పరిచయం
గమనమే గమ్యం నవలను భూమికలో ధారావాహికంగా ప్రచురించడానికి అనుమతినిచ్చిన ఓల్గాకి ధన్యవాదాలు. డా|| కొమర్రాజు అచ్చమాంబ జీవన స్ఫూర్తితో సాగిన ఈ నవల భూమిక పాఠకుల కోసం. – ఎడిటర్
సాయంకాలమైంది. రాజ్యలక్ష్మి ప్రార్థనా మందిరానికి వెళ్ళటానికి సిద్ధమవుతోంది. చక్కబెట్టవలసిన పనులు చాలానే ఉన్నాయి. పెంపుడు కూతురు ప్రేమావతి తలలో పువ్వులు పెట్టింది. గులాబీపూలు ప్రేమావతి తలలోంచి తనను నవ్వుతూ చూస్తున్నాయనిపించిందామెకు. ఆ పిల్ల తలను దగ్గరకు తీసుకుని ఆ పూలనోసారి వాసన చూసింది. రాజ్యలక్ష్మికి పువ్వులంటే మహాప్రీతి. ఏ కాలంలో పూసే పూలు ఆ కాలంలో తన తలలో ముడవకుండా ఉండదు. తన చుట్టూ ఉన్నవారి సిగలో అలంకరించకుండా ఉండదు. ప్రేమావతి తలను తనవైపు తిప్పుకుని ముఖాన్ని చేతులతో నిమిరి మెటికలు తన కణతలపై విరిచి
”వెళ్ళమ్మా… అందరికీ ప్రార్థన సమయమవుతోందని చెప్పు. పనులు ముగించుకుని రమ్మను” అన్నది రాజ్యలక్ష్మి.
ప్రేమావతి ఉత్సాహంగా పరిగెత్తుతున్నట్లే వెళ్ళింది.
తన తలలో కూడా రెండు గులాబీలు పెట్టుకుంటుంటే ఆవు సంగతి గుర్తొచ్చింది. ఆవు రేపో మాపో ఈనటానికి సిద్ధంగా ఉంది. దాని పరిస్థితేమిటో ఒకసారి చూస్తే మంచిదని పాకవైపు వెళ్తుంటే తోటమాలి పరిగెత్తుకొచ్చాడు. ”పంతులు గారు ఉన్న పళంగా రమ్మన్నారమ్మా” అంటూ రొప్పుతున్నాడు. ”అంత పరుగు తియ్యటం దేనికిరా. ఐదు నిమిషాలలో కొంపలు మునుగుతాయా? ఆవు ఈనేలాగా
ఉంది. అప్పడూ, నువ్వూ ఇక్కడి నుంచి కదలకండి” అంటూ తోటవైపు నడిచింది రాజ్యలక్ష్మి.
”ఈ సమయంలో తనతో ఏం పనిబడిందో. ప్రార్థనకు వేళవుతోంది. రాత పనులన్నీ ముగించుకుని తోటకు వెళ్ళారు. అక్కడ ఏం ఆలోచన వచ్చిందో. వచ్చిన ఆలోచన వెంటనే చెప్పకపోతే ఆయనకు తోచదు. కొత్తగా ప్రారంభించిన పాఠశాల గురించి ఎంత ఆలోచించినా ఆయనకు చాలటం లేదు. ఇంకా కొత్తగా ఏదో చేయాలనే ఆరాటం తీరటం లేదు. సరైన విద్య అంటే ఏమిటో తేల్చుకోలేకపోతున్నారు. ఆడపిల్లలకు చదడటం, రాయటం వస్తే సరిపోతుందా? ఆఫీసుల్లో ఉద్యోగాలు చేయాలి. టీచర్లుగా, డాక్టర్లుగా పని చేయాలి. ఈ ఆలోచనలకు ఆయన పూర్తిగా సుముఖంగా లేరు. ఆ పనులకు ఇంకా సమయం ఉంది అంటారు. ఆడవాళ్ళు డాక్టర్లయితే ఎంత సుఖం తోటి ఆడవాళ్ళకు. ముఖ్యంగా పురిటి గదిలో. వైద్యుడ్ని వైద్యుడిగానే చూడాలి. మగవాడు అనుకోకూడదు నిజమే, కానీ ఆ మాట అర్థం చేసుకునేదెవరు. ఈ ఆచార పరాయణులు ఎవరు చెప్పినా వినరు. మగ వైద్యుని దగ్గరకు రానివ్వరు. ఎంతమంది ఆడవాళ్ళు ప్రసవ సమయంలో సరైన వైద్య సహాయం లేక చనిపోతున్నారో తల్చుకుంటే గుండె చెరువవుతోంది. ఇంత అవసరమైన పని ఉంటే ఆడపిల్లలకు సతీహితబోధిని మాత్రమే అందించి ఊరుకుంటే సరిపోతుందా? పంతులుగారితో వాదించాలి, ఒప్పించాలి. ఆయనకు కోపం ముక్కుమీదే
ఉంటుంది. కానీ అది ప్రథమ కోపమే. వినగానే కాదంటారు గానీ ఆలోచిస్తారు. సబబనిపిస్తే ఒప్పుకుంటారు. ఇప్పుడాయనకు ఏ ఆలోచన వచ్చిందో”.
రాజ్యలక్ష్మి ఆలోచనలన్నీ తోటలోని చిన్న పందిరి దగ్గరకు వస్తుండగా ఆగిపోయాయి. దూరాన్నుంచి కూడా వారిద్దరూ కనిపిస్తూనే ఉన్నారు.
పంతులుగారి పక్కనే రామారావు ఉన్నాడు. ఆయన చిన్న వయసులోనే ఆంగ్లాంధ్ర సాహిత్యాలలో మంచి పాండిత్యం సంపాదించినవాడు. ఆయన అక్క శారదాంబ రాజ్యలక్ష్మికి మంచి స్నేహితురాలు. ఆమె బాగా చదువుకుంది. ఎన్నో పుస్తకాలు రాసింది. ఎన్నోచోట్ల స్త్రీల కోసం చిన్న సంఘాలు స్థాపించింది. స్త్రీల విద్య గురించి ఎంతో పనిచేసింది. ఇవన్నీ ఒక ఎత్తయితే ఆమె సేవా స్వభావం ఒక ఎత్తు. రోగుల సేవ ఆమెకు ఇష్టమైన పని. ఆమె వైద్యురాలయితే ఎంతో రాణించేది. వైద్యురాలు కాకపోయినా ఆమె చేసింది తక్కువ కాదు. ప్లేగువ్యాధి ప్రబలినప్పుడు ఎంతోమంది ప్రాణాలను రక్షించింది. వారి సేవలోనే ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఆమె డాక్టరయి ఉంటే అంత త్వరగా చనిపోయేది కాదేమో. రాజ్యలక్ష్మి ఆలోచనలు ఆ రోజు డాక్టర్ల గురించి, ఆడవాళ్ళు డాక్టర్లు కావాలనే ఆశ చుట్టూనే తిరుగుతున్నాయి.
రాజ్యలక్ష్మిని చూడగానే రామారావు లేచి నమస్కారం చేశాడు.
రాజ్యలక్ష్మి ఆయనను దీవించింది. అప్పుడు గమనించింది ఆయన పక్కనున్న ఐదేళ్ళ చిన్నపాపను. ”మీ అమ్మాయా రామారావుగారూ” అంటూ ఆ పాపను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంది.
”ఔనమ్మా. మీ స్నేహితురాలి మేనగోడలు. ఆమె పేరే పెట్టుకున్నాను”.
రాజ్యలక్ష్మి ఆ పాపను మరింత దగ్గరకు తీసుకుని హృదయానికి హత్తుకుంది.
”మా అక్క పోయిన ఏడాదికి పుట్టింది ఈ శారదాంబ. తరువాత ఒక అబ్బాయి. రెండో ఏడాది నడుస్తోంది”.
”అమ్మాయిని బాగా చదివించండి” అది రాజ్యలక్ష్మి సిగ్గుపడుతున్న ఆ పాపను ముద్దాడుతూ.
”తప్పకుండా. మా అక్కయ్యలాగే పండితురాలిని చేస్తా”.
”పాండిత్యం మంచిదే రామారావు గారూ. కానీ ప్రాణాలు పోయలేదుగా. ఇవాళ మనకు కావలసింది వైద్యులు. అమ్మాయికి వైద్యం చెప్పించండి”. రామారావు కళ్ళల్లో ఆనందాశ్చర్యాలు ఒక్కసారే మెరిశాయి.
”అమ్మా! ఎంత మంచి మాటన్నారు. అమ్మాయిని తప్పకుండా డాక్టర్ కోర్సే చదివిస్తా. మీ ఆశీస్సుల కోసమే మా అమ్మా, ఆవిడా వద్దంటున్నా అమ్మాయిని నాతోపాటు తీసుకొచ్చాను” పొంగిపోతూ అన్నాడు రామారావు.
”విద్య, వైద్యం… ఈ రెండింటిలో ఆడవాళ్ళు ఎక్కువమంది ప్రవేశించాలని రాజ్యలక్ష్మి అభిప్రాయం” అని పంతులుగారు మెల్లిగా నవ్వారు. ”నిజమేనండి. అందులో సందేహమే లేదు. ఈ చిన్న శారదాంబ పుట్టుక ఎంత కష్టమైందనుకున్నారు. వీళ్ళమ్మను గుంటూరు తీసుకెళ్ళి కుగ్లర్ ఆసుపత్రిలో పురుడు పోయించాల్సి వచ్చింది. ఆ మహానుభావులు కుగ్లర్ ఇక్కడికి వచ్చి గుంటూరులో ఆస్పత్రి పెట్టకపోతే నా చిట్టితల్లి ఏమైపోయేదో, నా భార్యకేగతి పట్టేదో ఆలోచిస్తే చెమటలు పడతాయి నాకు. మా శారదాంబను తప్పకుండా డాక్టర్ చదివిస్తా. మా అక్కకు కూడా రోగులకు స్వస్థత కలిగించటమంటే ఎంతో ఇష్టం. ఆమెకూ కొద్దిపాటి వైద్యం తెలుసు. ప్లేగు రోగులకు సేవ చేస్తూనే కదా ఆమె ప్రాణాలు పోగొట్టుకుంది”.
”అమ్మాయికి ఆధునిక వైద్యం చెప్పించండి” అంది రాజ్యలక్ష్మి. ”అమ్మాయికి మీ దీవెనలు కావాలని వచ్చాను. అవి అందాయి. వాటితోపాటు నా చిట్టితల్లి జీవితపథ నిర్దేశం కూడా జరిగిపోయింది. మీ మాట నాకు వేదవాక్కు. అమ్మాయిని డాక్టర్ చదివిస్తా. ఇంగ్లాండ్ పంపించి మరీ చదివిస్తాను” చిన్న శారదాంబకు వాళ్ళ మాటలు తన గురించేననే విషయం అర్థమయింది. కొత్త మనుషులతో తండ్రి తన గురించి మాట్లాడడం ఆ పాపకు తెలియని సంతోషాన్ని కలిగించింది.
”అచ్చు మా నేస్తం శారదాంబలాగానే ఉంది. ఆ చూపుల్లో ఎంత తెలివో” రాజ్యలక్ష్మి మురిసిపోయింది.
ఆమెకు పిల్లలంటే ఎంతో ప్రేమ. ఎంతమంది ఆడపిల్లలను తన స్వంత కూతుళ్ళలా పెంచినా ఆమె మమకారం తరిగిపోలేదు.
”నీ మురిపెంతోనే రామారావు కడుపు నిండుతుందనుకున్నావా? ప్రయాణం చేసి వచ్చాడు. ఫలహారం ఏర్పాట్లు…” పంతులుగారి మాట పూర్తికానివ్వలేదు రాజ్యలక్ష్మి. ”ఒక్క నిమిషం” అంటూ లోపలికి వెళ్ళింది. మధ్యాహ్నం ఒలిపించిన పనస తొనలను పళ్ళెంనిండా సర్దింది. వారి తోటలో పండిన పండు అది. బెంగుళూరు నుంచి అంటు తెచ్చి పెంచారు. తొనలు మహా తీపి. రామారావుకి పనస తొనలు ప్రియమని ఆమెకు తెలుసు.
రోజూ వాళ్ళింట్లో అతిథులు ఉంటూనే ఉంటారు. వారి ఇష్టాయిష్టాలన్నీ రాజ్యలక్ష్మికి తెలుసు.
పనసతొనలు తెచ్చి రామారావు ముందు పెట్టింది. రామారావు కూతుర్ని తీసుకోమని తనూ ఆప్యాయంగా తిన్నాడు. శారదాంబ నాలుగు తొనలు ఇష్టంగా తిని ఇంక చాలంది.”శారదాంబను నాతో తీసుకెళ్ళి ప్రేమావతితో స్నేహం కలుపుతాను. మీరిద్దరూ తీరికగా చర్చలు చేసుకోండి”. శారదాంబ చిన్న చేతిని పట్టుకుని నడిపించింది రాజ్యలక్ష్మి. రామారావు వస్తే నాలుగైదు గంటలు శాస్త్ర చర్చలు చేయందే పంతులుగారు వదలరు.
రాజ్యలక్ష్మి కొత్త మనిషనే బెరుకు కలగలేదు శారదాంబకు. ఆమెతోపాటు ప్రార్థనకు వెళ్ళింది. ఆ ప్రార్థనలు శారదాంబకు కొత్త. ఆసక్తిగా, ఇష్టంగా విన్నది.
”ఈ పాటలు రాసింది త్యాగరాజ స్వామేనా?” అమాయకంగా అడిగింది.
”కాదమ్మా! నేనే రాశాను”.
శారదాంబ రాజ్యలక్ష్మి మాటలు నమ్మలేనట్లు చూసింది.
”మా అమ్మ, నాన్నమ్మా త్యాగరాజస్వామి పాటలే పాడతారు”.
”అవి నాకూ వచ్చు”.
”వస్తే మరి మీరెందుకు మళ్ళీ రాశారు”.
”త్యాగయ్య ప్రార్థించింది మానవ రూపంలోని ఈశ్వరుడిని. నేను శక్తి రూపంలోని పరమేశ్వరుని గురించి రాశాను”.
శారదాంబకు ఆ మాటలు అర్థం కాలేదు. అర్థమవుతాయని రాజ్యలక్ష్మి అనుకోలేదు. అర్థం కాకపోయినా అమ్మా, నానమ్మా ఎంతో గౌరవించే త్యాగరాజ స్వామిలా ఈ అమ్మమ్మ పాటలు రాయగలిగిందనే గౌరవం కలిగింది ఆ చిన్నారి మనసులో.
రాత్రి భోజనాల దగ్గర అన్నీ రామారావుకి ఇష్టమైన వంటకాలే.
”మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారమ్మా. ఎందరో వస్తారు మీ ఇంటికి. ఎవరికి ఏం కావాలో మీకు తెలిసినట్టు వాళ్ళింట్లో వాళ్ళకు కూడా తెలియదేమో” రామారావు తృప్తిగా భోజనం చేశాడు. శారదాంబకు ముందే తినిపించింది ప్రేమావతి.
రాజ్యలక్ష్మి భోజనం చేసి పడుకుందామని వస్తే ప్రేమావతి నిద్రపోయింది గానీ, శారదాంబ కొత్త చోటవటం వల్లనేమో కళ్ళు తెరుచుకునే ఉంది.
”నిద్ర రావటం లేదామ్మా?”
”ఊహు. మా నాన్నమ్మ కథ చెబితే గానీ నాకు నిద్ర రాదు”.
”నేను కథ చెప్తే నిద్రపోతావా? మీ నాన్నమ్మ ఏం కథ చెప్తుంది?”
”రాముడి కథ. కృష్ణుడి కథ. ప్రహ్లాదుడి కథ”.
”నేను నీకు కొత్త కథ చెబుతాను వింటావా?”
శారదాంబ సంతోషంగా తలూపింది.
”ఈ కథ పాటలాగా పాడుకోవచ్చు”.
”మా నాన్నమ్మ కూడా పాడుతూ కథ చెబుతుంది. కుశలవుల కథ, ఊర్మిళాదేవి నిద్ర”.
”వాళ్ళంతా ఇప్పుడు లేరు. ఇప్పుడున్న వాళ్ళ కథ చెప్పుకుందామా? పూర్ణమ్మ అని చిన్నపిల్ల. నీకంటే కొంచెం పెద్దది. ఆ కథ పాడతాను వింటావా?” అంటూ రాజ్యలక్ష్మి పూర్ణమ్మ కథను పాడడం మొదలుపెట్టింది.
శారదాంబ అది వింటూ నిద్రపోయింది.
పాట పూర్తిచేసి, నిద్రపోతున్న శారదాంబ ముఖం చూస్తూ ఉండిపోయింది రాజ్యలక్ష్మి.
పిల్ల ముఖం ఎంత ముద్దుగానో ఉంది. ఆ ముఖాన్ని చూస్తుంటే…
శారదాంబను చూస్తుంటే స్నేహితురాలి జ్ఞాపకాలు కళ్ళముందు కదలాడుతున్నాయి. తనకంటే ఇరవై ఏళ్ళు చిన్నది. కలుసుకున్నది అతి తక్కువసార్లు. కానీ ఎంత స్నేహం కుదిరింది. కారణం తన ఒంటరితనమేనేమో. బంధువులందరూ వెలి వేశాక తనలాంటి ఆడవాళ్ళ స్నేహం దొరకక ఒకలాంటి బాధ గుండెలో గూడుకట్టుకుని ఉండేది. ఊపిరాడని పనులతో కాలం గడిచిపోతున్నా మనుషుల కోసం ముఖం వాచినట్టు ఉండేది. పద్దెనిమిదేళ్ళ శారదాంబ ఉత్సాహంగా వచ్చిందొక రోజు. చనువుగా పరిచయం చేసుకుంది. తన కూతురిలా అనిపించింది. అదేమాట శారదాంబతో అంటే అలా ఒద్దంటే ఒద్దంది. బంధుత్వం కంటే స్నేహం ఎక్కువ విలువగలది అంది.
”నిజం చెప్పు రాజ్యలక్ష్మి” అని ఒక్క క్షణం ఆగి ”మీరు నాకంటే చాలా పెద్దవాళ్ళు. ఇలా పిలిస్తే ఏమీ అనుకోరుగా” అంది.
సమాధానంగా రాజ్యలక్ష్మి శారదాంబను హృదయానికి హత్తుకుంది.
రెండు నిమిషాలు అలా గడిచాక – ”చెప్పు రాజ్యలక్ష్మి. నీ బంధువులు నీతో మాట్లాడుతున్నారా?” అని సూటిగా అడిగింది.
రాజ్యలక్ష్మికి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. శారదాంబతో అంతా చెప్పుకోవాలనిపించింది. చెప్పింది. తన మేనమామ తననెంత ప్రేమగా పెంచాడో, అందరూ వద్దంటున్నా తనను బడికి పంపి ఎలా చదివించాడో, రోజూ తనతో పురాణ కథలెలా చదివించుకునేవాడో, తమ బంధం ఎంత ప్రేమమయమో, ఆయనకోసం ఇప్పటికీ తన ప్రాణం ఎలా కొట్టుకు పోతోందో, అంతా చెప్పింది.
”అసలు ఆయన ఏమంటారు?” శారదాంబకు కుతూహలం ఎక్కువ. ఏ విషయాన్నయినా చివరివరకూ తెలుసుకోనిదే ఊరుకోదు.
రాజ్యలక్ష్మి మాత్రం ఆ రోజుని మర్చిపోయిందా. శారదాంబకు చెప్పడం మొదలెడితే అంతా నిన్న మొన్న జరిగినట్టు గుర్తొచ్చింది.
”శారదా.. ఆ రోజుని నేను మర్చిపోలేదు. ఎప్పుడూ నా మనసులో సెల వేస్తూనే ఉంటుంది. మా ఇంట్లో మొదటి వితంతు వివాహం జరగబోతోందనే వార్త బయటికి పొక్కింది. మా మేనమామ, మేనత్త వచ్చారు. నాకు చిన్నప్పుడే అమ్మా నాన్నా చనిపోతే కన్నబిడ్డలా పెంచారు. కంటిపాపలా చూసుకున్నారు. నన్ను ”బాపాయి” అని ప్రేమగా పిల్చేవాడు. నా అసలు పేరు బాపమ్మ కదా. పంతులుగారికి అది నచ్చక రాజ్యలక్ష్మి అని పిలుస్తున్నారు.
మా మేనమామ ఆ రోజు వచ్చి దీనంగా నా ముందు నిలబడితే నా గుండె పగిలిపోయింది.
”బాపాయి. నిన్ను కళ్ళల్లో పెట్టుకు పెంచిన సంగతి మర్చిపోయావామ్మా” అని ఆయన అంటుంటే ”అంత కఠినంగా ఎందుకు మాట్లాడుతున్నావు మామయ్యా” అని కన్నీరు కార్చాను.
ఆయన ధోరణి వేరు.
”అమ్మా! ఈ అనాచారం ఏమిటి? నువ్వు తెలివిగల దానివి. నీ భర్తను ఈ పనులన్నీ ఒద్దని చెప్పి మాన్పించాలి. లేదంటే ఈ అనాచారపు కొంప నుంచి బైటికి రా. మేము నిన్ను కడుపులో పెట్టుకుంటాం” అన్నాడు.
”మామయ్మా! ఏమంటున్నావు. నేను ఆయనని ఒదిలి రావటమా. నీకు నోరెట్లా వచ్చింది” అని నేను బాధపడుతుంటే…
”నువ్వు భర్తను ఒదిలెయ్యాలని చెప్పటం లేదమ్మా. ఈ పనులు మానెయ్యకపోతే నేనీ ఇల్లు విడిచి పెడతానని నువ్వొక మాటంటే ఈ అనాచారాలన్నీ ఆగుతాయమ్మా” అన్నాడాయన.
”అప్పుడు నువ్వేమన్నావు?” శారదాంబ ఉద్వేగంగా అడిగింది.
”నేనేమని ఉంటానో ఊహించు” రాజ్యలక్ష్మి కన్నీళ్ళలోంచి నవ్వింది.
”పంతులుగారి మీద నీకెంత ప్రేమో చెప్పి ఉంటావు. వదలి రాలేనని ఉంటావు” కొంటెగా అంది శారదాంబ. రాజ్యలక్ష్మి నవ్వి ”అలా అనలేదు శారదా. ఈ వితంతు వివాహాలు జరగాలని నేను కూడా గట్టిగా నమ్ముతున్నాను. ఈ పనులు నాకిష్టం లేకుండా నా భర్త కోసం చేస్తున్నవి కాదు. అనుకూలవతి, పతివ్రత అనిపించుకోవటం కోసం చేస్తున్నవీ కాదు. నా జీవిత ధర్మం, లక్ష్యం, గమ్యం, నా జీవన సాఫల్యం అన్నీ సంఘ సంస్కరణలో ఉన్నాయని నేనెంతో బలంగా నమ్మి చేస్తున్నాను. విశ్వాస రహితంగా ఏ పనీ చెయ్యని మనిషిని నేను. ఏ పనైనా నా మనస్సాక్షిగా నమ్మి చేస్తాను శారదా. ఏ కారణం వల్లనైనా ఈ సంస్కరణ నుంచి పంతులు గారు వెనక్కు తగ్గినా నేను ముందుకే పోతాను”.
రాజ్యలక్ష్మి కళ్ళల్లో వెలుగుకి శారదాంబ ఆశ్చర్యపడి చూస్తోంది.
రాజ్యలక్ష్మి చెప్పుకుపోతూనే ఉంది.
”అంటే మమ్మల్నందర్నీ ఒదిలేస్తావా?” అని మామయ్య అడిగాడు.
”నేను మిమ్మల్ని ఒదిలెయ్యను. మీరే నన్ను ఒదలేస్తారేమో” అన్నాను నేను.
”ఈ వెధవ ముండ పెళ్ళి మీ ఇంట్లో జరిగితే వదిలెయ్యక తప్పదు. మేమే కాదు, మొత్తం కులం, సమాజం అంతా మిమ్మల్ని వెలివేస్తారు. దిక్కులేని వారవుతారు” అన్న మామయ్య మాటలకు అందరికీ దిక్కు ఆ పరమేశ్వరుడే అని ఒక నమస్కారం చేశాను. వాళ్ళు వెళ్ళిపోయారు. నా మీద వారికున్న ప్రేమనంతా తెంచుకుని వెళ్ళిపోయారు. వాళ్ళే కాదు ఎందరో బంధువులు, స్నేహితులు దూరమయ్యారు. ఒంటరితనం. వాళ్ళ కోపాలు, తిట్లు, శాపాలూ తప్ప వాళ్ళు మరి కనబడరు. నా చేతి అన్నం తినరు. అదంతా తట్టుకున్నాను. ”మీ మామయ్య వెళ్ళిపోయాక పంతులుగారు నిన్ను ఓదార్చారా? ఎవరున్నా లేకపోయినా తానున్నానని ధైర్యం చెప్పారు కదూ” శారదాంబ మనసు కూడా ఆర్ద్రమై అడిగింది.
”ఆయన నన్ను ఓదారుస్తూ నా వల్ల నీకు ఇన్ని కష్టాలు అంటుంటే నాకు మరింత బాధ కలిగింది శారదా. ఆయనను అలా అనవద్దని వారించాను. ఇవి కష్టాలైతే నేను కోరి తెచ్చుకున్నవే. స్త్రీల ఉద్ధరణ కోసం నేను కష్టపడుతున్నాను. కేవలం మీ కోసం పతిభక్తితో నేనీ పనులు చేయడం లేదు. మీరలా అనటం నాకు బాగుండదు. ఈ ఉద్యమం మీ ఒక్కరిదేనని లోకం అనుకుంటే అనుకోనివ్వండి ఈ ఉద్యమం నాది కూడా. మనందరికంటే ఎక్కువగా పునర్వివాహం కోసం సాహసిస్తున్న ఆ ఆడపిల్లలది అన్నాను”.
శారదాంబ రెప్పవాల్చకుండా ఆ మాటలను తాగేస్తున్నట్లుగా విన్నది.
ఆ రోజంతా తన వెనకాలే నడిచింది. ఇద్దరూ కలిసి ఎన్ని విషయాలో మాట్లాడుకున్నారు.
ఆ శారదాంబ ఇప్పుడు లేదు. ఈ చిన్న శారదాంబ పెరిగి పెద్దదై ఆమె కలలన్నీ నిజం చేయాలి అనుకుంది రాజ్యలక్ష్మి. పెద్ద చదువులు చదివిస్తాననీ, ఇంగ్లండ్ పంపిస్తాననీ ఆ పాప తండ్రి చెప్పిన మాటలు గుర్తొచ్చి రాజ్యలక్ష్మి మనసంతా ఆనందంతో నిండిపోయింది. ఎన్నో ఆలోచనలు. ”ఈ అమ్మాయి అదృష్టవంతురాలు. కొత్త తరంలో పుట్టింది. ఆడపిల్ల అనగానే పెళ్ళి గురించి ఆలోచించకుండా చదువు గురించి ఆలోచించే తండ్రికి కూతురిగా పుట్టింది.
ఇంకో ఇరవై ఏళ్ళకి ఈ అమ్మాయి డాక్టరవుతుంది. మగవాడిలా అన్ని పనులూ చేయగలుగుతుంది. ఇంట్లో మగ్గిపోకుండా ప్రపంచాన్ని చూస్తుంది. పంతులుగారు ఆడవాళ్ళలా మగవాళ్ళు, మగవాళ్ళలా ఆడవాళ్ళు ప్రవర్తించే అద్భుత దేశం గురించి కథ ఒకటి కల్పించి రాశారు. పెద్దయ్యేసరికి ఈ పాప, ఈమె భార్త ఇద్దరూ కలిసి ఇంటి పనీ, బైట పనీ సమానంగా చేసుకుంటారా?
ఈ పాప డాక్టరైతే ఇంటి పనికి సమయమెక్కడ? పనికి మనుషుల్ని పెట్టుకోవటమే. డాక్టరయిన ఈ పాప ఎంత ఆత్మవిశ్వాసంతో ఉంటుందో. హుందాగా నడిచే ఆమె నడకా, మాట తీరూ, స్వభావం, దుస్తులూ అన్నీ వేరుగా ఉంటాయి. పనికిమాలిన కబుర్లు చెప్పదు. జట్టీలు పెట్టుకోదు. అసభ్యమైన మాటలు మాట్లాడదు. విద్య, సంస్కారం ఉట్టిపడుతుంటాయి.”
రాజ్యలక్ష్మి ఒక ఆధునిక యువతి రూపాన్ని తన మనసులో ఊహించుకుంటోంది. ఆధునిక యువతి, స్త్రీ అన్న మాట ఆవిడకు ఈ మధ్యనే పరిచయమైంది. గురజాడ అప్పారావు ఈ మాట అన్నాడని పంతులుగారు చెప్పారు. ”ఆధునిక స్త్రీ చరిత్రను పునర్లిఖిస్తుంది” అన్నాడట ఆయన. ఈ చిన్నది చరిత్ర సృష్టిస్తుంది. తృప్తిగా శారదాంబ నుదుటి మీద చిన్న ముద్దు పెట్టింది రాజ్యలక్ష్మి.
రామారావు మరో మూడు రోజులు రాజ మహేంద్రవరంలో పంతులు గారితో చరిత్ర గురించిన చర్చలో మునిగాడు. శారదాంబ, రాజ్యలక్ష్మి చుట్టూ తిరుగుతూ ఆమె నేర్పిన పాటలు, పద్యాలు నేర్చుకుంది. అప్పుడప్పుడూ వస్తుండమనే ఆత్మీయ వచనాలను మనసారా ఆస్వాదిస్తూ రామారావు ఆ దంపతుల నుంచి వీడ్కోలు తీసుకున్నాడు.
… … …
శారదాంబను తీసుకుని రామారావు రాజమండ్రి నుంచి సరాసరి గుంటూరు వెళ్ళాడు. శారదాంబ పుట్టింది అక్కడే. పుట్టిన వెంటనే లక్ష్మీబాయమ్మ ఆశీర్వాదం ఆ పిల్లకు దొరికింది. ఇప్పుడు ఐదేళ్ళు నిండిన శారదాంబను మళ్ళీ ఒకసారి ఉన్నవ దంపతులకు చూపించి వాళ్ళ ఆశీస్సులు కూడా ఇప్పించి ఇల్లు చేరదామనిపించింది. శారదాంబను డాక్టర్ చదివించాలనే ఆలోచన రాజ్యలక్ష్మి ఆయన మనసులో నాటిన మరుక్షణం నుంచీ ఆయన ఆనందానికి అవధి లేకుండా పోయింది. నిజానికి ఆయనకు కుటుంబం గురించి శ్రద్ధ తక్కువనే చెప్పాలి. చరిత్ర, సాహిత్యం వీటి గురించిన చర్చల్లోనూ, పనుల్లోనూ ఎక్కువ సమయం గడుపుతుంటాడు. ఆ పనిమీదే రాజమండ్రి బయల్దేరితే శారదాంబ తానూ వస్తానని పేచీ పెట్టింది. కూతురిని తీసుకెళ్ళి రాజ్యలక్ష్మికి చూపించాలని ఆ క్షణానే ఆయనకు అనిపించింది. తన ప్రియ సోదరికీ, ఆమెకూ ఉన్న స్నేహం గుర్తొచ్చింది. తీరా వెళ్ళిన తర్వాత రాజ్యలక్ష్మి అన్న మాటతో ఆయనకు వెయ్యేనుగుల బలం వచ్చింది. ఆ మాట వెంటనే లక్ష్మీనారాయణ దంపతులకు చెప్పాలనిపించింది. వారిద్దరూ వీరేశలింగం గారి శిష్యులే. స్త్రీ విద్య కోసం, వితంతు వివాహాలు జరిపించటం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు, పాటుపడుతున్నారు. రామారావుని చూసి ఆ దంపతులు సంతోషించారు. శారదాంబను ప్రేమగా అక్కున చేర్చుకున్నారు. రాజ్యలక్ష్మి మాటను లక్ష్మీబాయమ్మ మరింత బలపరిచింది. శారదాంబను డాక్టర్ చదివించాలనే నిర్ణయం జరిగిపోయింది.
ఆ రాత్రి లక్ష్మీనారాయణ గారూ, రామారావూ అనేక విషయాలు మాట్లాడుకున్నారు. ఎక్కువ చర్చలు ఆడపిల్లల చదువు, వితంతు వివాహాల గురించే. సంస్కరణ భావాలు గిట్టని వారు తమ మీద రాసిన రాతలనూ, చల్లిన బురదనూ రామారావుతో చెప్పుకుని బరువు దించుకున్నాడాయన. ప్రేమ అనే మాట అనుకోకుండా వాళ్ళ మాటల్లో దొర్లింది. అనుకోకుండా అని కూడా అనలేం. ఉన్నవ వారు గుంటూరు సమీపంలో ఒక గ్రామంలో జరిగిన ఒక సంగతి చెప్పాడు. ”ఒక రైతు కోడలు ఆ ఊరిలోని మరొక యువకుడితో వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి మంచి అమ్మాయి. నేను వాళ్ళింటికి చాలాసార్లు వెళ్ళాను. ఎంతో గౌరవంగా చూసేది. మాట తీరు, ప్రవర్తన అన్నీ హుందాగా ఉండేవి. భర్త మంచివాడే కానీ బలహీనుడు. మేదకుడిలా కనిపించాడు. ఆమెకు అతని మీద ప్రేమ లేదేమో. ఈ యువకుడు చదువుకున్నవాడు, అందగాడు. అతని మోహంలో పడి వెళ్ళిపోయింది. జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకుంది” విచారంగా చెప్పారాయన. ”నాశనం చేసుకుందని ఎందుకనుకుంటారు? ఆమె సుఖపడుతుందేమో. వారిద్దరి మధ్య ప్రేమ కలిగిందేమో”.
”ప్రేమ అంటే ఏమిటి రామారావు గారు?”
రామారావు నవ్వాడు.
”నాకు కూడా తెలియదు. పెళ్ళి చేసుకున్నందుకు కర్తవ్యంగా భావించి భార్యతో చేసే కాపురంలో ప్రేమ ఉండదని, మనంగా ఎంచుకున్న మనిషిపై కలిగేది ప్రేమ అనీ అంటారు. మనంగా ఎంచుకోవడం… ఎంత అర్థం లేని మాట! మన వివాహాలు పెద్దలు నిర్ణయిస్తారు. మన ప్రమేయం చాలా తక్కువ. వేశ్యని తప్ప మనంగా ఒక స్త్రీని ఎలా ఎంచుకోగలం? మీరు చెప్పిన రైతు కోడలు ఒకతనిని ఎంచుకుని గదా వెళ్ళిపోయింది. అతనూ ఎంచుకున్నట్లే గదా…అక్కడ ప్రేమ లేదంటారా?”
”అది ప్రేమ కాదంటాను. తల్లిదండ్రులను, కన్నకొడుకుని, రెండు వంశాల పరువు ప్రతిష్టలను పణంగా పెట్టి ఆమె ఏం బావుకుంటుంది. అది ప్రేమంటే నా మనసు అంగీకరించడం లేదు. ప్రేమ ధర్మ విరుద్ధంగా ఉండరాదంటాను”. ”ప్రేమ మనోజనితం. ధర్మం సంఘ జనితం. ఈ రెండింటికీ మధ్య సయోధ్య కుదిరి ధర్మబద్ధమైన ప్రేమ కలగటం కష్టమేమో. మీరు ధర్మ విరుద్ధం అన్నారు. సమాజం ఆ అమ్మాయిని వెలివేస్తుంది. ఆమె గతి ఏమవుతుందో. ఇలాంటి సంఘటనలు అక్కడక్కడా జరుగుతూనే ఉన్నాయి”. ”అంత నిగ్రహం లేకుండా” ఉన్నవ వారి గొంతులో ఆగ్రహం రాబోయింది.
”నిగ్రహం లేని ప్రేమ గురించి మనిద్దరికీ తెలియదు. మనం మాట్లాడుకుని ఏం ప్రయోజనం?”
”అర్థం చేసుకుందామని”
”రాధాకృష్ణుల ప్రేమని మీరు ఎలా చూస్తారు?” అడిగాడు రామారావు.
”అది దైవ సంబంధం. మానవులకు దాని అర్థం, సారాంశం గ్రహించటం సులభం కాదు.”
”ఒక మనిషికి సంఘ విరుద్ధమైన ప్రేమ కలిగితే ఏం చెయ్యాలంటారు?”
”ప్రేమించవచ్చు. కానీ కామ సంబంధం పెట్టుకోకూడదు. ఆ మనిషిని చూసి ఆనందించవచ్చు. స్నేహంగా ఉండొచ్చు. ఆ మనిషికి సహాయం అవసరమైతే చేయవచ్చు. ఒక్క కామ సంబంధం తప్ప మరే సంబంధమైనా ఉండొచ్చు” అన్నారు ఉన్నవ.
”అంత స్నేహం, ప్రేమ ఉన్నచోట చేతులు కలిస్తే, దేహాలు కలిస్తే తప్పవుతుందా? మనసే ప్రధానం కదా? శరీరానిదేముంది?” దానినంగీకరించటానికి ఉన్నవ వారు సిద్ధంగా లేరు.
”శరీరం చాలా ముఖ్యం. శరీరమే కదా ధర్మసాధనం. శరీరానికి నిగ్రహం నేర్పితేనే మనసు దారికొచ్చేది. ఇంద్రియాలు కోరినవన్నీ ఇస్తే శరీరం, మనసూ రెండూ పతనమవుతాయి”.
రామారావుకి ఆ మాటల్లో పొరపాటేమీ కనిపించలేదు.
”మీరన్నదానిలోనూ నిజముంది. కానీ ఈ విషయాల గురించి ఎవరూ రాయరు, మాట్లాడరు. నేను టాల్స్టాయ్ రాసిన నవల ”అన్నాకెరినినా” సంక్షిప్తంగా ఆంగ్లంలో చదివాను. ఇదే కథ. అన్నా అనే ఆమె భర్తను, పిల్లలను ఒక యువకుని కోసం వదిలి వెళ్ళి చివరికి సంక్షోభంలో పడుతుంది. అట్లాంటి పుస్తకాలు చదివి ఈ ఆకర్షణలు, ప్రేమలు, కామాలూ వీటి గురించి మాట్లాడుకుంటే ఇలాంటి అనర్థాలు ఆగుతాయేమో!”
”నిజమే. మనం కూడా రాయాలి ఈ విషయాలు”.
”మీరు రాయండి. నేను ప్రచురిస్తాను”.
ఉన్నవ వారు పెద్దగా నవ్వారు. ఆ సంగతి అక్కడితే వదిలేశారు. తెలుగు సాహిత్యాన్ని కొన్ని తరాలపాటు ప్రభావితం చేయబోయే నవల ఒకటి ఆ సంభాషణలోంచి పుడుతుందని వారిద్దరూ ఆనాడు అనుకోలేదు.
తర్వాత వారి సంభాషణ మత మార్పిడుల గురించి సాగింది. మిషనరీలు విద్య, వైద్యం, సమానత్వం ఇవ్వటం ద్వారా మాల, మాదిగలను ఆకర్షిస్తున్నారని రామారావు అంటే ఉన్నవ వారు అందులో తప్పేముందన్నారు. ఆ పని మనమే చేయవచ్చు. చేసే మనసు మనకు లేదు. ధైర్యం లేదు. దానికి తగిన మూల్యం ఎప్పుడో ఒకప్పుడు చెల్లించవలసిందేననుకున్నారు ఇద్దరూ.
రాత్రి చాలా పొద్దుపోయేవరకూ ఈ చర్చలు సాగుతూనే ఉన్నాయి. తెల్లవారి లేచి స్నానం చేసి ప్రయాణానికి సిద్ధమవుతున్నాడు రామారావు. ఎవరో బైటినుంచి లక్ష్మీనారాయణ గారూ అని పెద్దగా పిలవటంతో ఇద్దరూ బైటికొచ్చారు.
ఆ వచ్చినతని ముఖం పాలిపోయింది. దుఃఖం నిండిన గొంతుతో ”లక్ష్మీనారాయణ గారూ! ఘోరం జరిగిపోయింది. వీరేశలింగం పంతులు గారి భార్య రాజ్యలక్ష్మమ్మ గారు మరణించారట” అన్నాడు. ఇద్దరూ నిశ్చేష్టులై నిలబడిపోయారు. కాసేపటికి తేరుకున్న రామారావు ”నాలుగు రోజుల క్రితం చూశాను. ఆరోగ్యంగా ఉన్నారు. ఆమె చేతి భోజనం తిన్నాను. ఏ అనారోగ్యమూ లేదామెకు. ఎలా జరిగింది?”
ఆ వచ్చినతను కన్నీళ్ళు కారుస్తూ చెప్పాడు. ”నిన్న రాత్రి నిద్రపోయినామె మరి నిద్ర లేవలేదట. అంతే. రాజమండ్రిలో పంతులు గారింటికి తీర్థప్రజలా జనం వచ్చిపడుతున్నారట.” ”గొప్ప అదృష్టవంతురాలామె. అంత హాయిగా బాధపడకుండా వెళ్ళిపోయింది” ఉన్నవ బాధను దిగమింగుకున్నారు. ”పాపం పంతులుగారు ఒంటరైపోయారు. రామారావ్… రాజమండ్రి వెళ్ళాలి. నాకైతే వెంటనే బయల్దేరి వెళ్ళాలనిపిస్తోంది. నీ సంగతేమిటి?” రామారావుకి శారదాంబను ఇంటివద్ద దించి ఆ తర్వాతే రాజమండ్రి వెళ్ళాలనిపించింది. మొన్నటికి మొన్న ఆమె తన చల్లని చేతులతో శారదాంబకు అన్నం పెట్టి నిద్ర బుచ్చింది. ఇప్పుడామె లేని ఆ ఇంటిని చూడడానికి ఆ చిన్నపిల్లను వెంటబెట్టుకుని వెళ్ళటం ఎందుకు? అదే ఉన్నవ గారితో చెప్పాడు.
లక్ష్మీబాయమ్మ గారితో ఈ విషాద వార్త చెప్పటానికి ఉన్నవ లోపలికి వెళ్ళాడు. రామారావుకి అంతా అయోమయంగా అనిపించింది. మరణం ఇంత సులభమా? నాలుగు రోజుల క్రితం నవ్వుతూ శారదాంబను ఎత్తుకుని దీవించిన తల్లి, వండి వడ్డించిన తల్లి ఇప్పుడు లేదు, ఇక కనబడదు. చిన్ని శారదాంబ, అదృష్టవంతురాలు. ఆమె ఆత్మీయతని రుచి చూడగలిగింది. శారదాంబకు ఈ విషయం ఎలా చెప్పాలి? చెప్పకుండా ఎలా ఉండాలి? శారదాంబ ఏదో ఒక ప్రశ్న అడగకుండా ఉండదు. ఏం చెయ్యాలి? ఆలోచిస్తుండగానే శారదాంబ లోపలినుంచి పరిగెత్తుకు వచ్చింది.
”నాన్నా, ఆ అమ్మమ్మ చనిపోయిందటగా”
ఐదేళ్ళ పిల్ల అలా అడిగేసరికి రామారావుకి నిగ్రహించుకున్న దుఃఖం బైటికొచ్చింది.
”ఔనమ్మా… దేవుడి దగ్గరకు వెళ్ళింది”.
”నాకు పాట నేర్పింది నాన్నా”.
”పాటా…”
”ఔను నాన్నా”
”పాడు తల్లీ… ఏం పాట నేర్పిందో వింటాం” అంది లక్ష్మీబాయమ్మ శారదాంబను దగ్గరగా తీసుకుని.
శారదాంబ ముచ్చటగా రాజ్యలక్ష్మి నేర్పిన పాట పాడింది.
అందరూ ఆ పాట వింటూ ఉద్వేగ భరితులయ్యారు.
రామారావు, శారదాంబలు వెంటనే బయల్దేరి వెళ్ళిపోయారు.