పిల్లలపై లైంగిక హింస – కమలాభాసిన్‌

ముందుమాట

‘హింసలేని సమాజం మహిళల, బాలికల హక్కు’ అనే నినాదంతో 1993 నుండి భూమిక ఉమెన్స్‌ కలక్టివ్‌ నిరంతరాయంగా పనిచేస్తుంది. ఇంటా, బయట స్త్రీలు, పిల్లలు ఎదుర్కొనే హింసకు సంబంధించి వివిధ పద్ధతుల ద్వారా భూమిక పనిచేస్తున్నది. అందులో ముఖ్యమైనది ఇరవై నాలుగు గంటలూ పనిచేసే హెల్ప్‌లైన్‌ను బాధితులకు అందుబాటులో ఉంచడం. పోలీస్‌ స్టేషన్‌లలో స్పెషల్స్‌ పేరుతో స్త్రీల కోసం సపోర్ట్‌ సెంటర్లు నడపడం భూమిక కార్యక్రమాల్లో ముఖ్యమైనవి. అలాగే నగర బస్తీలలోను, నారాయణ్‌పేట లాంటి గ్రామీణ ప్రాంతాల్లోను హింసకు, బాల్యవివాహలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నది భూమిక.

ప్రముఖ సామాజిక కార్యకర్త కమలా బాసిన్‌ రాసిన ఈ పుస్తకం బాల బాలికలు ఎదుర్కొనే లైంగిక వేధింపుల గురించి చాలా లోతుగా చర్చిస్తుంది. కుటుంబ సభ్యుల నుండి, బయట వ్యక్తుల నుండి పిల్లలు ఎదుర్కొనే లైంగిక వేధింపులను ఎలా అర్థం చేసుకోవాలి. పెద్దలు పిల్లలకు ఎలా సహకరించాలి. మంచి స్పర్శ, చెడు స్పర్శలను ఎలా గుర్తుపట్టాలి లాంటి అంశాలను చాలా చక్కగా, పిల్లలకి అర్థం అయ్యేలా రాసిన ఈ పుస్తకాన్ని గ్రామ్య రిపోర్ట్‌ సెంటర్‌ అన్ని అనుమతులూ పొంది తెలుగులో ప్రచురించారు. వారి నుండి భూమిక అనుమతి తీసుకున్నది. వారికి ధన్యవాదాలు, పిల్లలకు, పెద్దలకు కరదీపికలా ఈ చిన్న పుస్తకం

ఉపయోగపడాలని ఆశిస్తున్నాం.

కొండవీటి సత్యవతి, భూమిక ఉమన్స్‌ కలక్టివ్‌.

మహిళలు, బాలికలపై హింసను ఆరికట్టడానికి గ్రామ్య, మహిళల వనరుల కేంద్రం గత ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తోంది. ఈ క్రమంలో పల్లెల్లో ఎంతో మంది ఆడపిల్లలు కుటుంబంలోని మగవాళ్ళు, చుట్టుపక్కల ఉండేవాళ్ళ ద్వారా లైంగిక హింసకు గురైన ఎన్నో సందర్భాలను చూశాం. ఇలా దాడులకు పాల్పడేవాళ్ళు ఆ బాలికలకు పరిచితులే. సిగ్గు, అవమానంతో ఈ విషయాన్ని బడిలో, లేదా ఇంటిలోని పెద్దవాళ్ళకు చెప్పరన్న ధీమాతో వాళ్ళ ఇటువంటి దుశ్చర్యలు కొనసాగిస్తుంటారు. బాలికలపై జరుగుతున్న అత్యాచారాల గురించి దినపత్రికలలో రోజూ వస్తున్న వార్తలు పెరుగుతున్న ఈ సమస్యకు రుజువుగా నిలుస్తున్నాయి. మహిళా హక్కులపై దేశంలో ప్రముఖ కార్యకర్త అయిన కమలా భాసిన్‌ రాసిన ఈ పుస్తకాన్ని జాగోరి ప్రచురించింది. దీన్ని గ్రామ్య తెలుగులోకి అనువదించి, ప్రచురిస్తోంది. పిల్లలు, టీచర్లూ, మహిళా సంఘాలు, కుటుంబ సభ్యులు ఈ పుస్తకాన్ని విస్తృతంగా చదివి, చర్చించటం ద్వారా బాలికలపై పెరుగుతున్న లైంగిక వేధింపుల అవగాహన పెరిగి, దాని చుట్టూ ఉన్న నిశ్శబ్దాన్ని ఛేదిస్తారని ఆశిస్తున్నాం.

”మౌనాన్ని ఎవరైనా ఛేదించి ఉంటే” అన్న ఈ పుస్తకాన్ని తెలుగులోకి అనువదించి, ప్రచురించటానికి అనుమతి ఇచ్చిన జాగోరి, కమలా భాసిన్‌లకు ధన్యవాదాలు. సమస్యలు ఎదురైనప్పడు పిల్లలు వాటి గురించి మాట్లాడేలా చెయ్యటానికి పెద్దలకుఈ పుస్తకం దోహదపడుతుందని ఆశిస్తున్నాం.

చాలామంది పిల్లల్లాగే మీకు కూడా మీ తల్లిదండ్రులు, తాతయ్యలు, బామ్మలు కాకుండా చాలామంది పెద్దవాళ్ళు తెలిసే ఉంటారు. ఇందులో మామయ్యలు, అత్తలు, మీ తల్లిదండ్రుల స్నేహితులు, మీ అన్నయ్య, అక్కయ్యల స్నేహితులు, ఉపాధ్యాయులు, చుట్టుపక్కల వాళ్ళు

ఉండి ఉంటారు.

నిజాయితీగా చెప్పండి, వారందరంటే మీకు ఇష్టమేనా? ఆ అందరితో ఉండటం, వాళ్ళని కలవటం మీకు ఇష్టంగా, సంతోషంగా ఉంటుందా?

దేని గురించి మీరు ఆలోచిస్తూ ఉంటే ఇంకా నా బాల్యంలో పెద్దవాళ్ళతో అనుభవాలను, వాళ్ళ పట్ల నా భావనలను మీతో పంచుకోవాలని ఉంది?

మీకు నిజం చెప్పాలంటే, నేను చిన్నగా ఉన్నప్పుడు నా చుట్టుపక్కల ఉన్న పెద్దవాళ్ళందరిపట్లా ఇష్టం ఉండేది కాదు. నేను ఇష్టపడినవాళ్ళు కొందరే ఉన్నారు. నన్ను గౌరవంతో చూసిన పెద్దవాళ్ళంటేనే నాకు ఇష్టంగా ఉండేది. గౌరవించడం అంటే నా ఉద్దేశ్యం పిల్లలను మూర్ఖులుగా చూడకపోవటం, నేను మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు శ్రద్ధగా వినేవారు. నేను తెలివైనదానినని, నా దగ్గర కూడా చెప్పటానికి విషయాలున్నాయని అనిపించేలా చేసేవారు. నేను చిన్నదానినని వాళ్ళు నన్ను చిన్నచూపు చూసేవారు కాదు, తక్కువ చేసి మాట్లాడేవారు కాదు.

వాళ్ళు నన్ను మృదువుగా, గౌరవంతో తాకేవారు. వాళ్ళు నా బుగ్గలు పిండేవారు కాదు. ఊపిరాడకుండా గట్టిగా హత్తుకునేవారు కాదు. వాళ్ళు నన్ను తాకినప్పుడు ఇచ్చిపుచ్చుకున్నట్లు ఉండేది. వాళ్ళ స్పర్శ నాకు బాగుండేది. వాళ్ళతో ఉంటే నాకు హాయిగా ఉండేది, భద్రతగా ఉండేది. వాళ్ళకంటే నేను చాలా చిన్నదానినైనప్పటికీ, నేను కూడా ఒక వ్యక్తినేననిపించేలా చేసేవారు. వాళ్ళ గురించి ఇప్పటికీ నేను ప్రేమ, అభిమానాలతో తలుచుకుంటాను.

కానీ, నేను ఏ మాత్రం ఇష్టపడని కొందరు పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళ ప్రవర్తన నాకు అర్థమయ్యేది కాదు, నచ్చేది కాదు.

ఉదాహరణకు వాళ్ళు నా బుగ్గలను గట్టిగా పిండి వాళ్ళ ప్రేమను ప్రదర్శించేవాళ్ళు. నా బుగ్గలు ఎర్రబడి బాగా నొప్పిపెట్టేవి. కొంతమంది తమ ప్రేమని చూపడానికి నా జుట్టు లాగేవాళ్ళు, నన్ను తమపైకి లాక్కొనేవాళ్ళు. ఈ రకం ప్రేమ అన్నా, ప్రేమను ఇలా చూపించేవాళ్ళన్నా నాకు ఇష్టంగా ఉండేది కాదు. ఈ పెద్దవాళ్ళకి ఇంత చిన్న విషయం కూడా అర్థం కాదేమిటని ఆశ్చర్యపోయేదాన్ని. వాళ్ళు ప్రేమను వ్యక్తపరిచే తీరు బాధాకరంగాను, ఇబ్బందికరంగాను ఉండేది.

నిజం చెప్పొద్దూ, మా బుగ్గలను పిండినప్పుడు ఎలా ఉంటుందో తెలియచెయ్యడానికి వాళ్ళతో వాళ్ళ బుగ్గలను పిండాలని ఆప్పుడప్పుడు నాకనిపిస్తుంది.

ఇటువంటి పెద్దవాళ్ళు పిల్లలంటే ఏమీ తెలియని మూర్ఖులన్నట్లు నాతో మాట్లాడేవారు. వాళ్ళు నన్నొక పసిపిల్ల మాదిరి చూడటం నాకు ఇష్టంగా ఉండేది కాదు. ఇటువంటి వాళ్ళవల్లనే నేను పెద్దయిన తర్వాత ఎలా ఉండకూడదో చాలా చిన్నప్పుడే నిర్ణయించుకున్నాను.

పెద్దవాళ్ళలో కొందరు మగవాళ్ళంటే ముందు నాకు ఇష్టంగా ఉండేది. కానీ, ఆ తరువాత వాళ్ళ ప్రవర్తన వల్ల వాళ్ళంటే చాలా భయం వేసేది.

ముందు పరిచయమైనప్పుడు ఈ మగవాళ్ళు చాలా మంచిగా అనిపించేవారు. పిల్లలతో స్నేహం ఎలా చెయ్యాలో వీళ్ళకి తెలుసు. నాతో వీళ్ళు చక్కగా మాట్లాడేవారు. నా ఇష్టాలు, అయిష్టాల పట్ల ఆసక్తి చూపేవారు. నా నమ్మకాన్ని చూరగొని నాకు చేరువయ్యేవారు. కానీ, ఆ తరువాత వాళ్ళు నన్ను తాకే తీరు, ముద్దు పెట్టుకునే తీరు నన్ను ఇబ్బంది పెట్టేది. అది నాకు మంచిగా అనిపించేది కాదు. ఒక్కొక్కసారి నేను గందరగోళానికి గురయ్యేదాన్ని. వాళ్ళని కానీ, వాళ్ళ చర్యలను కానీ ఎలా అర్థం చేసుకోవాలో నాకు తెలిసేది కాదు. ఎందుకు అన్నా, ఎలా అన్నా చెప్పలేను కానీ, వాళ్ళు నన్ను తాకే విధానం చెడ్డదని, తప్పని నాకు తెలిసేది. వాళ్ళు చేస్తున్నది తప్పని వాళ్ళకీ తెలుసనిపిస్తుంది. ఎందుకంటే ఇతరులు ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడూ నన్ను అలా తాకేవారు కాదు. ఎవరూ లేకుండా ఒంటరిగా

ఉన్నప్పుడు నన్ను పట్టుకోవడానికి ప్రయత్నించేవారు.

ఈ మగవాళ్ళందరూ నాకంటే పెద్దవాళ్ళు. కొందరికి 50, 60 ఇంకా ఎక్కువ సంవత్సరాలు కూడా ఉండేవి.

వాళ్ళు మా బంధువులు లేదా కుటుంబ స్నేహితులు లేదా ఉపాధ్యాయులు లేదా నా స్నేహితుల అన్నలూ, తండ్రులూను. అంటే, వీళ్ళందరూ నాకూ, మా కుటుంబానికీ చాలా ”దగ్గర” వాళ్ళు. మా కుటుంబం వాళ్ళని గౌరవించేది, వాళ్ళపై నమ్మకం ఉండేది. అందుకనే వాళ్ళపై నమ్మకం లేకపోవడానికి నాకు ఏ కారణమూ లేదు. నేను అందరితో బాగా కలివిడిగా ఉంటూ, తేలికగా స్నేహం చేసుకునేదాన్ని.

మా అన్నయ్య స్నేహితుడంటే నాకెంతో ఇష్టంగా ఉండడం నాకు గుర్తు. నేను ఒంటరిగా ఉన్నప్పుడు అతను నా పెదాల మీద ముద్దు పెట్టుకునేవాడు. ఈ రకంగా ముద్దు పెట్టుకోవడం నాకు ఇష్టంగా ఉండేది కాదు. అది వింతగానే కాక సరైదని కాదని అనిపించేది.

నా స్నేహితురాలి తండ్రి నాతో చాలా స్నేహంగా ఉండేవాడు. కానీ నన్ను తరచూ గట్టిగా హత్తుకునేవాడు. మేం ఒంటరిగా

ఉన్నప్పుడు అతను వింత పద్దతిలో అతడి ఒంటిని నాకేసి రుద్దేవాడు, వింతగా అనిపించేట్లు ముద్దు పెట్టుకునేవాడు. అతను అలా చేసినప్పుడు నాకు అసహ్యమేసేది. మొదట్లో అతనంటే ఇష్టంగా ఉన్నా, ఆ తరువాత అతనంటే భయం వేసి అతని నుంచి తప్పించుకునేదాన్ని.

75 ఏళ్ళు ఉన్న ఒక తాత ఇంటికి వచ్చి నాకు ఇంగ్లీషు నేర్పించేవాడు. అతను ఆంగ్లేయుడో, ఆంగ్లో ఇండియనో. అతను తరచూ నా శరీరాన్ని అతనికేసి హత్తుకునేవాడు. పెదాలపై ముద్దు పెట్టడానికి ప్రయత్నించేవాడు. అలా చేసేటప్పుడు అతడి ముఖమూ, ఊపిరీ వింతగా మారేవి. అతడి దగ్గర పాఠాలు నేర్చుకోవడం నాకు ఇష్టం లేదని మా నాన్నతో చెప్పడానికి ప్రయత్నించాను. కానీ మా నాన్న ”అతడు చాలా మంచి టీచర్‌. అతనికి ఇంగ్లీష్‌ బాగా వచ్చు. పైగా మన దగ్గర డబ్బులు తీసుకోవడం లేదు” అనేవాడు. అసలు విషయం మా నాన్నకు ఎలా చెప్పాలో నాకు తెలియలేదు. అయితే, నా అదృష్టం బాగుండి అతడికి జబ్బు చేసి రావడం మానేశాడు. దేవతలు నా మొర ఆలకించారని నాకు అనిపించింది.

ఇంకొక ”మర్యాదస్తుడు”, దూరపు బంధువు ఒకాయన కూడా నాకు గుర్తున్నాడు. అతను తరచూ మా ఇంట్లో బస చేసేవాడు. నేనంటే అతనికి ఎంతో ఇష్టం. నాకూ అతనంటే ఇష్టంగా ఉండేది, అతనితో గడపడం సరదాగా ఉండేది. మేమిద్దరం మంచి స్నేహితులుగా ఉండేవాళ్ళం. ఒకరోజు నేను అతని వడిలో కూర్చుని ఉండగా అతను నాకు కథ చదివి వినిపిస్తున్నాడు. ఉన్నట్టుండి అతను తన వేలిని నా చెడ్డీలోకి దోపాడు. నాకు నొప్పి వేసింది. భయభ్రాంతురాలయ్యాను. నేను వెంటనే అతని ఒడిలోంచి దూకి పారిపోయాను. అతను ఏమీ అనలేదు. భయం, దుఃఖం వంటి భావనలు నన్ను ముప్పిరిగొన్నాయి. అతను నాతో ఏమీ జరగనట్లే వ్యవహరించేవాడు. కానీ, నేను మాత్రం భయపడిపోయాను.

ఎన్నో ప్రశ్నలు నన్ను కలవరపెట్టాయి. అతను అలా ఎందుకు ప్రవర్తించాడు? అందుకోసమే నాతో మంచిగా

ఉన్నాడా? అతను మంచివాడు కాదా? నేను ఎలా ప్రవర్తించాలి? అతని దగ్గరకు వెళ్ళవచ్చా, వెళ్ళకూడదా?

అతడంటే చాలా ఇష్టపడ్డాను కాబట్టి అతని గురించి చెడుగా ఆలోచించాలనిపించేది కాదు. అతని గురించి ఫిర్యాదు చేయాలని కూడా అనిపించేది కాదు. వాస్తవానికి ఇదంతా జరిగి ఏళ్ళూ, పూళ్ళూ గడిచిపోయాయి. అప్పటి నా భావనలు, ప్రతిస్పందనలు ఏమిటో ఇప్పుడు అంత బాగా గుర్తులేవు.

నాకు సీమా అనే ఒక స్నేహితురాలు ఉండేది. మేమిద్దరం కలిసి ఆడుకోవడానికి తరచూ ఇంకొక స్నేహితురాలి ఇంటికి వెళ్ళేవాళ్ళం. ఆమె అన్నయ్య కూడా తరచూ మా ఆటల్లో మాతో కలుస్తూ

ఉండేవాడు. మా కోసం మిఠాయిలు తెచ్చేవాడు. మేం ఆడుకునేటప్పుడు అతడు తరచూ సీమాని వడిలో కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్పేవాడు. అతడి పురుషాంగంతో ఒకరోజు తన వెనక భాగంలో రుద్దాడని సీమా నాతో చెప్పింది. అది ఆమెకు చాలా నొప్పి కలిగించింది. ఆమె అతడి దగ్గర నుంచి పారిపోయింది. ఆ ఘటన తరువాత సీమాకీ, నాకూ అతనంటే భయం. అతని కారణంగా మేము మా స్నేహితురాలి ఇంటికి వెళ్ళడం మానుకున్నాం.

ఇటువంటిదే మరొక ఘటన కూడా నాకు గుర్తు ఉంది. నేను మరొక స్నేహితురాలి ఇంటికి వెళ్ళి ఆడుకునేదాన్ని. ఇద్దరం గంటల తరబడి ఆడుకునేవాళ్ళం. సెలవు రోజుల్లో వాళ్ళ నాన్న కూడా మాతో కలిసేవాడు. అతను చాలా సరదాగా

ఉండేవాడు. చాలామంది నాన్నల కంటే అతను ఎంతో మంచివాడని నేను అనుకునేదాన్ని. కానీ, అతను కూడా ఒకరోజు నన్ను తాకకూడని విధంగా తాకాడు. నేను చాలా ఆందోళనకు గురయ్యాను. దిగాలు పడిపోయాను. అతని ప్రవర్తన కారణంగా నేను నా స్నేహితురాలి ఇంటికి వెళ్ళడం మానేశాను.

ఈ ఘటన తరువాత నా స్నేహితురాలి తండ్రి తన కూతురుతో కూడా ఇలాగే ప్రవర్తిస్తాడా అన్న అనుమానం కలిగింది. అలా చేస్తుంటే ఆమె ఎలా తప్పించుకుంటుంది? నేనంటే ఆ ఇంటికి వెళ్ళడం మానేశాను. కానీ ఆమె అలా చెయ్యలేదే. నేను భయంతో కంపించిపోయాను, గందరగోళంలో కొట్టుమిట్టాడ సాగాను. నాకు అయిదు-పది సంవత్సరాల మధ్య ఈ అనుభవాలన్నీ ఎదురయ్యాయి. నేను చిన్నదానినే అయినప్పటికీ వాళ్ళు ఆ రకంగా తాకడం సరికాదనీ, తప్పనీ నాకు తెలిసేది. ఈ రకంగా నన్ను తాకేవాళ్ళు కూడా మంచివాళ్ళు కాదని నాకు అనిపించేది. వాళ్ళు నన్ను వాడుకోవడానికి ప్రయత్నించేవాళ్ళు. మా కుటుంబానికీ, నాకూ ఇంత దగ్గరివాళ్ళే నాతో ఆ విధంగా ఎలా ప్రవర్తించగలిగేవారో నాకు అర్థమయ్యేది కాదు. ఆ పాటికి నేను చాలా గందరగోళానికి లోనయ్యి, ఎవరు మంచివాళ్ళో ఎవరు కాదో చెప్పలేక పోయేదాన్ని.

నేను కొంచెం పెద్దదానినైన తర్వాత ఆడపిల్లలే కాకుండా మగపిల్లలు కూడా లైంగిక హింసకు గురవుతారని తెలిసింది. కుటుంబాలలో, బడులలో, ప్రత్యేకించి హాస్టళ్ళలో, క్యాంపులలో, పని ప్రదేశాలలో పెద్దవాళ్ళ లైంగిక హింసకు వీళ్ళు కూడా గురవుతారు.

నాతో ఆ రకంగా ప్రవర్తించే మామయ్యలు, టీచర్లు, కుటుంబ స్నేహితులను చూసినప్పుడు వీళ్ళు మంచితనం ముసుగు వేసుకున్న రాక్షసులు అనిపించేది. మా కుటుంబంలోని ఇతర సభ్యులు ఆ ముసుగు వెనుక ఉన్న అసలు రూపాన్ని చూడలేకపోయేవారు. వాళ్ళ అసలు ముఖాలు తెలిసిన నేను ఆందోళనకు గురయ్యేదాన్ని. కోపం, బాధ కలిగేవి.

ఆందోళన, గందరగోళాలకు గురయ్యేదాన్ని కాబట్టి ఇతరులతో దీని గురించి మాట్లాడలేకపోయేదాన్ని. ఇవి ఎలా చెప్పాలో నాకు తెలిసేది కాదు. నా అనుభవాలను చెప్పటానికి నా దగ్గర సరయిన మాటలు ఉండేవి కావు. ఎలా చెప్పాలి? ఎలా వివరించాలి? ఇతరులు నన్ను నమ్ముతారా? నేను భయానికి లోనయ్యి నాతో చెడ్డగా ప్రవర్తించిన వాళ్ళను తప్పించుకు తిరిగేదాన్ని. ఇతరులతో ఎంతో జాగ్రత్తగా ఉండేదాన్ని.

ముసుగులు తగిలించుకుని మంచివాళ్ళలాగే చెలామణి అయ్యే ఈ చెడ్డవాళ్ళంటే నాకు భయం వేసేది, వాళ్ళని అసహ్యించుకునేదాన్ని. వాళ్ళమీద ప్రతీకారం తీర్చుకోవడానికీ, వాళ్ళు శిక్షించబడడానికీ ప్రణాళికలు తయారు చేస్తుండేదాన్ని. చాలాకాలం పాటు నాలో కోపం, ద్వేషం రగులుతూ ఉండేవి. కానీ, వీటి గురించి ఎవరికీ చెప్పలేకపోయేదాన్ని. మౌనంగానే ఉండిపోయేదాన్ని.

నేను పెద్దగా అయిన తర్వాత కూడా చాలామంది మగవాళ్ళు తమ చెడ్డ పనులకు ప్రయత్నించారు కానీ నేను అందుకు అవకాశం ఇవ్వలేదు. నేను బలంగా ఉండడమే కాకుండా ఎంతో జాగ్రత్తగా ఉండేదాన్ని. నా అనుభవంలోకి వచ్చిన లైంగిక హింస మరీ అంత తీవ్రమైనది కాదు, కాబట్టి నేను ఎంతో అదృష్టవంతురాలినని ఇప్పుడు నాకు అనిపిస్తుంది. చిన్నపిల్లలు కూడా అత్యాచారాలకు గురవుతున్నారని ఇప్పుడు నాకు తెలుసు. ఈ అత్యాచారాలకు పాల్పడేది మామనో, బావనో, టీచరో, పక్కింటి వ్యక్తో, ఒక్కొక్కసారి తండ్రే తన కూతురిపై అత్యాచారం చేశాడు. కానీ నేను కూడా ఎంతో మానసిక వేదనకు గురయ్యాను. ఏ బాలిక కూడా ఇటువంటి బాధకు లోను కాకూడదు.

నాకు ఎదురైన లైంగిక హింస కారణంగా నేను భయస్థురాలినయ్యాను. ప్రతిదీ అనుమానించేదాన్ని. ఈ చర్యకు పాల్పడిన వారిపట్ల భయం, అనుమానం, కోపం, ద్వేషం ఏళ్ళ తరబడి నాతో ఉండిపోయాయి. ఇటువంటి బాధాకరమైన అనుభవాలు, భయాలు, సందేహాలు, ప్రత్యేకించి దాని గురించి మాట్లాడడానికి ఎవరూ లేనప్పుడు పిల్లలకు ఎంతో నష్టం జరుగుతుందని ఇప్పుడు నాకు తెలుసు.

దీని గురించి ఎవరితోనూ, మా తల్లిదండ్రులు, అక్కలు, అన్నలు, లేదా స్నేహితులు, టీచర్లతో నేను మాట్లాడలేకపోవడం అన్నింటికంటే ఎక్కువగా నన్ను బాధించింది, నిరాశపరిచింది.

”నేను మౌనంగా ఎందుకు ఉండిపోయాను?” అని ఈ రోజుకి కూడా నన్న నేను ప్రశ్నించుకుంటాను.

ఎవరికీ ఏమీ ఎందుకు చెప్పలేదు? గందరగోళంలో ఉన్నందుకు మిన్నకుండిపోయానా? లేక నా అనుభవాలను వివరించటానికి నా వద్ద మాటలు లేవా?

నిజానికి నేను ఇష్టపడినవాళ్ళ గురించి ఫిర్యాదు చేయడం నాకిష్టం లేకపోయిందా? లేక నన్ను ఎవ్వరూ నమ్మరేమోనన్న భయం ఉండేదా? లేక నన్నే తప్పుపట్టి, శిక్షిస్తారేమోననా?

ఇతరుల దృష్టిలో మర్యాదస్తులయిన పెద్దవాళ్ళు అధికారం ఉన్నవాళ్ళపైన ఒక అమ్మాయి చెప్పే మాటలు నమ్మరని అనుకునేదాన్నా?

తప్పు నాదేనేమో, వాళ్ళు నాతో అలా ప్రవర్తించడానికి నేనే బాధ్యురాలినేమో, నాలోనే ఏమైనా దోషముందేమోనని నేను మౌనంగా ఉండిపోయానా?

ఇటువంటి వాటి గురించి మాట్లాడడం మంచిది కాదని నేర్పించడం వల్ల మౌనంగా ఉండిపోయానా?

నేను మౌనంగా ఎందుకు ఉండిపోయానో నిజంగానే నాకు తెలియదు. చిన్నపిల్లనైన నేను నా బాధనీ, భయాలనూ, గందరగోళాన్నీ ఇతరులతో ఎందుకు పంచుకోలేకపోయాను? ఈ మౌన భారాన్ని ఇన్నేళ్ళపాటు మోస్తూ ఎందుకు తిరిగాను?

కారణాలు నిజంగానే నాకు తెలియవు.

చాలా కాలంపాటు మరొక బాధాకరమైన ప్రశ్న నన్ను వేధించింది. నేనంటే చిన్నదాన్ని, గందరగోళంలో, సందేహాలతో

ఉన్నదాన్ని. కానీ నా తల్లిదండ్రులు, అన్నలు, అక్కల మాటేమిటి? వాళ్ళు మౌనంగా ఎందుకు ఉండిపోయారు? ఇటువంటి చర్యల గురించి, అటువంటి వాళ్ళ గురించి ఏ ఒక్కరు కూడా నన్ను ఎందుకు హెచ్చరించలేదు. నాకు జాగ్రత్తలు ఎందుకు చెప్పలేదు?

వాళ్ళు నాకంటే పెద్దవాళ్ళు. అన్నీ తెలిసిన వాళ్ళు. ఇటువంటివి జరుగుతాయని వాళ్ళకి తప్పక తెలిసి ఉండాలి. వాళ్ళ మౌనం వెనుక కారణాలు ఏమిటి? నన్ను కాపాడలేకపోవటానికి, వాటిని ఎదుర్కోటానికి నన్ను సిద్ధం చేయకపోవడానికి కారణాలు ఏమిటి? చిన్న పిల్లలు లైంగిక దూషణకు గురవుతారని వాళ్ళకెవ్వరికీ తెలియదా?

నా తల్లిదండ్రులు, అన్నయ్యలు, అక్కలు నన్ను ప్రేమిస్తారు. అయితే నా అసౌకర్యాలనూ, బాధనీ, మౌనాన్నీ ఏ ఒక్కరూ ఎందుకు గ్రహించలేకపోయారు? లేక నా అనుభూతులను నా ముఖంలో కానీ, నా ప్రవర్తనలో కానీ కనబడనివ్వనంతటి గొప్ప నటినైపోయానా?

వాళ్ళతో ఏ విషయం గురించి అయినా మాట్లాడవచ్చన్న నమ్మకాన్ని మా అమ్మా, నాన్న, అన్నలు, అక్కలు, టీచర్లు నాలో ఎందుకు కల్పించలేకపోయారని ఈ రోజుకీ నన్ను నేను ప్రశ్నించుకుంటాను. నేను చెప్పింది వాళ్ళు నమ్ముతారనీ, నా భయాలనూ, అనుమానాలనూ తొలగిస్తారనీ అన్న నమ్మకం నాలో ఎందుకు లేకపోయింది?

మా కుటుంబంలో ఈ దూరాలు, ఈ అంతరాలు ఎందుకు ఉన్నాయి? ఒకే ఇంట్లో ఉంటున్నప్పటికీ మేం అపరిచయస్తులుగానే ఉండిపోయాం కదా? అన్ని ఇళ్ళల్లో ఇదే మౌనం, ఇవే దూరాలు ఉంటాయా?

ఆ తర్వాత నా స్నేహితురాలు ఒకామె తన అనుభవాన్ని నాతో పంచుకుంది. ”నా బాల్యంలో మా నాన్నగారి స్నేహితుడు మా ఇంటికి వస్తూ ఉండేవాడు. అతను మా పక్క ఇంట్లోనే ఉండేవాడు. అతను పిల్లలతో ఆటలు ఆడించేవాడు. వ్యాహ్యాళికి తీసుకువెళ్ళేవాడు. ఒకరోజు అతను మమ్మల్ని ఒక నిర్జన భవనంలోకి తీసుకెళ్ళాడు. మా అందరికీ మిఠాయిలు ఇచ్చాడు. నన్ను తన వడిలో కూర్చోబెట్టుకుని తన పురుషాంగాన్ని నాకేసి రుద్దసాగాడు, వెనకనుంచి తొయ్యసాగాడు.

”నాకు చాలా చెడ్డగానూ, బాధగానూ అనిపించింది. అతని వడిలోంచి లేవటానికి ప్రయత్నించాను కానీ అతను నన్ను గట్టిగా పటుకున్నాడు. నేను పెద్దగా అరిచి, వడిలోంచి బయటికి వచ్చి ఏడ్వడం మొదలుపెట్టాను. పిల్లలంతా నా చుట్టూ చేరారు. తర్వాత మేమంతా ఇంటికి పరుగుతీశాం. జరిగినదాని గురించి నేను మా అమ్మకు చెప్పాను. ఆమె నాన్నకు చెప్పింది. మా నాన్న చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడి అందరూ కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడు శిక్షింపబడ్డాడు”.

ఇది విన్న తర్వాత మా కుటుంబ సభ్యులు నా శరీరం గురించి, సెక్స్‌ గురించి నిర్మొహమాటంగా మాట్లాడి ఉంటే నేను మరింత జాగ్రత్తగా, ఆత్మవిశ్వాసంతో ఉండేదాన్ని అనిపిస్తుంది. స్పర్శలో మంచిదానికీ, చెడ్డదానికీ తేడా, అలాగే మనుషుల్లో పిల్లలను ప్రేమించేవాళ్ళకీ, దూషించేవాళ్ళకీ తేడా తెలిసేది.

ఇంటివద్ద కానీ, బడిలో కానీ అటువంటి వాతావరణం ఉంటే నేను మౌనంగా ఉండిపోయేదాన్ని కాదని ఖచ్చితంగా చెప్పగలను. నన్ను దూషించడానికి ప్రయత్నించిన పురుషుల పట్ల నా తల్లిదండ్రులు కూడా ఏదైనా చర్య తీసుకుని ఉండేవారు.

ముసుగులు వేసుకున్న ఆ వ్యక్తులు ఇతర పిల్లలతో కూడా అలాగే వ్యవహరించేవారేమో. ఆ పిల్లలు కూడా నాకులాగే మౌనంగా ఉండిపోయారేమో.

మా మౌనం వల్ల దోషులు స్వేచ్ఛగా తిరగగలిగారు. వాళ్ళకి ఎటువంటి శిక్ష పడలేదు. తమ నేరాలకు క్షమాపణలు కోరలేదు.

నా కుటుంబ సభ్యులు లేదా టీచర్లు నాతో ఈ విషయం గురించి నిర్మొహమాటంగా, స్వేచ్ఛగా మాట్లాడి ఉంటే బాధాకరమైన ఆ రహస్యాలను అన్నేళ్ళపాటు మోస్తూ తిరిగేదాన్ని కాదు. నా భయాలను, ద్వేషాలను అప్పుడే వదిలిపెట్టి ఉండేదాన్ని.

సరే, నన్నూ, నా కథనీ ఇక వదిలిపెడదాం. నా గురించి ఇప్పటికే చాలా చెప్పాను. ఇప్పుడు మీరు చెప్పండి…

తప్పుగా కానీ, చెడ్డగా కానీ ఎవరైనా మిమ్మల్ని చూడడం, తాకడం వంటి అనుభవం మీకు ఎప్పుడైనా ఎదురయ్యిందా? ఎదురైతే, మీరు ఏం చేశారు? నాలాగా మౌనంగా ఉండిపోయారా, లేక ఎవరితోనైనా మాట్లాడారా? ఎవరితో మాట్లాడారు?

ఇటువంటి విషయాల గురించి మీ కుటుంబ సభ్యులతో, లేదా స్నేహితులతో, లేదా టీచర్లతో చెప్పగలిగేవారా? మీ తల్లిదండ్రులు, టీచర్లు మీతో స్వేచ్ఛగా ఉండేవారా? నిన్ను ఇబ్బంది పెడుతున్న ఏ విషయం గురించి అయినా వాళ్ళతో పంచుకోవచ్చునన్న ఆత్మవిశ్వాసాన్ని మీలో కలిగించారా?

మీ శరీరం గురించి కానీ, సెక్స్‌ గురించి కానీ మీకు ప్రశ్నలు ఏమైనా ఉంటే మాట్లాడడానికి ఎవరైనా ఉన్నారా? లేక సెక్స్‌ అంటే చెడ్డదనీ, దాని గురించి ఎవరితోనూ మాట్లాడకూడదని చెప్పారా?

మీ శరీరంలో మార్పు గురించీ, సెక్స్‌ గురించీ మీతో మాట్లాడడానికి మీ కుటుంబంలో, బడిలో ఎవరైనా చొరవ తీసుకున్నారా? లేక మీ శరీరం గురించి, సెక్స్‌ గురించి అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే పుస్తకాలు ఏమైనా ఇచ్చారా? మీ స్నేహితులతో సెక్స్‌ గురించి మాట్లాడారా?

నలభై సంవత్సరాల క్రితం మా కుటుంబంలో ఉన్నట్లే ఈ విషయాల పట్ల ఇప్పటికీ మౌనమే ఉందా?

నేను పెద్దయిన తరువాత ఇప్పుడు మన కుటుంబాలలో అందరం స్నేహితులుగా మెలగాలని నేను నమ్ముతున్నాను. కుటుంబంలో భయాలకు, మౌనానికి స్థానం ఉండకూడదు.

పిల్లలు ఏ విషయం గురించైనా తమతో మాట్లాడవచ్చునని, అన్ని భయాలు, అనుమానాలు, గందరగోళాలు తమతో పంచుకోవచ్చుననే భావాన్ని పెద్దవాళ్ళు కలిగించాలి.

వాళ్ళ భావాలు, అనుభవాలు, భయాలు, ప్రశ్నలను అర్థం చేసుకోవడానికి, ప్రతిస్పందించడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తామన్న నమ్మకాన్ని పిల్లల్లో పెద్దవాళ్ళు కలిగించాలి. ఎవ్వరూ వాళ్ళపై అరవకూడదు, నోరు ముయ్యమని అనకూడదు.

పిల్లలకు కూడా దృక్పథాలు ఉంటాయని, వ్యక్తిత్వం ఉంటుందని, తమదైన గుర్తింపు ఉంటుందని, వాటిని గుర్తించి, గౌరవించాలని పెద్దవాళ్ళు అర్థం చేసుకోవాలి.

భయం, అతిగా రక్షణ కూడుకున్న వాతావరణంలో కంటే స్వేచ్ఛ. ప్రజాస్వామిక వాతావరణంలో పిల్లలు ఆరోగ్యంగా, ఆనందంగా పెరుగుతారన్నది అందరికీ తెలిసిందే కదా.

ఈ రోజు ఒక కూతురికి, ఒక కొడుకుకి తల్లిగా ఏ విషయమూ చెడ్డది కాదనీ, ఏ విషయంపైనా కూడా నిషేధం

ఉండకూడదనీ నేను నమ్ముతున్నాను. చివరికి సెక్స్‌ కూడా. సెక్స్‌ పట్ల కొంతమందికి చెడ్డ ఆలోచనలు ఉండవచ్చు. కానీ సెక్స్‌ చెడ్డదీ కాదు, తప్పూ కాదు. పిల్లలకు సెక్స్‌ గురించి, లైంగికత గురించి మనం ఇళ్ళలోనూ, బడులలోనూ చెప్పవచ్చని, చెప్పాలని నేను భావిస్తున్నాను. లైంగిక దూషణకి గురయ్యే అవకాశాల గురించీ, మంచి, చెడు స్పర్శల గురించి పిల్లలకు ఇళ్ళల్లో, బడుల్లో చెప్పాలని నేను నమ్ముతున్నాను.

సెక్స్‌ గురించి పిల్లలతో మాట్లాడడం మంచిది కాదని, అది వారిపై చెడు ప్రభావం చూపిస్తుందని కొంతమంది నమ్ముతారు.

పిల్లలకి వాళ్ళ శరీరాల గురించి, సెక్స్‌ గురించి చెబితే వాళ్ళు మరింత బాగా అర్థం చేసుకోగలుగుతారనటంలో ఎటువంటి సందేహం లేదు. సరైన సమాచారం లేనప్పుడు పిల్లలు తప్పుడు అభిప్రాయాలు ఏర్పరచుకుంటారు. సెక్స్‌ గురించి నిర్మొహమాటంగా మాట్లాడడం వల్ల అనవసర, హానికరమైన భయాలను, ప్రమాదాలను (ఉదాహరణకు లైంగిక వ్యాధులు, హెచ్‌ఐవి, అనవసర గర్భధారణ) తొలగించవచ్చు. జీవితంలో సెక్స్‌ అనివార్య భాగమైనప్పుడు దాని గురించి మాట్లాడడం, దానికి సంసిద్ధులను చేయడం తప్పు లేదా చెడ్డది ఎలా అవుతుంది?

పిల్లలకు భయాలు, లేదా ఆందోళనలు కలిగించే విషయాల గురించి వాళ్ళతో మాట్లాడకూడదని కొంతమంది నమ్ముతారు.

సరైన సమాచారం, జ్ఞానం వల్ల భయాందోళనలను కలిగించడానికి బదులు తగ్గిస్తాయని నేను భావిస్తున్నాను. పెద్దవాళ్ళతో నిర్మొహమాటంగా మాట్లాడడం వల్ల తమకున్న సమాచారం, జ్ఞానం వల్ల పిల్లలు దృఢంగా, విశ్వాసంతో ఉంటారు. వాళ్ళకి అన్నింటిపట్ల అవగాహన ఏర్పడి, విభిన్న పరిస్థితులను ఎదుర్కోవడానికి సంసిద్దులుగా ఉంటారు.

ఆడపిల్లకి జరగకూడనిది ఏదయినా జరిగితే దాని గురించి అస్సలు మాట్లాడకూడదని కొంతమంది అంటారు. దాని గురించి మాట్లాడడం వల్ల ఆడపిల్లకి, కుటుంబానికి చెడ్డపేరు వస్తుందని అంటారు.

లైంగిక దూషణ గురించి మాట్లాడడం వల్ల దానికి గురయిన ఆడపిల్లకి కాకుండా దానికి పాల్పడ్డ వ్యక్తికి చెడ్డపేరు రావాలన్నది నా అభిప్రాయం. దోషిని బయట పెట్టినందుకు, ఆ రకంగా ఇతర పిల్లలకు రక్షణనిచ్చినందుకు ఆమెను మనం అభినందించాలి.

వీటన్నింటి పట్ల మీ అభిప్రాయం ఏమిటి? వీటి గురించి నిర్మొహమాటంగా మాట్లాడాలా, వద్దా!

మనలో ప్రశ్న కానీ, సందేహం కానీ, భయం కానీ ఉన్నప్పుడు మనకి దగ్గరవాళ్ళు, నమ్మకమున్న వాళ్ళతో తప్పనిసరిగా మాట్లాడాలని మళ్ళీ చెపుతున్నాను.

మనం నమ్ముతున్నవాళ్ళతో మాట్లాడడం వల్ల విషయాల పట్ల స్పష్టత ఏర్పడుతుంది. మన భయాలు, సందేహాలు తొలగిపోతాయి.

తలుపులు, కిటికీలు తెరిచినప్పుడు గాలి, వెలుతురు, తాజాదనం లోనికి ప్రవేశించినట్లు మన మనస్సుని, ఆలోచనలను విప్పి చెప్పుకుంటే తాజాదనాన్ని తెస్తుంది, ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది.

మన ఆలోచనలను పంచుకోవటం వల్ల స్నేహం ఏర్పడుతుంది; ఈ స్నేహం సమవయస్కుల మధ్య ఉండవచ్చు, పెద్దలు, పిల్లలవాళ్ళ మధ్య ఉండవచ్చు.

ఇతరులతో మన మనసులు విప్పటం ద్వారా వాళ్ళు కూడా తమ మనసులు విప్పేలా ప్రోత్సహించినవాళ్ళం, సహాయపడినవాళ్ళం అవుతాం. స్నేహ హస్తాల కోసం, మాట్లాడే వారి కోసం వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారేమో…

మిత్రులారా, అందరితో మాట్లాడదాం అన్నది నా అభిప్రాయం.

మీ మాటేమిటి?

Share
This entry was posted in సమాచారం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.