాన్ని దించుకోవాలనుకున్నదో ఏమో కానీ ఆమె చెప్పుకుపోతోంది ”అమ్మ ఎప్పుడు వచ్చి అక్కడ నుంచుందో తెలీదు కానీ మొహం తెల్లగా పాలిపోయి ఉంది.
అదేమీ పట్టించుకోకుండా ఎప్పుడూ నోరు తెరిచి గట్టిగా మాట్లాడని అమ్మ అమ్మమ్మ మీద యుద్ధం ప్రకటించింది, అభం శుభం ఎరగని పసిదానిపై ఈ గూఢచర్యం ఏమిటని.
అమ్మమ్మ ఊరుకుందా… లేదు. అమ్మనే తప్పు పట్టి నానా మాటలు అనడం విని నేను అమ్మకు సపోర్టుగా మాట్లాడాను.
అసలు నువ్వే మా అమ్మ జీవితం నాశనం చేశావ్ అనేసరికి ఆవేశం పట్టలేని అమ్మమ్మ నోర్ముయ్ అంటూ నా చెంప ఛెళ్ళుమనిపించి అమ్మను అనరాని మాటలు అన్నది. నాన్న తప్పేమీ లేదట అమ్మవల్లే, మొగుడ్ని కొంగున కట్టుకోకపోవడం వల్లే ఆయనట్లా తయారయ్యాడట.
అయినా తిరిగితే తప్పేంటి, వాడు మగవాడు, ఎంతమందితోనయినా తిరుగుతాడని సమర్థించింది. పెళ్ళికి ముందు కులం కానివాడిని, మతం కానివాడిని, తమతో తూగలేని వాడిని ప్రేమించి అమ్మ తప్పు చేసిందని అమ్మనే దూషించింది అమ్మమ్మ.
ఏడుస్తూ గదిలోకెళ్ళిన అమ్మ ఆ తలుపు తీయలేదు. తలుపు తీయమని అమ్మ వెనకే వెళ్ళిన నేనెంత మొత్తుకున్నా అమ్మనుండి సమాధానం లేదు. కాసేపటి తర్వాత వెనకవైపు కిటికీలోంచి చూస్తే అమ్మ ఫ్యాన్‌కి వేలాడుతూ ఉరేసుకుని. అమ్మ నాకు రాసిన ఉత్తరం కూడా నాకు అందనివ్వకుండా మాయం చేసేశారు అమ్మమ్మ, నాన్న. డబ్బులతో కేసు కాకుండా చూశారు.
బహుశా అమ్మ మామయ్యని చేసుకోవద్దనే నాకు చెప్పాలని అనుకుని ఉంటుంది.
అమ్మ వెళ్ళిపోయి పదిహేను రోజులన్నా కాలేదు. అప్పుడే మామయ్యతో నా పెళ్ళి ఆలోచనలు చేస్తున్నది అమ్మమ్మ. వర్జిన్ టెస్ట్ చేయించమని మామయ్య అమ్మమ్మతో చెప్పడం విన్న నా కజిన్ విషయం నా చెవిన వేసింది.
అమ్మలేని ఆ ఇంటికి పోవాలనే లేదు. ఆ నరకంలోకి వెళ్ళననీ నా మనసులో గట్టిగా చెప్పుకున్నాకే ఇట్లా వచ్చేశా… నన్ను వెంటాడుతూ వస్తారేమోననే భయమూ వెంటాడుతూనే ఉంది. అందుకే హాస్టల్‌కి ఇప్పుడే వెళ్ళను. మా వాళ్ళు నన్ను వెతుక్కుంటూ ఖచ్చితంగా హాస్టల్‌కి వెళ్తారు. అందుకే జయానగర్‌లో ఉన్న ఫ్రెండ్ ఇంటికి వెళ్తా. వాళ్ళ నాన్న పోలీస్ ఇన్‌స్పెక్టర్. కొంత రక్షణ
ఉంటుందని అనుకుంటున్నా అంది.
ఇంకా చీకటి తెరలు వీడలేదు. అప్పటివరకు రయ్‌న ఉరికిన బస్సు స్లో అయింది. యలహంక అని అరుస్తున్నాడు బస్సు డ్రైవర్. మా మాటల్లోనే యలహంక వచ్చేసింది. నేను దిగిపోయాను.
… … …
మిత్ర ఎట్లా ఉందో… ఏమై ఉంటుందో ఆమె జీవితం. ఊహించడం కష్టంగా ఉంది జయకు.
మిత్ర అయినా… రచన అయినా… ఇద్దరూ నేటి తరం ఆడపిల్లలకు ప్రతినిధులే.
గుడ్డిగా అల్లిన నైలాన్ వలలో జీవితాన్ని బందీగా మార్చుకోలేరు. మగవాడి ద్వంద్వనీతిని అంగీకరించలేరు.
పెళ్ళికి ముందు వర్జిన్‌గా ఉండాల్సింది ఆడవాళ్ళేనా… మగవాళ్ళు కాదా…?
వర్జిన్ టెస్ట్ ఆడవాళ్ళకేనా…మగవాళ్ళకి ఉండదా…?
అరిగిపోయిన మాటలే కానీ కొత్తవాళ్ళతో మళ్ళీ మళ్ళీ వినిపిస్తూనే ఉంటాయా?!
రేపు నా కూతురు స్వర్ణ కూడా ఇదే ప్రశ్న వేస్తుందేమో… ఆలోచనలు తీగలు తీగలుగా… గజిబిజిగా అల్లుకుపోయి మంచు ముసురై వణికిస్తుండగా… మార్పు కోసం ఏం చేయాలి అని తనని తానే ప్రశ్నించుకుంటూ… పరిష్కారం ఆలోచిస్తూ… జయ.