ఈ మధ్య పత్రికల్లో ఒక వార్త చదివాను, శీతల్ ఆమ్టే ఆత్మహత్య చేసుకుని చనిపో యిందని. అదే సమయంలో తమిళ నాడులో ఒక నటి ఆత్మహత్య చేసుకున్న వార్త. తెలంగా ణలో ఒక తల్లి తన ఇద్దరు కూతుళ్ళతో సహా ఆత్మహత్య చేసుకున్న వార్త. ఒక్కో వార్తా చదువుతున్నప్పుడల్లా మనసు వికలమై పోతూ ఉంది. ఏ ఒక్కరి జీవితానికి పొంతన లేదు. ఒక్కక్కరిదీ ఒక్కో జీవన నేపథ్యం.
శీతల్ ఆమ్టే ప్రముఖ సామాజిక వేత్త, బాబా ఆమ్టే మనవరాలు. వృత్తిరీత్యా వైద్యురా లైన శీతల్ ప్రస్తుతం చంద్రపూర్‌లోని ఆనంద్ వన్‌లో ఉన్న మహారోగి సేవా సమితికి సీఈఓ గా వ్యవహరిస్తున్నారు. 2016లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ యంగ్ గ్లోబల్ లీడర్‌గా ఆమెని గుర్తించారు. అలగే ఐరాస ఇన్నోవేషన్ ఫర్ పీస్ కార్యక్రమానికి శీతల్ బ్రాండ్ అంబాసి డర్‌గా కూడా వ్యవహరించారు. బలమైన కుటుంబ నేపథ్యం ఉన్న ఆమె అదే కుటుంబ సమస్యల్లో చిక్కుకునే ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
తమిళ నటి వీజే చిత్ర అటు సినిమాల్లో, ఇటు సీరియల్స్‌తో బాగా బిజీగా ఉన్న నటి. అర్థరాత్రి వరకూ షూటింగ్ చేసి వచ్చి కాసేప టికే ఆత్మహత్య చేసుకోవడం జరిగిందంటే ఆ కాసేపటిలో అకస్మాత్తుగా ఏదో పెద్ద సంఘర్షణ పడి అలా చేసుకుని ఉంటుందేమో అని అని పించవచ్చు. కానీ అది అకస్మాత్తుగా వచ్చిన సంఘర్షణ అవడానికి అవకాశమే లేదని అనిపిస్తుంది సమాజాన్ని కాస్త అర్థం చేసుకునే హృదయం ఉన్న వారెవరికైనా.
ఖమ్మంలో ఒక తల్లి తన ఇద్దరు కూతుళ్ళ తో సహా ఆత్మహత్య చేసుకుంది. విచారకరమైన సంగతి ఏమిటంటే వారు ఆత్మహత్య చేసుకున్న మర్నాడే చనిపోయిన కూతుళ్ళలో పెద్ద కూతు రికి పెళ్ళి కావలసి ఉంది. కట్నం లేని పెళ్ళే అయినా పెళ్ళి ఖర్చులకు కూడా డబ్బులు సమకూరని పరిస్థితిలో జరిగిన ఆత్మహత్యలివి.
అలాగే… రోజూ ఎన్నో వార్తలు చూస్తూనే ఉంటాం. ఆరోగ్య సమస్యలకు సరైన వైద్యం పొందలేక, చదువు ఒత్తిళ్ళను భరించలేక, గృహ హింసను తట్టుకోలేక ప్రాణాలు తీసుకుం టున్నారని. ఒకరికి ఉన్న కారణం మరొకరికి ఉండదు… కానీ అందరి యొక్క అంతిమ ఆలోచనా చావే అవుతుంది. ఇక్కడ మాత్రమే వారందరికీ సారూప్యత ఉంది. మనం కోరుకోని సారూప్యత.
కావాలంటే ఇందాక చెప్పిన ఉదాహరణ ల్లోని వ్యక్తుల జీవితాల్లోని వైవిధ్యాన్ని చూడండి. ఒకరిది పూర్తిగా సామాజిక జీవితంతో పెనవేసుకున్న జీవితమైతే, మరొకరిది తారా ప్రపంచపు మెట్ల మీద నడక సాగిస్తున్న జీవితం… ఇంకొకరిది సగటు క్రింది మధ్య తరగతి జీవితం.
ఒక్కొక్కరిదీ ఒక్కొక్క సమస్య. ఒకరి సమస్య మరొకరికి చాలా చిన్నదిగా అనిపించవచ్చు కానీ వారు ఆత్మహత్య చేసుకున్న సమయంలో వారికది పెను సమస్యగా తోస్తూ ఉంటుంది.
ఒక సమస్య అంత పెద్ద సమస్యగా మారటం వెనక ఎలాంటి కారణాలు ఉన్నాయి, ఎలాంటి అంశాలు ప్రభావితం చేస్తున్నాయి అని ఆలోచించి చూస్తే ప్రతి చావు వెనకా సమాజమే మొదటి ముద్దాయి అవుతుందేమో.
అవును మరి! కొన్ని చావులు వ్యక్తిగత ఇగోల వల్ల అవ్వచ్చు, మరికొన్ని చావులు వ్యక్తిగత హననాల వల్ల అవ్వవచ్చు, ఇంకొన్ని ఆర్థిక పరంగా కావొచ్చు… ఆరోగ్యపరంగా కావచ్చు… కారణం ఏదైనా వీటన్నింటి వెనకాల ఉన్నది, సమాజంలో తమ తమ అస్తిత్వాలను బలంగా చాటుకోవాలనే మూక మనస్తత్వపు పోకడల వల్ల వచ్చే అమాయ నీయతలే.
ఉన్నతమైన సాంప్రదాయాలు… సంస్కృ తీ… బలమైన కుటుంబ వ్యవస్థా ఉన్న దేశంగా మనల్ని మనం కీర్తించుకుంటూ
ఉంటాం కానీ ప్రపంచ వ్యాప్తంగా ఆత్మ హత్యలకు పాల్పడే మహిళల్లో దాదాపు 37 శాతం భారతీయ మహిళలే అని ఒక అధ్యయనంలో వెల్లడయింది.
ఒకప్పుడు పెద్ద వయసు వాళ్ళలో మాత్రమే ఆత్మహత్యలు ఎక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు మన దేశంలో ఆత్మహత్యలు చేసుకుంటున్న మహిళల్లో 70 శాతానికి పైగా 15 నుండి 39 ఏళ్ళ మధ్యలో ఉన్న వాళ్ళే. వీళ్ళల్లో ఎక్కువమంది వివాహితలే. అంటే పూర్తిగా యువతరం అన్నట్లే లెక్క.
సారూప్యత చావుల్లోనే తప్ప కారణాలని చూస్తే మాత్రం సమాజంలో ఉన్న అసమానత లన్నీ బయటికి వస్తాయి. కొందరికి పెళ్ళి ద్వారా వచ్చిన కుటుంబం కారణం కావచ్చు, కొందరికి సమాజంలోని చిన్న చూపు, కొందరికేమో ఆర్థిక స్వేచ్ఛ లేకపోవడం, మాన మర్యాదలకి భంగం కలిగిందన్న భావనలు, వ్యక్తిగత జీవితాలని క్రీనీడల మాటున చూసే సమాజపు పోకడలు, వృత్తిగత జీవితంలో సహచర ఉద్యోగుల దాష్టీకాలు… ఎన్నని చెప్పగలం. ఆడదిగా పుట్టాక చెప్పగలిగే కారణాల సంఖ్య అన్నది బహు స్వల్పం. చెప్పలేని కారణాలు మాత్రం అనేకం.
ఇదంతా తలచుకుంటే డిప్రెషన్. ఇదిగో ఈ డిప్రెషన్ కూడా ఒక పెద్ద కారణమే ఆత్మహత్యలకి. అందులోనూ మగవాళ్ళతో పోలిస్తే ఆడవాళ్ళలో రెండు రెట్లు ఎక్కువ డిప్రెషన్‌కి గురవ్వడం. కారణం లేకుండా ఎవ్వరూ డిప్రెషన్‌లోకి వెళ్ళరు.
వీటిల్లో దేనికీ సమాధానం వెదకడానికి మాత్రం మనమెప్పుడూ ప్రయత్నం చెయ్యం. ఎందుకంటే ఇక్కడ మనమంతా మనసులన్నీ అపరిచితమై ముఖాలు మాత్రమే పరిచితమైన బంధువులు.. స్నేహితులం.
మన అందరిలో సానుభూతి అనేది కుప్పలు కుప్పలుగా పోగుపడి ఉంటుంది. చిన్న చిన్న కష్టాలకి తెగ జాలిపడిపోతాం. ఫేస్‌బుక్‌లోనూ, వాట్సాప్‌లోనూ అక్షరాలుగా కన్నీటి అక్షరాలుగా మారిపోతాం. అక్కడ అయితే జాలి పడడానికి పెద్ద ఖర్చేమీ ఉండదు సరికదా మన వ్యక్తిత్వానికి కీర్తికిరీటాలు ఉచితంగా వచ్చేస్తాయి. నిజానికి మనం బయటకే కాదు మనలో మనం కూడా ఒప్పుకోని నిజం ఇది.
నిజంగా ఒక మనిషికి సాయం చెయ్యడ మంటే చేయాల్సిందేమిటో తెలుసా… కాసేపు మనసుతో మాట్లాడడం. మనసుకి మనసు స్పర్శని చల్లగా తాకించడం. ఎందుకంటే ఆత్మహత్యలు చేసుకునేవారు ఎక్కడో ఉండరు. మన మధ్యే ఉంటారు. కాకపోతే వాళ్ళ ఆలోచనల్ని మనం చదివే ప్రయత్నం చేయకుండా ఉండడంతో వాళ్ళెవరో మనకు తెలియడం లేదు. ఒక్కసారి మనసులకి పరిచయం అయ్యిందా… ఆలోచనలోని ఒక్క చిన్న తడబాటు చాలు… నేనున్నానన్న భరోసాతో దాన్ని మొగ్గలోనే సరిచెయ్యడానికి.