అక్టోబరు నెలలో ఇంతకు ముందెన్నడూ కనీవినీ ఎరగని రీతిలో హైదరాబాదులోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసి, లోతట్టు ప్రాంతాలు వరద ముంపునకు గురయ్యాయి. నగరం చుట్టూ ఉన్న చెరువులకు గండ్లు పడడం, బస్తీల మధ్య నుంచి ప్రవహించే నాలాలు పొంగిపొర్లడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చాలా రోజులు పాటు మునిగిపోయిన ప్రాంతాలు నీళ్ళల్లోనే ఉండిపోవడంతో వందలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.
హైదరాబాదులో భూమిక పదిబస్తీలలో పనిచేస్తున్నది. ఆ పదింటిలోను నాలాకి అతి సమీపంగా ఉన్న నాగమయ్యకుంట బస్తీలోకి నీళ్ళ రావడంతో వస్తువులు తడిసిపోవడం, పిల్లల పుస్తకాలు తడిసి పాడైపోవడం జరిగింది. ఈ పరిస్థితిని వివరిస్తూ ఏజెడబ్ల్యూఎస్ అనే సంస్థను సపోర్ట్ కోసం కోరినప్పుడు ఆ సంస్థ వెంటనే అంగీకరించి ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు వచ్చింది. చాలా వేగంగా స్పందించి ఫండ్స్ రిలీజ్ చేసారు. నాగమయ్యకుంటలో నష్టపోయిన వారిని గుర్తించి ముఖ్యంగా ఒంటరి స్త్రీలు, వృద్థులు, ట్రాన్స్‌జెండర్ మహిళలు, శారీరక వైకల్యం ఉన్న వారికి డ్రైరేషన్ పంచడంతో పాటు బస్తీలో ఉన్న పిల్లలందరికీ ఐదేసి నోట్ బుక్కులు, పెన్నులు పంచాం.
అలాగే పాతబస్తీలోని నిరుపేద ముస్లిమ్‌లను, పేదలను గుర్తించి ”సఫా బెతుల్‌మాల్” అనే సంస్థ ద్వారా ఒక కొత్త పద్ధతిలో వారికి అవసరమైన వస్తువులను అందించగలిగాం. ఒక పెద్ద ఫంక్షన్ హాలులో సమస్తమైన నిత్యావసర వస్తువులని ఉంచి, బాధితులకు టోకన్లు పంచడం ద్వారా వారికి కావలసిన వస్తువులను సగౌరవంగా తీసుకునేలా ఏర్పాట్లు చేసారు. ఈ పద్ధతిలో భూమిక 300 మంది ముంపు బాధితులకు సహాయం చేసింది.
నాగమయ్యకుంటలోను, పాత నగరవాసులకు అందించిన ఈ సహాయానికి ఆర్థిక సహకారమందించిన AJWS సంస్థకు భూమిక ధన్యవాదాలు తెలుపుకుంటోంది.