మిత్రులారా…
మా కంటి పాపలారా…
మమ్మల్నిలా
చూస్తుంటే
ఆశ్చర్యంగా ఉంది కదూ
అద్భుతంగా ఉంది కదూ
ఆనందంగా ఉంది కదూ…
భుజంపై జండాతో
బిగిసిన పిడికిలితో
గొంతెత్తిన నినాదంతో
సమిష్టి సంఘర్షణతో
ఇన్నేళ్ళు
మేమెలా కనిపించాం…
ఎండిన పొలాల మీదా
ముళ్ళ డొంకల వెంటా
నీరసంగా కదులుతూ
నిట్టూర్పులు విడుస్తూ
ఆకలితో అప్పులతో
దీనంగా భారంగా
పెరిగిన గడ్డంతో
చిరిగిన చొక్కాతో
చేతులెత్తి ప్రార్ధిస్తూ
సాష్టాంగపడి మొక్కుతూ
చీత్కరిస్తే సిగ్గుపడుతూ
కసురుకుంటే బాధపడుతూ
అవమాన పడుతూ
దుఃఖపడుతూ
ఉరి కొయ్యకు వేలాడుతూ
బలవన్మరణం పాలవుతూ
ఇదేమీ మాకు కొత్త కాదు
ఇదేమీ మొదలూ కాదు
వెలుగు నీడలే
మా అడుగు జాడలు
పోరాటంతోనే ముందడుగులు…
పంజాబ్ బెంగాల్ కేరళ
తెలంగాణ మహారాష్ట్ర
దండకారణ్యం కాశ్మీర్
ఒడిషా బీహార్
రాష్ట్రమేదైనా
ప్రాంతమేదైనా
ఊరయినా అడవయినా
సముద్ర తీర ప్రాంతమైనా
అణచివేతను సహించని
చరిత్ర మాది
తిరుగుబాటు చేసిన
తరం మాది
సహనం మా బలం
పోరాటం మా ఊపిరి
ధైర్యం మా ఉనికి
గెలుపు మా భవిత
ఓ పాలకులారా…
ప్రభుత్వ పెద్దలారా…
అబద్ధాల బతుకు మీది
అరాచకాల పాలన మీది
మోసపు మాటలు మీవి
చెల్లని వాగ్దానాలు మీవి
నెరవేరని హామీలు మీవి
మేమిప్పుడు కదిలొచ్చాం…
చిట్ట చివరి యుద్ధానికి
మొట్టమొదటి అడుగేశాం…
మగవాళ్ళం ఆడవాళ్ళం
పిల్లలం ముసలాళ్ళం
యువతీ యువకులం
రైతులం కూలీలం
దళితులు ఆదివాసీలు
అన్ని మతాల మనుషులం
మా మాటలు స్పష్టం
మా అడుగులు స్పష్టం
భయం లేని నడక మాది
సాహసమే మా సోపతి
నిజం మా వెంట ఉంది
లోకం మా తోడు ఉంది
గెలుపు మా ముంగిట ఉంది
ఓటమి మీ నుదుటన ఉంది
రండి…చర్చిద్దాం
కలిసి కూర్చుందాం
కాదంటే కలహమే
సవాలంటు సమరమే…