ఎక్కడ పదిమంది అంబేద్కర్ బొమ్మ దగ్గర చేరి నినాదాలు ఇస్తున్నా అక్కడ ఒకే ఒక వయసు మళ్ళిన స్త్రీ కనిపిస్తారు. ఎక్కడ దళిత సమస్యపై సభ జరిగినా అక్కడ వేదికపై ఒకే ఒక మహిళ కనిపిస్తారు. క్రిస్మస్ పండగ రోజు తన ఈడు ఆడవాళ్ళంతా కుటుంబంతో చర్చికి వెళ్ళి ఆధ్యాత్మికంగా గడిపితే ఆమె మనుస్మృతి దహన కార్యక్రమంలో ముందుండి మనుస్మృతికి నిప్పంటిస్తారు. వాకపల్లి, లక్షింపేట, గరగపర్రు, రావూరు, ఆగిరిపల్లి, మిర్యాలగూడ, సింగంపల్లి… ఎక్కడ దళితులపై దాడులు జరిగినా అక్కడ జరిగే ఆందోళనలో ఆమె ఉంటారు. దళితులపై దాడికి పాల్పడినవారిని శిక్షించి బాధితులకు న్యాయం చెయ్యమని ఆమె ఎక్కని పోలీస్ స్టేషన్ మెట్లు లేవు. దళితులకు చెందవలసిన ఆర్థిక పథకాల లబ్ది వారికి అందేలా చూడమని ఆమె కలవని ప్రభుత్వాధి కారి లేరు. ఆమె అఖిల భారత దళిత హక్కుల వేదిక (ఎఐడిఆర్‌ఎఫ్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు, బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి ఆర్.మణి సింగ్.
బిఎస్సీ చదివిన తర్వాత ఆమెకు ఏలూరు పక్కనే ఉన్న పాలగూడెం గ్రామానికి చెందిన రేవులగడ్డ సుందర్ సింగ్‌తో ఆయన కర్ఫర్డ్ ఐ.ఎ.ఎస్‌గా ప్రమోషన్ పొందారు.
ఆమె పాల్గొనే సభలకు తమ పిల్లలతో పాటు అల్లుళ్ళు కూడా హాజరవడం చూస్తే అంబేద్కరిజం కుటుంబం దాకా రావడం అనేది ఎలా ఉంటుందో మన కళ్ళెదుట కనిపిస్తుంది. మణిసింగ్ ముందు నుంచీ స్వతంత్ర భావాలు, ఆత్మాభిమానం గల వ్యక్తి. వ్యక్తిగత క్రమశిక్షణతో పాటు సమాజం పట్ల గొప్ప బాధ్యతతో మెలగడం ఆమెకు స్వతహాగా అలవడింది. ఆమె కష్టపడి ఎంతటి అసాధ్యమైన పనినయినా సాధించేవారు. వ్యక్తిగత జీవితంలో, ఉద్యోగంలో సవాళ్ళను స్వీకరించ డానికి ఎప్పుడూ వెనుకాడరు. తెల్లవారుజామున నాలుగు గంటలకే నిద్ర లేవడం, ప్రతి పని తానే స్వయంగా చేసుకోవడం ఆమెకి అలవాటు. మణిసింగ్ గారికి అంబేద్కర్ సామాజిక విప్లవ సిద్ధాంతం పట్ల, సాంస్కృతిక రంగంలో ఆయన చూపిన బౌద్ద ధర్మమార్గం పట్ల ఎనలేని ప్రేమ, గౌరవం ఉన్నాయి. ఆమెకు మతం అంటే విముఖత తన తల్లినుంచే అబ్బిందనుకోవాలి. సామాజిక స్పృహతో కుల సమస్యమీద, సమస్యల్లో ఉన్న దళితులు, స్త్రీల కోసం పనిచేయడం నుంచి, సాదాసీదాగా జీవించడం, మొహమాటం లేకుండా ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం, నమ్మిన సిద్ధాంతాన్ని ఆచరిస్తూ దానికోసం కట్టుబడి ఉండడంలో ఆమె నూటికి నూరు శాతం అంబేద్కర్ అనుయాయిగా, బౌద్దురాలిగా కనిపిస్తారు. మణిసింగ్ గారు ఏ ఉద్యోగం చేసినా పూర్తి నిబద్ధతతో, ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి పకడ్బందీగా పనిచేసే వారు. ఆమె అమలా పురంలో ప్రధానోపాధ్యాయు రాలిగా మంచి పాలనాదక్షు రాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె భర్త సాంఘిక సంక్షేమ శాఖలో ఆఫీసర్ కాబట్టి కొన్ని పనులు చేయించి పెట్టమని గ్రామాల నుంచి పేద దళితులు ఆమె దగ్గరకు వచ్చేవారు. ఎస్సీ కార్పొరేషన్‌లో సుందర్ సింగ్ గారు ఉండబట్టి ఆమెకి ఆ తర్వాత కూడా సులభంగా పనుల య్యేవి. ఆలిండియా దళిత్ ఫెడరేషన్ చేపట్టే కార్యక్రమాలకు మణిసింగ్ గారు బైపాస్ సర్జరీ అనంతరం కూడా ఎంతో దూరం ప్రయాణం చేసి హాజరవుతున్నారని, ఆమె నిబద్ధత వెలకట్టలేనిదని ఆయన మణిసింగ్ గారి ఉద్యమ స్ఫూర్తి గురించి పదే పదే చెబుతారు.
దళిత సమస్య మీద ఉద్యోగ జీవితంలో కొన్ని పరిమితులతో పనిచేస్తూ తన వంతు వచ్చినప్పుడు పేద దళిత విద్యార్థులకు సహాయం చేయడం, తన భర్త పరిచయాల ద్వారా ఎస్సీ కార్పొరేషన్ నుంచి రుణాలు ఇప్పించడం వంటివి ఎక్కువగా చేశారు. అవసరమైనప్పుడు సెలవు పెట్టుకుని మరీ సమస్య పరిష్కారం కోసం తిరిగేవారు. దళిత ఆర్టీసీ
ఉద్యోగుల సమస్యల మీద ఇటీవల ఎక్కువగా తిరిగి పనిచేశారు. రిటైర్మెంట్ తర్వాత దళిత ఉద్యమంలో పూర్తిస్థాయి కార్యకర్తగా, నాయకురాలిగా గ్రామాలలో తిరిగి సమస్యలపై క్రియా శీలకంగా పనిచేస్తున్నారు. ఆ క్రమంలో ఆమె దృష్టికి వచ్చిన సమస్యలపై బయట ఏ ఆఫీసుకి సంబంధించిన పనయినా వారిని వెంటబెట్టుకుని వెళ్ళడం, కొన్నిసార్లు తెలిసిన వారికి ఫోన్ ద్వారా నచ్చచెప్పి పని అయ్యే దాకా వదలకుండా ఫాలో అప్ చేయడం ఆమె నిబద్ధతకు అద్దం పడుతుంది.
మణిసింగ్ గారు గ్రామాల నుంచి వచ్చే పేదవారికి ఆర్థిక సహాయం, రుణాలు ఇప్పించడం వంటివే కాక తన స్వంత సంపాదన నుంచి సుమారు యాభైదాకా అంబేద్కర్ విగ్రహాలను వివిధ గ్రామాలకు ఇచ్చారు. ఆమె రిటైర్మెంట్‌కి ముందు నుంచే బుద్దిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా అనే సంస్థ నుంచి జరిగే కార్యక్రమాలలో పొల్గొనేవారు. ఆమె ప్రస్తుతం బుద్దిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా సంస్థకి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షురాలిగా, ఆలిండియా దళిత్ రైట్స్ ఫెడరేషన్‌కి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలిగా క్రియా శీలకంగా పనిచేస్తున్నారు. బుద్దిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా నుంచి ఆమె చేపట్టిన కార్యక్రమాలలో ఏలూరు పట్టణంలో జరిగిన బౌద్ద కార్యక్రమంలో సుమారు 150 మందికి ఒకేసారి బౌద్ద దీక్ష ఇప్పించడం చెప్పుకోదగిన విషయం. అంతేకాక ఆ సంస్థ ద్వారా మ్యారేజ్ లైసెన్స్ పొంది కులాలకు, మతాలకు అతీతంగా ఆదర్శ సమతా వివాహాలు జరిపిస్తున్నారు.
దళితుల పరంగా ఎక్కడ ఏ సంఘటన జరిగినా స్పందించి అక్కడికి వెళ్ళి సమస్య పరిష్కారం కోసం పనిచేయడం, నిరసన కార్యక్రమాలైన ధర్నాలు, రాస్తారోకోలలో పాల్గొనడం, పత్రికా సమావేశాలు ఏర్పాటు చేయడం, అవసరమైతే సంబంధిత పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి కేసులు పెట్టి అధికారుల దృష్టికి తీసుకురావడం, ప్రజాప్రతినిధులకు మెమొరాండంలు సమర్పించడం వంటి అనేక పనులను నిత్యం చేస్తూనే ఉండడం ఆమె దినచర్య.
మణిసింగ్ పుట్టి పెరిగింది పట్టణ ప్రాంతంలో కావడమే కాక ఆమె భర్త ఒక ఉన్నతోద్యోగి కావడం వలన కుల వివక్ష తాలూకు సమస్యలను ఆమె పెద్దగా ఎదుర్కోలేదు. అలాగని ఆమె సమాజంలో కులం లేదని బుకాయించరు. ఆమె ఏ పని చేసినా చాకచక్యం తో, నిజాయితీగా, ధైర్యంగా చేయడం వలన ఆమెని స్త్రీ అని, దళిత స్త్రీ అనే తక్కువ చూపుతో ఎవరూ చూడలేదని, అందుకు కారణం ఇతరుల మంచితనం కంటే తాను తన పనిని సమర్ధవం తంగా చెయడానికి కష్టపడడం, సవాళ్ళను ధైర్యంగా స్వీకరించడమే అని ఆమె నమ్ముతారు. ఆమె దృష్టిలో చదువు అంటే కేవలం అక్షరాస్య తనే కాదు, ఇతరుల అదుపాజ్ఞలలో వారు నిర్ణయించిన చట్రాలలో ఇమిడిపోకుండా తనదైన సొంత వ్యక్తిత్వంతో మెరవడమని ఆమె భావిస్తారు. ఆమె స్వతంత్ర వ్యక్తిత్వాన్ని ఇంట్లోనూ, బయటా ప్రదర్శించేవారని, కొన్ని విషయాలలో మొండిగా కూడా వ్యవహరించేవారనీ మణిసింగ్ గారి కుటుంబానికి సన్నిహితంగా ఉండే దేవరపల్లి శ్రీరాములు గారి కుమార్తె, టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో ప్రొఫెసర్, డాక్టర్ దేవరపల్లి సుజాత పేర్కొన్నారు. ఆమె బాబా సాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన చైతన్యంతో, జ్ఞానంతో తనదైన అరుదైన వ్యక్తిత్వాన్ని పెంపొందించుకుని మిలమిల మెరిసే ‘మణి’దీపం. ఆమె ఎక్కడుంటే అక్కడ కాంతి ప్రసరిస్తుంది.