చదువుల తల్లి పుల్లగూర దీనమ్మ – డా|| చల్లపల్లి స్వరూపరాణి

జ్యోతీరావు ఫూలే, సావిత్రీబాయి ఫూలేల కాలం అంటే 19వ శతాబ్దం నాటి ఆంధ్ర దేశంలో సామాజిక పరిస్థితులు, అణగారిన వర్గాల స్థితిగతులు, వాటిపై సంస్కరణ దిశగా సాగిన ప్రయత్నాల మీద అటు అకడమిక్‌ రంగంలో కానీ, బయట గానీ అసలు పరిశోధన జరగలేదనే చెప్పాలి. ఆ రోజుల్లో అత్యంత దయనీయమైన పేదరికం, అంటరానితనం, ఊరెలపటితనం వంటి దుర్భర పరిస్థితుల్లో బతుకులు వెళ్ళదీస్తున్న దళితులకు క్రైస్తవం ఒక వెలుతురు పంచే ఆశాకిరణంలా కనిపించింది. గుంటూరు జిల్లాలో ఫాదర్‌ హయ్యర్‌ ఆధ్వర్యంలో లూధరన్‌ మిషన్‌ తన కార్యక్రమాలను విస్తరిస్తూ అణగారిన కులాలకు చేరువైంది. అటువంటి చీకటి దినాల్లో గుంటూరు జిల్లా వేలూరు గ్రామంలో పుట్టిన గడ్డం దీనమ్మ అసమ సమాజం తన చుట్టూ నింపిన అంధకారాన్ని చీల్చుకుంటూ జ్ఞాన జ్యోతిలా ప్రకాశించింది.

అసలు దీనమ్మ ఎవరు? ఆమె ధనవంతుల బిడ్డా? తన సౌందర్యంతో ఇతరులను ఆకర్షించగలిగిన స్త్రీనా? అంటే ఇవేమీ కావనే సమాధానం. కానీ ఆమె అత్యంత

ఉన్నతురాలిగా, చరిత్రలో నిలిచిపోయే విధంగా తన జీవితాన్ని మలుచుకున్న తీరు మనకు సంభ్రమాశ్చర్యాలను కలిగిస్తుంది. దీనమ్మ గుంటూరు జిల్లా కేంద్రానికి 48 కిలోమీటర్ల దూరంలో, చిలకలూరిపేట పట్టణానికి దగ్గర వేలూరు గ్రామంలో గడ్డం రాహేలు, యాకోబు దంపతులకు 17.02.1881 న జన్మించింది. ఆమెది గుంటూరు జిల్లాలో క్రైస్తవులుగా మారిన మొదటి దళిత కుటుంబం. మతం పుచ్చుకోక ముందు దీనమ్మ తల్లిదండ్రుల పేర్లు చెంచమ్మ, రమణయ్య. అప్పట్లో కొత్తగా క్రైస్తవంలోకి మారిన వారికి తప్పనిసరిగా పాత పేరు మార్చి క్రైస్తవ మతపరమైన పేరు పెట్టేవారు. ఆ విధంగా వారికి రెండు పేర్లు ఉండేవి.

దీనమ్మ శారీరకంగా పూర్తిస్థాయి అవిటి తనంతో కుడి చెయ్యి సగం వరకు ఉండి, ఎడం చెయ్యి అసలు లేకుండానూ, ఒక కాలుకి పాదం లేకుండానూ పుట్టింది. ఆమె పుట్టినప్పుడు మంత్రసాని ‘ఈ దెయ్యం పిల్లకు నోట్లో వడ్లగింజేసి వదిలించుకో! లేకపోతే నీ బతుకు నరకం అవుద్ది’ అని దీనమ్మ తల్లికి సలహా ఇచ్చింది. ఆ సమయంలో తన భర్త ఇంట్లో లేకపోవడంతో ఆయనొచ్చాక నిర్ణయం తీసుకుంటామని చెప్పింది. దీనమ్మ తండ్రి వచ్చాక కాళ్ళూ, చేతులూ లేని పసికందుని చూసి బాధపడినప్పటికీ ఆయనకి ఆ పసిపాప ముఖంలో ఏదో తెలియని కాంతి కనిపించి ఆమెను ఎలాగైనా కష్టపడి వృద్ధిలోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నాడు.

దీనమ్మ తండ్రి యాకోబు ఆమెను ఎలాగైనా చదివించాలనే పట్టుదలతో ఆమె కోసం అహర్నిశలూ శ్రమించాడు. అందుకు ఆయన ఎక్కని గడప లేదు. ఆ రోజుల్లో అరకొరగా

ఉండే ప్రయాణ సాధనాలైన గుర్రపు బండ్లలో మాల, మాదిగలను ఎక్కనిచ్చేవారు కాదు. ఆ పరిస్థితిలో దీనమ్మని ఆమె తండ్రి యాకోబు తన భుజాలమీద కూర్చోబెట్టుకుని తిప్పేవాడు. బాగా వాకబు చేస్తే ఆయనకి లూధరన్‌ క్రిస్టియన్‌ మిషన్‌ నుండి ఫాదర్‌ హయ్యర్‌ గుంటూరులో ఆడపిల్లల కోసం ఒక పాఠశాలను స్థాపించాడని తెలిసి ఆమెను ఆ స్కూల్లో చేర్పించాడు.

దీనమ్మ కురచగా ఉండే తన చేతితో అక్షరాలు నేర్చుకుంది. ఆమె చేతిరాత ముత్యాల్లా ఉండేది. పట్టుదలతో చదివి తనకు కుల సమాజం నిరాకరించిన చదువుని సొంతం చేసుకోవడంతో పాటు ప్రకృతి ఇచ్చిన శారీరక అవరోధాన్ని కూడా అధిగమించింది. ఆమె గుంటూరు జిల్లాలోనే చదువుకున్న మొట్టమొదటి దళిత స్త్రీ. ఐదవ తరగతి పూర్తయ్యేసరికి దీనమ్మకి యుక్తవయసొచ్చింది. ఆమెను పొరుగు గ్రామమైన జాలాదికి చెందిన వడ్రంగం పనిచేసే పుల్లగూర జకరయ్య ఇష్టపడి వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు మగపిల్లలు.

ఆ రోజుల్లో చిలకలూరిపేట చుట్టుపక్క గ్రామాలు కమ్యూనిస్ట్‌ పార్టీకి పెట్టని కోటల్లా ఉండేవి. దీనమ్మ గ్రామం కూడా కమ్యూనిస్టు నాయకులకు కేంద్రంగా ఉండేది. ‘గడ్డం మోషే’ అనే జిల్లా స్థాయిలో పేరు ప్రఖ్యాతలున్న నాయకుడు దీనమ్మ తల్లిదండ్రుల వైపు నుంచి దగ్గరి బంధువు కావడం వలన దీనమ్మకు కుటుంబం నుంచి ఆదర్శ భావాలు అబ్బాయని అనవచ్చు.

తనని ఉద్యోగం చేయమంటే ‘నాకు

ఉద్యోగమొస్తే నేను, నా కుటుంబమే బాగుపడతాము, సమాజానికి పెద్దగా ప్రయోజనం ఉండదు’ అనుకుని ఎంతో అజ్ఞానం, వెనుకబాటుతనంతో ఉన్న సమాజం మొత్తానికి తన పని ద్వారా మేలు జరగాలంటే ఏదో ఒక గట్టి పని చేయాలని దీనమ్మ భావించింది. ఆమె తాను ఉద్యోగం సంపాదించుకోకుండా తన అత్తగారి ఊరైన జాలాది గ్రామంలో ఒక ఎలిమెంటరీ స్కూల్‌ని తమ సొంత స్థలంలో పూరి పాకలో ప్రారంభించింది. దాని పేరు ‘లూధరన్‌ ఎలిమెంటరీ స్కూల్‌’.

ఆమెకు అంగవైకల్యం ఉన్నప్పటికీ అన్ని పనులూ ముగించుకుని పాఠశాలకు ముందుగానే రావడం దగ్గర నుంచి స్కూలు రికార్డులను సక్రమంగా నిర్వహించడం వరకు అన్నీ ఎంతో చాకచక్యంతో, ప్రావీణ్యంతో చేసేదని తెలుస్తోంది. ప్రారంభంలో ఆమె ఒక్కతే ఏకోపాధ్యాయ పాఠశాలగా నడిపే రోజుల్లో పాఠశాల పనితీరును పరిశీలించడానికి ప్రభుత్వం నుంచి అగ్ర కులానికి చెందిన ఒక ఇన్‌స్పెక్టర్‌ స్కూలుకొచ్చాడు. ఆయన పిల్లలకు వ్యాయామ తరగతులు నిర్వహిస్తున్నారా, లేదా? అని అడిగినప్పుడు దీనమ్మ తన బలహీనతకు నొచ్చుకుంటూ ‘అవిటిదాన్నయిన నాకు కుదరడం లేదు’ అని ఎంతో న్యూనతా భావంతో బదులిచ్చింది. దానికాయన ‘మీ కులపోళ్ళకి ఏమొచ్చు? అంతా అవిటితనమేనా?’ అని ఛీత్కారంతో విదిలించి వెళ్ళాడు. స్కూల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఛీత్కారంతో చిన్నబుచ్చుకున్న దీనమ్మ తన పాఠశాలలో ఎలాగైనా వ్యాయామ విద్యను అభివృద్ధి చేయాలని భావించింది. బాగా ఆలోచించి ఆమె ఒక విజిల్‌ కొనుక్కుని, ఆమె కూర్చుని దాని సహాయంతో విద్యార్థులకు తర్ఫీదునిచ్చింది. క్రమంగా పిల్లలు డ్రిల్లు చేయడం నేర్చుకున్నారు. కొన్నాళ్ళకు మళ్ళీ ఆ పాఠశాలకు అదే ఇన్‌స్పెక్టర్‌ వచ్చాడు. పిల్లలు ఆయనకు గౌరవ వందనం చేయడం, డ్రిల్లు చేయడం చూసిన ఆ బ్రాహ్మణ ఇన్‌స్పెక్టర్‌ ఆశ్చర్యబోయి దీనమ్మ పట్టుదలను ఎంతో అభినందించాడు. ఆయన రెండవసారి ఇన్‌స్పెక్షన్‌కి వచ్చేటప్పుడు తన భుజం కనిపించకుండా కండువా కప్పుకుని వచ్చి, వెళ్ళేటప్పుడు కండువాని తొలగించి ప్రమాదంలో తాను పోగొట్టుకున్న చేతిని చూపించాడు. దీనమ్మ అవిటితనాన్ని అవమానించినందుకు దేవుడు తనకీ శిక్ష వేశాడని, దీనమ్మ మాత్రం తన కార్యరంగంలో ఎంతో నిబద్ధత, పట్టుదలతో రోజు రోజుకూ శక్తివంతురాలవుతోందని కితాబిచ్చి వెళ్ళాడు ఆ ఇన్‌స్పెక్టర్‌.

దీనమ్మ ప్రారంభించిన లూధరన్‌ ఎలిమెంటరీ పాఠశాల వందలాది మంది దళిత విద్యార్థులకు విద్యనందించడమే కాక అనేకమంది దళితులకు ఉద్యోగం, ఉపాధిని కలిగించిందనవచ్చు. పుల్లగూర దీనమ్మ రెండవ కొడుకు విశ్వనాధం కుమారుడు పుల్లగూర రంజన్‌ బాబు ఈ రోజు విద్య, సామాజిక రంగాలలో గుంటూరు జిల్లాలో చెప్పుకోదగిన గుర్తింపు పొందడం వెనుక తన నాయనమ్మ దీనమ్మ ఇచ్చిన స్ఫూర్తి ఎంతో ఉంది.

19వ శతాబ్దపు చివరి రోజుల్లో జన్మించి అటు సమాజం నుంచి కులపరమైన అసమానతల్ని, పుట్టుకతో ప్రకృతి నుంచి ప్రాప్తించిన శారీరక అవిటితనాన్ని తన ఆత్మస్థైర్యంతో ఒక్క తన్నుతన్ని పుల్లగూర దీనమ్మ ఈ అసమ సమాజానికి పెద్ద సవాలు విసిరింది. పుల్లగూర దీనమ్మ ఆంధ్రప్రదేశ్‌లో దళిత కులాల్లో మొదటి విద్యావంతురాలు మాత్రమే కాదు, మొదటి టీచర్‌, మొదటి పాఠశాల వ్యవస్థాపకు రాలిగా గుర్తింపునూ, అరుదైన గౌరవాన్నీ పొందిన వ్యక్తి. ఆమె 20 ఏళ్ళకే సొంతగా పాఠశాల స్థాపించడమే కాక దాన్ని ఎంతో పట్టుదలతో అభివృద్ధి చేయడంలో ఎన్నో ఆటుపోట్లను, అటు కుల సమాజం నుంచి ఇటు కుటుంబం నుంచీ ఎదుర్కొని నిలబడడం అనేది అసాధారణం, అనితర సాధ్యం.

Share
This entry was posted in మిణుగురులు . Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.